కొప్పరపు సోదర కవుల కవిత్వము/చీరాల శతావధానము

వికీసోర్స్ నుండి

చీరాల శతావధానము

పీఠిక

సత్యబంధులారా! రసికోత్తంసులారా!

జగత్ప్రసిద్ధులును శ్రీమద్భాలసరస్వత్యాశుకవిసింహాది బిరుదాంకితులు నైన బ్రహ్మశ్రీ కొప్పరపు సోదరకవి శిఖామణులు 15-10-1911 తేదీన మా చీరాల, పేరాల గ్రామవాసులయిన విద్యాభిమానులచే నాహూతులయి మా చీరాలకు దయచేసిరి. వారు ధూమయానము నెక్కివచ్చి మాయూరి రైల్ స్టేషనునందు దిగునప్పుడు మాయూరివారలును వారిని దర్శింపవచ్చిన యితర గ్రామ వాసులును గుంపులు గుంపులుగా వారినెదుర్కొని కరతాళధ్వనులచేతఁ దమయానందం బెఱిగించుచు దర్శనోత్సవంబు జరిపిరి. అట్టి సమయమున మాపురవాసులు ముందుగా నీ క్రింది విధముగా స్వాగత పద్యములను జదివి కవి చక్రవర్తుల యాశీర్వాదంబుంజెందిరి.

స్వాగత పద్యములు

శ్రీమదాశుకవిసింహబాలసరస్వతి కుండినకవిహంస కవిచక్రవర్తీత్యాది బిరుదాంకులగు బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకటరమణ కవీశ్వరుల సన్నిధికి

శ్రీకర కొప్పరంపుకుల సింధుసుధాకర మూర్తులార! వి
ద్యాకలితాత్ములార! సరసాశుకవిత్వ పటుత్వవైదుషీ
ప్రాకట మల్లికా కుసుమ పాండుర నిర్మల కీర్తులార! లో
కైక కవీంద్రులార! యిదె యందుఁడి స్వాగతపద్యమాలికల్

స్వాగతంబిదె మీకు ఫణికులేంద్రస్తవ్య
          ప్రకటాశు కవి చక్రవర్తులార!
స్వాగతంబిదె మీకు శారదారూపులై
          యలరు కుండిన కవిహంసలార!
స్వాగతంబిదె మీకు భవ్య విద్వద్వరే
          ణ్య వినుతాశుకవిసింహాంకులార!
స్వాగతంబిదె మీకు బాలసరస్వతీ
          త్యాదిక వరబిరుదాడ్యులార!

స్వాగతంబిందు చందన పారిజాత
గాంగ డిండీర పాండుర ఖ్యాతులార!
సోదర కవీంద్రులార! విశ్రుతనియోగి
వంశమణులార! బుధులార! స్వాగతంబు.

కవితాలతాంగి మక్కువమీర నెవ్వారి
         రసనాగ్రసీమ నర్తనముఁ జేయు
స్వామి సత్కార్య తత్పరత యెవ్వారికి
         నుగ్గుబాలై సతంబొప్పుమీఱు
భవ్యసత్పురుష సంభావ్యమానధనంబు
         వసుధనెవ్వారికి భాగధేయ
మతులోపకారి వర్ణితవదాన్యత యేరి
        హృదయ సంస్థానము ల్సదనసీమ

లట్టియార్వేలవారి వంశాంబురాశి
యందు సంపూర్ణ హిమధాము లనఁగఁ జెలఁగు
రమణసుబ్బాఖ్యులార! సత్ప్రఖ్యులార!
సదయమతిఁ గైకొనుండిదే స్వాగతంబు

శ్రీపీఠికాపురీ భూపాలవరునిచే
        నెనలేనియట్టి మన్ననలఁ జెంది
మణికొండ నృపసభా మండపంబునయందు
        రాజితలీల గౌరవముఁబొంది
నెల్లూరుపురిని సంపల్లీల నాశుక
        వీంద్రసింహాభిఖ్య నెసకమంది
చెన్నపురీవరాశేష విద్యానాథ
        వితతిచే మేటి సన్నుతులనొంది

షట్సహస్రనియోగి వంశప్రదీపు
లగుచు నాశాంతదంతురితాచ్ఛకీర్తి
సాంద్రులగు సోదరకవీంద్ర చంద్రులార!
సరసమతులార! మీకిదే స్వాగతంబు

కవిలోకపద్మసంభవుఁ దిక్కనామాత్యుఁ
        గారామెలర్పఁగాఁ గన్న తల్లి
సహజపాండిత్య విశారదుఁ బోతనా
        ఖ్యాకుని గారాలఁ గన్నతల్లి
యలికాక్షమును డాఁచి యవనిఁ జేరినసోముఁ
        గవిలోకసోమునిఁ గన్న తల్లి
భువనపూర్ణ ప్రభాద్భుత తంత్రి మంత్రి భా
        స్కర కవీశ్వరుఁగూర్మిఁ గన్నతల్లి

ఆంధ్రదేశమతల్లి యర్ధ్యమరవల్లి
మిమ్ముఁగడుపారఁ గని సఫలమ్మునయ్యె
సోదరకవీంద్రులార! విశ్రుతనియోగి
వంశమణులార! పండిత ప్రవరులార!

అలతుషార ధరాధరాగ్ర నిర్గతసౌర
          వాహినీభంగ సంపదవహించి
పార్ధకార్ముకముక్త బాణపరంపరా
          మితవేగ విస్ఫురద్గతివహించి
కమలబాంధవరథోత్తమ తురంగమ రయో
          ధ్ధత పద్ధతీద్ధ సంగతివహించి
యనుపమానాసమానానూన ధూమ శా
          కటవేగ జాగ్రదుగ్రత వహించి

యెవరి మధురస పరిపాటి కవనధాటి
ముదముఁ బొదలించు విబుధోత్తములకు నట్టి
సోదరకవీంద్రులార! విశ్రుతనియోగి
వంశమణులార! మీకిదే స్వాగతంబు

కవితఁ జెప్పెడువారు గలుగరే పద్యాళి
         మీరీతిఁ గుప్పంగ లేరుగాని
అవధానగరిమంబు నందరే యిటువలె
         నూదినధారణ లేదుగాని
లలి సమస్యాపూర్తి సలుపరే పెక్కండ్రు
         రసభావయుక్తి దొరకదుగాని
పాండితీభావంబుఁ బడయరే కొందఱు
         సుగుణ సంపత్తులు సున్నగాని

కొప్పరంపుకులాంభోధి కువలయాప్తు
లార! భవ్యసోదర కవులార! రమణ
సుబ్బరాయాఖ్యులార! సంస్తూయమాను
లార! కొనుఁడయ్య మీకిదే స్వాగతంబు

రసమును భావమర్దమును రమ్యగుణంబును జాతిరీతిపెం
పెసఁగఁగఁజాతురీరచన లెంతయుసంతసమీనుచుండ, ను
ల్లసితకవిత్వకన్యక విలాస మెలర్ప మిమున్వరించి సం
తసపడి యో యనూనకవితావనితేశ్వరులార! స్వాగతం
బొసఁగెనిదే గ్రహింపుఁడు జయోన్నతిఁగాంచుఁడుదంచితస్థితిన్

శ్రీలఁజెలంగి సాధుజన సేవితులై యలరారునట్టి చీ
రాలపురంబువారు కవిరాజుల మెప్పులఁబొందినట్టి పే
రాలపురంబువారు నవరత్నములిచ్చిరి పద్యధార, ధా
రాళముగాఁగ నో విబుధరాజగురుప్రణుతాశు దివ్యవా
గ్జాల విజృంభణోల్లసిత కమ్రకవిత్వ విలాసులార! భూ
పాలక వందనీయగుణ పారగులార! శతావధానమే
ధాలయులార! రాజకిరణాంచిత సర్వదిగంత దంతురో
త్తాల యశస్కులార! యతిధన్యులకుం దమకర్షభక్తితోన్

