గణపతిముని చరిత్ర సంగ్రహం/"నాయన" నామము

వికీసోర్స్ నుండి

7. "నాయన" నామము

ఆనాడు భోజనానంతరం వాసిష్ఠుడు రథ చలన సంఘటనము వలన వ్యక్తమైన ఈశ్వారానుగ్రహమును గూర్చి ధ్యానించు చుండగా, బ్రాహ్మణ స్వామిని దర్శింప వలయునని తలంపు హఠాత్తుగా కలిగెను. 'ఆ స్వామి యందు కాషాయము, దండము మొదలుగా ఆశ్రమ ధర్మ లక్షణములు ఏమియు లేకున్నను, ఆయన యందు అచంచలమైన యాత్మ నిష్ఠ ఏదో వున్నది. లేకున్నచో అంత తేజస్సు కలవాడు అట్లు నిశ్చలముగా నుండ గలుగుట సంభవము కాదు; ఆయన సన్న్యాసి కాకున్నను సకలాశ్రమములను అతిక్రమించిన యవధూతయై యుండును' అని వాసిష్ఠున కప్పుడు తోచెను. తోచినదే తడవుగా ఆయన మండు టెండలో వడివడిగా విరూపాక్ష గుహ యొద్దకు పోయెను. అదృష్టవశమున అప్పుడు ఆ ప్రదేశము నిర్జనమై బ్రాహ్మణ స్వామి ఒక తిన్నెపై కూర్చుండి యుండెను. వాసిష్ఠుడు ఆయనకు పాదాభివందనము గావించి భక్తి పారవశ్యమున కనులవెంట బాష్పములు స్రవించు చుండగా ఇట్లు ప్రార్థించెను 'స్వామీ! ఉత్తమములైన పెక్కు మంత్రములతో తపస్సును గాఢముగా చేసితిని. కాని నా యందు ఇంకను దేవుడు ప్రసన్నుడు కాలేదు. నేను పండితుడ నైనను నా సాధనలో ఏమి లోపమున్నదో తెలిసికొన లేకున్నాను. తపస్సు యొక్క స్వరూపమును తెలిసికొనుటకై మిమ్ము శరణు పొందుచున్నాను. అనుగ్రహింపుడు.' స్వామి ఈ ప్రార్థనమును విని నెమ్మదిగా వాసిష్ఠుని గుర్తించి కరుణార్ద్ర దృష్టితో కొంతసేపు చూచి మెల్లగా తమిళమున ఇట్లనెను. " 'నేను' అను స్ఫురణము ఎందుండి వచ్చుచున్నదో విచారించినచో మనస్సు అందే లీనమగును. అదియే తపస్సు. జపము చేయు నప్పుడు మంత్రనాదము ఎందు ఉదయించు చున్నదో పరికించినచో, పరికించు మనస్సు అందు లీన మగును. అదియే తపము."

బ్రహ్మోత్సవములలో అష్టమ దినమున కార్తిక శుద్ద చతుర్ధశి యందు అశ్వినీ యుక్త సోమవారమున (18 - 11 - 1907) ఈ యుపదేశము జరిగెను.

మొదటి వాక్యముచేత సకల కార్యములకు మొదట పుట్టునట్టి 'నేను' అను కర్తృత్వము యొక్క స్ఫురణము ఎందుండి పుట్టుచున్నదో గమనింప వలయునని, రెండవ వాక్యముచేత సకల వాక్యములకు మూలమైన నాదము ఎందుండి పైకి వచ్చుచున్నదో పరిశీలింప వలయునని అదియే తపస్సని మహర్షి బోధించెను. ఇది విన్నంతనే వాసిష్ఠుడు సకల వేదాంతముల సారము ఇదియే యని గ్రహించి అమృతమును రుచి చూచినవానివలె సంతోషము నొంది మరల గురువునకు సాష్టాంగముగ ప్రణమిల్లి 'ఈ యుపదేశమును అనుసరించి మీ పాద సన్నిధిని కొంతసేపు తపస్సు చేయుటకు అనుజ్ఞ నిండు' అని ప్రార్థించెను. 'గుహ లోపల కూర్చుండి ధ్యానింపుడు' అని స్వామి అనుజ్ఞ నొసంగెను. అదివఱ కెన్నడు వాసిష్ఠుడు గుహలో తపస్సు చేయలేదు. గురు కటాక్షము చేత గుహలో ప్రవేశించుటకూడ సంభవించెనని ఆయన సంతసించి గుహలో కూర్చుండి 'నేను' అను స్ఫురణము ఎందుండి వచ్చు చున్నదని విచారింప జొచ్చెను.

