తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 332

వికీసోర్స్ నుండి

రేకు: 0332-01 వసంతం సం: 04-184 వైరాగ్య చింత


పల్లవి :

రంటదెప్పరపురచన మా బదుకు
జంటల శ్రీపతిశరణమే నిజము


చ. 1:

కన్నులయెదుటను గలిగిన జగమే
మిన్నక మనసున మెరసేది
తిన్నఁగ రేయి నిద్రించినవాఁడనే
యెన్నఁగ రేపే యెరిఁగినవాఁడ


చ. 2:

బాయట నూరక పారెటిగాలే
కాయములోపలఁ గలిగేది
పోయిన జన్మపుఁబొరుగులవాఁడనే
యీయెడ నిటు జనియించితిఁగాని


చ. 3:

పుడమివెలుపలను బుట్టినరుచులే
కడుపులోపలను గరఁగేది
కడఁగి శ్రీవేంకటపతి నాలోననే
యెడయఁడు యతనినే యిటు గొలిచితిని

రేకు: 0332-02 సాళంగనాట సం: 04-185 గురు వందన


పల్లవి :

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
విష్ణుఁడ నీవెటైన వివరించుకోవయ్యా


చ. 1:

నెఱి నీబంటనా హరి నీకంటె బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక


చ. 1:

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక


చ. 1:

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నే డీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక

రేకు: 0332-03 రామక్రియ సం: 04-186 ఉపమానములు


పల్లవి :

విత్తోకటి పెట్టఁగాను వేరొకటి మొలచీనా
హత్తి దేహగుణములు ఆతుమకయ్యీనా


చ. 1:

చెంది చేఁదుదిన్ననోరు చేఁదేయయివుండుఁగాక
దిందుపడి కొంతైనాఁ దియ్యనుండీనా
బందెల సంసారికి బలు లంపటాలేకాక
అందు హరిఁజేరి సుఖ మందఁ దీరీనా


చ. 2:

యెంగిలిఁ బుట్టినమేను హేయమే వెదకుఁగాక
చెంగలించి పావనమ సేసుకోనీనా
ముంగిటిదేహికిఁ గర్మములు ముంచుకొనుఁగాక
రంగుగ శ్రీపతిఁ గొలిచి రతికెక్కినా


చ. 3:

చేతికి వచ్చినసొమ్ము చేరిదాఁచుకోనుగాక
యేతులఁ దా నొల్లనంటా యీసడించీనా
యీతల శ్రీవేంకటేశుఁ డిచ్చిన విజ్ఞానము
ఆతుమ సంతసించుఁ గాకందు వెలితున్నాదా

రేకు: 0332-04 మలహరి సం: 04-187 భక్తి


పల్లవి :

అందుకు హరికథ యనుతీర్ధంబున
నింద వాసె నిఁక నిర్మలమైతి


చ. 1:

కంతునిముట్టంటు గలసె మదిలో
యెంతట శుద్ధెనో యెరఁగమిఁక
సంతత సంసార జలధుల మునిఁగెద
పొంతగర్మము పోదింకాను


చ. 2:

మాయపు టాసల మాలు గలసె మది
యేయెడ శుద్ధోనో యెరఁగమిఁక
ఆయపుభవములయనలము చొచ్చితి
పోయినఁగర్మము పోదింకాను


చ. 3:

చక్కఁగఁ గలిదోసము గలసెను మది
నెక్కడ వోయెనో యెరఁగమిఁక
దక్కి శ్రీవేంకటదైవముఁ గొలిచితి
పుక్కట గర్వము పోదింకాను

రేకు: 0332-05 దేశాక్షి సం: 04-188 అధ్యాత్మ


పల్లవి :

కర్మమూలము జగము గాదనివిడువక
మర్మపుమోక్షము లేదు మానలేరో గర్వము


చ. 1:

సకలకర్మాలు మాని సన్యాసి యైతేను
వొకట వెలితిలేనివున్నతుఁడట
ముకెమై వుభయకర్మములు బంధహేతువని
ప్రకటించి వేదాంతపఠనమే యెక్కుడు


చ. 2:

బహురూపములు మరచి బ్రహ్మ నిష్ఠుఁడైనయోగి
యిహపరముల కతఁడెక్కుడట
విహితకర్మము దక్క వీరఘోరకర్మములు
సహజపాతకమనేశాస్త్రాలే యెక్కుడు


చ. 3:

సంతతకర్మములెల్ల సంసారమూలములు
అంతట నిస్సంగుడైతే నధికుఁడట
చింతించి చింతించి శ్రీవేంకటేశ్వరు
వంతుకుఁజెప్పన హరివాక్యమే యెక్కుడు

రేకు: 0332-06 దేవగాంధారి సం: 04-189 శరణాగతి


పల్లవి :

పుట్టించినవాఁడు దానే బుద్ధిచెప్పేవాఁడు దానే
యిట్టె శ్రీహరి నన్నేట్టీడేరించీనో


చ. 1:

యెంచుకొందు నొకవేళ నేఁటి సంసారమిదని
యించుకవడిలోనే మోహింతు నందుకు
కంచువంటి దీమనసు కటకటా యేది వాటి
చంచలుఁడ హరి నన్నేసంగతి సేసీనో


చ. 2:

తలఁతు నేనొకవేళ దైవము గనేనని
కలిమి నంతటిలోనె కడు మరతు
చలపట్టె నిదివో నాజన్మములకేది వాటి
కలుషచిత్తుఁడ నన్నేకందువఁ బెట్టీనో


చ. 3:

జ్ఞానినౌదు నొకవేళ సరిఁ గర్మినౌదును
మానువంటిదీగుణము మరేది వాటి
కోనల శ్రీవేంకటేశుఁ గొలిచి నే శరణంటి
మానిసి నింతే యెట్టు మన్నించీనో