తత్త్వముల వివరము/ముందుమాట

వికీసోర్స్ నుండి

రచయిత ప్రబోధానంద యోగీశ్వరుల ముందుమాట


తత్‌ అనగ అది అని అర్థము. త్త్వం అనగ నేను అని అర్థము. తత్త్వం అనగ అది నేను అని చెప్పవచ్చును. నేను అనువాడు జీవుడు, జీవునికంటే వేరుగ ప్రక్కనే ఉన్నవాడు ఆత్మ (దేవుడు). జీవాత్మ ఆత్మల వివరమే తత్త్వములో ఉండును. జీవాత్మ, ఆత్మల వివరములేనిది తత్త్వము కానే కాదని చెప్పవచ్చును. తత్త్వ జ్ఞానము చాలా విలువైనది. ఆత్మ, జీవాత్మలు శరీరములోనే ఉండును. కావున తత్త్వ వివరమంతయు శరీరములోనే ఇమిడివుండును. అందువలన తత్త్వ వివరము తెలుపువారు శరీరములోపలే చెప్పాలి. శరీరము విడిచి బయట చెప్పితే అది పూర్తి అసత్యమగును.


అసలు విషయమేమంటే "తత్త్వం" అని పేరు పెట్టిన పాటలుకాని, పద్యములుకాని ఎవరికి అర్థముకాని రీతిలో ఉంటాయి. ఎవరైన తత్త్వము వ్రాస్తే అలాగే వ్రాయాలని ఆనాటి పెద్దలు నిర్ణయించుకొని తీర్మానించారు. ఆ పద్ధతి ప్రకారమే తత్త్వాలన్నీ వ్రాయబడినవి. అలా అర్థముకాని రీతిలో ఎందుకు వ్రాయాలి అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా? మన పెద్దలు కొంత ధనమును సంపాదించారు అనుకొందాము. ధన సంపాదన వెనుక ఎంతో శ్రమ ఉండును. శ్రమపడి సంపాదించినది కావున ఆ ధనమునకు కూడ ఎంతో విలువ ఉండును. దాని విలువను గుర్తించిన వారు ధనమును ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు ఒక తాళము కూడ వేసి ఉందురు. లోపలి ధనము కావాలంటే తాళమును తెరచు తాళముచెవి కావాలి. అలా ఉన్నపుడే ధనమునకు విలువవుండును. ఎదుటివాడు దాని విలువను తెలుసుకొనును. అలా లేకపోతే ధనము ఆరుబయట ఉంటే దాని విలువను గుర్తించలేరు. ఇష్టమొచ్చినట్లు వాడుకొని అసలే లేకుండ చేసుకొందురు. పూర్వము పెద్దలు జ్ఞానమను ధనమును సంపాదించి ప్రపంచ ధనమును దాచినట్లు పెట్టెలో పెట్టి తాళము వేయలేదు. కాని ఒక గుడ్డలో మూటగట్టి ముడివేశారు. ఆ మూటలను మన ఎదుటే పెట్టి పోయారు. ఆ మూటల ముడి విప్పితే అందులోని జ్ఞానధనము సులభముగ దొరుకును. మూటలు ముందున్న మనము ముడివిప్పుకోలేని వారమైనాము. కావున వారు కొంత మరుగుపెట్టి వ్రాసినవి తెలియకుండ పోయినవి. అందువలన తత్త్వముల వివరములు ఎవరు చెప్పుకోవడము లేదు.


అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు కొందరికి తత్త్వములు అర్థము కాక వాటిని తిక్క మాటల క్రిందికి జమకట్టారు. ఇవి వేదాలుకాదు, ఉపనిషత్తులు కాదు వీటిని ఎందుకు చదవాలని అంటున్నారు. ఎవరు ఏమనిన తత్త్వాలలో ఉన్నది జ్ఞానము యొక్క సారాంశమను మాట వాస్తవము. పూర్వము బోధకులైన గురువులు జ్ఞానము చెప్పునపుడు కూడ రహస్య ప్రదేశములోనే చెప్పెడివారు. బయటి అజ్ఞానుల ఎదుటకాని, జ్ఞానము విూద ఆసక్తిలేనివారి ఎదుటకాని చెప్పెడివారుకాదు. పూర్వకాలములో అందరూ అదే పద్ధతిని కొనసాగించుచుండిరి. కావున వారు తత్త్వములను కూడ నిగూఢముగానే వ్రాసి అందరికి అర్థము కాకుండ చేశారు. ఎవరికైతే జ్ఞానము విూద జిజ్ఞాసయుండునో వారికి మాత్రము అర్థమగునట్లు వ్రాశారు. బయటి చూపును వదలి లోచూపు పెట్టుకొన్న ఎవరికైన తత్త్వములు ఎంత నిగూఢముగ ఉండినప్పటికి అర్థము కాగలవు.


నేటి సమాజములో ఎందరో గురువులుగ చలామణి అగుచున్న బోధకులు, స్వాములు, పీఠాధిపతులు గలరు కదా! తత్త్వముల వివరము గురించి వారికి కూడ తెలియదా? అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఎవరైతే తత్త్వములుగ వ్రాయబడిన పాటలలో జ్ఞానము లేదంటున్నారో వారు ఎవరైన వారికి శరీరములోని ఆత్మజ్ఞానము తెలియదనియే చెప్పవచ్చును. నేడు బోధకులందరు ఎక్కువ శాతము బయటి జ్ఞానమునే బోధిస్తున్నారు. కొందరైతే ఏ జ్ఞానములేని రామాయణ ఇతిహాసములను చెప్పుకుంటున్నారు. ఈ విధముగ జరిగి పోయిన చరిత్రను జ్ఞానమనుకోవడము వలన, ఇంతకు ముందు జ్ఞానిగ ఉన్నవాని చరిత్రను చెప్పుకోవడము వలన, మనకు జ్ఞానము కలుగుచున్నదా లేక కాలక్షేపణ జరుగుచున్నదా అని యోచించక పోవడము ఎవరి దారిని వారు సమర్థించుకొంటున్నారు. అటువంటి వారికి తత్త్వములలోని జ్ఞానధనము లభించదు.