ఎట్టి ఆలోచనమును రానీయక, ఆలోచనము ఉబికినంతనే దాని పుట్టుక స్థానమును గమనించుచు దానిని అణచుట ఈ సాధనము యొక్క పద్ధతి. "నేను" అను స్ఫురణలో రెండు భాగము లున్నవి. మొదటిది కర్తృత్వము. రెండవది మనస్సుయొక్క ప్రసరణము. దీనినే వృత్తి యందురు. కర్తృత్వము చేతనము. మనోవృత్తి జడము. ఆలోచనమును అరికట్టి "నేను" యొక్క మూలమునే పరికించుచున్నచో మనోవృత్తి లయము నొంది 'నేను' శుద్ధ చైతన్యముగా భాసించును. శుద్ధ చేతనమైన 'నేను' అను స్ఫూర్తియే ఆత్మ. 'నేను' శుద్ధముగ గోచరించుటయే ఆత్మ సాక్షాత్కారము.

ఇట్లు విచారించుచు కావ్యకంఠుడు మనస్సును అంతర్ముఖ మొనర్చి దాని మూలమును పొందలేక పోయినను దానియొక్క సమీపమున సుఖస్థితి పొంది సుమారొక గంటసేపు ధ్యానమగ్ను డయ్యెను. ఆ స్థితి తొలగినంతనే వాసిష్ఠుడు "ఇప్పటి వఱకును మఱుగున పడియున్న తపో విధానమును పునరుద్ధరించుటకు భగవంతుడే ఈ కాలమునకు తగిన మహర్షిగా ఈ స్వామి రూపమున అవతరించె" నని నిశ్చయించుకొనెను. ఇంతలో స్వామికి పరిచారకుడైన పలని స్వామి అచ్చటికి వచ్చెను. అతని వలన స్వామి పేరు 'వేంకటరామన్‌' అని తెలిసికొని వాసిష్ఠుడు ఆ గురువరేణ్యుని 'భగవాన్ శ్రీ రమణమహర్షి' అని పేర్కొనుట ఉచితమని తలంచెను. వెంటనే పలనిని అడిగి లేఖన సామగ్రిని గైకొని "శ్రీ రమణ పంచకము" అను పేరుతో అయిదు శ్లోకములను రచించి, స్వామి యొద్ద చదివి, అర్థమును తమిళమున వివరించి ఆ శ్లోక రత్నమాలికను గురుదక్షిణముగా వాసిష్ఠుడు ఆయనకు సమ ర్పించెను. "సరే నాయనా" అని స్వామి దానిని స్వీకరించి భద్రపరచుటకై పళనికి ఇచ్చెను.

