జీవశాస్త్ర సంగ్రహము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము.

జీవులు, అజీవులు (The Living and the Non-Living)

సృష్టియందలి సమస్తపదార్థములును జీవులు అజీవులను రెండు తెగలుగా విభజింపబడియున్నవి. జీవులు అనగా ప్రాణముగలవి: జంతువులు, వృక్షములు, అజీవు లనగా నెన్నడును ప్రాణము లేనివి: నీరు, వాయువు, శిలలు మొదలగునవి. జీవులకును, అజీవులకును గల భేదములు మిక్కిలి సులభముగ నున్నట్లు తోచునుగాని యా భేదములు నన్ని చోట్లను విధులుగ వర్తింపవు. ఈక్రిందినిషేధములను (Exception) చక్కగ గ్రంహించునెడల నీవిషయము బోధపడగలదు.

1. జీవులు మిక్కిలి మిశ్రమైన రసాయనసమ్మేళనమువలన (Complex Chemical Combination) నైన మూలపదార్థముచే నేర్పడినవి. అవి కణములరూపమున నమరియుండును. అజీవ పదార్థములయందలి రసాయనసమ్మేళనములు అంత మిశ్రముగా నుండవు. వానికి నిర్ణయమైన నిర్మాణము లేదు.

2. జీవు లితరపదార్థముల నాహారముగా నిముడ్చుకొని, వానిని జీర్ణముచేసికొని తమ మూలపదార్థములో మిళితము చేసికొను శక్తి (Nutrition) గలవి. ఇందుచే సమస్తజీవులకును కొంతవరకు వృద్ధి (Growth) గలుగును. అజీవపదార్థములకు వృద్ధిక్షయములు లేవు. నిషేధములు: అజీవులగుస్ఫటికాదులు (Crystals) నీటిలోని పదార్థముల గొన్నిటిని తమచుట్టు నాకర్షించి యొకపొరపైనొకపొరగా జేర్చుకొని పెరుగుచుండును. భూగర్భమునుండి పొంగుకొని వచ్చు క్రొత్తపదార్థముల నిముడ్చుకొని పర్వతములు పెరుగును. కాని యివి జీవులు కావు.

3. జీవులు సజాతీయములగు జీవులనుండియే పుట్టును. అజీవ పదార్థములనుండి జీవులు పుట్టవు. ఒక జాతిజీవికి మరియొకజాతి జీవియు పుట్టదు. జీవోత్పత్తిక్రమమునుగూర్చి ప్రత్యేకముగా క్రింద వ్రాయుచున్నాము.

4. సామాన్యముగా సమస్తజీవులకును సంతానవృద్ధి (Reproduction) జెందు శక్తి గలదు. నిషేధములు: అంగసంపూర్ణత లేని నపుంసకులు, కంచరగాడిదలవంటి సంకరజంతువులు మొదలగునవి. వీనికి సంతానవృద్ధి జెందుశక్తి లేకపోయినను ఇవి జీవులే.

5. జీవుల కెప్పటికైనను మరణము (Death) సిద్ధము. నిషేధము: వికారిణి మొదలగు ఏకకణప్రాణులకు నై సర్గికముగా మరణము లేదు.

6. జీవులకు కరచరణాద్యవయవములు (Organs) గలవు. చెట్లయాకులు వేళ్ళు మొదలగునవి వాని యవయవములు. అజీవులు నిరవయవములు. నిషేధములు: జీవులలో కొన్నిటి కవయవములు లేవు; ఉదాహరణము-వికారిణి. అజీవులకు కొన్నిటి కవయవములు గలవు. పొగబండి; పొగయోడ; వీనికి చక్రములు మొదలైనవే యవయవములు. 7. జీవులకు చలనము (Locomotion) కలదు. అజీవులకు చలనము లేదు. నిషేధములు: హెచ్చుజాతి వృక్షములు, వానిగింజలు; ఇవి అచలములైనను జీవము గలవి. అజీవులయ్యును ద్రవపదార్థములో తేలుచుండు అణువులు ఒండొరుల్స్ యాకర్షణ (Gravitation) చే చలించుచుండును. కాని జీవులయొక్క చలనము వాని స్వశక్తిచే గలుగును. అజీవుల చలనము అన్యశక్తులచే గలుగును.

