గణపతిముని చరిత్ర సంగ్రహం/దేశోద్ధరణ కాంక్ష

వికీసోర్స్ నుండి

5. దేశోద్ధరణ కాంక్ష

శంకరశాస్త్రి అను వ్యక్తికూడ కావ్యకంఠునిచే తనకు పూర్వ జన్మ కింకరుడుగా గుర్తింపబడి దొరస్వామికి తోడయ్యెను. వీరిద్దఱి వలన విద్యార్థులు గుంపులు గుంపులుగా ఆయనవద్దకు వచ్చుచుండిరి. వారు ఆయనను సముద్రతీరమునకు తీసికొనిపోయి దేశోద్ధరణమునకు ఉపాయములను చర్చింపజొచ్చిరి. ఆయన వారికి వేద రహస్యముల యుత్కృష్టతను, ఋషుల తపశ్శక్తుల మహిమలను బోధించుచు నిట్లు చెప్పుచుండెను. "........సన్యాసి వేషములు బుద్దునికాలమునుండి మన కొంప ముంచినవి. కాషాయ ముండనములందున్న మన గౌరవమును జూచి మన కన్నివిధముల క్షారమొనర్చుట కితర దేశస్థులు పరంపరలుగా మనదేశమును కొల్లగొట్టిరి. శుష్క వైరాగ్యము నాశ్రయించిన ఈ వేషధారులు మనసంఘమధ్యమందే నిర్వ్యాపారులై విహరించుచు తమ కుక్షి కొఱకు మన కుక్షులను హరించుచున్నారు. వీరియం దనాదరణము జూపియైన వీరిని గార్హస్థ్యమునకు మరల్చుట మన జాతి కవసరమగు ప్రథమ సంస్కారము. రెండవది గోచి గావంచా సాంప్రదాయము లెట్లితర దేశస్థులచే మనయందు పరిహసింప బడుచున్నవో గుర్తించి మనలను నవ్వులపాలు చేయని విధమున సాంప్రదాయములను సంస్కరించుకొనుట. అట్లే మన కాదర్శ ప్రాయులైన ఋషులను నీచబరచు విధమున అల్లబడిన దుష్ట కథలను పురాణములనుండి, కావ్యప్రబంధ నాటకాది గ్రంథముల నుండి తొలగించి యట్టిధోరణిని కవులందు నిరసించుట మూడవది. మన జాతియందు వీర్యబలతేజములు తిరుగ వర్ధిల్లుటకై స్త్రీ పురుష విచక్షణలుగాని వర్ణభేదములుగాని మంత్రధ్యానము కొఱకు లేకుండునట్లుచేసి గృహములన్నియు మంత్ర స్పందనములచే ప్రతిధ్వనించు నట్లొనర్చుట నాల్గవది. ఈ నాలుగింటి నేకకాలమందే సాధించవలెను. అప్పుడు మనదేశము, మనజాతి కూడ సర్వారిష్టములనుండి విముక్తిబొందుట తథ్యము..."[1]

రంగయ్యనాయునితో మాటాడుచు కావ్యకంఠుడు ఒకనాడు ఇట్లు ఉద్ఘాటించెను. "రాతియుగము, కంచుయుగము అను విభాగము లూహాగానములు. బృహత్తరమైన మనదేశమందిప్పటికిని వెండిబంగారములతో పాటు ఇతర లోహములను రాళ్లను పాత్రలుగా వాడుక చేయుచున్నాము. మట్టితో చేయబడిన కుండలను వాడు చుంటిమి. ఏయే కార్యముల కేవేవి శ్రేష్ఠమో యుగయుగముల క్రిందటనే మనము తెలిసికొంటిమి. తెలియనివారును మనమధ్య నున్నారు. అట్టివారిని జూచి వారు మనతొలినాగరికతకు చెందిన వారనుట సమంజసము కాదు. .........నాగరికత యనునది దీనిని బట్టి మనము వాడుకచేయు పాత్రలపై ఆధారపడ దని విశదమగును. ...... ఇట్టి ధోరణి చొప్పున మన మతమునకు గూడ చరిత్ర వ్రాసినవా రున్నారు. వీరి దృష్టిలో వేదకాలమందాచార్యులు పశువులమందల నడవులందు మేపుకొనుచు పశు సంపదకొఱకే ప్రార్థించువా రనియు, కొండలను నదులను దైవములుగా భావించి నిర్గుణదేవతాతత్త్వమును గ్రహింపలేకుండి రనియు దోచినందున వేదకాలమునందు మతభావములు సంకుచితములై, క్రమాభివృద్దిచే విశాలము లగుచు, జైన - బౌద్ద - మహమ్మదీయ - క్రైస్తవ ప్రవక్తల ప్రబోదములను గ్రహించి పూర్ణతచెంది నట్లెంచువారు. భావదాస్యముచే ప్రభువులు వ్రాయించినవన్నియు సత్యములని జనులు గ్రహించుచుండిరి. మన పురాణములను రచించిన కవులు మనవారైనను తమకున్న మహత్తర కవితా ప్రజ్ఞ నిట్లు నీచకథలను పరివ్యాప్త మొనర్చుట కియ్యకొనినట్లు నాకు దోచుచున్నది. ఒకదాని నొకటి పోలని యీ పురాణములకు ప్రామాణ్యముల నిచ్చు మన పండితులు సైత మందలి కల్పిత కథలను విమర్శింపకుండుట శోచనీయమై యున్నది. అట్టి కథల నందుండి తొలగించినచో మనకు అవి యన్నివిధముల పూజా గ్రంథములు కాగల్గునని నా నమ్మిక"[2]

