కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/కందనూరు నవాబు రాజరికం

వికీసోర్స్ నుండి

11.కందనూరు నవాబు రాజరికం

[ఇది కల్పితకధ కాదు; నిజంగా జరిగినసంగతి. 1836 వ సమత్సరం వరకూ కర్నూలుజిల్లాలో నాలుగు తాలూకాలు కర్నూలు నవాబురాజ్యంలో చేరివుండేవి. శ్తీశైలము, అహోబిలము, నివృత్తిసంగమము మొదలైన పుణ్యక్షేత్రాల కు పోయే యాత్రికుల దగ్గిర ఆ నవాబు గారు 'హాశ్శీలు '(పన్ను) వసూలేసేవాడు. శ్రీశైల దేవస్థానము చాలా దుస్థితిలొ వుండేది. ఇలా వుండగా ఈ నవాబుగారు ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వాన్ని తిరగదోడడానికి కుట్రచేసిన సంగతి బయటపడింది. అంతట కుంఫినీవారు ఆయన రాజ్యాన్ని లాక్కున్నారు. శ్రీశైలాన్ని కొన్నాళ్లు కుంఫిణీవారే పరిపాలించి తరువాత 1840 లో పుష్పగిరి శంకరాచార్యులవారివశంచేశారు.]

కందనూరు, కందవోలు, కదినవోలు అనేవి కర్నూలుకు పాత పేర్లు. కందెనవొలు అనేదే అసలుపేరు. క్రీస్తుశకం 1775 వ సం॥లో అధ్యాత్మరామాయణం వ్రాసిన పెద్దనసోమయాజి కందవోలు అని ప్రయోగించాడు. కొందరు కవులు కందవోలు అనికూడా వాడారు విజయనగరసామ్రాజ్యంనాటి కైపీయతులలో కందవోలు, కందమాలు అనె రెండుపేర్లూ కబపడ్తున్నాయి. అయ్యలరాజు నారాయణకవి తన హంసవింశతిలో ఊళ్లపేర్ల జాబితా నివ్వడంలో 'కందనూరు ' అని ప్రయొగించారు. 1830-31 లో కాశీయత్రచరిత్రను వ్రాసిన ఏనుగుల వీరాస్వామయ్యగారుకూడా కందనూరు అనే ప్రయోగించారు.

ఇప్పటి కర్నూలు జిల్లాలొ రామళ్ళకొట, నందికొట్కూరు, నంధ్యాల, శ్రివెళ్ళ, కంభము, మార్కాపురము, కోయిలకుంట్ల లేకాండ అనే ఎనిమిది తాలూకాలున్నాయి. రామళ్లకోటకు ..... ముఖ్యపట్టణం. శిరివెళ్ళకు ఆళ్లగడ్ద, కంభానికి గిద్దలూరు తాలూకాలకు ఆతాలూకాపేర్లుగల గ్రామాలూ ముఖ్య పట్టణాలు. జిల్లా విస్తీర్ణం 7504 చదరపుమైళ్ళు, జనాభా షుమారు ......... రివిన్యూ ఆదాయం 23 1/2 లక్షల రూపాయలు.

పూ ర్వ చ రి త్ర

కర్నూలు మండలం హంపీ-విజయనగర చక్రవర్తుల క్రిందికి వచ్చినప్పటినుంచీ ఈజిల్లా చరిత్రయొక్క న్నాయి కాని అంతకు పూర్వపు చరిత్రవివరాలు తెలియడం లేదు. అయితే ఈ దేశాన్ని పూర్వము చాళుక్యులూ, చోళులూ, ఓరుగంటి కాకతీయగణపతిరాజులూ ఏలినట్లు నిదర్శనాలున్నాయి. 1565 లో తాళికోట అనే రాక్షసతగ్డి యుద్ధంలో విజయనగర ప్రభువయిన అళియరామరాజు ఓడిపోవడంతో గెల్చినపక్షంలో చేరిన తురకరాజైన గోలకొండ సుల్తాను కుతుబుశాహీ ఈ రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు. తరువాత ఇతర మహమ్మదీయ రాజులుకూడా దేశం కొల్లపెట్టారు.