జీవోత్పత్తి క్రమము (Biogenesis)

ఈవరకు చదివిన ప్రాణులనుగూర్చి, అందు ముఖ్యముగా సూక్ష్మజీవులనుగూర్చి, నేర్చిన చదువరులకు అట్టి యణుమాత్రములైన నలుసులకు ప్రాణ మెట్లు కలిగినదో యను సంశయము గలుగవచ్చును. దానినిగూర్చి కొంత చర్చించుట యవసరము. హెచ్చుజాతిజీవులలో ప్రతిజీవియును మరియొక జీవినుండి పుట్టుచున్నదని మనకందరికి తెలిసినదియే. మన మొక కుక్కను జూపి యిది యెట్లు పుట్టినదని యొక పసిబిడ్డ నడుగగా దాని కొక తల్లి గలదనియు, దాని గర్భమునుండి యిది పుట్టినదనియు చెప్పును. ఒక చెట్టును జూపి యిది యెట్లుద్భవించినదని యడుగగా నిది యొక గింజనుండిగాని, అంటునుండిగాని పుట్టినదని చెప్పును. ఆ గింజయు అంటును ఎక్కడివని యడుగ, మరియొక తల్లి చెట్టునుండి పుట్టినవని చెప్పును. కాని కొన్ని చోట్ల నొకక్షణమునందు లెక్కింప నొక్కటియు లేక, మరియొక క్షణమున లక్షలకొలదిగ పుట్టునట్టి పురుగులు మొదలగు జీవకోట్లను చూచువానికి వీనికన్నిటికి తల్లిదండ్రులు గలరా? వాని గర్భమునుండియే ఈ జీవులన్నియు పుట్టుచున్నవా? యను సందియము తోచక మానదు.

తల్లిదండ్రులు లేకనే పుట్టినవా!

పూర్వులు కొంద రీ యల్పజాతిప్రాణులు తమంతట పుట్టుచున్నవనియు (Spontaneously), కొందరు మట్టినుండి పుట్టుచున్నవనియు, మరికొందరు గాలివలన పుట్టుచున్నవనియు ఊహించిరి. తొలకరియందు అకస్మాత్తుగా బెకబెకలాడుచు వేనవేలుగా జన్మించు కప్పలు మట్టినుండి పుట్టినవని కొందరును, ఆకసమున నుండి వర్షించినవని కొందరును, తలచుచుండిరి. నెమలియీకెలను పుస్తకములలో బెట్టియుంచిన నవి పిల్లలను బెట్టునని వీథిబడులలోని బాలురు తలచుచుండుటయు నిట్టిదియే.

సముద్రమునుండి లక్ష్మియు, అగ్నినుండి ద్రౌపదియు పూర్వ కాలమందు పుట్టిరని చెప్పిన నిజమని గ్రహించువారును, మన చెమటనుండి నల్లులును పేలును పుట్టు చున్నవనియు, చీడపురుగులు గాలినుండియు, పేడపురుగులు పేడకుప్పలనుండియు, తల్లు లక్కరలేకయే పుట్టు చున్నవని వాదించువారనేకులు ఈకాలమునందును గలరు.

సూక్ష్మదర్శని అజ్ఞానమును నశింపజేయుట.

ఇన్నూరు సంవత్సరములక్రిందట ఐరోపాఖండస్థులుగూడ నిట్టిసంగతుల నమ్ముచుండిరిగాని వారికి సూక్ష్మదర్శనియొక్క నిర్మాణముచే గలిగిన హెచ్చు ప్రకాశమువలన వారి యజ్ఙానమను చీకటి నశించిపోయెను. సూక్ష్మదర్శనియంత్రము నిర్మింపబడిన క్రొత్తరికమున వారిలో సహితము ఉభయవాదములవారు నుండిరి. వారు సూక్ష్మజీవుల విషయములను బాగుగ తర్కించిరి. ప్రథమమున శోధన (Experiment) చేసినవారు జీవజపదార్థములరసము చక్కగ వడబోసి గాలియైనను చొరకుండ గట్టిగ బిరడవేసినను, దానియందు కొంతకాలమునకు లక్షలకొలది సూక్ష్మజీవులు పుట్టుచుండుట చూచి యీ జీవులు తప్పక కషాయమునుండి తనిచ్చగ (Spontaneously) పుట్టినవేయని తలంచిరి. సారా కషాయమును మిక్కిలి చక్కగ వడబోసి దానియం దేవిధమైన జీవియు లేదని మొట్టమొదట నిశ్చయము చేసికొన్న వారగుటచేత నీ సూక్ష్మజీవులన్నియు జీవులు లేని కషాయమునందు క్రొత్తగ పుట్టెనని వాదించిరి.

