గోన గన్నారెడ్డి/అష్టమగాథ

వికీసోర్స్ నుండి

అష్టమ గాథ

కృష్ణవేణి

1

శాలివాహన శకం 1185 రుధిరోద్గారి సంవత్సర మాఘ బహుళ చతుర్దశి రాత్రి శివరాత్రి మహాపుణ్యకాలంలో తన కోటలోనే నమకమంత్ర యుక్తంగా శివాభిషేకం చేస్తూ శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ సప్తమ చక్రవర్తి వెనక్కు వాలి పోయారు. పరమ మహేశ్వరులైన శివగురువు ‘దేవా, ఏమిటిది?’ అంటూ ఒక అంగలో చక్రవర్తిని చూచేసరికి ఆయన విగతజీవియై ఉన్నాడు. బ్రహ్మరంధ్రం పగిలి ఉన్నది. చిరునవ్వుతో తేజస్సుతో ఆయన మోము వెలిగిపోతున్నది.

మరుసటి క్షణికంలో శివదేవయ్యమంత్రీ, రుద్రమాంబా విగతజీవుడై పడి ఉన్న చక్రవర్తికడకు ఉరికారు. చక్రవర్తి వెనుకనే నిలుచుండిఉన్న రాణులు నారాంబా పేరాంబలు ఇద్దరూ కూలిపోయారు. గుమ్మం దగ్గర ఉన్న ప్రసాదాదిత్య ప్రభువు వచ్చినాడు.

రాజవైద్యులైన చెన్నాప్రగడ గణపామాత్యుని తమ్ముడు చెన్నాప్రగడ సుబ్రహ్మణ్యమంత్రికి వార్త వెళ్ళగానే వారు వచ్చి చూచి ప్రాణము లేదని ధృవపరిచారు.

శివదేవయ్యమంత్రి ప్రసాదాదిత్యునకు ‘నగరము జాగ్రత్త’ అని ఆజ్ఞ ఇచ్చి పంపి, తలవరి మేచ నాయకుని ‘రక్షణ జాగ్రత్త!’ అనీ, పణీకము బాప్పదేవునికి ‘సైన్యాలు జాగ్రత్త’ అనీ హెచ్చరికలు పంపినారు. తంత్రపాలుడు పోలరౌతు నగరపు వెలివాడలకు సైన్యసమేతుడయి వెడలెను.

వేగుదళాధిపతి గొంకప్రభువు శివదేవయ్యమంత్రి ఆజ్ఞలను గొని మల్యాల గుండయమహా రాజుకు, మల్యాల చౌండసేనాపతికి, రేచెర్ల గణనాథ ప్రభువుకు, కోట భేతమహారాజుకు, చాళుక్య ఇందుశేఖర మహారాజుకు, కోనభీమ జనవల్లభ నృపాలునికి, జన్నిగదేవ సాహిణికి, అద్దంకి సారంగపాణిదేవ మహారాజుకు, సప్తమ చక్రవర్తి లింగైక్యమందినారనిన్నీ, అందుకు సర్వసేనలతో సిద్ధంగా ఉండాలనిన్నీ, ఏ సామంతులు తిరుగుబాటుచేసినా, ఏ పరరాజులు ఎత్తివచ్చినా వారిని నాశనంచేయడానికి సిద్ధంగా ఉండవలసిందనిన్నీ వేగులు పంపినారు.

అన్నాంబిక రుద్రమదేవి ప్రక్కనేవాలి, ఆమెను గట్టిగా హృదయానికి అదుముకొన్నది. రుద్రమదేవి తండ్రిశవము ప్రక్క మోకరించి కన్నులు మూసికొని కొయ్యబారిపోయెను. శివదేవయ్య దేశికులు రుద్రమాంబను సమీపించి, ‘జయము, రుద్రమహాప్రభూ! జయము. ఇక తాము అష్టమ చక్రవర్తులు. రాజనీతి దుఃఖానికెడ మీయదు. ఒక్కనిమేషమాత్రమైనా దేశము అరాజకం కాకూడదు. సార్వభౌమా! ఈ గడియ నుండి తా మీ చతుస్సముద్రముద్రిత మహాభూమి భారం వహించినవారయ్యారు. దేవతాస్వరూపులయిన తండ్రిగారి ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞగా పరిపాలించండి' అని రుద్రచక్రవర్తిని చేయిపట్టి లేవతీశాడు.

కన్నులు మూసుకొనే ప్రార్థిస్తూ రుద్రమలేచింది. పూజామందిరంలో నుండి రాజసభామందిరంలోనికి విచారసముద్రములో మునిగిఉన్నా గంభీర వదనయై వచ్చిన రుద్రమహాదేవిని చూడగానే ఆ సభామందిరంలో కూడిన సామంతులు, సేనాపతులు, పండితులు, ప్రజ్ఞ, సభాధికారులు, ‘జయ జయ శ్రీ రుద్రమదేవ చక్రవర్తీ! జయ జయ’ అని నినాదాలు సలిపారు.

అప్పుడు వందులు ఇరువదిమంది ముందుకు వచ్చినారు. వారి నాయకుడు రుద్రమచక్రవర్తికి ఎదురుగా నిలబడి ‘జయ జయ సమధిగత పంచమహాశబ్ద మహా మండలేశ్వర పరమమాహేశ్వర! హన్మకొండ పురవరాధీశ్వర! సత్య హరిశ్చంద్ర! చతుస్సముద్రవలయిత దిక్పూరితకీర్తి! అష్టమచక్రవర్తీ! జయ జయ జయ, అంటూ జయజయ ధ్వానాలు చేశారు.

తండ్రి పరమవృద్ధులై రాజ్యంలో ఏవిధములైన కలతలు లేకుండా పవిత్రదినమైన శివరాత్రినాడు లింగైక్యమందినారు అంతకన్న శుభం ఏముంది?

తన దుర్బల భుజాలు, తండ్రిగారు సులభముగా వహించిన భూభారం వహించవలసి ఉంటుంది. అన్నిటికీ బలము పరమశివుడు, కాకతీదేవీ, సర్వజ్ఞులైన శ్రీ శివదేవ దేశికులూ - వారి సహాయమే తనకు సూర్య చంద్రులూ, నక్షత్రాలూ కాగా, తాను ఈ రాజ్యభారం వహిస్తుంది. ఈ కార్యంకొరకేకదా తనకు మొదటినుండి తండ్రిగారు సర్వవిద్యలూ నేర్పించి రాజ్యపరిపాలనా విధానంలో ప్రవీణత ఇప్పించినారు.

తాను సర్వదేవతలు సాక్షిగా మాట ఇచ్చినది.

ఎవ్వరూ చూడకుండా ఆ బాలిక చిన్నబిడ్డలా తన రహస్యమందిరంలో మంచంమీద మేను వాల్చి లోచనాంచనాల సంతతధారగా ప్రవహించే బాష్పప్రవాహంతో కరిగిపోయింది.

2

శ్రీ గణపతి రుద్రదేవప్రభువు దివంగతు డయ్యాడని ఒక్కసారిగా సకలభారతావని మ్రోగిపోయింది. దక్షిణాన పాండ్యులు, చోడులు, భల్లాణులు; దేవగిరిలో యాదవులు; కాళింగాన ఒడ్డెరాజులు ‘అమ్మయ్యా’ అని ఇంతగాలి గట్టిగా పీల్చుకున్నారు.

కృష్ణవేణీతీరంలో తన రహస్యనగరంలో గోన గన్నారెడ్డి ఇక “ఆంధ్ర మహాసామ్రాజ్యానికి ప్రళయం సంభవించింది” అని నిట్టూర్పు విడిచినాడు. ఆ మరుసటిక్షణంలో విశాలమై, మహాపర్వతసానువై, ఆంధ్ర ప్రతాపాలవాలమై ఆంధ్ర క్షత్రియకుల శ్రీనివాసమైన అతని వక్షము ఇంకా విస్ఫారితమైనది. దౌవారికుని చీరి ‘మహాసభాఘంటిక మ్రోగింపు’ మని ఆజ్ఞ ఇచ్చినారు.

మరి పదిక్షణికాలకు లోకకుహరాలన్నీ మారుమ్రోగుతూ ఒక పెద్ద జయగంట మ్రోగటం ప్రారంభించింది. ఆ మ్రోత ఆ రహస్యపులోయ అంతా నిండగానే రాచనగరుకు ఎదురుగాఉండే విశాల ప్రదేశాలలో గజదొంగల సైన్యాలన్నీ బిలబిల చేరడం ప్రారంభించాయి. సేనాపతులు, దళవాయులు, సాహిణిలు అందరూ యథోచితవేషాలతో ఆ ప్రదేశానికివచ్చి యథాస్థానాల బొమ్మలులా నిలబడినారు.

మూడుగడియలలో గోన గన్నారెడ్డి సైన్యం యావత్తూ సంపూర్ణంగా ఆ ప్రదేశంలో బారులుతీర్చి, రాతివిగ్రహాలులా నిలబడి ఉన్నది. దుష్టతురగ రేఖారేవంతుడు, రాజద్రోహరగండ, గండరగండ మహావీరుడు, యౌవన శ్రీవిష్ణుడు, దుష్టమానవ భీకరుడు, ఆజానుబాహుడు, మనోహరాంగుడు, కామినీ జయంతుడు, అర్జున ప్రతాపుడు అగు గోన గన్నారెడ్డి కోలమోముతో, సోగ మీసాలతో, ప్రత్యక్షమైన కుమారస్వామిలా ఉత్తమ శ్వేతాజానేయము నధివసించి మెరుపులా వచ్చి తల లక్ష ముప్పదివేల సైన్యముఖంలో నిలుచున్నాడు.

ఒక్కసారి ఆ లక్షమంది తామ్ర కంఠాలలోనుండీ ‘జయ! జయ! గోన గన్నారెడ్డిప్రభూ! జయ! జయ!’ అని రోదసీకుహరం నిండే జయధ్వానాలు ఉద్భవించాయి. మహావీరుని కుడిప్రక్క అపరభీముడు, మహాసత్వుడు, గజబలుడు మేరుశృంగంవంటి రూపంకలవాడు అశ్వత్థతరుకాండాలలాటి చేతులుకలవాడు కండలుతప్ప కొవ్వులేని దేహాంగాలు కలవాడు, ఏనుగులతో మల్లయుద్ధంచేసి నెగ్గగలవాడు, ఉరుమువంటి కంఠధ్వని కలవాడు గోన విఠలధరణీశుడు మహాసేనాపతి కిరీటలాంఛనంతో ఉన్నతమైన గదను ధరించి నిలుచున్నాడు.

గన్నారెడ్డికి కుడిప్రక్కను కదలివచ్చే కొండలాంటివాడు, ముష్టి ఘాతం చేతనే బండరాళ్ళను పిండిగొట్టగలవాడు; విఠలధరణీశుని కుద్దియగు వాడు, సముద్ర గర్జన కలవాడు దోసపాటి సూరన్నరెడ్డి ప్రభువు హిమాలయ శిఖరంలా నిలుచున్నాడు. అవక్రవీరుడు, సింహంలాంటివాడు, మాయలలో గంధర్వులకు విద్యనేర్పేవాడు విరియాల సబ్బారెడ్డి ప్రభువు సూరన్నరెడ్డికి ఎడమప్రక్క నిలుచున్నాడు. సబ్బారెడ్డికి ఎడమప్రక్క ఉత్తమ వెలమరెడ్డి కులమనే పాలసముద్రానికి బాలచంద్రుడు, అభిమన్యసత్వుడు, సంతత సంతోష ప్రపుల్ల వదనుడు, దివ్యధనుస్సుకలవాడు, అతి వేగాలయిన బాణాలతో సూటితప్పక ఎట్టివస్తువునైనా ఎంతటిదూరములో ఉన్నా ముక్కలు చేయగలవాడు రేచెర్ల బేతిరెడ్డి మహాప్రభు తనయుడు సోమారెడ్డి నిలిచిఉన్నాడు. ఆయనప్రక్కనే రేచర్ల ప్రసాదాదిత్యప్రభువు కుమారుడు చినదామానాయకప్రభువు నిల్చుండి ఉన్నాడు. ఆ ప్రభువు పగతురకు వెన్నిచ్చి ఎరుగడు. యుద్ధప్రారంభమందు ఏమినవ్వునో మళ్ళీ యుద్ధాంతమందే నవ్వుతాడు. ఈ లోగా ప్రచండ సూర్యాగ్ని అతడు; పసికట్టిన మహానాగము. కత్తియుద్ధములో అతన్ని ఓడించగల యువకు డొక్క గన్నారెడ్డి ప్రభువే!

విఠలధరణీశునకు కుడిప్రక్క చినఅక్కినప్రగడ ఉన్నాడు. ఆ బాలపండిత కుమారస్వామికి, వ్యాసునకు తప్పులు దిద్దగల ఆ పండితుడు యుద్ధావసరం వస్తే రామబాణం, చక్రధార, పాశుపతాస్త్రమును.

మల్యాల చౌండసేనాధిపతికి ఇద్దరు కొమరులు, ముగ్గురు కొమరితలుఉన్నారు. వారయిదుగురు భీమసంతతివారు. కొమరులిద్దరూ మహాసత్వులు, విఠలధరణీశునే యుద్ధానికి పిలువగలరు. ఆ బాలికలు గదాయుద్ధంలో అన్నగారిని, తమ్ముణ్ణి ఒక్కొక్కప్పుడు ఓడించేవారు ఆ యన్నదమ్ములలో కాటప్రభువు గన్నారెడ్డి జట్టులో చేరిపోయినాడు. పదియారేళ్ళ ఆ బాలప్రభువు మహాతోమరధారియై అక్కినప్రగడ కుడిప్రక్కను నిలిచిఉన్నాడు.

ఇంకనూ అక్కడ చేరిన ఆంధ్రక్షత్రియవంశ్యులలో మున్నూరు కాపు వీరప్రభువు మలుగంటి రుద్రనాయకుడు గజసాహిణి. గన్నారెడ్డిహృదయం చూరగొన్న ఆ వీరుడు కాటయప్రభువు ప్రక్కను నిలిచి ఉన్నాడు.

రామరాజు, గణపతిప్రభువు, వెలమదొర మండయ్య ప్రభువు, పులవరి బొల్లిరెడ్డిప్రభువు. గోనం కామిసేనాని, వివరము నరహరినాయకుడు, పంట అన్నరెడ్డిప్రభువు, గొచ్చెబమ్మ సేనాని అనే ప్రభువులు వారి వారి సేనాముఖాల నిలుచుండి ఉన్నారు.

గోన గన్నారెడ్డి తన మహాసైన్యాన్ని చూచి, ‘ఆంధ్రవీరులైన మీకు ఒక మహావిషాదవృత్తాంతం వినిపించవలసివచ్చింది. మనప్రభువు శ్రీ గణపతిదేవ చక్రవర్తి అస్తమించారు’ అని విషాదకంఠంతో తెలియచెప్పెను. ఆ మాటలు దగ్గరి వారికే వినబడినవి. అక్కడినుండి చారులు వారిమాటలను సైన్యం అంతకూ అందిచ్చినారు.

“మనం ఎంత గజదొంగలమైనా, హీనత్వానికి పాలుపడలేదు. మన చక్రవర్తులకు ఎప్పుడూ భక్తి చూపించాము. అజభక్తితో, భగవద్భక్తితో దుర్మార్గులను, రాజద్రోహులను నాశనంచేసే పని పెట్టుకొని ఈ మహాసైన్యం పెంచుకొన్నాము. శ్రీశైల మల్లికార్జునుడు మనపక్షం ఉన్నాడు కాబట్టే మనకు కోట్లకొలది ధననిధులు దొరికాయి. ప్రజలే భగవంతుడు. ప్రజానురంజనమే భగవద్భక్తి. మన చక్రవర్తి, దీనబాంధవుడు కైలాసవాసి అయినాడు. ఈతరుణంలో సరిహద్దుభూములలో కుట్రలు, అరాజకము, కాటకము, తుచ్ఛరోగ తాండవము, చోరవృద్ధి తటస్థిస్తుంది. కాబట్టి ఈ నాటినుంచి మనం శ్రీ రుద్రచక్రవర్తి సింహాసనం అధివసించి సుఖసంవిధానం చేసేవరకూ అప్రమత్తులమై ఉండాలి. ఆ వెనుక మన గజదొంగతనం ఈ రహస్యనగరంలోనే భూస్థాపితం అగుగాక. అలా కాని పక్షంలో మన జన్మలు గజదొంగలుగానే ముగిద్దాము” అనే గన్నారెడ్డి మాటలు కైలాస వాక్కులులా వినబడ్డాయి.

