కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/331వ మజిలీ

వికీసోర్స్ నుండి

నందుండి లేచి ముందు నడచుచున్న కుమారకేసరి నత్యంత ప్రేమోపచార వచనముల నాదరించుచు నమ్మణి మండపము వెడలి వసంతశీలుని యనర్ఘ పారితోషికముల బ్రీతునొనర్చి తురగారూఢు డై సామంతవర్గము జేయునతులందుకొనుచు గ్రమం బున నిజనగరంబున కేగెను. ఇంతలో నా కన్యాలలామను సమకూర్చు భారము నర పతి తనయందుంచి నాడని విధి యామెను వెదుక బంపెనో యనునట్లు పగలును స్యూరుడును గూడ నిష్క్రమించిరి. అప్పుడు రాజేంద్రుని మనమున మన్మధ రాగము నిండినట్లె పశ్చిమ భూభృచ్చిఖరమున సంధ్యారాగ మావరించెను. పిదప గాఢాంధకారము దిశలెల్ల నాక్రమించుకొనెను.


331 వ మజిలీ

రాక్షసుని గర్వభంగము

నాఁటిరాత్రి చీఁకటి పురమెల్ల దట్టముగా నలుముకొనెను. ఇది స్థలమిది నీరిది మెరక యిది పల్ల మని నిరూపింప నశక్యముగా నుండెను. ఇంతలో జనార్థనుని చేతిపాంచజన్య మట్లు, కాళియపణా పంజరమందలి నిర్మోకపుంజముగతి, యమునాజల మందలి ఫేనపిండము డంబున, కువలయవనమందలి హంస విధమున తారకానాధుం డంబరము నలంకరించెను.


గీ. చీఁకటికి సూడు వీఁడని వీఁక మిగుల
    మఱుఁగునభిసారికర చూపుమంటలఁబడి
    చందురుఁడు బూదెబుంగయై స్వచ్ఛబింబ
    మడరఁ దొలిదిక్కుగట్టున నమరియుండె.

మరియును,

గీ. ఇనుఁడు లోకాంతరంబున కేగ నపగ
    తాళిఘనశిరోజకలాపయైక మలిని
    విధవలోలె వెన్నెలయను విమలవస్త్ర
    మునుముసుంగిడుకొని మోము ముడుచుకొనియె.

అప్పుడు చీఁకటిపడఁగ నభము శుభ్రకాంతు లీనుచుండ గుముదములు వికసింపఁ దమ్ములు ముకుళింప, శశికాంతశిలలు చెమ్మగింప, జారచోర ప్రచారములు సన్నగింప, విరహిణుల చిత్తముల కనంగతాప మతిశయింప, జగమున కాహ్లాద మొన గూర్చు సుధాంశుండు మింటఁ బ్రకాశించుచుండెను. అట్టి సమయమున మదనతాపముచే వేగుచున్న పుండరీకరాజేంద్రుండు పూర్వరాత్ర కరణీయముల నిర్వర్తించుకొని జ్యోత్శ్నామృతోపశాలితం బగు సౌధాగ్ర మున కేకతమఁ బోయి యందు విలాసపట మండపమున ధవళచీనచ్చద్యాబరంబున డంబుమీరు హంసతూలికా తల్పగతుండై పాలమున్నీటియందు మధుసూదనునిభాతి నతిశయించి యుండెను. హరిణలాంఛనుఁడగు చంద్రునిజూచి తదాకారసాదృశ్యంబగు చిత్రపటము దలంపునకు వచ్చుటయు నయ్యది చేతఁ బట్టుకొని యందు లిఖింపబడి యున్న యన్నులమిన్న రూపమును, ననిమేషదృష్టులం దిలకించుచు నిట్లు తలంచు కొనెను.

