కాశీమజిలీకథలు/ఏడవ భాగము/121వ మజిలీ

వికీసోర్స్ నుండి

లోకమా ! వైకుంఠమా యని తలంచుచు వీరసింహుఁడు తాను వచ్చిన పనియేదియో మరచిపోయెను. చూచినవింతయే చూచుచుఁ బోయినచోటునకే 'పోవుచునాలుగవ వాకిలియందుఁ బరిభ్రమించుచుండఁ నింతలో విభీషణుఁడు బలిచక్రవర్తి దర్శనముజేసి తిరిగి వచ్చుచుండం గాంచి ప్రహర్షము జెందిమఱి లోపలికిఁ బోవక యతనితోఁగూడి సేనానివేసము చేరెను. మొదటిద్వారమునందు మునుపు గనంబడిన వైష్ణవులెవ్వరు గనంబడలేదు.

అప్పుడు వీరసింహుఁడాత్మగతంబున బలిచక్రవర్తి ద్వారము మహావిష్ణుండు గాచుచున్నాడని పురాణములుచెప్పుచున్నవి. నాచేయి పట్టుకొనినవైష్ణవుఁడు జగదీశ్వరుఁడైన నారాయణుఁడు కాడుగదా. అవును సందియమేలా? బరులకదృశ్యుండనగు నన్నుఁ దెలిసికొనుట వశమా! ఛీ! ఛీ! నేను వట్టి మూర్టుండ. దర్శనమిచ్చినను దెలిసికొనలేకపోయితిని. నేనువట్టిపాపాత్ముడనని పశ్చాత్తాపము జెందుచుండ నింతలో దళంబులు రాజు నానతి పయనము సాగించుటయు వీరసింహుఁడు వారితోఁకూడ భోగవతీనగర ప్రాంతదేశమునకరిగెను. అనియెఱింగించెను.

121 వ మజిలీ.

భుజగాసురుల యుద్ధము

లంబకర్ణిక - దీర్ఘ జిహ్వికా ! యిటురా ! చెవులో మాట! నీకు మంచి యేకాంతము జెప్పెదను

దీర్ఘ జిహ్విక - ఇక్కడనుండఁగ జెప్పవచ్చును. ఎవ్వరివినకుండక నాలుక అడ్డము పెట్టెదనులే. చెప్పుము.

లంబ - ఇఁక మనలంకకు రాజు వజ్రకంఠుఁడగునఁట వింటివా?

దీర్ఘ - ఎట్లు విభీషణమహారాజో.

లంబ - వానిపని‌ యైనదఁట. యిప్పుడే నాకొడుకు దీర్ఘజంఘుండు పాతాళము నుండి యొకజాబు తీసికొనివచ్చెను. భుజించి చంపక యొద్దకు బోవును.

దీర్ఘ - ఆ జాబులో నేమనియున్నది?

లంబ - (మెల్లగా) వభీషణుం డాయుద్ధములో మూర్ఛపోయినాఁడని చెప్పినాఁడు కాని అది చావనియె తలంపవలయును. అంతఃపురకాంతలనెల్ల బారిపోయి మానములఁ గాపాడుకొనవలయునని జాబులోనున్నదఁట చావుకానిచో నట్లు వ్రాయుదురా?

దీర్ఘ - మఱి చిన్నవిభీషణుఁ డేమయ్యెను? తక్కిన రాక్షస వీరులందరు మడిసిరాయేమి? లంబ - ఆవివరమంతయు నాకుఁ జెప్పలేదు. కాని మహాబలశాలియగు పెద్దవిభీషణుఁడే మడిసినప్పుడు తక్కినవారి లెక్కయేమి? పోనీ మంచిపని జరగినదిలే.

దీర్ఘ - అవును మనల కడుపులు మాడ్చుచున్నందులకు మన యుసురు తగులక మానునా? తప్పక వాఁడు చావవలసినదే.

లంబ - ఇఁక మనము నిరాటంకముగా మనుష్యమాంసము తినవచ్చును. మద్యము త్రాగవచ్చును. యధేష్టముగాఁ దిరుగవచ్చును. ఇంకను వెల్ల డింపకుము.