3

ధీరహృదయ, విద్వాంసురాలు, రాజ్యపాలన ప్రజ్ఞావతి అగుటచేత రుద్రమదేవి తండ్రిపోయిన దుఃఖాన్ని తన బ్రతుకు పడవను ముందుకు గొనిపోయే అనుకూల వాయుశక్తిగా చేసికొన్నది. ఆమె హృదయంలో సంతోషము నశించింది; అనుమానం పటాపంచలయింది! వెనుకటి డోలాయమాన మానసికావస్థ నశించింది. గుప్పిళ్ళు బిగించి, కనుల తీక్ష్ణకాంతులు ప్రసరింప, దేహమంతటా శక్తి పొదవికొనగా, దృఢ ప్రతిజ్ఞావతియై కర్యరు రాలైంది.

ఆమె స్త్రీవేషము మానింది. సర్వకాల కవచధారిణియై, సైన్యాలను భయంకరాయుధంగా సిద్ధంచేయ సంకల్పించుకొన్నది. ఆమె కోమలత్వం వజ్రకాఠిన్యం సవదరించుకొంది. ఆమె సౌందర్యం మహాదుర్గా సౌందర్యమై వికసిల్లినది.

ఆమెకు ప్రొద్దుపోయినగాని నిదురపట్టదు; పట్టిన పదిగడియలలో మరల మెలకువ.

ఆమె ఆలోచనలు ఆంధ్రవిరోధి సంహరణము, ఆమె కాంక్ష అవధిలేని లోకపురోగమనము.

ఆమె ఉదయాస్తమానాలు అన్నాంబికతో కత్తియుద్ధ పరిశ్రమచేయును. అన్నాంబికతోపాటు విలువిద్యలు, సూక్ష్మతలు నిరంతరపరిశ్రమచేసి సాధించును. వివిధాశ్వారోహణలు, అశ్విక యుద్ధాలు, రథనూత కారిత్వము, రథయుద్ధకౌశలము, వివిధ వ్యూహనిర్మాణము, వివిధ వ్యూహచ్ఛేదము, వివిధాయుధ ప్రయోగము ఇవన్నీ దీక్షతో అభ్యసింప నారంభించినది.

స్వయంగా ప్రసాదాదిత్యునితో కలిసి, ఓరుగల్లుకోట బాగుచేయించసాగిందా మహారాణి. ఏటిసూతకమైనవరకు తాను సింహాసన మధివసించదట. శివదేవయ్య మంత్రితో వివిధోద్యోగులతో, సర్వనాడులగూర్చి; ప్రజలగూర్చి మోటుపల్లి శ్రీకాకుళం, మచిలీపట్టణము, శంబరదీవి, కుదంగేశ్వరపురం మొదలైన రేవుపట్టణాలనుండిజరిగే సముద్రవ్యాపారాల గురించి, సుంకాలు, రాజభోగము, పన్నులు, కప్పాలు, అడవులు, గనులు, వర్తకము, నాణేలు మొదలైన ఆర్ధికవిషయాలగురించి; వానలు, నదులు, చెరువులు, కాలువలు, పంటలు, తోటలు, వ్యవసాయము, గ్రామాలు, పశువులు మొదలగు ప్రజాజీవనం గురించి; గ్రామపెద్దలు, దళ గ్రామాధికారులు, సామంతులు, మంత్రాంగులు మొదలయిన రాజ్యపాలనా నీతినిగూర్చి; మహారాజ పథాలు, సత్రాలు మొదలైన సంస్థలగూర్చి; వైద్యశాలలు, పశువైద్యశాలలగూర్చి, విద్యానిలయాలు, ఆశ్రమాలు, పరిషత్తులు, దేవాలయాలు, శాసనాలు, మఠాలు, వివిధ సంప్రదాయాలు, మతాచార్యులు మొదలయినధార్మికవిషయాలగూర్చి; కవులు, పండితులు, శిల్పులు, గాయకులు, గ్రంథాలు, సరస్వతీ ఆలయాలు, నాట్య కోవిదులు, భోగమువారు, శిల్పబ్రాహ్మణులు మొదలైన మహావిద్యలనుగూర్చి ఆ సామ్రాజ్ఞి సంపూర్ణంగా చర్చించుచు తానే అన్నికార్యాలు నిర్వహింపసాగింది.

అన్నిటిలో అన్నాంబిక ఆమెకు మంత్రి, సేనాపతి, తంత్రపాలిక, తలవరి, అంగరక్షక, తోడునీడయై మెలగుచుండెను.

అన్నాంబిక ఒక్కొక్కప్పుడు ‘ఇదేమిటి, పురుషులు నిర్వర్తించే ధర్మము తాము నిర్వర్తించడ మేలాగు? అది ఎలా విజయం పొందగలదు?’ అని సంశయముచే వ్యధనొందేది. ఒక్కొక్కప్పుడు తన మహారాణి అవతారస్వరూపిణి, కారణజన్మ, దేవీమూర్తి కాబట్టి అపరాజితాదేవిలా లోకం యావత్తూ రాజ్యం చేయగలదని సంకోచరహితమైన ఉత్సాహంతో ఉప్పొంగిపోయేది.

పురుషవేషంలో వా రిద్దరూ రామలక్ష్మణులు లయ్యారు. వరాహలాంఛన యుతమై, ఖడ్గధారిణియైన దేవీమూర్తి విగ్రహంతో, రుద్రదేవి అన్న అక్షరాలతో ముద్ర ఒకటి సామ్రాజ్ఞి అనామికను, మరొకటి అన్నాంబికవ్రేలిని అలంకరించాయి.

అశ్వసైనికులు ఒకరొకరు, ఇరువురిరువురుగా, మూవురుగా, నలుగురుగా, ఇరువదిమంది, వేయిమందిగా చెక్కుచెదరక శ్రేణులుగా యుద్ధయాత్రకు పురోగమించడం, యుద్ధంలో విరోధుల్ని తాకడం ఆమె నేర్పి సేనల సుశిక్షితము లొనర్చెను.

ఢంకానాదాన్ననుసరించి పదాతులు మొదట వరుసతీర్చడం, ముందుకురకడం, డాలు డాలు కలిపి గోడకట్టడం, డాళ్ళు గొడుగులుచేసి నడవడం, ఒక శ్రేణివెనుక ఒక శ్రేణిగా మోహరించడం; మోహరంలో కరవాల భల్లశూల పరశు యుద్ధాలు చేయడం; యెదుర్కొన్న సైన్యాలపై బడడం; పరు గునబోయి తాకడం, శ్రేణులు విడకుండ వెనుకవారు ముందుకు సర్దుకొనడం ఇవన్నీ శిక్షణ ఇచ్చింది.

జేగంట గుర్తులకు యుద్ధవిధానాలు నడపడం ఆ మహారాణి ఏనుగులకు నేర్పింది.

ఓరుగల్లు వెలివాడలకు, మైలసంతకుచుట్టు గంపకోట కట్టించింది. నగరం చుట్టు ఉన్న కోటగోడల ఇనుమిక్కిలిగా బలిష్టమొనర్చింది. రాచకోట బాగు చేయించింది. అగ్నిబాణాలు ఆర్పడం నేర్పించింది. అగ్నిబాణాలనుండి కాపాడే తోలుకూర్పాసాలు లక్షలు సిద్ధం చేయించింది.

నగరంనిండా ధాన్యపుగాదెలు నిర్మాణం చేయింది వానిని వివిధధాన్యాలతో నింపించింది. నగరంలో రాచకోటలో ఎన్నో కూరగాయల తోటలు వేయబడినాయి. ఎన్నో మంచినీళ్ళ బావులు త్రవ్వినారు. చెరువులలో ఎప్పుడూ నీరు ఉండే విధానం పండితులతో ఆలోచించి నిర్వహించినారు.

ఓరుగల్లు నగరం రెండేళ్ళ ముట్టడికి సర్వసిద్ధ మయింది.

4

“శ్రీ కాకతీయ గణపతిరుద్రుడు కాలంచేశాడూ? అతని కూతురు రాచరికమా? క్షత్రియకులానికి ఎంతగతిపట్టిందీ!” అన్నాడు కల్యాణి చోడోదయుడు.

కల్యాణినగరం పశ్చిమాంధ్ర మహారాజ్యానికి ఒకనాడు ముఖ్యనగరం. కాంచీపురం రాజధానిగా పల్లవులు దక్షిణానా, వాతాపినగరం రాజధానిగా పడమటను చాళుక్యులూ శాతవాహన సామంతులుగా ఉండేవారు.

శ్రీశైలానికి ఈశాన్యంగా పల్లవభోగమూ, తూర్పుగా చళుక విషయమూ ఉండేవి. చళుకవీరుడొకడు చక్రవర్తికి సేనాపతియై కుంతలదేశం జయించినాడు. శాలివాహన చక్రవర్తికి పెద్దకుమారుడు రాజప్రతినిధిగా ములుకనాటికి ముఖ్యనగరమైన ప్రతిష్ఠాననగరంలోనూ, ద్వితీయకుమారుడు, మసికనగరం రాజధానిగా శాతకర్ణాటంలోనూ ఉండేవారు. మధ్యకుంతలానికి వాతాపిలో చళుకసేనాధిపతి ఉండేవాడు.

శాలివాహన సామ్రాజ్యం విచ్ఛిన్నంకాగానే, ఇక్ష్వాకులు పల్లవభోగానికి, తూర్పు ఆంధ్రావనికీ సామ్రాట్టులైనారు. కంచిలో పల్లవులు స్వతంత్రులై నారు. బాదామిలో చాళుక్యులు స్వతంత్రులైనారు.

ఆనాటినుండి చాళుక్యులు కుంతలము, అశ్శకము, ఆంధ్రము, గాంగవాడి, అభీరము, ఘూర్జరము జయించి, మహారాజ్యము విస్తరింపచేశారు, వాతాపినుండి రాజధాని కల్యాణినగరమునకు వచ్చినది. చాళుక్య సామ్రాజ్యము అంతరించగానే, వారికి సామంతులుగా ఉన్న కందూరులోని తెలుగుచోడులు వర్థమానపురం రాజధాని చేసుకొని, విజృంభించారు. కల్యాణి, చాళుక్యుల సేనాపతి అయిన కాలచుర్యబిజ్జలుని హస్తగత మయినది. బసవని వీరశైవంవల్ల కాల్యచుర్యవంశం నశించి కల్యాణి నగరాన్ని తెలుగుచోడులు ఆక్రమించినారు.

వర్థమానపుర చోడులను గణపతిచక్రవర్తి పెదతండ్రి రుద్రదేవ చక్రవర్తి నాశనం చేశాడు. అంతట కల్యాణి చోడులు కాకతీయ సామ్రాజ్యానికి సామంతులైనారు.

గణపతిదేవచక్రవర్తి కాలంలో కల్యాణినగరాన చోడోదయుడు రాజ్యం చేస్తూఉండెను. అతనికి ఎంతకాలమునుంచో తాను స్వతంత్రుడై మహారాజు కావలెనని వాంఛ ఉండేది. బలవంతుడైన గణపతిదేవచక్రవర్తి ముసలివా డయినాడు. ఆయన పేరున ఆయనకుమార్తె రాజ్యం చేస్తూఉంది. ఇంతకన్న అదను ఏమి కావాలి?

చిన్న చిన్న సామంతులను చేరతీశాడు. గట్టి సైన్యం పోగుచేశాడు. తాను చక్రవర్తినన్నాడు. తనకు పశ్చిమాంధ్ర సామంతులందరూ కప్పము కట్టాలన్నాడు. సైన్యంతో వెళ్ళి కందూరు పట్టుకున్నాడు. ఆ చుట్టుపట్ల ఉన్న రాజ్యం అంతా ఆక్రమించాడు.

ఆ సమయంలో రుద్రమహారాజుకు, శివదేవయ్య మంత్రికీ చోడోదయుని దురంతం తెలిసింది. శివదేవయ్య దేశికులు, మహారాజు, బాప్పదేవుడు, ప్రసాదాదిత్యప్రభువు, జాయపసేనాని ఆలోచించి, కొద్దివారాలలో చోడోదయునిపైకి వెళ్ళడానికి నిశ్చయించినారు. కాని నెలలు జరిగి పోయినవి. చోడోదయుడు నిర్భయంగా విజృంభించిపోయినాడు.

ఇంతట్లో చక్రవర్తిసైన్యాన్ని ఒకదాన్ని చోడోదయుడు నాశనం చేయడం, గణపతిదేవ చక్రవర్తి కైలాసవాసి అవడం రెండూ జరిగాయి.

చోడోదయుడు విజయగర్వంతో రాజు బందీగా ఉన్నాడని మానువనాడు ఆక్రమించుకొని వర్థమానపురం ముట్టడించాడు. ఈ విషయం అంతా గోన గన్నారెడ్డికి వేగు వచ్చింది. గన్నారెడ్డి మండిపోయాడు. ఎందుకు చక్రవర్తి సైన్యాలు ఊరుకొన్నాయి? ఇన్ని నెలలు ఈ పామును పాలుపోసి పెంచారు! చక్రవర్తి సైన్యాన్ని నాశనంచేయగానే గోనమహానగరం ముట్టడించే మొనగాడ నయినా ననుకొన్నాడా ఈ కీటకము! అని గన్నారెడ్డి పెదవులు బిగించి నవ్వినాడు.

చోడోదయుడు ఆశ్వికశ్రేష్టుడని ప్రతీతి. అతడు తురగముమీదనే నిద్ర పోగలడట. తురగముమీదనే భోజనం చేయగలడట. ఆయన ఎక్కే గుఱ్ఱము ‘మహావాయువు’ అని పేరుగలది. మ్లేచ్ఛాశ్వాలలో మహోత్తమమైనది. ఆ తురం గపు మెడలో చోడోదయుడు వజ్రాలుపొదిగిన బంగారు తాడుతో ఆణిముత్యాల హారం అలంకరించాడట.

ఆ ఉత్తమాజానేయ మధివసించి చోడోదయుడు వర్థమానపురం ముట్టడిని సాగిస్తున్నాడు.

అతని హృదయంలో ఈ వర్థమానపురాన్ని పట్టుకోవడం అయిదు నిమేషాలని. ఈ పురం ప్రస్తుతం పాలించేది ఒక బాలకుడుకదా? రాజు కావలసిన గన్నారెడ్డి గజదొంగ అయినాడు. ముసలిరాజు బందీ. వర్థమానపురం దొరకగానే ఓరుగల్లు కొద్దివారాలలో తన హస్తగతం. చోడచక్రవర్తులు, చాళుక్య చక్రవర్తులు ఆతన్ని ఆశీర్వదిస్తున్నారని ఆతడు భావించి ‘ఎవ రీ కాకతీయులు?’ అనుకున్నాడు.

ఆ వెంటనే రోజుకుంటూ అశ్వానెక్కిన ఒక చారుడు చోడోదయ మహారాజుకడకు పరుగిడివచ్చి ‘జయ! శ్రీ మహారాజాధిరాజునకు జయ! గోన గన్నారెడ్డి సైన్యాలతో మహాప్రభువుమీదకు వస్తున్నాడు!’ అనివార్త తెచ్చాడు.

“ఏమిటీ, గన్నారెడ్డా! ఆ గజదొంగా? ఎందుకు వస్తున్నాడు? ప్రాణాల మీద ఆశపోయిందా? లేక తనకు దక్కని వర్థమానపురం మావలన దక్కుతుందనా? మాతోచేరి, మాకు దాసుడైతే ఈ నగరాన ఈ దొంగను సామంతుణ్ణి చేద్దాము” అని చోడోదయ మహారాజాధిరాజు తన్ను కొలిచిఉన్న సేనాధికారులతో అన్నాడు.

ఆ ముక్కలు ఆత డంటున్నాడు. మరుసటిక్షణంలో తృణావర్తుడులా గోన గన్నయ్య ససైన్యంగా వచ్చి చోడోదయుని సైన్యాలపై విరుచుకు పడినాడు.

ఎంత సిద్ధంగాఉన్నా ఆ ఢాకకు చోడోదయుని సైన్యాలు ఉప్పెన కెరటానికి విరిగిన తాళవనంలా అయిపోయినాయి.

