తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 339

వికీసోర్స్ నుండి

రేకు: 0339-01 మాళవశ్రీ సం: 04-226 విష్ణు కీర్తనం


పల్లవి :

వేగిరించనేల విష్ణుఁడే యింతకుఁ గర్త
బాగుగా నాతనియిచ్చఁ బరగుటేకాక


చ. 1:

తలపోఁతలేల దైవము గలుగఁగాను
చెలఁగి యాతఁడే యిన్నీఁ జేసీఁగాక
యిల నేఁడె పుట్టెనా యింకాఁ గలది గాదా
పలులోకాలు నడప భారము దేవునిదే


చ. 2:

చింత లిఁకనేలా శ్రీపతి గలుగఁగాను
మంతుకుఁ బుట్టించి తానే మనుపుఁగాక
వింతా యీ దేహము వేరా యీ యింద్రియాలు
యింతట బ్రహ్మాండనాథుఁ డిందరికి నొకఁడే


చ. 3:

సిలుఁగు గోరికలేల శ్రీవేంకటేశ్వరుఁడు
కలఁ డాతఁడే మనలఁ గాచీఁగాక
వెలసి యాతనిమాయే విశ్వమింతా నిండినది
తెలిపి రక్షించుటకు దిక్కు దెస యితఁడే

రేకు:0339-02 వరాళి సం: 04-227 వైరాగ్య చింత


పల్లవి :

అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక
కటకటా శునకపు గతి యాయఁ గావవే


చ. 1:

పసిమిఁ బాపమనేటి బందెలు మేసితిని
కసరి దేహపు కట్టుగాడి నుంటిని
కొసరి కర్మపుమెడగుదియ మోఁచితిని
పసురమువంటివాఁడఁ బాలించవే


చ. 1:

పంచేంద్రియములనే బాడిగె మోఁచితిని
అంచపు సంసారమనే లాడిఁబడితి
పంచల వాసలచేత బందమ పెట్టించుకొంటి
ముంచినగుఱ్ఱమువంటి మూఢుఁడఁ గావవే


చ. 1:

మరిగి 'యజ్ఞాన'మనేమద మెత్తి తిరిగితి
'మరుఁ'డనే మావటీని మాయఁ జిక్కితి
గరిమ శ్రీవేంకటేశ కరిఁ గాచితివిగాన
కరి నైతి నన్ను నీవు కరుణించవే

రేకు: 0339-03 దేసి సం: 04-228 మనసా


పల్లవి :

లోకమంతా నిండె లోచూపు వెలిచూపు
శ్రీకాంతుఁడై తోఁచె చిక్కినవి యాలా


చ. 1:

సకలజీవులలోన సర్వేశ్వరుఁడు వాఁడె
వొకరి నౌఁగాదన నోపను నేను
అకట యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే
వికటాలెందుకు నాడ వెరపయ్యీ నాకు


చ. 2:

భువియందు దీని యందు పురుషోత్తముఁడు వాఁడె
వివరించ మేలు గీడు వెదక నే నోప
చెవి విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని
ఇవల కల్లనిజాలు యెంచఁజాల నేను


చ. 3:

పగటందు రేయందు పరమాత్ముఁడు వీఁడె
తగిలి పాసే నన్న తలఁపునోప
జగి మించ నాలోన శ్రీవేంకటేశుఁడే
బగివాయఁ డెన్నఁడును బదుకవో మనసా

రేకు: 0339-04 లలిత సం: 04-229 నామ సంకీర్తన


పల్లవి :

వర్ణాశ్రమములాల వడిఁ జిత్రగుప్తులాల
వర్ణించి మమ్మిఁకఁ దడవకురో మీరు


చ. 1:

చదువులు దెచ్చినట్టి సర్వేశుఁ గొలిచితి
చదువు నామారతఁడు చదివీఁ బోరో
అదన యోగీంద్రవంద్యుఁడైన కృష్ణుఁ గొలిచితి
చదల నాయోగములు సాధించు నతఁడే


చ. 2:

కూరిమి యజ్ఞకర్తైనగోవిందుఁ దలఁచితి
చేరి నామారతఁ డవి సేసీఁ బోరో
ఆరయ విజ్ఞానమూర్తియైన హరి శరణంటి
వూరకే నాకాతఁడవి వుత్తరువిచ్చీని


చ. 3:

దేవతాశిఖామణియైన దేవునిఁ బూజించితిని
దేవఋషి ఋణములు తీరిచీఁబోరో
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నవాఁడు
చేవఁ బాపాలెల్లఁ బాసె సెలవిచ్చెఁ జేతలు

రేకు: 0339-05 దేశాక్షి సం: 04-230 నామ సంకీర్తన


పల్లవి :

ఊరకే నోరుమూసుక వొంటి నీకు మొక్కేమయ్య
చేరి నారాయణ నీవు చేసినట్టు సేయవే


చ. 1:

హరినామముఁ దలఁచి అణఁచేనంటేనయ్య
సరి నా పాతకములు చాల వందుకు
నరహరినామ మెంచి నాకుఁ గూడపెట్టేనంటే
అరుదైన పుణ్యములు అన్నిలేవు భూమిని


చ. 2:

రామనామము నొడిగి రవ్వల బోఁజోఁపే నంటే
తామసపునరకాలు దగ్గరవందు
వామననామమెంచి వరస్వర్గ మెక్కేనంటే
యేమిటా నాకడ వారికెడచా దదియు


చ. 3:

గోవిందనామముచేతఁ గుదించే భవములంటే
పావనమాయను నీభక్తివల్లను
శ్రీవేంకటేశ నేను చేకొని నీశరణంటి
యేవిధులు నెరఁగను యిదివో నీచిత్తము

రేకు: 0339-06 బౌళి రామక్రియ సం: 04-231 వైష్ణవ భక్తి


పల్లవి :

జ్ఞానంబొకటే జగమున కధికం మరి
నానావిధములు నటనలు


చ. 1:

బహుదానఫలము పడయుటకంటే
యిహమున వైరాగ్య మెక్కుడు
సహజకర్మములు శతములకంటే
అహిశయనుని భక్తధికము


చ. 2:

ధరఁ దపములనంతంబులకంటే
గరిమల శాంతము ఘనము
విరసాచారము వేవేలకంటే
హరినామపఠన మధికము


చ. 3:

ఆవల వ్రతములు అన్నిటికంటే
శ్రీవైష్ణవమే శేఖరము
శ్రీవేంకటేశ్వరుచేఁతలె యివిగన
సేవ యిదొకటే చింతింప ఘనము