దీర్ఘ - ఆహాహా! మద్యమాంసములు పేరు చెప్పినంత నానాలుక నూరు గజములు పెరిగినది చూడుము. వజ్రకంఠా?? రాక్షసజాతికెల్ల నుపకారము చేసితివిరా ! (అని గంతులు వైచుచున్నది )

లంబ -- అయ్యో? కేకలు వేయకుము భుజించుచు నెవ్వరికి జెప్పవలదని సంక్షేపముగా నాకొడుకు నాకీమాట జెప్పెను. వాఁడు వినినఁ గోపించును ఇంతలో నాగలేకఁజెప్పితిని.కొడుకు లేచువేళయైనది. పోయివచ్చెదను.

అనిచెప్పి లంబకర్ణిక యింటిలోనికిఁ బోయినది. అంతలో దీర్ఘ జంఘుఁడు భుజించి యాపత్రికం దీసికొని అమ్మా ! నేను చంపక యంతఃపురమున కరిగివచ్చెదను నేనన్నమాట యెవ్వరికిం జెప్పకుమీ! యని పలుకుచు నతివేగముగా శుద్ధాంతమున కరిగెను

అప్పుడు చంపక కలభాషిణితో నిట్లు సంభాషించుచున్నది. దేవీ నీవాపురుష సింహునితోఁ బెద్దతడవుమాట్లాడితివి. మేము మాటుననుండి యాకర్ణింతిమి. కొన్ని వినంబడలేదు. అతండెవ్వఁడు? ఇక్కడికెట్లు వచ్చెను. వానితోఁ గులశీలాదుల గుప్తము గావించితినని చెప్పుచుంటివి ఇప్పుడు మాకుఁ జెప్పక తీరదని అడిగినఁ గలభాషిణి యిట్లనియె.

యువతీ! యెఱింగించెద వినుము. ఈతండు జయసింహుఁడుకాడు.వీరసింహుఁడు. విక్రమార్కు ప్రసిద్ది మీరు వినియేయుందురు.ఆతనిమనమఁడు విజయభాస్కరుని కిద్దరము భార్యలము. పెద్దది హేమప్రభ రెండవదానిని నేను. నాపేరు కలభాషిణి యండ్రు. వీఁడు హేమప్రభ కొడుకు. హేమప్రభ వృత్తాంతము మీకునుఁ దెలిసియేయుండును. ఆమె రాక్షస వంశజాతయే అని యాత్మీయ వృత్తాంతమంతయుఁ జెప్పినది. ఆకథ విని చంపక యుబ్బుచు హృదయంబునం బొడమిన సంతసము దెలియనీయక చామరికతో సాభిప్రాయముగా నేదియో చెప్పినది. అప్పుడు తేజోవతి వారియొద్దకు వచ్చి యుద్ధవార్త లేమైనందెలిసినవియా చారులెవ్వరు రాలేదుగదా అని పలుకుచుండ దీర్ఘ జంఘుఁడు ముందరకువచ్చి భర్తృదారిక! నమస్కారము నేను సందేశహరుండ దేవరదాసుఁడ, పాతాళమునుండి యిప్పుడే వచ్చితిని. ప్రహస్త పుత్రుండు మీకీ పత్రిక నిమ్మని పంపెను. గైకొనుఁడు అని పలుకుచు నాకమ్మ చేతికందిచ్చెను.

చంపక దానింబుచ్చుకొని తొందరగాఁ జింపి యిట్లు చదివెను. యుద్ధక్రమ మంతయు దీర్ఘ జంఘుఁ డెఱింగింపఁ గలడు. ప్రస్తుతము మన కపజయము గలిగినది. వజ్రకంఠుడు పారిజాతుని బ్రోత్సాహమున లంకాపురి కరుదెంచి తేజోవతిని జెరఁబట్ట యత్నించుచున్నట్లు తెలసినది. అంతఃపురకాంతలెల్ల నేకాంత నిశాంతముల కరుగుటకు నాయత్త చిత్తులై యుండవలయును. మా రెండవవార్త వచ్చుదనుక నిల్లు కదలవద్దు. ఇట్లు పాద సేవకుఁడు మంత్రిపుత్రుఁడు. ఆజాబు చదివికొని యిచ్చగింపక కంపకలితదేహయై దీర్ఘ జంఘా! మాతాతయుదండ్రియు దగ్గరచుట్టము లుండఁ బ్రహ్మస్త పుత్రుఁడీ పత్రిక పంపుటకు గారణమేమి? యుద్దవిశేషము లేమియో చెప్పుము. నా మనసు తొట్రుపడుచున్నదని అడిగిన వాఁడిట్టని చెప్పఁదొడంగెను.