5

ఎప్పుడు గోన గన్నారెడ్డి సైన్యాలువచ్చి తన సైన్యాలను తలపడినా యని విన్నాడో, ఆ వెంటనే తన ఆశ్వికసైన్యాలు గన్నారెడ్డి సైన్యాలను చుట్టుముట్టవలసిందని ఆజ్ఞఇచ్చి, ఆ సైన్యాలను తానే స్వయంగా నడుపుకుంటూపోయి కల్యాణి చోడోదయుడు గన్నారెడ్డిసైన్యాలను ఆరుగవ్యూతులదూరంలో మధ్యను తాకినాడు. ఆవెంటనే గన్నారెడ్డి సైన్యాలు ఇటుతిరిగి భల్లూకవ్యూహం రచించాయి. ఆసంకుల సమరంలో చోడోదయుని ఎడమవైపునుంచి గన్నారెడ్డి తానున్నూ తెల్లని అజానేయంపై అధివసించి, తన ఆశ్విక సైన్యాలను నడుపుకొని వచ్చి మధ్యనే తాకినాడు. గన్నారెడ్డి ఆశ్వికసైన్యాన్ని పొదుపుకొని ముప్పది వేలమంది పదాతులను నడుపుకొని విఠలధరణీశుడు - చోడోదయుని ఇతర సైన్యాలు గన్నారెడ్డి సైన్యాలను వెనుకనుండి తలపడకుండా - అడ్డుపడినాడు. చోడోదయుని ఆశ్వికులు గన్నారెడ్డి ఆశ్వికులు ఆ దినమంతా జరిపిన యుద్ధము దేవతలు విమానాలపై వచ్చి తిలకించినారని కవులు గానం చేసిరి.

ఆ పిమ్మట ప్రవర్తిల్లిన సంకులయుద్ధంలో గన్నారెడ్డి కొద్దిమంది ఆశ్వికులతో గోదావరిని ఈదే ఏనుగులా తక్కిన ఆశ్వికసైన్యాల మధ్యనుండి చొచ్చుకుపోయినాడు. ఆవీరుడు చేసిన దారిని ఆరువేలమంది ఆశ్వికులు చోడోదయుని ఇరువదివేలమంది అశ్వ సైన్యాన్ని రెండుగా చీలుస్తూ చొరబడినారు. ఈ సైన్యాన్ని ఎదుర్కొనడానికి తిరిగిన చోడోదయుని సైన్యాన్ని మల్యాల చినదామానాయుడు తన సైన్యంతో వెనుకవైపున తాకినాడు.

ఈ కారణంచేత రెండుగా చీలిన చోడోదయుని ఆశ్వికసైన్యాలు మూడుగా చీలినవి. గోన గన్నయ్య ఇట్లు శరవేగంతో ముందుకు చొచ్చుకుపోయి చోడోదయుని తాకినాడు. ఆఇద్దరు వీరులూ ఆశ్విక శ్రేష్టులే కాని గన్నారెడ్డి అశ్వపునడక మెరుమువేగము.

రెండుమూడుసారులు గన్నారెడ్డి చోడోదయులమధ్య ఇతరాశ్వికులు యుద్ధం చేస్తూ అడ్డం వచ్చినారు కాని గన్నారెడ్డి వారిని తప్పించుకొని చోడోదయుని మరల తాకినాడు. చోడోదయుడు, ఎడమ ముష్టితో మణులు పొదిగిన బంగారుకళ్ళెము బూని గుఱ్ఱాన్ని విచిత్రగతులు నడిపినారు. గన్నారెడ్డి గుఱ్ఱము సూర్యుని గుఱ్ఱములా చరించినది. చోడోదయుని కత్తి ఘాతాలకు తనఫలకాన్ని అందిస్తూ గుఱ్ఱాన్ని మాటచేతనే నడుపుతూ గన్నారెడ్డి, చోడోదయునికి, వానిగుఱ్ఱానికి గాలి పీల్చుకునేందుకన్నా వ్యవధి ఈయలేదు.

ఇరవై క్షణములలో చోడోదయునిచేతి పట్టుసూత్రము రెండు ఖండము లై పడిపోయినది. పదిక్షణములలో కత్తి ఆతనిచేతినుంచి ఎగిరి క్రింద పడినది. ఇక రెండు నిముషములలో చోడోదయుడు క్షతగాత్రుడై క్రిందపడిపోయినాడు. గోన గన్నారెడ్డికి అంగరక్షకుడుగ ఉన్న అక్కినప్రగడ ఒకడే ఉరుకున చోడోదయుని సమీపించి, అతని చేతులకు బంగారు గొలుసులు తగిల్చినాడు.

చోడోదయుడు బందికావడంతోటే సేనాపతులు చేతులెత్తి యుద్ధ మాపు చేసినారు.

చోడోదయుని బందీగాగొని గోన గన్నారెడ్డి చోడోదయుడు నిర్మించుకొన్న రాజశిబిరానికి వెళ్ళి అక్కడ కొలువు తీర్చినాడు. చోడోదయుని ఉత్తమాశ్వాన్ని గోన గన్నారెడ్డి సైన్యాలు తమప్రభువు గుఱ్ఱంతోపాటు అశ్వశాలలో పెట్టి సంరక్షణ చేస్తూ ఉండిరి. “ఏమయ్యా చోడోదయా, ఉదయచోడ మహారాజుకు మనుమడవు. ఉదయచోడుడు రుద్రచక్రవర్తికి లోబడిన నాటినుండి, మీతండ్రి గోకర్ణ చోడుడు శ్రీ కాకతీయవంశానికి భక్తితో సేవచేస్తూ ఉంటే, నీకు ఈ దుర్బుద్ధి పుట్టిందేమి? నువ్వు పదివేలసైన్యంమాత్రం ఉంచుకో, తక్కిన సైన్యం మా దగ్గర ఉంటుంది. ఖర్చు నీవే భరించాలి. నీ గుఱ్ఱాలన్నీ మావి, నీ పట్టుసూత్రము, నీ అశ్వము మావి, నీకిష్టమైతే ఇవి ఒప్పుకొని మాకూ, చక్రవర్తికీ సామంతుడుగా ఉండు. లేదా, దేశాలు విడిచి కాశీయాత్ర చేసుకో” అని చెప్పెను.

చోడోదయుడు తలవాల్చుకున్నాడు. ఆతని హృదయంలో ప్రళయం నాట్యం చేస్తున్నది. ఈ గజదొంగ చేతిలో పాలువిరిగినట్లు తనవిధి విరిగిపోయినది. ఈతనికింత అదృష్టము ఎలాపట్టినది? ఈతడు ఇంతటి వీరు డవడమేమిటి? చోడోదయుని హృదయం దహించుకుపోతున్నది. పైకి నవ్వు మొహంతో,

చోడో: మహారాజా? నేను శ్రీరామునివంటి మహావీరునిచేతిలో ఓడిపోయాను.

గోన: చోడోదయరాజా! మీరు నన్ను భట్రాజులా పొగడనవసరంలేదు. మనం ఆంధ్ర క్షత్రియ వంశాల్లో ఉద్భవించాము. మనకు ధర్మము, అధర్మమూ అవసరంలేదు. రాబందుల్లా ఒకళ్ళనొకళ్ళం పీక్కుతింటాము.

చోడో: మహారాజులకు కోపంవద్దు. నేను చేసినతప్పు నేను గ్రహిస్తున్నాను. ఆంధ్రచోడులూ ఒకనాడు చక్రవర్తులు...

గోన: అంతకుముందు చాళుక్యులు, అంతకుముందు పల్లవులు, అంతకుముందు ఇక్ష్వాకులు.... వెళ్ళిపోయిన చక్రవర్తివంశంవారు, మళ్ళీ చక్రవర్తులవటం కాలధర్మం కాదుప్రభూ!

చోడో: అదే నేను మనవిచేసేది. కాని పొరపాటుపడి ప్రయత్నాలు చేయడంమానవస్వభావం, క్షాంతవ్యుణ్ణి; తాము చక్రవర్తి కాదగిన మహానుభావులు.

గోన: కరటక దమనకులనీతి నేర్చుకుంటున్నారా?

చోడోదయుడు పెదవి కొరుక్కున్నాడు. కళ్ళలోమంటలు లేచాయి. వెంటనే చప్పబడ్డాయి.

గోన: చోడోదయప్రభూ! నేను గజదొంగను నా నీతి నాది. దాదికి వీసం తప్పను. భగవత్స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ రుద్రమదేవి నాకు చక్రవర్తిని. అందుకు ఇంద్రుడు కాదన్నా అతన్ని హతమారుస్తాను. ఇకచాలు . విఠలప్రభూ! చోడోదయుని తురంగాలన్నీ మనవి. చోడోదయుని తురంగము మీది, ఆ తురంగసూత్రము మా అశ్వానికి తగిలించవలసిందిగా సూతునికి ఆజ్ఞ ఇవ్వండి. చోడోదయుని బందిగా వదలి ఆయన సైన్యాలు మన సైన్యంలో చేరేవి చేర్పించండి. తక్కిన సైనికుల్ని పొమ్మనండి. కల్యాణి తాము ఆక్రమించి చోడోదయ ప్రభువునే రాజ్యం చేయనియ్యండి. ఆయనధనాగారంలో ఉన్న ధనం మనధనాగారంచేర్పించి; అందులో సగం ఈ నాడులోని ప్రజలకు పంచండి.

గోన గన్నారెడ్డి సింహాసనమీదనుంచి లేచినాడు.

“జయ! చోడోదయ పట్టసూత్రతురంగాపహరణా! జయ! జయ! అని భటులు జయధ్వానాలు చేసినారు.

గన్నారెడ్డి మహావేగంతో చోడోదయుని అశ్వసూత్రంచే అలంకరింపబడిన తన అశ్వము అధివసించి, అక్కినప్రగడకూడా రాగా స్కంధావారం దాటి ఎక్కడి కేని పోవసాగినాడు.

వా రట్లు ఒక గవ్యూతిదూరం పోగానే గోన గన్నారెడ్డి అశ్వవేగం తగ్గించి ‘అక్కిన బావగారూ, ఇకపదండి, ఇంత ఆలస్యమైన తమ పునస్సంధాన మహోత్సవానికి, మీ తాతగారి మనస్సు తిరిగినదే చివరకు! మన రహస్యం తెలిసి తిరిగిందా, లేక ఆర్ద్రత తాల్చిందా?’ అన్నాడు.

“బావగారూ! ఆయన మనస్సే కరిగిందనుకొంటాను. మా బామ్మగారు కంటినీటితో, మాతాతగార్ని చూచి, ‘మీరు బ్రాహ్మణు లనుకొన్నాను. పై స్వరూపం చూచి మోసపోవడం ఉంటుంది. కొన్ని మేఘాలు బాగావర్షిస్తాయి, అనుకుంటాము. అవి వృధాడంబర జీమూతాలని తెలియడం కష్టం’ అన్నదట. ఆ రాత్రి మా తాతగారు భోజనం చేయలేదట. ఆ మరునాడు నిరశనవ్రతమేనట. ఆ మూడవనాడు, వారితో పాటు నిరశనవ్రతం చేసే మా బామ్మదగ్గరకు మా తాతగారు వెళ్ళి ‘అక్కిన ప్రస్తుతానికి మనం అందరం వెడుతున్నాము’ అన్నారట.”

6

గోన గన్నారెడ్డి, అక్కినప్రగడ మొదలయినవారు అంతా, అక్కినప్రగడ అత్తవారి ఊరు ప్రోలేశ్వరము చేరిరి.

ఓరుగల్లునుంచి పెద్ద అక్కినప్రగడ, సోమయామాత్యులు, చుట్టాలు పక్కాలు అందరూ వేయిమంది మెరికలవంటి ఆంధ్రసైనికులతో వచ్చిరి.

వారికందరికీ చెన్నాప్రెగడ మాచయమంత్రి తగిన విడుదులు ఏర్పాటుచేసి ఉంచినాడు. ఊరంతా పచ్చని తోరణాలతో, పందిళ్ళతో, అలంకారాలతో నిండి పోయింది. ఇరువంకలా చుట్టాలు వందలు వందలు వచ్చారు. ముఖ్యంగా ఆడవారు ఎక్కువమంది ఈ శుభకార్యానికి చేరారు. ఈ శుభకార్యం ఆడవాళ్ళకు పండుగ. ఆంధ్రులీ ఉత్సవంలోనూ, పెళ్ళినాడూ పొందే ఆనందం ఇంతా అంతా కాదు. వారి వేళాకోళాలు, వేడుకలు; విందుభోజనాలు దేవతలకుకూడ ఒడళ్ళు మర పిస్తవి. శుభముహూర్తకాలంలో ఉదయం భార్యా భర్తలను పీటలమీద కూర్చోపెట్టి దేవతాపూజ, అగ్నిహోత్రము చేయించారు. పెళ్ళికొడుకు ప్రద్యుమ్నుడులా, పెళ్ళికుమార్తె కామేశ్వరి, రతీదేవిలా ఉన్నారు. ఉద్దండ పండితుడైన అక్కినప్రగడ పునస్సంధాన మహోత్సవానికి పేరుగన్న పండితులందరూ వచ్చారు. ఆంధ్రపండితులు జగత్ప్రసిద్ధులు, నిష్ఠాగరిష్ఠులు, ఆంధ్రవైదికపాఠము జగత్ప్రసిద్ధము. కాశిలో, నవద్వీపంలో, నలందాలో, కంచిలో, ఢిల్లీలో, ఉజ్జయినిలో, ద్వారకలో, హరిద్వారంలో ఆంధ్రపండితుల కున్న గౌరవము అప్రతిమానము.

కవిసార్వభౌముడు, శబ్దవిద్యావిశారదుడు, యజుర్వేద పారగుడు ఈశ్వర భట్టోపాధ్యాయులు సభకు అధ్యక్షు డై నాడు. విద్యావాచస్పతి, త్రయీపాఠి, సోమనాథభట్టోపాధ్యాయులు, హరితసగోత్రుడు, వ్యాకరణ బృహస్పతి, బొమ్మనభట్టోపాధ్యాయులు, సకలశాస్త్రపారంగతుడు సూరదేవలుం గారును, గౌతమగోత్రికులు షట్చాస్త్ర సాగరులు దేవసభట్టోపాధ్యాయులు మొదలైన ఉద్దండపండితులు విచ్చేసిరి. శివాచార్యులు ఆరాధ్యదేశికులు విచ్చేసినారు.

శుభముహూర్తానికి వధూవరులు పీటలపై అధివసించినారు. కామేశ్వరి అప్పుడే పాలసముద్రస్థ అయిన లక్ష్మిలా ఉన్నది. అక్కినప్రగడ లక్ష్మినిచేబట్టిన నారాయణుడే!

ఆడవారు వైకుంఠంలా అలంకరించిన శయనమందిరంలో చేసిన వేడుకలు, ఆనందమహావీచికలే!

అందరూ వెళ్ళిపోయి తలుపులు వేసినారు. వధూవరుల తలుపులు విప్పారినవి. అక్కిన తన భార్యను హృదయానికి అదుముకొని ‘కామేశ్వరీ! ఈ గజ దొంగను ఇప్పటికైనా క్షమించవా?’ అని అస్పష్టవాక్యాలతో అడిగినాడు.

“మీరే నన్ను క్షమించాలి” కామేశ్వరి భర్తమోము లేత తమలపాకుల వంటి తన చేతులతో అదిమిపట్టి తన దెసకు తిప్పుకొని అన్నది.

“ఎందుకు?”

“మీకు అడ్డం రాబోయినాను.”

“నేను గజదొంగను అనుకొని, నన్ను శంకించినానంటావు?”

“అందుకు శిక్షవిధించండి.”

“రా, ఈ బాహువుల్లో నీకు ముందర బంధనము విధిస్తున్నాను! ఈ శిక్ష చాలునా?”

“ఇంతేనా మీ ధర్మశాస్త్రపారీణత?”

“ఏమిలోటు వచ్చింది?”

“నాకు మీరు చేసిన అపరాధానికి?” “అదేమి చెప్మా?”

“నన్ను వదలిపెట్టి అంతకాలం ఉండడం?”

“పెళ్ళ యినప్పటినుంచే వెంటపెట్టుకొని తిరగమన్నావా?”

