తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 314

వికీసోర్స్ నుండి

రేకు: 0314-01 లలిత సం: 04-078 ఇతర దేవతలు


పల్లవి :

నిత్యసుఖానంద మిదె నీ దాస్యము
సత్యములేని సుఖాలు చాలుఁ జాలు నయ్యా


చ. 1:

కన్ను చూపుల సుఖము కడు నీచక్కనిరూపె
యెన్నఁగ వీనులసుఖమిదె నీపేరు
పన్ని నాలుకసుఖము పొదపు నీతులసి
వున్న సుఖముల తెరు వొడఁబడమయ్యా


చ. 1:

తనువుతోడిసుఖము తగు నీకైంకర్యము
మనసులోసుఖము నీ మంచిధ్యానము
పనివి యూర్పుసుఖము పాదపద్మమువాసన
యెనయని పెరసుఖ మేమి సేసేనయ్యా


చ. 1:

పుట్టుగు కెల్లసుఖము పొల్లులేనినీభక్తి
తొట్టి కాళ్లసుఖము పాతురలాడుట
జట్టి శ్రీవేంకటేశ మాచనవోలి చెన్నుఁడవై
వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా

రేకు: 0314-02 మంగళకౌశిక సం: 04-079 గురు వందన, నృసింహ


పల్లవి :

జీవములు దవ్వువోయ చీమలునుఁ బుట్టచొచ్చె
వేవేలయిన నిది విడువనయ్యా


చ. 1:

చింతలన్నియుఁ బాసె చిత్తమింతట రోసె
యెంత లే దీయాసలు యిఁకనేలయ్యా
అంతలో గురునిగంటి హరికే శరణంటి
దొంతులభవములాల తొలఁగరో


చ. 2:

గక్కనఁ గడువు నిండె కన్నుఁ దనిసె నిదె
యెక్కడి పలురుచులు యిఁకనేలయ్యా
చిక్కె విజ్ఞానము నేఁడె జిహ్వ నారాయణుఁగూడె
వుక్కునఁ బాపములాల వుడుగరో


చ. 3:

జీవుఁడు పాపనమాయ దేవుఁడే జీవనమాయ
యీవలి యావని కర్మమిఁక నేలయ్యా
శ్రీవేంకటేశు భక్తిఁ జేరి శరణంటి నేను
భావపుబంధములాల పారరో

రేకు: 0314-03 తోడి సం: 04-080 ఉపమానములు


పల్లవి :

ఇంతే యింతే యింకా నెంత చూచినా
చింతలఁ జిగురులెక్కి చేఁగదేరినట్లు


చ. 1:

వుల్లములో నెంచనెంచ నుద్యోగములే పెక్కు
పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు
బల్లిదుని హరినాత్మ భావించుటొకటే
ముల్ల ముంటఁ దీసి సుఖమున నుండినట్లు


చ. 2:

అనిన సంసారమున నలయికలే పెక్కు
చానిపిఁ జవి వేఁడితేఁ జప్పనైనట్టు
పూని హరిఁ జేతులారాఁ బూజించుటొకటే
నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు


చ. 3:

వెనకఁ దలఁచుకొంటే విజ్ఞానములే పెక్కు
తినఁ దిన వేమేఁ దీపైనట్టు
చనవై శ్రీవేంకటేశు శరణను టొక్కటే
పనివడి చెఱకునఁ బండువండినట్లు

రేకు: 0314-04 నారాయణి సం: 04-081 శరణాగతి


పల్లవి :

హరిశరణాగతి యాతుమది
సరుస నిదియపో సతమయ్యెడిది


చ. 1:

దినదినరుచులివి దేహమువి
చెనకేటికోరిక చిత్తముది
యెనపేటికాంతలు యింద్రియంబులవి
పనివి యాత్మకివి పనిలేదయ్యా


చ. 2:

పదరేటికోపము పావముది
అదనఁ గాలములు అనాదివి
నిదుర తమోగుణ నిలయముది
యెదుట నాత్మకివి యెరవెరవయ్యా


చ. 3:

కాయపు జననము కర్మముది
మాయలంపటము మమతలది
యేయెడ శ్రీవేంకటేశుఁ డితనికృప
పాయనియాత్మకుఁ బ్రమాణమయ్యా

రేకు: 0314-05 దేశాక్షి సం: 04-082 గురు వందన, నృసింహ


పల్లవి :

ఎదిరికి మాకును యెక్కుడుతక్కువ లివి
పదిలపుజ్ఞానముచేఁ బవిత్ర మాయ


చ. 1:

మహిఁ బొడమినవెల్లా మంచివే యందులోఁ
దహతహ దేహమే తగనిది
యిహములో తృణములుయెండినా యోగ్యములాయ
బహి నిర్జీవపు మేను పనికిరాదాయ


చ. 2:

పుడమిఁ జల్లినవెల్ల పురుషార్థపదములే
కడుపున నిడుకొంటేఁ గానివి
గుడికొని యితరపు గోమయమే శుద్ధి యాయ
అడరి మానుషధర్మ మతి హేయ మాయ


చ. 3:

హరిసేవ గురుసేన నాత్మజ్ఞానమున కెక్కె
పొరలింపుఁగర్మమే పుణ్యమంటెకే
అరిది శ్రీవేంకటేశుడంతరాత్మకుఁ డితని
శరణనుటే సర్వసాధన మాయ

రేకు: 0314-06 దేసాళం సం: 04-083 వైరాగ్య చింత


పల్లవి :

గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను
అల్లనాఁడే అడియాస లవియేల విడుతు


చ. 1:

మహిలోన రోగములు మాన మందు గద్దుగాక
సహజగుణము మాన్పఁజాలుమందు గలదా
బహుబంధములు నీవే పాపితే నేమోకాని
అహరహమును నేనే అవియేల విడుతు


చ. 2:

తనరూపమద్దములో తగఁ జూడవచ్చుఁగాక
మనసు దా నద్దములో మరి చూడవచ్చునా
దినచంచలము నీవే తీర్చితేనేమో కాని
అనుఁగు సంశయము నేనదియేల విడుతు


చ. 3:

నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చుఁగాక
జాలిఁబడ్డ కన్నులచేఁ జవి గానవచ్చుఁగాక
యేలి శ్రీవేంకటేశ నీవిట్టే కాతువుగాక
వేళ జీవుఁడను నా విధమేల విడుతు