ఒకనాడు రంగయ్య "దేనిని గురించి మీరింత దీర్ఘముగా మాటిమాటికి ధ్యానించుచుంటిరి." అని అడుగగా కావ్యకంఠుడు "దశాం దేశ స్యైతాం ప్రతిపద మయం ధ్యాయతి జన:" (ఈ దేశముయొక్క దశనే మాటిమాటికి ఈ జనుడు తలపోయు చున్నాడు) అని చెప్పి తన యభిప్రాయములను రెండుశ్లోకములలో వ్యక్తీకరించెను. దీనిని బట్టి భారతజాతి యొక్క దుర్గతిని గూర్చి ఆయన ఎంతగా పరితపించుచుండెనో స్పష్ట మగుచున్నది.

చెన్నపురి నుండి కావ్యకంఠుడు తిరువణ్ణామలై చేరిన కొన్నాళ్లకు రంగయ్య రామస్వామితో కూడివచ్చి వేలూరులోని క్రైస్తవ కళాశాలలో ఆంధ్ర భాషాధ్యాపకపదవిని స్వీకరింపుడని ఆయనను కోరెను. ఆ మాటవిని విశాలక్షమ్మకూడ భర్తను ప్రోత్సహించెను. 1904 జనవరిలో ఆయన అరుణాచలం వీడి వేలూరునకు వచ్చెను. కళాశాలలో ప్రవేశించిననాడే యఫ్. ఏ. తరగతిలో (F.A. Father of Arts ఇప్పటి ఇంటర్మీడియేట్) రామస్వామికి మేనల్లుడైన అప్పుశాస్త్రిని (కె. జి. సుబ్రహ్మణ్యశాస్త్రి) తనకు ఆప్తుడైన శిష్యునిగా గుర్తించెను. అప్పుశాస్త్రి తన తమ్ముడైన కళ్యాణ రామునితో గురువును సేవించుచుండెను. ఈ సోదరులను తనకు పూర్వజన్మ సంబంధులైన కింకరులనుగా గుర్తించి కావ్యకంఠుడు వీరికి మంగళ ప్రదమగు మంత్రమును ఉపదేశించెను.