“ఎదురుప్రశ్న ప్రత్యుత్తరం కాదు?”

“తర్కపండితురాలవుకూడా!”

“మీ అర్ధదేహాన్ని కాదా!”

“మరి నాకు శిక్ష?”

“నా హస్తాలలో బంధనము ఒకటి!”

“నీ హస్తాలు వట్టిలతలు! రెండవశిక్ష?”

“రెండా? ఆరుశిక్షలకు మీ రర్హులు!”

“అమ్మయ్యో! ఏ సూత్రం? ఏ ధర్మశాస్త్రం?”

“వాత్స్యాయనం.”

“అమ్మదొంగా”

“మీరు గజదొంగలు, మీ ఇల్లాలిని నేనూ దొంగనే; మళ్ళీ దొంగా అంటారేమిటి?”

“నేను ఓడిపోయాను కామేశ్వరీ!”

కామేశ్వరి ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఆమెకు తన భర్త తక్క మరో ప్రపంచమే లేదు. ఆ భర్త తనకు సన్నిహితుడై, విధేయుడైనప్పుడు, ఆమె ఆనందం మేరమీరినది.

ఆమె వెంటనే వంగి భర్తపాదాలంటి కళ్ళ కద్దుకొని ‘మీ పాదాలు సర్వ సౌందర్యనిధులు! వానిని పూజించి ఆత్మలో ధరించడానికి నేను తగను అని కన్నుల ఆనందబాష్పాలు రాల్చినది. ఆమెను ఒడిలో కూర్చుండబెట్టుకొని అక్కిన గాఢంగా హృదయాని కదుముకొన్నాడు.

7

మూడుదినాలు, ఉత్సవాలు అఖండంగా జరిగాయి. నాల్గవదినాన మగపెళ్ళివారు ఓరుగల్లు ప్రయాణం. అక్కిన ఓరుగల్లు వెళ్ళడమా, వెళ్ళకపోవడమా? అక్కినకు వెళ్ళడము ఇష్టంలేదు. వెళ్ళవలసిన ధర్మం. వెళ్ళితే అక్కినను బంది చేసి రుద్రచక్రవర్తి శిక్షిస్తుందా అనే ప్రశ్న సోమయామాత్యుల హృదయంలో ఆవేదన కలుగజేసింది. ఆయనకు తోచక కాలుగాలిన పిల్లిలా అయిపోయాడు.

పెద అక్కినప్రగడ రాతివిగ్రహంలా బిర్రబిగుసుకొని ఉన్నాడు. మాట లాడడు. ఆయన ఎదుటికి వెళ్ళడమంటేనే అందరికీ భయం.

గోన గన్నారెడ్డి చిన అక్కినప్రగడను పిలిచి ‘బావగారూ, నువ్వు మా చెల్లెలి ఆలోచనను అనసరించు నేనువెడుతున్నాను. కృష్ణవేణి నన్నుపిలుస్తున్నది. ఏదో రహస్యము నాతో చెప్పదలచుకున్నది. నువ్వుమాత్రం తొందరపడి రాకు. అవసరమైతే నేనే వార్త పంపుతాను” అని అక్కినతోచెప్పి, మాచనమంత్రివద్ద సెలవుతీసుకొని పెదఅక్కినప్రగడ కడకు వెళ్ళినాడు.

గోన: తాతగారూ! నమస్కారాలు, నేను సెలవుతీసుకొని వెళ్ళివస్తాను.

పెదఅక్కిన మంత్రి: దొంగవాళ్ళకూ, మాకూ ఏమీ సంబంధంలేదు. అవసరంలేదు, వారు మాదగ్గర సెలవుతీసుకొనే, మేము ఇవ్వవలసిన అవసరంలేదు.

గోన: అక్కినమంత్రిగారూ! మీ కోపము మా కాశీర్వాదము. త్వరలోనే దర్శనము వాంఛిస్తాను.

పెద: నేను మీ మంత్రి చినఅక్కినప్రగడను, నాపేరు పాడుచేయడానికి పుట్టినవాణ్ణి, మా వంశానికి అపఖ్యాతి తెచ్చేందుకు పెరిగినవాణ్ణి, ఇప్పుడే బందీ చేసి ఓరుగల్లు తీసుకొని వెడుతున్నాను.

గోన: తాతగారూ, బందీచేసి తీసుకొని వెళ్ళగలరా?

పెద: నేను ప్రసాదాదిత్యప్రభువునడిగి వేయిమంది వీరుల్ని తీసుకొని వచ్చాను.

గోన: ఈ గ్రామంచుట్టూ నా సైన్యాలు పదివేలు సిద్ధంగా ఉన్నాయి.

పెద: మిమ్మూ చక్రవర్తి పేరుచెప్పి బందీచేస్తున్నాను.

గోన: (పకపక నవ్వుతూ) తాతగారూ! మీ ధర్మబుద్ది ప్రశంసనీయం. కాని మమ్ము బందీచేయగలవా రొక్కరే ఉన్నారు. చక్రవర్తే స్వయంగా నన్ను బందీచేశానంటే లోబడగలను. లేకపోతే హరిహర బ్రహ్మలు అడ్డంవచ్చినా గోనగన్నారెడ్డి పీల్చివదలే గాలినైనా స్పృశించలేరు.

పెద: అంత విఱ్ఱవీగటం ఎవరికీ తగదు.

గోన: తాతగారూ! మీ మాటలు నాకు నవ్వుకలుగజేస్తున్నవి. మీఅక్కిన మీతో వస్తాడు. అక్కడ మూడునాళ్ళుంటాడు. ఆ తర్వాత శ్రీశ్రీ రుద్రదేవ సార్వభౌములు స్వయంగా ఆజ్ఞఇస్తే తప్ప ఏశక్తీ అతన్ని అక్కడ ఆపలేదు. సెలవు.

గోన గన్నారెడ్డి నవ్వుతూనే నెమ్మదిగా నడిచి, సింహద్వారంకడకువెళ్ళి, అక్కడ తనకై సూతుడు సిద్ధంగా ఉంచిన ఉత్తమాశ్వం ఎక్కి వెళ్ళిపోయినాడు. పెదఅక్కినప్రగడ మరుమాటలేక నిలిచిపోయెను.

అక్కినను బందీగా తీసుకొని వెళుతున్నారు అన్న ప్రతీతి ఆ గ్రామం అంతా పాకింది. కామేశ్వరి భర్తను కలుసుకున్నది.

కామే: మీరు ఓరుగల్లుకు బందీగా వెడుతున్నారట కాదా?

అక్కి: అవును నారాణీ! కామే: మీరు బందీగా వెడితే ఇంక నాకు రాణివాసం ఎట్లా?

అక్కి: రాజ్యంవదలి రాజు పోతే రాజ్యం పాలించేది ఆయన తరపున రాణియేకదా!

కామే: మీరు పాలించేరాజ్యం?

అక్కి: మన్మథ సామ్రాజ్యం!

కామే: (ఒళ్ళు ఝల్లుమనగా) వేళాకోళం కాదండీ! మీరు బందీగా ఏకారాగారంలోనో పడితే, ఆ వెంటనే...

అక్కి : ఆగు! చటుక్కున మాటలనకు, హృదయేశ్వరీ! పండితురాలవు. మాటలకున్న విలువ, శక్తీ చేతలకు లేదు దేవీ! నన్ను ఎవ్వరూ కారాగారంలో పెట్టలేరు. పెట్టదలచుకొన్నది తాతయ్యగారు. ఓరుగల్లు వెళ్ళగానే నన్ను చెఱసాలలో పెట్టాలని ఆయన ప్రయత్నం చేయవచ్చు. ఆ వెంటనే నేను మాయ మౌతాను. నీకు వార్త పంపుతాను. నువ్వు వెంటనే నేను ఉపదేశించిన విధాన వచ్చి నన్ను కలుసుకో.

కామేశ్వరి ఇటుజూచి, అటుజూచి, భర్తమెడ కౌగిలించుకొని, నవ్వుతూ కన్నులనీరు తిరుగగా ‘నా ఆత్మేశ్వరులైన మీతో ఒక్క మనవి. మిమ్మువిడిచి బ్రతుకలేను. మీ కోసం నా తపస్సు, తెలుసునా!’ అన్నది. అక్కిన భార్యను బిగియార కౌగిలించి గాఢచుంబనము వరముపొందినాడు.

ఇంతలో సీత పరుగు పరుగున అక్కడకువచ్చి ‘అక్కా! దొంగభావను ఒక్క నిమేషమూ వదలదలచుకొనలేదుటే! నేను బావను ఏడిపిస్తానని భయమా?’ అన్నది. ‘నువ్వు వెళ్ళు, నీకు కొత్తచీరలు ఇస్తారట. బావను నేను కనిపెట్టి ఉంటాను. నన్ను చేసుకుంటేనా, బావను మూడుచెరువుల నీళ్ళు తాగిద్దును. నువ్వు వట్టి దద్దమ్మవు. నీ లోకువచూచి బావ కోడిపుంజులా కూస్తున్నాడు’ అంటూ విరగబడి నవ్వింది.

అక్కిన: అమ్మో! నిన్ను నేను పెళ్ళిచేసుకుంటేనా! నా తలంతా బొప్పెలుకట్టి ఉండును. నేను దినానికి వేయి చీపురుకట్టలు, పదివేలు బిందెలు, అయిదువేల కుంచాలు కొనవలసి ఉండును. భోజనం అతిరుచిగా నువ్వు వండడం వల్ల పూర్తిగా మానివేసి ఉపవాసం చేయవలసి ఉండునును.

సీత: అదిగో మాఅక్క పారిపోతుంది! ఇకరా! నీపై కనుక్కుంటాను. ఇవాళ మళ్ళీ నీకు తలంటులే!

అక్కిన తన మరదలిని చేరదీసి ‘దొరికావా దొంగా! నీకుకావలసిన భర్త ఏ కుంభకర్ణుడో.’

సీత: లేకపోతే నీబోటి ఏ వృశ్చికరోముడో.

అక్కిన: హరహరా! ఆడపిల్లకు ఓడిపోయానురా దైవమా.

చిన్నమరద లంతటిలో ‘బావా బావా! పన్నీరూ, బావను పట్టుకు తన్నేరు’ అంటూ అచటికి వచ్చినది.

8

కృష్ణవేణ్ణానది నీలమణిహారంలా కొండలమధ్య ప్రవహించి వెడుతున్నది. పూర్వం కన్నబెన్న అనే ఈ మహానది ఆంధ్రదేశానికి మొలనూలు. గోదావరి కంఠహారము. తెలివాహ శిరోహర లంబకము. వేణ్ణా (పెన్న) నదులు రెండూ మంజీరాలు.

గన్నారెడ్డి కృష్ణానదిలో స్నానంచేసి, పొడిబట్టలు కట్టుకొని, తడిబట్టలు సేవకుని చేతికిచ్చి కృష్ణానది అందం గమనిస్తూ ఒక రాతిమీద ఆసీనుడై నాడు. కృష్ణానది అందకత్తె. శ్రీకృష్ణునిపేరు ఆమె తండ్రి పెట్టినాడు. ఆ నందబాలుని పేరు కలిగినది సుందరి కాకుండునా? ఈ దివ్యసుందరిపై తనకింత ప్రేమఏమి? శ్రీకృష్ణభగవానునకు యమున రాధాదేవితోపాటు ప్రియురాలు. తనకు కృష్ణ ప్రియురాలు. ఈ నదీమతల్లి కోట్లసంవత్సరాలనుంచీ ఏమేమి చరిత్రలు కన్నులారా కన్నదో! ఎందరిప్రాణాలు తనలో లయం చేసుకొన్నదో! ఎందరి ప్రేమలు చూఱగొన్నదో?

వెనుక గంగానది శంతనుని ప్రేమించి బాలికగావచ్చింది. అతన్ని వివాహమై బిడ్డలను కన్నది. కావేరి అగస్త్యుని ప్రేమించింది. నర్మద పురుకుత్సుని ప్రేమించింది. సంవరుణుని తపతి ప్రేమించినది. ఆలాగే కృష్ణ మనుజ బాలికా రూపము తాల్చి తన్నేల ప్రేమింపగూడదు? తన హృదయంలో ప్రేమ ఉన్నదా? ఇందరి ప్రాణాలు తీసిన ఈ కఱకు చేతులు, వారి ప్రాణాలు కాంక్షించిన తన కఱకు హృదయం ప్రేమరహస్యాలు ఎలా తెలుసుకోగలవు?

తన కీనాడు ప్రేమవిషయం ఆలోచనాపథానికి వచ్చిందేమి? ఆవల తన ప్రాణస్నేహితుడు అక్కిన దివ్యప్రణయంలో ఓలలాడిన ఉత్సవాలనుండి రావడం వల్ల తనకూ ఈ ఆలోచనలు ఉద్భవించాయి. తాను ప్రేమకు తగడు. ప్రేమ అమృతము. తాను కాలకూట విషము. ఎంతమందినో తాను దహించివేశాడు. వాళ్ళు దుష్టులని తాను అనుకొన్నాడు. దుష్టత్వ శిష్టత్వములు సాపేక్షకాలు, ఈ ద్వంద్వాలనుగూర్చి నిర్ణయించడానికి తానెవరు? అయినా తా నెవ్వరిమీద దండువిడిసినా ఏదో ఒక అలౌకికశక్తి ప్రేరణచేతనే అనుకొన్నాడు.

కృష్ణవేణి తన్ను ప్రేమించగలదా? ఆమెను తన హృదయానికి అదుముకొని స్నాన మాచరించే సమయంలో తనకు కర్తవ్యము గోచరించింది. ఈ నదీ సుందరి కోలమోముతో, ఆకాశ నీలాల కన్నులతో, ఉదయ సంధ్యారుణాధ రోష్ఠంతో దివ్యసుభగ శరీరముతో బాలికయై ప్రత్యక్షం అవుతుందికాబోలు!

“ఓ స్వామీ! మీపేరు ఎవరండీ” అన్న ఒక బాలికాకంఠము అతనికి వినబడింది. గన్నారెడ్డి ఉలికిపడి వెనుకకు చూడ పదియారు, పదునేడు సంవత్స రాల ఈడుగల ఒక బాలుడు, కవచ శిరస్త్రాణాదులు ధరించి నడుమున కరవాలముతో వీపున డాలుతో గుఱ్ఱాన్ని నడుపుకొంటూ ఆ రాళ్ళలో నెమ్మదిగా దారి చూచుకుంటూ వస్తున్నాడు. అతని వెనుక ఇంకొక్క యువకుడు ఇరవై ఏళ్ళ ఈడుగలవాడు అంగరక్షకుడు కాబోలు తనగుఱ్ఱాన్ని నడిపించుకొంటూ వస్తున్నాడు.

గోన: ఎవరు కావాలి మీకు?

బాలుడు: నాకు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువర్యుల దర్శనం కావాలి. చూస్తే బాలుడు, గొంతు బాలికాకంఠం! అలాంటి బాలకులను గన్నారెడ్డి ఎరుగును. యవ్వనము వచ్చేముందు చాలమంది బాలురకు స్త్రీ కంఠమే ఉంటుంది.

గోన: ఏమిపని వారితో?

బాలు: నేను వారి కొలువులో చేరడానికి వచ్చాను.

గోన: వారికి రాజ్యంలేదే.

బాలు: స్వామీ! మీరుకూడా వారి సైన్యంలో ఉన్న వారిలా కనబడుతున్నారు. వారి రహస్యనగరానికి దారిచెప్పండి.

గోన: ఓయి వెఱ్ఱివాడా! నా మొగముచూస్తే నేను గన్నారెడ్డి జట్టులో వాడనని తోచిందా? లేక నీకు తెలిసే మాట్లాడుతున్నావా?

బాలు: స్వామీ! ఈ చుట్టుప్రక్కల నెక్కడనో వారికోట ఉందని వినికిడి. వారి సైన్యంలో చేరాలని ఎన్నాళ్ళనుండో నాకు కోరిక. ఇంటిదగ్గర చెప్పకుండా పారిపోయి వచ్చాను.

గోన: నీవు ఇంత చిన్నతనంలో వస్తే, ఆయన నీ తల్లి దండ్రుల అనుమతి లేనిదే సైన్యంలో చేర్చుకోడే.

బాలు: వారికి ఎవరు అనుమతి ఇచ్చారు? వారిలోచేరిన యువకవీరులందరికీ వారి తలిదండ్రులు అనుమతి ఇచ్చారా?

