కాశీమజిలీకథలు/ఏడవ భాగము/113వ మజిలీ

వికీసోర్స్ నుండి

నదియా? అని యడిగిన యోగి అగును. ఆ ముద్దుగుమ్మ నా యొద్దకు వచ్చినది. దాని చిత్తశుద్ది యరసి యది కోరినరీతి నతివేగముగా వశిష్ఠుని యాశ్రమమున కరుగునట్లు చేసితిని. మీ రెవ్వరని యడిగిన విని నే నాతురతజెంది యిట్లంటిని.

మహాత్మా ! నేనామె సఖురాలను. ఆమెతోగూడ నిల్లు వెడలితిని. కష్టముపడితిని. యమునలో విడిపోయితిమి. నన్నుఁ గూడ నందు జేర్పరా? అని మొర పెట్టుకొనిన నతండు చాలు జాలు మా కిదియే పనియా పోపొమ్ము. నీవందఱుగ నర్హురాలవు కావని పలికి యా తపసి స్నానమునకై యరిగెను.

అప్పుడు మేము దారి గాచుకొని యతండు మరల వచ్చుదనుక నందుండి పాదముల కడ్డముపడి నమస్కరింపుచు మునివర్యా ! ఆ చిన్నది యెన్నటికైన నింటికి వచ్చునా ? ఇది యొక్కటియే చెప్పుఁడు. ఇఁక మాదారి మేము పోయెదమని పలికిన నతం డించుక ధ్యానించి యింటికి రాకేమగును. పోపొండు అని పలికి వెండియు వృక్షారోహణము గావించెను. మేము సంతోషము జెందుచుఁ గ్రమ్మరఁ బ్రద్యో తన నగరమునకు వచ్చితిమి. అవ్వార్త మీకుఁ దెలుపుటకు దూతలవెంట వెంటనే యిందు బుచ్చితిని. ఇదియే నావృతాంతమని యాకథయంతయు రోహిణి వారి కెఱింగించెను.

అని యెఱింగించి మణిసిద్దుండు-ఇట్లని చెప్పఁదొడంగెను.

113 వ మజిలీ.

వసిష్ఠుని కథ

అహా ఆమహర్షి ప్రభావ మేమని కొనియాడఁదగినది? కన్నుల మూసికొని తెరచి చూచినంతలో నెంత సంతోషము గలుగఁజేసెను? అయ్యారే? యిది మేరు పార్శ్వ భూభాగమునందలి వసిష్ఠమహర్షి యాశ్రమము గావలయును. ఔరా? బహుయోజనదూరములో నున్న వనిష్ఠాశ్రమము రెప్పపాటులోఁ జేర్చిన యా సిద్ధతాపసుని తపః ప్రభావము అవాజ్మానసగోచరముగదా? తాపసులు లోకోద్దరణమునకై తపంబు గావింపుచుందురు. తపోధనప్రభావంబునంగాక యీ ప్రదేశము మనష్యులకుఁ జేర శక్యమా? ఇది దేవతాభూమివలెఁ గనంబడుచున్నది. బళిరే యిచ్చటి భూమియంతయు రత్నమయమైయున్నది వృక్షములు సువర్ణచ్ఛాయలచే విరాజిల్లుచున్నవి. జాతివైరములు లేక మృగములు దిరుగుచున్నవి. ఇది తప్పక వసిష్ఠాశ్రమమే నా కోరిక ఫలించు సూచనలు గనంబడుచున్నవి. అదిగో మునిబాలుఁ డెవ్వఁడో నాదెసకు వచ్చుచున్న వాఁడు. వానివలన నీదేశవృతాంత మడిగి తెలిసికొనియెదంగాకయని యొకనాఁడు ప్రాతఃకాలమున నొక వనములో నిలువంబడి జితవతి తలంచుచుండెను. అంతలో నామునికుమారుండు పలాశ దండము చేతంబూని యచ్చటికి వచ్చెను. వారికిట్టి సంవాదము జరిగినది.

శిష్యు - అమ్మా ! నీవే మునికన్యకవు? పులితోలు ముడతగా బూని శిరంబున దాల్చితివేల? నీపేరేమి? యెందుండి వచ్చుచుంటివి?