దేవీ ! వినుము విభీషణమహారాజు చతురంగ బలంబులతోఁ దండువెడలి పాతాళలోకంబునకుంజని దారిలో బలిచక్రవర్తి దర్శించి క్రమంబున భోగవతీ నగర ప్రాంతమున విడిచి వ్యూహములుబన్ని రణభేరీ మ్రోగింపఁజేసిరి. ఆధ్వని విని శత్రువులు మరల రణభేరీ మ్రోగించిరి. క్రమంబున రెండు సేనలు కలియబఁడి సంకుల యుద్ధము గావించినవి. మీతండ్రి సర్వ సేనాధిపత్యము వహించి సేనలు నడుపుచుండ విభీషణమహారాజు గదాపాణియై యుద్ధము జేయుచుండఁ బాములును దనుజులును నిలువఁగలరా ? విభీషణుండు ముహూర్త మాత్రములోఁ బగతురనెల్ల హాహాకార రవంబులతోఁ బలాయితులం గావించెను.

మనబలంబులు గౌరవ్యుని కోట నాక్రమించుకొనఁబోవు సమయంబున నొక వీరపురుషుండు తురంగారూడుండై అరుదెంచి ఆబలంబులఁ బురికొలుపుచుఁ బ్రచండ భందనము గావించెను. ఇకజెప్పనేల నావీరుని సంగరప్రకారమిట్టిదని వర్ణింపఁ బరమేశ్వరునికి వశముకాదు. అందరు కన్నిరూపులై యెక్కడ జూచినఁ దానియై దానవ వీరులనెల్ల అవలీల లేళ్ళగమి శార్దూలంబువోలెఁ బారదోలెను. రాక్షస వీరులు ప్రయోగించు శస్త్రాస్త్రసాధనంబు లతని నించుకయుఁ బాధింప కృతఘ్నునికింజేయు నుపకృతివలె వ్యర్థ౦బులైపోయినవి.

మొదటఁ బ్రహస్తునికి అతనికి ద్వందయుద్ధము జరిగినది. ముహూర్తకాలమైన అతని యెదుట మన మంత్రి నిలువలేక నేలంబడియెను తరువాతఁ జిన్నవిభీషణుఁడు కలియంబడిన వారికి ముష్టా ముష్టి యుద్ధము జరిగినది. రెండు గడియలు సమముగాఁ బోరెను వజ్రకంఠాది దనుజులు సింహనాదములు సేయ నంతలో నాసేనాధిపతి నేలఁబడద్రోసెను. మనుమని పాటుజూచి విభీషణమహారాజు మిగులఁ గోపించుచు నిలునిలుడాని యదల్చుచు గదఁచేబూని సింహనాదము గావించుటయు మాతంగంబు మీది కుఱుకుసింగంబు చాడ్పుననార్చుచు దురగంబు డిగ్గనురికి గదబూని యమ్మహారాజుతో గలియఁబడిగదా యుద్ధము చేయదొడంగెను.

భీమదుర్యోధనులకుంబోలె వారిద్దరికిఁ బెద్దతడవు గదాయుద్ధము జరిగినది. వారి సంగరనైపుణ్యము జూచి దేవత లచ్చెరువుజెంద దొడంగిరి.

తప్పించుకొనుటయు దాటుటయు నురుకుటయు నొగ్గుటయుఁ దగ్గుటయుఁ దిఱుగుటయులోనగు లాఘవంబుల నొకరునొకరు మించిపోరాడిరి. దేవదానవులయుద్ధము లనేకములు చూచి యారితేరిన విభీషణమహారాజుగారితో నల్పప్రాయముగల నావీరుండు సమముగాఁ బోరుటఁ జూపరకు వింతదోపక మానదు.

