గుసగుస పెళ్ళి/గుసగుస పెళ్ళి

వికీసోర్స్ నుండి


గుసగుస పెళ్ళి

“ఏమీ ఫర్వాలేదు, నీకేమీ తగాదా రాదులే, ఏమన్నా శృతిమించివస్తే నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం మాది పూచీ, ఇక్కడ పరాయివాళ్లు ఎవళ్ళూ లేరులే,” అని మేం ఎంతో భరోసా యిచ్చిం తరువాత కుంభయ్య శాస్త్రి తన అనుభవం ఈరీతిగా మాతో చెప్పాడు.

అయ్యా! మనవి చేసుకుంటాను పెద్దలూ, బంధువులూ, వెల్లడీ, లేని వివాహాలు ఎన్ని వందలవుతున్నాయని మీ ఊహ! డబ్బుఖర్చు తగ్గుతోందికదా అని వీట్లకి మోజు ఎక్కువవుతోంది. వీట్లకి ముహూర్తపు పట్టింపులు లేవు. అసలు రాజ్యాంగపు జబర్దస్త్రీలకి పంచాంగపు మూహూర్తాలు పాటించవలసిన అవసరం లేదు. ఏది వీలుగా ఉంటే అదే సుముహూర్తం. ఛస్తారా ఏమిటి ధర్మచ్యుతి అయేటప్పుడు!

నిన్న రాత్రి మా నాన్న నాలుగు పెళ్ళిళ్లు వరసని చేయించడానికి బజానా కాదు సొమ్మంతా పుచ్చేసుకున్నాడు. మూడు చేయించడానికి తనికి వీలుందని అంచనా వేసుకున్నాడు. నాలుగోది నన్ను వెళ్ళి చేయించమన్నాడు. పెళ్ళి చేయించడం అంటే ఇదేమన్నా కూర్చుని వస్తువు చేయించడం లాంటిదా! నాకు పెళ్ళి చేయించడం రాదు. చాలా రావు అందులో అదోటి ! తమకే తెలుసు. అయినాగానీ వెళ్ళాను. చూసిచూసి ఈ కాలంలో రూపాయలు పోగొట్టుకోనా మరీ!