జితవతి - ఋషిపుత్రా ! నేను మునికన్యకనుగాను. రాజపుత్రికను. నాపేరు జితవతియంద్రు ఈపులి బ్రతికియున్నప్పుడు (అని కన్నీరు గార్చుచు) నాకమిత మైన యుపకారము గావించి నానిమిత్తమై సమసినది. దానంజేసి యీకృత్తి నిట్లు భక్తితోఁ బూజించుచుంటిని.

శిష్యుఁడు - తపఃప్రభావంబులు సత్వంబులు మునులకు భృత్య కృత్యంబులు గావించుట యాచారమై యున్నది. నీకు దీనియందిట్టి కృతజ్ఞత గలుగుట స్తుతిపాత్రమై యున్నది గదా !

జిత - బాలకా! నీవెవ్వని కుమారుండవు? ఈతపోవన మెవ్వరిది?

శిష్యు - తల్లీ ! ఈవనము త్రిభువనవిదితుండైన వసిష్ఠమునీంద్రుని తపోవనము నేనాయన శిష్యుండ హోమధేనువుం గాచువాఁడ.

జిత - హోమదేనువన నందినీధేనువేనా?

శిష్యు -- అవును వారికి మఱియొక మొదవులేదు.

జిత - పుత్రా ! ఈనడుమ వసువులు దానిం దీసికొని పోయిరని వింటి. సత్యమేనా?

శిష్యుడు - సత్యమే అందులకు వారికిఁ బ్రాయశ్చిత్తమైనది. కాదా?

జితవతి - ఏమైనదితండ్రీ ? చెప్పుము చెప్పుము.

శిష్యు - వారినెల్ల మనుష్యయోనిం బుట్టునట్లు శపించెను.

జిత - తండ్రీ వారువచ్చి పాదాక్రాంతులైరని వింటిని కనికరించి యమ్ముని వారి శాపవిముక్తులం జేయలేదా?

శిష్యు - తల్లీ ! అప్టమవసువు ప్రభాసునితక్కఁ దక్కిన నేడ్వురను జన్మ మాత్రముననే విముక్తులగునట్లు కనికరించెను.

జిత - ప్రభాసు నేమిజేసెను.

శిష్యు - అతఁడే యీయపరాధమునకెల్ల కారకుఁడు. వినుము వాఁడు పుడమి మనుష్యుఁడై పుట్టి భార్యాపుత్రులులేక దరిద్రుఁడై యాధివ్యాధులు బాధింపఁ బరమ మూర్ఖుఁడై క్రూరకృత్యములు గావింపుచుఁ బెద్దకాలము బ్రతుకఁగలఁడని శపించెను.

జితవతి - హా పరమేశ్వరా! హా పరమేశ్వరా !. యెట్టికర్ణ కఠోర వాక్యము వినంబడినది? యోగసక్తా ! నాకతంబున మీకెట్టియిక్కట్టు వచ్చినది అని పలుకుచు నేలంబడి మూర్ఛిల్లినది.

ఆమునిబాలకుఁడు లేవనెత్తి తల్లీ ! వసువులు నీకు బంధువులాయేమి? వారి కొరకై పరితపించెదవేమిటికి? అని యడిగిన జితవతి కన్నీరు దుడిచికొనుచుఁ దన కథ అంతయుఁజెప్పి బాబూ ! వారి ముప్పునకు మూలము నేనైతిని తండ్రీ యోగసక్త నేమైన శపించెనా? యామె యేమైనది నాయనా ! చెప్పమనుటయు నాబాలుండు సాధ్వీవినుము మాగురుండు బతిని సతీసుతహీనునిగా శపించిన విని యడలుచు యోగసక్త తన్నుఁగూడ మనుష్యయోనిం బుట్టఁజేసి‌ అతనికి భార్యయగునట్లు చేయుమని కోరినది.

ఆయన అందుల కంగీకరింపలేదు అప్పు డప్పడఁతి చురచురం జూచుచుఁ గఠినమతీ! నీసతి నీకెట్లో యాయనకు నేనట్లుగానా? మీ వియోగమునకు మీభార్య పరితపింపదా? మమ్ము విడఁదీయుదువా? అని యేమేమో నోటికి వచ్చినట్లు మునివరుని నిందించినది.