అట్లు పోరుచుండ గొంతవడికి మన రాజుగారి దెబ్బలు తబ్బిబ్బులు కాఁజొచ్చినవి అయ్యంతరమరిసి‌ యవ్వీరుండు దారుణ గదా ఘాతంబునఁబీడితుంజేసి మీ తాతగారిని‌ మూర్ఛనొందించెను. అప్పుడు మన సేనలో హాహాకారములును, శత్రు సేనలలో జయజయ ధ్వానములును నింగిముట్టినవి.

అవ్వీరుం డంతటితో యుద్ధవిముఖుండై యవ్వలికిఁబోవుటచే మనసేనలందు నిలువంబడియున్నవి. కాకున్న నీపాటికి లంకాపురిజేరవలసినవే. మనరాజు మూర్ఛ దేరునంతలో లంకాపురి బ్రవేశించి దేజోవతి మొదలగు నాగకాంతలంజెరబట్ట వజ్రకంఠాది దానవుల సహాయమునఁ బారిజాతుండుఁ ప్రయత్నము జేయుచున్నట్లు గూఢచారులవలనం దెకిసికొనిప్రహస్త పుత్రుండీ పత్రికనిచ్చి నన్ను మీ యొద్ద కనిపెను. ఇవియే యుద్ధవిశేషములని చెప్పుటయుఁ జంపకశోకాక్రాంత స్వాంతయై పరితపించుచు తేజోవతి కత్తెరంగెఱిగింపుచున్న సమయంబున మఱియొక సందేశహరు డరుదెంచి యొక పత్రిక నారాజపుత్రిక కిచ్చెను. ఆమె తత్తరముతో నాయుత్తరమువిప్పి యిట్లు చదివినది దేవీ ! మీరు శుద్ధాంతముల విడిచిపోవనక్కరలేదు. శత్రువుల రాయిడి యుడిగినది. మనకు విజయసూచనలు గనంబడుచున్నవి. అంతయు నీశార్దూలుం డెఱిగించును. అనియున్న జాబుచదివి యుబ్బుచు నోరీ శార్దూలా ! మనవారుమూర్ఛ నుండి లేచిరా? శత్రువులేమిటికి బారఁదొడంగిరి. యుద్ధక్రమం బెఱిఁగింపుమని అడిగిన వాఁడిట్లనియె. అమ్మా ! మనవారింకనుమూర్ఛనుండి లేవలేదు. ఇది మన వారి ప్రజ్ఞకాదు. వినుండు మనవ్యూహమునకు నా వీరపురుషుం డెట్లు వచ్చెనో తెలియదు. మనవీరులందరు పిరికితనము వహించు దనుక నూరకొని అంతలోఁ దురగారూఁఢుఁడై శంఖము పూరించెను.

ఆధ్వని విని పరబలంబులు చెవులు బీటలువార శార్దూల ఘోషంబు వినిన మేషంబులవలెఁ జిందవందర జొచ్చినవి. అప్పుడు మన వీరుండు సేనల కుత్సాహము గలుగఁజేసి రౌద్రా వేశముతోఁ బ్రతిబలంబుల గలిసి కరవాలంబుల నేసియు శూలంబులం బొడిచియు శరంబులసేసియు శీఘ్రకాలములో మంధరము సముద్రమువోలె సంక్షోభమునొందజేసెను.

వానిముందర నొకవీరుండైన నిలచినవాడు లేడు. రణాంగణమంతయు బట్టబయలైపోయినది. మనవీరుండు శంఖము బూరించుచు వారిం దరిమికొనిపోయెను. అప్పుడు మన బలంబుల సింహనాదంబులు జయజయధ్వానములు నాకసము ముట్టినవి. పడిపోయిన మనవీరులింకను మూర్ఛ దేలలేదు. అవ్వలి వీరుండింకను ననిమొనకు రాలేదు. ఇంత పట్టుచూచి వచ్చితినని చెప్పెను. ఆ వృత్తాంతము విని చంపక యెడద బొడమిన ముదము ప్రకటింపక చారులారా! మీరు పొండు మఱల వేగవచ్చి తరువాత యుద్ధవృత్తాంతము మెఱింగింపుఁడు ప్రతివీరుని పరాక్రమము చూచువరకు మనవిజయము నమ్మరాదని పలికి వారినంపి యక్కలికి కలభాషిణంజూచి యిట్లనియె.

