గుసగుస పెళ్ళి/దానికే మందు

వికీసోర్స్ నుండి


దానికే మందు

అప్పుడు నా కింకా పాతిక బొటాబొటీ, మాబలగం అయిదారుగురం ఉండేవాళ్ళం. కొందరు నలభైయోపడిలో పడ్డ వాళ్ళున్నా, ఒకొక్కడు ఓ వంద కోతుల పెట్టు. ప్రతీ వాడూ ఒక అచ్చాడీ, అనగా మరేంలేదు, రాళ్ళుతిని హరాయించుగునే రకం. అచ్చయ్య ఒకడు. అచ్చయ్య పచ్చగా మిసమిసలాడుతూ తాడెత్తున ఉండేవాడు. ఎదేనా వచ్చిందంటే ఎదరవాడి కణతమీద టపాకాయిలాంటి లెంపకాయి పేల్చి మరీమాట్టాడేవాడు. తరవాత, ఉండ్రంముక్కల్లాగ రామయ్య కామయ్యలుండేవారు. వాళ్లని శ్రావణ భాద్రపదాలని పిలవడంకూడా కద్దు. వాళ్లిద్దరూ చెరో వామనావతరం అవడంవల్ల వాళ్లు ఇతరుల్ని కొట్టిన లెంపకాయలు ఎప్పటికప్పుడు దూసుగుపోతూచ్చినా, దెబ్బలాటల్లో మాత్రం కాళ్లసందుల్ని ఉడుముల్లాగ దూరిపోయేవారేమో, ఛస్తే అందేవారు కారు. ఆపైని జానికిరామయ్య ఒకడు. జానికిరామయ్యకి భజనంటే సరదా. నాకూను, అయితేం జానికిరామయ్య చాలా గడసరి. మేం ఇద్దరం కాస్త పై హంగుకి ఉండేవాళ్లం. ఓబయ్య ఓడు. ఓబయ్య స్తబ్దు, ప్రతీ పన్లోనూ జొరబడి, దిగబడి, కూరకుపోయి ప్రతీపని నిప్పక్కర్లేకుండానే తగలపెట్టేవాడు. అందుకని, మాలో ఎవడికి ఎందుకు ఎవడిమీద అక్కసు వచ్చినాసరే వాడెళ్లి అమాంతంగా ఓబయ్యని తనివితీరా తిట్టేవాడు. వాడవన్నీ మహారాజులా నవ్వుతూ పడేవాడు. మా జనం సంకల్పమాత్రంలో కలుసుగునే వారు. ఊళ్లో ఏవళ్ళేనా తమరిదోడ్లో చెట్టున కాసిన దబ్బకాయలు లాంటివి ఊరగాయెట్టుగోడానికి సాయంత్రం పడకుండా ఉప్పూకారం వగైరా రైటుచేసుగుని, మొన్నాడు ఉదయాని కప్పుడూ ఊరగాయి కుండలో పడ్డట్టు ఊటలూరి రొట్టలేస్తూండేవారనుకోండి! మా వాళ్లు ఎల్లానో ఆ వాసన తగిలి, పోగై, ఆ రాత్రే చెట్టు సమూలంగా దులిపి, తెల్లవారేసరికి చెట్టుకాయలు సరేసరి ఆకులు కూడా ఊడ్చేసి మోడులాగ చేసి, “ ఇహను ఈ చెట్టు పట్టిగెళ్లి పోయిలో పెట్టుgOMడి” అన్నట్టు అట్టే పెట్టేవాళ్లు. మొన్నాడు యజమాన్లు, ఆచారప్రకారం, కోసినవాళ్లని ఎల్లానూ దుమ్మెత్తి పోస్తూండేవారు కనక, ఆ సుముహూర్తానికి మేంకూడా వెళ్లి యజమాన్లకి మద్దత్తె ఉమ్మడితిట్లు తిట్టేవాళ్లం (ఓబయ్యని మనస్సులో పెట్టుగుని - పాపాలకల్లా భైరవుడు!). అల్లాంటి పన్లు మావే అయుంటాయి అని జనం అనుకునేవారు గాని, సాక్ష్యం లేకపోడంవల్ల, ఎవరూ ఏమీ అనలేకపోయేవారు. పై చెప్పిన అర్జెంటు కేసుల్లోనే కాకుండా, ఇతరప్పుడు, అనగా, ఏవర్నేనా ఓపాం పసికట్టడం అంటే, మరి ఎప్పుడేనా ఊరు అంటుగోడం అంటే , ఎదేనా ఓబరవు కదిలించడం అంటే, లాంటి ప్రమాదాలలో కూడా కలిసి, మేం జనానికి యథాశక్తి సాయితా అవుతూండడంవల్ల మమ్ముల్ని జనం అసలు ఏమీ అనలేకపోయేవారు. ఇల్లాంటి గ్రామ సంబంధమైన స్వల్పాల్లో మాత్రమే కాక, వ్యాజ్యాలూ, సప్తాహాలూ, యాత్రలూ, తీర్థాలూ, లాంటి గ్రామాంతర దండయాత్రలు కూడా మేం కలిసే చేసేవాళ్లం.

