తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 302

వికీసోర్స్ నుండి

రేకు: 0302-01 లలిత సం:04-007 గురు వందన, నృసింహ

పల్లవి:
        
పనిగొను వారల భాగ్యమిది
వెనక ముందరికి వివేక మొకటే

చ. 1:
        
బలు పుణ్యములకుఁ బాపములకు గురి
కలియుగ మొకటే కలది
చెలఁగి సేయటకు సేయించుటకును
తలఁపూ నొకటే తనలోఁ గలది

చ. 2:
        
మోదపు భోగము మోక్షమునకు గురి
యీదేహ మొకటే యెత్తినది
గోదిలి కడుఁ గుంగుటకు నెక్కుటకు
యీదెస విజ్ఞానమిదియే కలది

చ. 3:
        
ఆర్మిలి దుఃఖము నతిసుఖములకు గురి
కర్మం బొకటే కలది
కూర్మి శ్రీవేంకట గురుదైవముఁ గను-
ధర్మమున కతని దాస్యమే కలది

రేకు: 0302-02 మంగళకౌశిక సం: 04-008 విష్ణు కీర్తనం


పల్లవి:

ఇందరు నీకొక్కసరి యెక్కువ తక్కువ లేదు
చెంది నీసుద్దులు యేమిచిత్రమో కాని

చ. 1:

నీనామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని
నీ నామము వినక నెరవేరె నొకఁడు
వూని నిన్ను నుతియించి భోగియాయ నొకఁడు
మోనమున నిన్ను దిట్టి మోక్షమందె నొకఁడు

చ. 2:

మతిలో నిన్నుదలఁచి మహిమందె నొకయోగి
తతి నిన్ను దలఁచకే తగిలె నిన్నొకఁడు
అతిభక్తిఁ బని సేసి అధికుఁడాయ నొకఁడు
సతతము బనిగొని సఖుఁడాయ నొకఁడు

చ. 3:

కాఁగిటి సుఖములిచ్చి కలసిరి గొందరు
ఆఁగి నిన్ను వెంటఁదిప్పి ఆవులు మేలందెను
దాఁగక శ్రీవేంకటేశ దగ్గరైన దవ్వయిన
మాఁగి నిన్ను దలపోసే మనసే గుఱుతు

రేకు: 0302-03 ముఖారి సం: 04-009 వైష్ణవ భక్తి

పల్లవి:

గరిమతో వెరపేల కమలాక్షు దాసులకు
పరమపద మొక్కటే ఫలమింతే కాక

చ. 1:

పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు
దాఁప నవి నిమిషమాత్రములే కాక
లోపలేడ వెలియాడ లోకులకింతే కాక
మోపినదంతా యేకముఖమే కాక

చ. 2:

రాతిరేది పగలేది రమించు సాత్వికులకు
యీతల నింతా వెలుఁగింతే కాక
ఘాతలఁ గర్మాకర్మగతులు యీసంది వింతే
పోతరించి యెక్కనెక్కఁ బోడవే కాక

చ. 3:

చింతలేల సిలుగేల శ్రీవేంకటేశ్వరుని
వంతుల నమ్మినయట్టి వైష్ణవులకు
జంతువుల పురుఁడులు జడులకింతేకాక
వింతవింత సుద్దులేల విభవమే కాక


రేకు: 0302-04 గుండక్రియ సం: 04-010 అధ్యాత్మ

పల్లవి:

అనాది జీవుఁడన్నియుఁ గన్నవే
వినోదమిందలి విరతే వలయు

చ. 1:

వెలిఁ దోఁచిన యీ విశ్వంబెల్లా
కలసిన మనోగతములివి
పలు విషయేంద్రియ భావములెల్లా
వెలయుఁదా ననుభవించినవే

చ. 2:

సహజపు వర్ణాశ్రమము లివెల్లా
యిహమునఁ దాధరియించినవే
బహువేదశాస్త్రపఠన లివెల్లా
వహి కెక్కఁగఁదా వచియించినవే

చ. 3:

దినదిన సంసార తిమిరం బెల్లా
ఘనముగఁ దను మున్ను గప్పినవే
అనయము శ్రీవేంకటాధిపుఁ డాత్మకు
ననిచి తొల్లి కల నాయకుఁడే

రేకు: 0302-05 సామంతం సం: 04-011 విష్ణు కీర్తనం


పల్లవి:
 
ఇతర మేదియు లేదు యెఱఁగ మింతేకాని
రతికెక్కేపనులెల్లా రామచంద్రుఁడే పో

చ. 1:
        
ధనమై చేరేవాఁడు దైవమై కాచే వాఁడు
మనసులోదలఁచేటి మాధవుఁడే
మునుకొన్న గ్రామములై ముందర నుండే వాఁడు
కొననాలుక మీఁదటి గోవిందుఁడే పో

చ. 2:
        
తల్లియై పెంచేవాఁడు తండ్రియై పుట్టించే వాఁడు
వెల్లవిరిఁ దాఁగొలిచే విష్ణుమూరితి
ఇల్లాలై సుఖమిచ్చి యెంచఁ బుత్రులైన వాఁడు
చెల్లుబడిఁ దామొక్కేటి చేతిపై శ్రీహరియే

చ. 3:
        
దేహమై వుండేటివాఁడు దినభోగమైన వాఁడు
యీహల శ్రీవేంకటేశుఁడితఁ డొక్కఁడే
మోహాచారమైన వాఁడు మోక్షమై నిలిచే వాఁడు
సాహసించి నమ్మఁగల సర్వేశుఁడితడే


రేకు: 0302-06 భవుళి సం: 04-012 వైరాగ్య చింత

పల్లవి:

విడిచితి మనరాదు అవి మరి విడువమవఁగరాదు
అడరిన శ్రీహరి అనుమతికొలఁదే

చ. 1:

పెంచినఁ బెరుగును పెను యింద్రియములు
కొంచము సేసినఁ గుందును
పంచిన దిందును పాపముఁ బుణ్యము
యెంచఁగ నీశ్వరుఁడిచ్చిన కొలఁదే

చ. 2:

తెలిసినఁ దేటగు తిరమగు మనసిది
కలఁచిన లోలోఁగలఁగును
తొలఁచిన దిందునె దుఃఖము సుఖమును
యిల నంతర్యామిచ్చిన కొలఁదే

చ. 3:

చేసినఁ జెలఁగును చేఁతల కర్మము
పాసినఁ బాయును బంధముతో
ఆసల శ్రీవేంకటాధీశుఁడిందుకు
యీసరి గర్తతఁడిచ్చిన కొలఁదే