దేవీ ! నీపుత్రుం డధికపరాక్రమశాలియని తెల్లమగుచున్నది. ఇప్పుడు రాక్షస వీరులకెల్ల రక్షకుఁడై పోరుచున్నాడఁట. మనకు దప్పక విజయము గలుగఁగలదు. అనివాని‌ గుణంబులు కొనియాడుచుండఁ దేజోవతి యరుదెంచి అక్కా! జయసింహుని వార్త యేమయినం దెలిసినదా? అతండు బ్రతికియుండెనేమో తెలిసికొంటివా? యని యడిగినఁ జంపక అయ్యో యీవిజయోత్సాహములో వానిమాట యడుగుట మరచితిని. రేపు మఱల దూతలువత్తురు. తప్పక తెలిసి కొనియెదంగాక. పోరుతొందరలో వాని మాట విమర్శించుటయు దటస్తించదు అని వారందఱు నాయుద్ధవార్తలగురించి ముచ్చటింపుచు నారేయిఁ గడిపిరి.

మఱునాఁడు శార్దూలుం డరుదెంచుటయు నంతఃపురకాంతలెల్లవాని మూఁగికొని యుద్ధవార్తలు చెప్పుము చెప్పుము. మనవీరుఁడు విజయమందెనా? ప్రతివీరుఁడేమిజేసెను? విభీషణాది మహావీరులు మూర్ఛదేలిరా అని అడిగిన వాఁడిట్లు చెప్పందొడంగెను.

దేవీ మీరు విచారింపవలదు మనకు విజయము గలిగినది. మీకొఱకే వచ్చితిని. విభీషణాది వీరులందరు మూర్ఛనుండి లేచిరి. కోట మనకు స్వాధీనమైనది అని సంక్షేపముగాఁ చెప్పుటయుఁ జంపక సంతసించుచు వానికిఁ బారితోషిక మొసంగి యిట్లనియె. వీరసింహునకు ప్రతివీరునకుఁ బోరు జరిగినదా! కోట మన కెట్లు స్వాధీనమైనది? ఆవృత్తాంత మెఱింగింపుమని అడిగిన వాఁడిట్లనియె.

ఆమహావీరుని ప్రతాపము నాబోటులువర్ణింపఁజాలరు. వినుండు. మనవీరుండు విజృంభించి శత్రుసేనల నసమానపరాక్రమంబునఁ బీనుఁగు పెంటలగావించినఁ బ్రతివీరుండు యుద్ధమునకుఁ బూనుకొనిన యేదియో విచారంబునఁ గుందుచుండెనఁట. మనవీరునకుజడిసి రణవిముఖుండయ్యెనని కొందరు దలంచిరి. అప్పుడు వజ్రకంఠుఁడు విభీషణ జయంబునకుఁ బరితపించుచు నావీరుంబోర యనేకవిధంబులఁ బ్రతిమాలు కొనియెను.

అతండు దుఃఖాక్రాంతస్వాంతుడై వాని పరిదేవనంబు వినిపించుకొనఁడయ్యెను. వజ్రకంఠుండు అడలుచు వేగము తలాతలంబున కరిగి అందున్న యోగి పాదంబులంబడి మహాత్మా! మీయక్కటికంబున మనవీరునివలన విజయము గ్రైకొంటిమి. మీశిష్యుండు విభీషణాది దానవులఁ బీచమడఁచెను. అంతలో శత్రుసేనలోనుండి యొకవీరుండు తురగారూఢుండై యరుదెంచి మాబలంబులనెల్లఁ బటాపంచలు గావించెను. వాని నెదుర్కొను డని మే మెంత బ్రతిమాలినను మన హరిదాసు ఆయుధము బూనఁడయ్యెను మాకు వేరొకగతిలేదు. మీరువచ్చి వారికి రణోత్సాహము గలిగింప కున్నఁ బ్రతివీరునిచే మే మందరము మడియఁగలము. వేగవచ్చి రక్షింపుమని వేడుకొనియెను. అతిదయాళుండైన యా యోగి వానిదుఃఖమునకు వగచుచు వానితోఁ గూడఁ బాతాళమున కరుదెంచి హరిదాసుంగాంచి దీవించుచు వత్సా! శత్రువులు విజృంభించుచుండఁ బ్రతివీరుల నాపఁనోపియు నుపేక్షించుచుంటివఁట. ఏమిటికి? అట్లుచేసిన శరణాగతరక్షణమునకు లోపముగాదా?

