కాశీమజిలీకథలు/ఏడవ భాగము/101వ మజిలీ

వికీసోర్స్ నుండి

చెద. నూరడిల్లుము ఇది మొదలు నీవు నాకుఁ బ్రాణసఖురాల వైతివి. దూరమందున్నను దాపున నున్నట్లే నీక్షేమ మరయుచుండెదను. నాయాజ్ఞలేక నీవు వరుని వరింప వద్దు. అని యుపన్యసించినవిని సంతసించుచు జితవతి యిట్లనియె.

దేవీ ! నీవచనంబులన్నియు వరంబులుగాఁ దలంచుచుంటి. ఇఁక నాకేకొదవయునులేదు. నీవు మఱలవచ్చి యనుజ్ఞనిచ్చు దనుకఁ బెండ్లి యాడను. నీవాలసించివేని జరారోగములచే నేనునుం బీడింపఁబడుదుం జుమీయని సాభిప్రాయముగాఁ బలికిన విని యయ్యోగస క్త నవ్వుచుఁ దత్సమయోచితముగా ముచ్చటించి దీవించి తన మండనంబు గైకొని తదనుజ్ఞంబడసి యంతరిక్షగమనంబునఁ బతియొద్ద కఱిగినది.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలివృత్తాంతంబు దతనంతరా వనదంబున నిట్లని చెప్పందొడగెను.

101 వ మజలీ

వసువుల కథ

1. ధరుఁడు — తమ్ములారా ! నిన్నటి సభలో మహాభిషుని సంతోషమునకై మహేంద్రుం డెన్ని యుత్సవములఁ గావించినను నతని మనసు వికసించినట్లు కానిపించలేదు. విచారగ్రస్తమై యున్నదిసుఁడీ !

2. ధ్రువుఁడు — స్వకృత సుకృత విశేషంబున నత్యంత దుర్లభంబైన యమరలోక నివాససౌఖ్య మనుభవించుచు స్వల్పాపరాధమూలంబున ననల్ప దుఃఖభూయిష్టంబగు మనుష్యలోకంబున జనింపబోవు చున్నవాఁడు. అమ్మహారాజునకు దుఃఖముగాక సంతోషమెట్లు గల్గెడిని.

3. సోముఁడు — దేవమహర్షి సేవితంబగు బ్రహ్మ సభలో నాఁడుదాని వలువ తొలంగిన సాభిలాషుఁడై చూచె నిది స్వల్పాపరాధ మెట్లగును ?

4. అహ్నుఁడు - స్వల్పాప రాధము కాదు. జలజోదరుఁడు దయా హృదయుండగుట నామాతృపు శాపముతో విడిచిపెట్టెను.

5. అనలుఁడు — అంబుజ గర్భుండు గంగాదేవి కెమైన శాపమిచ్చెనా ?

6. అనిలుఁడు — అం దామె తప్పేమి యున్నది?

7. ప్రత్యూషుఁడు - తప్పున్నదని యెంచియే విరించి యామెం గూడ మనుష్యజన్మ మెత్తుమని శపించెను.

8. ప్రభాసుఁడు — అక్కటా ! మనుష్య లోకమం దాధి వ్యాధులు బాధింప నెట్టివారికిని సుఖలేశమైన లేదని యచ్చటి చరిత్ర మంతయు యోగసక్తవలన వింటిని. పాపము, పరమేష్టివారికి కఠిన శిక్షయే విధించెను. ప్రత్యూ — మహాభిషుండు పుడమి నెవ్వఁడై పుట్టునో ? వెండియు నాకంబుకు వచ్చునా?

ధరుఁడు — అతఁడు ప్రతీపుఁడను మహారాజునకు నందనుండై శంతనుండను పేరుతో బుడమిఁ బెద్దకాలము పాలించి వెండియు స్వర్గమునకు రాఁగలడని నారదుని వలనఁ దెలిసినది.

అహ్నుఁడు — పోనిండు. వారికదియు నొక వినోదముగా నుండును. కొంత కాలములో కాంతర విశేషములందెలిసికొని రాఁగలరు.

అనిలుఁడు — ఆహా! మన విమానము లెంతలో నెంతదూరము వచ్చినవో చూచితిరా! మనయెదురఁ గన్నులను మిరుమిట్లు గొల్పుచున్న పర్వతంబు మేరువుసుఁడీ?