అప్పటికి ఎన్నడును ఒక్క మాటైనను పలుకని స్వామి మాటాడు చుండుటను చూచి పలని ఆశ్చర్యానంద పరవశుడై పురము లోనికి పరుగెత్తి నలుమూలల "ఎవ్వరో నాయన" అను వ్యక్తితో బ్రాహ్మణస్వామి మాటాడుట కారంభించెనని కనబడినవారి కెల్ల చెప్పెను. పూర్వ దినమున రథము కదలినట్లే ఆనాడు స్వామి యొక్క వాక్కు అను రథము కదలినట్లుగా జనులు కుతూహలముతో స్వామియొద్దకు వచ్చిరి. వారికి అందఱకు స్వామి దర్శనము సులభమగుట కొఱకు పలని గుహకు ముందున్న దడిని తీసివేసెను. జనులు గుంపులై స్వామిని పరివేష్టించిరి. ఒక పండితుడు స్వామిని సమీపించి "స్వామీ ! మీ రీ దినమున ఎవరో 'నాయన' అను వ్యక్తితో మాటాడుటకై మౌనము వీడినారట. ఆ సత్పురుషు డెవడు? ఎక్కడున్నాడు? అని యడిగెను. స్వామి 'వీరే నాయన' అని వాసిష్ఠుని చూపెను. క్రిందటి దినమున రథము కదలుటకు కారణ భూతుడైన వ్యక్తి అతడే అని కొందఱు గుర్తించిరి. రెండు అద్భుతములకు కారణమైన వాసిష్ఠుని అందరు సంభ్రమముతో గౌరవముతో చూచిరి. దాక్షిణాత్యులు దేవుడైన గణపతిని 'నాయన' అని పేర్కొందురు. 'స్వామి స్వయముగా 'నాయన' అని పేర్కొన్న వాసిష్ఠుడు కూడ గణపతి యంశమున జన్మించి యుండునని వారు స్వామికి, గణపతికిని ప్రణమిల్లిరి. అప్పుడు వాసిష్ఠుడు వారి కిట్లు చెప్పెను. 'ఈ స్వామి లోక గురువుగా అవతరించిన దివ్య మూర్తి, కావున నేను ఈయనకు భగవాన్ శ్రీ రమణ మహర్షి అను నామధేయమును ఏర్పరిచితిని. మీరింక వీరిని భగవాన్ అనియే సంబో ధింపవలె. మీ రందరు రమణ నామ స్మరణముచే ధన్యు లగుదురు గాక. ఇందులకు మనకు సహాయ మగుటకు ఈ క్షేత్ర దేవతయైన సహాయవల్లిని ప్రార్థింతము." ఇట్లు చెప్పి కావ్యకంఠు డొక శ్లోకమున ఆ దేవిని ప్రార్థించెను. ఆనాటి నుండి స్వామికి "భగవాన్ శ్రీ రమణ మహర్షి" అని, వాసిష్ఠునకు "నాయన" అని నామములు ప్రసిద్ధము లయ్యెను.

వాసిష్ఠుని లేఖ వలన "నాయన" వృత్తాంతము నెఱింగి దీపోత్సవము నాటికి విశాలాక్షమ్మ ముప్పది మంది శిష్యులతో వచ్చెను. ఆమెను చూచి మహర్షి "అమ్మ వచ్చినది" అని నాయనతో చెప్పెను. నాయన ఆమెను "అమ్మా" అని సంబోధించెను. ఆమెకూడా భర్తను "నాయన" అని సంబోధించెను. ఆ సన్నివేశమును చూచుచుండగా మహర్షికి సంతోషమున కన్నుల నుండి బాష్పములు స్రవించెను. పిదప ఆమె శిష్యులతో కూడ భగవానునకు వందనము గావించి శరణాగతి చేసెను. అమ్మను గుహలోనికి పిలిచి వాసిష్ఠు డామెకు తారా మంత్రమును ఉపదేశించి దానిని వ్యాపింప జేయుటకు అధికార మొసంగెను. అప్పుడు పర్వత శిఖరముపై జ్యోతి వెలిగెను. ఆ జ్యోతికి భగవానునకు అందఱు ప్రణమిల్లి బయలు దేరిరి.

నాటి నుండి అమ్మ నాయనలు తమకు భగవానునిచే వానప్రస్థాశ్రమము అనుగ్రహింప బడినదని తలంచిరి. భార్యతోకూడ బ్రహ్మచర్యము నవలంబించి తపస్సు చేసికొనుచుండుటయే వానప్రస్థమునకు ముఖ్య లక్షణము. మఱునాడు అమ్మ శిష్యులతోకూడ వెళ్ళిపోయెను. భగవానుడే స్వయముగా చూపిన చూతగుహలో వాసిష్ఠుడు తపస్సును ఆరంభించెను. మహర్షికి అన్నమును తీసికొనివచ్చుచున్న ఎచ్చెమ్మయే వాసిష్ఠునకు కూడ భోజనం సమకూర్చుచుండెను. రమణోపదేశము వివరించుచు వాసిష్ఠుడు దేవీస్తవ రూపమున ఉమాసహస్రమును ఇరువది దినములలో ముగించుటకు దీక్షబూని గురుని యనుమతినిపొంది 26-11-1907 నుండి గ్రంథమును ఆరంభించెను. గడువులోపల పూర్తి కాకున్నచో గ్రంథమును చింపి వేయుదునని ఆయన శపథమొనర్చెను. గ్రంథము కొన్ని దినములు వేగముగా జరిగెను. తుది దినములలో ఆయనకు కుడిచేతి బొటనవ్రేలిపై గోరుచుట్టువంటిది ఏర్పడి వ్రాత మందగించెను. గ్రంథము ఏమగునో అని అందఱు ఆందోళన చెందజొచ్చిరి. స్వప్నమున ఒక బ్రాహ్మణుడు ఆదేశించెనని పుణ్యకోటి అను వైద్యుడు వచ్చి ఆ వ్రణమునకు చికిత్సచేసెను. బాధ తొలగినను వ్రాయుటకు వ్రేలికట్టు అడ్డముగా నుండెను. ఇరువదియవ దినమునకు ఇంకను 250 శ్లోకములు కావలసి యుండెను. ఆ రాత్రి అయిదుగురు లేఖకులను ఏర్పరచుకొని వాసిష్ఠుడు ఆశువుగా శ్లోకములను చెప్పనారంభించెను. మహర్షి ఆయనకు వెనుకకూర్చుండెను. అర్థరాత్రమునకు పూర్వమే నాయన ఒక్కొక్క లేఖకునకు 50 శ్లోకములను చెప్పి గ్రంథమును ముగించెను. అప్పుడు రమణుడు సమాధినుండిలేచి "నాచే చెప్పబడినదంతయు వ్రాసికొంటిరా?" అని యడిగి అందఱకును ఆశ్చర్యమును కలిగించెను. నాయన సంతోషముతో, "చిత్తము, అట్లే గ్రహించి గ్రంథమును ముగించితిని" అనెను. అది అట్లు పూర్తి యగుటకు గురుని యనుగ్రహమే కారణమని గ్రంథము చివర నాయన ఉల్లేఖించెను.