వీరివాదమును రెండవకక్షివా రామోదింపక తామును విసుగక పరీక్షలు చేసిచేసి వారితప్పులను కనిపెట్టిరి. వాడుకగా నిలువ యుండుటచే కుళ్లిపోవుపదార్థముల కషాయమును వీరును శోధన నిమిత్త మెత్తుకొనిరి. మొదట దానిలోనుండు జీవుల నన్నిటిని మిక్కిలి జాగ్రతతో నశింపజేయవలయుననియు, పిమ్మట దానిలోనికి జీవులు ఎంత సూక్ష్మములైనను, వెలుపలనుండి ప్రవేశించకుండ జాగ్రతపడవలెననియు, ఈ రెండువిధముల జాగ్రతలు పడినమీదట నింకను జీవజంతువులు పుట్టునెడల నవి స్వతస్సిద్ధముగ తల్లిదండ్రులు లేకయే కషాయముననుండి పుట్టినవని చెప్పవచ్చుననియు వీరు వాదించిరి.

ఈ ముఖ్యాంశములను వా రీ దిగువ కనబరచిన రీతిని శోధించిరి. మిక్కిలి సన్నని పొడుగుమెడ గల గాజుకుప్పె నొక దానిని తీసికొనిరి. దానిని మాంసరసముతో నింపిరి. పిమ్మట దానిని కొంతకాలము కాచి మసలనిచ్చిరి. అప్పటికి సూక్ష్మజీవుల బీజముల గురించి వారల కేమియు తెలియదు. ఈప్రకార మా రసము కళవెళలాడుచున్న సమయమునందు ఆ బుడ్డియొక్క సన్నని మెడ గొట్టమును కరగునట్లు కాచి దానియందలి రంధ్రమును మూసివేసిరి. ఇట్లు చేయుటచే వారు వెలుపలనుండి వచ్చు సూక్ష్మ జీవులనే గాక గాలినిగూడ గాజుకుప్పెలోనికి చొరకుండ తొలగించిరి. కాని ఏవిధమైన రేణువులును ప్రవేశింపకుండునట్లు ఏర్పరచినయెడల పరిశుభ్రమైన గాలి బుడ్డిలో ప్రవేశించినను భంగము లేదు కాన, వారిలో కొందరు గాజుబుడ్డిలో సగమువరకే నీరు పోసి, మూతిని కరగించి మూయుటకుబదులుగా మెడగొట్టములో రెండుమూడంగుళములవరకు పరిశుభ్రమైన దూదిని బిరడవలె క్రుక్కిరి. పిమ్మట దీనిని యథావిధిగా మరుగబెట్టిరి. ఇట్లు చేయుటచే గాలి దూదిగుండ బుడ్డిలోనికి ప్రవేశించునేగాని దట్టముగనుండు నీ దూదిమూలమున నేవిధమైన నలుసులైనను కుప్పెలోనికి చొరనేరవు. కాన నీ యుపాయముచే వారు గాలిలో నుండు సూక్ష్మజీవులనుగూడ కుప్పెలోనికి ప్రవేశించకుండునట్లు జేసిరి. వీనిని తొలగించునట్లు వడబోయబడిన గాలిమాత్రమే కుప్పెలోపల ప్రవేశించెను.

ఇట్లు చేసినను ఒక్కొకసమయమందు సూక్ష్మజీవులు వృద్ధిబొందుచు వచ్చెను. అయినను వారు తాము పట్టిన పట్టును విడువక యీ కషాయము చెడుట వారు చేయవలసిన ప్రక్రియల ననుష్టించుటయందు ఏదో లోపముచేతనేగాని తమ వాదమునందు తప్పులుండుటచే గాదని నమ్మియుండిరి.

ఇ ట్లీ రెండుకక్షులవారికిని తీవ్రమైన వాదములు జరిగి తుదకు సూక్ష్మజీవుల బీజములు 130°C-150°C భాగములపర్యంతము వేడి హెచ్చువరకు చావకయుండవచ్చునని వారు కనిపెట్టిరి. పిమ్మట వా రీ కషాయములను 130°C భాగములవరకు మసలనిచ్చి సూక్ష్మజీవులను, వాని బీజములలో చాలభాగమును, చచ్చునట్లు జేసిరి. ఆ కషాయమును తిరిగి చల్లారనిచ్చి మిగిలిన సూక్ష్మజీవుల బీజముల నుత్పత్తి జెందించి, యి ట్లుత్పత్తిజెందిన జీవులను రెండుమూడుసా ర్లీప్రకారము హెచ్చువేడిని మరిగించి చంపి ఆమూలాగ్రముగ శోధించి, యా కషాయమునందలి సూక్ష్మజీవులను బీజములసహితము నశింపజేసిరి. అట్లు తయారు చేసిన కషాయ మెన్నటికిని మురిగియుండలేదు. తిరిగి సూక్ష్మజీవు లెన్నడు నా కషాయమునందు కానబడవాయెను.

