తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 341

వికీసోర్స్ నుండి

రేకు: 0341-01 భూపాళం సం: 04-238 విష్ణు కీర్తనం


పల్లవి :

కన్నవారివద్ద నెల్లఁగావంగ నేమిగద్దు
యిన్నిటికి నియ్యఁగొన నీతఁడే స్వతంత్రుఁడు


చ. 1:

పరమేష్ఠిగన్నతండ్రిఁ బాటించి కొలువరో
అరుదై లోకాలకెల్ల నతఁడే తండ్రి
సిరిమగఁడైనవానిఁ జేపట్టి తలఁచరో
సిరులిచ్చేమేఁటీదాత సృష్టికెల్ల నతఁడే


చ. 2:

అంబరీషుఁ గావఁ జక్రమంపినవానిఁ జేరరో
అంబుజభవాండాన కతఁడే రక్ష
పంబిన భూకాంతపతిఁ బాయక సేవించరో
వుంబళ్లు వూళ్లు నిచ్చేవున్నతుఁడు నతఁడే


చ. 3:

మూలమంటేఁ గరిఁగాచేముఖ్యునికి మొక్కరో
మూలధనమైయుండీ ముందర నిట్టె
యీలీలఁ జిత్తజుతండ్రి నెదలోనఁ గొలువరో
పాలించ శ్రీవేంకటాద్రిపతియాయ నితఁడే

రేకు: 0341-02 లలిత సం: 04-239 విష్ణు కీర్తనం


పల్లవి :

తొల్లి యేరుపరచిరి దొడ్డవాఁడు హరియని
యెల్లసందేహాలు బాసె నిఁకనేల చింత


చ. 1:

నారదుఁడు సోదించి నారాయణు నెరిఁగె
సారెకు శివుఁ డెరిఁగి చాటె రాముని
చేరి సోదించెఁ బార్వతి శ్రీరామచంద్రుని
యేరీతుల సోదించేము యింతకంటె నేము


చ. 1:

వేదవ్యాసులు దెలిసే వెదకి విష్ణునిఁ జెప్పె
సాధించితని యోగిసనకాదులు
యీదెస శుకాదులెల్ల నెరిఁగిరి మాధవుని
కాదని వీరికంటె గతి గానఁగలమా


చ. 1:

పెక్కుగాలము చదివి పెక్కేండ్లుబదికి
పెక్కు రుషులిందుననె పెద్దలైరి
దక్కఁగ శ్రీవేంకటేశు ధనముగాఁ జూపి రిదె
తక్కక కొలిచితిమి దైవమని కంటిమి

రేకు: 0341-03 కౌశి సం: 04-240 విష్ణు కీర్తనం


పల్లవి :

నీవంటిదైవాలు వేరీ నిఖిలలోకములందు
యీవల నావల నెందు నెంచి చూడ మాకును


చ. 1:

తగిలి నీమోముచక్కఁదన మెంచి చూచితిమా
తగిన మరునిఁగన్న తండ్రివి నీవు
అగపడ్డనీగుణము లవి యెంచిచూచితిమా
నిగిడి కల్యాణగుణనిధివనీ శ్రుతులు


చ. 2:

గుట్టు నీపెద్దతనము కులమెంచిచూచితిమా
అట్టె బ్రహ్మకులము నీయందుఁ బుట్టెను
దట్టపు నీపనులవర్తన మెంచి చూచితిమా
ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి


చ. 3:

బెడిదమైననీబిరు దెంచిచూచితిమా
వడి శరణాగతవత్సలుఁడవు
కడఁగి శ్రీవేంకటేశ కంటిమి నీమహిమలు
బడి నిన్నే సేవించి బ్రదికితి మిదివో

రేకు: 0341-04 మంగళకౌశి (క) సం: 04-241 శరణాగతి


పల్లవి :

నీవనేనమ్మినయట్టినవారము
వేవేలువిధాలఁ జేసే విన్నపమిదయ్యా


చ. 1:

పండెనుమాకర్మములు పాలు గోరు గొనవయ్య
అండనె నామతిలోని అంతర్యామి
నిండెనునా కోరికలు నినుపువారిధులై
వెండిబంగారాలతోడ విఱవీఁగవయ్యా


చ. 2:

మలసె మాపుట్టుగులు మారుమూలసరకులై
కలసుంకము దీరుచు కరుణాకర
వెలసే సంసారాలు వెక్కసపుఁ బౌఁజులై
తొలఁగక యిటు నీవు తోడుచూడవయ్యా


చ. 3:

కూడెను మానుతులనే గోకులపుఁ గదుపులు
యీడుగాఁ బుల్లరి గొని యేలవయ్యా
వోడక శ్రీవేంకటేశ వొప్పగించితిమి నీకు
వేడుకలు దైవార విహరించవయ్యా

రేకు: 0341-05 నాగవరాళి సం: 04-242 వైరాగ్య చింత


పల్లవి :

వెగ్గల మింతా వృథా వృథా
తగ్గి పరులతో దైన్యములేలా


చ. 1:

పెంచఁగబెంచఁగఁ బెరగీ నాసలు
తుంచఁగఁదుంచఁగఁ దొలఁగు నవి
కంచముకూడును కట్టినకోకయు
వంచనమేనికి వలసినదింతే


చ. 1:

తడవఁగఁదడవఁగఁ దగిలీబంధము
విడుఁగఁ విడువఁగ వీడునవి (ది?)
గుడిశలోన నొకకుక్కి మంచమున
వొడలు సగమునను వుండెడిదింతే


చ. 1:

మరవఁగమరవఁగ మాయలే యింతా
మురహరుఁదలచితే మోక్షము
నిరతి శ్రీవేంకటనిలయుఁడే కాయపు-
గరిమెల నిలిచిన కాణా చింతే

రేకు: 0341-06 శుద్ధవసంతం సం: 04-243 విష్ణు కీర్తనం


పల్లవి :

హరి నీవు లేవా అన్నిచోట్లను తొల్లి
అరయ నీదాసులే యరు దింతేకాక


చ. 1:

కంటిమినీదాసులను కన్నులపండుగగాను
కొంటిమి పాదతీర్థము కొల్లలుగాను
వింటిమి నీనామములను వీనులపండుగగాను
అంటిన మోక్షముత్రోవ అడుగనేమిటికి


చ. 2:

నుతించి మాటాడితిమి నోరార నీదాసులను
మతిఁజొక్కితిమి దాస్యమహిమచేత
మతిగంటిమి వారిసంగతి కూటములవల్ల
వెతకి విజ్ఞానము వేఁడనేమిటికి


చ. 3:

మొక్కితిఁ జాగిల నీమోహపు దాసులకును
యెక్కితిఁ బరమపదమిహమందునే
తక్కక మన్నించిరి నీదాసులె నన్నన్నిటాను
గక్కన శ్రీవేంకటేశ కడమ లేమిటికి