చీరాల

15-10-1911

ఇట్లు,

చీరాల, పేరాల పురవాసులు

ఇట్లు స్వాగత పద్యరత్నభూషణ భూషితులఁజేసిన పిదప గుంటూరు, బెజవాడ, బాపట్ల, తెనాలి, వంగవోలు, మన్నవ మున్నగు పట్టణముల నుండి సభార్ధమాహూతులయి వచ్చిన మహామహులును గూడరాఁగా వేలకొలఁది జనులు తమ జన్మములు పవిత్రములయ్యెనని సంతసించి, జయజయ ధ్వానము లొనర్పఁగాఁ బుష్ప దామాలంకృతులయిన కవిచక్రవర్తుల నొక పుష్పరథంబునఁ గూర్చుండఁ బెట్టి యిరుగడలఁ జిత్రచ్ఛత్రయుగళంబును బట్టువారుసు జామరంబుల వీచువారును నై కొందఱు పరిసేవింప నూరేగించిరి, అయ్యూరేగింపు సమయంబు నందు "ఆశుకవి చక్రవర్తి” బిరుదవర్ణాంకితములయిన, విజయధ్వజములెత్తి కొందఱు ముందు నడిచిరి. బాలికలు గానంబొనర్చిరి. బాలకులు కోలాటంబాడిరి. మల్లులు కొందఱు తమ దేహ పరిశ్రమ విద్యఁగనుపఱచి వేడుకఁజూపిరి. ఇట్లు మంగళవాద్య ధ్వనులు పెల్లు చెలరేగ సూరేగింపు మహోత్సవంబు నెఱవేఱిన పిదప నాశుకవిత్వ ప్రదర్శనంబుచే నెల్లరానందము జెందిరి. ఆసభ కగ్రాసనాధిపతులుగా వంగవోలు మిషన్ స్కూలులోని పండితులును, సంస్కృతాంధ్ర భాషా పారంగతులునైన బ్రహ్మశ్రీ ముక్తి నూతలపాటి గోపాలకృష్ణ శాస్త్రి గారుండిరి. ఈయాశుకవిత్వసభ యనర్గళ ప్రవాహముగా సాగెను. మఱునాఁడును ఆశుకవిత్వమే కావలయునని మేము గోరితిమి గాని “అవధానమొనర్ప వలయునని మా యుద్దేశమని” కవిసింహులు తమయభిప్రాయముందెలుపుటచే, సభ్యులయ్యదికూడఁ జూడవలయు” నను నుత్సాహముతో నందులకొడంబడిరి. ఆనాఁటి యవధాన సభ యత్యద్భుతముగా నెఱవేఱెను. ఆ యవధాన సభకనేకులు విద్వత్కవివర్యులు చనుదెంచిరి. అట్టి విద్వాంసులలోఁ గొందఱు పృచ్చకులయి కూర్చుండి విషమ ప్రశ్నములనేకము లిచ్చిరి. అట్టి ప్రశ్నములన్నియు నీ కవిసోదరులు తృణ ప్రాయముగా నతిరస వంతములుగాఁ బూరించిరి. శ్రీ తిరుపతి వేంకటకవులు, నరసరావుపేటలో వృథగా బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామరాయ కవీంద్రులనిరసించి వారి శిష్యులు తారసిల్లుటచే భయగ్రస్తులయి, ఆహ్వానముచేసిన వారి మర్యాదయైన

నెంచక పిక్కబలంబుఁ జూపించిరి. ఆ వృత్తాంతమెఱింగియో యెఱుంగకయో తదభిమానులు కొందఱు బాపట్లలో నదివఱకు సోదర కవీంద్రులొనర్చిన యాశుకవిత్వావధానముల కన్న మిన్నగా నొనర్పఁజేసెదమని శ్రీ తిరుపతి వేంకట కవుల నాహ్వానముజేసి సభ గూర్చిరి. అందాశుకవిత్వము పేరెత్తినంతనే వారు తబ్బిబ్బుతో నేలవచ్చితిమి దేవుఁడాయనుకొని తమ కృత్రిమపు సభలు నేఁడు బైటపడునని కాలనేమియుక్తులతో నాశుకవిత్వమును దప్పించుకొని యవధానమను పేరుతో నొక సభఁగావించిరి. సోదరకవులపైఁ దమకుఁ బ్రతిగా గంటలుగట్టి కొంటిరఁట .... గెంటెదనని దూఁకిన శ్రీశివరామశాస్త్రిచే నాశుకవిత్వముఁ జెప్పింపఁదలఁచి ముందఱకు నెట్టి సభ్యులఁగథ కోరుకొనుండనఁగా సభ్యులు రామరావణ యుద్ధంబుఁగోరిరి. అంతట నా బాలకవి యీ కథలో మేటరులేదు. కావునఁ జెప్పుటకు వీలులేదనఁగా "జననంబాదిగా నేల చెప్పరా"దని వేంకటశాస్త్రి గారూత యొసంగిరి. అంతట నా శివరామకవిగారు, “రాళ్ళచేనిలో గుంటక డొల్లించి”నట్లు ప్రాసవిశ్రమముల దూరముగాఁ బాఱఁజిమ్ముచు నాశుకవిత్వమునఁ బ్రాసవిశ్రమము లవసరమ్ములేదని శాసనంబుఁ జేయుచు రసాభాసమొనర్చి గంటకుఁ బదియాఱు పద్యములనల్లిరి. వేంకటశాస్త్రిగా రంతటఁ దమ్ముద్ధరింప వచ్చెనన్న విశ్వాసమయినలేకుండ నిజమాడిన నిష్ఠురమనియైనఁ దలంపక “ఇఁక కధ నే గోదావరిలోనో గంగలోనో కలిపితివి” చాలులేయని పరిహసించిరి. శ్రీ తిరుపతి శాస్త్రిగారు, పిదపఁ దామొక గీతపద్యము మొదలుపెట్టిరి. అంతట వేంకట శాస్త్రిగారును గలిసి చెఱియొక పాదముగాఁ ......... చేయంగల విన్నపములనునట్లు చెప్పి శిష్యునకుం దమకుంగల తారతమ్యంబును నాశుకవిత్వంబునఁ దమకుఁగల ప్రజ్ఞయు సకలజనంబుల కెఱింగించిరి. అవధానమందైన సోదర కవులఁ బోలఁజాలరా యను తమవారి సంతోషమంతయు భంగము చెందునట్లు తొలి నాఁడవధానమునఁ ప్రశ్నములిచ్చిన పృచ్ఛకుల కసంతుష్టిగాఁ గొన్నియడిగిన ప్రశ్నములమార్చియుఁ గొన్ని వీలు లేదనియుఁ జెప్పి తమ చాకచక్యంబుఁ గనుపఱచిరి. వారవధాన సమయమునఁ జెప్పుటకు వీలులేదని విడచినవియుఁ, జెప్పినవియుఁ గొన్ని దిక్ప్రదర్శనముగా నీ క్రింద నుదహరించితిని. 1. కరోమి, కవయామి, వయామి, యామి అను పదములనుకరణము లేకుండ మీయిష్టమువచ్చిన వృత్తములోఁ జెప్పుఁడన యుభయభాషా ప్రవీణులు, ఆంధ్రంబున నెక్కువ ప్రవేశముగలవారు చెప్పవలయుఁగాని మేము చెప్పలేము మాకశక్యమని దానిని వదలిరి.

2. ఈసోదరకవులచేఁ జేయఁబడిన యవధాన పద్యములలో 5, 11 పద్యముల తాత్పర్యమును మీయిష్టమువచ్చిన పద్యములుగాఁ జెప్పుడన నవియిప్పుడసాధ్యమని త్రోసివేసిరి.

3. రంభముగడుపారమెక్కె రవితాపమునన్, అనుసమస్యఁ బాడుచేసిరి.

4. దీపముతలమీఁదయీఁగ ధీరతవ్రాలెన్ - అను సమస్యను దీనతయని దిద్దికొనిరి.

5. దారము లేకున్న బ్రతుకఁ దరమే మనకున్ - అను సమస్యను ధారము అని మార్చిరి.

ఇట్లెట్లో అవధానమంతమందిన మీఁదట మరలఁ బద్యములఁ జదువుఁడని సభ్యులు కోరిరి. అంతట భోజనమొనర్పఁ బ్రొద్దుపోయినదనియు, నవధానాంతమున బద్యములు చదువకున్న లోపము కాదనియు, వేంకటశాస్త్రిగారు చెప్పిరి. అందుల కొడంబడక సభ్యులు చదువుఁడని మరలఁగోరఁగా నమస్కార బాణములచేఁ దప్పుకొనుట తటస్థించెను.

ఈ విధముగా నాసభలో వారు సభ్యుల యనుగ్రహమునకై ప్రార్ధించిన ప్రార్ధనము లిందు వివరింపఁ బడవు, కాని సోదరకవీశ్వరులను మెచ్చి కవివర్యులు కొందఱు చెప్పిన పద్యములచే సవ్విషయములన్నియు విశదపడఁగలవు. అట్లు తిరుపతి వేంకటకవు లసాధ్యములని, వదలివేసిన ప్రశ్నములన్నియు నీ సోదర కవి శిఖామణులచే నతిరసాలవాలముగాఁ బూర్తిచేయఁబడెను. అవియన్నియుఁ దూచా తప్పకుండఁగాఁ జదివి వినిపించుటచే మహానందముఁజెందిన సభ్యులందఱు నీ సోదరకవి సింహుల సనేకవిధంబుల స్తుతించి నూటపదాఱులిచ్చి బహూకరించిరి. గుంటూరులో ననవసరముగా ననూయావిశేషముచేఁ దిరుపతి వేంకటకవులు తమ్మునిందించుటచే నీసోదరకవులు వారినిఁ గూర్చి కొన్ని ప్రతిజ్ఞా పద్యములఁజెప్పిరి. అందుకొన్నిటినిందుఁ దెలుపుచున్నారము,

ప్రతిజ్ఞా పద్యములు

బ్రహ్మశ్రీ తిరుపతి వేంకట కవీశ్వరులకు

తిరుపతి వేంకటేశ కవిధీరుల కియ్యదె విన్నపంబు కొ
ప్పరపు శతావధానులను వారలలో నొకరుండ నాత్మలో
నిరతము మీరు మున్నొసఁగు స్నేహము నిల్పఁగఁగోరువాఁడ మీ
పరువును మాపు మాటకు జవాబు నొసంగిన వాఁడ నమ్ముఁడీ.

