ఘటికాచలమాహాత్మ్యము/అవతారిక

వికీసోర్స్ నుండి

ఘటికాచల మాహాత్మ్యము

అవతారిక

శా.

శ్రీకాంతాకుచ భూధరేంద్ర యుగళీ సిందూరపత్రాంక బా
హాకల్పద్రుమశాఖలన్ మెఱసి లోకానందసంధాయియై
యాకల్పంబుగఁ దా నభీష్టఫల [1]మీయంజాలు గీర్వాణలో
కైకశ్రేష్ఠుఁడు కృష్ణుఁ డీవుత సిరుల్ ఖండోజిభూభర్తకున్.

1


సీ.

కోడెమీలకు సిగ్గుకుప్పలించు వినీల
కైరవచ్ఛవిదాయి కన్నుదోయి
చిఱుతరూపునవచ్చు చిన్నారిపొన్నారి
యలల యందముఁ జూపు వళులయేపు
పాలమీఁగడ మిన్ను పైకొన్నగిరికన్న
గొమరుగా రుచిగ్రమ్ము కుచయుగమ్ము
అరిదిదీవులమేలు నవఘళింపఁగఁజాలు
చలితకాంచీదామ జఘనసీమఁ
గలిగి పుట్టింటి చిన్నెలఁ జెలఁగునట్టి
కలశవారాశిపట్టి విఖ్యాతమహిమ
నిరుపమప్రాజ్యసామ్రాజ్య వరవిభూతి
కరుణనీవుత ఖండోజిధరణిపతికి.

2


ఉ.

రాజమరాళ పాండురతురంగము నెక్కిన రాయరౌతు నీ
రేజగృహాసహాయుఁడగు శ్రీహరి [2]పొక్కిలితమ్మికుఱ్ఱ వా
ణీజలజేక్షణాకమలినీదిననేత విధాత యిచ్చు ఖం
డోజివిచిత్రరాయని కనూనమృకండుసుతాయురున్నతుల్.

3


శా.

నిండారం దెలిదమ్మినుండి మది నెంతే వేడ్కతో సత్కళా
పాండిత్యంబు కరంబు రాచిలుక కాపాదించు నావల్లకీ

దండాలంకృతపాణి వాణి యొసఁగున్ దాక్షిణ్యవారాశి యౌ
ఖండోజిక్షితిపాలచంద్రునకు వాక్కల్యాణపారంపరిన్.

4


శా.

ఆలోలాత్మసకృత్కృతప్రణయగంగాలింగనప్రోల్లస
ల్లీలాభోగి తనూహరిద్రలను హాళింజూచి లోనల్గు నా
ర్యాలీలావతి మానసం బెఱిఁగి యాహారిద్రవర్ణంబు స
వ్యాలోకంబున మాటుశంకరుఁడు కావ్యస్వామినిం బ్రోవుతన్.

5


ఉ.

పుట్టదుపూరి నాతలనుబుట్టినకుంభములందు నీయెదం
బుట్టినకుంభయుగ్మమున బుట్టెసుధారసధార [3]తెల్పు మీ
గుట్టని పోరువెట్టు నలకుంజరవక్త్రునిఁ జూచి నవ్వు నా
గట్టులఱేనిపట్టి దయ ఖండొజిరాయనిఁ బ్రోచుగావుతన్.

6


చ.

గరళశశాంకరేఖలను కంఠశిరంబులనుంచి మించు భూ
ధరతనయాసహాయుగతి తప్పులుగల్గిన లోనణంచి పై
సరసగుణంబుఁగల్గ గడుసన్నుతి సేయు పురాణసత్కవీ
శ్వరకులసార్వభౌములను వర్ణన సేయుడు నెమ్మనంబునన్.

7


చ.

ఝషభషలైన కొన్ని యపశబ్దములం గృతి సెప్పి కామపౌ
రుషముల కాళ్ళు గట్టుకొని రూఢికి నెక్కఁదలంచి శేముషీ
ధిషణులమంచు వాదులకు [4]దీయను కాకవులాడువాక్యముల్
విషకబళంబుగాఁ దలఁచి వీనులఁ బెట్టరు సత్కవీశ్వరుల్.

8


వ.

అని యిష్టదేవతానమస్కారంబును శిష్టకవిపురస్కారంబును దుష్టకవితిరస్కారంబునుఁ గావించి కవిజనవనవసంతుండును కామినీనవీనకేళినీరమణుండును కదనభూతలపరిసంధిసింధురకంఠీరవకులధురంధరుండును కమనీయనిజయశఃకౌముదీసుధాధవళీకృతదిగంతరాళుండును కమలనిలయాసహాయవేణుగోపాలచరణారవిందయుగళభ్రమరాయవి[5]మాణమానసుండును మదీయజనావనబద్దకంకణుండును మదీయసఖుండును మదీయసహోదరకోటిప్రవిష్ణుండును నై పొల్చు ఖండోజి క్షోణీమండలాఖండలుపై బంధురంబుగా నొకానొకమహాప్రబంధంబు రచియింపం బూనియున్న సమయంబున.

9

సీ.

వైరిప్రతాపంబు వడి గట్టి నట్టిచం
దాన నెవ్వాని శోణధ్వజంబు
కమలసాయకుసోయగము మూర్తిగైకొన్న
కరణి నెవ్వాని యాకారమహిమ
భుజభుజంగమనాథ భోగనారాయణ
చ్ఛాయ నెవ్వాని కౌక్షేయకంబు
అకలంకనలినగేహకు ద్వితీయగృహంబు
కైవడి నెవ్వాని కన్నుదోయి
పరఁగు నాతఁడు నిఖిలభూపాలజాల
నిరుపమాద్భుతరసహేతునిజనిటాల
వర్ణితానూనసౌభాగ్యవర్ణపాళి
రమ్యగుణశాలి ఖండోజిరాయమౌళి.

10


సీ.

హరు లెక్కి చనుదెంచి సరిదొరల్ తనతోడ
వేడ్కతోమాటాడ వేళచూడ
కలితకార్యవిచక్షణులు రాయసమువ్రాయు
ఘనులు వాకిటిదండఁ గాచియుండ
శ్రీమించ బిరుదుమాస్టీలు పంతములుమిం
చను హజారముచాయ చౌకసేయ
భర్రేభయానలు భరతశాస్త్రప్రౌఢి
మురిపెముల్ నింప ముందఱనటింప
బంధురానూనసకలప్రబంధకలన
మహిమఁగాంచిన కవిశిఖామణులచేత
రాణమీఱ పురాణభూరమణకథలు
హాళివినుచుండ నచ్చటి కద్భుతముగ.

11


క.

వెదురాకువంటి తిరుమణి
నుదుటంగలవిప్రుఁడొకఁ డనూతనకావ్యం
బది గైకొని చెంతకు జని
ముదమున నాశీర్వదించి మొగినిట్లనియెన్.

12

శా.

ఓ ఖండోజివిచిత్రరాయ విను నీవొక్కండుదక్కంగ నా
శ్రీఖండాచల శీతలాచల ధరాసీమాబ్ధిరాణ్మేఖలా
లేఖాధీళులలోన కావ్యసుమనోలీలాసుగంధప్రయో
గాఖండీకృతమానసుల్ దొరక రాహా మందుకైనన్ మహిన్.

13


చ.

భువిని విచిత్ర క్సరణిఁ బొల్చిన తెన్నలిరామకృష్ణ స
త్కవికులవజ్రపాణి ఘటికాగిరినాథమహాచరిత్రమున్
సవరణగా రచించి కృతిసంతతికన్యక కెన్న యోగ్యుఁడై
ధవుఁడొకరుండు[6]లేమికిని తామదిలోన వితాకుఁ జెందుచున్.

14


సీ.

పొలుపేది పుట్టులోభులపాలు చేసిన
పశుమూల్యమాత్రంబు ప్రాప్యమనుచు
మూఢాత్ములైన కాముకుల కర్పించిన
నెనరుతోఁ బాలింప నేరరనుచు
ఎదిరిఁ దన్నెఱుఁగని హీనుల కిచ్చిన
వసుమతి నపకీర్తి వచ్చుననుచు
మత్సరగ్రస్తపామరుల కీఁదలఁచిన
విడువక నొలమూల వేతురనుచు
వెంచి కృతికన్య నింటనే యుంచె నాతఁ
డాతనియభీష్టసిద్ధి నేఁ డయ్యె ననుచు
నిన్ను విని తెచ్చినాఁడ నా నిరుపమాన
కావ్య మిది కొమ్ము భాగాంబికాతనూజ.

15


గీ.

అనుచు నొసఁగినఁ గైకొని యతని యిష్ట
సిద్ధిఁ గావించి [7]సంతుష్టసిద్ధుఁ డగుచు
నన్ను రావించి యర్ధాసనమున నుంచి
పలికె నుదమేఘగంభీరభాషణముల.

16


మ.

పదసందర్భవిశుద్ధి ప్రౌఢతరశబ్ద క్రియాబుద్ధి పా
రదగంభీరచతుర్విధప్రధితధారాసిద్ధి ప్రాపించి [8]సం

సదభిద్యద్గిరిరాజసోదరత యెచ్చన్ మించు పుంభావ[9]శా
రద వీవే గద వన్న వేంకటగిరీంద్రా! సాంద్రమేధానిధీ!

17


క.

విదితప్రబంధములు వే
డ్కదనరఁగ మదంకితముగఁ గావించి ననున్
మొదల పవిత్రము చేసితి
సదయాత్మా! విచిత్రరాయచంద్రవతంసా!

18


గీ.

ధరణి తొమ్మిది లిబ్బులు దాఁచుకొన్న
వానికైనను ధనకాంక్ష పోనియట్లు
కృతులు పదివేలు గైకొన్నఁ గీర్తికాముఁ
డైనవానికిఁ జనదు కావ్యాభిలాష.

19


ఉ.

కావున రామకృష్ణకవికల్పితకావ్యమొకండు దెచ్చి స
ద్భావముతోడ నా కతనిపౌత్రుఁ డొసంగె మదంకితంబుగా
నీవిఁక హారనాయకమణిప్రతిమానముగా మదీయవం
శావళి చెప్పి కూర్పుము యశంబు భృశంబుగ సంఘటిల్లఁగన్.

20


వ.

అని నన్ను బహుమానపూర్వకంబుగా నఖర్వకార్తస్వరదుకూలసారఘనసారవాసనాలోలతాంబూలంబుల నాదరించుటయు నేను పరమామోదసంభరితాంతరంగుండనై యభినవంబుగను గృతివిభు నభిజనావళి నభివర్ణించెద.

21


సీ.

వాగీశ్వరీవక్త్రవనజసారంగంబు
కలహభోజనమౌనిఁ గన్నతండ్రి
సప్తలోకీచరాచరకల్పనాచణుఁ
డామ్నాయరత్నరత్నాకరుండు
కలశాబ్ధిశాయిపొక్కిలితమ్మి పసికందు
తోయజాతాస్త్రుని తోఁడఁబుట్టు
పాలును నీరు వేర్పఱచు తత్తడిరౌతు
కడుపు బంగారుబొక్కసమువాఁడు

నలుమొగంబులవాఁడు వేల్పులకు ఱేఁడు
బ్రతుకుపొద్దుల జనులకు నుదురుటాకు
[10]కవిలెను లిఖంపనేర్చిన [11]కరణికుండు
గరిమనొప్పారు ధాత జగద్విధాత.

22


మ.

[12]వశగీభూత సమస్తసర్గు డగు నా వాగీశ్వరీభర్తకుం
గుళికుం డాత్మజుఁడయ్యె నాతని కరిక్రూరప్రతాపార్కుఁడై
కుళనాభుం డుదయించె గాధినృపుఁ డాక్షోణీశుకుం బుట్టె నా
శశభృత్కీర్తికి గాధికిం బొడమె విశ్వామిత్రుఁ డత్యున్నతిన్.

23


క.

అక్కులమున నక్కజముగఁ
బెక్కండ్రు జనించి రతులపృథ్వీనాథుల్
దిక్కమలముఖీచికుర
స్రక్కలనాకారి కీర్తి సముదంచితులై.

24


గీ.

జలజబాంధవ చంద్ర వంశముల మించి
వారివంశంబు భువి మాలివంశమయ్యె
నింబుమీఱంగ సమయాంతరంబువలన
పాలమీఁగడ వెన్నగాఁ బరఁగినట్లు.

25


క.

ఆ మాలికులమునఁ గవి
స్తోమాలిమనోహరైకసురతరువితర
శ్యామాలి చతుర్థీహిమ
ధామాలిక[13]నిరతి కృష్ణధరణిపుఁ డలరెన్.

28


సీ.

అనవద్య బర్హి[14]బర్హానలంకృతమౌళి
యకృతాభిరామవస్త్రాపహారుఁ
[15]డనధిరూఢమహావిహంగమధౌరేయుఁ
డజ్ఞాతచౌర్యవిద్యావిలాసుఁ
డనధీతఘోషకన్యాప్రతారణమంత్రుఁ
డరచితాభీరగోష్ఠాధివాసుఁ

డపరావనీంద్ర[16] మంత్ర్యపవారణగరిష్ఠుఁ
డకరాగ్రవేణువిఖ్యాతవాద్యుఁ
డైనకృష్ణుఁడితఁడె యని యభినుతింప
దానవారి వివర్ధనోదారశంఖ
చక్రయుతపాణిఁ బొల్చు నిర్వక్రలీల
రమ్యగుణహారి కృష్ణాజిరాయశారి.

27


మ.

అనుకంపాహరి నిమ్నతానదవిభుం డైదంయుగీనార్జునుం
డని కైవారము సేయ సార్థ మయి కృష్ణాధీశుఁడన్ పేరు పా
వనభావమ్మునమీఱ నా వరసరస్వన్మేఖలానాథుఁ డ
త్యనతారాతిచమూనికేతన దరణ్యానీకుఁడై వర్తిలెన్.

28


క.

పొంగుచుఁ గృష్ణాధీశుఁడు
భంగము లేనట్టి కీర్తిఁబడసి సముద్య
తుంగయశస్సంగాయిని
గంగాయిని బెండ్లియాడెఁ గరుణానిధియై.

29


సీ.

అపకీర్తిగతిబట్టి యాత్మేశుతలముట్టి
బెట్టుగా వడిసుళ్ళఁ బెట్టదేని
[17]చెనటిభంగముమీఱ తనవారిచెలువారఁ
దెరువేది యూరూరఁ దిరుగదేని
ఘనజడస్థితి బైట కన్నవారలనోటఁ
బడి ఱాఁగయనుమాటఁ బడయదేని
అనతోద్దతిగాక లో[18]నార్భటము లేక
మొగి నట్టు [19]వీఁకున నిగుడదేని
గంగ చెలగంగ సరియనంగా దనర్చు
పతిహితాచారధృతికి నపారకీర్తి
రతికి నన్యజనజ్ఞాతవితతమతికి
నతులకారుణ్యధృతికి గంగాయిసతికి.

30

శా.

ఆ గంగాయినితంబినీమణికి రమ్యాంగుండు కృష్ణాజిభూ
భాగస్వామికి సంభవించెను దురాపస్తంభజన్మాయశ
స్త్యాగార్థంబు జనించెనాగ నరసింహస్వామి భీతారిజా
యాగమ్యస్వభయంకరప్రబలరూపాటోపసంరంభియై.

31


మ.

 అరికిన్ పండ్లిగిలించఁ డెంచఁడు [20]హిరణ్యాదృష్టి మత్తాసుహృ
చ్ఛర దగ్రత చూచికుందఁడు విపక్షచ్ఛేదనాపాదన
త్వర సంధిల్లిన వేళఁ జూడఁడు సముద్యన్మండలాగ్రంబు నే
మరఁ డౌరా నరసాజిరాయఁడు మహామార్తాండసంకాశుఁడై.

32


సీ.

ఝంపాగతప్రాణ శబ్దాయమాన భూ
ధరగుహాకుహర నిద్రా[21]ప్రసక్తి
కటకభూమిరుహాగ్రగళితపర్ణాకీర్ణ
పర్వతాంబుకషాయపానయుక్తి
భరితగండమదాపసురభి గంధగజేంద్ర
ఘటనానిశాఖేట[22]ఘటనయుక్తి
అనుపమానాధిత్య [23]కాతృతాప్రత్యుష
శ్చిత్రభానుప్రభాసేవనంబు
పరుల కర్పించి నిజవీరభటమృగేంద్ర
పాలితము చేసె దత్పురప్రకర మౌర
సంతతారాతినేత్రదురంతతిగ్మ
భావిభుండగు నరసాజిభూవిభుండు.

33


ఉ.

ఆనరసింహపూజనములన్న శివార్చనలన్న ధర్మ[24]దా
నానకు దార మీని కఠినప్రకృతుల్ రణరంగవీథిలో
నానరసింహభూవిభు భుజాయుధవర్ణినిఁగన్న ధర్మదా
నానికి నోడి యిత్తురు [25]సనాతనసంచితమంచితంబుగన్.

34


క.

గురుజాయియందు గనియెం
నరసాజివిభుండు సుతుల నయగుణనిధులన్

గురునుతి సుందరరాయని
[26]తరుణార్కనిభుని విచిత్రధరణివిభునిన్.

35


క.

ఆ సుందరరాయానుజుఁ
డై సుమతి విచిత్రరాయఁ డలరె విచిత్ర
శ్రీసుందరవిగ్రహవని
తాసుమశరుఁ డనఁగఁ గీ ర్తితత్పరుఁ డగుచున్.

36


సీ.

ప్రబలప్రతీపభూపదురాపశౌర్యాగ్ని
తోయధుల్ మరుభూమి సేయుటొకటి
భుజయుగాశ్రితమహాద్భుతహేతిహతి వైరి
వీరుల సురలఁ గావించుటొకటి
చక్రవాళగిరీంద్రసానురత్నంబులఁ
జిరకీర్తిఁ దెల్లగా నెరపుటొకటి
అక్షీణకరుణాకటాక్షవీక్షణమున
నిరుపేదలకు కల్మి నిల్పుటొకటి
ధైర్యమున మేరుఁదృణముగాఁ దలచుటొకటి
పరధనాదులపై నాసపడమియొకటి
యతివిచిత్రనిదానమై యతిశయిల్ల
నతనికి విచిత్రరాయాఖ్య యమరుటరుదె?

37


ఉ.

మల్లవడీపురీశ్వరుఁడు మానితమూర్తి విచిత్రరాయభూ
వల్లభుఁ డామరద్రుమనవప్రసవంబుల నంబరాపగా
ఫుల్లసువర్ణపద్మములఁ బూజలొనర్చు నుమేశు శాంబరీ
భిల్లుని చంద్రశేఖరుని పేర్మి ధరాగతుఁడయ్యు వింతగన్.

38


సీ.

హృత్తాపఘనమైన మత్తాపఘనముతో
ముత్తాపఖానుఁడు మూలకొదుగ
అలబలంబు దొలంగి చలబలావళితోడ
బలబలాఖానుఁడు పరితపింప

అంభోరుహేక్షణా డింభారతాత్ముడై
యంబారుఖానుఁ డత్యంతములుక
సేనతో దీనుఁడై [27]హీనమానతఁబాఱి
ఖానకానుండు బల్ కానకరుగ
చొచ్చి మల్లాదళంబుల సోమసూర్య
వీథు లేర్పడ నఱికిన వీరు డంచు
విజయరమ నవ్య నిజసవ్యభుజ నటింప
రహివహించు మీఱి విచిత్రరాయశౌరి.

39


చ.

అనవరతస్వకారిత మహామహనీయ మఖాన్నభోజన
మ్మున నశనాయలేని సురముఖ్యులబోలె సదాసుఖస్థితిన్
[28]దనరునిజాగ్రహారముల తామరతంపరగా ద్విజేంద్రు లిం
[29]పెనయ విచిత్రరాయధరణీశ్వరుఁ డెంతయు సంత[30]సిల్లెడున్.

40


గీ.

అతని గేహిని భాగాంబ యవనిఁ బొల్చు
నతులగుణముల నల యరుంధతినిఁ బోలి
సురభికీర్తుల చుట్టాల సురభి యగుచు
పతిహితాచారశీల సౌభాగ్యలీల.

41


సీ.

మొగమురాజ దినంబు మిగులమండెడి [31]యౌర్వ
వహ్ని చేపట్టిన స్వాహ యెంత
పునుకకూడు [32]భుజించిమ నెడు శ్రీ [33]కంఠు దా
యకు మెడసాచిన యార్య యెంత
[34]కడిమి శుశ్రుగృహంబు గతియంచుఁ బడియున్న
హరినిఁ గైకొన్న శ్రీతరుణి యెంత
పరకాంతకొఱకు శాపగ్రస్తుఁడైన యిం
ద్రునిఁ గూడిన పులోమతనయ యెంత
యనుచు వారల కర్హనాయకులు లేమి
కాత్మహసియించి సకలగుణాభిరాముఁ

డైన నిజధర్తతోడ నొయ్యనచరించు
కాంతలకు మేటి భాగాంబికావధూటి.

42


ఉ.

కొంతనిగాదు బాలతొడుగుల్ మడుగుల్ సువర్ణముల్
దొంతిగ నుప్పుతోఁగలుగు తొమ్మిదియుంగొని యేటి కేటికీ
వంతుగ నాపెచే మననివారలులేరు నిజంబుగాఁ దదా
నీంతనమైనయట్టి ధరణీజనజాలములోన నెన్నఁగన్.

43


క.

ఆ భాగాంబాశచికిన్
శోభిల్లు విచిత్రరాయసుత్రామునకున్
శోభాఖని ఖండోజిమ
హాభాగుఁడు [35]వొడమె నల జయంత స్ఫూర్తిన్.

44


సీ.

పుట్టినప్పుడె పూర్వపుణ్యశేషంబునఁ
బుట్టించె బుధుల కద్భుతముదంబు
అడుగుబెట్టిననాఁడె యతులతేజస్ఫూర్తి
[36]నడుగువట్టించె ఖలాంధకార
మమ్మమ్మ యనునాఁడె యాకారగరిమచే
నమ్మమ్మ యనిపించె నఖిలజనుల
పలుక నేర్చిన నాఁడె ప్రతిమలౌ వేల్పులఁ
బలికించె నాత్మీయభక్తి మహిమ
పలుకబట్టిననాఁడె రూపప్రభావ
భావనమ్మున [37]కామినీపంఙ్తిచేత
పలుకబట్టించె సజ్జనకులవిహారి
రాధితమురారి ఖండోజిరాయశౌరి.

45


చ.

కలితగుణాభిరాము డగు ఖండొజిరాయని బాహుపీఠిపై
బొలుచు ప్రతాపసిద్ధుఁడు విభుత్వవిభూతి నొనర్చు పారద
చ్ఛలఘటికాపరంపరలచాడ్పునఁ దచ్చిరకీర్తిచంద్రికో
జ్జ్వలబహిరంతరంబుల[38]న వర్తిలు నంబుజసంభవాండముల్.

46

ఉ.

వావిరి ఖండొజిప్రభుఁ డవామకరంబున హేతిఁబూన యు
ద్ధావని ధావనం బిడి హితావళితోడను పుట్ట లెక్కఁగా
నావలిభోగివల్లభులమైతిమటంచుఁ దృణంబు లెక్కఁగా
గోవరులైతిమంచు [39]ననుకొందురు శాత్రవు లాత్మసంపదన్.

47


సీ.

మహనీయధామసామగ్రితో గృహదాన
ములు చేసె బ్రాహ్మణావళులకెల్ల
త్రవ్వించె బలిరసాతలముదాక తటాక
ములు నీరుదీయక నిలచియుండ
వేయించె శీతలచ్ఛాయానపాయాభి
రామ[40]ద్రుమావృతారామసమితి
కట్టించే శైలప్రాకారానుకారప్ర
కారసంతతులతో మీఱ గుళ్లు
కనియె తనవంటితనయుని గాంచెఁ గృతులు
నట్లనేకసంతానసంఖ్యలు గడించి
యీ యవని బొల్చు ఖండోజిరాయధీరు
కేకసంతానయుతుఁడైన యింద్రుఁ డెనయె?

48


చ.

మలసి నిదాఘవేళలను మాపు వెలార్చిన తత్ప్రపాజలం
బుల వరిమళ్లలోఁ బొడముపుల్లు భుజించు ఘటోధ్నికాచయం
బులు పరిశుద్ధపాత్రపరిపూర్ణసువర్ణపయస్సు లిచ్చు ను
జ్జ్వలగతి ఖండొజీంద్రువలె [41]సజ్జనవిత్తము రిత్తవోవునే?

49


సీ.

పొంది యబ్ధులు గట్టుపొర్లివచ్చినగాని
[42]కేరిధూర్తత నొకతూరిచల్లు
సురపథం బొకవేళ సోలివ్రాలినగాని
క్షితి ఱాఁగయై యరచేత నొడ్డు
తుహినాచలేంద్రంబు దొర్లివచ్చినగాని
గడుసుగయ్యాళియై కాలఁదన్ను

ప్రబలదిగ్గజములు ప్రతిఘటించినగాని
మొక్కలిజంతయై మూలఁద్రోయు
గరళకంధర హరి పురందర విరించి
సురలు వచ్చిన నొకసన్నఁజూచు నౌర
కఠినవైరులదళమన్న కాసెఁగట్టు
ధరణి ఖండోజిధీరుని ధైర్యలక్ష్మి.

50


ఉ.

మెత్తని పల్కులుం గవులమేలిమి తాలిమిసొంపు కామినీ
చిత్తము నాత్మవిత్తముగఁ జేయుతెఱంగు హితైకపోషణా
యత్తమనీష మంజులతరాకృతి ఖండొజిరాయునందు స
ర్వోత్తమమై చెలంగు ధర నుత్తముఁ జేరిన రిత్తబోవునే?

51


గీ.

అమల ముద్దాజిపుత్రి మానాయిసతియు
నమర నరసాజితనయ వీరాయిసతియు
నతనిచేపట్టి మెఱయుదు రమరనగము
మాలతీమల్లికలువోలె లీల నెసఁగి.

52


మ.

మతి సౌందర్యకళావిలాసనిధులై మా నాయి వీరాయి యు
ద్గతలీలం దను జేరికొల్వగ విశాఖాయుక్తచంద్రుండు నా
క్షితి లక్ష్మీయుతపంకజాక్షుఁ డనఁగాఁ జెన్నొంది ఖండోజిరా
ట్పతి యాచంద్రధరాధరార్కముగ [43]సంపద్దాముఁ డై వర్తిలున్.

58


షష్ఠ్యంతాలు

క.

ఏతాదృగ్గుణగణనా
జాతమనీషావిశేషచతురబ్ధివృత
క్ష్మాతలజనతా[44]వహికి న
శీతలసదఖర్వదోర్వశీకృతమహికిన్.

54

క.

యక్షపవితరణునకు హ
ర్యక్షపరాక్రమధురాక్రమాడ్యుకు శశిహ
ర్యక్షపదాంబుజపూజన
దక్షపరప్రథితగుణికిఁ దరుణాగ్రణికిన్.

55


క.

సౌనాశీరి నిశాకర
సూనశరాసన వసంత సుందరునకు సం
ధానవభార్గవునకు మం
ధాన వసుమతీధరేంద్రధైర్యోన్నతికిన్.

56


క.

అక్షీణశ్రీలక్షిత
వీక్షాలబ్ధార్ధసుకవివిశ్రాణితస
ద్రాక్షారస శిక్షాత[45]
దీక్షాలసమానకవనదీవ్యత్కృతికిన్.

57


క.

అతిలలితాతులితగుణా
ద్భుతునకుఁ గుక్షింభరప్రభుంమన్యపణా
యతనయనాజన[46]విటునకు
సతతశుభప్రభవవిధవళతమన్యునకున్.

58


క.

చండ నిజాఖండభుజా
దండ సుజాతప్రతాప తాపన దళితో
దండారిత మస్తతికిన్
[47]ఖండొజిరాయావనీంద్రకమలాపతికిన్.

59


వ.

అంకితంబుగాఁగ నమ్మహాకవి యొనర్చిన ఘటికాచలమాహాత్మ్యంబను మహాప్రబంధంబునకు కథారంభం బెట్టి దనిన.[48]*

60

  1. మియ్యం. పూ. ము.
  2. పొక్కిటి. పూ. ము.
  3. వేల్పు. తా.
  4. దియ్యను. తా.
  5. మాన. తా.
  6. లేమికిని తా, తా లేమిగని. పూ. ము.
  7. సంతుష్ట
  8. సంసదభిద్యద్విభుధావలిన్ వినుతి నెచ్చన్. తా.
  9. శారద నీవే గద యెన్నగా సుకవిచంద్రా! సాంద్రమేధానిధీ.
    శారద నీవే గద యెన్న వేంకట.... తా.
  10. కవిలను. తా. పూ. ము.
  11. కరణికంబు తా. పూ. ము.
  12. దశనీ. తా.
  13. విరతి. తా.
  14. బర్హావలంకృత. తా.
  15. డనధీరుఁడన. తా.
  16. మంత్యపచార, తా.
  17. చనిన.పూ.ము. తా.
  18. నార్పడము.తా.
  19. వీఁకని తా.
  20. హిరణ్యవృష్టి తా.
  21. పసక్తి. తా.
  22. ఖటన. తా.
  23. కార్తతా. పూ. ము.
  24. దానానికి తార మీని తా. దావానకుఁ దార మీని పూ. ము.
  25. సనాతసమంచిత మంచితంబుగన్. తా.
  26. తరుణారుణవిభు, తా....నిభు. పూ. ము.
  27. పోనమానతఁ బాఱి పూ.ము.
  28. దనర తా. పూ.ము.
  29. పెనయు తా. పూ. ము.
  30. సిల్లుచున్ తా. పూ ము.
  31. నర్యతా. పూ. ము.
  32. భజించి. తా.
  33. పట్టి తా. పూ. ము.
  34. కలశ్వశురగృహంబు. పూ. ము.
  35. వొడమెన్ జయంతభాగ్యస్ఫూర్తిన్ - పూ.ము.
  36. ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
  37. సన్ముని - పూ. ము.
  38. యి. తా.
  39. నని కొందరు. తా.
  40. దృఢా. పూ.ము. దృతా-తా.
  41. సజ్జనుద్రవ్యము రిత్తబోవునే. తా.
  42. ధూర్తమై యొక కేరితూరిచల్లు. తా.
  43. సంపద్ధైర్యుఁడై వర్తిల్లున్. తా.
  44. మహికి నశీతలసర్వదోర్వసీకృతమహికిన్ తా.
  45. సవీక్షా. తా.
  46. విభునకు. పూ. ము.
  47. ఖండే రాయాంఘ్రి విమలకమలగమతికిన్
  48. ఈ అవతారికలోని అరువది గద్య పద్యములు మరియు ఆశ్వాసాద్యంత పద్యములు వేంకటగిరీంద్రుడు రచించినవి.