గోన: బాగుందయ్యా! నీ పేరు?

బాలు: నా పేరెందుకు స్వామీ?

గోన: మరి మా సేనలో చేరేవారి పేరు మా కక్కరలేదా?

బాలు: అలాగే! నా పేరు విశాలరెడ్డి.

గోన: మీ ఇంటి పేరు?

బాలు: మా యింటిపేరు అనుమకొండవారు.

గోన: ఆ అబ్బాయి?

బాలు: ఆ అబ్బాయి నా మంత్రి.

గోన: నీకు ముక్కుపచ్చలన్నా ఆరలేదు. నువ్వు గన్నారెడ్డి సైన్యంలో ఏం చేయగలవయ్యా రెడ్డివర్యా? బాలు: అలాగే? అదిగో కృష్ణ ఆవలిఒడ్డున అ చెట్టు చూచారా? మామిడిచెట్టు, ఆ చెట్టుక్రింద క్రొమ్మకు క్రిందుగా వేలాడే మామిడిపండు చూచారా? ఆ పండు పడకుండా, ఈ బాణం దానికి గుచ్చుకుంటంది. చూడండి, అనుచు ఆ బాలుడు చెలికా డందిచ్చిన ధనుస్సు అంబులపొది అందుకొని, ఆ పొది తగిలించుకొని వక్షానికి బిగించుకొని, ధనుస్సు ఎక్కుపెట్టి, బాణంతీసి గురిచూచి వదిలాడు. రివ్వున ఆ బాణంపోయి, ఆ మామిడికాయకు తగుల్కొన్నది.

గోన గన్నారెడ్డి ‘ఓహో’ అన్నాడు. వెంటనే ఆ బాలకుడు చెలికా డందిచ్చిన మామిడికాయ నొకదానిని పై కెగురవేసి కత్తి ఝళిపించి పైనుండి క్రిందికి తిప్పినాడు. ఆ లేత మామిడికాయ రెండు సమానపు చెక్కలై క్రిందకు పడింది.

“ఇప్పుడైనా నన్ను చేర్చుకోరా మీ ప్రభువు?” అని బాలుడు ఎక్కువ ఆతురతగా అడిగాడు.

గోన: బాగుందయ్యా! నేను మాట ఇస్తానుగాని కన్నులకు గంతలు కట్టి తీసుకుపోతాను.

బాలు: మంచిది.

గోన గన్నారెడ్డి గొంతుఎత్తి ‘ఓహోహో’ అని అరచెను. పదిమంది మనుష్యులు అక్కడకు పరుగునవచ్చారు. వారందరు గన్నారెడ్డికి నమస్కరించారు.

గోన: చిన్న పుట్టితియ్యండి, నేనేస్వయంగా నడుపుకొని వీరిని తీసుకు వెడతాను.

‘చిత్త’ మని అందులో ఒకవీరుడు నీటికడ ఉన్న రాళ్ళలో ఒకరాళ్ళ గుంపు కడ వంగి తీగలుతీసి, ఒక చిన్న పుట్టిని ఈవలకు లాగినాడు. అందులో గన్నారెడ్డి, ఆ బాలుడూ, అతని మంత్రి అధివసించినారు. గన్నారెడ్డి ఆబాలు డందిచ్చిన రుమాలును అతనికళ్ళకు, చెలికా డందిచ్చిన రుమాలును చెలికాని కళ్ళకు కట్టి బిగించి పుట్టి నడుపుకొంటూ నదిలోకి పోయినాడు.

9

ఆ యువకప్రభువు కండ్లకు గంతలు కట్టుచున్నపుడు గన్నారెడ్డికి ఒళ్ళు ఝల్లుమన్నది. ఆ బాలునిమోము ఎక్కడో చూచినట్లున్నది. మీసాలులేవు. శిరస్త్రాణం నుదుటి నంటి ఉండడంచేత పోలిక అంతుపట్టడానికి వీలులేకుండా ఉంది.

“ఓ బాలప్రభూ! మీ రాజ్యం ఎక్కడ?” “మారాజ్యమా? మాది చౌడమహారాజ్యపు సరిహద్దున, ఒక చిన్న రాజ్యం. మాది చక్రకోట్య దేశంలోనిది; నేను ధారావర్షులకు దూరపు చుట్టమైన రాజకుమారుణ్ణి.”

“అంతదూరమునుంచి మా సైన్యములో చేరడానికి వచ్చారా?”

“చిత్తం స్వామీ! మీ నాయకుని పక్కనఉండి యుద్ధం చేయాలని కోర్కె. ఇంటికడ ఒక లేఖ వ్రాసిపెట్టి బయలుదేరివచ్చాను.”

“ముట్టుకుంటే కందిపోయే రీతిగా ఉంది మీ దేహం!”

“ఇది రెండసారి తాము ఆముక్క అనడం. ఇప్పుడేకదా నాబలం కళ్ళారా చూచారు. మన శిబిరానికి వెళ్ళినతరువాత నా బలం మీకు చూపిస్తాను.”

“మంచిది.”

“తమ పేరు ఎవరో?”

“నా పేరు ఎవ్వరూ ఉచ్చరించరానిది!”

“అదేమిటి అట్లాంటారు?”

“నేను చేసిన పాపాలు అనంతం. నేను హీనుణ్ణి. మా ప్రభువే హీనుడు....”

“స్వామీ, మీరు గన్నారెడ్డి మహారాజునే అంటూ ఉన్నట్లయితే, ఆ మాటలు రానీయకండి.”

“అదేమిటి రాజకుమారా?”

“నాకు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువంటే భగవంతుని అవతారమని ఊహ. నా భగవంతుని నా ఎదుట ఎవ్వరూ తూలనాడటానికి వీలులేదు.”

“కాలుదువ్వి కజ్జా తెచ్చుకుంటావేమయ్యా ప్రభూ.”

“నేనా కాలుదువ్వుతా? ధర్మమైనదీ, నా హృదయానికి అతి సన్నిహితమైనదీ ఒక విషయం మనవిచేశాను. ద్వంద్వయుద్ధంవలన మనలోని అమరజ్యోతికి కళంకం రాదు, పొగచూరదు. కాబట్టి సంతోషంగా మీతో సమస్త ఆయుధాలతో ద్వంద్వయుద్ధము చేస్తాను.”

“నావల్ల మీరు ఒక వేళ ఓడిపోతే?”

బాలుడు: స్వామీ! అలా ఓడిపోతే మీవంటి ఉత్తమ వీరునివల్ల ఓడిపోయి నందుకు నాకు కించలేదు. మీవల్ల విద్య నేర్చుకున్నట్లవుతుంది.

గోన: నేను ఉత్తమ వీరుణ్ణని ఎలా తెలిసిందయ్యా?

బాలుడు: మామిడిపండును చూచి, ఇది మామిడిపండు అని తెలుసుకోవడం కష్టమా!

గోన: నేను మీవల్ల ఓడిపోతే?

బాలుడు: (పక పక నవ్వుతూ) నావల్ల.... మీరా ఓడేది? ఓహో! ఆ బాలుని నవ్వు ఆతని హృదయాన్ని కలవరపరచినది. అది నవ్వా, గాంధర్వమా? కోయిలలు కువకువ కూసినవా? లేక బంగారుమువ్వలు మ్రోగినవా? కిన్నెరతంత్రులు మీటినారా? వేణుస్వనాలు విననయినవా? గన్నారెడ్డి ఆ బాలుని మోము తేరిపారజూచినాడు.

పుట్టిని ఒడ్డుకుబట్టి గన్నారెడ్డి రెండుసార్లు కోకిలలా, ‘కూ! కూ! కో! కో!’ అని కూసినాడు. మళ్ళీ రెండుసార్లు కోకిలకూత వినబడింది. ఆ వెంటనే నలుగురు భటు లక్కడికి వచ్చిరి.

వెంటనే గన్నారెడ్డి ఒడ్డుకు ఉరికి, వీరిద్దరినీ చేతులందించి ఒడ్డుకు దింపి, తాను బాలునీ, వచ్చిన వీరులలో ఒకరు బాలుని అనుచరునీ పట్టుకొని నడిపించికొనిపోవ నారంభించినారు.

అడుగడుగుకు ఆ అడవిలో, గుట్టలలో, రాళ్ళలో, చిన్న లోయలలో, కోకిల కూతలు రెండుసార్లు చొప్పున విన బడుతూనే ఉన్నాయి.

ఎప్పటికప్పుడు వారు నడిచే దారి అంతమైనట్లే కనిపిస్తుంది మరల ఒక రాయి తిరిగితే, ఒక పొద మళ్ళితే, ఒక లోయ దాటితే, మరో క్రొత్తదారి.

అలా నడిచి నడిచి, జామున్నర ప్రొద్దు ఎక్కేసరికి, వారు కొండ శిఖరం చేరారు. అక్కడినుండి, వారు ఆ కొండ శిఖరమునుండి ఒత్తయిన చెట్లలో, గుట్టలలో, రాళ్ళలో ప్రయాణం చేశారు. ఇంతలో ఒక చెట్లగుంపు దాటగానే ఎట్టఎదుట ఒక మహానగరం ప్రత్యక్షం అయింది. గోన గన్నారెడ్డి అక్కడ వారి గంతలు విప్పాడు.

ఆ బాలుడూ, ఆతని స్నేహితుడూ కళ్ళు చిట్లించుకొంటూ ఆశ్చర్యముతో ఆ నగరం చూచారు. కొంతకాలంవరకూ వారి చూపులు నల్లపడి, పచ్చపడి చివరకు స్పష్టత తాల్చాయి. ఆ నగరం అందం, ఆ నగరం కోటగోడలు, ద్వారాలు, కందకము వారు చూచారు. చుట్టూఉన్న ఎత్తయిన కొండలూ, ఆ కొండలు నిండి ఉన్న అడవులు చూచారు.

గన్నారెడ్డితో వచ్చిన వీరుడు వీపున తగిలించిన కొమ్ము నొత్తగానే ఆ కోట ద్వారం తలుపులు విడి కందకంమీద వంతెన వాలింది. వారంద రావంతెన దాటి నగరంలోకి పోయినారు.

వారందరు ఆశ్వారూఢులై నగరంమధ్యనున్న కోటగోడలదగ్గరకు చేరిరి. రథికులు, ఆశ్వికులు, పదాతులు, వర్తకులు, సేవకులు - ఎదురై నవారందరు తన్ను తీసుకొనివచ్చిన వీరునకు నమస్కారం జేయడం చూచి, ఆబాలుని ఆనందం వర్ణనాతీతమైనది.

కోటలోనికిపోయి మహారాజభవనప్రాంగణంకడ వారందరు అశ్వాలను అవరోహించి, అక్కడ ఉన్న భటులు గుర్రాలను స్వాధీనంచేసుకోగా, సభామందిరం ప్రవేశించాడు. వెంటనే అక్కడ వివిధాసనాల అధివసించిన యువక వీరు లందరూలేచి నిలుచుండి ‘జయ జయ! గోనవంశకలశాంబుధిరాకాచంద్రా!’ అన్నారు. వందిమాగధులు ‘సమస్తగుణగణాకర జయ జయ! సత్యజ రత్నాకర, జయ! సౌజన్యగంభీర, జయ! అరిగండభైరవ, జయ! సాహసోత్తుంగ జయ! వీరవితరణోత్సాహ, జయ! కడుపులూరిపురాధీశ్వర, జయ! వీరలక్ష్మి నిజేశ్వర, జయ! మనుమకులమార్తాండ, జయ! మీసరగండ, జయ! కామినీజయంత, జయ! కోసగి మైలి తలగొండుగండ, జయ! ఉప్పలసోముని తలగొండుగండ, జయ! వందిభూపాలుని తలగొండుగండ, జయ! అక్కినాయకుని తలగొండుగండ, జయ! మేడిపల్లి కాచనాయ కురిశిరమండ, జయ! కందూరి కేశి నాయకుని తలగొండుగండ, జయ! తెఱాల కాటయశాపట్ట, జయ! బేడచెలుకినాయని నిస్సాణాపహరణ, జయ! సహజ శౌర్యాభరణ, జయ! కోట పేర్మాడిరాయ కంఠాభరణ చూరకార, జయ! చోడోదయ పట్టసూత్రతురంగాపహార, జయ! జయ!, అని దిక్కులు మారుమ్రోగ పలికినారు.

అ బాలుని చేయి పట్టుకొని గోన గన్నారెడ్డి సింహాసనమెక్కి ఆ బాలుని తనప్రక్క కూరుచుండబెట్టుకున్నాడు.

10

ఆ బాలకుని తనప్రక్క అర్ధసింహాసనమిచ్చి గౌరవించుట గన్నారెడ్డికే ఆశ్చర్యంవేసింది. తమ నాయకుడు కారణం లేక ఏపనీ చేయడని తక్కిన వీర ప్రభువులందరు అనుకొన్నారు.

ఆ నిండు సభలో గోన గన్నారెడ్డి అక్కినప్రగడ లేకపోవడంవల్ల చెప్పవలసిన విషయము సబ్బప్రభువే చెప్పవలెనని ఆయనవైపు చూచి తల ఊపినాడు. వెంటనే సబ్బనాయకుడు లేచి సింహాసనంముందు వచ్చి నిలుచుండి, ‘ఆంధ్ర క్షత్రియోత్తములైన మీ కందరకూ మన సేనాపతి, నాయకులు అయిన గోన గన్నారెడ్డి ప్రభువు పక్షాన జయము పలుకుతున్నాను. మీలో యువక ప్రభువులు, యువ రాజులు, రాజకుమారులు ఉన్నారు. గన్నారెడ్డి ప్రభువుతోపాటు ఏలాంటి వీరవిక్రమకార్యాలకన్నా వెనుదీయకుండా అనేక విజయాలు సముపార్జించారు. ఇప్పుడు మనకు తెలిసిన వేగువల్ల చోళమహారాజుకు శ్రీ ఆంధ్రదేశం పై కన్నెత్తి చూచేటంత సాహసం వచ్చింది. వినండి. పూర్వకాలంలో మన రుద్రచక్రవర్తి పెదతాతగారు శ్రీశ్రీ రుద్రదేవ చక్రవర్తి రాజ్యంచేస్తూ ఉండిరి. వారు శౌణరాజైన జైత్రపాల యాదవునితో యుద్ధానికి వెడుతూ శ్రీ రుద్రచక్రవర్తి తాతగారైన శ్రీ మహాదేవ రాజును చక్రవర్తిగా నిలిపి తాము వెళ్ళినారు. ఆ సమయంలో చోళులు కృష్ణాతీరం వరకువచ్చి, వారిరాజ్యం అల్లకల్లోలం చేశారు. రుద్రచక్రవర్తి శౌణరాజుతో యుద్ధంచేస్తూ మూడు సంవత్సరాలు ఉండినారు. మహాదేవ చక్రవర్తిపై చోళుల ప్రేరేపణవల్ల అనేకమంది సామంతులు తిరగబడినారు. ఆ యుద్ధాలలో మహాదేవరాజు వీరస్వర్గ మలంకరించారు. ఇంతలో శ్రీ రుద్రదేవ చక్రవర్తి శౌణరాజును ఓడించి తిరిగి అనుమకొండవచ్చి, సింహాసనం ఆక్రమించి చోళులతో యుద్ధం చేస్తూ మరణం పొందారు. చోళులవల్ల కారాగారంలో పెట్టబడిన శ్రీ శ్రీ గణపతిదేవ చక్రవర్తిని విడిపించి శ్రీ రేచెర్ల రుద్రప్రభువు అనేక సామంతులతోకూడి చోళుల ఓడించి బాలు లైన మన సప్తమ చక్రవర్తిని సింహాసనంమీద కూర్చుండబెట్టినారు.

“ఈలా మనకు చోళులు ఎన్నోసారులు అవమానం చేశారు. ఇదంతా ఆలోచించి శ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులు శౌణయాదవులను నాశనంచేసి ఈ మహదాంధ్రదేశం యావత్తూ తమ ఏకచ్ఛత్రం క్రిందకు తీసుకువచ్చి చల్లనిపరిపాలనము నెలకొల్పారు. కాని చోళుల రాజ్యకాంక్షపోలేదు. దక్షిణాన పాండ్యులు విజృంభించి చోళరాజ్యం ఆక్రమిస్తూ ఉండడంవల్ల చోళులు మన రాజ్యంమీదకు రావడం ప్రారంభించారు. తెలుగుచోడులందరు ఇదివరకు చక్రవర్తికి దాసోహమ్మని సామంతులయ్యారు. ఇంక మిగిలింది కాంచీ మహాపుర రాజ్యం. కాంచీపురంలో అదివరకు చాళుక్య మహారాజైన కులోత్తుంగుని వంశమువారు కాంచీపురం రాజధానిగా ఆంధ్రదేశానికి చక్రవర్తులుగా ఉండేవారు.