ఔరా ! ఈ కన్యకాలలామ నా కెట్లు సమకూడఁగలదు? ఈమె నే యుపా యమునఁ గనుంగొనఁ గలను ? నేను ముందేమి యొనర్పవలయును? నా మనోప హారిణి నెందు వెదకుదునని చింతించుచు మరియు నతండు నిలింపుల మందిరముల యందు విధ్యాధరుల పురములలో గుహ్యకాశ్రయముల భుజగరాజధానుల నామె యెందున్నదో వెదుక నుత్సహించుచు, నంబరమున కెగుర, గిరుల నుల్లంఘింప, భూమి నతిక్రమింప, సముద్రమును దరింప, ద్వీపాంతరముల కరుగ, నురగలోకమును ప్రవేశింపఁ దలంచుచు, నందులకుఁ బక్షుల సర్వగామిత్వమును, జగదేక చక్షుషుండగు సూర్యుని సర్వలోకత్వమును యోగసిద్ధుల సర్వవేదిత్వమును నపేక్షించుచు, మదన మూఢుండై సితకర కిరణసంతానముల గగనారోహణరజ్ఞువులని భ్రమించి వాని నూఁతగఁ బైకెఁగ నుంకించుచు, కుముదవనమారుతారూఢుఁడై దిక్కులఁ బరిభ్రమింప నూహించుచు, నిట్లనేకభంగుల హృదయాందోళన మందుచుఁ గొంతకాలము గడిపెను.

ఆ రాజేంద్రుం డిట్లు విరహతాపమున వేగుచు నాకసము వంకఁ జూచు చుండ నా విమలచంద్రికాపుంజమున నకస్మాత్తుగా విస్తార యంధకారము గ్రమ్మెను. దాని కతం డబ్బురంపడుచు ఓహో ! ఇదేమి ? ఇట్లత్యద్భుతముగ నంధకార మావ రించినది ! ఇంతలోనే హిమాంశుండస్తంగతుఁ డగుటకు హేతు వెయ్యది ? నేఁటి తిథి ననుసరించి ప్రథమయాయంబునఁ కొన్ని గడియలు తప్ప రాత్రియంతయును జంద్రుఁడు ప్రకాశింపుచుండవలెను గదా ? ఇది హేమంతమును వర్షాగమమును గాకుండుట వలన నాకసము నిర్శలముగా నుండవలెను. మరియును సంపూర్ణగ్రాస మగు జంద్రగ్రహణము గలిగె ననుకొనుటకైన నేఁడు పూర్ణిమకాదే?

ఇంక యిదేమై యుండును? అంజనపర్వతము దిరుగ ఱెక్కలఁ దాల్చి నంబరతలమున కెగిరియుండలేదుగదా ? లేక యకాలజలధరసమావేశ మగుచుండెనా ? కాకున్న నెవఁడైన నిట్లింద్రజాలమును బ్రదర్శించుచుండెనా? అని యిట్లారాజేంద్రుండు విత్కరించుచున్న సమయమున నయ్యంధకార మెల్ల బుంజీభవించి గగనము నుండి యానగర పరిసర భూమియందుఁ బడెను. తోడనే హృదయవిద్రావకంబుగ మర్మ విచ్చేదకముగ నెడతెగని యార్తధ్వని యా భూజానికి దూరమునుండి వచ్చుచుండుటచే నస్పష్టాక్షరార్థంబుగ వినంబడఁదొడంగెను.

పుండరీకుం డాయాక్రోశరవం బాలించి యౌరా ! ఆ యద్భుత తమోరాశి వెంటనంట నంబరమునుండి పుడమి కేతెంచిన దెవరై యుండును ? ఆ యార్తనాదంబు నకుఁ గతం బేమై యుండును ? ఏమైన గానిమ్ము. ఆర్తపరిత్రాణమే ధర్మముగదా ! అందును ధాత్రీశ్వరుండగు క్షత్రియున కాధర్మ మవశ్యకర్తవ్యము, కావున నే నిప్పుడే పోయి యాపదపాలైన యావ్యక్తి నాశ్వాసించెదను. ప్రసంగ వశమునఁ దదీయ యన్వ యాభిధానాదులం దెలిసికొందునుగాక యని యందుండి లేచి వీరపురుషోచితవేషము ధరించి కృపాణధారియై యాచీకఁటిలో నొరులెరుఁగకుండ నతిజవంబున నా యార్త ధ్వని ననుసరించి పోయెను.

