తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 310

వికీసోర్స్ నుండి

రేకు: 0310-01 మాళవిగౌళ సం: 04-055 తేరు


పల్లవి :

నానావర్ణముల నడగొండవలెను
దానవారి తేరదె తగ తిరువీధుల


చ. 1:

కదలే కదలె నదె గరుడధ్వజునితేరు
అదె మిన్నుమోచిన నీలాద్రివలెను
యెదిరె నెదిరె నదె యిందిరాధిపుని తేరు
కదిసి చుక్కలు మోచే కనకాద్రివలెను


చ. 2:

తిరిగె తిరిగె నదె దేవుదేవునితేరు
అరుదైన ఘనమందరాద్రివలెను
పరువులిడీ నదె పట్టపు శ్రీపతితేరు
విరిఁవి గైలాసపు వెండికొండవలెను


చ. 3:

దగ్గరె దగ్గరె నదె దైవశిఖామణితేరు
అగ్గలపు శ్రీవేంకటాద్రివలెను
అర్థమై శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడె
తగ్గులేని మొత్తపు దొంతరకొండవలెను

రేకు: 0310-02 శ్రీరాగం సం: 04-056 వైష్ణవ భక్తి


పల్లవి :

కాకున్న మాపాటు కడమున్నదా
నీకృపవంకనే నిలిచితిఁగాక


చ. 1:

యీ నాలికేకాదా యిందరి నిందించినది
శ్రీనిధి నిన్నుఁ బొగడి చెలఁగెఁ గాక
నానాపాపములు విన్న నా వీనులే కావా
దానవారి నీ కథల ధన్యమాయఁగాక


చ. 2:

యీ మేనేకాదా హేయపుటింతులఁ గూడె
నీముద్రలు ధరియించి నిక్కెఁగాక
యీ మనసేకాదా యిన్నిటిపైఁ బారినది
కామించి నిన్నుఁ దలఁచి కట్టువడెఁ గాక


చ. 3:

యీ పుట్టుగేకాదా హీనాధికములఁ బొందె
వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక
యేపున శ్రీవేంకటేశ యిన్నినేరములు నాకుఁ
బాపఁగా నే నిన్ను నమ్మి బ్రదికితిఁగాక

రేకు: 0310-03 దేసాళం సం: 04-057 శరణాగతి


పల్లవి :

నేనే పో ఘనుఁడను నీకంటెను
దానవారి నీవు నాకు దైవమవు గాన


చ. 1:

నేరుపున నాకైతే నీ దిక్కు గలదుగాని
చేరి నీ కావల దిక్కు చెప్పి చూపఁగలదా
అరయ నీవైతే నాకు నాధారము గలవు గా
నూరకే నీకాధారము వున్నదా యెక్కడను


చ. 2:

నిన్నుఁ గొల్చిన సలిగె నేఁడు నాఁకు గద్దుగాని
సన్నుతి నీకు నొకరి సలిగున్నదా.
పెన్నిధి నిన్నుఁ దలఁచే పేరు నాకుఁ గద్దుగాని
వున్నదా నీకుఁ దలఁచ నొకరి పేరైనను


చ. 3:

యీవులెల్లా నాకైతే నియ్యఁగలవు గాక
ఆవల నీకీవులియ్య నన్యులున్నారా
శ్రీవేంకటేశ నాకు జీవాంతరాత్మవు నీవు
భావించ నంతరాత్మ యప్పటి నీకు నున్నదా

రేకు: 0310-04 గుండక్రియ సం: 04-058 వైరాగ్య చింత


పల్లవి :

కాయము నాదే ఆట కర్తను నే నట నా-
చాయకవి రావు నన్నే జరసీఁగాని


చ. 1:

తలఁచినట్టుండదు తలఁపు నాదైనాను
కులికి నన్నే పనిగొనీఁగాని
నిలిపిన యట్టుండవు నేఁడు నా మాటలే నాకు
పొలసి నన్నే కడు బొంకించీఁగాని


చ. 2:

కలిమి లేమెరఁగదు కాయము నాదైనాను
కొలఁదికి నేమైనాఁ గోరీఁగాని
యిల నాయంకెకు రావు యింద్రియములు నావైనా
కలసి నామర్మములే కాఁడిపారీఁగాని


చ. 3:

పంపు నాకుఁ జేయదు భవమిది నాదైనా
తెంపున కర్మవీధులఁ దిప్పీఁ గాని
యింపుల శ్రీవేంకటేశ యిది యరాజిక మాయ
పంపున నీకిదె మొఱ ప్రతిపాలించఁగదే

రేకు: 0310-05 గుండక్రియ సం: 04-059 శరణాగతి


పల్లవి :

అతఁడు లక్ష్మీకాంతుఁ డన్నియు నొసఁగుఁగాక
యితరుల వేఁడుకొంటే నేమి గలదు


చ. 1:

మోదముతో నొకమాని మొదలఁ బోసిన నీరు
పాదుకొని కొనకెక్కి ఫలించుఁగాక
ఆదిమూలమగుహరి నాతుమ సేవించక
యే దైవములఁగన్నా నేమి సెలవు


చ. 2:

తల్లి భుజించినవెల్లా తగు గర్భము శిశువు -
కెల్లగాఁగఁ బరిణామ మిచ్చుఁగాక
పుల్లము లోపలి హరి కొసగని పూజలెల్లా
వెల్లిఁ జింతపంటివలె వృథా వృథా


చ. 3:

వోలి నెంత జారిపడ్డా నూరకే యెవ్వరికైనా
నేలే యాధారమై నిలుచుఁగాక
తాలిమి శ్రీవేంకటేశుఁదలఁచక తలఁచినా
పాలించ నాతఁడేకాక పరులకు వశమా

రేకు: 0310-06 బౌళి సం: 04-060 అధ్యాత్మ


పల్లవి :

గోనెలె కొత్తలు కోడెలెప్పటివి
నానిన లోహము నయమయ్యీనా


చ. 1:

మున్నిటి జగమే మున్నిటి లోకమే
యెన్నఁగ బుట్టు గులివె వేరు
నన్ను నెవ్వ రున్నతి బోధించిన
నిన్న నేటనే నేనెఱిఁగేనా


చ. 2:

చిత్తము నాఁటిదే చింతలు నాఁటివే
యిత్తల భోగములివె వేరు
సత్తగు శాస్త్రము చాయ చూపినా
కొత్తగ నేనిఁక గుణినయ్యేనా


చ. 3:

జీవాంతరాత్ముఁడు శ్రీవేంకటేశుఁడే
యీవల భావనలివె వేరు
ధావతి కర్మము తప్ప దీసినా
దైవము గావక తలఁగీనా