చెన్న పురంబునందు మఱి చెప్పఁగ నొప్పెడి పట్టణంబులం
దెన్నఁడు మిమ్ము చూడకయె, యేము ప్రసంగ వశంబునన్ మిము
న్మన్నన చేసినామనెడి మాట నెఱింగియు, మమ్ముఁబూర్వమే
సన్నుతిఁజేసి నేఁటి సభ శాంతము వీడి వచించు టేమొకో.

మీరును మేమున్ మైత్రిన్
బేరుంగొనినార మనుచు విమతులు నడుమన్
జేరి కుయుక్తులు పన్నిన
యారీతి నెఱుంగ కట్టులాడందగునే

అన్యుని సహాయ మించుకయైన లేక
పద్య మవధానమందుఁ జెప్పంగలేని
మీ మహాధారణాశక్తి మీకే కాక
యెల్ల వారికి నీ సభ నెఱుక పడియె.

ఆశుకవిత్వంబు నల్లఁబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ
అష్టావధానంబు నాచరించెదరేని యద్దాని మించి చేయంగలేమొ



శతఘంట కవనంబు సల్పఁబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ
నేత్రావధానంబు నేర్పు జూపెదరేని యద్దాని మించి చేయంగలేమొ

ఆంధ్రమున నిన్ని యన్ని పద్యములటన్న
నింతకాలంబులోనన్న, నిందఱన్న
నిట్టి వర్ణోత్కరంబన్న, నేమి వెఱపు
తెలుఁగు మీసంబు నిలుపంగఁ దివురుఁడింక.

చెప్పిన వన్ని చేసెదము, చింత యొకింతయు లేదు వెంటనే
చెప్పుఁడి యుత్తరంబు, సభచేయుటొ చేయక మారు వ్రాయుటో
తప్పక వ్రాయఁగావలసె, ధర్మమె గెల్చునఁటంచు నమ్మి నా
తప్పొకయింత లేమి, యిది ధార్మికులందఱెఱింగి యుండుటన్.

గుంటూరు,

20-8-1911

ఇట్లు,

కొప్పరపు వేంకటసుబ్బరాయశర్మ, శతావధాని.

ఇట్లు ప్రతిజ్ఞా పద్యములంజెప్పిన వీరిశక్తినిఁబ్రత్యక్షముగాఁజూడఁగోరిన మా చీరాల పేరాల పురవాసులకు నీ సోదర కవిచక్రవర్తులు పరమానందంబును గూర్చిరి.

అట్టి అవధానిపంచాననులను; మరల మంగళవాద్యములను, ఆవిరి దీపములను, మహానందంబు సంఘటింప నూరేగించిరి. ఆ సమయమునఁ బౌరులందఱును గర్పూర నీరాజనాదుల సమర్పించి పవిత్రులైరి. ఇట్లు మమ్మందఱ నమందానంద భరితులఁజేసిన శ్రీ బాలసరస్వతులకు భగవంతుఁడు దీర్ఘాయుర్భాగ్యంబు లొసంగుఁగాత!

ఇట్లు,

ఉలిచి పిచ్చయ్య

మునిపల్లి వెంకటసుబ్బయ్యశర్మ

చీరాల శతావధానము

(15-10-1911)

శ్రీరాజత్కరుణావలోకనములన్ జెల్వొప్పవీక్షించుచున్
ధారాశక్తికిధారణాధృతికి దైన్యంబింతరానీక యూ
రూరన్ బట్టణసీమలన్ బనిచి యీయుద్యోగమేనిల్పుటన్
జీరాలన్ సభనిప్డుఁబ్రోవఁగదె వాసిన్ భర్మదుర్గాంబికా.

1. బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామరాయకవీంద్రులను గుఱించి

అత్యుగ్రకుకవి పంచాననంబులు పలా
         యనమంద శరభాంక మందినాఁడు
సకలాభినుత శబ్దశాస్త్ర పారావార
         మున కగస్త్య ఖ్యాతి బూనినాఁడు
అఖిలాగమాంత రహస్యార్ధమునకు ది
         వ్యాంజనంబగు ప్రజ్ఞనందినాఁడు
భవ్యబెల్లముకొండ వంశ వంశమునకు
         ముక్తాఫలంబనఁబొసఁగి నాఁడు

శిష్యసమితికి విద్యలు చెప్పినాఁడు
గురుయశంబందినాఁడు శ్రీకొండవీటి
సీమ కాభరణం బనఁజెలఁగినాడు
రామరాయాఖ్య సుకవిసుత్రాముఁడిపుడు.

2. కొండవీటి సీమ

కోటీశ్వరస్వామి గూర్మిఁగాంచుటఁజేసి
       యైశ్వర్యమున సందియంబులేదు
మందు మాఁకులగిరుల్ వందలుండుటఁజేసి
       యారోగ్యమునకింత మేరలేదు
ఓంకారనది కృష్ణ యొరసి పాఱుఁటఁజేసి
       యతి పవిత్రతకు లోటనుటలేదు
సుకవి పండితరాజ నికరముండుటఁజేసి
       విద్యాభివృద్ధికే వెఱపులేదు

కాన నెన్నంగఁబడియె సత్కవులచేత
సకల పండితపామర జనులచేత
జగతిఁగల సీమలకు నెల్లఁజందమామ
విపుల సుఖ భూమ మాకొండవీటిసీమ.

3. శుద్ధవిదియనాటి చంద్రరేఖ ఒకరిచ్చిన కల్పన

మేలున్ గూర్చెడిశుద్ధమందు విదియం బెంపొందుశీతాంశునిన్
హాళింబోల్చెదఁ జిత్రవర్ణములచేఁ హర్షంబునుంగూర్చుపం
జాలోమ్లేచ్ఛులుపీర్ల పండుగను జేర్చన్ దళ్కుచే వంకయౌ
లాలాసాహెబుపీరుతోడ నభమెల్లన్ బంజయంచాడుచున్

4. కవులను గౌరవింపవలదను వారికి శిక్ష

సారతరార్థ సంపదలు జాలులు వాఱఁగ శారదాకృపన్
దీరిన సత్కవిత్వమునఁదేజువహించు కవీంద్ర చంద్రులన్
గూరిచి సత్కృతుల్ జరుపఁగూడ దటంచను నీచు ధర్ముడెం
దాఱని దుఃఖసంచయము లంటఁగఁ జేసెడు మంటఁ గాల్పుచున్.

5. పద్యమునకుఁ బ్రతిపద్యము

అలదానిమ్మ యిగుర్లునయ్యలరు దంతాళిన్ గరచ్ఛాయమై
తెలివిన్ బోలఁగనెంచి కాకునికి నెంతేనాది మధ్యాంతముల్
వెలియౌ దేవునిగొల్చి యట్లయయి యాబింబోష్ఠిమేల్ గబ్బిగు
బ్బలధమ్మిల్లమునున్ వళిన్ దొరసి శోభన్‌గాంచె నిష్టాప్తిగన్

6. బాల్యమున వితంతువైన కాంత

చేరలఁగొల్వఁగాఁదగియుఁజిన్నెలువన్నెలుమించుకన్నులున్
సారసవైరిసౌరు నెకసక్కెముసల్పెడియాస్యమన్నిటస్
దీరిన సుందరాంగములు నెమ్మినెసంగిన నేమి? దుర్గతిన్
గూరిమి దూరమైమగఁడు కోల్పడ డీల్పడియున్న కాంతకున్

7. కైలాసము

అల నీహారధరాధరేంద్రసుత యొయ్యారంబుఁ జూపింప ను
జ్జ్వల మోదంబున దేవవాహినియు గ్రేవన్నిల్వ దేవేంద్ర ము
ఖ్యులు కైవారము లాచరింపఁ బ్రమధుల్ గొల్వంగ శంభుండు సౌ
ఖ్యలసత్ప్రాభవ మొందఁ జెన్నుగను నాకైలాస మెన్నందగున్.

