జ్యోతిష్య శాస్త్రము/కాలచక్రములో ఏ లగ్నము మంచిది?

వికీసోర్స్ నుండి

28. కాలచక్రములో ఏ లగ్నము మంచిది?[మార్చు]

కాలచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు లగ్నములని అందురు. కాలచక్రములోని పన్నెండు లగ్నములకు పన్నెండు పేర్లు కలవని చెప్పుకొన్నాము. వివరముగా చెప్పుకొంటే పన్నెండు లగ్నములను పన్నెండు దేశములుగా పోల్చుకొని చెప్పవచ్చును. ప్రతి లగ్నము కొంత విస్తీర్ణముగల దేశములాంటిది. ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క రాజు అధిపతిగాయున్నట్లు, పన్నెండు లగ్నములకు పన్నెండు గ్రహములు రాజులుగా అధిపతులుగా యున్నారు. ఆ పన్నెండు మంది ఎవరికి వారు మంచివారే, అయినా వారు రెండు గుంపులుగాయున్నారు. ఒకవర్గము వారికి మరొక వర్గము వారు వ్యతిరేఖులుగాయుందురు. మనిషి జన్మించిన కాలమునుబట్టి, ఆ మనిషి ఒక వర్గము వారికి చెందినవాడుగా నిర్ణయించబడును. అప్పుడు ఒక వర్గమువారైన ఆరుమంది రాజులు లేక లగ్నాధిపతులు మనిషికి మిత్రులుగా ఉండగా, వారివైపుకు పోయినందుకు ఆ మనిషికి మిగత ఆరు గ్రహములు శత్రువులుగా తయారగుదురు. ఏ మనిషికైనా దేశములుగానీ, ప్రదేశములుగానీ ఏ భావములేనివిగా, నిర్జీవమైనవిగా, అందరికీ సమానముగా ఉండును. సమానముగా లేనివారు ఆయా లగ్నములకు సంబంధించిన అధిపతులేనని తెలియవలెను. కొందరు మిత్రులైతే, కొందరు శత్రువులుగా ఉందురు. మనిషి కర్మనుబట్టి వాని జన్మనుబట్టి, జన్మించిన లగ్నమునుబట్టి మనిషికి లగ్నాధిపతులు ఆరుమంది శత్రువులుగానూ, ఆరుమంది మిత్రులుగాను ఏర్పడుచుందురు. కాలచక్రములోని లగ్నాధిపతు లైనవారు మనిషి ఎడల మంచిగా కొందరు, చెడుగా కొందరు ఉండుట వలన, కాలచక్రములోని లగ్నాధిపతులలో మంచివారుండవచ్చును గానీ, లగ్నములు మంచి, చెడు అనునవి ఉండవు. లగ్నములు అని పేరు పెట్టబడిన పన్నెండు భాగములు పన్నెండు ప్రదేశములేగానీ అందులో మంచి చెడు అనునవి ఉండవు. లగ్నము అనబడునది నిర్ణీత పొడవు వెడల్పుగల ప్రదేశము అని అర్థము. కాలచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు లగ్నములుగా చెప్పుచున్నాము. అలాగే కర్మచక్రములోని పన్నెండు భాగములను లగ్న ములనియే చెప్పుచున్నాము. అలా కర్మచక్రములోని భాగములను లగ్నము లనుట తప్పు. అయితే ముఖ్యముగా గమనించవలసిన విషయ మేమనగా! కాలచక్రములోని భాగములకు మేషము, వృషభము అను పన్నెండు పేర్లు గలవు. కర్మచక్రములోని భాగములకు ప్రత్యేకించి పేర్లు ఉండవు. కర్మచక్రములోని భాగములకు వరుసగా సంఖ్య పేర్లుండును. ఆ విధానములో ఒకటవ స్థానము, రెండవ స్థానము అని మొదలిడి చివరకు పన్నెండవ స్థానము వరకు చెప్పుచుందురు. దీనినిబట్టి పేర్లనుబట్టి కాల చక్రమునూ, వరుస సంఖ్యనుబట్టి కర్మచక్రమునూ గుర్తించవచ్చును.