తరికొండ నృసింహశతకము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

1. రచనా ప్రక్రియ:

తెనుగు సాహిత్యంలో 'శతక'మనే రచనాప్రక్రియ ఎంత ప్రాచీనమైనదో, అంత నవీనమైనది. శతకానికి ముఖ్య లక్షణాలు మూడు: i) మకుటం - అంటే రచయిత ఇష్టదైవాన్ని ఉద్దేశించిన సంబోధన ii) పద్యసంఖ్య- అనగా 'శతక'మనే పేరుకు అనుగుణంగా నూరు పద్యాలకు తక్కువ కాకుండా ఉండటం. iii) ఛందస్సు - అంటే శతకంలోని పద్యాలు మొదటి నుండి చివరి వరకు ఒకే ఛందంలో రచింపబడివుండటం.

పై మూడూ సామాన్యంగా తెలుగు శతకానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు.

తెలుగు శతకాల్లో భక్తి శతకాలది అన్ని విధాల అగ్రస్థానం. తెనుగులో అసంఖ్యాకంగా వెలువడిన భక్తిశతక సముదాయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన “తరిగొండ నృసింహశతకము" విశిష్టమైనది. ఇది ఈ భక్తకవయిత్రి రచనల్లో మొట్టమొదటిది. ఆమె తరిగొండలో ఉండినప్పుడు రచించినది.

2. శతక స్వరూపం:

వెంగమాంబ లేఖినినుండి ప్రప్రథమకృతిగా అవతరించిన ఈశతకంలో నూటమూడు పద్యాలు ఉన్నాయి. అందులో 65 ఉత్పలమాలలు, 38 చంపకమాలలు కలవు. "తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" -

అనేది ఇందలి 'మకుటం'. ఈ మకుటాన్ని బట్టే ఈ కృతికి "తరిగొండ నృసింహశతక”మనే నామధేయం ఏర్పడింది.

3. రచనోద్దేశం:

స్వగ్రామమైన తరిగొండలో వెలసి, తనకు ఇలవేల్పైయున్న శ్రీలక్ష్మీనృసింహస్వామివారి యెడల తనకు గల భక్తి ప్రపత్తులను అక్షరరూపేణ వెల్లడించు పూనికతోను, తన రచనా వ్యాసంగానికి ఆది ప్రయత్నంగాను వెంగమాంబ రచించిన శతక మిది. ఈ శతకంలోని "అతులితమైన మీపదవి నందందలంచి విశాలభక్తిచే"- ఇత్యాది మూడవ పద్యంద్వారా కవయిత్రి తనకు గల పరమోద్దేశాన్ని (అతులితమైన పదవిని - అనగా మోక్షాన్ని పొందాలనే ఆకాంక్షను) స్పష్టంగా వెల్లడించింది. నిజానికి 'ముక్తికాంక్ష'- అనే ఈ పరమలక్ష్యాన్ని ఉద్దేశించియే తరువాతి కాలంలో ఈమె సారస్వతమంతా వెల్లివిరిసింది. ఆ ధ్యేయం ఇలాగ ఆమె తొలిరచనలోనే వ్యక్తంకావడం ఒక విశేషం!

4. ప్రతిపాదించిన విషయాలు:

ఈ కృతిలో ఆ యా పద్యాల మూలంగా ప్రబోధింపబడిన విషయాలను బట్టి ఇందులో i) భక్తి ii) నీతి iii) వేదాంత, యోగ విశేషాలు iv) కవయిత్రి ఆత్మీయాంశ- అనేవి ప్రధానంగా ప్రతిపాదింపబడినవని గుర్తింపవచ్చు.

i) భక్తి: వెంగమాంబ 'అచ్చపుభక్తి'కి ఉదాహరింపదగిన పద్యాలు ఈ శతకంలో అనేకం ఉన్నాయి. వాటిలో 'దశావతారస్తుతి'- ఒక ఘట్టం. (చూ.7 నుండి 16 వరకు గల పది పద్యాలు). ఈ కవయిత్రి భక్తిలో కొన్నిచోట్ల మధురభక్తి (నాయికాభావన) కూడ గోచరిస్తూవుంది. (చూ. 17,19,20,21 పద్యాలు).