అట్లు పోయి స్మశానవాటిక యందున్న చండికాదేవి శూన్యాయతనమున కనతిదూరములో విశాలశ్వత్థవృక్షము క్రింద మహాంధకార కూపోపకంఠమున నతి, మలినాకృతిఁగల యొక వ్యక్తినిఁ జూచెను. అయ్యతి త్రివిక్రమ స్వరూపముకన్న దీర్ఘమై యాకసముకన్న నున్నతమై యుండెను. మరియును మహామారి గర్భపాతమువలె రక్తోపవర్ది తాంగముగలిగి భువనభోజనుండగు కృతాంతునియతిధివలె, కాల్పాంతసంచా రుండగు భైరవుని సహాయునివలె నంధకాసురసంహారమునకుఁ జండిక యేర్పరఱచు కొనిన సేనానివలె, శక్తియొక్క పురుష స్వరూపమువలె, భయంకరన్వరూపము గలిగి మండుచున్న నేత్రద్వయముతో దారుణమగు వదనగహ్వరము గలిగి, యందుండి వెడలు పృధుతరానేక వహ్నిచ్చటలు మాటిమాటికి రక్తాస్రవము గ్రోల వ్రేలాడు రస నాళతమువలె నొప్పుచుండ భూషణీకృతానేక నరకరోటుండై భయంకరాకార భాసు రుండగు రాక్షసుం డొకండు గృతాంతునికన్న నుగ్రుడై మృత్యువుకన్న హింస కుండై గన్పట్టెను.

ఆ నిశాచరాధముని యమదండభీషణంబగు భుజదండముచే నయ్యంధ కూబోదరమునుండి బైకెత్తి పట్టుకొన బడియుండి యతి దీనమున నాక్రందించుచు, భయతరళితంబులగు జూపుల దిక్కుల బ్రసరింపజేయుచు, గడగడ వడంకుచున్న నిజతనూలత యానక్తంచరుని మేనఁగల తెల్లని నరకపాల మాలికాభరణమున ప్రతి ఫలింప వానినే శరణు జొచ్చియున్నట్లు గనుపించుచు, జటావల్కముల ధరించి చేతి యందు రుద్రాక్షమాలికం గ్రహించి యోగ పట్టికం బూని యొడలెల్ల భస్మ మలంది కొని లలాటంబున జంద్రలేఖంబూని ప్రశాంత సుందరాకారముతో బదునాలుగేండ్ల వయసున నున్న యొక కన్యాతపస్విని యారాజోత్తమునకుగోచరమయ్యెను. తోడనే యతం డోహో ! భయపడకుము. భయపడకు మని యాసన్న మరణ భయాకులిత యగు నా తపస్విని నాశ్వాసించి యానిశాచరునిచే నామె హానిం బొందకమున్నె తా నచటకు జేరుకొనుటకు మనమున సంతసించుచు నా రాక్షసాధము నుపలక్షించి హుంకార పురస్సరంబుగ నోరీ ! దురాత్మా ! విడువుము తొలగిపొమ్ము. ఈమె నీకు జాలిన యాహారము గానేరదు. ఈ పితృవనమున గాలాపహృత జీవితము లగు జంతుకోటుల సర్వత్ర గ్రహించి తత్చిశిత పిండములచే దుష్పూరంబగు నీజఠ రగర్తంబును నిండించుకొనుమని పలికెను.

ఆ రక్కసుం డక్కజంబుల నక్కుంతల భూపరీవృఢుంచు దిలకించుచు నౌరా ! సురసిద్ధవిద్యాధరోరగ మనుజగుహ్యకులలో నీ యువకుడెవ్వడై యుండును? నేనింతకు ద్రిభువనముల సంచరించుచు బురుషుల నెందరినేని జూచి యుంటిని గాని యిట్టివాని నెందును గని విని యెరుంగను. ఆహా! ఏమి యీ పురుషపుంగవుని శరీరీలావ ణ్యము ! ఏమి వీని సౌందర్యము ? ఏమి వీని దైర్యము ! వెరపు బుట్టించు రక్కసు లకు గూడ భయంకరుండనైన నా యెదుట నితడు శంకలేక కత్తిదూసి నిలువబడుట విచిత్రము గదా! వీడెవ్వడో యొక నసామాన్య వీరునివలె గన్పట్టుచున్నా డు. సమరము నకై యేతెంచి భుజాస్ఫాలనం బొనరించు బ్రతి వీరు నిట్లు మెచ్చుకొను చుండుట వీర పురుష లక్షణముగాదు. వీని సామర్ద్యం బెరింగెదంగాక యని యా భూమీశు నీక్షించి యట్టహాసంబొనరించుచు వాని కిట్లనియె.