“అలా ఉంటూఉంటే పాండ్యులు విజృంభించి కాంచీపురంమీదకు దండెత్తి వచ్చారు. తెలుగుచోడులు మన సప్తమ చక్రవరి సహాయం అపేక్షించారు. వారు వెళ్ళి పాండ్యులను ఓడించి, తరిమి, కాంచీపుర చోడులను తనకు సామంతులను చేసుకొని, అరవ చోడదేశంపై దండెత్తిపోయి ఇన్నాళ్ళనుంచీ వారు తమ దేశానికి చేసిన అపకారాలన్నిటికీ బుద్ధి వచ్చేటట్లు చావగొట్టారు. కంచిలో తమ పక్షాన సామంతభోజునీ, సింద మార్జవాడులలో తమ పక్షాన గంగయ సాహిణి మహారాజును ఉంచారు.

“వీరనాయకులు మీరందరూ ఇప్పుడే జాగ్రత్తగా వినండి. తెలుగు చోడ సామంతులు తమలో తాము కలహాలలోపడి చక్రవర్తి గారి సహాయం కోరేబదులు దక్షిణాన పాండ్యులను, చోడులనూ సహాయం కోరినారు. అప్పుడు దక్షిణాంధ్ర మంతా అల్లకల్లోలం బయలుదేరింది. అప్పుడు మన సప్తమ చక్రవర్తులు విజయగండ గోపాలునికి, గంగయసాహిణికి సైన్యాలు పంపి సహాయం చేసి, అటు పాండ్యుల్ని, ఇటు దక్షిణ చోళులనుకూడా ముక్కలు చేశారు.

“పాండ్యులకు బుద్దివచ్చి దక్షిణానికి మధుర వెళ్ళిపోయారు. కాని దక్షిణచోళుడైన రాజేంద్రచోళుడు తనఆశ వదలక రెండేళ్ళక్రితంవచ్చి త్రిపు రాంతకం పట్టుకొని, అక్కడ శాసనం వేయించాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ధైర్యం వహించి, పదివేల ఏనుగులతో, లక్ష ఏబదివేల కాల్బలంతో వచ్చాడట. రెండువేల ఆశ్వికులట, వేయి రథాలట, పదివేల ఏనుగులలో చేర భూపతివీ, గాంగులవీకూడా ఉన్నాయట. ఈ ఏనుగులబలం ముందు నడిపించుకుంటూ, తిరుగులేకుండా త్రిపురాంతకం పట్టుకున్నాడట.

“కృష్ణకు దక్షిణాన్ని ఉన్న సిందవాడి, మార్జవాడి ఆక్రమించాడట. పొత్తపినాడు ఆక్రమించి పురందలూరు పట్టుకున్నాడట. అంబయదేవ త్రిపురాంతకులు సైన్యాలతో పారిపోయి జన్నిగదేవుని కలిస్తే ఆయన కూడా సైన్యాలతో ఆ ఏనుగులముందు మనమేమి చేయగలము అని వెలనాటికి వచ్చేశారట. ఏరువనాడు రాజేంద్రచోడుని హస్తగతం మొదటే అయింది. అతనితో ఏరువనాటి చిన్న సామంతులు, తొండై మండలం చిన్న సామంతులు అనేకులు కలిశారట. ఈలా కలిసిన సైన్యాలు డెబ్బదివేల కాల్బలము, రెండువేలమంది అశ్వికులు, వేయి ఏనుగులు, అయిదువందలమంది రథికులూనట. సంగమేశ్వరానికి దిగువ ఎక్కడో కృష్ణానదినిదాటి ఓరుగల్లు పట్టుకుంటారట!

“వీర ప్రభువులూ, యువకులూ, లవకుశ సమానులు, కుమారస్వాములూ వీరభద్రులూ అయిన తమరు, ఇంతవరకు ఓటమి ఎరుంగని తమరు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు నాయకత్వాన ఈ ఉప్పెనను అరికట్టవలసి ఉంది” అని గంభీర వచనాలతో మనవిచేసి తన ఆసనం అధివసించాడు.

అప్పు డొక పండితబాలుడు (విద్యానాధుని తండ్రి) లేచి,

“త్రిపురసంహారకమైన శివుని మూడవ నేత్రము మీయందు నిలుచుగాక!

“దక్షగర్వాపహారి వీరభద్రుని అఖండ విక్రమము మీ బాహువులయందు నిలుచుగాక!

“తారకాసురసంహారి కుమారస్వామి ఉద్దండ పరాక్రమము మీ హృదయాల యందు నిలుచుగాక!

“గోన గన్నారెడ్డి చోళగజాసురుల చెండాడు దివ్యగజాననావతారుడగు గాక!” అని చేయెత్తి ఆశీర్వదించెను.

11

రాజేంద్రచోడుడు అడ్డులేని పురోగమనంతో చొరబారివచ్చుచున్నాడు. ఆంధ్ర కమలాకరములో చోళహస్తి చొరబడి తామరపూవుల, ఆకుల, తూండ్ల చిందరవందర చేస్తున్నది.

ఉద్ధురగమనములు, పర్వతసమానములు, కుపితములు, నిర్భీకములు అగు గజతండములు యిత్తడి మొనలు తాపడంచేసిన నిశితదంతాగ్రములతో, ముఖ ఫలకములతో, ఆ ఫలకములందు కొండల బద్దలుకొట్టగల నిశితములైన భల్లాయుద్ధములతో, నలుగురు, ముగ్గురు, ఇరువురు వీరులను దాల్చి, మహా ప్రళయమువలె కదలివచ్చుచున్నవి.

ఆ సేనను పొదవికొని పదాతులు, ఇటు, నటు అశ్వికసైన్యాలును, వెనుక రథములు, ఆ వెనుక ఎడ్ల బళ్లు, సామానులు మోయు ఎడ్లు, గాడిదలు, గుఱ్ఱాలు, సాధారణ జనసమూహం, ఇట్లు చోళసైన్యము పదునయిదు గవ్యూతుల పొడవున, అయిదు గవ్యూతుల వెడల్పున వచ్చుచున్నది.

అడ్డులేని ఆ చోళయుద్ధయాత్ర గమనించుచు హిమపర్వతమువంటి ఏనుగును అధివసించి రాజేంద్రచోడ చక్రవర్తి ఠీవిగా వచ్చుచున్నాడు.

ఆ గజయూధాలలో మొదటివరుస కృష్ణఒడ్డున చేరెను. వసంతకాలపు కృష్ణ కృశాంగియై, కొండలలో, రాళ్ళలో, ఇసుక తిన్నెలలో చిన్న చిన్న పాయలుగా జలజలా ప్రవహిస్తున్నది.

రాజేంద్రచోళునికి ఆంధ్రప్రతాపము, యుద్ధరచనాశక్తి పూర్తిగా తెలియును. కావుననే అతని చార సైన్యాలలో కొన్నిదళాలు ఏనుగులకన్న ముందుగనే కృష్ణ దాటే సైన్యాలను రక్షించుటకు వేయి ఆరితేరిన గజాలపై, నాల్గువేల విలుకాండ్రు సిద్ధముగా నున్నారు.

కృష్ణదాటిన చారసైన్యాలు ఈవలిఒడ్డు నిరాటంకము అని తెలుపుచు కొమ్ము లొత్తిరి. కాపుగా ఉంచిన వేయి గజాలుకాక, తక్కిన ఏనుగులు మూడు గవ్యూతుల వెడల్పున కృష్ణలోకి దిగినవి.

ఇంతలో బ్రహ్మాండము పగులునాట్లు అర్పులతో, రుంజల మ్రోతలతో, అల్లల్లభేరా అను పెడబొబ్బలతో ఏబదివేలమంది అవక్రపరాక్రములై న ఆంధ్ర వీరులు చెట్లపై నుండి, గుట్టలపై నుండి, రాళ్ళ ప్రక్కలనుండి లేచిరి. నదిలోనికి దిగిన ఏనుగులపైకి నూనెగుడ్డలుకట్టి వెలిగించిన కాగడాలుగల బాణాలు సువ్వు సువ్వున మహావేగంతో గురిచూచి వేయ ప్రారంభించినారు. గట్టుమీద కాపున్న ఏనుగులను ఆ వైపునుండి ఇరువదివేల సైనికులు అగ్నిబాణాలతో ఎదుర్కొనిరి. ఆ గంధకబాణాలకు నిశితమైన మొనలుగూడ నున్నవి.

ఆ రీతిగానే ఎడమవైపున ఇరువదివేలమంది పోటరులు తాకిరి.

నదిలో దిగిన ఏనుగులు ముందుకు సాగలేక వెనుకకు వెళ్ళలేక అటు ఇటు చెల్లాచెదరై పోవుట కారంభించినవి.

రాజేంద్రచోడుడు ఏనుగుల నిలబెట్టుటకు మహాప్రయత్నాలు చేయుచుండెను. నదిఒడ్డునఉన్న సైన్యాలలో ఒకభాగము తమ్మెదిరించువారిని తలపడవల వచ్చెను. అటులనే ఎడమభాగపు సైన్యమూ చేయవలసివచ్చెను. మధ్యనున్నవారు మాత్రమే నదిలో దిగినవారిని రక్షించుకోగలరు. ఆ స్థితిలో నదిలోఉన్న సైన్యాలను దిగువను, ఎగువను అయిదువందల చొప్పున ఏనుగు దళాలు వచ్చి తాకినవి. గన్నారెడ్డి అశ్వికదళాలతో చోళసైన్య మధ్యమును తాకినాడు. చోళసైన్య పృష్టాన్ని రేచర్ల చినదామానాయుడు తాకినాడు. విఠలధరణీశుడు చోళసైన్యాల ఎడమభుజము తాకినాడు. ఓరుగల్లునుండి భార్యతో పారిపోయివచ్చి గన్నారెడ్డి సైన్యాలను కలుసుకొన్న అక్కినప్రగడ ఒకవైపునా, విరియాల సబ్బనాయకు డొకప్రక్కనా నదిలోని ఏనుగుల యూధాలను తాకినారు. కృష్ణ కీవలిఒడ్డున సూరనరెడ్డి సైన్యాలు గట్టుఎక్కే ఏనుగుదళాలను వెనుకకు త్రిప్పి నదిలోకి దిగి ఆవలిగట్టున ఉండే ఏనుగులపై విలుకాండ్రను ‘ఒక్కా ఓ చెలియా’ అంటూ ఆక్రమించి ప్రాణాలు హరిస్తున్నవి.

“గన్నారెడ్డి! గన్నారెడ్డి!” అని చోళసేనలలో గగ్గోలుపుట్టింది. కొండలలో యుద్ధమన్న గన్నారెడ్డికి చెలగాటము. అతనికి వేలకొలది చెంచులు సహాయము!

మూడుదినాలు రాత్రింబగళ్ళు సంకులసమరము ప్రవర్తిల్లెను. సబ్బ ప్రభువు అక్కినప్రగడలు నదిలోదిగిన వేలకొలది గజాలను తిరిగి తరిమికొట్టిరి. కొన్ని నాశనమైపోయాయి. కొన్ని తమ సైన్యాలమీదే విరుచుకుపడినాయి. చెట్లు, గుబురులు, గుట్టలు, రాళ్ళు గన్నారెడ్డికి పెట్టనికోటలు.

చోళసైన్యాలకు కలిగిన నష్టము విపరీతము. గన్నారెడ్డి వీరులలో వేలకొలది మడిసినారు. చోళసైన్యాలు పలుచబడిపోయినవి. గజములను నాశనముచేసే విధానము గన్నారెడ్డికే తెలియును. వచ్చిన గజములలో వేలకొలది యుద్ధభూమికి బలి అయిపోయినవి. రాజేంద్రచోడుడు నాల్గవనాటి ఉదయము హతశేషమయిన సైన్యాలతో త్రిపురాంతకము దారిని పారిపోయినాడు.

నూతనంగా గోన గన్నారెడ్డి జట్టులో చేరిన ఆ బాలుడు గన్నారెడ్డికి అంగరక్షకుడుగా నుండి తననేర్పు ప్రకటించెను. ఆ బాలకుడు, వాని స్నేహితునితో గన్నారెడ్డిచుట్టు దుర్గమై నిలిచినాడు. జీవకవచమై కాపాడినాడు. గన్నారెడ్డిని రెండుసారులు తనప్రాణమునొడ్డి కాపాడెను. ఒకసారి ఒక ఏనుగు గన్నారెడ్డిపై బడెను. గన్నారెడ్డి గుఱ్ఱము ఆ తాకును తప్పుకోలేకబోయే సమయములో, ఒక శవము తగిలి తూలిపోయింది. మరు నిమిషములో గన్నారెడ్డి తూలి క్రింద పడినాడు. ఆ క్షణములో ఆ ఏనుగు గన్నారెడ్డిపై కాలు వేయబోయెను. అంతట అ నూతన బాలుడు మెరుపువేగాన గన్నారెడ్డికడకు ఉరికి ఏనుగు కాలును ఖడ్గమున కెరగావించెను. ఆ గజము కోపముతో ఈ నూత్నశత్రువును హతమార్పనెంచి తదభిముఖముగా రెండు అడుగులు వేసెను. ఇంతలో గన్నారెడ్డి చెంగున లేచి, ప్రక్కనే నిలిచియున్న తన గుఱ్ఱముమీది కెగిరి ఒక్కయమ్మున మావటీని ప్రాణాలు దివి కెగురవేసినాడు. మావటీడులేని ఏనుగు వెనక్కుతిరిగి పారిపోయెను. గన్నారెడ్డి చిరునవ్వుతో ఆ బాలుని ‘ప్రాణదాతా!’ అని మెచ్చుకొని ముందుకురికినాడు.

12

గోన గన్నారెడ్డి రాజేంద్రచోడుని సైన్యాలు వెనుకకు మళ్ళగానే, తన సైన్యాలను కూర్చుకొని అందరకు బహుమతులు, విజయబిరుదావశులు సమర్పించి మరల సైన్యాన్నంతటినీ సుసంఘటితముచేసి, రాజేంద్రచోడుని పూర్తిగా దాసోహ మనిపించుటకు బయలుదేరెను. రాజేంద్రచోడుని, మూడుచోట్ల తలపడి పూర్తిగా ఓడించినాడు. రాజేంద్రచోడుడు వేయి ఏనుగులు, పదివేల గుఱ్ఱములు, ఏబదిలక్షల బంగారునాణెములు సమర్పించి తన దేశం వెళ్ళిపోయినాడు.

గోన గన్నారెడ్డి, ఆ యూపుననే ఏరువనాడంతయు నాక్రమించెను. ఏఱువనాటి సామంతుడు భీమప్రభువు రెండు సంవత్సరాలక్రితం తొండమండల ప్రభువైన కొప్పరుజింగ పల్లవుడు ఆంధ్రదేశంపై దండెత్తివచ్చి కంచి పట్టుకొన్నప్పుడు అతనికి సహాయము చేసెను. (ఏఱువనాడు ఇప్పటి కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాలలోని భాగాలు కలిసినదేశం) కొప్పరుజింగ పల్లవుడు విక్రమసింహపురం పట్టుకొని మనుమసిద్ది అనే మనుమగండ గోపాలుని తరిమివేసి పాకనాడు, ఆరువేలనాడు, గృధవాడ విషయాలు గడచి రాజమహేంద్రవరము చెంత గోదావరి దాటి ద్రాక్షారామపురములో తన శాసనము వేయించెను.

ఇంతలో కాకతీయ సామంతులయిన చాళుక్యులు, కోన హైహయులు, వెలనాటిచోడులు, అంబరదేవుడు కొప్పరుజింగని సైన్యాలను నాశనముచేసి తొండ మండలమువరకు తరిమివైచిరి.