8. అవధాన సభను గఱించి

నేఁడేయొక్క శతావధాన మిచటన్నిర్విఘ్నమై సాగునం
చాడాడన్ దగుసజ్జనుల్ గనఁగరానత్యంతమోదంబునన్
గూడన్ జేరినపౌరులిట్టి సభయందున్ గొంటెనుం బోలుచున్
బాడౌ వానయొకండువచ్చి చనెనంబా! నీకటాక్షంబుచే

9. సమస్య : కమలబాంధవుఁడేతేరఁ గలువ విచ్చె

జంపతులకాత్మ మోదంబు సౌరునింప
జారచోరుల గుండియల్ సంచలింప

విదిత రుచి మీఱ రోహిణీ హృదయ కమల
కమలబాంధవుఁ డేతేరఁ గలువ విచ్చె

10. సమస్య : దీపముపై నొక్కయీఁగ ధీరతవ్రాలెన్‌

భూపాలు కేళిగృహమున
దీపములై శోణమణులు దీపింప దురా
శాపటిమఁజేసి తన్మణి
దీపముపై నొక్కయీఁగ ధీరతవ్రాలెన్

11. పద్యమునకుఁ బ్రతిపద్యము

ఆ సుమగంధి వేణిరుచి కంబుధరంబెనగాక యోడి లో
గాసిలి రెండు ఖండములుగాఁగని, తత్సుపదాంతరంబునన్
భాసిలుచున్న వారగుటఁబట్టి తదంశములన్ గ్రహించి వే
వేసరిపోల్చి రాబుధులు వీక్షణపాళిఁబయోధరంబులన్

12. ఈఁగ

తన కేమి యొరగకుండినఁ
గన లేకొరుసౌఖ్యమడపఁగా నెంచు దురా
త్మునిఁబోలి యీఁగ యన్నముఁ
దినునెడ లోదూఱి, నరుని తేఁకువఁజెఱచున్

13. సమస్య : కవికొప్పునె సర్వలోక కాంత రవిరుచుల్‌

ప్రవిమల గతి సారసచయ
ము విలాసముఁజెంద జగము పొగడఁగఁ దిమిరం
బవలఁ బడఁద్రోయుటను ఘా
కవికొప్పునే? సర్వలోక కాంత రవి రుచుల్

14. కరము అనుపదము నాలుగుపాదముల వచ్చునట్లు స్త్రీవర్ణన -- మహాస్రగ్ధర

కరమున్‌బోల్పంగ నెమ్మేన్ గరిమనుగొనియెన్ గంధసంపుష్టదంతీ
ట్కరమున్‌బోల్పంగనూరుల్ గణుతినిగనియెన్ గాళమైయొప్పుదర్వీ
కరమున్ బోల్పంగనెంతేఘనతను గొనియెన్ గాటమౌవేణి క్షీరా
కరమున్ బోల్పంగ నవ్వాకలికికిఁదనరెన్ గావ్యకృద్వర్ణనాప్తిన్

15. ప్రస్తుత సభ - మందాక్రాంత వృత్తము

సారప్రజ్ఞాన్వితులువిబుధుల్ క్ష్మాసురుల్ కూడియుండన్
మేరంగాంచన్ దగనిసిరులన్ మీఱువైశ్యుల్ సెలంగన్
దోరంబో వేడ్కఁదనరెడి శూద్రుల్ గడున్ జేరియుంటన్
జీరాలన్ హెచ్చునుగనుసభన్ జేయుచుంటిన్ సుధీంద్రా

16. రైలుదప్పినవాఁడు - అచ్చ తెనుఁగు

ఉన్నదిచాలఁగాఁబనియు నున్నదిపోయెడియూరుదవ్వునన్
జన్నదిగుప్పుమని నల్గడలన్ బొగయేగ బండియ
న్నన్న యొకింతకూడయిన నాఁకటికీయెడ వేయకుంటి నే
తెన్నును దోఁచదాయెనని తిర్గునొకండు తలంపుకీడ్వడన్

17. సమస్య : రంభముఁగడుపార మెక్కె రవి తాపమునన్‌

ఆంభఃపానంబున సం
స్తంభింపని జాఠరాగ్నిఁ జల్లార్పఁగ సం
రంభమును బూని యొకఁడు క
రంభముఁ గడుపారమెక్కె రవి తాపమునన్

18. అభిసారిక - నది

గారంబైన విలాససంపదలులేకన్ దోడునున్ లేకయే
దారిండొంకయుఁ గాంచఁబోవక కడున్ ధాత్రిన్ విడంబించుచున్

దూరంబందునఁగల్గునాయకుని సంతోషంబులన్ దేల్పఁగాఁ
జేరుంబో యభిసారికాంగన ధునీశ్రేష్ఠంబు ప్రజ్ఞానిధీ

19. ఐకమత్యము లేకపోవుటవలన నష్టము

ఒక్కనిమాటయన్నమఱియొక్కఁడు కోపముఁజెందునంత వే
ఱొక్క విధంబుగాఁదలఁచి యొయ్యనఁబాడొనరింపఁజూచుఁ బై
నక్కట యైకమత్య మనునట్టిది లేశముగల్గకుంటచే
నిక్కలికాలమందు నిదియే యిఁకనున్న జగంబడంగెడున్

20. చంద్రుఁడు - పొన్న చెట్టు

సారతరోక్తులన్ శశినిఁజక్కనిపొన్నకుఁబోల్చుమంచు నిం
పారఁగఁబల్కినావు శశియందలిమచ్చయె యాకుజొంపమై
తారకలెల్ల నిండుప్రమదంబిడు సూనములై రహింపఁగా
భూరుహమొప్పుఁ జంద్రుఁడనఁ బొల్పెసలారుచు ధీరనంద్యమై

21. కొప్పోలు, ఒంగవోలు, దశరాజుపల్లె కర్వది యను యూళ్ళపేరులు వచ్చునట్లు భారతకథ

చాలఁగసైన్యముండవలె సంగరముంబొనరింపఁగానఁ గొ
ప్పోలున కొంగవోలునకుఁ బోతిమిగన్ దశరాజుపల్లెకున్,
మేలునమించుకర్వదికి మేదినినాథుఁడు కౌరవాధిపుం
డేలలిఁబొమ్మనంగ నటకేగియు సైన్యముఁగూర్చి తెచ్చితిన్

22. తుంగభద్ర, రాజ్యలక్ష్మి, పొన్నూరు, భావనారాయణస్వామి పేర్లు వచ్చునట్లు భావనారాయణస్వామికి సంబోధన

నీరంబొప్పఁగ నేత్రపర్వమయి యెంతేఁదుంగభద్రాస్రవం
తీ రత్నంబు కురంగటన్ దనరఁగన్ శ్రీ రాజ్యలక్ష్మ్యంబ సొం
పూరన్ జేయఁగ భక్తసంతతుల నెప్డున్ బ్రోదిఁగావింప పొ
న్నూరన్ నిల్చిన దేవు నిన్నుమదినెంతున్ భావనారాయణా

23. కరోమి, కవయామి, వయామి, యామి అనుపదములు వచ్చునట్లు విష్ణుస్తవము

గరిమన్నిల్పక, రోమిటారి వలెఁ గుల్కన్ సాగె దుర్మేధ, ధీ
వర హృత్సాంకవ! యామికుండు నిశఁ బ్రోవంజూచినట్లే యబో
ధ రహింపంగను దేవ! యామిడిని బొందంజేయకే యెందు శ్రీ
ధర! యామిన్యధిపాన్వయేశ! సురవంద్యా! కృష్ణ! భక్తావనా!

24. లక్ష్మీసరస్వతుల హెచ్చుతగ్గులు

వరుసనుజూడ నత్తయగు భార్గవి శారదకంటె హెచ్చగున్
వరమతిఁజూడఁ గోడలగు భారతిహెచ్చగు లక్ష్మికంటెఁదా
సిరినిడు లచ్చి విద్యనిడు నీరజగర్భునిరాణి గాన నా
యిరువురిలోనఁ దచ్చనియు హెచ్చని యేయమఁ బల్కఁజాలుదున్

25. సమస్య : మాద్రియు దోగ్ధృతంగనే హిమాద్రియుఁ దర్ణకమయ్యె నయ్యెడన్‌

క్షుద్రపువ్యాధి లోకములఁ జొచ్చి చికాకును జేయుచుండగాఁ
భద్రము లిచ్చు నోషధు లపారముగాఁ గొన ధేనువయ్యె ని
ర్నిద్రగతిన్ వసుంధరయుఁ బ్రేముడి నాపృధునామధైర్యహే
మాద్రియు దోగ్దృతంగనె హిమాద్రియుఁ దర్ణకమయ్యె నయ్యెడన్

26. సమస్య : చెలువుగఁబిల్లిఁ బట్టుకొనఁ జేరెడి యెల్కల పిండుఁ బోలెడిన్‌

జ్వలితపురోషవహ్ని రిపువారదవంబును నేఁడెకాల్తు నం
చలఘు బలంబుఁజూపఁ బవనాత్మజుఁడా రణసీమఁజేర న
బ్బలియు నొకంటఁగూల్తుమని పైబడు కౌరవసేన యయ్యెడన్
చెలువుగఁబిల్లిఁ బట్టుకొనఁ జేరెడి యెల్కల పిండుఁ బోలెడిన్