సీ. పవలు రేల్గాఁగనే యవిరాజు నవిరాజు
            లలయక పలఁగొందు రనుదినంబు
    గరిమ దీపించునే గిరికోటి శతకోటి
            గిరికోటి గఱులఁ జెక్కినవిభుండు
    సాధింపనే మహాచలముతోఁ జలముతోఁ
            గలహించి వింధ్యాద్రి ఘనతఁబాసె
    హరియించెఁ ద్రిపురకర్బురగోత్రమే గోత్ర
           మునుఁ జాపముగఁజేసి మును శివుండు

గీ. దేవతాద్వంద్వసంచార దీప్తభూరి
    కందర భ్రాజితంబేనగ ప్రధాన
    మట్టి మేరుగిరీంద్ర మీయదితనర్చు
    సకలవిష్టవధూర్వహ స్థంభమగుచు.

ద్రువుఁడు - మన మనోరధముల ననుసరింపకయే యీ రధములు మేరు పార్శ్వమున కరుదెంచినవేమి?

ధరుఁడు — నేనట్లు తలంచితిని. మేరుపాద భూభాగము లతి మనోహరములని విందుము, చూడంబోవలదే ?

సోముఁడు — ఇది యేలోకము?

ధరుఁడు - భూలోకమనియే చెప్పవలయును.

ప్రభాసుఁడు — ఆహా! సౌరభేయి భూలోక విహారము సేయుచున్న దాయేమి. ఆ తోట మధ్యంబున అటుచూడుఁడు.

ఉ. ముద్దులుమూటగట్టు పెనుమూపు సమానములైన శృంగముల్
     దిద్దినయట్టులొ ప్పెఁ ప్రథదేరెడు కన్గవ చారువాలమున్
     బెద్ద నిగారపుంబొదుగు పేరురము న్మెఱపైన పాదముల్
     తద్దయుఁగ్రాలఁగా నిడి శతక్రతుధేనువుగాఁ గనంబడున్.

అనలుఁడు — అవ్వన మొకానొక మహర్షి యాశ్రమం బని తోచుచున్నది. అందు సంచరించు నామొదవు హోమధేనువుగావచ్చును. చూడుఁడు.

శా. గోవుల్ గంఠములెత్తి హాయిఁగొన నాకున్ గంగడోలు ల్బులున్
    గ్రీవాభంగముగాఁగ సింగములు లంఘించు న్గరుల్వెంటరా
    ద్రోవల్జూపుచు నాడు ఛాగములతోఁ తోడేలు సారంగముల్
    బ్రోవుల్‌గా నదె యాటలాడుశరబంబుల్ మ్రోలనీక్షింపఁగా.

ప్రత్యూ - అవును. తపోధన ప్రభావంబునం గాని జాతివైరంబుల విడచి మృగంబు లిట్లు మైత్రిమై సంచరించునా? ఇది యేమహర్షి యాశ్రమమో?

ప్రభా — ఏదియైన మనకేమి. స్వాదుమూలఫలోదకం బగు నివ్వనమందుఁ గొంతసేపు విహరించి పోవుదము రండు.

ధ్రువు - మేరుగిరి పరిసరమునుండి ప్రవహించు సెల యేరుల కాలువలు కసక సైకత మిళితములై తరుమూలములనుండి ప్రవహింప నెంతేని దర్శనీయంబై యొప్పుచున్న నీయుపవన విశేషంబులు తప్పక జూడఁదగినవే.

ధరుఁడు — తమ్ములారా! యిది మహర్షి యాశ్రమంబని తెలిసికొనియు నిందు విహరింపఁ బ్రయత్నించు చున్నారేమి? తాపసుల కోపమునకుఁ బ్రతిహతము గలదా?

ప్రభా - సర్వభోగత్యాగం బొనరించిన యోగులిట్టి వినోద స్థానముల వసించుట డాంబికముగాక వైరాగ్య ప్రవృత్తియే? మన విహారములు వారికిఁ బ్రసాదకారణములు గాక యహంకార హేతువులగునా?

ప్రత్యూ — అనిమిషకృపాకాంక్షులైన పారికాంక్షులు మనల నాశ్రయింతురు గాని యాగ్రహింపరు. ఇందు విహరింతము రండు.

ధరుఁడు — పుష్పాసచయాది క్రీడలు గావింపక యూరక యాతోట చూచి రావలయు నట్లైనఁ బదుఁడు.

అని యొండొరు లాలోచించుకొని యవ్వసువులు విమానము లాకసమున నిలిపి భార్యలతోఁకూడ అయ్యాశ్రమమునఁ బ్రవేశించిరి.