సత్వరముగ లేచి యాయుధముబూని స్వపక్ష రక్షకముగ బ్రతిపక్షుల శిక్షింపుము. అని యుపదేశించిన విని యావీరుండు అతనికి నమస్కరించుచు యోగీంద్రా! వేరొక కారణంబునఁజేసి సమరవిముఖుండనైతిని. పగరకు వెరచిగాదు. కానిండు ఇప్పుడు తృటిలో శృతువులఁ బరాభవించెదఁ జూఁడుడు. అని పలుకుచు అపుడు తత్తడ నధిష్టించి యాయుధంబులం బూని దానవపన్నగంబులఁ బురిగొల్పుకొని రణరంగంబున కరిగెను. వెండియు రెండుబలంబులకుఁ పోరు ఘోరంబుగా జరిగినది.

అందు మనవీరుండు ప్రతివీరుని దలపడి సింహనాదము జేయుచు విచిత్రగతులఁ దురగమును నడిపించుచు అద్భుత సంగ్రామము గావించెను. ఆవీరకుమారు లిరువురు నొకరినొకరు మించులాగున లంఘించుచు నేయచుఁ బొడుచుచు ద్వంద యుద్ధములం గావించిరి. అపుడు రెండు బలంబులంగల యోధులాయుధములం బారవైచి వారి యాయోథన వైచిత్ర్యంబుఁ జూడఁదొడంగిరి. మూఁడ హోరాత్రంబు లేకరీతి నావీరులు బోరాడిరి. జయాపజయంబు లెవ్వనికిం గలుగలేదు. అపుడు మనవీరుఁడు విసిగి -

చ. కులపతివిక్రమార్క నృపకుంజరుఁడుత్తమ దానధర్మ ని
    ర్మలమతియేని భాస్కరుఁడు మజ్జనకుండు పరోపకార ని
    శ్చల దృఢచిత్తుఁడేని సురసంస్త వనీయ మహాపతివ్రతా
    తిలకమయేని మజ్జనని ద్రెంచురిపున్ నిశిఖంబమోఘమై.

ప్రతివీరుండు.

గీ. యోగివర్యుండు సతతపరోపకార
    తత్పరుఁడయేని నాతలిదండ్రుల సమ
    ధర్మరతులేని నేనని ధర్మబుద్ది
    జేయుదునయేని వీని శాసించు శరము.

అని పలుకుచు వారిరువురు నొకరిపై నొక రాయుధంబుల బ్రయోగించుకొనిరి ఒకని సాధన మొకనికిఁ దగిలినంత నిద్దరును వివశులై నేలంబడి మూర్ఛిల్లిరి. అప్పు డుభయసేనలలో హాహా కారంబులు నింగిముట్టినవి. పిమ్మట మనవీరుని మనవారును బ్రతివీరుని శాత్రువులును నిరపాయస్థలమునకుఁ దీసికొనిపోయి కాపాడుచుండిరి. అప్పుడు మహారాజుగారు హృదయశూలమై ప్రతివీరుని యుద్ధతి యడంగినంత సంతోషముతో శంఖము బూరించుచు సేనల కుత్సాహము గలుగజేసి అవలీల సవక్ర విక్రమంబునఁ పరబలంబులం బారదోలి శత్రుహస్తగతంబైన కౌరవ్యుని కోట వశము చేసికొనిరి. మన వారందరు అందుబ్రవేశించిరి. పిమ్మట మాయొడయండు మీకీ విజయంబెరిగించి మిమ్మునందర నక్కడకుఁ దీసికొనిరమ్మని నన్నంపెను.