ఆడపెళ్లివార్ని నే నెరగను.మగపెళ్లివార్ని అసలే ఎరగను. వాళ్ల పేర్లు గోత్రాలు వగైరా నాకేమీ తెలియదు. రాత్రి ఒంటిగంటకి ఈ ఊళ్లో రైలు దిగినట్టు ఒంటెద్దుబళ్లమీద వాళ్లు పెద్దింటివారి దొడ్డిదగ్గరి కొచ్చారు. ఆ యింటివారంతా మూడోకాలం నిద్రలో ఉన్నారు. ఏర్పాటు ప్రకారం వారిదోడ్లో రహస్యంగా రాత్రిళ్లు వివాహాలు అనేకం పిట్టకి తెలియకుండా అయిపోతుంటాయి. నేనూ అక్కడికి వెళ్లాను. ఒక బండీలోంచి ఒకపిల్లా తల్లిదండ్రులు ఇద్దరు వితంతువులూ దిగారు. రెండు పెద్దగోనీ సంచులుకూడా వాళ్ళు మెల్లిగా కిందికి సాయంపట్టారు. రెండో బండిలోంచి ఒక కుర్రాడూ తల్లిదండ్రులూ మరిద్దరూ దంపతులు దిగారు. వాళ్లు కొన్ని పెట్టెలు చప్పుడనేది లేకుండా దింపారు. అంతా లోపల జేరాం. వీళ్లతో ఒక చాకలీ వాళ్లతో ఒక నౌఖరూ వచ్చారు. వాళ్ల చేతికి ఒక బూర ఇచ్చి, కర్మవశం చేత ఏపోలీసులేనా, కిట్టనివాళ్ళె వళ్ళేనా, పసికట్టి వస్తూన్నట్టాయినా అది ఊదితే మేం లోపల మా జాగర్త మేం పడతాం అని వాళ్ళతో చెప్పి వాళ్ళని బయట నిలేశాం. నా బిచాణా నేను ఒక పక్కని పెట్టాను. 'బిచాణా ఎందుకయ్యోయ్?” అని మీరు ప్రశ్నించ గల్రు. ఎవడేనా తణిఖీకొస్తే నేను అమాంతంగా అది పరిచేసి గాఢంగా నిద్రపోతూన్నట్టు కనపడ్డానికి. జీలకర్రా బెల్లం ఉన్నాయా అని నేను ఒక వితంతువుని అడిగాను, సిద్ధంగానే ఉన్నాయని ఆవిడ అంది, పెళ్ళి అంటే నాకు తెలిసింది. అంతే, మంగళ సూత్రాలు నాచేతికిచ్చారు. అవాంతరం ఎదేనావస్తే నేను వాటిని బుగ్గని పెట్టుకోవలసి ఉంటుందని వాళ్ళు తీర్మానం చేశారు. ఏదో ఏడుస్తాను, మంగళాస్నానాలు కానిమని నేను వాళ్ళని తొందరచేశాను. “కాసిని వేణ్ణిళ్ళేనా లేక పోయాయిగదా” అంటూ ఒక వింతతువు ఏడవడం మొదలెట్టింది. ఆవిణ్ణి నిమ్మళంగా ఏడవమని కోప్పడ్డాం. ఇంకో ఆవిడ నిశ్శబ్దంగా నీళ్లు తోడింది. అవేనా మీద పోసేటప్పుడు ధ్వని అవుతుందేమో అని భయమేసి, ఊరికే తడిగుడ్డపెట్టి వొళ్ళుతుడిస్తే చాలని నేను అన్నాను. శాస్త్రం అల్లా ఒప్పదని పెళ్ళికొడుకు తండ్రి మహా ఎగరడం మొదలెట్టాడు, బోడి ఎగరడం వీడూనూ! నాకు డబ్బు వెనకే ముట్టిపోవడం వల్ల నేను నిర్భయంగా ఓ కఠినమైన శ్లోకం చదివి దానికి అర్థం 'ధర్మంనిలబెట్టడానికి అధర్మం చెయ్యచ్చు, చెయ్యాలి' అని మెల్లిగా చెప్పి ముహూర్తం, దాటపెట్టొద్దని కూకలేశాను. మూడుగంటల ముప్పై అయిదు నిమిషాలకి ముహూర్తం, గడియారం, ఎవరి దగ్గిరా లేదు. చటుక్కున నేను మహాతెలిసినట్టు నక్షత్రాల కేసి చూసి 'సరే, ఇంకా బలువుగా రెండుగడియల వ్యవధి ఉంది' అన్నాను. అల్లా అనడం మరీ బాదైపోయింది. నేను ఝణ ఝణా మంత్రం చెప్పటం లేదని కన్యాప్రదాతకి నా మీద ఇంతముట్టుకుంది. అందుకని పైకి వినపడ్డం ప్రమాదం గనక నేను అవసరం చొప్పున మంద్రస్థాయిలో మాట్లాడుతూన్నట్టు నటించి తల ఎగరేసి పెదిమిలు కదుపుతూండే సరికి మెడా నోరూ నెప్పెట్టి చచ్చాను. ఈ ఘడియ వరకు అవి స్వాధీనంలేవు. ఆపళంగా పెళ్ళికూతురుతల్లి, “ఇంత డబ్బోస్తూన్నా నాపిల్లకి ఒక్క ముచ్చటా తీరలేదుకదా! అసలు పల్లకీ అంటే దానికి ఎంతో అంత మనసు! బాజాలంటే దానికి అన్నం అక్కర్లేదు. రాత ఇల్లా ఉంటే అవన్నీ ఎల్లా వస్తాయీ! అందులో మొగాళ్ల పురమాయింపులు! అయ్యో! బతుకు!” అంటూ రాగా లెట్టి ఊహూ చీత్తూ కూర్చుంది. పెళ్ళికొడుకు అప్పగారొచ్చి పానకబ్బిందిలేనా లేకపోవడం ఆడపెళ్ళివారి మొహంలా ఉందని తిప్పుకొని ఆడింది. పెళ్ళికొడుకుతండ్రొచ్చి “తాంబూలాలప్పుడు ఈ బాజాల సంగతి మీరు ఏమాత్రం మాతో ఊదినా, డోళ్ళూ అవీ పెద్ద రావణాచప్పుడు కాకుండా కాస్త తడిపించేనా నేను తెప్పించి ఉండేవాణ్ణి, ఊరేగడానికి వీలంటూ లేదు గనక పల్లకీ మానేశాం. లేకపోతే భాగ్యమా? మా విస్తళ్ళదగ్గిర రోజూ మేం పారేసే మెతుకుల పాటి విలవ లేదు మీరు కోరేవాట్ల విలవంతా! అది మాకు ఓ లెఖ్ఖా ఓ పత్రమా” అని సమర్ధించుకోవడం మొదలెట్టాడు. కన్యాప్రదాత, “ఇక్కడేనా కాస్తోకూస్తో దొడ్డిఅంటూ ఏడిసింది కాదుటయ్యా పోనీ యథాశక్తి దొడ్లోనే ఊరేగి ఉందుం. ఏదో రవంత పల్లకీ లాంటిది తీసుగొచ్చి మరీ ఏడవకపోయావూ! ఊరేగితే ఎవడేనా పట్టుగుంటాడుగాని, దొడ్డేగితే నీ కొంపేం ములిగిందీ!” అని అందుకున్నాడు.