(సంపూర్ణము)

అవధానాంతమున

పండితకవుల యభిప్రాయములు


బ్రహ్మశ్రీ బొమ్మరాజు జూనకీరామశర్మ

శ్రీకాంతాగాఢవక్షోజ కుంకుమాంకవిభూషణః
పాతుమామబ్దిజామాతా భో సోదరకవీశ్వరౌ

కైశికీభారతీవృత్తియుక్తా గౌరీవిభూషితా
సుశయ్యాచావధానేవాం రాజతేకవితా భృశం

అవధిశిఖరపశ్చాద్భాగగానాంశిలానాం
శితశితినువిభేదాజ్ఞానభాజాంక్రమేణ
ప్రథితవిమలకీర్త్యబ్జాతపై స్సూచయంతౌ
కవిమలతిల కేపావిష్ణురాయుర్విధత్తాం

కొప్పరపుంగవుల్ సుకవికోటిని మాన్యులటంచువింటి నే
నెప్పుడుగాంతునా? యనుచు నెంతయు నువ్విళులూరుచుండ నే
డిప్పురిస్వాగతంబొసఁగిరియ్యది మామకదిష్టమౌట నే
నిప్పుడచేర్తు వీరలకహీనమతిన్ఁ గవికంఠభూషలన్

కవికంఠ భూషణములు

సురసంచయంబునకు సోకులమూకకునుం గురుత్వముల్
సరగంగ్రహించుటను శాత్రవవృత్తినినుండిరిప్డుసో
దరసత్కవీశులనాధారుణిగీష్పతి భార్గవుల్ జనిం
చిరటంచుసజ్జనులు సేవలుసల్పఁ జరించి రంతటన్

భువిఁగింకవీంద్రులకుఁ బోల్చెడిదౌష్ట్యగదన్ జికిత్ససే
యవిరించియాజ్ఞఁగొని యశ్వినులాద్యభిషగ్వరుల్ వడిన్
దివినుండివచ్చిరనధీనిధులైన కవీశులిర్వురున్
గవివందనీయతనుఁగాంచిరి, వేం, సు, ర, నామధేయులై

కడునాశుధారగను గంటకునూఱులుపద్యముల్ సుధన్
జడివానగొల్పి కవిసన్నుతులంగొనమీకె సెల్లుఁగా
యుడురాజశారద పయోధర ధాతృకుటుంబినీ సుధా
జడధిప్రఫుల్ల సితసారసశుభ్రయశః ప్రకాశులై

ఎలమిన్ భగీరధమహీశ తపోముదితేశ మస్తకో
జ్జ్వలసజ్జటాపతన సభ్రమవేగవియన్నదీ ఝరిన్
దలపించు మీవిమల ధారను మేధను గల్మి చల్వయున్
గలవాణివాణియును గావుతఁగాఁపురమయ్యు మీయెడన్

భువినొప్పు పోతవరపూర్నిలయుండును - రామరాయ సూ
రివరప్రశిష్యుఁ డతిప్రేమను సోదరసత్కవీశులన్
గవిగంరభూషలను కమ్మనిపద్దెము లింపుమీఱఁగన్
జవులొల్కఁబల్కె గవినాధులుఁ బండితవర్యులౌననన్

శ్రీమాన్ మాడభూషి వీరరాఘవాచార్యులుగారు, పేరాల

శ్రీపతిః కరుణారాశిః పాతుసత్కవిశేఖరౌ
భ్రాతరౌకవితాధారా సంపూరితదిక్తటౌ

చీరాల పేరాల ఇతిప్రసిద్దం పురద్వయంపూర్వసముద్రతీరే
విభాతివిద్వత్ప్రకరైః ప్రకీర్ణంపురం యథేంద్రస్యమనుష్యధర్మణః

తత్రతైఃకవితావలోకనపరైః కార్యేషుదక్షైఃప్రభోః
శ్రీదుర్గాంబిక సత్ప్రసాదవిభవైః శ్రీలోకనాథాదిభిః

సానందంసకుతూహలం సవినయం సంప్రార్ధితాసాదరం
స్వాసాధారణలక్షణైశ్శుభకరై స్సుస్వాగతౌసుప్రభౌ

బ్రహ్మశ్రీ పెళ్లూరి శ్రీనివాసశాస్త్రిగారు

తాభ్యాంకృతాన్యనుపమాన శతావధానా
న్యాశుప్రబంధరచనాని పరశ్శతాని
దృష్టానిసర్వవిబుధైః పరికీర్తితాని
వక్తుంక్షమాని న సహస్రముఖేనతాని

ఆకల్పమత్రవిజయీ కవిరాజవర్య
భ్రాత్రాసహైవ భవవేంకటసుబ్బయాఖ్య
త్వద్వాక్యజాతమకరందరసప్రవాహే
మజ్జత్యయంసమనుభూయబుధాళివర్గః

బ్రహ్మశ్రీ మన్నవ నరసింహముగారు, మన్నవ

కప్పురపుఁబల్కు కొప్రంపుఁ గవులపల్కు
నవరసులమూట కొప్రంపుఁ గవులమాట
కాకవులఁగొట్టు కొప్రంపుఁ గవులతిట్టు
లనఁగఁగవిసింహులయి యశంబందినారు

మెచ్చిరి పండితోత్తములు మెచ్చిరి నాగరికాగ్రగణ్యులున్
మెచ్చిరి సత్కవీంద్రులును మెచ్చిరి భూరినరేంద్రచంద్రులున్
మెచ్చనివారిమాటయిఁక మిమ్ములఁజూచి సహింపకుంట వా
రెచ్చటనైన నొక్కరుఁడొ యిద్దఱొయుండిన లోపమున్నదే

అనిలకుమారకుండబ్ది దాఁటినమాట
          నిక్కమాయనిపల్కు నేర్పరులకు
వార్ధింబుక్కిటఁబట్ట వశమెట్లగస్త్యున

         కనిసంశయించు మహాత్ములకును
కొండమోకాటిలో నుండెనా జాంబవం
         తునికనిపల్కెడు మనుజులకును
పసిబిడ్డఁడై తృణావర్తునిఁగృష్ణుండు
         కూల్చినా యనిపల్కు కోవిదులకు

నిట్టియద్భుతకృత్యంబులెల్ల నిక్క
మనుచుఁదెల్పఁగవచ్చిన యజులుగాక
పద్దెములు గంటకొకనాల్గువందలల్ల
జాలిరే కవులీకలికాలమునను

నన్నయకవినిఁజే కొన్న రాజనరేంద్ర
        భూనాథచంద్రుండు లేనికొఱఁత
కవిరత్నమైనతిక్కననుఁ బ్రోచిన మన్వ
        భూనాథచంద్రుండు లేనికొఱుఁత
కవిరాజుశ్రీనాధు గారవించిన వేమ
       భూనాధచంద్రుండు లేనికొఱఁత
కవిదిగ్గజములరక్షణ మొనర్చిన కృష్ణ
       భూనాధచంద్రుండు లేనికొఱఁత

గలుగఁజేసె విచార మాంధ్రులకు నేఁడు
వారిలోనెవ్వరయిన నిప్పట్లనున్న
కవికులమహేంద్రులార! మీకవితవిన్న
గారవింపరె గండ పెండార మొసంగి

శ్రీమాన్ శ్రీరంగకవిగారు

వీరౌనాశుకవిత్వవాహినికి పృథ్విన్ బేరుఁదెప్పించు వి
స్తారామేయ శరద్ఘనామలయశస్సంవ్యాప్త లోకుల్‌మహా

సూరుల్ భవ్యశతావధానకవితా శుద్దాంతులున్ భూరిధీ
సారుల్ కొప్పరపుంగవీశ్వరులు భాషాదేవి పుంభావులున్

కుండినకవిహంస లుండినందునఁగాదె
          కాకవులకుఁ గల గర్వమడఁగె
బాలసరస్వతుల్ ప్రభవించుటనుగాదె
          యాంధ్రభాషకు మోదమావహిల్లె
ఆశుసుకవిసింహు లతిశయించుటఁగాదె
          దుష్టమత్తేభముల్ దూలిపోయె
ప్రకటాశుకవిచక్ర వర్తులొప్పుటఁగాదె
          కవితామహాలక్ష్మి గరిమఁగాంచె

నట్టి సోదరసుకవీంద్రు లాఱువేల
వంశవర్దిష్ణులౌట నీవంశమెంత
భాగ్యమందెనొ? తెల్పఁగా బ్రహ్మవశమె
వారిఁబ్రోవుతఁ గృష్ణుఁ డవార్యమహిమ

అంబుజగర్భ మోదదము లద్భుతభూతవిచిత్రసృష్టి మూ
లంబులు భక్తిచిత్తకమలప్రకరార్కరుచుల్ బుధాత్మ స
క్తంబులు లోకపాలకనుతంబులు పద్మభవాంగనా కటా
క్షంబులు గల్గుమీ కెపుడుఁ గాకవిగర్వ నిబర్హణంబులై