ii) నీతి : వెంగమ లేఖినినుండి అలవోకగా వెలువడి, మిగుల సహజంగా భాసిస్తూవున్న నీతిపద్యాలు ఇందులో అచ్చటచ్చట నెలకొని వున్నాయి. మచ్చుకు 92, 95 సంఖ్యలుగల పద్యాలు తిలకింపదగివున్నాయి. iii) వేదాంత, యోగ విశేషాలు : ఈ శతకం ప్రధానంగా భక్తిశతకమే అయినప్పటికీ, ఇందులో ఇంచుమించు 40 పద్యాల్లో జీవుడు, ఆత్మ, పరమాత్మ, సద్గురు మహిమ - మొదలైన పెక్కు తాత్త్విక విషయాలు ప్రవచింపబడివున్నాయి. ఈ వేదాంత, యోగ విశేషాల ప్రాశస్త్యాన్నిబట్టే కొందరు విమర్శకులు ఈ కృతిని వేదాంత శతకాల శ్రేణికి చెందిందిగా పరిగణించారు.

iv) కవయిత్రి ఆత్మీయాంశ: వెంగమాంబ ఆత్మీయాంశ ఈ రచనలో అద్దంలాగా సుస్పష్టరేఖలతో ప్రతిబింబించివుంది. ఈమె పద్య రచన ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈమెది 'వికల్పకవిత' అనే విమర్శ బయలు దేరిందట! (చూ.4ప.). 'వికల్ప కవిత్వం' అనగా 'కవిత్వం కాకపోయినా కవిత్వంలాగా కనిపించే రచన'- అని అభిప్రాయం. కాని, పై విమర్శ అసూయతో గూడిన పసలేని విమర్శ అనటానికి ఈ శతకమే సాక్ష్యం. ఈప్రథమరచననాటికే ఈ కవయిత్రి వివాహితయని, భర్తపేరు ఇంజేటి వేంకటా చలపతి యని ఇందలి చివరిపద్యం ప్రకటిస్తూవుంది.

ఇంతేగాక, గురువర్యుడు పాదమూలంచేత తన (శిష్యురాలి) నుదుటివ్రాతను మార్చివేసినట్లు ఈ కవయిత్రి 41వ పద్యంలో పేర్కొనియున్నది. అందువల్ల, ఆ గురువు ఆధ్యాత్మికోపదేశంచేత ఈ కవయిత్రి జీవితానికి నూతనోత్తేజాన్ని ప్రసాదించినాడనే అర్థం సూచింపబడింది.

ఈ శతకరచనాకాలం నాటికే వెంగమాంబ ఇలవేల్పైన తరిగొండ లక్ష్మీనృసింహస్వామియొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రురాలై యున్నట్లు ఈ శతకంలోని 32, 42, 86, 102 సంఖ్యలు గల పద్యాలు స్పష్టంగా చాటుతూవున్నాయి.

5. రచనా వైశిష్ట్యం:

ఈ శతకం వెంగమాంబ ప్రథమ రచన అయినప్పటికీ, ఇందులో కమనీయమగు కవితా వైచిత్రికి కొదువ లేదు. బమ్మెర పోతనార్యుని భాగవతము, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము, కంచెర్ల గోపనార్యుని దాశరథి శతకము-మున్నగు ప్రాచీన మహాకవుల రచనల ఛాయలు గోచరిస్తూవున్నాయి. అయినను, కొన్ని విశిష్ట గుణాలచే ఈ కృతి స్వతంత్రవ్యక్తిత్వం కలదై అలరారుతూవుంది.

ఆ విశిష్టగుణాలు ఇవి:

i) కవయిత్రి యీ కృతిలో ఇష్టదేవతా, గురువందనాదికం మొదలుకొని చివరిదాకా నిర్మల భక్తినిష్ఠమైన తన మనఃక్షేత్రంలో అంకురించిన భావాలనే సహజధోరణిలో సంతరించింది.

ii) ఈ శతకశైలి ఒడిదుడుకులు లేక, నిరాడంబరమై, నిర్మలంగా, నిరర్గళంగా సాగుతూ, అక్కడక్కడ పూర్వకవుల కవితారీతులను సముచితంగా సమన్వయించుకొని, ఒకానొక ప్రత్యేకతతో విలసిల్లుతూవుంది.

iii) అత్యంత సహజమైన భక్తిభావాలు, అనుభవజనితాలైన తాత్త్వికభావాలు ఇందులో పడుగుపేకలుగా అల్లుకొనివుండటం చేత, ఇది అపూర్వమైన "భక్తివేదాంత శతకం”గా విరాజిల్లుతూవుంది.