ఓరీ ! నీ వెవడవురా ! త్రిదశులకైన నజేయవిక్ర‌ మక్రముండనగు నాతో నీమె కొరకేమిటి కిట్లు గలహింప నెంచెదవు? కల్పాంత విస్తృతాంభోధి జల మహా ప్లవంబునబడు వసుంధర నెవడైన మునుగకుండ దప్పింపగలడా ? నా చేజిక్కిన ఈ యీశ్వర తపస్వినిని విడిపింప ‌సమర్థు డెవ్వడుగలడు ? రెండు చేతులు మాత్రమేగల జంతువవు నీవేమి చేయగలవురా ? చతుర్భుజుండగు నారాయణునకు దశభుజుండగు హరునకు, ద్వాదశభుజుఁడగు కుమారునకుగూడ నే నజేయుండ నని యెరుంగుము. ఇక దక్కినవారి లెక్క యేమి? కావున నేను నీకు హితోపదేశం బొనరించుచుంటిని. బుద్ధి గలవాడనై నీవీ యశక్యమగు కార్యమునకు బూనుకొనకుము.

యౌవన ప్రాదుర్భావ గర్వమున నభంబున కెగురజూచెద వేమిటికి ? దర్పాంధుడవై కృతాంతముఖ కూపంబున నెందులకు బడఁ దలంచెదవు? వీర వ్రతము పేరున మృత్యువు నేమిటి కారాధించెదవు  ? శౌర్యగ్రహావిష్ట హృదయుండవై ప్రజ్వ లించుచున్న యగ్నికుండమున దుముక నేలసాహసించెదవు ? రణరనాస్వాద ప్రవృ త్తిచే విషతరుఫలముల భుజింప నేమిటికి గమకించెదవు ? సుభటచర్యా కుతూహలైక దుర్ల లితుండవై దారుణ పన్నగములో నేల గ్రీడింపదలంచెదవు ? భజబలావష్టం భంబున దిగ్గజముగరంబు బట్టుకొని యాటలాడ నెందులకు బూనెదవు? ఆపన్న పరిరక్షణా సక్తివలన విశ్వైక వీరుండనగు నాతో నేల యుద్ధమునకు డీకొనెదవు? దురంతమగు నీ విఫల ప్రయత్నము నుండి వైళమ విరమింపుము. రణవిముఖుల నీ రాక్షసప్రవ రుండు క్షమించునని యెరుంగు మని పలుకు పలభుజున కాభూభుజుం డిట్లని ప్రత్యు త్తర మొసంగెను.

ఓరోరీ ! దుర్మదాంధా ! ఈ వ్యర్థాలాపములతో నాహవమహోత్పవమున కంతరాయమును గల్పింప జూచెదవేమిటికి ? స్వప్రశంసాపరాయణుండవై బహు భుజులకైన జయింపరాని వాడవని జెప్పికొని ద్విభుజుండనగు నన్నపహాస్య మొన ర్చుచు నీవంటి పిశాచజన్ముల నగ్గించుచుంటివా ? స్వసామర్థ్యమే నరులకు బహు బాహుత్వమని యెరుంగవా ? నిశాచరచక్రవర్తియగు రావణుండువింశతి భుజుండైనను ద్విబాహుండగు శ్రీరామునిచే దలలు నరుకబడి మడియుట మరచితివా యేమి ? భుజ సహస్రవిశ్రుతుండగు కార్తవీర్యుండు భార్గవునిచే నిర్జింపబడుట యెరుంగవా ? కావున నోరిమూఢ ! వీరులకు యుద్ధసమయమున ద్విబాహుత్వమే యుపకరింప గలదని దెలిసికొనుము.


చ. అలఘుమతుల్‌ ద్రిలోకవిజయమున దక్షిణహస్తమున్‌, భయా
    ర్తుల కభయప్రదానముఁ దోడ్తన వామకరంబున, వాడఁగా
    గల రిఁక నిన్నుఁబోలు మదగర్వులు స్వోదరపూర్తికొక్క కే
    ల్మల నిగమప్రదేశ సమమార్జన కింకొక కేల్గ్రహింపరే?