బ్రహ్మశ్రీ చిల్లర వేంకటేశ్వరకవిగారు, వెల్లలూరు

 
సిరికిమగండు భక్తజనసేవితపాదుఁడు కంజసంభవా
మరపతి ఫాలనేత్రముఖమాన్యుల కెల్ల విభుండు శత్రుసం
హరణుఁడపారకీర్తినిధి యంబుజనాభుఁడొసంగుచుండుఁగొ
ప్పరపుశతావధానులకు భాగ్యముల న్విలసద్యశంబులన్

ఎవ్వారుశబ్దార్ధ మవ్వారిగ గ్రహించు
         ప్రజ్ఞలో బాలసరస్వతులయి
రెవ్వారు కుకవి మదేభాళిహరియించు
         శూరత్వమందు నాశుకవిసింహు
లెవ్వారు మధురమై యింపౌ కవిత్వరా
         జ్యంబు ప్రోచుటఁ గవిచక్రవర్తు
లెవ్వారు రయమున నేను నాశుకవిత్వ
         సురనదీవిహృతిచే సుకవి హంస

లట్టి కొప్పరపన్వవాయాబ్ధిచంద్రు
లైన వేంకటసుబ్బరాయకవి వేంక
టరమణకవుల మహిమంబుఁదరమె పొగడ
ఫణిపతికినైన వాక్సతీపతికినైన

ఒక పద్యంబుఁ బఠించి దాని మఱి వేఱొక్కండుగా మార్పుఁ డం
చొకఁడన్నన్మఱి నాల్గు శబ్దములు తానొక్కండు ముందిచ్చి కొం
కక యాంధ్రంబునఁ బద్యమల్లుఁడనినన్ గాదంచ శక్యం బటం
చకటా చంపకుఁడంచు వందనము లేమర్పింతు మంచున్ గృపా
ధికతన్ మమ్మెటొ పంపుఁడీ యనుచు నీతీరైన మేమింక మా
నుకొనన్ వచ్చు వధాన మంచు తమకున్ గోపంబు వద్దంచు త
ప్పక యెవ్వఁడవధాన మందివి యొనర్పం జాలఁడంచున్మమున్
సుకవుల్ మీరు పరాభవింపఁ దలఁపన్ సొంపౌనె యంచున్ సభన్
వికలంబౌమతి జూపుచు న్వినయమున్ భీతిన్ గనన్ జేయు వా
రికి నీ నాఁటి భవద్వధాన కవితా శ్రీపూర్ణ కీర్తుల్ శతా
ర కరోరంబులునై త్రపాప్రదములై రాణించెఁ బ్రాజ్ఞుల్ కవి
ప్రకరంబుల్ నిజముం గ్రహించి మిము సంభావించిరో కొప్రపున్
సుకవి గ్రామణులార! వేడ్కగొనుఁడిచ్చో నా నమస్కారముల్.

బ్రహ్మశ్రీ అన్నంరాజు సుబ్బారావుగారు, నండూరు

శూలిశుంభజ్జటాజూటనిర్ముక్తస
         ద్గంగాప్రవాహ వేగంబుమీఱి
యమృతాపహరణార్ధ మమరేంద్రపురి కేగు
         నలఖగేశ్వరుగతి నపహసించి
మలయశైలాగతోన్మహితసామోదరం
         ధవహగర్వంబు నధఃకరించి

వెలయు మీయాశుధారాకవిత్వమౌర
యిట్టి మీశక్తిఁగొనియాడ నెంతవాఁడ
నలువయగునేని యొక్కింతపలుకునేమొ
సుగుణనిధులార! సోదరసుకవులార!!

శ్రీనాథకవిచంద్రు సీమఁబుట్టినమీకుఁ
         గన నాదుపాండిత్య గరిమయెంత
నిరుపమానకవిత్వ నిర్ణేతలగుమీకు
         నే రచించెడు పద్యనిచయమెంత
యాంధ్రవాల్మీకి మెప్పందియుండినమీకుఁ
         గణుతింప నానమస్కారమెంత
యలవేయి నూటపదాఱులందెడుమీకుఁ
         దనియింప నాయిచ్చు ధనమదెంత

యవనిలో నెవరైనఁ గొండంతవారి
నరసి కొండంతపూజ సేయంగఁగలరె
భక్తితోనిచ్చునట్టి నా పద్యములను
జూచిసంతసమందుఁడో సుకవులార!

అడిగినవిషయంబు లన్ని చెప్పుటెకాని
         యదియుఁగా దిదియుగాఁ దనుట లేదు
విషమవృత్తములైన వెసఁజెప్పుటే కాని
         యవియుఁగావివియుగా వనుట లేదు
కోరుసమస్యలఁ బూరించుటయె కాని
         తప్పను మిషఁద్రోయు దారిలేదు
తుదిఁబద్యములనెల్లఁ జదివి చెప్పుటెకాని
         యడుగువారినిఁ గోపపడుట లేదు

ధర శతవధానులను పేరఁ దనరువార
లెందఱున్నారు వారల కిట్టి బుద్ధి
బలమొకించుకయైనను గలదెచూడ
సుగుణయుతులార! కొప్రంపుసుకవులార!

ధీరవరేణ్యులార! వెనుదీయక విన్నపమొండు సేతుని
ధారణఁదప్పకుండ నవధానమొనర్పఁగఁజాలు శక్తియే
కారణసంపదన్ దమకుఁగల్గెనొ చెప్పకఁజెప్పుచుండె మీ
చారుతరస్వరూపములె సభ్యులకుం గడులేఁతప్రాయమున్

చనమే యెప్పుడు పట్టణంబులకు విస్తారంబుగానచ్చటన్
గనమే దివ్యశతావధానులఁగడున్ గౌతూహలంబొప్పఁగా
వినమే వారల యాశుధారకవితావిఖ్యాతి నీరీతిగా
ననిదంపూర్వముగాఁ గనంబడెనె యాహా! మీయదృష్టంబెకా

బ్రహ్మశ్రీ రావినూతల వేంకటప్పయ్యకవిగారు, వేటపాలెము

అంజలిఁ జేసిభజించెద
నంజఁగదల్పక సదాముదావహముగ హృ
త్కంజము వికసింపం బుధ
రంజకమౌ నిన్నుఁ కొప్పరపుఁ గవియుగమా!

సములెందుంగలరిప్పుఁ డిద్దరఁ గవీశవ్రాతమం దుత్తమాం
ధ్రమునం దాశుకవిత్వమందు నవధానంబందు నేత్రావధా
నమునందున్ సమయానుకూల పదసంధానంబునం ధీర భా
వమునందత్యధికంపుధారణమునన్ వాగ్జృంభణంబందు వా
గమృతంబందును వాక్చమత్కృతిని వాక్యాలంకృతిన్ ధైర్యమం
దమలత్వంబున నీకునాశుకవిసింహా! బ్రహ్మవంశోత్తమా!

నీ సుకవిత్వసౌరభము నీటుగఁగ్రమ్మిననాటనుండి సం
భాసితకీర్తులౌ సుకవిమండలమండనులున్ నిరంతరా
న్యాసకళానిధుల్ విబుధభాస్కరులున్ నరపాలచంద్రులున్
దాసజనుల్ గుణగ్రహణదక్షులు సజ్జనులెల్లమానవుల్
వాసిఁజెలంగ నిన్నెటుల వాకొని వాక్పరిశుద్ధిఁగాంచి రా
యాసఁదరింపఁగాఁదలఁపునందుఁ దలంచితి నట్టిగౌరవ
శ్రీసతినందుకొమ్మిఁకను జెప్పెడిదేమి మహాకవీశ్వరా

వనధిసభాస్థలంబు కవివర్యులిలన్ బుధులద్రులెల్ల వా
రును రతనంబులందలి విరుద్ధపుఁబ్రశ్న లెపో తుపాను కుం
డినకనిహంస! నీయశపు ఠీవియె నావసరంగు నీవుత్రో
వనునడపించుపల్క నిరవద్యతగన్న కవిత్వలక్ష్మిదా
నినిఁగొని నావనొడ్డునకు నేర్పునఁజేర్చితివౌర నేఁడు నీ
టను బడకుండ నిన్నుఁ బొగడందరమా సరితూఁగసెక్కెమా

భోజునికాలమందుఁ బరిపూర్ణవిలాసముతోడ సంస్కృతం
బీజగమెల్లనిండుగొని యెంతయువాసిగ నుండె నందు రా
యోజనె కృష్ణరాయనిమహోన్నత కాలమునందు నాంధ్రమం
భోజభవాండమెల్లెడలఁబూర్తిగనిండి క్రమక్రమంబునన్
దేజమువాసియిప్డిపుడు ధీధృతినొప్పుకవీంద్రకోటిచే
బీజమునాటమొక్కయయివృద్ధికినాంధ్రమె ముందువచ్చి మున్

దా జనియించినట్టి విహితస్థలమైతగునాంధ్రమండలిన్
భ్రాజితమయ్యె నీవలన భాసురలీలలఁ బూర్వమెట్టుల
ట్టేజయమందు సోదరకవీశ్వరచక్రచరా! సుఖస్థితిన్

ఎద్దానిజడులునీ కియ్యభావింపరో
          యెద్దానిదుష్కవు లెఱిఁగికొనరొ
ఎద్దానిచేఁ బెద్ద లెలమిహర్షింతురో
          తప్పులెద్దానిచే నొప్పుఁగనునొ
రాజకీయోద్యోగ రాజసంబెద్దియో
          సకలజనుల కేది సాయమగునొ
దైవతస్వాములెద్దానఁ బ్రసన్నులో
          కనికరం బెద్దానఁ గలుగఁగలదొ

అఖిలలోకైక పూజ్యమైనట్టి దెదియొ
భూతదయగల్గఁగారణభూతమెదియొ
అట్టివందనమును మీపదాబ్జములకు
నర్పణముచేయుచున్నాఁడ ననఘులార!