అజీవపదార్థమునుండి జీవులు పుట్టవు.

ఇట్టి శోధనలచే కషాయమునందు సూక్ష్మజీవుల బీజ మొక్కటియైన లేనియెడల సూక్ష్మజీవులు జన్మింపనేరవనియు, అదేప్రకారము ఏజీవియైనను మఱియొక జీవినుండియే పుట్టును గాని అజీవపదార్థములనుండి జీవు లెన్నడును పుట్ట నేరవనియు సిద్ధాంతపరచిరి.

ఈ సృష్టి కాధారమైన ఆదిజీవిగాని జీవులుగాని ఎట్లుపుట్టెనో, అట్టి ఆదిజీవి అజీవపదార్థముననుండియే పుట్టినదో లేక మరి యెట్లు పుట్టినదో నిశ్చయ మెవ్వరికి నింతవరకు తెలియదు. ఈ సంగతి చర్చించుట కిక్కడ స్థలము చాలదు.

సజాతీయ సృష్టివాదము (Theory of Homogenesis)

ఈ విషయమై యిక్కడ కొంచెము చెప్పవలసియున్నది. ఒకజాతిజంతువునుండి అదేజాతిజంతువు పుట్టునుగాని వేరొక జాతిజంతువు పుట్టనేరదు. ఒక పిల్లికడుపులోనుండి ఎలుకగాని మరియే యితరజాతిజంతువుగాని పుట్టనేరదు. ఇదియే సజాతీయ సృష్టివాదము.

పరిణామ సృష్టివాదము (Theory of Evolution)

మానవులు కోతులనుండి పరిణమించిరనియు, పిల్లి, పులి, సింహము మొదలగు ఏకజాతిజంతువులు ఎప్పుడో యొకకాలమున నొక తల్లిబిడ్డలనియు బోధించు పరిణామవాదము మరియొకటి కలదు. కాని యిది పైనిచెప్పిన వాదమునకు విరోధము గాదని తెలిసికొనవలెను. మానవజాతి కోతులనుండి పరిణమించెనని చెప్పునప్పుడు కోతిజాతి మానవజాతిలోనికి మారుటకు అనేకవందలతరములు పట్టునని గ్రహించవలెను. ఒక తరమునకును దాని తరువాతి తరమునకును గల భేదములు గ్రహించు టకు మిక్కిలి సూక్ష్మమైనవిగ నుండి కొన్నితరములు గడచునప్పటికి కొంచెమధికనైన మార్పులను సూచించుచు తుద కనేకతరములు గడచినపిమ్మట జన్మించిన జంతువునకును, దాని ఆదిపురుషు డనదగు మొదటిజంతువునకును గలభేదములు మిక్కిలి యధికమై దానినుండి యిది పుట్టినదని వక్కాణించి నమ్మశక్యముగాక యుండును. ఈ విషయమై వేరొకచో వ్రాయ నుద్దేశించి యిచ్చట విస్తరించలేదు.

నిజాతీయ సృష్టివాదము (Theory of Heterogenesis)

ఒక పిల్లికడుపున ఎలుకపుట్టెననిన కాబోలునని నమ్మువారు నిజాతీయ సృష్టివాదు లనబడుదురు. ఇట్టివారు మానవులనుండి పక్షులును, పాములును (గరుత్మంతుడు, కాద్రవేయులవలె) పుట్టిరనియు, చేపలనుండి మానవులును, (మత్స్యవల్లభువలె) పుట్టిరనియు జెప్పునప్పుడు కాలక్రమమునగాక ఒక్కతరములోనే అట్టి మార్పు గలిగెనని నమ్ముదురు. ఇట్టిది యసాధ్యము.

పరిణామ సృష్టి వాదులు బోధించెడు మార్పు క్రమముగ మెల్లమెల్లన నొకతరమునకంటె రెండవతరమున కొంచె మధిక మగుచు అనేకతరములు గడచునప్పటికి జాతిభేదములు చూపట్టును.