హరి హరాదులకైన నసాధ్యుండనని బల్కుచు ద్రైలోక్య పంద్యులంగూడ నీసడించుచున్న నీ నాలుక దుత్తునియలు గాలేదా ? కాకున్న నానిశితాసిం దాని నిప్పుడే వేయిచీలికలుగా గోసివైచెదం జూడుము. ఓరీ ! పాపాత్మా ఆత్మప్రశంసాపరాతాణా ! వృధావాగాడంబరా ! మాటలవలన గాక పరాక్రమము సమరమున జూపింపుము. రమ్ము. రణమున కాయత్తము గమ్ము. అనిలో ముందు బాణ మేయనని నాకు శపధ మున్నది. కావున దొలుత నీవే నాపై గవిసి ప్రహరింపుము. పిమ్మట నిముసములో మదీయతీవ్రాసిధారల నీశిరము దృళ్ళి ధరణిపై బడగలదు. నిన్ను నిర్జించి యీ బాల తపస్వినిని రక్షించెదనని శౌర్యమదోద్రేకదారుణములగు రణాలాపంబు లారాజేం ద్రుండు బలుకుచుండ నా రక్కసుండు ప్రతిభటబాభమున కానందించుచు వానివీరా లాపముల కక్కజపడుచు దదీయ భుజబలమునకు జకితు డగుచు నట్టివానితో సంగర మున గలియ ద్వరపడుచు నా సమయమునకు దగిన రోషము దెచ్చుకొని యిట్లనియె.

సాధు ! రణకౌండీర ! సాధు! నే ననేక దారుణసంగ్రామముల నారితేరిన వాడను. నీవో పిన్న వయస్కుండవు. నన్ను బోలు రాక్షసులతో నీవింతదనుక నెన్న డును బోరియుండవు. నీ బీరం బెంతటిదో జూచెదంగాక. ఇదిగో మద్భుజపరిఘ ప్రహారముల గాచికొమ్మని చేరువనున్న తాళద్రుమము బెరికి పై కెత్తి బిరబిర ద్రిప్పుచు రాజుపై విసిరెను. తోడనే యతండు దానిని నిజకృపాణ ధారాభిఘాతమున దుత్తు నియలుగ నొనరించెను. రక్కసుం డుక్కుమిగిలి యింకొక్కదానిం బెరికికొనివచ్చి వాతం గొట్టెను దానినిగూడ పుండరీకుం డశ్రమమున ముక్కలుజేసెను. రక్కసుం డిట్లెన్ని వృక్షముల బెకలించి మీద వైచుచున్నను వానినెల్ల ఖండఖండములుగ నా రాజోత్తము డొనరించుచుండెను.

ఇట్టి యుద్ధమున నా ప్రాంతభూరుహములెల్ల శూన్యమైనవి. పిదప నా నక్తంచరుండు శిలాసమర మొనరింప బూనెను. రాజేంద్రుం డప్రమత్తుండై నిజకుఠార ధారల వాని నెల్ల నుగ్గుసేయ దొడంగెను. పిదప గొంతసేపు వారిరువురకును నస్త్ర యుద్ధము జరిగెను. అందుగూడ బుండరీకుడే మేలు చేయియయ్యెను. పిదప నారక్క సుండుక్కివమున నెక్కడనుండియో యొక విశాలదారుణ పాషాణమును శిరమునఁ బెట్టుకొనివచ్చి దర్పోద్రేకమున నిట్లనియె.


చ. అమరఁ గృతాంతుపీఠమున కత్యధికంబయి, మారియింటికు
    డ్యమునయి, మృత్యుదేవికి శుభాస్పదమౌ యభిషేకవేదికై
    పరగెడి యశ్మఖండ వ్రక్కలుసేయు భవచ్చరంబు, యె
    వ్వరు నింక దీని నడ్డఁగలవారలు లేరు సురాదు లందునన్‌.

