జడకుచ్చులు/తమ్ముడా

వికీసోర్స్ నుండి

తమ్ముడా!

శ్రీలుపొంగిన ♦ జీవగడ్డయి.
పాలు బాఱిన ♦ భాగ్యసీమయి
వ్రాలినది యీ ♦ భరతవర్షము
భక్తి పాడర తమ్ముడా!

2 . వేద శాఖలు ♦ వెలసె నిచ్చట
    ఆది కావ్యం ♦ బలరె నిచ్చట
    బాదరాయణ ♦ పరమఋషులకు
               పాదు సు మ్మిది తమ్ముడా!

3. విపిన బంధుర ♦ వృక్ష వాటిక
    ఉపనిమషన్మధు ♦ వొలికె నిచ్చట
    విపుల తత్వము ♦ విస్తరించిన
               విశ్వమణి యిదే తమ్ముడా!

4. సూత్రయుగముల ♦ శుద్ధవాసన
    క్షాత్రయుగముల ♦ చండ శౌర్యము
    చిత్ర దాస్యము♦ చే చరిత్రల
              చెఱిగిపోయెర తమ్ముడా!

5. మేలికిన్నెర ♦మేళవించీ
    రాలు గరుగగ ♦ రాగమెత్తీ
    పాల తీయని ♦ బాల భారత
              పదము బాడర తమ్ముడా!



6 నవరసమ్ములు ♦ నాట్యమాడగ
    చివురుపలుకులు ♦ జెవుల విందుగ
    కవితలల్లిన ♦ కాంత హృదయుల
                   గారవింపర తమ్ముడా!

7 దేశగర్వము ♦ దీప్తి జెందగ
     దేశ చరితము.♦ తేజరిల్లగ
     దేశ మరసిస ♦ ధీరపురుషుల
                  తెలిసి పాడర తమ్ముడా!

8 పాండ వేయుల ♦ పదునుకత్తులు
     మండి మెఱసిన ♦ మహిత రణకథ
     కండగల చి ♦ క్కని తెనుంగుల.
                  కలిపి పాడర తమ్ముడా!

9 లోక మంతకు ♦ కాక బెట్టిన
     కాకతీయుల ♦కదన పాండితి
     చీకిపోవని ♦ చేవమాటల
                  చేర్చి పాడర తమ్ముడా!

10 తుంగభద్రా ♦ భంగములతో
      పొంగి నింగిని ♦ పొడచి త్రుళ్ళీ
      భంగపడని తె ♦ నుంగు నాథుల
                   పాటబాడర తమ్ముడా!

11 పసుపు కొంగుల ♦ ముసుగు లెడలగ
    కొసలు తీర్చిన ♦ కోరకత్తుల
    కసరిపోరిన ♦ గండు యోధుల
             పదము బాడర తమ్ముడా