పిదప మహర్షి ఆదేశమున నాయన కొండ శిఖరమున "సప్తఝరి" అను ప్రదేశమునందు శిరస్సుయొక్క తాపమును శమింపజేసుకొనుటకు వారము రోజులుండి, దూరదృష్టి దూర శ్రవణము మొదలగు సిద్ధులను పొంది తిరిగి వచ్చెను. తరువాత మరకత శ్యామాంబాలయమున మహోత్సవముగా నాయన గ్రంథమును పఠించెను. అప్పుడు ఒకనాడు చిఱుపాకం కొండయ్య అను గణపతి యుపాసకుడు అక్కడికి వచ్చెను. "నీవు గణపతి యుపాసకుడవు గదా!' అని నాయన అతనిని పలుకరించెను. అతడు ఆశ్చర్యము నొంది ఇట్లనెను. "ఔను. నేను గణపతిని ఆరాధించుచు కావించిన యాజ్యహోమమునందు ప్రజ్వరిల్లిన జ్వాలలలో ఒక దివ్యాకృతి కన్పించెను. గణపతియే అట్లు గోచరించెనని తలంచితిని. ఆ యాకృతి గల పురుషుడు ఎక్కడనైన కనిపించునేమో అని వెదకుచుంటిని. ఆ పురుషుడు మీరే" ఇట్లు చెప్పి కొండయ్య నాయనకు పాదాభివందనము గావించెను. దీని వలన గణపతియే నాయనగా అవతరించెనని అందరకును తెలిసెను.

మఱియొకనాడు ఇంకొక సంఘటనము సంభవించెను. వేకువజామున భక్తులందరు శ్రీ రమణ సన్నిధియందు ప్రార్థనకు ఉపక్రమించుచుండగా హఠాత్తుగా రమణుని చుట్టు ఒక జ్యోతి ఆవిర్భవించి ఆయన ఫాలమును ఆరుసార్లు తాకెను. ఆ తేజస్సు అంతయు ఆయనయందే లీనమయ్యెను. దీనివలన షణ్ముఖుడే రమణుడని వ్యక్తమయ్యెను. నాయన భక్త్యావేశమున లేచి మహర్షిని కార్తికేయునిగా స్తుతించుచు 8 శ్లోకములను చెప్పి ఆ విధముగా తన గురువు యొక్క అవతార రహస్యము ప్రకటనమగుట తన గ్రంథ రచనకు ఒక ఫలమని, దానిచే గ్రంథము చరితార్థమయ్యెనన ఆనందించెను.

అప్పుడే వేలూరు నుండి కల్యాణ రాముడు వచ్చెను. పడైవీడులో పెద్ద చెరువు గట్టునొద్ద ఒక పొదలో తనకు మొండెము లేని ఒక శిరస్సు కనిపించెనని అది అనిబిసెంటు యొక్క శిరస్సును పోలియుండెనని అదియే అద్భుతమైన తేజస్సుతో రేణుకాదేవి శీర్షముగా స్ఫురించెనని అతడు చెప్పెను. మహర్షి రేణుకా తత్త్వము మంత్ర శాస్త్రములో ఎట్లున్నదని నాయనను అడిగి కుతూహలముతో వినెను.