ఇట్లనుచు రాజేంద్రుని బ్రహరింపనున్న యారక్కసుని ప్రవత్తిం గని యా తపస్వని హహాకార మొనర్చుచు నారాజున కేమి ముప్పు వాటిల్లునో యని నెమ్మనమున భయమందుచుండెను. ఈ యేటు దప్పించుకొనుట మానవేంద్రున కతిదుష్కరమని యంబరచరులు వగచుచుండిరి. ఈ పాటుతో ధాత్రి యనాధయగునని దిక్పాలకులు గుందుచుండిరి. ఇంతలో యుద్దవిశారదుండగు మేదినీకాంతండు ఖడ్గమును విడిచి యతి రయమున వేఱొకగండశిలంగైకొని యా రక్కసుని మణిబంధమును విరుగగొట్టెను. మణిబంధము విరిగినతోడనే చేతనున్న యదారుణశిలా శకలము నేలబడి పతనవేగమున భూమియందు లోతుగా గ్రుంగిపోయెను. అంత పోరు దిలకించుచున్న నభశ్చరుల సాధువాదములు దిక్కుం బిక్కటిల్లెను. పిమ్మట దనప్రయత్న మెల్లనట్లు విఫల మగుట కారాక్షసప్రవరుండు విభ్రాంతుడై యదృశ్యు డయ్యెను. అందుల కా రాజు విస్మయమున నిట్లనుకొనెను.

ఏమిది ! అసమానపౌరుషముగల నీపిశితాశనప్రవరుం డిట్లు సమరసమా ష్టము గాకుండగనే మాయ మయ్యెనేమి ? సంగరరంగమున నరునిచే నిర్జింపఁబడుటకు లజ్జపడి యిట్లు తిరోభూతుం డయ్యెగావలయు. మరియొకయుపాయ మెద్దియైన గ్రహించి వచ్చుటకు నిజసదనమున కరిగియుండెనా ? మాయచే నన్ను వంచించుటకు నభముల కేగెనేమో ! నాయాశయ మెరుంగుట కిట్లుంవచ్చును. రాక్షసుల యుద్ధక్రమం బీక్రియనే జరుగుచుండునేమోగదా ! వాడు బలాయుతుండగుటవలన నింతటితొ సమరోపసంహార మైనదనుకొనవచ్చును. నేనింక నీతపస్వినిని వెంటగొనిపోదునా ? లేక యింకొకక్షణము నిరీక్షించి యుందునా ? రాక్షసులు క్షుద్రప్రవర్తనలు కావున నా పాపాత్ముని జాడ నింకొకముహూర్త మరసెదంగాక యని తలంచుచుండ నకస్మాత్తుగ నందున్న మహాంధకూపమునుండి భయంకరహుంకారరవం బుప్పతిల్లెను. తోడనే యందుండి పొగ లేచినది, తదనంతర మతిభీకరంబగు నగ్నిజ్వాలలు వెల్వడినవి ఆ మంటలతో దుర్నిరీక్ష్యతేజుం డగు రాక్షసుం డేతెంచి రాజుముందర నిలచెను.

ఆ యగ్నిజ్వాలలు జాలదూరము వ్యాపింప బుడమి మండుచుండెను. దిక్కులు మండుచుండెను. ఆకాశము మండుచుండెను. ప్రళయకాలానలమున బడి పోయినట్లు విశ్వమంతయు నాకులత్వ మందెను. అట్టి సమయమున వా దగ్నిమయా కృతియై, యగ్నిమయాలోకపద్దతియై, యగ్నిమయాలాపవృత్తియై, యగ్నిమయాస్త్ర సంభృతియై, యగ్నిమయాశేక్షవ్యావృత్తియై తీక్ష్ణవచనముల నాక్షితిసాల పుంగవున కిట్లనియె.


శా. నీబాహుబలకౌసలం బడరి హానిం జెందగా ఱాయిగా
    దాబోఅందిన తాళవృక్షమునుగా దస్త్రంబునం దస్త్రమున్‌
    గాఁబో దిద్ది దవానలంబు నిఁను దీక్ష్ణజ్వాలలన్‌ మ్రింగెడిన్‌
    నీ బాధన్‌ దొలఁగింప నాకరుణగానీ‌ లేదు దిక్కన్యమై.