ఆజడదారి పెద్దతటవోపిక జేసియుఁ గోపము నిలుపలేక దుర్మతీ? నీవు స్త్రీవని విడిచినందులకుఁ బిన్న పెద్ద దారతమ్యము విచారింపక ప్రేలుచుంటివి. ఈయపరాధమంతయు నీయం దేయున్నది. నిన్ను విడువరాదు. వినుము నీవు గోమాంసభక్షులైన మ్లేచ్ఛజాతింబుట్టి పెక్కు కష్టము లనుభవింపఁ గలదానవు పోపొమ్ము అని పలికి అమ్మునివరుం డవ్వలికిఁ బోయెను. ఆదంపతులు విచారగ్రస్త చిత్తులై ' యేమాటయుం బలుకక శాపఫలం బనుభవింప నరిగిరి.

పురాకృత మెట్టివారికి ననుభవింపక తీరదుగదాయని చెప్పిన విని యాచిన్నది గుండెపగుల నేడ్చుచు యోగసక్తా ! నాకతంబున కాదా నీవా మునిచేత దుర్మతీయని నిందింపఁబడితివి. ఇప్పుడేమి చేయుదును నీదురవస్థవినియుఁ బ్రతికియుంటిని? నేను కృతజ్ఞురాలనా? కాను కాను వేషమునకే అని పలవరింపుచుండ మునిబాలుండు వెరగు పడుకు‌ తల్లీ ! నీశీలము కొనియాడఁదగియున్నది. ఇప్పుడు మా అయ్యగారు భార్యతో వినోదముగా మాట్లాడుచున్నవారు నీవు వేగము పోయి వారిం బ్రార్థింపుము యేదేని సదుపాయము జేయఁగలరని బోధించి యా శిష్యుఁ డవ్వలికిఁ బోయెను.

జితవతియుఁ దదు పదిష్టమార్గంబునఁబోయి వసిష్ఠాశ్రమాంతరమున--

గీ. మడతగాఁజేసి వ్యాఘ్రచర్మంబు భక్తి
    దైవమునువోలెఁ దనదు మస్తకమునదాల్చి
    తడిఁబడఁగ మెల్ల మెల్లన నడుగులిడుచు
    వచ్చు జితవతిఁగాంచె దాపసవధూటి.

కనుంగొని యాశ్చర్యముతో అరుంధతీమహాదేవి నొసట మడతలుదేర గన్నులెత్తి చూచుచు భర్తతో ప్రాణేశ్వరా! ఈ వచ్చు మచ్చెకంటి యెవ్వతె? యోగినీ వేషము బూనిన శ్రీవిష్ణుని జగన్మోహినీ రూపముగాదుగద? పులితోలు శిరంబున దాల్చినదేమి? ఆహా? జటావల్కలములు ధరించినను అమ్మించుబోణి రూపమా సేచనకంబై యున్నది మునికన్యకల కిట్టి సోయగముండునా? ఈమె యెవ్వతెయో చెప్పుడని యడిగిన విని వసిష్ఠుండు వెరగుపాటుతోఁ జూచుచుండెను.

అంతలో జితవతి వారిదాపునకువచ్చి పులితోలు నేలంబెట్టకయే సాష్టాంగ నమస్కారములు గావించి మహాత్ములారా ! పురాణదంపతులగు మిమ్ముఁ జూచుటచే నేను గృతార్థురాలనైతిని. నాసాపములు పటాపంచలైపోయినవి. మీదర్శనమునకై యెన్నియో వెతలఁబడి యిక్కడికి వచ్చితిని. మిమ్ముజూచితిని నాకోరిక సఫలముగాఁ గలదని పెద్దగాఁ బొగడినది.

అప్పు డరుంధతీ మహాదేవి ఆచ్చిగురుఁబోణిని గ్రుచ్చియెత్తి యాదరించుచు సుందరీ ! నీవెందలిదానవు? నీపేరెయ్యది? మాయొద్దకు రాఁబనియేమి‌? ఈపులితోలు అంత శ్రద్ధగా శిరంబునఁ బూనితివేమిటికి? నీవృత్తాంతమంతయు నెఱింగింపుము. నీయందు మాకు గనికరము గలుగుచున్నదని పలికిన విని యక్కలికి యిట్లనియె.