సీ. వంచి కొమ్మలకు నెక్కించి కొమ్మలనుంచి
           మంచిపండులను గోయించి మేటి

    తీవలదిగలాగి పూవుఁగుత్తుల మూఁగి
           మ్రోగు తేటులు రేఁగఁ బూలురాల్చి
    బోదెలగ్రొచ్చి యంబువులుజారఁ బారి
           కేరుచు శంబర క్రీడలాడి
    పొదలమాటున దాగి పొలతు ల్బెదరంగ
           వింతజంతువుల రొద ల్వెలయఁజేసి

గీ. వస్తువు లసమానకేళి విలసితులగుచు
   సతు లతులిత ప్రహర్ష రసప్రవాహ
   మున మునుంగఁగఁ గ్రీడించి రసయమందు
   వలదు వలదని ధరుఁడు బేరుఁడు బేరలుకఁబలుక.

వసువు లట్లు క్రీడాపరతంత్రులై యత్తపోవనంబుద్యానవనంబుగా నెంచుకొని సరసులఁ గలచియు విరిగొమ్మలవిఱచియు తీగెల లాగియుఁ బండ్లు రాల్చియుఁ బలు తెఱంగు లగు క్రీడావినోదంబులఁ బెద్దతడ వందు విహరించి యణుఁగఁబోవు సమయంబున నాప్రాంతమందు

సీ. వాలవిక్షేపోద్భవ ప్రభాంజన వేగ
            మున బ్రాంతపాదపంబులు జలింప
    పృధుఖురకోటి విన్యాసమున థరా
            ధరవహుం దహిరాజు శిరము పంప
    వప్రకేళ్యగ్ర శృంగవ్ర దారితములై
            గురు శిలాప్రకరముల్ ధరణి జెదర
    వత్సమున్‌జీరు సంభారవంబున మేరు
            ధర గుహావళిఁ ప్రతిధ్వనులు వొడమ

గీ. నేలవ్రేలాడు పెనుగంగడోలు గలిగి
    దుగ్దపూరితపావనో ధోభరమున
    దిరుగుచుండెడి నందినీధేనువందు
    వసువులకు నేత్రపర్వమై యొసఁగెనపుడు.

ఔరా ! దీనిం గామధేనువని భ్రమపడితిమి? కాదుకాదు దీని యాకృతింజూడ భయప్రహర్షంబులు గలుగుచున్నవి. ఇది యెవ్వరియావో యని వితర్కింపుచున్న తమ్ములం జూచి నవ్వుచు ధరుండిట్లనియె.

ఉ. మానిత రూపలక్షణ సమచిత మీమొదవెన్ననందినీ
    ధేనువు దీనిదుగ్ధముల దృష్టవశంబునఁ గ్రోలిరేని బ్ర

    జ్ఞానిధులై జరామరణజవ్యడలాధులు క్షుత్పిపాసలున్
    బూనక దేవభావమునుబొంది సుఖింతురనేక ఘన్రముల్.

తమ్ములారా ! ఇది యరుంధతీ మనోహరుండైన వసిష్ఠమునీంద్రుని హోమదేనువు కశ్యపుని వలన సురభియను భార్య యందు జనించినది. దీనిపాలంగ్రోలినవారు క్షుత్పిపాసలు జరావ్యాధులు లేక యనేక వత్సరంబులు జీవింతురు. దీనికతంబున నీయాశ్రమంబు వసిష్ఠ మహర్షి దని దెలిసికొంటిమి అమ్మహాత్ముం డలిగిన మూడులోకములు దృటిలో భస్మీభూతములై పోఁగలవు. మనమిఁక నిందు మసలరాదు. పోవుదము రండని పలికిన విని వారెల్ల బ్రయాణోన్ముఖులైరి.

అట్టితరి యోగనక్త యప్పలుకులాలించి ప్రభాసుని పాదంబులకరగి యిట్లనియె ప్రాణేశ్వరా ! నా ప్రాణసఖి జితవతి యుదంతంబింతకు ముందు మీకెఱిగించితినిగదా !

అన్నరనాధకన్యకకు మానవదుర్ల భమగు దేవభావము గలుగఁజేయుదు నని వరంబిచ్చి వచ్చినమాట మీరును మఱువకుందురు. అయ్యువతీమణి కామితంబీడేర సౌరభట రక్షితంబగు నమృతంబెట్లొ మీచే సంగ్రహింపఁజేసి యవ్వాల్గంటికీయ సంకల్పించుకొని యుంటి. దుర్ఘటకార్యంబు సులభక్రియా సాధ్యంబగుచుండ సుపేక్షింపరాదు గదా ! ఈగోదుగ్ధము లమృతతుల్యంబులని తెలియఁబడినది. ఇప్పుడీ మొదవును మన సదనమునకుఁ దీసుకొనిరావలయును. పాలను బితికి జితవతి కంపెదను. ఇదియే మదీయవాంఛితము ఇక్కామ్యంబుదీర్పక తీరదని మిక్కిలి వినయముతో ధరుఁడు వినమనోహరునిఁ బ్రార్థించినది.