ఓరీ ! నరాధమా ! ఈదారుణాగ్నిజ్వాల లావరించినప్పుడైన రక్షింపుము రక్షింపు మని నన్ను శరణు వెడుకుండజాల వని పలుకు నారక్కసిమొక్క లీనితో బుండరీశుండు మందహాసభాసుర వదనపుండరీకుడై యిట్లనియె. ఒరోరీ క్రవ్యాదకీట కాధమా ! రమ్ము నీబిరం బడంప నేను సంసిద్దుడనై యుంటిని. నీవలెమాయా ప్రయోగ ప్రకారమునంగాక వీరపురుషోచితం బగు సంగ్రామమున నీమదము సదమద మొనరింతును. నాచేత నిర్జింపబడి యిప్పుడే గదా పారిపోతివి. చల్లటినీటిచే నార్పదగిన యగ్నిజ్వాలలతో నిప్పుడు సిగ్గులేక వచ్చి రణప్రగల్భము లాడుచుంటివా? ఓరి పెశాచ పశువా! ఈసమరాధ్వరమున బశువువలె నిన్ను విశసనం బొనరింతును. నిన్నేమి చేసెదనో వినుము.


శా. నీసర్వాంగములన్‌ దవానలశిభానీతప్రచండాగ్ని కి
    లాసందోహమునందుఁ బక్వమగు లీలన్‌ జేసి మాంసంబు దీ
    వ్రాసిన్‌ గోసి తదీయఖండములు గాలాస్వస్ఫురద్గహ్వర
    వ్యాసంగంబున నేను బెట్టెదను మాద్య చ్ఛీతలగ్రాసమున్‌.


గీ. అతిశయభుజప్రతాపాగ్ని యలమియుండ
    లేదు నాయందుఁ జోటేమి నీదువహ్ని
    కింక వినుమ ! నీగృహమున కేఁగి బంధు
    జనులఁ గలయుమ, సమరభీషణత మాని.

ఇట్లు నీవొనర్ప వేని యందులకు దగుఫలం బిప్పుడే యనుభవింపగలవని యారక్కసునితో బలుకుచుదనలోనిట్లనుకొనెను ఈ యనలతీవ్రమున జల్లనినీటిచే ముందు జల్లార్చిపిదపమదీయఖడ్గప్రహారమున నీరాక్షసాథముని దెగటార్చెదను. జలము లేనప్పు డార్ద్రతరుపల్లవమున నైన నగ్నిని జల్లార్పవచ్చును. కావున నట్లొనరించెదం గాక యని నిశ్చయించి వామకరమున గృపాణము దాల్చి సవ్యకరమున‌ జేతికందిన పృథుదళాతిమాంసల పల్లవంబగు నయ్యశ్వత్థశాఖను గ్రహించి యోరోరి హింస కాధమా! నిలునిలు మని యతిసాహసమున నారాత్రించరాధముని మార్కొనెను.

అట్లు భీకరాగ్నిజ్వాలల కించుకయును వెరువక సాంద్రప్రవాళభాసురం బగు తరుశాఖం గొని యుద్ధసన్నద్ధుడగుచున్న యీరాజపుంగవుని యవక్రవిక్రమము నీక్షించుచున్న యంతరిక్షచరులు సాధువాదము లొనరింపసాఁగిరి. మరియు నాసంగ రమును దిలకించుచున్న నేకాదశరుద్రులును నాపుండరీకుని ధైర్యసాహసముల కత్య ద్బుతరసావేశహృదయులై తలలుపంకించుచుండ దదీయజటాజూటములనున్న జాహ్నవీ ప్రవాహము జారి పుడమిపై బడెను. ఏకాదశరుద్రుల యుత్తమాంగములనుండి గంగా జలం బేకధారగాబడిముంచుటంజేసి యాశవాశనుని వైశ్వానరసృష్టియెల్ల దృటిలో విధ్వస్తంబయ్యెను.

అప్పు డప్పిశితాశనుండు విస్మితుం డగుచు నతిసంభ్రమమున మృత్యువు శిఖాదండమువలె, సురేంద్రుని రెండవవజ్రాయుధమువలె, కాలమహిషము తృతీయ శృంగమువలె, త్రికూలము చతుర్ధకోణమువలె నభ్రకుంజరము పంచమవిషాణమువలె విశేషభీషణమై, దనుజదారుణా ఘాతమున విఘటితంబైన నృసింహదేవునితీవ్రనఖము వలె నిశితమైన మండలాగ్రంబొండు బిడికిటంబట్టి దానివ్రేటును బ్రతివీరుండు దప్పించుకొని‌పోకుండ నడ్డు పెట్టినట్లు బాహువుల జాపుకొని తీక్ష్ణదృష్టుల నిగుడించుచు నౌడుగరచి పదఘట్టనమున బుడమి యదుర నా రక్కసు డుక్కుమిగిలి యాదారుణ కృపాణము బుడమీశ్వరునిపై విసరెను.