రాజేంద్రచోడుడు ఎత్తివచ్చుటకుముందే ఏఱువభీముడు తన సైన్యాలతో దొంగచాటుగా కొప్పరుజింగని దారినే వెళ్ళి, ద్రాక్షారామములో శాసనము వేయించి గోదావరీతీరమున మంత్రకూటమువరకు పోయి, దొంగదారులను కాకతీయ సైన్యాలను తప్పించుకొనుచు ఏఱువనాడు చేరెను.

రాజేంద్రచోడుని తరిమి కప్పము పుచ్చుకొని, ఏఱువభీమునిపై గోన గన్నయ్య ఇంద్రాయుధమువలె పడినాడు. భీమునిసైన్యాలు దూదిపింజలై ఆకాశములోనికి చెదరిపోయెను. ఏఱువనాడంతయు గాలించి, భీమనృపుని సామంతులను కొల్ల గొట్టి భీముని పట్టుకొన్నాడు. భీముడు గన్నారెడ్డి పాదాల వ్రాలి, సన్యాసియై దేశాంతరగతుడయ్యెను.

ఏఱువనాటికి సబ్బప్రభుని సామంతునిచేసి సింహాసన మెక్కించి ఆంధ్రదేశమును కన్నెత్తిచూచిన తొండమండలపు కొప్పరుజింగనికి బుద్ధి చెప్పుటకు గన్నారెడ్డి తొండమండలముపై దాడిచేసెను. ఆంధ్రసైన్యాల వేగ మప్రతిహతము. హిమాలయపర్వతపు లోయలనుండి పరవళ్ళెత్తివచ్చే గంగానదివలె తొండమండలముపై బడిన గన్నారెడ్డి ధాటికి నిలువలేక కొప్పరుజింగని సైన్యాలు చెల్లాచెదరైపోయెను. ఆ మహా సంగ్రామములో కొప్పరుజింగని బందీచేసి గన్నారెడ్డి రాజధనాగారము దోచినాడు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండ యుద్ధము నెరవేర్చి, కొప్పరుజింగని కోరలు ఊడబెరికి, విషం పిండి, ముందు ఆంధ్రదేశముపై కన్నెత్తితే తొండమండలము సముద్రమట్ట మొనర్తునని ప్రతిజ్ఞచేసి అయిదువేల ఏనుగులతో, వజ్రవైడూర్యాది రత్నరాసులతో, ఏనుగులు మోయలేని బంగారు రాసులతో వానాకాలము రాకమున్నే తన రహస్యనగరం చేరెను.

గన్నారెడ్డి దుర్నిరీక్ష్యతేజస్కుడై సకల ధనరాసులతో, సర్వసైన్యాలతో తన నగరం చేరి సైనికులకు, నాయకులకు వెలలేని బహుమతు లిచ్చి కాకతీయ రుద్రదేవి సామ్రాజ్ఞికి పదిలక్షల ఫణాలు, రెండువేల ఏనుగులు, పదివేల గుఱ్ఱాలు, రత్నాలు కప్పముగా పంపించెను.

ఓరుగల్లు కోటలో రుద్రమహారాజు, శివదేవయ్యమంత్రి, బాప్పదేవుడు, ప్రసాదాదిత్య నాయకుడు గన్నారెడ్డి యుద్ధయాత్రలకు ఆశ్చర్యము పొందినారు. రుద్రదేవి సామ్రాజ్ఞి సకల భారతావనిలో కీర్తినందిన ఈ గజదొంగ విషయము ఆలోచింప పేరోలగమున రాకాచంద్రునిలా తేజరిల్లుచు పురుష సింహాసనాసీన యయ్యెను.

శివదేవయ్యమంత్రి లేచి, “శ్రీశ్రీ రుద్రదేవ మహాప్రభూ! గోన గన్నారెడ్డి గజదొంగ కావటం మన దురదృష్టమూ అదృష్టమూ కూడా! అలాంటి వీరుడు తమకు దక్షిణభుజంగా ఉండవలసినవాడు. ప్రజలు అతని పేరుచెప్పి దీపం పెట్టుకుంటారు. ఒక్కరైతు కష్టంలో ఉన్నాడని గన్నారెడ్డికి వార్త వెళ్ళినదా, ఆ రైతుఇంట ధనరాసులు కురిసినవన్నమాటే! బ్రాహ్మణుడు వ్యధపడుతున్నాడంటే అ వెంటనే గన్నారెడ్డి ఆ బ్రాహ్మణుని ఇంట కల్పవృక్షము పాతినాడన్న మాటే! ఎక్కడై నా మన సామంతుడెవరన్నా ప్రజలను పీడిస్తున్నాడంటే గన్నారెడ్డి స్వయంగా అక్కడ ప్రత్యక్షం. ఆ సామంతుడు క్షమార్పణ అర్పించాలి. ప్రజలఎదుట దోషిగా నిలబడాలి. లేకపోతే గన్నారెడ్డే ఆ సామంతుని ప్రజల ఎదుట మునికోలతో శిక్షించినాడన్నమాటే!

“ఏ మహాదేశానికై నా ఒక్కొక్కప్పుడు చిక్కులు సంభవిస్తూ ఉంటవి. గద్దె దిగే ప్రభువు ముసలివాడై, ఎక్కేప్రభువు బాలకుడై నప్పుడు ఈ ప్రళయం సంభవిస్తూ ఉంటుంది. శ్రీ రుద్రమహాప్రభువు పృథ్వి అదృష్టం వల్ల సింహాసనం అధివసించారు. ఆమె స్త్రీ అనే ఉద్దేశంచేత అనేకమంది సామంతులు రాజద్రోహులై నారు. వెంటనే ఈ మహదాంధ్రభూమి అట్టి ద్రోహులను గన్నారెడ్డి పట్టి పాలార్చి, దేశాన్ని నిష్కంటకం చేశాడు. ఆంధ్రసామ్రాజ్యానికి శిలావప్రమై నిలిచినాడు.

“ఈ మధ్య రాజేంద్రచోడుని ఓడించి, ఏఱువభీముని దాసోహ మనిపించి, కొప్పరుజింగని పారద్రోలి, సామ్రాజ్యంలో ఛిద్రాలను నాశనం చేశాడు. గజదొంగ అయినందుకు నిజంగా గజాలు వేలకొలది ప్రతి యుద్ధంలో అపహరించినా డా యువకప్రభువు. చక్రవర్తి సింహాసనం మ్రోల కోట్లకొలది బంగారురాసులు, రత్నరాసులు కానుక లర్పించినారు.

“అలాంటి మహావీరుడు నిజరాజ్యాన్ని చేపట్టి ఏలుకోవలసిందని శ్రీ చక్రవర్తి కోరదలచుకొన్నారు.

“ఇది ఒక విషయం. రెండవది: దక్షిణాన్నుంచి వచ్చిన ప్రళయాన్ని గన్నారెడ్డి అడ్డుపెట్టినారు కాని అంతకన్న మహత్తరమైన ప్రళయం ఉత్తరం నుంచి వస్తున్నది. దేవగిరి యాదవరాజు కృష్ణభూపతి మరణించాడు. ఆయన కుమారుడు మహదేవరాజు దేవగిరిపతి అయినాడు. తండ్రిమరణాన్ని ఎదురు చూస్తున్న మహదేవరాజు సర్వసన్నద్ధుడై ఉన్నాడుగనుక ఇక మన దేశంపై పడడానికి అడ్డుఏమీలేదు.

“అదీగాక ఆయన సింహాసనం ఎక్కిన దినాన కవీశ్వరులు ఆయన్ను పొగడుతూ ‘మహదేవరాజు వీరకంఠీరవుని ప్రతాపానికి భయపడి మాళవులు ఒక, బాలకుని, ఆంధ్రులు ఆడదాన్ని సింహాసనం ఎక్కించారు’ అని కావ్యాలల్లారట. పిల్లలను, ఆడవారినీ మహదేవరాజు ఏమీ చేయడట. కాని వారి వారికి రాజ్యార్హత లేదు. కాబట్టి వారి రాజ్యాలుమాత్రం తాను తన ఛత్రచ్ఛాయలకు తీసుకొని అనుగ్రహిస్తాడట.”

అని శివదేవయ్యమంత్రి చెప్పగానే ఒక్కసారిగా “మహదేవరాజును పిండి గొట్టండి. ఆంధ్రులు పిల్లులో, బెబ్బులులో చూపండి. రుద్ర చక్రవర్తికి జయ! జయ!, అని కోలాహలం వినబడింది.

13

కృష్ణవేణ్ణానది అందాలు, విలాసాలు అన్ని ఋతువులలోనూ గోన గన్నారెడ్డి సందర్శించి ఆనందపరవశుడు అయ్యేవాడు.

గన్నారెడ్డిని వీరాధివీరునిగా ఎంచి, చూపులతో, మాటలతో, చేతలతో పూజించే ఆ బాలునితో కలిసి నిప్పులు చెరిగే ఆ వేసవికాలపు సాయంవేళల గన్నారెడ్డి కృష్ణాతీరానికి వచ్చేవాడు. గన్నారెడ్డితోపాటు వంతులచొప్పున సైనికులు గూడ కృష్ణాతీరానికి వచ్చేవారు.

తొండమండల జైత్రయాత్రానంతరం చాలమంది వీరులు, నాయకులు, సేనాపతులు తమ తమ నాడులకు, గ్రామాలకు వెళ్ళిపోయారు. గన్నారెడ్డి మాత్రము తన రహస్యనగరంలోనే ఉన్నాడు. విఠలధరణీశుడు తన అక్క కుప్పమాంబాదేవిని, బావ గుండయమహారాజును చూడడానికి వెళ్ళాడు.

ఆంధ్రదేశంలో స్వతంత్రత సంపాదించుకొందామని ఆశించిన సామంతులలో కొందరు నాశనం అయ్యారు. కొందరు దాసోహమన్నారు. కొందరు పారిపోయి దేశాలు పట్టారు. తన గజదొంగతనం ఇక దేశానికి అవసరం లేదా కృష్ణవేణీ అని ప్రశ్నించుకుంటూ ఏదో నిర్వచింపలేని హృదయవేదనలో గన్నారెడ్డి కృష్ణఒడ్డున కూరుచున్నాడు. ఆయన మౌనం బరువుగా కృష్ణానదీ జలాలలోనికి ప్రవహిస్తున్నది. ఆయన ప్రక్క నీలజలాలను పారకించి చూస్తూ గోన గన్నారెడ్డికి అంగరక్షకుడై న విశాలరెడ్డి ప్రక్కనే కూరుచుండి ఉన్నాడు.

వీరిద్దరికి దూరంగా నీళ్ళలో కాళ్ళుఆడిస్తూ ఆ బాలుని స్నేహితుడు మల్లికార్జుననాయకుడు ఒక బండరాతిమీద కూర్చొని అన్నాడు.

వేసంకాలపు మత్తు ఆ నదిమీదనుండి ప్రసరించే గాలిలో నిండి ఉన్నది. అడవిపూవుల సువాసన ఆ మత్తుకు ఇంకను భారము సమకూరుస్తున్నది. ఆ పరీమళములు నీటి పరీమళాలు, చిగురులసౌరభాలు, మోదుగపూలు, తంగేడులు ఆ ప్రదేశాన్ని వైకుంఠవనంగా చేస్తున్నవి. వేసవి సాయంకాలాలలో, శీతకాలపు రాత్రులలో, వానకాలపు పగళ్ళలో, వసంతకాలపు దివారాత్రాల పొడుగునా స్వప్నాలు లోకం అంతటా ప్రసరిస్తూ ఉంటాయి. గన్నారెడ్డి హృదయంలోనికి మూడు స్వప్నాలు ఒక్కసారిగా చొచ్చినాయి.

తాను వర్థమానపుర సింహాసనం అధివసించి తన రాజ్యం యావత్తూ నందనవనసదృశం చెయ్యాలని ఒక కల, రెండవ స్వప్నం తన చక్రవర్తి మహసభలో సర్వదేశాలవారు రుద్రచక్రవర్తి పాదాల తమ తమ కిరీటకాంతులు వెలిగింపగా నమస్కారాలు సలిపి జయధ్వానాలు పలుకుతూ ఉండగా చూడాలని. మూడవ స్వప్నానికి స్పష్టత లేదు రాసిపోసిన పూలకు రూపములేనట్లు ఆ స్వప్న మొక కదంబము. దూరాన ప్రత్యక్షమయ్యే ఒక ప్రకృతిదృశ్యం; రేకలులేని ఒక వెన్నెలప్రవాహము. దరులుముంచెత్తే సువాసనల వాన. ఒక మధుర ప్రళయం.

యుద్ధం అతనికి సుపరిచితం. యుద్ధంలో ఆతని బుద్ధి నిశితము. ఆతనిశక్తి నిరుపమము. అతనిధాటి అప్రతిహతము. మనస్సు వినిర్మలము,

యుద్ధవ్యవహారాలు, రాజకీయాలు, వ్యవసాయము, పరిపాలన ఆ యువకునకు బాగా తెలుసును. చదువుకున్నాడు. కాని మతాలు, ధర్మాలు, తత్వవిచారణ, పరలోకము వీనినిగూర్చి ఆ ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. రాచరికము, ప్రజాసంసారము ఆయన నిర్వహించగలడు. స్త్రీ ఏమి? పురుషుడేమి? వారి సంసారమేమిటి? అన్నప్రశ్న ఆలోచించడానికే ఆయనకు భయం.

తన మంత్రి, స్నేహితుడు అగు అక్కిన యుద్ధంకాగానే అత్తవారింటికి పరుగెత్తినాడు. యుద్ధసమయంలో మూడుదినాల కొకపర్యాయం చారులచే మామగారికి, భార్యకు కమ్మలు పంపేవాడు. భార్యను కలుసుకున్నప్పటి నుండి అక్కిన పూర్తిగా మారిపోయాడు. అంతకుపూర్వం సూర్యరశ్మిలా ఉన్నాడు. ఇప్పుడు వట్టి వెన్నెల్లా మూర్తితాల్చాడు. యుద్ధంలో ఇదివరకు ప్రాణలక్ష్యం లేకుండా పోరాడేవాడు. ఇప్పుడు జాగ్రత్త ఎక్కువయింది.

ఓరుగల్లులో అక్కినచరిత్ర దశకుమారచరిత్రలో ఒకకథవంటి దయింది. చక్రవర్తి పేరన చినఅక్కినను ఆయన తాత బందీచేశాడు. అతన్ని కారాగృహంలో ఉంచవలసిందని నగరపాలకుడగు ప్రసాదాదిత్య ప్రభువునకు మనవి చేసెనట. ఆయన ఈ విషయంలో తమకు సన్నిహిత సంబంధం ఎక్కువ ఉండటంవల్ల కార్యనిర్ణయభారం ముఖ్యమంత్రిపై నిడెనట.

శివదేవయ్య దేశికులు, ఆ భార్యాభర్త లిద్దరికి యింటిలోనే బంధనమని ఆజ్ఞ పంపించారట. ఆ ఆజ్ఞ వచ్చిన మూడవదినాన భార్యాభర్త లిరువురూ కావలి కాచే వీరభటుల కన్నుగప్పి, ప్రోలేశ్వరము పారిపోయి వచ్చారట. అక్కడ భార్యను వదలి అక్కిన తన్ను కలుసుకున్నాడు.

రాజవ్యవహారాలు మాట్లాడేటప్పుడు తక్కతక్కిన సమయాలలో అక్కిన ఏదో విధంగా తన భార్యాప్రస్తావన వచ్చేమాటలే మాట్లాడుతాడు. స్త్రీ ఎలాంటి వీరుణ్ణయినా భీరువును చేస్తుందికాబోలు!

గోన గన్నారెడ్డి అక్కినను తలచుకొని అసహ్యించుకొన్నాడు. అక్కినకు ఈ మధ్య కవిత్వపు వెఱ్ఱి ఎక్కువైంది. ప్రొద్దస్తమానమూ గాథాసప్తశతి, శృంగార శ్లోకాలు చదువుతున్నాడు.

ఒక దినాన వారిద్దరికి జరిగిన సంభాషణలో అక్కిన అన్న ముక్కలు చటుక్కున జ్ఞాపకం వచ్చినవి గన్నారెడ్డికి.