అప్పుడు ప్రభాసుండు అన్నా ! ఈయోగసప్తలుకులు వింటిని గదా. ఇమ్మత్తకాశిని యెన్నడును రిత్తమాట లాడునదికాదు. పరమార్థమెఱింగిన ప్రోఢ పరోపకార తంత్ర. దీనికోరికఁ దీరుపక తప్పదు కావున నీగోవుం బట్టుఁడు తీసికొనిపోవుదమనుఁడు ధరుం డిట్లనియె.

తమ్ముఁడా ! బ్రహ్మర్షివరేణ్యుండైన వసిష్ఠుని హోమధేనునని యెఱింగియు దీనిం బట్టుమనుచుంటివేమి? బ్రాహ్మణవిత్తంబులు హరింపఁ బాతకంబుగాదా? అది యట్టుండ నయ్యతివతి ప్రభావంబు త్రిలోక విదితము, ఇంతదనుకఁ జేసినపనియే తప్పు వనభగంబున కేమి మూడునో యని వెఱక్షుచుంటిని పైపెచ్చు చిచ్చుమూటఁ గట్టుకొనినట్లీ ధేనువుం దీసికొనిపోతిమేని ప్రమాదము రాకమానదు. అమ్ముని వరుచే యాగ్రహంబునకుఁ బాత్రులమైతిమేని రక్షించువా రెవ్వరు? వలదు వలదు పోవుదము రమ్ము అని మందలించిన విని ప్రభాసుండిట్లనియె.

చాలుచాలు పిరికిమాటలు విడువుము వేల్పులఁ బ్రసన్నుల జేసికొనుటకేకాదా? ఋషులు తపంబులం గావింతురు. మనరాక వారికి బ్రమోదకారణంబుగాక కోపహేతువెట్లగును ? మన మీ గోవుం గ్రహించిన వసిష్ఠుండు తన్నుఁ గృతార్థుంగాఁ దలంచుకొనును. లెండు, లెండు, పట్టుఁడు అతండలిగిన నేనడ్డుపడెదను లెండు. ఈయోగసక్తపలుకులు హేతుశూన్యములుగావు. తానిచ్చినవరము నిలుపుకొనుటకై కోరినదిగాని యాత్మార్దముగాదు. పిన్నతమ్మునిమాటఁ బాటించి యిక్కార్యంబు సాధింపవలయునని మిక్కిలి దైన్యముతో బ్రతిమాలుకొనియెను.

వానియందుఁగల మక్కు-వచే ధరుండేమియుఁ బలుక కూరకుండెను. అట్టితరి వసువులెల్లరు నలుమూలలు గాచికొని యుండఁ ప్రభాసుండు నందినీధేనువును సమీపించి గంగడోలు దువ్వుచు మచ్చికఁ గలుగఁజేసి శృంగంబులం కుచ్చుబిగించియు నగ్గోవరంబు కదలక యాత్మీయబంధుత్వము దలంచి కాఁబోలు వారికిఁ దృటిలో వశమైనది అట్టిసమయంబున వసిష్ఠ శిష్యుఁఁడొక డడ్డమువచ్చి.

శిష్యుఁడు — అఁ! ఆఁ! మా హోమధేనువును దీసికొనిపోవు చున్నారేమి ? మీ రెవ్వరు? నిలుఁడు. నిలుఁడు. ఇది వసిష్ఠమహర్షికిఁ బ్రాణసమంబని యెఱుంగరా యేమి.

ప్రభా — బాలకా ! నీవు వసిష్ఠుని శిష్యుఁడవాయేమి? దీనిం బనిగలిగియే తీసికొని పోవుచున్నారము. అమ్మహర్షితో వసువులు తీసికొనిపోయిరని చెప్పుము.

శిష్యుఁడు — వసువులన నెవ్వరు? చోరులాయేమి?

ప్రభా - చోరులుగారు దేవసభాసామాజికులు. మెయాచార్యుండు సంతతము మమ్ముఁగూర్చియే జపము చేసికొనుచుండును. మమ్మే యుపాసించును. మేము దీనిం బరిగ్రహించుటచేఁ గృతార్జుండగును.