అప్పు డాఖడ్గోత్తమంబాభూపాలోత్తమునిదరికరిగి పదక్షణ పూర్వకముగ వాని పాదమూలమున బడిపోయను. తోడనే యా రక్కసుడు విభ్రాంతుడై సంగ్రామ దారుణవేషమువిడచి చేతులు జోడించుకొని వినయవినమితోత్తమా గుడై యానరేం ద్రునకు జోహారులొనరించుచు నిట్లనియె. ఓహో ! నిజము దెలిసికొంటిని. భూమండలశరీరమునకు బ్రాణమనియును, బ్రహ్మాండశుక్తియందలి యాణిముత్తెమనియును, నరలోకన్యంజనమునకు మృగనాభి నాయకమనియును, భూకల్పలతికయందలి రత్నగుచ్చమనియును, జంబూద్వీపపదక మందలి మాణిక్యబంథమనియును, సకలభువనభూపాలచూడామణియనియును నెవ్వరు కీర్థింపబడుచుండిరో యట్టి ప్రతిష్టాననగర పరమేశ్వరునిగా గుంతలావనీనాధునిగా బండరీకరాజదేవేంద్రునిగౌ నిన్నెరింగితిని. నీ యత్యద్భుతచరిత్రము, నీవిక్రమక్రమము నీవిజ్ఞానసంపద, నీ యుదారస్వభావము, నీ యైశ్వర్యవిశేషము, నీ సద్గుణగరిమము నే నెన్నిసారులో ముల్లోకములయందును విని యానందించితిని. అంధకమధనునిచే బరా క్రమమున గొనియాడబడిన మదీయసామర్ద్యము నెదిరింప నీకుదక్క_ నితరులకు శక్య మగునా? త్రైలోక్యవిజయిని యగు నీమండలాగ్రము దనశక్తినుడిగి నీ పాదముల మ్రోల బడియుండుట విచిత్రముగదా! ఈ కృపాణమును నీకు గానుకగా నొసంగు చున్నాడను. ఈ తపస్వినిని విడచిపెట్టుచున్నాను. ఇక నాకు సెలవొసంగుము. పోయి వచ్చెదను. అవసరము గలిగినప్పుడు నన్ను దలంచినంతనే వచ్చి నీయాన నెరవేర్చి పోవుచుందు నని మిన్నకుండెను.

పుండరీకుండును విస్మయకౌతుకావేశ హృదయుడై యిట్లనియె. అసమ సమరాంతమున నొనగూడిన మనమైత్రి శుభదాయకమై చిరము వర్దిల్లుగాక. ఇందు నాకు నిషచరధౌరేయుడగు మిత్రుడలవడినందుల కెంతయును సంతసించుచుంటిని. నీవృత్తాంత మెరుంగుటకు నా మనం బుత్సహించుచున్నది. నీ వెవ్వడవు? రక్కసుండ వైనను నీయందు సద్గుణము లుండుట గ్రహించితిని. ప్రభావసంపన్నంబగు నీమండ లాగ్రము నెందుండి యెట్లు సంగ్రహించుకొనివచ్చితివి. ఉన్నతాశయుండవగు నీవీ తపస్వినిని దయమాలి యేమిటి కట్లేడ్పించితివని ప్రశ్నించు నరేంద్రున కా దాన వేంద్రుం డిట్లనియె.

332 వ మజిలీ

మాయాబలునికథ

దేవా అవధరింపుము ! దక్షిణసముద్రమున కావల కనకమయా శేష వస్తునిస్తులంబై యత్యంత శోభాయమానమగు లంకాపురము గలదని వినియేయుందువు. అచ్చట‌ దశకంఠునిశాసనమునఁ గట్టపడినసమీరణుం డిప్పటికిని బ్రబలదాయకపతాకాగ్ర ములఁ‌ దన వణకు గనుపింప నతిభయంబున నప్పురంబునుఁ బ్రవేశించుచున్నట్లు