“బావగారూ! జీవితానికి పరమావధి మోక్షం. మోక్షానికి దారి జ్ఞానపూర్ణ భక్తి. భక్తికి ఉత్తమరూపం కావ్య సంగీత, నాట్య, చిత్రశిల్పాది విద్యలు. ఈ విద్యలకు ప్రాణం రసము. ఈ రసాలలోకి మకుటము శృంగారరసము. అది తెలియడానికి స్త్రీని ప్రేమించాలండీ!” అని

సంతానంకోసం స్త్రీని కామింపవచ్చును. అది మానవజీవిత యుద్ధంలో ఒక వ్యూహరచనవంటిది. వివాహం ఒక సంస్కారం. ఇష్టమున్నట్లయితే ఆ సంస్కారం నెరపవచ్చును; లేకపోతే బ్రహ్మచారిగా ఉండవచ్చును. పున్నామ నరకం తప్పించుకొనటానికి పెళ్ళిచేసుకునేవారు చేసుకోవచ్చును. కావ్యాలలో నాయికా నాయకులు పరస్పరం చూడగానే ప్రేమించారు. కాళిదాసాదులు రచించిన కావ్యసౌందర్యాలేగాని జీవితసత్యా లెట్లాఅవుతాయి?

ఈ ప్రశ్న మనస్సులో ఉదయించగానే, గన్నారెడ్డి పక్కున నవ్వు వచ్చింది.

14

గన్నారెడ్డి పక్కున నవ్వగానే ఆ ప్రక్క కొంచెం దూరంగా కూర్చుండి తన పెద్ద కళ్ళతో మధ్యమధ్య గన్నారెడ్డిని చూస్తూఉన్న విశాలరెడ్డి ఆశ్చర్యముతో,

“ప్రభూ, ఎందుకు అలా నవ్వుతున్నారు?” అని ప్రశ్నించాడు.

గోన గన్నారెడ్డి ఉలిక్కిపడి, స్త్రీకంఠంలా విని ఆ బాలుని మోము తేరిపారచూచి, ‘ఎక్కడనో చూచినట్లు ఉంది! నువ్వుకూడా ప్రేమ అనే శక్తి ఒకటి ఉందని నమ్ముతావా?’ అని ప్రశ్నించాడు.

విశా: నమ్ముతాను ప్రభూ!

గోన: ఎలా నమ్ముతావు? నీకు తార్కణం ఏముంది?

విశా: నేనూ జీవితంలో కొన్ని ప్రేమసంఘటనలు దర్శించాను.

గోన: నీ యీడు?

విశా: పందొమ్మిది ఏళ్ళు.

గోన: నిన్ను చూస్తే పదారేళ్ళ బాలకునిలా ఉన్నా, నీ విక్రమం మాత్రం ఈడును మించినదయ్యా!

విశా: నన్ను పొగడకండి మహారాజా!

గోన: నేను పొగడేవాణ్ణికాను. ప్రేమవిషయంలో నీ అనుభవమేమిటి?

విశా: మహాప్రభూ! నాజీవితంలో ప్రేమ అనే ఒక విచిత్రశక్తి ప్రవేశించింది. అంతవరకూ మీకు మనవిచేయగలను. తక్కిన విషయాలు రహస్యమైనవి.

గోన: నాకు ప్రేమ విషయం చెప్పవయ్యా వీరబాలుడా అంటే, నీ ప్రేమను గురించి చెప్పమని నేను కోరటంకాదు. మన అక్కిన ‘ప్రపంచములోని శక్తులన్నిటికన్న ప్రేమ అనేది మహోత్తమ, మహత్తర శక్తి’ అని వాదిస్తాడు.

విశా: ఆయనమాట నిజమనే నా నమ్మకం.

గోన: ఎట్లా? విశా: పశువులలో స్త్రీ పురుషాకర్షణ జంతుధర్మం. మనస్సు కలిగిన మనుష్యుడు ఆ జంతుధర్మాన్ని దివ్యధర్మం చేసినాడు. దానినే ప్రేమ అంటాము.

గోన: జాగ్రత్తగా ఆలోచించి ఒక ధర్మం నిర్ణయించినట్లా?

విశా: అదికాదు ప్రభూ! పశువులలో తల్లిబిడ్డల ప్రేమ, బిడ్డల చిన్నతనం వరకే! ఆ పైన ప్రేమలేదు. ఆ భావమే ఉండదు. బిడ్డ తల్లికి భర్త కావచ్చును.

గోన: కావచ్చు నేమిటి? అవుతున్నాయి!

విశా: జంతువులలో సహోదరప్రేమ లేనేలేదు!

గోన: సరే, ఇంక నీ వనేది మానవులలో మాతృప్రేమ, సోదరప్రేమా ఉన్నట్లు స్త్రీ పురుష ప్రేమా ఉందని. ముసలివార లైన స్త్రీపురుషులకు దాంపత్య ప్రేమ ఎట్లా సాధ్యమవుతుంది?

విశా: మహాప్రభూ! స్త్రీపురుష ప్రేమ సర్వకాలమూ దాంపత్య ప్రేమగా ఉండాలనేదిలేదు.

గోన: ఓయి యువకనాయకుడా! ఇంత చిన్నతనంలోనే ఇంత విచిత్రభావాలు నీ కేల్లా అలవడినాయి?

విశా: మహాప్రభూ! ప్రచండ విషయాలు గమనించడానికి ఈడుకూడా అడ్డంరాదు ఒకప్పుడు.

గోన: జ్ఞానమౌక్తికాలు ఒలికిస్తున్నావు విశాలప్రభూ! నువ్వు నా మనస్సును దొంగిలించినావు. గజదొంగకే దొంగవయినావు!

విశా: (చిరునవ్వు నవ్వుతూ) మహారాజా! మీ వస్తువు లెవ్వరు దొంగతనం చేయగలరు?

గోన: ఈ వేసవికాలం పూర్తికాకుండా ఆంధ్ర సామ్రాజ్యాన్ని దొంగతనం చేయడానికి దేవగిరి యాదవుడు వస్తున్నాడు. మన సైన్యాలన్నీ చెల్లచెదరై ఉన్నాయి. ఇంక పదిహేనురోజులలో మళ్ళీ సైన్యాలన్నీ చేర్చవలసి ఉంటుంది. సరేకాని విశాలాక్షనాయక అనేపేరు మీకు ఎలా వచ్చిందయా? మీ తండ్రిగారు కాశీ వెళ్ళారా?

విశా: అవును మహారాజా! మా తాతగారు కాశీ వెళ్ళారట. అక్కడ నుంచి వచ్చిన నెలరోజులకు నేనుపుట్టితినట.

గోన: బాగుంది. చీకటిపడింది. మనవారిని కాగడాలు వెలిగించమనండి. నెగళ్ళుచేసి మన శిబిరంచుట్టూ అప్రమత్తులుగా ఉండమనండి. మనం భోజనానికి వెడదాం.

కృష్ణఒడ్డునే ఒక ఇసుకతిప్పపై గోన గన్నారెడ్డికి, విశాలాక్షప్రభువుకు మల్లికార్జున నాయకునకు విడివిడిగా పటకుటీరలు నిర్మించారు. ఆ ప్రక్కనే వంటకుటీరా లున్నాయి. దూరంగా సైనికుల కుటీరాలు నిర్మించినారు, భోజనశాల వేరు, స్నానశాలలు వేరు. విశాలాక్షప్రభువు విడిగా కృష్ణలో ఎక్కడో స్నానంచేసి వచ్చేవాడు.

మువ్వురూ కలిసి భోజనాలుచేసి ఆ సైకతాలలో కొంతకాలము కూర్చుండి మాట్లాడుకొన్నారు. గన్నారెడ్డికి ఉద్భవించిన ఆవేదన ఇట్టిదని ఆయనే నిర్ణయించుకోలేకపోయినాడు. మంచముపై మేనువాల్చి, ఎంతకూ నిద్దురపట్టక లేచి కూర్చుండినాడు. పక్కపై మేనువాల్చిన మరునిమేషాన గాఢనిద్రబోయే తాను నేడు నిద్దుర పట్టక ఇలా రాత్రించరుడగుటకు కారణము రేపు రాబోయే మహాదేవరాజు జైత్రయాత్రవల్లనా?

అతడు రావచ్చును కాని తిరిగి వెళ్ళుట ఆతనికి వశమా? ఇంక ఎవరో మహారాజద్రోహి ఒక డున్నాడు తమకు ఒకనిపై చాల అనుమానమున్నది. నిశిత బుద్ధికల అపసర్పులను నిజము కనిపెట్టుడని తాను పంపించాడు. తన అనుమానము నిజమయితే, కర్తవ్యము వెంటనే తనవారందరితో ఆలోచించి తగిన ప్రతీకారము సలుపవలసియుండును.

ఈ బాలుడెవ్వడో ఉత్తముడు. కాని తన జీవితములో ఏదో దాచుచున్నాడేమో? నుడికారము చూడగా ఈతడు ఈ చుట్టుప్రక్కలవాడేనని స్పష్టము. కొఱవిదేశంనుంచి, సబ్బిసాహిరమండలంనుంచి వచ్చినట్లు నమ్ముటకు వీలులేదు. ఇంతలో గోన గన్నారెడ్డి ప్రభువు నిద్దురకూరినాడు.

15

తన మందిరములో విశాలాక్షిరెడ్డి నిద్దురపట్టక చాలసేపు మేలుకొని ఆలోచించుకొనుచు కూరుచున్నాడు. గన్నారెడ్డి ప్రభువు తన హృదయములో ప్రేమ లేదందురేమి? మనుష్యుని జీవితం ప్రేమ లేకుండ ఉండగలదా? ప్రేమలేని మనుష్యుడు మనుష్యుడా? ప్రేమగలవాడు మనుష్యుడు కావచ్చును. ప్రేమకు వ్యతిరేకమైన ద్వేషముకలవాడును మనుష్యుడు కావచ్చును. కాని ఈ రెండునూ లేనివారు లోకాతీతులై ఉండవలె. లేక ప్రేమ ఎరుగని జంతు స్వరూపులు కావాలి!

గన్నారెడ్డి ప్రభుని ప్రేమను చూరగొనగల బాలిక ఉదయించలేదు కాబోలు! అందులో ఈ ఉన్నతవంశాలలో సాధారణంగా ప్రేమకు తావులేదు. రాజకీయావసరాలకు వివాహాలు జరుగుతాయి. ఆ దాంపత్యములో భార్యాభర్తలు బిడ్డలగనుచు స్నేహితులౌతారు. స్నేహితులుకాకుండ విరోధులయ్యే భార్యాభర్తలు ఉన్నారు. ఒక్కొక్కప్పుడు స్నేహము ఉత్తమ ప్రేమగా మారిపోతుంది.

రుద్రదేవ చక్రవర్తిని శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజును గాఢముగా ప్రేమించుచున్నారు. వారిరువురకు వివాహమయినచో మహోత్తమ ప్రేమగల దంపతులు లోకానికి ప్రత్యక్షమగుదురుగదా! గన్నారెడ్డి ప్రభువు హృదయము చాల గుప్తమగుట యేలనో? ఆయన హృదయము నవనీతము. శత్రువును నాశనము చేయుటలో ఎంత దుర్నిరీక్ష్య తేజోవంతు లాయన కాగలరో, యుద్ధేతరకాలంలో అంత సుకుమార చరిత్రులు అయిపోతారు. యుద్ధములో దెబ్బతిన్న శత్రువులకుకూడా తల్లి వలె ఆయన వైద్యము చేయించును. గ్రామాలజోలికి, పశువులజోలికి వెళ్ళనే వెళ్ళడు. ఇట్టివాడు గజదొంగయా?

తన కీ సమస్య కృష్ణవేణీదేవియే ఒకనాడు విడదీయవలసి ఉండును. ఓహో కృష్ణవేణి అంటే గన్నారెడ్డి ప్రభువుకు ఎంతప్రేమ! ఒకవేళ ఆ దేవి ఆయన మనస్సు పూర్తిగా చూరగొన్నదేమో?

ఇంతలో విశాలాక్షప్రభువు స్నేహితుడు ఆ ప్రక్క మందిరంలో పండుకొన్నవాడు లేచివచ్చి, ‘ప్రభూ! నిద్రపట్టలేదా తమకు? మంచినిద్దురలో ఉన్న నాకు మెలకువ వచ్చి, మీరు మేలుకొని ఉండుట చూచి లేచివచ్చాను.’

విశా: అవును మల్లికా! ఈలా పురుషవేషాలతో ఆ తల్లి విశాలాక్షి మీదే భారంవైచి వచ్చాము.

మల్లి: నిదురలోనున్నా మనం ఏమరుపాటుగా ఉండకూడదనుకుంటే మీరు తేలిపోతున్నారేమి అమ్మా?

విశా: దినదినమూ వారితో ఉండి, ఆ మహాపురుషుని చరిత్ర గమనిస్తూ నే పడే వేదన అణచుకుంటూ, పైకి పురుషునివలె నటించడం దుర్భరమే అవుతూ ఉంది మల్లికా!

మల్లిక: రాజకుమారీ! ఏంచేద్దాము? వెళ్ళిపోదామా? అయినా, మనం వచ్చిన పవిత్రదీక్షా విజయం పొందకుండా వెళ్ళిపోతే తలవంపుకాదా?

విశా: మల్లికా! నీ కది పవిత్రదీక్షయేమో, నాకుమాత్రం ఇదంతా స్వలాభపూరితమైన పనికాదా అనిపిస్తున్నది.

మల్లిక: మీరది ఏమనుకున్నాసరే. మనం వేసిన వేషాలు కట్టుదిట్టంగా ఉన్నాయి. అందుచేతనే గన్నారెడ్డిప్రభువు మిమ్ము ఆనవాలు పట్టలేకపోయారు. వచ్చినందుకు ఈ మధ్యను జరిగిన గజయుద్ధంలో పాల్గొన్నాము. తాము రెండు సారులు గన్నారెడ్డిప్రభువు ప్రాణం రక్షించారు.

విశా: అదే మరింత కష్టంగా ఉంది మల్లికా! ఒకవేళ నేను ఎవరో ఆ మహాపురుషుడు గుర్తించి కృతజ్ఞతతో నన్ను ఉద్వాహం చేసుకుంటానని అనవచ్చు. వ్రతనియమం పాలనచేయలేనివాడు వివాహమే చేసుకొనకపోవచ్చు.

మల్లిక: ఏమి అనుమానాలండీ మీవి?

విశా: వచ్చాము, ఇంతవరకూ గౌరవంగా బయటపడ్డాము. ఇంక ఈ విషయంలో గజిబిజిలు రాకుండా చల్లగా రుద్రదేవి సామ్రాజ్ఞికడకే వెళ్ళిపోదాము. మల్లిక: అదీ నిజమేనండీ! నాయనగారు తాముచేసేపనికి విచారిస్తున్నామనీ, అమ్మాయి ఇష్టములేకుండా ఏపనీ చేయమనీ, రుద్రదేవ చక్రవర్తికి తా మిక ముందు నమ్మకమయిన బంటుగా ఉండి వారిఆజ్ఞ శిరసావహిస్తామనీ తెలుపుతూ ఓరుగల్లు రాయబారం పంపారని నిన్న ఇక్కడకు వేగు వచ్చింది.

విశా: మల్లికా! అమ్మగారినీ, నాన్నగారినీ చూడాలని ఉంది. అయినా మహాదేవరాజు ఓరుగల్లుమీదకు దండెత్తి వస్తున్నాడట. ఈ సమయంలో శ్రీ రుద్రదేవి గారిదగ్గర నేను ఉండా లనిపిస్తున్నది.

మల్లిక: మంచిది రాజకుమారీ!

మల్లిక లేచివెళ్ళి తన ప్రక్కమీద పండుకొని, అన్నాంబిక అన్నమాటలే ఆలోచించుకొనుచు కళ్ళు తెరిచియే ఉన్నది.

అన్నాంబిక హృదయమా, గన్నారెడ్డిప్రభువుపై లగ్నమైనది. అందులకే కదా రుద్రదేవి చక్రవర్తిని ఆలోచనపై ఈ బాలిక వేషాలతో వా రిరువురు గన్నారెడ్డిప్రభువుకడకు వచ్చినది. మన మనోరథాలు నెరవేరుచున్నంత వరకూ తికమక లేమీ లేక ఆనందము ప్రసరించుచుండును. ఏమాత్రము తారుమారైనను మనుష్యుని దినచర్యలో ఎన్నిమార్పులో వచ్చునుగదా! అన్నాంబిక, మల్లిక వెళ్ళగానే బిడ్డవలె నిద్రపోయెను.