కాశిలో నాయనకు దుర్గామందిర యోగియైన సుకేతుడు కన్పించినప్పుడు, తాము పదునార్వురు లోకకార్యము కొఱకు జన్మించితిమని, వారిలో గణకు డనువాడే గణపతియని, స్థూల శిరస్సువలన గణపతి కావింప దగిన కార్యమెట్టిదో తెలియగలదని చెప్పెను. ఆ స్థూల శిరస్సు రమణుడేయని నాయన గుర్తించెను. కాని ఇప్పుడు నాయన గణపతి యంశమున జన్మించెనని రమణుడు కార్తికేయుని యంశమున పుట్టెనని పై సంఘటనములచే వ్యక్తమయ్యెను. మఱి సుకేతుడు చెప్పిన మాటల కేమి అర్థము? ఆయన యభిప్రాయమును ఇట్లు గ్రహింపవచ్చును. ఈ పదు నార్వురు ఊర్ధ్వలోకములలో ఒక గణముగా నుండి లోకహితము కొరకు భూమియందు జన్మించియుందురు. ఈ లోకముననేకాక భువర్లోకములందు ఎందఱో ఋషులు ఉన్నారు. వారికి బ్రహ్మ యజ్ఞమున ప్రతిదినము తర్పణము చేయుచున్నాము. అందు "సర్వాన్ ఋషీగ్‌ం స్తర్పయామి" అని "సర్వాన్ ఋషి గణాగ్‌ం స్తర్పయామి" అని కూడ ఉన్నది. దీనిని బట్టి కొందరు ఋషులు వ్యక్తులుగా ప్రముఖులైయుండగా మఱికొందఱు గణములుగా కూడియుందురని వ్యక్తమగుచున్నది. కావున భద్రకుడు మొదలుగా పదునార్వురు ఒక ఋషిగణమై యుండవచ్చును. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఉపాసించి ఆ దేవతల యంశలతో అవతరించిరని, గణకుడు గణపతి నుపాసించి గణపతిశాస్త్రిగా అవతరింపగా స్థూల శిరస్సు కార్తికేయుని ఆరాధించి ఆ దేవుని యంశతో అవతరించెనని గ్రహింపవచ్చును. స్థూలశిరస్సు యీ గణమునకు నాయకుడై యుండును. కావుననే రమణునియందు స్థూల శిరస్సు గోచరించినంతనే, నాయన, తన్ను ఆయనకు అనుచరుడైన గణకునిగా స్మరించి, రమణుని మహర్షిగా, భగవానునిగా పేర్కొనియుండును. ఈ గణములో భద్రకాదులు కొలదిమంది మాత్రమే నాయన చరిత్రయందు ప్రస్తావింపబడినారు. తక్కినవారు ఎక్కడ ఏ విధముగా జన్మించి ఏయే కార్యముల నిర్వహించిరో నాయన చెప్పలేదు. భద్రకుడు కల్నల్ ఆల్కాట్‌గా రేణుకాదేవి అనిబిసెంటుగా ప్రస్తావింపబడుటచే ఈ ఋషులలో కొందఱు పాశ్చాత్యదేశములలోకూడ ప్రారబ్దకార్యలబ్ధికై జన్మించి యుందురని యూహింపవలసియున్నది. ఉమా సహస్రముయొక్క శుద్ధప్రతి లేఖన పఠనములు 1908 జనవరిలో ఆరంభింపబడి మార్చిలో ముగిసెను. అప్పుడు మరకత శ్యామాంబాలయమునుండి మహర్షి విరూపాక్ష గుహకు బయలుదేరుచుండగా వాసిష్ఠుడు ఆయనను సమీపించి "నాకు ఎక్కడికైన యాత్రగా పోయి తపస్సు చేయవలయునని సంకల్పము కలుగుచున్నది; "అహం" మూలాన్వేషణమే నా సంకల్పముల నన్నింటిని సఫలముగ చేయునా? లేక ఏదైన మంత్రధ్యానము అవశ్యకమా?" అని యడిగెను. "మొదటిదే చాలును; అది సకలార్థసాధకము" అని మహర్షి యనెను. "నా సంకల్పము మంచిదేనా?" అని వాసిష్ఠుడు మరల అడిగెను. అందులకు భగవాను డిట్లనెను. "ఈశ్వరునిపై భారము వేయుడు మీ భారములు తొలగును. తన కర్తవ్యము ఆయనకు తెలియును"