తాళికోట యుద్ధంయొక్క ఫలితంగా కర్నూలుమండలంలో తూర్పు భాగాలు గోలకొండసుల్తానుగారి వాటాకూ పడమటి భాగాలు బిజాపూరుసుల్తానుగారి వాటాకూ వచ్చినవి. ఆసుల్తానులు తమ తమ వాటాలను స్వాధీనపర్చుకోవడానికి సైన్యాలు పంపి యుద్ధాలు చేయడంతో కొంతకాలం గడచింది. పడమటి భాగాలు సులభంగానే లొంగినట్లు కనబడినా అక్కడ బిజాపూరుసుల్తానుగారి ప్రభుత్వం నిమిత్తమాత్రంగానే వుండేది. తూర్పుభాగంలో కంభం, కొండవీడు మొదలైన ప్రాంతాలపాళెగార్లు గొలకొండసుల్తానుగారికి సులభంగా లొంగక చాలాకాలం యుద్ధంచేశారు. శిరివెళ్ల, చెన్నూరు, నంద్యాల, ముసలిమడుగు మొదలైన ప్రాంతాలు కూడా గోలకోండసుల్తానుకు లోబడినవి.

క్రీస్తుశకం పదహారవశతాబ్ధంలో బిజాపురం సుల్తాను సామంతుడైన అబ్దుల్ వాహబుఖాను కర్నూలుమీదికి దండయాత్ర చేసి అప్పట్లో ఆప్రాంతాలను పరిపాలిస్తూ వుండిన విజయనగర రాజ బంధువున్నూ రామరాయల మనుమడున్నూ అయిన గోపాల ................... కర్నూలులొ తనప్రభుత్వం స్థాపించాడు. ఇతడు ................కొన్ని వ్యాపింపజెయ్యాలనే వుద్దేశ్యంతో అనేక ఆలయాలను పడగొట్టి మశీదులను కట్టించాడు. అతని తరువాత ........................ మహమ్మదు నవాబు అయి1686 వరకూ రాజ్యం .................................కాలంలోనే అనాగా 1677 లో ఛత్రపతి శివాజీ బిజాపూరురాజ్యభాగాలను కొన్నింటిని ఆక్రమించుకుని కొన్నింటిని దోచుకోవడంలో కర్నూలును కూడా దోచినాడు. తరువాత కొద్ది కాలంలోనే మొగలాయి చక్రవర్తియైన షాజహాను సైన్యాలు దక్షిణాపధంమీదికి దండేత్తి వచ్చి బిజాపూరు రాజ్యభాగాలను కొన్నింటిని ఆక్రమించుకున్నవి. క్రమక్రమంగా దక్షిణా పధంలోని రాజ్యాల నన్నింటినీ కూడా జయించి మొగలుసామ్రాజ్యంలో చేర్చినవి.

కం ద నూ రి న వా బు లు

1687 లో మొగలు చక్రవర్తియైన ఔరంగజేబు పాదుషా గోలకొండను, కృష్ణానదికి దక్షిణాన వున్న రాజ్యాలను జయించాడు. అప్పుడు ఆయన సేనాపతులలో ఒకడైన గయాజుద్దీను కర్నూలును పట్టుకున్నాడు. తరువాత ఈ మండలాన్ని మొగలుచక్రవర్తి తన సేనాధిపతియైన దావూదుఖాను బహద్దరుకు జాగీరుగా యిచ్చాడు. అతని తరువాత 1733 లో జాగీరుదారుడైన హిమాయతుఖాను 'నవాబు ' అనిపించుకున్నాడు, ఇతని కాలంలో 1741 లో మరాటీదండు వచ్చి దేశాన్ని కొల్లపెట్టింది. దీనినిగురించిన పాటలు ఇప్పటికీ పాడుతూ వుంటారు.

కర్ణాటకనవాబుల వారసత్వంతగాదాలలో హిమాయతుఖాను ఒకమాటు ఇంగ్లీషువారి పక్షాన్ని యింకొకమాటు ఫ్రెంచివారి పక్షాన్ని చేరినాడు. అప్పట్లో నలబతుజంగున్నూ, ఫ్రెంచిసేనానియైన బుస్సీదొరయున్నూ, కలిసి 1751 మార్చిలో కర్నూలును ముట్టడించారు. హిమాయతుఖాను తమ్ముడైన మునవరుఖాను కర్నూలు నవాబు అయినాడు. అతని కాలములో మైసూరుసుల్తాను హైదరాలీ (1755) కర్నూలుమీదకి దాడివచ్చి రెండులక్షలు కప్పంగా పుచ్చుకున్నాడు. మునవరుఖారు 1792 లో చనిపోగా అతని మూడవకొమారుడైన అలూఫ్ ఖాను నవాబు అయినాడు.

