జ్యోతిష్య శాస్త్రము/ఎవడు జ్యోతిష్యుడు?

వికీసోర్స్ నుండి

3. ఎవడు జ్యోతిష్యుడు?[మార్చు]

ఏ మనిషికైనా జరిగిపోయిన కాలము, జరుగుచున్న కాలము, జరుగబోవు కాలము అని మూడు కాలములు కలవు. జరిగిపోయిన కాలమును ‘భూతకాలము’ అంటున్నాము. జరుగుచున్న కాలమును ‘వర్తమానకాలము’ అంటున్నాము. జరుగబోవు కాలమును ‘భవిష్యత్‌ కాలము’ అంటున్నాము. జరిగి పోయిన భూతకాలమును మనలోని మనస్సు యొక్క జ్ఞాపకము చేత తెలుసుకోవచ్చును. దానినే మనోనేత్రము చేత భూత కాలమును తెలుసుకోవచ్చునని పెద్దలన్నారు. ఒకని భూతకాలమును మరియొకడు తెలుసుకొనుటకు వీలులేదు. ఎవని భూతకాలమును వాడు మాత్రము వాని మనస్సు చేతనే తెలుసుకోవాలి. జరుగుచున్న వర్తమాన కాలము అందరి కళ్ళముందర ప్రత్యక్షముగ జరుగుచున్నది. కావున ఎవరి కన్నుల ద్వార వాడు తెలుసుకోగల్గుచున్నారు. వర్తమానకాలమును అందరూ సులభముగా తెలుసుకొంటున్నారు. జరిగిపోయిన భూతకాలమును మనో బలహీనత కల్గినవారు మరచిపోవచ్చును. భూతకాలమును వాని మనస్సు జ్ఞప్తి తేలేకపోతే, దానిని తెలుసుకొను అవకాశము లేకుండ పోవచ్చును. కానీ వర్తమాన కాలమును ఎంత తెలివి తక్కువ వాడుగానీ, మనో బలహీనత కలవాడుగానీ తెలుసుకొనుటకు అవకాశము గలదు.

జరుగబోవు భవిష్యత్‌ కాలమును తెలుసుకొనుటకు, అంతరంగము లోని మనోనేత్రముగానీ, బాహ్యరంగములోని ప్రత్యక్ష నేత్రముగానీ పనికి రాదు. భవిష్యత్‌ కాలమును తెలియుటకు జ్ఞాననేత్రము కావలెను. జ్ఞానజ్యోతి వలన తెలియునది కావున దానిని ‘జ్యోతిష్యము’ అంటున్నాము. దీనిని బట్టి జ్ఞాననేత్రమను జ్యోతిష్యము ద్వారానే, భవిష్యత్తు కాలమును తెలియవచ్చును. మనిషికిగల భూత,వర్తమాన,భవిష్యత్‌ అను మూడు కాలములను మూడు నేత్రముల ద్వార చూడవచ్చునని తెలియుచున్నది. భూతకాలమును తెలుసుకొను మనోనేత్రము యొక్క చూపు (జ్ఞాపకశక్తి) కొందరికుండవచ్చును, కొందరికి ఉండకపోవచ్చును. కానీ వర్తమాన కాలమును తెలుసుకొను బాహ్యనేత్రముల యొక్క చూపు అందరికీ ఉందనియే చెప్పవచ్చును. ఇకపోతే భవిష్యత్‌ కాలమును తెలుసుకొను జ్ఞాననేత్రము, నూటికి తొంభై మందికి లేదనియే చెప్పవచ్చును. కేవలము పదిశాతము మందికి జ్ఞాన నేత్రముండినా, అది చూపులేని గ్రుడ్డిదై ఉన్నది. అందువలన భవిష్యత్‌ కాలము ఎవరికీ తెలియకుండ పోయినది. జ్ఞానులమనుకొన్న కొన్ని వేలమందిలోనో, లేక కొన్ని లక్షలమందిలోనో ఒకనికి జ్ఞాననేత్రము చూపు కల్గినదై ఉండును. అటువంటివానికి మాత్రమే జ్యోతిష్యము తెలియును. అట్టివాడు మాత్రమే భవిష్యత్‌ను తెలుసుకోగల్గును. మూడు కాలములకు మూడు నేత్రములు అవసరమని, అందులో జ్ఞాననేత్రము చాలా ముఖ్యమైనదని తెలిసి, చూపున్న జ్ఞాననేత్రమును కల్గినవాడు నిజమైన జ్యోతిష్యుడని తెలియవలెను. జ్ఞాననేత్రము లేకుండ పంచాంగములను తెలిసినవాడు జ్యోతిష్యుడు కాదు.