తల్లీ! నీవు ముల్లోకములలో వాసికెక్కిన పతివ్రతవు నీపేరు దలంచిన స్త్రీలు పూణ్యాత్మురాండ్రగుదురు. నీవు నాకభయహస్త మిచ్చితివి. ఇంక నాకుఁ గొదవలేదు. వినుము నేను శీనరుఁడను నరనాధుని కూఁతురను నాపేరు జితవతియండ్రు. యోగసక్త యను వసుపత్నితో నాకు మైత్రి గలిగినది. అమె నన్ను దివిజకాంతంజేయు తలంపుతో మీధేనువుంగట్టి తీసికొనిరమ్మని పతిని బోధించినదఁట. అక్కారణంబు నంజేసి మీభర్త వారిని శపించెనఁట. అవృత్తాంతము విని నేబరి తపించుచు జటావల్కలములధరించి పురమువిడిచి మీయొద్దకు రా బయలుదేరితిని అని తాను నగరము విడిచినది మొదలు నాఁటి తుదదనుక జరిగినకథయంతయు నివేదించినది.

అయ్యుదంతము విని యాపతివ్రత వెరగుపాటుతోఁ బతిమొగము జూచినది. వసిష్టుండు దివ్యదృష్టినంతయుఁ జూచి యౌను ఈశీలవతి జెప్పినదంతయు సత్యము మఱియు నిందు స్వగుణోత్కర్ష విడిచినదని యెఱింగించెను.

అప్పుడరుంధతి యాసుందరిని గౌఁగలించుకొని ముద్దిడుకొనుచు పుత్రీ! నీ యట్టి కృతజ్ఞురాలి నేపురాణములో వినియుండలేదు. నీ సుగణంబులెన్న ఫణిపతి చాలదు నీశీలము మా కెంతేని మెప్పువచ్చినది మఱియు హోమధేనువను నీమహర్షికిఁ బ్రాణమువంటిది. వసువులు దానిం దీసికొని పోయిరి అలిగి యిమ్ముని వారిని శపిం చెను. ప్రభాసుని దక్క తక్కిన వసువుల జన్మమాత్రముననే ముక్త లగు నట్లనుగ్రహించెను. ప్రభాసుండు పుడమిలో జనింపక తీరదు యోగసక్త మునిపై నలుగుటచే శపురాలైనది. మ్లేచ్ఛజాతియందుఁ బుట్టును. ఇప్పుడు మేమేమి చేయుదుము శాపములు క్రమ్మరింప శక్యముగాదు. నీయభిలాష యేదియో చెప్పుము నీకు సంతోషము గావింప మాకుత్సాహముగా నున్నదని పలికిన విని జతవతి యిట్లనియె.

దేవీ ! యోగసక్త నాకు మనుష్యజన్మ వలనఁ గలిగిన యిక్కట్టు బావఁ బ్రయత్నించి నాకతంబున నావెతలం గుడుచుచుండ నాకు వేరొక పనివలన సంతోష మెట్లు కలుగునో చెప్పుము. నాకుపకారము గావింవఁ బూనినవా రాపద నొందుచుండి నాబ్రతుకేమిటికి, నావైభవము కాల్చనా? తల్లీ! ఆదంపతులశాపము నేననుభవించెద. వారి విముక్తలం గావింప నీపతిం బ్రార్దింపుము. నన్ను మ్లేచ్ఛజాతిగాదు ఛండాల జాతి యందుఁ బుట్టింపుము. పతిపుత్ర శూన్యంజేసి భరింపరాని యిడుములం గుడింపుము. అందులకు వెరవను. నామిత్రులు దుఃఖశూన్యులైనంజాలును. అయ్యో? నా ప్రాణసఖురాలు యోగసక్త మనుష్యులు జరామరణ రోగములవలనంబడు నిడుములు విని మిక్కిలి విచారించినది తానధమజాతియందు జనించి యట్టిబాధలం బొందుదునని వినినప్పుడెంత చింతించెనో తెలియదు. నన్నెంత నిందించెనో? నానేస్తము వలన గలిగిన చిక్కులకు విసుగుకొనక మానునా ? అయ్యో అట్టి యుత్తమురాలిం గష్ట పెట్టితిని నేను జీవచ్చనమునుగానా ? కటకటా ? నాకుపకారము చేయఁబూనినవా రెందఱు చెడిరో చూడుము దివ్యలోకముల భర్త తోగూడ విమానమెక్కి స్వేచ్ఛవిహారములు గావించు యోగసక్త యధోగతిం బొందినది. అంతఃపురముల రాజభోగము లందెడు రోహిణి యేటిపాలైనది. అడవిలో మెకములకెల్ల తాన యొడయఁడై కడుపు నిండ మాంసము గుడుచుచు యధేష్ట విహారముగావించు నీమృగరాజు తిండితినక కుళ్ళిచచ్చినది అమ్మా ! నేను వేషమున కిట్లుంటినిగాని కడుపాపాత్మురాల. నేనుత్తముల శోకాయత్తులం జేయుటకు జనించితిని నేను‌ బుట్టకున్న వీరి కీయిక్కట్టు లేకపోవును గదా ! కావున నాయావుల శాపవిముక్తులం గావిం‌పుము. లేకున్న నిప్పుడే మీపాదమూలమున నాశిరము వ్రయ్యఁజేసి యాదుఃఖము మరచెదనని గోలుగోలున నేడ్చుచుఁ బులితోలు నేలం బెట్టకయే యాదంపతులమ్రోల జాగిలంబడినది.