6. పరిష్కరణ:

ఈ శతకాన్ని తొలుత విశ్వవిఖ్యాత పరిశోధకాగ్రేసరులు కీ.శే. మానవల్లి రామకృష్ణకవి మహోదయులు తమకు లభించియుండిన ఒకతాళపత్ర ప్రతి ఆధారంతో పరిష్కరించి 1944లో తి.తి.దే. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయ పత్రికలో చిన్నపీఠికతో ప్రకటించారు[1]. ఈ పత్రికలో ప్రచురింపబడిన ఆ ముద్రితప్రతి ఆధారంగానే ప్రకృత పరిష్కరణ కార్యం కొనసాగించబడింది.

అచ్చుతప్పులు, మఱికొన్ని స్ధాలిత్యాలు ఈ పరిష్కరణలో సవరింపబడినాయి. ఇందులో ప్రతిపద్యం పాఠకుల సౌకర్యం నిమిత్తమై ఎనిమిదిపంక్తులలో ముద్రింపబడింది. అలాగే, ప్రతి పద్యానికి సంగ్రహంగా భావం కూడ సమకూర్పబడింది. "ఆపరితోషాద్విదుషాం” అన్నరీతిగా ఈ ప్రచురణ సహృదయ పాఠకుల సమాదరాన్ని అందుకోగలదని ఆశయం.

శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు రచించిన పీఠిక

పీఠిక

ఈ నృసింహశతకము రచించిన కవి తరికొండ వెంగమాంబ. ఈ తరికొండ కడపమండలములో నొక గ్రామము. అచ్చట నధిష్ఠితుఁడగు నృసింహస్వామి మహావరప్రదాతయని ప్రఖ్యాతి వడసి భక్తలోకముచే నిరంతర మారాధ్యమానుఁడగుచుండు. వెంగమాంబ చిరకాల మచ్చట వసియించి పిదపఁ దిరుమలలో నివాసము కుదుర్చుకొని శ్రీ వేంకటాచలపతి కైంకర్యమున జీవితకాలము పుచ్చుచుండెను. ఆంధ్రభాషలోఁ గులస్త్రీ కవయిత్రులలో నీమెయు గణనార్హ. కుమ్మరమొల్ల, మదినె సుభద్రమ్మ మొదలగువారు కులస్త్రీలు, మధురవాణి, రంగాజి, ముద్దుపళని ప్రభృతులు గొప్ప కవులయినను వారి యుదంతము నిశ్చయముగాఁ దెలియదు. వెంగమాంబ రాజయోగసారము, భాగవతము ద్విపదకావ్యములుగాను, వేంకటాచలమాహాత్మ్యము పద్యరూపముగను విరచించె. ఈ శతకము లఘు కావ్యమైనను స్వగ్రామదేవతాస్తుతి యగుటచే వేంగమాంబ కున్న యిష్టదేవతాభక్తిని వెల్లడించుచున్నది ఒక్క తాళపత్రప్రతిఁ జూచి దీనిని ముద్రించినారము. భగవద్భక్తుల కిది యింపు గొలుపు ననుట నిక్కము. ఈమె సుమారు 150 సంవత్సరములకుఁ బూర్వముండె ననవచ్చు. ఈ కవి బ్రాహ్మణస్త్రీ, నియోగికుల సంజాత. కృష్ణమంత్రి తనూజ. ఇంజేటి వెంకటాచలపతి భార్య. బాలవిధవయని పండితు లూహించుట కాధార మేమియుఁ గానరాదు. దీనిలో రాజయోగసారాదిగ్రంథములలో వివరింపఁబడిన షట్చక్రాదిశరీరయోగముద్రారహస్యములు చూపఁబడినవి. ఇందుఁ గొన్నిచోటుల వ్యాకరణఛ్ఛందోదోషములును, నశ్లీలపదప్రయోగమును గానవచ్చుచున్నవి. వస్తుస్వరూపము ననుసరించి తదధికారులకు దోషగణనము ప్రధానము కానేరదు.

మా. రామకృష్ణకవి, ఎం.ఏ.

  1. See; Journal of Sri Venkateswara Oriental institute, TIRUPATI, Vol-V - No.I, January - June 1944, TELUGU, 1. శ్రీతరికొండ నృసింహశతకము, Sri M. Ramakrishna kavi, pp:1-16