బ్రహ్మశ్రీ పూసపాటి వేంకటప్పయ్య శర్మగారు

ఓకవీశ్వరులార! మీ రేకమతిని
నిచటగావించునాశువు ప్రచురమయ్యె
శతవధానంబుమిక్కిలి జయముఁగాంచె
నింపుదళుకొ త్తైనామది కిదినిజంబు

ఆశుకవిత్వమందతిశక్తిఁజూపుటఁ
         బృథుకీర్తిఁగాంచె నార్వేలశాఖ
అష్టావధానమం దబ్రంబుఁగూర్చుటఁ
         బృధుకీర్తిఁగాంచె నార్వేలశాఖ

శతఘంటకవిత నాశ్చర్యమిచ్చుటచేతఁ
          బృథుకీర్తిఁగాంచె నార్వేలశాఖ
సత్కవిబుధరాజ సత్కృతుల్ గసుటచేఁ
          బృథుకీర్తిఁగాంచె నార్వేలశాఖ

మీరలీభువిజనియించి మించుకతన
నిందుఁ డమృతంబుఁ జనియింప నెల్లవారి
పొగడికలఁగన్న దుగ్ధాబ్ది పోల్కిఁగాఁగఁ
గొప్పరఁపుఁగవులార! సద్గోత్రులార!

బ్రహ్మశ్రీ కొండముది నరసింహకవిగారు, అప్పికట్ల

శ్రీమత్కొప్పరపన్వయాంబునిధి చంద్రీభూత శ్రీసుబ్బరా
యామాత్యా! భవదాస్యపుష్కరవినిర్యత్పద్య సంపాతమే
ధీమచ్చిత్తతటాకమందుఁబడి యేధీకుల్యలన్ బాఱునా
శ్రీమజ్జీవితసస్య మొక్కటిగదా సిద్ధించుసాఫల్యమై

సరసులు సత్కవీశ్వరులు శాస్త్రవిశారదులద్భుతావధా
న రచనలందు నేర్పరులు నమ్రులుసద్యశులైనయట్టి కొ
ప్పరకుల సింధుసోములు ప్రభావసమన్వితులైన సోదరుల్
సురుచిరరూపసంపదలఁ జూడఁగవాగ్వనితా నరాకృతుల్

పటుకీర్త్యాకర పండితావన లసద్బాగ్యోదయా! నీదుపే
రిటివారెందఱఁగంటిఁగాని కవితారీతిన్ విమర్శింప వేం
కటసుబ్బాఖ్యకవీంద్ర! నీసదృశులన్ గాంచంగలేదెన్నఁడున్
నిటలాక్షుండు మదీయుఁడౌటను సుమీ నీదర్శనంబబ్బుటల్

బ్రహ్మశ్రీ గుంటుపల్లి చంద్రశేఖరరావు

చాటుకవనంపుఁబద్దెముల్ చదువుటింతె
కాక కబ్బంబుగూర్పఁగాఁగలరె వీర



లనెడు వారలమోరల నడఁచినట్లు
గా హరిశ్చంద్రుకతఁ గూర్చు ఘనులు మీరె

ఆశుకవిత్వమందఱకు నబ్బురముం గలిగించె నిన్న నేఁ
డీసభసంతసంబుఁ బ్రవహింపఁగ జేసె శతావధానమున్
భాసురకీర్తిచంద్రికలఁ బర్వఁగఁ జేసితిరయ్యలార! వా
తాశనరాజుకైనఁ గొనియాడఁగ శక్యమె యిజ్జగంబునన్

కాళిదాసకవిత్వ కౌశలంబునుతింప
          భోజరాజేంద్రుఁడీ పుడమినెగడె
కవి బ్రహ్మయనెడి తిక్కనపొగడ్తకుఁ దేఁగ
          మనుమసిద్ధినృపాల మౌళియెప్పె
శ్రీనాథువాక్చాతురీసుధఁ గ్రోలంగ
          ననవేమభూపతి యమరియుండె
తగ నాంధ్రకవితా పితామహాఖ్యనుగొన్న
          పెద్దనార్యుని గృష్ణవిభుఁడు ప్రోచే

గాని యీకవులకును సత్కార మొసఁగు
వారు లేరను శంకలీవరకుఁ బోవఁ
బరగఁ జీరాల పేరాల పౌరవరులు
చూపెదరుగాక బహుమాన సూచకములు

చీరాల పేరాల పురవాసులు

శ్రీ వెలయు కొప్పరంపు పురీ నివాసు
లార! రమణాఖ్య సుబ్బరాయాఖ్యులార!
సోదరకవీంద్రులార! యశోనిధాను
లార! మావిన్నపముఁ బ్రేమమీఱ వినుఁడు

ఒక్కఁడు నింగిలీషునను నొక్కఁడుఘూర్జరభాషయందు వే
ఱొక్కఁడు పార్శియందునుమఱొక్కఁడుల్యాటినునందుమిమ్ములన్
గ్రక్కునఁబోరరమ్మనుచుఁ గాఱులుపల్కుట లెల్లవింటిమా
తక్కరిపండితోత్తములు తప్పుకొనంగను మాఱుమార్గముల్
ద్రొక్కుచునుండు వారలొగిధూర్తమతంబుగ్రహించి యెందుమీ
ప్రక్కను నిల్వలేక యిటుబల్మరునాడుదురింతెగాని యా
యక్కజపుం బ్రసంగులనయారె యెఱుంగని బాసయందు పెం
పెక్కరచింపుఁడన్న నదియెట్లని నెమ్మది నెంచలేరుగా
కొక్కటియైనఁ జక్కఁగను నోర్చినఁజాలునుగాని యీగతిన్
నిక్కువ మొక్క విద్దెయును నేర్పుగ నేరువలేనివారితో
నెక్కడివాదమంచు మదినెంచుఁడి మించుఁడి యీసడించుఁడీ

ఆశుకవితావిధానములనఁగ నెంత
పొట్టకూటికి భట్రాజు పోల్కిననుచు
నొకరొయిద్దఱొ యనిరని యొక్కనోట
విన్నవారము మీరిది విన్నవారె

అఖిలరాజన్య ధనాధిపాశ్రయములు
          గోరుచుండుట పొట్టకూటికొఱకె
కృతులొనర్చుచును ముద్రింపించి యవియమ్ము
          కొనుచుండుటలు పొట్టకూటికొఱకె
పాండితిలేకున్నఁ బండితుండననుట
          కోర్కెదీరఁగఁ బొట్టకూటికొఱకె
పరగౌరవమె దుఃఖభాజనంబుగ నెంచు
          కొని వాఁగుటయుఁ బొట్టకూటికొఱకె

కోటివిద్దెలు నేర్చినఁ గూటికొఱకె
యనెడు నార్యోక్తి నెఱుఁగని యధములాడు

పలుకులెంచంగవలదు మీతలఁపులందు
మిమ్ము ప్రార్ధించువార మమేయులార!

ఘటికాశతగ్రంధ కర్తనంచని రామ
          రాజభూషణుఁడనెఁ దేజమెసఁగ
సూరనార్యుండు నాచొప్పుననే యనెఁ
          గానియెక్కువఁ జెప్పఁ బూనఁడయ్యె
ధీరుఁడౌ నెల్లూరి వీరరాఘవకవి
          గడియకునూఱింటిఁ గడువఁడయ్యె
సకల దేశాధీశ సందర్శనులు కొంద
          ఱేమాత్రమును జెప్పు టెఱుఁగరయ్యె

గంట కేనూఱునార్నూర్లు గణనఁ జేయఁ
జెప్పితిరి చెప్పుచుంటిరి కొప్పరంపు
కవిశిఖామణులార! మీకంటెనితరు
లెట్లుఘనులగుదురు? చెప్పనెట్లుతగును?