ఓసారి, మమ్మల్ని ఓబయ్య, కురుపు సలిపినట్టు సలపగా, మేం క్షేమగిరియాత్ర బయలుదేరాం. వెళ్ళేది యాత్రగదా అని చెప్పేసి, వీలునుబట్టి, ఎవడికితోచిందివాడు మూటకట్టుకున్నాడు. నేను అప్పడాలు పుచ్చుకున్నాను, మరోడు అటుగులు పట్టుగున్నాడు, ఇంకోడు పెసరపప్పు తెచ్చాడు. సరి ఓబయ్య ఉప్పు కొనుక్కొచ్చాడు. కాని మా ఊరికి కొన్ని మైళ్లదూరంలోనే ఓ యేరు దాటాలి. అది దాటడంలో చిన్న అవాంతరం ఓటి తప్పిందిగాదు. అసలే అది చిన్నడింగీ, ఆవకాయ పెచ్చులాగా! పైపెచ్చు, ఓబయ్య అందులో అడుగున పడుకుంటే తూకంగా ఉండునా, ఓవేపు అంచుమీద కూచ్చున్నాడు, మహా! నట్టేట్టోకి వెళ్ళేసరికి, అచ్చయ్య వతనప్రకారం ఉత్తపుణ్యానికి ఓబయ్యని తిట్టుగోడం మొదలెట్టాడు. ఎప్పుడూ లేంది ఓబయ్యకి కొంచెం కోపం వచ్చింది. ఆపళంగా అచ్చయ్య డింగీ రెండంచుల మీదా రెండుచేతులూ పెట్టి, అది ఈ వేపుకీ ఆవేపుకీ ఒరిగే లాగు ఉయ్యాలా ఊగించాడు. డింగీ అల్లానే ఊగుతూ అద్దరికి అహోరించింది గాని, ఓబయ్య కూర్చున్న వేపుకి గోవిందాయిస్వాహా అని చెప్పి పల్టీ కొట్టింది. అంతా ఏట్లోపడ్డారు. ఏమడిగారు అవస్థ! ఓబయ్య ఊబిలో తల్లగిందులుగా కూరుకుపోయాడు. పాపం వాడికి ముక్కులోకి పాలు దిగాయో తేదోకాని ఇంత బురదమట్టుకు దిగింది. వాణ్ణి కప్పీలు లేకుండా పైకి ఊడదీసేసరికి మాతాతలు దిగొచ్చారు, బస్సుమీద! యాత్ర సరుకులికి మారురూపం వచ్చింది. అప్పడాలు కుక్క చెవులులా ,అయినాయి. ఒక్కొక్కవడియం కందదుంపలా తయారయింది. ఓబయ్య ఉప్పు ఏట్లో కలిసిపోయి రూపం లేకుండానే పోయింది. తడిబట్టలే మూట కట్టుగుని, ఒక్కొక్కబట్టమాత్రం పిడిచి ఒంటి మీద వేసుగుని, రాంబందుల్లాగ రెక్కలాడిస్తూ నడిచిపోయాం . ఓబయ్యని వెనక్కి వెళ్లమన్నాం . అబ్దాంతమైనా వాడు వెళ్లనన్నాడు. వెనక్కీ నిష్క్రమించక, కూడారాక, ముందుకీ సాగక, మమ్మన్ని వాడు కొరుక్కుతిన్నాడంటే నమ్మండి. నాని తగులడ్డ ఆ పదార్థాలే మహరుచిగా ఉన్నాయంటూ మా వాళ్లు, మొదటిమజిలీ జేరకుండానే, అవన్నీ ఊదిపారేశారు. అలానే, కొంతదూరం నాటునా, కొంతలెక్కరైలు మీదా, కొంతమేర అడివిలోనూ, భోజనానికి సహళగడ్డీ కరుస్తూ క్షేమగిరి చేరుకున్నాం. అక్కడ సత్రాల్లో ఏదో ఇంత మృష్టాన్నం స్వీకరిస్తూ కొంతకాలంపాటు స్థాయిపడదాం అనుకునేసరికి, ఆ ప్రాంత్యాన్ని అప్పుడు చాలా జాడ్యాలని మాకు రెండోనాడే తెలిసింది. వెంటనే ఇంటికి దారి తియ్యకపోతే ఉరెట్టుగుంటానని కూచున్నాడు, మమ్మల్ని ఇల్లు బయల్దేరగొట్టిన ఓబయ్య! రెండోనాడు మధ్యాహ్నం సత్రాల్లో వంటలవాళ్ళు కట్టుకట్టి మానేశారు. ఆ రాత్రి మాకు అన్నానికి, ఆటంకం తగిలింది. కాని, మాసత్రం పక్కింటి ఇల్లాలు ఆరోజునే నందికేశ్వరుడు నోం చేసుగోడం చేత (పదార్థం చలిమిడి అని తెలిస్తే, ఛీ అని ఊరుకుందుం) నోం వస్తువు గార్లని రూఢికబురు తెలిసి, గార్లు సాయంత్రందాకా చెల్లకపోడం ఏమిటి చెప్మా అని అనుమానిస్తూనే అస్తమయం కాకుండా వెళ్లాం. అవి ఉప్పుమయం. కాని ఎంజెయ్యం? అవే పూటుగా పట్టించి మర్నాడు బిచాణా బండి ప్రయాణంవల్ల ఒళ్ళు తిరుగుతుందని చెప్పి అయితేం, ఎత్తేసెయ్యడం ఖాయపరిచాం. రైలుఖర్చుకి జంకి అయితేం, రకం మార్చడంలో ఉండే సరదా వల్ల అయితేం, వచ్చినదార్నే వెళ్లడానికి మాలో చాలా మంది ఇష్టపడలేదు. మరోదారీ ఉంది కాని, ఆ దారిని పడితే క్షేమగిరినించి యాభైమైళ్లు అడివి తొక్కితేనే గాని కంకర దర్శనం కాదు. ఈ దారిలో సింహాలు గట్రా ఆహ్వానం ఇస్తాయేమో, ఈదారి వద్దని నేను అన్నాను, అనడం అంటేం! రామయ్య కామయ్యలు (వాళ్ళు అసలు సింహపు బొమ్మేనా చూడలేదు!) అందుకు ఒప్పుకోక, ఒకవేళ సింహమే యెదురుపడితే, దాన్ని పబ్లికుగా పట్టుగుని, ఇద్దరూ దాని నోరు విడగొట్టి, చెరోదవడా దబాయించి దాన్ని తాటికమ్మ చీరినట్టు చీరుతాం అనిన్నీ, అథవా అట్లా స్వాధీనం కాని పక్షంలో దాని నోరు వెలక్కాయి నొక్కినట్టు నొక్కేస్తాం అనిన్నీ భరవసా ఇచ్చారు. అంటే, స్వంత మనుష్యులు నలుగురు కూడా ఉన్నప్పుడు పరాయివాడి మీద ఎగరడం లాంటిదే అనుకున్నారు సింహంతో పని! ఏమైతేం? నడకదార్నే వెళ్లడం నికరపరుచుగుని, అందర్నీ ఝాంతెల్లారకట్ల ఓబయ్య లేవగొట్టే పద్ధతికి అందరూ ఒప్పుగుని, ఆ రాత్రి కునికాం.