శిష్యు — మీరు వసువులయినచో వారువచ్చుదనుక నిలిచి పూజింపఁబడి యడిగి యీమొదవుం దీసికొనిపోవుఁడు మాయావుల వలెవచ్చి మాయావుం గొనిపోవుచు మేము వేల్పులమనిన నెన్వరు గౌరవింతురు ?

వసు - బాలకా ! దేవప్రభావము నీవెఱింగిన నిట్లనవు. మనుష్యులకిట్టి పనులు దూష్యము. వేల్పులకులేదు. అదియునుంగాక నీమొదపు గశ్యపుసంతతిలోనిదగుట దీనింగ్రహింప మాకధికారమున్నది.

శిష్యు — శా. దీనిఁజూచి హరింపఁబూనుటనుకాదే కౌశికుండాత్మశౌ
               ర్యానూ నోరు బలంబులున్జెడఁగ నీర్ష్యాలోల చేతస్కుఁడై
               స్థానభ్రంశము రాజ్యనాశనముగా సన్యాసియైపోయె మున్
               మానుండీపని వేల్పులార వలదీమార్గంబు కీడౌఁజుఁడీ.

ప్రభా — శా. ఏమీబాలక ! మామకప్రధిత దివేడ్య ప్రభావంబు వి
               శ్వామిత్ర క్షితినేతృ నీచబలసామ్యప్రక్రియన్ బల్కెదా
               హా! మాప్రజ్ఞ వెఱుంగవీవరయబ్రహ్మర్షుల్ మముంగూర్చికా
               దే ! మోక్షాస్థపంబు సేయుదురుధాత్రిన్ వ్యక్తసర్వార్ధులై.

శిష్యు — గీ. అనిమిషప్రజ్ఞ మేమెఱుంగనిది కాదు
              పుడమి జడదారి కపకారముగఁ జరించి
              కాదె తెరఁగంటి యెకిమీడునికాయమెల్ల
              గన్నులై పోవ శప్తుఁడౌ టెన్నరొక్కొ.

అని పలుకుచుండ నమ్ముని బాలకుని మాటలఁ బాటింపక వసువుల సదృశ వేగంబున నాసౌరభేయిందీసికొని తమ కంబున కేగిరి.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం డిట్లు చెప్పండంగెను.

102 వ మజిలీకథ.

సఖీ ! జితవతీ ! నీపుణ్యము ఫలించినది. అనుకూల వాల్లభ్యంబు సంప్రాప్తించెనని యెల్లరుఁ జెప్పుకొనుచున్నారు. దివ్యరూపసంపన్నుఁడైన వరుండు లభింప నాకిప్పుడు వివాహ మక్కరలేదంటివఁట యేమిటికి? రహస్య మేమైనంగలదా యని యొకనాఁడు రోహిణి జితవతి నడిగిన నప్పఁడఁతి యిట్ల నియె. రోహిణీ ! అల్లనాఁడు మేడ మీఁద మనము సంగీతము బాడుకొనుచున్నప్పుడు యోగసక్తయను దేవకాంతవచ్చి ముచ్చటించినమాట నీవు మఱచితివి కాఁబోలును. ఆవసుపత్ని పెద్దతడవు నాతో నేకాంతముగా మాట్లాడునప్పుడు మనుష్యయోషల యస్థిరయౌవనత్వము దెలిసికొని నాకు దేవత్వము బ్రసాదింతునని వరమిచ్చి తాను వచ్చుదనుకఁ బెండ్లి యాడవలదని చెప్పి పోయినది. ఆ సుందరి నామాట మరువదు. ఎప్పుడోవచ్చి తానిచ్చిన వరము సఫలము జేయక మానదు. నాకట్టి విశ్వాసము గలిగియున్నది. ఆమె యాజ్ఞలేక నేను వివాహ మాడను. మాతల్లి తోఁజెప్పి యిప్పుడా సన్నాహము మానిపింపుము. నామాట పరిహాసముగా నెంచి లక్ష్య పెట్టకున్నదని పలికినది.

అంతలో జితవతితల్లి అక్కడకువచ్చి రోహిణీ ! అమ్మాయితో బెండ్లిమాట జెప్పితివా ! ఏమన్నది వరుని చిత్రఫలముం జూచితివా? ఈతని పేరు ప్రభాకరుఁడఁట. ఈనామ మీతనికి సార్ధకముగా నున్నది. ఇంతకంటె సుందరుఁ డీపుడమలో లేఁడని చెప్పుము. అని పలికిన నారోహిణి అమ్మా! భర్తృదారికతోఁ జెప్పితిని. ఆమె సంకల్పము వేరుగా నున్నది. యోగసక్తకథ మీకునుం జెప్పియున్నదిగదా? ఆమె వచ్చి