అని శార్దూలుండు ఎరింగించుటయు విని చంపక హృదయంబునఁ గంపము జనింప నో శార్దూలా? మన వీరుండు మూర్ఛనుండి లేచునా? వానిమాట యేమనుకొనుచున్నారు? ఎందు బరుండబెట్టిరి, కయ్యంబున అతఁడు గావించిన యుపకారంబు దలంచుచుండిరా? అయ్యో! పాపమతండు అని యున్మత్తవలె వానిగుఱించి అడిగిన మాటయే అడుగుచుండెను. ఆనడుమ తేజోవతి జయసి౦హుని వార్త ఏమైనం దెలిసినదా అని యడిగినది. అప్పుడు శార్దూలుండు అమ్మా! నేను వచ్చునప్పటికి నావీరుండు మూర్ఛనుండిలేవలేదు. వాఁడుజేసిన యుపకారముగురించి పెద్దగాస్తుతియింపుచుండిరి. బ్రతుకునను నాసతో దగిన యుపచారములం జేయుచుండిరి. జయసింహుని యుదంతము నేనెరుంగను. గూఢచారులవలన శత్రువులు గావించు కపటములన్నియు మనవారు తెలిసికొనుచుండిరి. మీరక్కడికి వచ్చిన అంతయుఁ దెలియఁగలదు. రండు రండు అని తొందర పెట్టుచు అందలంబుల నెక్కించి వారి నందరఁ బాతాళలోకమునకుఁ దీసికొనిపోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళ యతిక్రమించుటయు అవ్వలికథ పైమజిలీ యండిట్ల ని చెప్పఁదొడంగెను.

122 వ మజిలీ

మహాయోగికథ

మహారాజా! తమ శాసనముననుసరించి వజ్రదంష్టాది దానవవీరుల బద్దులం జేసి లంకాపురంబునంగల చెరసాల కనిపితిని. ఏలాపుత్రునిఁ బుత్రమిత్ర హిత మంత్రిసహితంబుగా నిందు బందీగృహంబునఁ బెట్టించితిని. రాక్షసులు విమత భుజంగాంగనల జోలికిఁబోకుండఁ గాపాడితిని. తలాతలముగూడ మనకు వశమైనది. కౌరవ్యునికిఁ పాతాళలోకరాజ్యంబునకుఁ బట్టముగట్టవలసి యున్నది. మనకు మహోపకారము గావించిన వీరుండింకను మూర్చనుండి లేవలేదు అతని కులశీల నామాదులు వివరముగాఁ దెలియలేదు. దేవర విమర్శింప వలయునని ప్రహస్తుండు విభీషణునకు నివేదించెను.

ఆ వెంటనే గూఢచారుండొకఁ డరుదెంచి నమస్కరించుచు దేవా! నేను సారణుండ మీయాజ్ఞవడువున నవ్వీరయోగింద్రుల చర్యల దెలిసికొని వచ్చితిని వినుండు. అయ్యోగివరుండు శత్రునగర బాహ్యోద్యానంబున వసించి హరిదాసు పాటునకును వజ్రకంఠాది దానవుల పరాభవమునకు మిక్కిలి వగచుచు శరణాగతులైన పన్నగులును దనుజులుం బరివేష్టింప హరిదాసున్న తావునకుఁబోయి యనల్పతేజంబున నిద్రించు సింగంబుభాతి మెరయునున్న యావీరకుమారుంజూచి విరక్తుండయ్యుఁ బామరుండువోలె దుఃఖించుచు అక్కటా? ఈ మహావీరుఁడెవ్వడో నేనెరుంగను. తలాతలమునకు వచ్చినది మొదలు పరిచయము గలిగినది. నాయందు వీనికి నిర్హేతుకముగా గురుభావము గలిగినది. ఈసంగరము తనకిష్టము లేకున్నను నామాట మన్నించి కావించెను. ఇట్టి పరోపకారపారీణుని నాయాయువిచ్చియైనఁ బ్రతికింపవలయును. లేకున్న నీ హత్య నాకుఁ దగులును అని తలంచుచు

ఉ. ఏను బదారువత్సరములేక గతింబొనరించు సత్తప
    శ్రీనయసిద్దింజెంది విలసిల్లెడి దేనిఁ బరోపకార సం