చెప్పిరితొల్లి పెద్దనయుఁ జెల్వలరారఁగ సూరనార్యుఁడున్
మెప్పుగ రామభూషణుఁడు మేటికవీంద్రుఁడు రామకృష్ణుఁడున్
దప్పక నాశుధారల యథావిధివారల శక్తిఁజూపరే
యిప్పటి కాకవీశ్వరుల కింపుజనింపదదేమి చిత్రమో
యప్పని పూనలేక యిటులాడుటెగాక యసూయతోడుతన్

పుట్టుకతోడఁబుట్టినది పూన్కినిమీకవనంబు గావునన్
బట్టఁగలేరు తప్పులిఁక బల్మరువ్రాయుచు దిద్దుకొంచున
ప్పట్టునఁ దప్పులున్నవనఁ బాటియొనర్పక సంచలించువా
రెట్టులనన్న నేమి యిది యించుకమీమదినెంచఁబోకుఁడీ

భవదీయనర్మ గర్భపుఁ జంద్రహాసముల్
          తెలియకుండఁగ మెడల్ త్రెంచుచుండ
లలితదీర్ఘసమాస లావణ్యతా కల్ప
          వల్లికల్ కంఠముల్ వలగొనంగ
నతిశబ్దచిత్రవాగబ్దితరంగముల్
          తలక్రిందులుగఁద్రిప్పి కలఁచుచుండ
వాక్యధారాధిక ప్రళయకాలసముద్భ
          వాంబుధారలు కంపమందఁజేయ

నాశుధారా మహాకవిత్వాంబు రాశి
పొంగిదిక్కుల నాక్రమింపంగ నిలువఁ
జోటుదొరకక దిక్కులు చూచితిట్టి
కొట్టుకొనిపోవువారల గొడవలేల

ఆశుధారాకవిత్వమం దాదరమునఁ
బెద్దనార్యుని కాలను బిరుదుతనదు
చేతితోడను వేసి సంప్రీతుఁడైన
కృష్ణరాయఁడెసాక్షి యీకృతులకెల్ల

ప్రధితచీరాల పేరాల వాసులైన
వారలు ముదంబుతో ననివార్యమైన
భక్తిని లిఖించినట్టి యీపద్దియములు
దయనుజేకొనుఁడయ్య మోదముదలిర్ప

శ్రీ అక్కిరాజు సరసింహకవి -వంగవోలు -చంపకమాల

కరముమనోహరంబు నలగాంగఝరీరయ భాసురంబు మే
దుర ఘననిస్వనంబునయి తోఁప జగంబున నెల్లవారున
బ్బురమునఁ దేరిచూడఁ గడుఁ బూజితమౌ భవదాశుధారసుం

దరతరమౌ భవచ్చతవధాన విధానమనోజ్ఞతం గనం
దిరమగురీతినచ్చెరువు తేజరిలెన్ మునుమిమ్మువంగవోల్
పురమునఁజూచినప్డె యిదెపో కవితావనితావిలాసని
ర్బరగతియంటినిప్పుడు చిరాలపురంబున నాశుధారలో
హరువుగఁజెప్పనద్దినకరాన్వయుఁడైన త్రిశంకుసూనుస
చ్చరితమ వింటినెమ్మదిని సంతసమెక్కువ యయ్యె వహ్వరే!
వరపదగుంభనంబహ సెబాసు రసాన్విత మౌటఁదుష్టియై
పరగెఁబుటంబులన్ మెఱుఁగు వారెడుబంగరురీతిమాకు గో చరమగునింతలాశువభిసారికఁబోలియెసంగె నిప్డలం
కరణములన్ని దాల్చి నయగారపుఁ జేఁతల జగ్గునిగ్గుసొం పొఱపునుగుల్కుతల్కుమెఱపుల్మిగులన్వహియించెనౌర మే
ల్పెరిగెనుగౌతుకంబడరె విస్మయమయ్యెను గానఁగూర్మిహె
చ్చరిక రచించినాఁడనొక చంపకమాలికఁ గైకొనుండు సు
స్థిరమతీదీనినాశుకవి సింహములార! సుధీంద్రులార! కొ
ప్పరపుఁగవీంద్రులార! మిమువర్ధిలఁజేయుత నీశుఁడెల్లెడన్

శ్రీ పేరాల లింగరాజకవి, వేటపాలెము

సరసవరేణ్యులార! బుధసత్తములార! నియోగివంశసా
గరవరచంద్రులార! నృపకాండహితోరుచరిత్రులార! కొ
ప్పరపురవాసులార! గుణభాసురులార! మనోజ్ఞులార! మీ
సరసకవిత్వధాటికిని సాటియొనర్పఁదరంబె? మేటిమో
టరుగతిమించుధూమశకటంబును గెల్చుఁదలంపఁగా దివా
కరురథ వేగతుల్యమగుఁగాదె యిదేమి యదేమి గాంగ నిర్
ఝరనిభ వాగ్విజృంభణముఁ గర్ణములన్ వినఁదన్విదీఱునే
గరిమను మీరుసేయు శతఘంటవధానముఁ జూడఁజూడనీ
కరణిని గంటకైదు శతకంబులఁగూర్చెడి నేర్పుకల్గుధీ

వరులనమీరెమీరె పెరవారలొకో యిదిస్తోత్రపాఠమో
పరిగణనంబపూర్వమునఁ బద్దెములం గడెకొక్కనూఱిటిన్
సరవినిజెప్పువారలు నిజంబుగ నుండిరి వారిమించి యి
ట్లరయఁగవిత్వమల్లుటయె యబ్బురమౌ పని యందులోనస
త్వరమొనరన్ రచించుటయథార్థముగాఁగడుఁగష్టసాధ్యమౌ
మఱియును బూర్వమాశుకవిమండనులన్ నృపకుంజరంబు లా
దరమునఁజూచి మన్ననలఁ దన్పిరి వానికిమీరె సాక్షులౌ
మఱిమఱియెందఱోకలరు మానితచర్యులు వారిమ్రోల న
క్కఱపడి చంపకంబులను గైకొని హారముఁగూర్చిఁనాడ సో
దరకవులార! యాదరముదారగతిన్ గనుపించుచుండి హె
చ్చరికను మత్సమర్పితసుచంపకమాలగ్రహింప వేఁడెదన్

సూరిస్తుత సుకవిత్వ
ప్రారంభకులైన కొప్పరపు వేంకట సు
బ్బారాయ రమణ కవులను
శ్రీరమణుఁడు ప్రోచుఁగాత సిరులిచ్చి దయన్

శ్రీ కార్యముపూడి రాజమన్నారుకవి

సరసులు పండితుల్ నృపతిసత్తము లెన్నఁగఁ బత్తనంబులం
దఱమరలేకఁజిత్రగతి నాశుకవిత్వ శతావధానముల్
నెఱపి వరప్రసాదులను నిద్దపుకీర్తినిఁ జెందినట్టి కొ
ప్పరపు కవిద్వయంబు శశిభాస్కరులట్ల వెలుంగుఁగావుతన్

కొద్దిది కొప్పరంబు కవికోటులవాగ్‌ఝరిమేటికీర్తి చే
బ్రద్దలుగొట్టి కాండమున భాసిలు వేంకటసుబ్బరాయనిన్ ముద్దుకవీశుఁదత్సహజుఁబూనుటఁదోఁచకతోఁచెఁగొద్దియౌ
యద్దమునుం గకారము మహాద్రిహరీశులఁ దాల్చునట్లొగిన్

వేంకటసుబ్బరాయకవి వేంకటుఁడౌ రమణార్యవర్యునిన్
బొంకముఁగానుతించు పనిఁబూనిననేఁడులుపట్టునంచు నే
జంకుచు జంకుచిట్టులనఁ జాలితి శ్రీచతురేంగితజ్ఞులున్
గొంకుటొకింతలేని కవికుంజరులంచు నిరంకుశంబుగన్

రాజితాం కవిసింహౌ ద్వౌ కొప్పరాద్రిగుహోద్భవౌ
ఇతోధికావధానైశ్చ నతోత్తమబుదైస్సదా

శ్రీ గుద్దంటి చినగోకర్ణము

అంబికాదత్త సత్కవిత్వాతి రేకు
లగుచు నవధానముల్ బుధుల్ పొగడఁజాలఁ
జేసి నెగడొందు సత్కవిశ్రేష్ఠులైన
కొప్పరపు సోదరకవులఁ గొల్తు భక్తి

సురుచిర శాస్త్ర వేదులగు సూరివరేణ్యుల సత్కవీంద్రులన్
నిరుపమవాగ్విలాసుల మనీషుల సత్కవితామృతంబునన్
బరిపరిఁ జొక్కఁ జేసినఘనప్రతిభానిధులైన వీరులన్
ధరణిసృజించికొంచెఁగద ధాత యశేషయశోవిలాసమున్