వేలూరులో కావ్యకంఠునియొద్ద ఎందరో స్త్రీలు పురుషులు మంత్రదీక్షలను గైకొనిరి. వీరిలో విద్యార్థులు అధికముగా నుండిరి. పెద్దలలో సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పినతండ్రియైన నరసింహం ప్రముఖుడు. ఈయనయే తర్వాత సన్న్యసించి "ప్రణవానందు" డయ్యెను. ఇంటియొద్ద అధ్యాత్మిక బోధన కాక పెద్దల యభ్యర్థనమున కావ్యకంఠుడు బహిరంగసభలలో కూడ వేదమత ప్రాముఖ్యమును గూర్చి బోధించెను. ఈ ప్రసంగముల వలన హైందవమతమును పరిహసించు వ్యసనము క్రైస్తవులలో చాల వఱకు తగ్గెను. ఉపాధ్యాయులయందున్న గౌరవమునకు నిదర్శనముగా వారి మతమునకు బానిసలు కానక్కఱలేదని విద్యార్థులు గ్రహించిరి. విద్యార్థులయందు వేదమతాభిమానముతో పాటు మాతృదేశభక్తి ప్రబలజొచ్చెను. ఉత్తరదేశమున ప్రజ్వరిల్లు చున్న విప్లవోద్యమముచే చెన్నపురమున విద్యార్థులు ప్రభావితులై ఉద్రేకము నొందజొచ్చిరి. దొరస్వామి వారికి నాయకుడై వేలూరు నకు వచ్చి ఆ ప్రాంతమున విప్లవము నారంభించుటకు కావ్యకంఠుని యాశీస్సులను అర్థించెను. ఆయన దొరస్వామిని మందలించి విద్యార్థులు నాయకుల ప్రచారమునకు లోనై తమ విద్యాభ్యాసమును వదలు కొనుటగాని, జీవితములను అపాయముల పాలొనర్చుటగాని మూర్ఖత్వమని, విప్లవనాయకులు తమ స్వార్థమునకు విద్యార్థుల జీవితములను బలిగొనుట తప్పు అని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని యధ్యక్షతయందు జరిగిన సభలో హెచ్చరించెను. తరువాత కొందఱు విద్యార్థులు ఆయన యొద్దకు వచ్చి దేశ స్వాతంత్ర్యము కొఱకు మంత్రశక్తితో ఉద్యమమును నడుపగల యొక సంఘమును స్థాపింపుడని కోరిరి. అప్పుడు ఆయన బ్రాహ్మణ విద్యార్థులతో ఇంద్రసంఘమును స్థాపించి, అది వేద మతోద్ధరణమునకు కృషిచేయవలయునని "ఉమాం వందేమాతరమ్" అను నొక మంత్రమును కల్పించి వారికి ఉపదేశించెను. ఆయన విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వముపై విప్లవము జరుగునట్లు చేయుచున్నాడని కొందఱు ప్రభుత్వమునకు ఫిర్యాదులను చేసిరి. కాని యధికారులు విచారించి ఈ యపవాదులను త్రోసివేసిరి.

17 - 2 - 1907 తేది రాత్రి వేకువజామున కావ్యకంఠునకు భద్రకుడు కలలో కన్పించి "ఓయీ! నా దేహయాత్ర ముగిసినది. నీవు స్వయముగా జాగరూకుడవై యుండుము; ఇంక నీ తపస్సు చేత సంఘము తీవ్రముగా చలించును" అని యంతర్ధానము నొందెను. కావ్యకంఠుడు సోదరుడు పోయినట్లుగా దు:ఖించి స్నాన మొనర్చి వానికి తర్పణము గావించెను. తరువాత ఆ రాత్రియే మరణించిన దివ్యజ్ఞాన సమాజాధ్యక్షుడైన కల్నల్ ఆల్కాట్ దొరయే భద్రకుడని వార్తాపత్రికలలో వేయబడిన బొమ్మను చూచి గుర్తించి, ఆతడు జీవించియుండగా తాను అతనిని కలిసికొనలేక పోతినని కావ్యకంఠుడు పరితపించెను.

తండ్రి యభిలాషను తీర్చుటకై గణపతిశాస్త్రి కలువఱాయి నుండి ఆయనను గైకొనిపోయి కాశీయాత్ర చేయించెను. గంగలో స్నానము చేసినంతనే ఆయనకు నేత్ర రోగము ఉపశమించెను. స్వగ్రామమునకు చేరగానే వేలూరులో తన కుమారుడైన మహాదేవునకు మశూచి వ్యాధి సోకినట్లు తెలిసి ఆయన భార్యతో వెంటనే బయలుదేరి వేలూరునకు వచ్చెను. కుమారుని చూచి ఆయన ఉగ్రమారీచి నాహ్వానించి శ్లోకములను చెప్పినంతనే మశూచి మాయమయ్యెను.

తరువాత దసరా యుత్సవములలో గణపతిశాస్త్రి సకుటుంబముగా "పడైవీడు" లోని రేణుకాదేవిని దర్శించెను. నాటి నుండి ఆయనకు తపస్సుపై ఇచ్ఛ తీవ్రము కాజొచ్చెను. ఒకనాడు ధామస్ హారిస్ అను ప్రధానోపాధ్యాయుడు ప్రసంగవశమున 'సంసారమును విడచి నిజముగా తపస్సు చేయువారు ఇప్పుడు ఎవ్వ రున్నారు?' అని పలికెను. వెంటనే కావ్యకంఠుడు 'నేను చేసెదను' అని ఉద్యోగమునకు అప్పుడే రాజీనామా ఇచ్చి 3 - 11 - 1907 వ తేది తపస్సు చేయుటకు తిరువణ్ణామలైకి తిరిగి వచ్చెను.

  1. * నాయన - పుటలు 173, 174
  2. * నాయన - పుటలు 175, 176