గారెలగుణమే గావును, వాటిమొహం ఈడ్చా, మాలో ఒక్కడికీ మళ్లీ స్మారకంలేదు. నేను లేచేటప్పుటికే వెలుగొచ్చింది. నేను అచ్చయ్యని లేవగొట్టాను, వాడెళ్ళి " ఇదేట్రా, మమ్మల్నీ పెంద్రాళే. లేవగొట్టడం?" అని ఓబయ్యని వీపుకి సరిబడ్డ చరుపు చరిచాడు, అట్టుఊడేట్టు. దాంతోటి వాడన్న మాటేమిటి, అంతా కూడా లేచి కళ్లు నులుముకుంటూ బయల్దేరారు. మేం ఊరవతలికి వెళ్లేసరికి కరకరా సూర్యోదయం అయింది. దారి దక్షిణం వేపుకి ఉంది. అది దొరకపుచ్చుగుని మేం నోరు మూసుగుని నడుచుకుంటూ కొన్ని మైళ్లు వెళ్లేసరికి, ఓవాగు ఎదురైంది. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని ప్రయాణం సాగించాం. ఓబయ్యకి భయమో ఏం ఏడుపో, వెనకాల దిగడకుండా మాతో కలిసి ఇదవాలని వాడు ఏకపరుగు. అసలు, వేసం కాలం ఓమూలనించి తరుముకొస్తోంది. చరచరా పొద్దెక్కుతోంది, ఎండా పేల్చి పోస్తోంది. తొమ్మిది గంటలైంది. చాటంతేనా మబ్బు లేదు. ముచ్చెమటలూ పోశాయి. ఒక్క ఓబయ్యకి మాత్రం గొడుగుంది. అది వాడొక్కడూ వేసుగున్నాడు. అచ్చయ్యకి ఓబయ్యని చంపెయ్యాలన్నంత దుద్ద బయల్దేరింది. అక్కడికీ వాడుకూడా దాల్లోనే దూరాలని చూశాడుగాని, తను మరీ పొడుగవడంచేత బెత్తాల మొనలు తనతలకి గుచ్చుగోడం మొదలెట్టాయి. ఆమట్టున వాడికి కోపం ఎగేసుకొచ్చి, వాడు ఆ గొడుగు తాలూకు ఎనిమిద బెత్తాలూ విరిచి, మానలుగురికీ పక్షపాతం లేకుండా రెండేసి చొప్పున పంచిపెట్టి, గొడుగుకామ తనుచ్చుగుని, మరి మిగిలిపోయిన ఆ గొడుగు గుడ్డ ఓబయ్య నెత్తికి పాగా చుట్టాడు. ఇంకోడికి లేకపోవడం, తనకి ఉండడం అనుకున్నాడు గావును అచ్చయ్య, అంతటితో శాంతించాడు. ఎవడిమట్టుకి వాడు వొఠ్ఠి తోటకూర కాడలాగ వేళ్ళాడిపోడం మొదలెట్టాడు, అందులో, పొద్దున్న మంచి మాట చేసుగు ఇదయామా, ఏమన్నానా! ఎక్కడా కనుచూపులో చెట్టు కనపడక ఊరుకున్నారు గాని లేకపోతే ప్రతీవాడికీ సాగారాలని లోపల ఉంది. మేం అఠాత్తుగా ఓమళుపు తిరిగేసరికి, అక్కడ, దారి మూడు పాయల కింద చీలి ఉంది. ఎటువెడితే ఎక్కడికెడుతుందో మాలో ఎవడూ ఎరగడు. అచ్చయ్య చుట్టుపక్కలు చూసొస్తానని తూరుపుదిశగా వెళ్లాడు. కొంతసేపు ఆ యెండలో మేం అల్లానే పడిఉన్నాం. ఆపళంగా, పడమటి దిక్కునించి ఓ సింహగర్జన వినిపించింది. ఓబయ్య మూర్చిల్లాడు. మేం చెల్లాచెదరై దాక్కున్నాం. కాస్సేపటికి అచ్చయ్య గర్జన వినిపించిన వేపునించేవచ్చి " ఏంరోయ్!” అని కేకేశాడు. మేం వచ్చాం, “ఏరి రామయ్య కామయ్యలూ! ” అన్నాడు అచ్చయ్య. అని, “మీకు కనపడకుండా, అల్లా తిరిగి ఈ వేపుకివచ్చి నేనేరా కూసిందీ!” అన్నాడు. అప్పుడు రామయ్య కామయ్యలు పడిపోయిన ఓబయ్య కాళ్లకింద దొరికారు, మేం చెవుల్లో కొంతసేపు ఊదగా వాళ్లకి స్పృహ వచ్చింది. మాపని అంతే అనుకున్నాం. జానికిరామయ్య కొన్ని దర్భలు జాగ్రత్తపడితే ఉత్తరోత్రా నయం అన్నాడు. కాని, దక్షిణాన్నించి ఓ గుర్రం మావెంపుకి వచ్చింది., దాని మీద ఓ గిరజాలాయన గొడుగేసుగుని, కూర్చున్నాడు. ఆయన మమ్మలి సమీపించినా, గుర్రం దిగలేదు, వడితగ్గలేదు. అవసరం మాదేగనక, నేను రోషం చంపుగుని "ఏదేనా ఊరు త్వరగా జేరడానికి దారి చూపించండి బాబూ!” అని ఆయన్ని కోరాను. ఆయన, ఏం ఆలోచించుకోడానికో ఓలిప్త నిదానించి, మమ్మల్ని తూర్పుగా తిరిగి (దణ్ణం పెట్టమన్లేదు గాని) గబగబా వెళ్లమన్నాడు. ఎల్లనో లేచి మేం తూర్పుకి ఎగబడ్డాం, అన్నింటి తోడు అప్పుడు ఎదురెండ కూడాను. కొంత దూరం డేకేసరికి ఆదారి మాయమైంది. మాకందరికీ నామీదా, గిరజాలవాడి మీదా మంటేసు కొచ్చింది. 'ఆపీసుగుని అడక్కపోయినా తీరిపోను' అనుకున్నాను. నా మాటవినడం గోతులో దిగడం అన్నాడు ఓబయ్య. ఈ మాటు ఆ గిరజాలవాడు కనిపిస్తే నెత్తురు కళ్ల చూస్తానని అచ్చయ్య, వాడి గుఱ్ఱం ఉత్త కోటిపిల్లి తట్టనిన్నీ, దాని నడుం కొడవలిలా ఉందనిన్నీ, అది మరో మైలు వెళ్ళేసరికి వాడేదాన్ని మొయ్యాలనిన్నీ రామయ్య, వాణ్ణి ఆ మాటు కలుసుకోడంతోటే చందా పోగుచేసి అదెట్టి వాడి గిరజాలు మంగలిచేత నున్నగా తీయించేస్తానని కామయ్య, “మనికి ఈ వేళ దినమందు అన్న ప్రాశన ముహూర్తం లేదేమోరోయ్” అని జానికిరామయ్య. ఇల్లా తిట్టుగుంటూ తిమ్ముగుంటూ వుసూరుమంటూ వెనక్కి తిరిగి కూడలిదగ్గరకు మళ్ళీ వచ్చి గిరజాలాయన వచ్చిన దారివెంటే మళుపులు తిరుగుతూ కొంతసేపు వెళ్ళేసరికీ మూడు ఇళ్ళు కనిపించాయి. అది తప్పకుండా గిరజాలాయన ఊరనిన్నీ, మేం అంతా తన ఇంటిమీద దిగితే ఇల్లు తినేస్తాం అనే భయం చొప్పున మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి వాడు ఎత్తు వేసి ఉంటాడనిన్నీ మాకు స్పురించింది.

అప్పటికి మిట్టమధ్యాహ్నం అయింది. మా పటాలం అంతా ఓమాటే కనిపిస్తే, ప్రతి గృహస్థూ వెంటనే అవతలికి పొమ్మంటాడేమో, ఒక్కొక్కడే ఊళ్లో ప్రవేశిస్తే బాగుంటుందని జానికిరామయ్య చెప్పాడు. అది చాలా బాగా ఉందని అందరూ ఒప్పుగున్నారు. కాని ప్రతీవాడు తను ముందు వెడతానని బయల్దేరాడు. అంచేత అంతా ఓమాటే వెళ్లాం. రెండిళ్లు దగ్గరసా ఉన్నాయి, ఓటి గిరవటేసి నట్టుంది. మొదటి యింటికీ రెండో యింటికీ మధ్య దొడ్డివుంది, దానికి వీధి వేపున చిన్న కోరడు ఉంది. దొడ్లో నూతి దగ్గిర ఓ ఆవిడ అంట్లు తోముతోంది. వీధిలో చింతచెట్టు తాలూకు నీడ ఉంది. మొదటి కొంప తాళం వేసి ఉన్నా అరుగుమీద ఓ ఆయన పడుకున్నాడు. " ఏమండోయ్! స్వామీ! ఇదేవూరు?” అని రాయ్య ఆయన్ని నిమ్మణంగా అడిగాడు. ఆయన వినిపించుగోక కళ్లు తెరవకుండానే పళ్లు పటపటా కొరుకుతూ అల్లానే పడుకున్నాడు. అచ్చయ్య వెళ్ళి ఆయన్ని నడ్డి విరగదన్నాడు. ఆయన లేవలేదు. తరవాత ఓబయ్య నడుంకట్టి ఆయన్ని అరుగుమీంచి కిందికి రోల్ని దొర్లించినట్టు దొర్లించాడు. అయినా సరే ఆయన లేవలేదు. తదుపరి రామయ్య బయల్దేరి ఆయన పిలక పట్టుగుని ఊడేపర్యంతం ఝాడించాడు. అప్పటికి ఆయనికి మెణుకువ వచ్చి, లేచి, మూతి వంకరగా పెట్టి, " ఆబావా బావ్. " అని మొరిగి మళ్లీ వెళ్లి అరుగుమీద పడుకున్నాడు. " ఒరేయ్ ! పాపం, మూగమనిషి గావున్రా ” అన్నాను నేను. "ఆ మాట మాత్రం చెప్పి ఏడవద్దుట్రా?” అంటూ రామయ్య ఇంకా కోప్పుడుతూనే ఉన్నాడు. ఈ సమయానికి రెండో యింటి అరుగు మీదకి ఓ ఆయన వచ్చాడు. కోరడు పక్కమ్మటే నడిచి మేం రెండోయిల్లు సమీపించాం. ఆరుగుమీదికొచ్చినాయన మాంచి బలంగా మా ఓబయ్య కంటే పెద్ద పన్నాగా ఉన్నాడు. కొంతసేపు అతగాడు ఏమి చలనం లేకుండా గుడిమీద బొమ్మలా కూర్చున్నాడు, తరవాత దగ్గొచ్చి సకిలించాడు, అంతేగాని వాడిజిహ్వెట్టుగుని వాడు మమ్మల్ని, "ఏం నాయనా! వచ్చారు! ఎండంతా మీపరం అయిందిగదా పాపం రండి! ఇదిగో కాళ్లు కడుక్కోండి, అదుగో మడికట్టుగుందురు గాని ఉండండి!” అని ఛస్తే అన్లేదు సరిగదా, “మీరెవరు? ఎందుకొచ్చారు?” అని కూడా అడగలేదు. రామయ్య రెండిళ్ళ మధ్యా చెట్టు నీడని కూచోపడ్డాడు. అరుగులమధ్య ఉన్న మెట్లలో ఆఖరు మెట్టుమీద నేను కూచున్నాను. అవడం మాలో అంతా ఒకటోరకం పేచీకోరులే అయినా అప్పటిస్థితిని బట్టి అందరికీ అస్త్రశస్త్రా లుడిగాయి కాని, అచ్చయ్య మాత్రం ఇంకా ముందే కయ్యానికి కాలుదువ్వుతాడేమో అని జానికిరామయ్య వాణ్ణి కాస్త ఎడంగా లాక్కెళ్ళాడు. వాళ్లిద్దరూ వీధిలో పచారు చేస్తున్నారు. కామయ్య ఓబయ్యలు మెట్లెక్కి తిన్నగా అరుగుమీది ఆసామీ దగ్గరికి వెళ్ళారు.

కా - మాది పొన్నూరండి.

ఓ - మరేనండి

కా - (ఓబయ్యతో) ఊరుకో! (అని ఒక్క దెబ్బ కొట్టాడు వాణ్ణి).

ఆయన (ఇద్దరి కేసీ చూసి ఊరుకున్నాడు.)

కా - తమరు నిరతాన్న ప్రదాతలని ప్రతీతి

ఓ - తమరు కేవలం నప్రతిగృహీతలని కూడా వినికిడి.

కా - (ఓబయ్యని మళ్లీ కొట్టాడు)

ఆయన - (ఓబయ్య మాట్లాడింది ఏదో తిట్టనుకుని ఓబయ్యని కొట్టబోయాడు.)

కా - తమకీర్తి ఈ అడవి దాటి అనేక సీమల వ్యాపించింది.

ఆయన - (పోక చెక్క నోట్టోవేసుగుని టక్కుమనిపించాడు)

ఓ - తమరు అతిథిపూజా ధురంధరులు

కా - (ఓబయ్యని ఓటి కొట్టి) మాకీ చిక్కులన్నీ ఒకానొక కుంకవల్ల వచ్చాయండి. వాడూ మాకు తప్పుడు దారి కనపరిచాడు.

ఓ - వాడు గుర్రంమీద కుడా తగులడ్డాడండి. అది బొత్తిగా బుక్కా గుర్రం.

ఆయన - (గుమ్మం కేసి తిరిగి) రామచిలకా! కాస్త సున్నం తెచ్చి పెట్టు! పోనీలో! వద్దు! నువ్వు ఇవతలకి రామోకు, నేనే తెచ్చుగుంటా!

అని లోపలకి వెళ్ళాడు.

ఈసమయంలో ఎవడో మనిషివాడు వీధి గుమ్మంలోకి వచ్చాడు.

మనిషి - చెల్లమ్మగార్ని వంటకి బేగీ రమ్మంతున్నారండి

నేను - వంటెక్కడ?

మ - కరణంగారింట్లో తద్దినం అండి.

నే - ఆపై యిల్లు కరణంగారిదా?

మ - అవును.

నే - ఇప్పుడు వంట మొదలెట్టి చచ్చినవాడికా బతుకున్నవాడికా తద్దినం పెట్టడం?

పాపం వారింట్లో భోక్తలు కుదిరారా? కావాలా?

మ - ఒకాయన యిందాకానే వచ్చారండి, రొండో ఆయన చిన్న కరణంగారండి.

నే - ఆయ నెవడు? మ - ఈ పంతులుగారి పెద్దబ్బాయండి.

అక్కడితో ఇంటాయన ఇవతలికి వచ్చాడు. నేను నిద్రపోతూన్నట్టు ఒరిగాను. ఈలోపులో ఓబయ్య కామయ్యలు ఒకడు చెక్కలడబ్బా ఒకడు తమలపాకుల బుట్టా స్వాధీనపరచుగుని రెండో అరుగుమీద తాపీగా కూచున్నారు. వెంటనే ఆయన వాళ్ల దగ్గర్నించి అవి వసూలు చేసుగున్నాడు. ఆయనికి కొంచెం ఆగ్రహం కూడా వచ్చింది. “మా అబ్బాయిని పిలుస్తానుండండి, వెధవ వేషాలూ మీరూనూ! పొండి! ఆకతాయి రకం! తిన్నగా ఉండలేరు!” అంటూ ఆయన మొదటి ఇంటి అరుగుకేసి చూశాడు. అక్కడ పడుకున్నవాడు ఆయనకి చిన్న కొడుకని మాకు బోధపడింది. అతణ్ణి మేం సన్మానించడం ఇతడు చూడనందుకు నాకు కొంత సంతోషం వేసింది.

మనిషి - పంతులుబాబుగారండి! చెల్లమ్మగార్ని వంటకి రమ్మంతున్నారండి!

పం - వస్తుంది. దొడ్లో అంట్లు రాస్తోంది. రొండో బ్రాహ్మడు వచ్చాడా?

మ - వచ్చారండి. సిన్న కరణం గారు వచ్చారాఅండి?

పం - వస్తాడు. వంట అయేసరికి రాలేకపోతాడా? పైగా గుర్రానికి వంట్లో ససిగాలేదు.

అని చెప్పి ఆయన తమలపాకుల్లో పడిపోయాడు. ఆ మాటలతోటి గిరజాలాయన ఆయనికి పెద్ద కొడుకని కూడా మాకు గోచరించింది. వెళ్లిపోతూన్న మనిషి వాడితో కలిసి మాట్లాడుతూ జానికిరామయ్య వెళ్ళాడు. కరణంగారి యింటి దగ్గిర వాణ్ణి ఒదిలేసి తను వెనక్కి గబగబా వచ్చాడు. రావడంతోనే తన మూటలోంచి ఏదోతీసి, నీడని కూచున్న రామయ్య దగ్గరికి పరిగెడుతూ, వాడు నాకేసి చూసి కన్ను గీటాడు. నేను వెళ్ళాను. ఆపళంగా వాడు ఓ జంధ్యాల జత తీసి రామయ్య మెళ్లో చిటికెలో వేసి వాడికి కనుసంజ్ఞ చేశాడు. రామయ్యకీ నాకూ కూడా సంగతేమిటో బోధపడలేదు. అచ్చయ్య ఒంటరిగా ఉండలేక తనూ ఆరుగుమీదికి ప్రయాణం అయాడు. వాడు తిన్నగా ఎక్కడ వెడతాడూ! అల్లరి పీనుక్కి, అల్లరి కలిసొస్తుంది. సరిగ్గా ఆ సమయానికే వీధి గుమ్మం ఎదటినించి ఒక వరాహం వెడుతోంది. అచ్చయ్య దాని పక్కనించి వెళ్లి అరుగుమీదకి ఎగరబోతూ దాన్ని “హూత్” అని ఝడిపించాడు. అది అల్లా చక్కాబోతూన్నది పక్కకి తిరిగి ఇంట్లో జొరబడి పోయింది. పంతులు దాన్ని మళ్లెయ్యడానికి యత్నించాడు. కాని, అది అతని కంటే బలిసి ఉండడంవల్ల జయించి గడపదాటి ఇంట్లో పడింది. పంతులు రుద్రుడైపోయి దాన్ని వేటాడాడు. అచ్చయ్యా వాళ్లూ అరుగుమీద కూచుని తాంబూలం వేసుకుంటున్నారు. అక్కణ్ణించి వాళ్ల గొడవలో వాళ్లూ మా గొడవలో మేమూ పడ్డాం. జానికిరామయ్యా నేనూ రామయ్యకి నచ్చచెప్పడానికి కూచున్నట్టు చెరోపక్కా కూచున్నాం.

జా - (గట్టిగా, కోరడువెనకాల దొడ్లో అంట్లు తోమే ఆవిడకి వినబడేలాగు) ఆపక్కింటి అరుగు మీద పడుకున్న మన్మథమూర్తీ నీకు నచ్చకపోతే మమ్మల్ని ఏ గంగలో దిగమన్నావ్! ఎమోరా! తిరిగి తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయి. ఇక మావల్ల కాదు బాబూ ఈ తిప్పటా! నీ కూతురు పెళ్లికి నీకు ఓ దణ్ణం. మమ్మల్ని వొదిలిపెట్టు, పోతాం.

నే - ఎమోరా! ఘటన! ఈ సంబంధం మాత్రం ఖాయపడుతుందని ఎవడు చెప్పగలడూ! మనికి ఇంకా ఎన్నాళ్లుందో కాళ్లశని!

రా - (మొహం కొద్దిగా విచారంగా పెట్టి) అషీతే ఇంత దూరంగా నా పిల్లదాన్ని పారెయ్యమనా మీసలహా? మాయింట్లో దాన్తోకూడా చెప్పందీ తాంబూలాలు పుచ్చేసు కోమంటారా? కొంచెం ఆగితే నయమేమో! నే - ఆగితే నయమా? అసలు నువ్వు ఇంటికి వెళ్లే దారిలోనే నువ్వులూ బెల్లం కొనుక్కుని వెళ్లడం మరీ నయం ! లేకపోతే, ఇంకా ఆగుతాట్ట, మతి లేక!

రా - అల్లాయితే, ఇచ్చెయ్యమంటారా? ఇది అడివిరా!

జా' - అందుకని ఎవడూ రాడు. నయం కాదూ!

రా - వీళ్లు మంచివాళ్లేనా?

జా - ఓరి వెర్రిముండావాడా! అన్నీ విని మళ్ళీ మొదటికొస్తావేంరా! నీకు నచ్చచెప్పలేక చచ్చిపోతున్నాం! వీళ్ల మంచి ఇంకా నీకు బోధపడలేదుట్రా! మీవియ్యంకుడు కేసి చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఎంత భారీమనిషో! అల్లుడు నిన్ను ఎదిరించడు, అసలు నిన్ను పల్లెత్తేనా ఏమీ అనడు. అతడు ఎంత శాంతశూరుడో నువ్వు ఇందాకా చూడనే చూశావ్, బహుమతీ ఇవ్వనే ఇచ్చావ్!

ఆపళంగా అంట్లుమానేసి చెల్లమ్మగారు, కోరడు దరికి వచ్చి మా మాటలు ఆలకించడం మొదలెట్టింది. ఆ సంగతి జానికిరామయ్యా నేనూ కూడా కీగంట గమనించి పని జరిగేట్టుందని అనుకున్నాం.

రా - ఇంత పిసినిగొట్టు పీనుగు కొంపలో పిల్లని గిరవటెయ్య మంటారురా! చచ్చినా పరాయివాళ్లకి, రెండు ఝాములప్పుడేనా రెండు మెతుకులు విదపని చట్రం?

జా - నిదానించు! అందుకనే, పిల్లని ఇస్తే ఇక్కడే ఇవ్వాలి. ప్రాణంకంటే అధికంగా డబ్బు జాగ్రత్త చేసి నీ వియ్యంకుడు నీ అల్లుడికి ఇస్తాడన్న మాట!

నే - మరోమాట వినొరీ! స్తోత్రం చెయ్యడానికి నే నేమీ బట్రాజుని గాను. అబద్దం ఆడవలసిన కర్మం నాకేమీ లేదు. ఎదరైతేం చాటునైతేం ఏమాట కామాటే చెప్పుగోవాలీ! ఇల్లాంటి వియ్యపరాలు వెయ్యేళ్ళు తల్లకిందులా బొటనవేలు మీద తపస్సు చేస్తే దొరుకుతుందిట్రా, మరో చోట! ఈవిడ కేవలం ఆ అరుంథతి! ఈ మహాలక్ష్మిని చూస్తే అన్నం నీళ్లు కావాలిట్రా వెఱ్ఱివాడా!

జా - ఇహ చెప్పలేమురా! నువ్వూ ఆ పంతులు గారూ గనక వియ్యమందితే, ఆయొక్క శివ కేశవులు వియ్యమందినట్టే! పైన నీ యిష్టం వాళ్లిష్టం. మేం ఎల్లానూ మధ్య వాళ్లమే! కాదుట్రా సీతారామయ్యా?

నే - కాకపోడేం!

అంతటితో చెల్లమ్మగారు పెరటిదార్ని ఇంట్లోకి ఒక్కగంతేసింది, అంటచేతులు కడుక్కోకుండానే.

ఈ సమయంలో అక్కడ జరిగిన సంగతిగురించి అచ్చయ్యావాళ్లూ చెప్పినమీదట మాకు తరవాత తెలిసింది. ఆ పంది ప్రతీగదిలోకి దూరి పంతుల్ని కూడా తిప్పిందిట. ఇల్లాకొంత చెడుగుడు లోపల అయింతరవాత, అచ్చయ్యా వాళ్ళూ కూడా లోపలికి వెళ్ళారట. అప్పటికి పంది పడకటింట్లో కెళ్ళి పందిరిపట్టిమంచంకింద అల్లరి చిల్లరిగా పడేసి ఉన్న సామాను కొద్ది సవరణలతో సంస్కరించి, తన యొక్క అవతారజన్మలో సముద్రంలోంచి భూమిని ఎత్తి దంష్ట్రాగ్ర మందు కాపాడినట్టు, ఇప్పుడుకూడా గదిలో ఏర్పడ్డ బురదలోంచి మంచాన్ని ఎత్తేసి ముట్టెచివర రక్షించి, తద్వారా “పందిరిమంచం” అనేమాట కొంతవరకు సార్లకపరిచి, ఇవతలికి వస్తోందిట. అప్పుడు పంతులుకి కాలుకొచ్చి, అతడు చీపురు కట్ట ఓటి పట్టుకుని, “ఇదంతా వీడిమూలాన్నే, వీడి దుంప తెగ!” అని అచ్చయ్యని కొట్టొచ్చాడట. వాడు ఇట్టీ తప్పించుగుని, ఆయన్ని చచ్చేట్టు ఒక్కతోపు తోశాడట. ఆయన పెళపెళ విరుచుగుని పంది మీద చెట్టులా పడిపోయాడట. అదికూడా కింది పడిపోయి అతణ్ణి కరవబోగా, మావాళ్లు నవ్వుతూ దాని అదరకాయించి అవతలికి కొట్టేశారట. ఇంతలో, పంతులు లేచి, ఓకత్తిపీట దొరకపుచ్చుకుని అచ్యయ్యని నరికెయ్యడానికి వీధులోకి రాబోతున్నాడట.

చెల్లమ్మగారు ఇంట్లోకి వస్తూనే "రామచిలకోయ్! నీ మరిదికి పెళ్లివారు వచ్చారేవ్!” అని కేకేసిందిట, అప్పుడు ఓ చీకటిగదిలోంచి ఒక అమ్మాయి ఇవతలికి వచ్చి, “మామగార్ని ఎవరో కొడుతున్నారు! రండత్తా!” అందిట,

ఇంతలో మేం చెట్టునీడనించి అరుగుమీదికి వదల బోయేసరికి, ఓబయ్యా కామయ్యా వీధిని ఎగబడి అదే:పోత పోతున్నారు. అచ్చయ్య కొంతదూరాన్ని ఖణాయించి నిలబడ్డాడు. పంతులు కత్తిపీట బాణకర్రలా తిప్పుతూ ఇంట్లోంచి వస్తున్నాడు.

పం - ఇప్పుడు రండిరా!మీ మొహాలు మండా!

చెల్లమ్మ - (ఇంట్లోంచి గుమ్మంలోకి వచ్చి) ఇదిగో, మిమ్మల్నే! ఇల్లా రండి? వినిపించుగోరేం! మీమాటే! మీతో ఓ మాట చెప్పాలి మంచిది! ఇల్లారారేం?

పం - కాస్సేపుండు! సొద! ఇవతల పనిమీద ఉంటూంటేనే! కళ్లేమయినాయి?

చె - (పళ్ళు బిగించి సంజ్ఞలు చేసి, నెగ్గి, ఆయన తనదగ్గరికి వచ్చిన తరవాత ఉండండి, ఏమీటా ఆగ్రహం! వచ్చిన వారెవరో చూసుకోడం ఉందా, చూసుగోడం లేకుండానే ఇదవుతారా మీ ఇదవడం మీరును! మన సుందరానికి మంచి ఎదిగిన (అని మెల్లిగా అతని చెవులో కొంత మాట్లాడింది)

ఈ మంత్రం పంతులికి కూడా పట్టిచ్చింది. అతడు వడి తగ్గించి కొంచెం సద్దుకున్నాడు. కత్తిపీట తిప్పడం మానేశాడు గాని అది అసలు పారెయ్యలేదు. “అల్లాచెప్పూ! నాకూ మొదణ్ణించీ అనిపుస్తూనే ఉంది - ఇది వియ్యాలారి హాస్యం కాదు గదా - అని, ఇప్పటికి బోధపడింది.” అంటూ ముసిముసి నవ్వు తెచ్చుకుని మమ్మల్ని “బాబూ, రండి రండి. అరుగు మీద దయ చెయ్యండి. సంగతులు క్రమేపీ గాని తెలియవు” అని హెచ్చరించాడు. ఓబయ్య కామయ్య పొరుగూరు అవడంచేత జంకి కేకకి అందకుండా పోయారు. వాళ్ళని కూడా పిలవడానికి వాళ్ళ వెనకాల పంతులు కత్తిపీటతో సహా దౌడు ప్రారంభించాడు. అతని వెనకాలే అచ్చయ్యా సాగాడు. ఓబయ్య కామయ్యలు పరిగెత్తలేక పొలిమేరదగ్గిర ఆగి ఎదురుతిరిగి పంతులుతో దెబ్బలాటికి సిద్ధంగా నుంచున్నారు. పంతులు వెళ్ళి వాళ్లు రావలిసిందని వాళ్లని కాళ్లట్టుగుని బతిమాలుకోడానికి ఒంగున్న సమయంలో అచ్చయ్య పిల్లిలా వెనకాలే వెళ్లి, ఆయన వాళ్ల కాళ్లు నరకపోతున్నాడనుకుని, ఆయన నడ్డిమీద ఒకటిచ్చుగున్నాడు. ఆయన మొర్రో అని, అచ్చయ్య కేసి తిరిగి, “అయ్యా! వియ్యాలారి హాస్యం మరిచారు. తమరుకూడా వచ్చి నా యిల్లు పావనం చెయ్యండి.” అని బతిమాలుకున్నాడట. వాళ్ల ముగ్గురికీ ఆశ్చర్యం వేసిందిట. వాళ్లూ “ఇదేమిట్రోయ్” అనుకుంటూ వచ్చారు. జానికి రామయ్య నేనూ వాళ్లకి సంజ్ఞలు చేశాం. వాళ్లు పూర్తిగా గ్రహించలేదు. ఆపళంగా జానికిరామయ్య వాళ్లతో “ఏమర్రోయ్! సంబంధం తేలకుండా ఉన్నప్పుడు జరిగినవాటికి బొడ్డుతుమ్మాలు. మన రామయ్య కూతురు సంబంధానికి పంతులుగారు ఒప్పుకున్నారు. ఇక మనమూ వారు ఒకటి, వారు సిద్ధంగా ఉన్నారు. మనదే అలస్యం!” అని కాస్త తెలిగించి చెప్పేశాడు. అక్కణ్ణించి చూస్కోండి మాదశ. కాళ్లు కడుక్కోడానికి వేణీళ్లు ఇచ్చారు. జానకి రామయ్య ఓ చుట్ట కావాలన్నాడు. పంతులు ఇంట్లోకి వెళ్ళి ఓ అరవీశెడు పొగాకు బొండం తెచ్చి అతనికి ఇచ్చి, “పెళ్ళి మనుగుడుపులుకి వచ్చినప్పుడు మీరు ఓ చట్టో అరచట్టో పొగాకు వేసుగు వెడుదురుగాని” అన్నాడు నిమిషంలో అందరికీ వేణీళ్ల స్నానాలు, అచ్చయ్య మాత్రం మొట్టమొదట బుర్రకి కొంత నూనె పులిమి, అది వదలడానికి కాసిన కుంకుళ్లు తెమ్మని, ఆపులుసుతో తల రుద్దుకునేటప్పుడు ఆమురికి వంటిమీద పడడం వల్ల వంటి జిడ్లు వదలడానికి సున్నిపండి తెమ్మని మొత్తం మీద రెండు మూడు తలంట్లంత స్నానం చేశాడు. చెల్లమ్మ గారు శుభమల్లే సంబంధం కలిసిరావడం వల్ల తద్దినంలో దిగడం కూడదని గ్రహించి గావును, వంటకి రానని కబురంపి, మాకు వంట చెయ్యడానికి మడి కట్టుగుంది. మాకు అగరు నూనె, అత్తరూ వగైరాలు ఇచ్చారు. మాలో కొంతమంది మళ్లీ మళ్లీ అల్లాంటి తరుణం దొరకదేమో అని ఈ సీసాలు బోర్లించి పాదాలకి కూడా రాచేసుగున్నారు, ఒకళ్ళిద్దరు కొంత లోపలికి కూడా పుచ్చుకున్నారు - లోపల సమేతూ సువాసనకలగడానికి, ఇల్లంతా ఘుమఘుమలాడు తూండగా మమ్మల్ని మళ్ళు గట్టుకోమన్నారు. మేం లేవబోతూన్నాం. వీధి గుమ్మంలోకి వీధి గుమ్మంలోకి గుర్రం వచ్చింది. గిరజాలాయన దిగాడు. గుమ్మంలోకి రాగానే మా బృందం కంటబడేసరికి ఆయన నిశ్చేష్టుడయ్యాడు. సువాసన తగలేసరికి ఆయనికి మతోయింది. లోపలికి వెళ్ళి సంగతి గ్రహించాడు. అతడు మళ్ళీ ఇవతలికి వచ్చి ఊరుకోక ఓ చిన్న పేచీ వేశాడు. “తమర్ని గురించి అమ్మా నాన్నా చెప్పారండి. అందులో అమ్మ మహ పట్టుపడుతోంది. సంబంధం విషయం బాగానే ఉంది. కాని ఒకటి తమరు ఆలోచించ లేదు. 'కతికితే అతకదు' అని శాస్త్రం. తమరు ముందుగానే ఇక్కడ భోంచెయ్యడం జయకరం గాదు” అన్నాడు. నోటి దగ్గిర అన్నంలాగి పారెయ్యడానికి వీడెక్కడ పోగయాడ్రా పేచీరాయుడు అని మాలో ప్రతీవాడికీ అనిపించింది. పాపం! మా పుణ్యం బాగుండబట్టి, సంబంధం సంగతి జ్ఞాపకం ఉంచుకుని, అచ్చయ్య వగైరాలు లోగడ గిరజాలాయనమీద చేసిన ప్రతిజ్ఞలు ఉపసంహరించుగున్నారేగాని, చెయ్యిచేసుగోలేదు. నేను కొంచెం సకిలించి సంగతి అందుకుని, “ఫరవా లేదండి, మూడుముళ్లూ పడక పూర్వం కన్యాప్రదాత ఒకడూ మాత్రం మీ యింట్లో కతకకూడదు గాని, కడం వాళ్ళకి తప్పులేదు” అన్నాను. ఈ మాట రామయ్యకి మిరపకాయి రాచినట్టుంది. “అల్లాయితే, ఆమూగవాజమ్మకి నాపిల్లని ఇవ్వనేయివ్వను. అంటూ వాడు భాటంగా కోప్పడం మొదలెట్టాడు, అప్పుడే తన ఒక్కడి కూడూ పడిపోతోందని. రంగం చెడేట్టుందని మాకు భయం వేసింది. పంతులు చిరునవ్వునవ్వి “ఇంతా చేసి మా చిన్నవాడు మూగాడని చూస్తున్నారా ఏమిటి? ఇంతేటండీ తమ గ్రహింపూ! వాడు మొదట కాశీ వెళ్లాడు. తరవాత రామేశ్వర యాత్రచేశాడు. చేసి, ఇంటికివస్తూనే మళ్లీ కాశీ వెడతానన్నాడు. వెళ్ళాలిట! కొంచెం కాలూ చెయ్యీ కూడ దీసుగుని వెళ్లవలసిందని వాణ్ణి మేం కోరాం. వాడు కోపించి, మళ్లీ కాశీ చూసేవరకూ నేను మాటేఆణ్ణు” అని భీష్మించి, అది లాగయతు అల్లా మూగాడల్లా నటిస్తున్నాడు. ఆదోసెడు తలంబ్రాలు వాడి నెత్తిని పడగానే కాశీ వెళ్లిచక్కారమ్మంటాను, వచ్చి బృహస్పతిలా మాట్లాడతాడు తీరిపోతుంది. సరా?” అన్నాడు. జానికిరామయ్య ఈ లోపులో ఆలోచించిగుని, " అయ్యా! వంట ఎక్కడ చేశారు?” 'దొడ్లో పొయ్యిమీద' అని పంతులు చెప్పాడు. "అల్లాయితే, దొడ్లో వంట ఇంట్లో తినడానికి శాస్త్రరీత్యా కన్యాప్రదాతకి ఏమి ప్రతిబంధకం లేదే? ఇయినా. పాపపరిహారం నిమిత్తమున్నూ, మీ పెద్దబ్బాయిగారి అనుమాన నివృత్యర్ధమున్నూ, మా రామయ్యకి మాత్రం భోజనం ఆ అవతల ఇంట్లో పెట్టండి!” అని జానికి రామయ్య సలహా ఇచ్చాడు. అంతాసరే అన్నమీదట మేం భోజనానికి కూచున్నాం, కరణంగారి యింట్లో వంట లేదని తెలిసినా, చిన్నకరణం ఉద్యోగానికి ఏం మొప్పుంవస్తుందో అని మడిగట్టుకు వెళ్ళాడు, మంత్రానికి పంతులు వెళ్ళాడు. అక్కడ వంటాలేదుట, పెంటలేదుట. ఆ రొండో బ్రాహ్మడే ఇంత అత్తీసరు తగలేశాట్ట. దాంతో అయిందనిపించారట. మాకు చెల్లమ్మగారే వడ్డించింది. రామయ్యకి రామచిలక వడ్డించింది. రెండో యిల్లు కొంత ఎడంగా ఉండడంవల్ల రామచిలక తన గొడవ అంతా రామయ్య దగ్గర, వెళ్లబోసుగోడంలో, తనకి బాల్యంలోనే ముడెట్టడం, ముడెట్టగానే అత్తారింటికి తీసిగెళ్లడం, అప్పణ్ణించీ పగలూ రాత్రీకూడా ఒక చీకటికొట్లో పెట్టి తనని తాళం వెయ్యడం, తన స్వజనం వచ్చినా వాళ్లతో తను మంచీ చెడ్డా అనుకోవాలంటే తమరి ఎదటే మాట్లాడాలనడం, వగైరా చెప్పుగు ఏడిచి “మీ అమ్మాయిని కూడా ఈ కొంపలో పారెయ్యకండి, నాయనా! అసలు మామరిది నిజంగా మూగాడే! ఆస్తితణఖా!” అందిట. అందుకు రామయ్య, “అమ్మా! అనుకుంటున్నాం.

మరి! పీటలమీద పెళ్ళిళ్లు అనేకం పేలిపోయినాయి. పీటల మీద భోయినాలు అనేకం దక్కకుండా పోయినాయి. ప్రాప్తం ఉండాలి దక్కాలి. అవాలి అనుకోవాలి. ఘటన!” అన్నాట్ట మేం భోజనాలై, అరుగుల మీద దొర్లుతూంటే (అప్పటికి నాలుగైంది) పంతులూ పెద్దకొడుకూ తద్దినం తెముల్చుకుని, కరణంగారిని వెంట పెట్టుకుని వచ్చారు, అప్పటిదాకా పెళ్లికొడుకు మొదటి యింటి అరుగుమీదే నిద్దరోతున్నాడు, బడలికవల్ల మాకు కొంచెం నిద్దరట్టింది. అయిదింటికి మేం లేచేసరికి పెళ్ళికొడుకుని ముస్తాబుచేసి, పంతులు ఇవతలికి వచ్చాడు. జానికి రామయ్య “పంతులు గారూ! తాంబూలాల ఆటంకంకూడా కానిత్తామా?” అన్నాడు. “వాళ్ళోచ్చి పిల్లని చూసుగోందే ఎల్లా? పైగా, తాంబూలాలు పెళ్ళికూతురుగారి ఊళ్ళో పుచ్చుగోవాలి!” అని ఓబయ్య తనని అడగందే చెప్పాడు. కొంచెం అయితే అచ్చయ్య వెళ్లి ఓబయ్య పళ్ళు గవ్వల్లాగా రాలకొట్టేవాడే! కాని, జానికిరామయ్య అచ్చయ్యని ఆగమని సంజ్ఞ చేసి, “ఏమంటారు పంతులుగారూ?” అన్నాడు. ఆయన “ఇక్కడా అక్కడా అంటూ నాకు పట్టింపులు లేవు. శుభస్య శీఘ్రం అన్నాడు గనక, అల్లానే!” అన్నాడు. సంబంధం ఇన్నాళ్లకి వచ్చింది, ఇది దాటిపోతుందేమో అని ఆయన బెంగ. సరే, తాంబూలాలు అయినాయి. నాకూ, రామయ్యకీ, జానకి రామయ్యకీ జామార్లు ఇచ్చారు. రామయ్యకి ఇవ్వడం జయప్రదం కాదని ఓబయ్య జ్ఞాపకం చేసినా వాళ్లూ విన్లేదు, రామయ్యా విన్లేదు. కడంవాళ్ల కివ్వలేదని కోపాలు బయల్దేరాయి. అచ్చయ్య మొహం జేవురించింది. వాడు మాటని పిలవకుండానే రామయ్యని రెక్కట్టుగుని కొంతదూరంగా తీసికెళ్ళి, “మీరు ముగ్గురూ జామార్లు లాగేస్తారా? నువ్వు ఉత్త బ్రహ్మచారివనీ, నంది మొహానికీ షష్ఠికీ తప్ప ఎందుకూ పనికిరావనీ వాడితో చెప్తానుజాగ్రత్త! నిన్ను కుళ్ళబొడుస్తారు!” అన్నాడట. రామయ్య “బాగా చెప్పుకో. చెప్పుకుని నాకు బంగారు చెప్పులు చేయించు,” అన్నాడట, అనేసరికి అచ్చయ్య ఫెడీమని రామయ్య దవడ ఊడిచాడు. తక్షణం మేం పరిగెట్టాం. పంతులు రాలేదు. సంగతి కనుక్కున్నాం.

జా - ఒరేయి ! ఇహ కాస్సేపుండరా, పోదాం. అ - నాకు జామారు కావాలి.

జా - కడంవాళ్ళకో?

అ - ఎమో!

జా - పోనీ మా ముగ్గురం మా జామార్లు ఆరు పంచెల కిందా ఉత్తరిస్తాం. ఆరుగురం పుచ్చుకుందాం.

ఆ - నా కల్లా పనికి రాదు.

ఓబయ్య - పోనీ ప్రతిజామారూ నిలువుగా చీరిస్తే రెండేసి జామార్లు అవుతుంది. అందరికీ తలోజామారూ వస్తుంది.

అ - అది బాగానే ఉంది.

అని మెచ్చుకోడానికి ఓబయ్యని ఒక్కటి కొట్టాడు. మేం మళ్లీ అరుగులమీదికి వచ్చాం. ఆపొడుగుటాయన (అనగా అచ్చయ్య) కన్యాప్రదాతని అమాంతంగా లాక్కెళ్లారేమిటని పంతులు జానికిరామయ్యని అడిగాడు. అందుకు జానికిరామయ్య “వాడికి కాలినరం ఓటిపట్టు పడుతూంటుందండి. అలాంటప్పుడు వాడు పరిగెత్తితే సద్దుకుంటుంది.” అని చెప్పాడు. “ఆ నరానికీ చేతులో ఏదో నరానికి కూడా సంబంధం ఉండి ఉండాలండి. అందుకనే ఆయన చెయ్యి ఊరుగోదు” అని పంతు లన్నాడు. పొద్దుకూకేదాకా మేం అరుగుమీదే కూచున్నాం. మేం లోపాయికారీగా కొత్త యెత్తు ఏదైనా ఆలోచించుకోడానికి వీల్లేకుండా వాళ్ళు మమ్మల్ని వదలకుండా పట్టుగున్నారు. ఇంకా ఏమాటమీద ఏం వస్తుందో సమర్ధించుకోలేక చావాలని భయం అందరికీ వేసింది. రాత్రి భోజనాపేక్ష ఎవడికీ లేదు. వెళ్ళిపోతే బాగుండునని ఉంది. రాత్రి అడవిలో వెళ్ళడం భీతిగానే ఉంది. మళ్ళీ జానికిరామయ్య ఓయెత్తువేశాడు. "పంతులుగారూ! తమ ఆస్తి వగైరాల దస్తావేజులు ఒక్కసారి కంటపడెయ్యాలి!” అన్నాడు. “అడ్డమా!” అని పంతులు అని తనూ గిరిజాలాయనా లోపలికి వెళ్ళారు. మేం అంతా మళ్ళీ లేవండి అనకుండానే తిండికి సిద్ధం అవుతాం ఎమోఅని గిరిజాలాయన భయం. రాత్రి ప్రయాణాల గురించి యింతలో ప్రసంగం వచ్చింది. వెన్నెలకూడా వచ్చింది. మాకు అల్లాంటి ప్రయాణాలు సరదాయే అన్నాం. అక్కడికి ఓకోసు దూరంలో ఉన్న గూడెం వెళ్ళి గిరజాలాయన రెండు బళ్ళు కట్టించుగొచ్చాడు. మేం లేచాం. దస్తావేజులు చూడ్డం అందరూ మరిచినట్టు నటించాం. ఉత్తరం రాస్తాం అని చెప్పి అందరిదగ్గిరా సెలవు పుచ్చుకుని బళ్ళుఎక్కి బయల్దేరాం, బళ్లవాళ్లు మళ్లీ మూట జేర వేస్తారేమో అని మేం కిక్కురుమనకుండా పడుకుని నిద్రపోయాం . ఉదయానికి అడవిచివరికి వెళ్ళాం, బళ్లతో సహా మావూరుదాకా వెడితే ఇతర చిక్కులుంటాయని చెప్పి వాళ్లని వెనక్కిపొమ్మన్నాం. కడం పాతిగమైళ్లూ నడిచి స్వగ్రామంలో పడ్డాం.

మర్నాడు జానికిరామయ్య పంతులికి ఉత్తరం రాశాడు. దాన్లో వృత్తాంతం ఏమిటీ? మేం ఇంకా మావూరు జేరుకోక పూర్వమే పెళ్లి కూతురు మసీసగం వచ్చి కాలంచేసిందనిన్నీ, ఘటనకి ఏమి చెయ్యలేం అనిన్నీ, విచారించవద్దనిన్నీ!! దాని మీదట, ఆ పంతులు పరామర్శపూర్వకంగా రామయ్యకి వేసిన జావాబులో, “మీకు వచ్చిన ఆపత్తు ఇంతా అంతా కాదు, గుండె నీరైపోయింది. విచారించకండి. నేనే బయర్దేరి మీ ఊరొచ్చి, సౌ|| అక్కగార్నీ మిమ్మల్నీ సమదాయించిందాకా, నాకు తోచటంలేదు,” అంటూ రాశాడు. రామయ్య ఆ ఉత్తరం పట్టిగెళ్ళి జానికిరామయ్యకి చూపెట్టి “నువ్వే, ఇదంతా చేశావు! ఆ పీనుగు ఈ ఊరొస్తాడుకదా ఏమిటి మరి సాధనం?” అన్నాడు, ఆమట్టున, ఊళ్ళోకి ఎప్పుడొచ్చి వాకబుచేస్తాడో అనే భయం చొప్పున, ఊరవతల రోడ్డుపక్కనున్న రెస్ట్‌హౌసులోనే వండుకు తింటూ రాత్రింబగళ్లు మనిషి విడిచి మనిషి చొప్పున కాసి, ఒకనాడు తెల్లారకట్ట ఒకబండిలో ఆయన వస్తూంటే, బండీ ఆపుచేయించి, ఆయన్ని రెస్టుహౌసులోకి తీసికెళ్లి, ఆయన్ని వెన్నిట్లో కుర్చీలో కూచోబెట్టి, వీళ్ళిద్దరూ చూరుకింది చీకట్లో కూచుని మాట్లాడారట! అక్కడ జరిగిన ప్రసంగం, తరవాత, జానికిరామయ్య నాతో చెప్పాడు.

పం - (రామయ్యతో) మీది మహచెడ్డచిక్కండీ! రామయ్య బావా!

రా - (చప్పరించి, నవ్వు ఆపుగుని) ఎం జేస్తాం?

జా - రాతండీ, రాతా! నరుడికి వశమా?

పం - చూపులేనా అందలేదు కావును!

రా - పాపిష్ఠి కళ్లకి అదికూడానా!

పం - ఇక అక్కగారి దుఃఖం చెప్పనే అక్కర్లేదు పాపం!

జా - ఆవిణ్ణి ఆపడం మహాకష్టంగా ఉందండి. కంటికీ మంటికీ ఏకధార!

పం - అన్నట్టు అక్కగారు లోపలున్నారా? ఓమాటు చూద్దాం పదండి.

జా - ఆవిణ్ణి ఈవేళే పుట్టింటారు పరామర్శకి తీసిగెళ్ళారండి.

పం - ఈ యిల్లు ప్రయాణీకుల బసలా ఉంది, మీరిందులో ఉన్నారేం?

జా - పిల్లపోయిన నక్షత్రం మంచిదికాదండి. పైగా వాడ త్రిపాదికూడా కాదుట, వాడ షట్పాదిట. అంచేత చుట్టుపక్కల ఇళ్లు కుదరక, ఇల్లా వచ్చాం.

అని మరి ఆయన్ని మాట్లడనియ్యక, ఆయన్ని ప్రాతఃకాల స్నానం చెయ్యమని, ఇంత అన్నం వండిపెట్టి, ఆయన్ని ఊళ్లోకి తీసిగెళ్లక, తెల్లవారకుండానే ఆయన్ని బండి ఎక్కించేసి, పంపేశారు. మరి రెండు నెల్లకి ఆయన దగ్గర్నించి వచ్చిన ఉత్తరంలో మేం వచ్చిన వేళావిశేషం వల్ల తమ అబ్బాయికి మరో సంబంధం కుదిరి పెళ్ళి అయిందనిన్నీ, మేం యాత్ర వెళ్లేటప్పుడు అటు వచ్చి పోవలసిందనిన్నీ ఉంది. అది లగాయతు, మేం యాత్రకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడూ కూడా, అక్కడ నాలుగేసి రోజులు ఆగుతూండేవాళ్లం! వాళ్లు భోజనం పెట్టేవాళ్లుగాని, కానైతే జామార్లు మాత్రం మళ్లీ ఇవ్వలేదు!

- జనవరి, 1928