వియ్యంకుడు - “వీల్లేక పోయిందని చెబుతున్నాను, గ్రహించండి. అక్కగార్ని నిమ్మళంగా ఇదవమనండి. ముహూర్తం ఇంకా కాలేదాయె మరి, ఇప్పణ్ణించీ ఊహూ రాగాలెందుకూ! అనుకున్న లాంఛనాల్లో ఒక్కటీ జరక్కపోయినా మేం నోరు నొక్కుకొని కుక్కినపేనుల్లా ఊరుకోలేదూ!” అన్నాడు.

కన్యప్ర - ఇప్పుడు నీకు లోటొచ్చిన లాంఛనాలేమిటోయ్?

వియ్యం - “ఏమోయ్” అనా, నన్నంటున్నావ్ (అని కళ్ళెఱ్ఱచేశాడు)

నేను - (పళ్ళు బిగించి) అబ్బ! నిమ్మళం! మెల్లి మెల్లిగా తిట్టుకోండి.

కన్యాప్ర - “ఏమోయ్” కాదు, "ఏమిరా” అని కూడా అంటాను మళ్ళీ నోరెత్తితే. తాంబూలాలనాడు నువ్వు అయిదు వందల ఎనభైయ్యీ లెఖ్ఖెట్టి పుచ్చుగున్నావ్, పూటా రూపాయిలని ఆరు తీసెయ్యించి, ఖంగున మోగేవి అందులో వేస్తేగాని ఉరెట్టుగుంటా నన్నావ్, అందులో లేవూ నీలాంఛనాలన్నీ! వియ్యం - లేవు (అని ధిక్కరించి చూశాడు)

కన్యాప్ర - ఉన్నాయి! ఉన్నాయంటూంటే ఏమిటది పోట్లగేదిలా అల్లాచూస్తావ్!

అంటూ వియ్యంకులిద్దరూ చెయ్యీచెయ్యీ కలుపుకోవడంలోకి వచ్చింది. ఆ సమయంలోనే, వాణ్ణితగలెయ్యా, చాకలాడు వీధులోంచి ఈలేశాడు, నాకు పైప్రాణాలు పైన పోయాయి. తక్షణం నేను ధైర్యం తెచ్చుకొని కంబళీ ఓటితీసి వియ్యంకులిద్దరికీ మూలగా ముసుగేసి, వాళ్ళని అందులో తగ్గుస్థాయిలో దెబ్బలాడుకోండని, నాపక్క విప్పిపరుచుకొని, తక్కిన వాళ్లందర్నీ ఒరగమని సంజ్ఞచేసి, మంగళసూత్రాలు - తీరానోట్టో పెట్టుగుంటే ఎవడేనా శత్రుమధ్యం వెధవొచ్చి, నన్ను సాచి లెంపకాయకొడితే ఊడి ఇవతల పడతాయేమో అని భయపడి - రొండిని దాచేసుగుని, పడుకుని, దుప్పటి తీసి రాయిలాతొక్కిపెట్టి మేకు బందీ చేసి ముసుగెట్టాను. ఒక్క నిముషం నిశ్శబ్దంగా సమాధిలా ఉంది. ఎవరో పైనించి తలుపుతట్టారు. తప్పకుండా పోలీసు యములాళ్ళే అయి ఉంటారనుకుని నేను స్పుటంగా హెచ్చుస్థాయిలో గుర్రు ఝమాయించాను. తలుపు మళ్ళీకొట్టి మళ్ళీకొట్టి అవతల కుంక ఆగిపోయాడు. వెంటనే గభీమని ఎవడో దొడ్లోకి దూకాడు. నాకు నిజంగా ప్రాణం గక్కురుమని గుండె నోట్టో కొచ్చినట్టయింది. “బాబుగారండి, ఓడూ లేడండి. నేను సాకల్నండి” అన్నాడు ఆ వచ్చిని చచ్చినాడు. “ఓరి వెధవ గదరా, వెధవా” అనుకున్నాను నేను. “ఆడూ నేనూ ఈలకోసరం పట్టింపులోయాం అండి. నేనుగల్తే ఈల నోట్టో యెట్టుగునే ఆడిమీద కలమడ్డామండి. అల్లానే ఆణ్ణి తిట్టడంలో కాంతంత కూసినట్టు తమరికిగాని యినమడింది గాబోసును!” అంటూ కూడా తమరి దెబ్బలాట సంగతి ఆ పీనుగుచెప్పాడు. ఈ పాటికి ముసుగులోంచి పైకొచ్చి వియ్యంకుల మీది కంబళీ తీసి వాళ్ళని బహిరంగ పరిచాను. అప్పటికి వియ్యంకులు యజ్ఞోపవీతాలు తెంపుగోడం పూర్తికాగా, ఒకరి శిఖ ఇంకోరిచేతుల్లో పట్టడి ఉండగా, తలుపు చప్పుడు వల్ల ఆగి ఒకర్నొకరు మోరచూపు చూస్తూఉన్నారు. అప్పుడు నేను కలగచేసుగుని, శబ్దం చెయ్యకుండా గొంతికలట్టుగుని ఇద్దర్నీ గుంజి, లేవదీసి ముక్కుమీద వేలేసుకొని, చాకల్ని మళ్ళీ కాపలాకి సాగనంపి, కన్యాప్రదాతచేత పెళ్ళి కొడుకు కాళ్ళు కడిగిపించి, పెళ్ళికూతుర్ని తీసుగురమ్మని సంజ్ఞచేశాను. ఓ వితంతువు తన సంచీలో దాచి తెచ్చిన తట్ట పట్టుగొచ్చి పెళ్ళికూతుర్ని అందుల్లో కూచోమంది. అని, 'మేనమామ రాలేదు. పెళ్ళికొడుకు బావగార్ని తట్టతీసికెళ్ళమనండి. మా పిల్లంది తట్టల్లో తలవంచుగు కూచోడం చూసి మురిసిపోవాలని మేం ఉన్నాం' అనికూడా అంది. అల్లానే నేను చేయించి, “ముమూర్తం దగ్గరికొచ్చి మీదపడిపోతోంది, తెండి జీలకర్రా బెల్లమూ” అన్నాను. అని ప్రవరకొంచెం చెబుదాం అనుకునేసరికి, వీళ్ళిద్దరి గోత్రాలూ ఒకటే, వీళ్ళ మొహం ఈడ్చా! అంతా తెల్లపోయారు. కాస్త సమాళించుగుని కన్యా ప్రదాత అప్పగా రొచ్చి, “ఏమిరా! తమ్ముడూ! కాస్త గోత్రం సంగతి చూసుగోరుట్రా, ఇంత ఖర్చూ. పెడుతూనూ!” అంది. అతను “ఎమో, నాకేం తెలుసూ! మీరంతా తాంబూలాలుచ్చుగోడం అంటూ అట్టహాసం చేసి వార్నీ వీర్నీ కేకేస్తే, వెల్లడయి కొంప తవ్వుతుంది వద్దు కాకవద్దని, నాలిక తెంపుగున్నారుగా! తాంబూలాలప్పుడు వాడూ నేనే ఉంటా! ఆ వెధవ ఊహూ మళ్ళీ మళ్ళీ రూపాయిలు లెఫ్టిచూసుకోవడమే! నేను పిల్లకి ఎల్లా నేనా కన్నె చెరవదిలించి ధర్మం ఎల్లనో నిలిపెడదాం అనే!” అన్నాడు. మనస్సుల్ని బట్టి చూస్తే వివాహానికి స్త్రీ పురుషులైతేసరి, గోత్రం పట్టింపులేదని బుకాయిద్దాం అంటే, నాకు ధైర్యం చాల్లేదు. "అయితే మరి నాకు సెలవు. ఉంటాను.” అన్నాను నేను పెళ్ళికొడుకు తండ్రి అమాంతంగా నా రొంటినున్న మంగళ సూత్రాలు - అక్కడుండడం ఎప్పుడు చూశాడో ముండావాడు-ఊడలాగి పుచ్చుకున్నాడు. ఒక వితంతువు కళ్యాణం రావాలమ్మా! కళ్యాణం రావాలీ! నేను కళ్లారా చూద్దాం అని ఇబ్బందైనాసరే చూరికిబుట్టెడు తలంబ్రాల బియ్యం మూటకట్టి తెచ్చాను. పాపిష్టికళ్ళకి ప్రాప్తం లేదు.” అని దుఖ్ఖించింది. అంతా లేచి కళ్ళు నులుముకుంటూ తలోమాటా ఆడారు. ఈ సందులో, కన్యాప్రదాత నన్ను పక్కకి లాక్కెళ్ళి “మీకు ప్రమాణపూర్తిగా చెయించడం వచ్చా!” అని అడిగాడు. “రామ రామ! నాకు రాదండి” అని లబ్బున మొత్తుగున్నాను. వెంటనే ఆయన ఒక పదిరూపాయల కాగితం నా మీద పారేశాడు. పారేస్తూ, “నయమే!

మీకే అసలు మంత్రాలన్నీ వచ్చి ఉంటే ఈ పాటికి చావవలిసొచ్చేది” అని నన్ను పొగిడాడు. తరవాత అతను 'నా రూపాయిలు ఇవ్వకుండా వీధులోకాలెట్టావంటే, రెండోకాలుఉండదు. జాగర్త!' అని వియ్యంకుణ్ణి - ఇహను అల్లా అనకూడదు - గనక ఆ రెండోవాణ్ణి నిలేశాడు. వాడు 'చాల్లే! జీలకర్రా బెల్లం మినహాయింపుగా వివాహం. వివాహంతాలూకు హైరానా, యావత్తూ అయింతరవాత ఇప్పుడెల్లా కట్నాం వెనక్కియ్యడం?” అన్నాడు. 'ఓరి నీతాడు తెంపా, అల్లాయితే దూట బిళ్ళల్లాంటి రూపాయిలు లాగేస్తావుట్రా' అని పెళ్ళికూతురుతండ్రి పందిరిగడ గుంజి దొరకపుచ్చుకున్నాడు. ఆమట్టుగా పందిరికి వేళ్ళాడగట్టిన హరికేన్ లాంతరు ఊగిసలాడి దిబ్బుమంది. ఆచీకట్లో నేను నా బిచాణా పోగుచేసుగుని ఇవతలపడి, ఇల్లుచేరేదాకా వెనకచూపు లేకుండా అదేపరుగు!

ఒక వేళ గోత్రాలు సరిపడి, అది ఖాయంగా పెళ్ళే అయిఉండి, తరవాత మొగుడూ పెళ్ళాలకి తగాదాలొచ్చి, మొగుడు పెళ్ళాన్ని వొదిలేస్తానని బెదిరించడంతో ఆ పిల్ల తన పెళ్ళామే కాదని అంటే, అప్పుడు అసలు నిజంగా పెళ్ళి జరిగిందా అనే సంగతి గురించి సాక్ష్యం కావలిసొచ్చినా, నేనుయుగం తిరిగినా సాక్ష్యం ఇచ్చిఉండను. నాకు పెళ్ళి చేయించడం రాదని మీరు సాక్ష్యం, అందుకే ఈసంగతి నేను తమతో మనవిచేసుగున్నాను.

అని చెప్పి, కుంభయ్యశాస్త్రి, సంగతి ముగించాడు, " అందరంగం

- సెప్టెంబరు, 1938