"తత్త్వం"ను విడదీసి చూచితే తత్‌+త్వం అని తెలుసుకొన్నాము. తత్త్వం అన్నది అన్ని మతములలోను గలదు. ముఖ్యముగ హిందూ (ఇందూ) మతములోను, క్రైస్తవ మతములోను బాగా కనిపిస్తున్నది. అయినప్పటికి ఇటు హిందువులకు అటు క్రైస్తవులకు దీని అర్థ భావములు తెలియకుండ పోయినది. హిందువులలో సంస్కృతమును నేర్చినవారు అర్థము చెప్పగలుగు చున్నారు. కాని భావము తెలియకుండ పోయినది. ప్రతి పదార్థము చెప్పిన వారికి భావము ఏమిటో తెలియదు. తత్‌ అనగ తనకు భిన్నముగ ఉన్న ఆత్మ అని అనుకోవడములో పొరపడుచున్నారు. ఎందుకనగా భగవద్గీతలోకాని, బైబిలులోకాని మూడు ఆత్మలు సిద్ధాంత సహితముగ చెప్పబడియున్నవి. ఆ త్రైతాత్మ సిద్ధాంతమును ఎవరు గుర్తించని కారణమున తత్‌ అనబడునది రెండవ ఆత్మనో, మూడవ ఆత్మనో తెలియకుండపోయినది. కొందరికి ఆత్మల వివరమే అర్థముకాక తాను మొదటి ఆత్మనైన జీవాత్మననే తెలియదు. ఇక క్రైస్తవులలోనికి వస్తే మూడవ ఆత్మను అటుంచితే రెండవ ఆత్మ వివరము కూడ తెలియదు. ఈ విధముగ ప్రపంచములో అతి పెద్దదైన క్రైస్తవమతమందుకాని, ఇక్కడ ఒక స్థాయిలోనున్న హిందూమతములో గాని రెండవ ఆత్మ వివరము తెలియకుండ పోయినది.


తత్‌+త్వం = తత్త్వం అని వివరించుకొని చెప్పువారున్నప్పటికి, "త్వం" కు అర్థము తెలిసినప్పటికి ఆ "తత్‌" అనేది ఏదో స్పష్టముగ ఎవరికి తెలియకుండపోయినది. ఒకవేళ కొందరిలో మాకు తెలుసునను ధీమా ఉండినప్పటికి అది వారి గ్రుడ్డినమ్మకమే కాని అసలైన జ్ఞానదృష్ఠి లేదని చెప్పవచ్చును. అందువలన తత్‌ అనగ పరమాత్మ అని చెప్పుచున్నారు. ఒక జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతే వానికి జన్మ ఉండదు. అలా ఐక్యమైనవాడే కర్మలేనివాడై శరీరముతో లేకుండును. ఇక్కడ అసలైన వివరానికి వస్తే పూర్వము తనలోని ఆత్మను తెలిసిన జ్ఞానులు ఆత్మతో కలిసి యోగము పొందినవారైవున్నారు. అటువంటి జ్ఞానులు ఆత్మతో కలియకముందు "తత్త్వం" అన్నవారు ఆత్మతో కలిసిన తర్వాత "తత్త్వమసి" అన్నారు. దీనిని విడదీసి చూచితే తత్‌+త్వం+అసి= తత్త్వమసి అనిగలదు. తత్‌ అనగ ఆత్మ అని, త్వం అనగ నేను అని, అసి అనగ కలసిపోయాము అని అర్థము. ఆత్మతో కలసినవాడు భూమి మీద శరీరముతో ఉండి బ్రహ్మయోగిగ ఉండును. అందువలన శరీరముతో బ్రతికివున్నవాడు "తత్త్వమసి" అనగలిగాడు. అదే పరమాత్మతో కలసిపోతే వానికి శరీరముండదు కావున వాడు ఏమియు అనే దానికుండదు. అందువలన ఆత్మను అనగ తత్‌ను తెలుసుకొన్న జీవుడు త్త్వం అన్నవాడు తత్‌లో కలసిపోయి తత్త్వమసి కాగలడు. ఇప్పటికైన తత్త్వం అను పదమునకు అర్థము తెలిసి, జీవాత్మ ఆత్మలను తెలుపు పాటలకు, పద్యములకు తత్త్వమని పేరు పెట్టారని తెలిసి, రెండు ఆత్మలు శరీరములోనే ఉన్నాయని తెలిసి, తత్త్వమునకు శరీరాంతర్గతములోనే అర్థము చెప్పుకోవలెను. ఇదే సూత్రమును అనుసరించి "తత్త్వముల వివరము" అను ఈ గ్రంథములో వ్రాసిన పాటలకు పద్యములకు శరీరములోనే వివరించి చెప్పాము. వేయి పుస్తకములు చదువుటకన్న వేమన పద్యమొకటి చదువుట మిన్న అన్నట్లు, వేయి పాటల తత్త్వములను పాడుకొనుటకంటే ఒక్క తత్త్వమునకు వివరమును తెలియుట మిన్న. అందువలన తత్త్వములను పాడుకొనుటలో ఉపయోగము లేదు కాని తత్త్వమును అర్థము చేసుకొంటే అది ఉపయోగమై "తత్త్వమసి" కాగలవు.


ఇట్లు

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు