గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/శ్రీ సరస్వతీ నిలయ గ్రంథాలయము

వికీసోర్స్ నుండి

నైతికధర్మ వ్యాప్తికలుగజేయుటకు దేవాలయపు గోడలపై వ్రాయు చిత్తరువులను, బౌద్ధమఠములలోను, గుహలలోను చిత్రింపబడిన చిత్తరువులు, పడకటిండ్లలోను రాజమందిరములలోను అద్దములపై వ్రాయబడిన చిత్తరువులు, బొమ్మలాటలు, భాగవతకథలు, హరికథలు ప్రజాసామాన్యములో విజ్ఞానబోధనకు వివిధమార్గముల నన్వేషించి ఎట్లు ప్రచారము జరిగియుండెడిదో యుదాహరణపూర్వకముగ రుజువు చేసిరి. ప్రాచీన కాలమున ప్రతిగ్రామమున పౌరాణికులను పోషించి ధర్మగ్రంథపఠనమునకు ఎటుల హెచ్చరించి యుండిరో ఆరీతినే గ్రంథాలయములలో కేవలము పుస్తకములను సంపాదించుటతో మాత్రమే సంతృప్తిజెందక, నాలుగైదు పంచాయితులు కలసి పురాణవేత్తను నియోగించి, రైతులు తీరికగాయుండు కాలములో గ్రంథములు చదువుట, వార్తాపత్రికలు వినిపించుట మొదలగు కృషిసలుపుటకు పూనవలసినదిగా హెచ్చరించిరి. దేశ పురోభివృద్ధికి, జాతీయభావవ్యాప్తికి గ్రంథాలయము లెట్లు తోడ్పడగలవో వివరించి చెప్పిరి. పిమ్మట గ్రంథాలయ అభివృద్ధికి గావింపవలసిన పనులవిషయమై కొన్ని తీర్మానములు గావింపబడినవి.

____

శ్రీ సరస్వతీనిలయ గ్రంథాలయము

పొలమూరు - పశ్చిమగోదావరి జిల్లా.

ఈ గ్రంథాలయము 1913 సంవత్సరమున శ్రీ కొత్తపల్లి నరసింహముగారిచే స్థాపితమైనది. మొదట 150 గ్రంథములతో ప్రారంభింపబడి దినదినాభివృద్ధి గాంచినది. వారు అనేక వార్తాపత్రికలను గ్రంథములను తమస్వంత ద్రవ్యమును వ్యయపరచి రప్పించి చదువరుల కందించుచు పరోపకారార్థము మిక్కిలి దీక్షతో పాటుపడిరి. గ్రంథముల గృహములకు గొంపోయినవారు తిరిగి సరిగా నొసంగకపోవుటచే చాలభాగము గ్రంథము లంతరించినవి. మెంబర్లందరును చందాలు సరిగా నిచ్చు పద్ధతియే లేకపోయినది. ఈరీతిగా గ్రామవాసులకు ఉత్సాహము లేకపోవుటచే క్రమముగా క్షీణదశలోనికి వచ్చినది. ఇటీవల ఈగ్రామమందు గ్రామపంచాయితి స్థాపింపబడినది. దానికి శ్రీ కొత్తపల్లి నరసింహముగారే అధ్యక్షులుగ నున్నారు. ఈ గ్రంథాలయమును పంచాయితీవారి యాజమాన్యము క్రింద దీసికొని జయప్రదముగ నిర్వహించుచున్నారు.

రామమోహన గ్రంథాలయము.

ఘంటసాల, కృష్ణాజిల్లా.

ఈ గ్రంథ్హాలయము చాలకాలమునుండి పనిచేయుచున్నది. కాని ధనములేమిచే తృప్తికరముగా పనిచేయజాలకున్నది. కొంతకాలము క్రిందట యీ గ్రామసహకారపరపతిసంఘమువారి యాజమాన్యమున నిర్వహించుటకు తీసికొనబడినది. దీని లోకలు కోఆపరేటీవుయూనియనువారు యీ గ్రంథాలయమునకు రెండువందల రూపాయిలు విరాళ మిప్పించవలసినదిగా ప్రభుత్వవారికి సిఫార్సుచేసినారు.

స్వవిషయము.

భదవదను గ్రహమువలన "గ్రంథాలయసర్వస్వమును" తిరిగి ప్రారంభింప గలిగితిమి. మాసపత్రికగ వెలువడుచుండును. సంవత్సరమునకు చందా అందఱకును అందుబాటులో నుండునటుల రు 1 - 4- 0 లుగ ఏర్పరుపబడినది. గ్రంథాలయోద్య మాభిమానులందరును ప్రోత్సాహించెదరని ప్రార్థన.