అప్పుడరుంధతి పతితో మహాత్మా ! ఈసుగుణమణి దుఃఖించిన మనము నాశనము నొందుదుము యిట్టికృతజ్ఞురాలు భూతభవిష్యద్వర్త మాన కాలములయందు మఱి యొకతె లేదని నాయభిప్రాయము. ఈమె నెట్లైన సంతోష పెట్టక తీరదు మన తపంబంతయు ధారపోసియైన‌ నుపకారము చేయవలయునని ప్రార్దించిన విని యమ్మహర్షి తదీయ సుగుణవిశేషంబుల కంతకుముందు మెచ్చియున్నవాడు కావున మందహాసము గావింపుచు జితవతి శిరంబునఁ గరంబిడి లేవదీసి యూరడింపుచు నిట్లనియె.

పుత్రీ ! నీచారిత్రము కడు పవిత్రమైనది నీశీలము స్తుతిపాత్రమైనది. నీయభీష్ట మొకరీతి దీర్పఁగలను. వినుము వారికి మనుష్యజన్మము తప్పదు. అందు సర్వోత్కృష్టత గలుగు నట్లనుగ్రహించెద వినుము ప్రభాసుండు పుడమి దేవతాగర్భంబున నుత్తమక్షత్రియునివలన జనించును. అస్తశస్త్రములందుఁ దేజోబలపరాక్రమములయందు మూడులోకములలో నీడులేనివాఁడని వాడుక వడయును. విద్యలచే బృహస్పతిని మించగలఁడు మహర్షు లతనియొద్ద జ్ఞానము నేర్చుకొందురు అతనకిఁ దెలియనిధర్మంబు లుండవు. జితేంద్రియులలో మొదటి వాఁడగును. పరమభక్తా గేసరుడు, స్వచ్చందమ రణుఁడునై పెద్దకాలము పుడమి నలంకరించును. భార్యాపుత్ర శూన్యుండయ్యును బెక్కు బలగము గలవాఁడగును. వేయేల? అతనికి వసువుగా నున్నప్పటికంటె మనుష్యుఁడుగా నున్నప్పుడే యెక్కువఖ్యాతి రాగలదు వసువు లప్పుడప్పుడుపోయి యతనితో సంభాషించి వచ్చుచుందురు. నీనిమిత్తమై యిన్నివరంబు లతని కొసంగితిని. సంతసించితివా? అని పలికిన విని నమస్కరించుచు జితవతి యిట్లనియె.

తండ్రీ ! ప్రభాసు ననుగ్రహించితివి. యోగసక్తను గూడ నుత్తమజన్మగాఁ జేయవాయని వేడిన నతం డించుక యాలోచించి కానిమ్ము నీవుజెలఁగినఁజాలు నీసఖురాలు యవనపుత్రికయను వాడుక బడయుంగాని బ్రాహ్మణునికే జనించును విద్యలలో సరస్వతిని, రూపంబున రతిని, భాగ్యంబున లక్ష్మిని, ప్రభావంబున గౌరిని మించి కారణాంతరమున రెండవజన్మమెత్తి పండితరాయలను బిరుదము వహించిన ప్రభాసునే పెండ్లి యాడును. కోపంబు గలిమిచేఁ గొన్ని యిడుములం బడునుగాని యవి దీర్ఘములుగావు. చివరకు భార్యాభర్త లిరువురు గంగా గర్భంబునఁ బ్రవేశించి పూర్వరూపంబులం దాల్తురు వారికీవరంబులు చాలునా? జితవతీ ! అని అడిగిన నప్పడఁతి చేతులు జోడించుచు నిట్లనియె.