రెండవప్రశ్నకు మహర్షి వాసిష్ఠుని సంకల్పము మంచిదనికాని, కాదని కాని నేరుగా సమాధానము చెప్పలేదు. ఈ సందర్భమున కృష్ణభిక్షు మహర్షియభిప్రాయమును సూచించుచు సద్విద్యలోని పద్యమును ఉదాహరించెను.

"ఈ తత్త్వమునే మహర్షులు 'సద్విద్యలో' (ఉన్నది-నలువది)

"భూభార మీశుండు - పూనంగ నట్లె
 యాభాసజీవు డ - య్యది మోయు పూన్కి
 గోపురంబును మోతు - నేపున ననెడి
 తద్వాహిబింబము - దర్పము నిజము"*[1]

భూమియొక్క కార్యభారమును ఈశ్వరుడు వహించుచుండగా, జీవుడు ఆ భారమును నేనే వహింతు ననుట, గోపురమును నేను మోయుచున్నానని దాని క్రిందనున్న స్తంభములో చెక్కబడిన బొమ్మ తలంచుట వంటిదే యగును. ఈ యభిప్రాయమును మహర్షి అనేక పర్యాయములు వ్యక్తీకరించెను. హంఫ్రీసునకు మహర్షికి ఇట్టి సంవాదమే జరిగెను.

హంఫ్రీసు:- స్వామీ, నేను లోకోద్ధరణము చేయగలనా?

మహర్షి:- నిన్ను నీ వుద్ధరించుకొనుము. లోకోద్ధరణము చేసినట్లే.

హంఫ్రీసు:- లోకోద్ధరణ సంకల్పము నాకు గలదు; అట్లు సేయ జాలనా?

మహర్షి:- మంచిదే, ముందు నీకే ఉపకారము చేసికో, నీవును లోకులలో నొకడవే గదా! అంతే కాదు; నీవే లోకము; లోకమే నీవు, ఈ రెండును వేఱుగావు*[2]

మహర్షి హంఫ్రీసునకు చెప్పినట్లుగా వాసిష్ఠునకు ఏల స్పష్టముగ చెప్పలేదు? వాసిష్ఠుని యందున్న లోకోద్ధరణకాంక్ష చాల గాఢమైనది. దీనికి బీజము తల్లితండ్రుల సంకల్పమునందే యున్నది. వారు దేశము నుద్ధరింపగల పుత్రు నొసంగుమని భగవంతుని ప్రార్థించిరి. ఆ సంకల్పమునకు ఫలముగా జన్మించిన వాసిష్ఠుని యందు అట్టి సంకల్పము ప్రబలముగానుండుట సహజము. భగవంతుడొసంగిన వరమును తప్పించుట తగదు. ఆ సంకల్ప మును కొనసాగ నిచ్చినచో కొంత కాలమునకు అది క్రమముగా క్షీణించు నను తలంపుతో మహర్షి వాసిష్ఠుని యభిప్రాయమును నేరుగా ఖండింప లేదని తలంప వచ్చును. ఏమైనను యోగులకు తత్త్వవేత్తలకు సంకల్పములు పనికి రావనుట ప్రసిద్ధము. "సంకల్పమును వీడనివాడు ఎవడును యోగి కాజాలడు." (న హ్యసన్న్యస్త సంకల్పో యోగీభవతి కశ్చన - గీత) అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగ చెప్పెను. "జ్ఞానామృతముచేత తృప్తుడు కృత కృత్యుడును అయిన యోగికి కర్తవ్యము ఏదియు నుండదు; ఉన్నచో అతడు తత్త్వజ్ఞుడు కాడు" అని విద్యారణ్యస్వామి ఉద్ఘాటించెను.

శ్లో|| జ్ఞానామృతేన తృప్తస్య కృతకృతస్య యోగిన:
    నై వాస్తి కించిత్ కర్తవ్య మస్తి చేత్ న స తత్త్వవిత్||

  1. * ప. 16 అనుబంధము శ్రీరమణ లీల - పుట. 128
  2. * శ్రీ రమణలీల-పుటలు 264, 265