తండ్రీ ! ప్రభాసుండు పుడమిఁ బెద్దకాలము భార్యలేక సంచరించుంగదా? ఆతండు రెండవ జన్మమెత్తుదనుక యోగసక్త‌ యేమి చేయుచుండును. అనతీయుఁడని యడిగిన నవ్వుచు నతండిట్లనయె.

తనపతి రెండవజన్మమెత్తుగనుక యోగసక్త తనపేరు సార్థకము నొంద యోగనక్తయై తపంబు గావించు నట్లనుగ్రహించితి‌ నిఁక జాలునా యని పలికిన విని జితవతి ప్రహర్షసాగరంబున మునుంగుచు దండ్రీ! ఇంకొక్కటి మిమ్ము వేడఁదలంచితి నాగ్రహింపవలదు నా నిమిత్తమై మరణమునొందిన యీ పులి కుత్తమలోకము గల్గునట్లు వరమీయబ్రార్థింతు. ఇదియే నా కడపటికోరికయని నుడివిన నతండిట్లనియె. పుత్రీ! నీ యట్టి పుణ్యాత్మురాలి కుపకారము గావించిన పులియూరకపోవునా? విను మది చక్రవర్తియై యుదయించును. క్రౌర్యస్వభావంబునంజేసి యవనుండగును. అతనికి యోగసక్త కూఁతురనువాడుక బడయునని యానతిచ్చెను..

పిమ్మట నా కొమ్మ రోహిణి సమసినదికా నిశ్చయించి దాని గురించియడుగఁ బోయి మోమాటపడి యూరకున్న గ్రహించి వశిష్టుఁడు బాలా ! నీ సఖురాలు రోహిణి యింటికిం బోయినది. సుఖంబున్నది. క్రమ్మర నీతో గలసికొనఁగలదని పలికెను.

అప్పుడు జితవతి మహాత్మా ! నీ దయవలన నా మిత్రులెల్లరు గృతార్దులైరి. మఱియొక విషయమడుగ మరచితిని. ఇప్పుడు రోహిణి బ్రతికి యింటికిం బోయినదని చెప్పితిరి. దాని నెక్కించుకొని యమునలో నీదికొనిపోయిన పులిమాట యడుగుట మరచితిని. అదియు నా కుపకారము చేసినదే దానికుత్తమగతు లడుగ మరచిన నేను గృతఘ్నురాలను కానా? నా వలన దానికేమి ప్రతిఫలము గలిగినది. స్త్రీ చాపల్యంబున నిట్ల డుగుచున్నదని తలంపక అదియును ముక్తినొందునట్ల ను గ్రహింపుము. ఇఁక మిమ్మేమియు నడుగనన నతండు చిరునగవు మొగమునకు భూషణముగాఁగ నిట్లనియె.

పుత్రీ ! నీవెన్ని వరము లడిగినను నాకు మురిపెమే కలుగుచున్నది. నీవు స్వార్థపరురాలవు కావు. నీ కృతజ్ఞత త్రిభువన విఖ్యాతమై యుండఁగలదు. రెండవ పులియు ఢిల్లీశ్వరునికి మంత్రియై యుదయింపఁగలదు. ఇప్పుడు నీవు పూర్ణముగా సంతసించితివా! అభీష్టము లన్నియుం దీరినవియా! ఇఁక నీవింటికి బొమ్ము సుఖింపుము. అని వక్కాణించిన విని యమ్మించుఁబోణి చేతులు ముకుళించి స్వామీ ! మీ యనుగ్రహంబున నేను మనుష్యాంగనలలో నుత్తమురాలనైతిని. ఇఁక నాకే కామితమును లేదు. మీ పుత్రికనై యిందు మీ పాదసేవ జేసికొనుచుఁ గాలము పుచ్చెద. మఱియు నే పుణ్యాత్మురాలి‌ మూలమున నాకు మీ దర్శనలాభము గలిగినదో యా యోగసక్త యొకసారి నా కన్నులం బడునట్లు చేయుఁడు. ఇక నాకు స్వర్గలోక సౌఖ్యమిచ్చనను నవసరము లేదని కోరుకొనియెను.

అమ్మహర్షి పుంగవుం డా మాటవిని యరుంధతి మొగము జూచెను. ఆ పతివ్రత జితవతిని బుజ్జగింపుచు బుత్రీ! నీ శీలమహిమచేఁ బుణ్యలోకంబు లన్నియు గుత్తగొంటివి. మఱియు సుఖోచితమైన ప్రాయంబునఁ బడరాని యిడుములం గుడిచితివి. నీ సౌందర్యమునకుఁ దగినట్టి వరుం బరిగ్రహించి గార్హస్థధర్మంబుల నడిపి పిమ్మట ముక్తవయ్యెదవుగాక ఇప్పుడింటికి బొమ్ము. తృటిలో నంపించెదమని పలికిన నా కలికి యందులకు సమ్మతించినది కాదు. అక్కడ నుండియే ముక్తనయ్యెదనని దీనయై మిక్కిలి ప్రార్దించినది.

అరుంధతి యాబోఁటి మాటలన్నియుఁ. బూర్వపక్షములు జేసి చేయఁదగిన కృత్యంబు లుపదేశించుచుఁ గన్నుల మూసికొనుమని చెప్పినది. యోగసక్తం జూపింతుననుటచే జితవతి తన కరతలంబుల గన్నుల నాచి మూసికొనినది.

అని యెఱింగించి - ఇట్లని చెప్పదొడంగెను.

114 వ మజిలీ కథ

ఔరా ! కన్నులుమూసి తెరచినంతలో నత్తపోవన మంతర్థానమైనదే. ఈ భవన మెవ్వరిది? నవరత్న ప్రభాధగద్ధగితములై కుడ్యాంతరంబులు కన్నులకు మిరుమిట్లు కొల్పు చున్నవి. ఇది మదీయ సదనము కాదు. ఇదియొక దేవలోక విశేషమని తోచుచున్నది. అగునగు మఱచితిని. నా సఖురాలిం జూపి౦పుమని యామునిపత్నిం గోరితినికానా? ఇది యోగసక్త మందిరము కావచ్చును. సందడియేమియుం దోచ దేమొకో? లోపలికిఁబోయి చూచెదంగాక యని తలంచి జితవతి మెల్లన తలుపులు తెరచికొని లోపల అడుగుపెట్టినది.

గదిలో మంచముపైఁ బండుకొని ధ్యానించుచున్న యోగసక్త “ఎవరువారు” అని కేక పెట్టినది. ఆ ధ్వనివిని యోగసక్త యని నిశ్చయించి జితవతి యామె దాపునకుఁబోయి నమస్కరించినది.

యోగసక్త లేచి యెదురువచ్చి యామె నెగా దిగఁజూచి అమ్మా ! నీవెవ్వతెవు ? ఇందేమిటికి వచ్చితివి? ఈ ప్రాయంబున యోగినివై జటావల్కలములు ధరించితి వేల? నీయుదంత మెరింగింతువే అని యడిగిన సఖీ ! నన్ను మరచితివా? నీకష్టముల కెల్లఁ గారకురాల జితవతిని తల్లీ! కశలినివై యుంటివా అని పలికినంత నాశ్చర్య ముఖముతో నామెం గౌఁగలించుకొని ప్రాణసఖీ! ఇట్టి వేషము ధరించితివేల? నీవిక్కడకెట్లు వచ్చితివి? మా దేవత్వము భ్రష్టమైనది వింటివా? నీకును వార్త నంపియే యుంటినని అశ్రుబిందువులుజింద విదారించుచుఁబలికినది.

జితవతి యామె నోదార్చుచు అమ్మా ! నీ దుఃఖమును సమూలముగా నిర్మూలింపఁజాలనుగాని కొంతకొంత కొరఁత వడునట్లు చేసితిని. వినుమని తాను రోహిణితో నగరము విడిచి యోగిని వేషము వైచినది మొదలు అంతదనుక జరిగిన వృత్తాంత మంతయు నెరింగించినది.

యోగసక్త యురముపై జేయివైచుకొని అమ్మనేజెల్లా ! ఎంత సాహసము జేసి