తరువాత 1799 లో హైదరాలీ కొమారుడైన టిప్పుసుల్తాను యుద్ధంలొ ఓడిపొయి చనిపోగా బళ్ళారి కడపజిల్లాలతోపాటు ఈజిల్లా కూడా ఇంగ్లీషువారికి సహాయుడైన హైదరాబాదు నిజాముపాలికివచ్చింది. తరువాత నిజాము ఇంగ్లీషువారికి సైనిక ఖర్చులక్రింద యివ్వవలసివచ్చిన సొమ్ముక్రింద రాయలసీమలోని బళ్లారికడపజిల్లాలనూ, కర్నూలు జిల్లాలోని కంభము, మర్కాపురము, కోయిలకుంట్ల, పత్తికొండ, అనే నాలుగు తాలూకాలనూ, 1800 వ సంవత్సరంలో నిజాము ఇంగ్లీషు వారికి సమర్పించాడు. ఇవే దత్తమండలా లని ప్రఖ్యాతి చెందినాయి కర్నూలుజిల్లాలో చేరిన మిగతా నాలుగు తాలూకాలు అనగా రామళ్ళకోట, నందికొటుకూరు, నంద్యాల, శిరివెళ్ళ, తాలూకాలు కర్నూలు నవాబురాజ్యంలోనే యున్నాయి. ఈ సందర్భంలో కర్నూలు నవాబు సాలుకు ఒకలక్షరూపాయలు కప్పం చెల్లించేపద్ధతిమీద అతని రాజ్యం అతనికే వుండనిచ్చారు.

పైన చెప్పినట్లు నిజాముగారివల్ల ఇంగ్లీషువారికిచ్చిన దత్తమండలాలనె బళ్ళారి కడప కర్నూలు జిల్లాల భాగాలను పరిపాలించడానికి తామస్ మన్రోగారిని నియమించారు. ఆ జిల్లాలలో పాలెగాళ్లు కొందరు దేశంలో అల్లరి సాగించగా క్యాంబెల్ అనే సేనాధిపతి వారిని అణచివేశాడు. అయితే మళ్ళీ కొద్దిరోజులలోనే దివాకరనాయకుడనే యతడు పుల్లల చెరువుగ్రామాన్ని తగలబెట్టి మార్కాపురం కచ్చేరీలో నున్న ఖజానాను దోచుకున్నాడు. అప్పుడు అక్కడ సబు కలెక్టరుగా నున్న గ్రీముదొరగారున్నూ, తాశిల్దారుగానున్న నరహరిరావుగారున్నూ, అతనిని పట్టుకొవడానికి చాలా ప్రయత్నాలు చేశారు గాని లాభంలేకపోయింది.

1800 లో చెన్నపట్నానికి మింటోగారు గవర్నరుగా నుండగా ఇంగ్లీషువారికి మహారాష్ట్రులతో యుద్ధంవచ్చింది. అప్పుడు కర్నూలు నవాబు ఆలూఫ్ ఖాను తన్మతమ్ముడికి కొంత సైన్యమిచ్చి ఇంగ్లీషువారికి సహాయముగా పంపించాడు. ఆలూఫ్ ఖానుగారికి ఆరుగురు కొమాళ్ళు, అందులో కడసారి కొమరుడైన గులాంరసూలుఖానుమీద ఆయనకు చాలాప్రేమ, అందువల్ల తనస్థానే అతణ్ని నవాబుగా అంగీకరించవలసిదని మింటోవారిని ప్రార్ధించి ఆ ప్రకారము ఉత్తర్వులు పొందినాడు. అంతట గులాం రసూలుఖాను కర్నూలు నవాబు అయినాడు. అయితే మళ్ళీ ఏకారణంవల్లనో అతనికి బదులుగా కొంతకాలం మునవరుఖానున్నూ, తరువత ముజఫర్ ఖానున్నూ నవాబులుగ నున్నారు. ఇంతలో ఆలూఫ్ ఖాను 1815 లో చనిపోగా ఇంగ్లీషు ప్రభుత్వంవారు ముజఫర్ ఖానును తొలగించి మళ్ళీ మునవరుఖానునే నవాబుగా చేశారు.

గులాం రసూలుఖాను పరిపాలన

మునవరుఖారు నవాబుగా వుండగా 1816 లో పిండారీ దండు కర్నూలుజిల్లామీదికి వచ్చిపడి ప్రజలను దోచి హింసించింది. మునవరుఖాను తరువాత 1823 లో గులాంరసూలుఖాను కర్నూలు నవాబు అయినాడు. ఇతడు 1839 వ సంవత్సరం వరకూ ఆ రాజ్యాన్ని ఏలినాడు. ఇతని కాలంలో పరిపాలన చాలా నిరంకుశంగా వుండేది. ఈయనరాజ్యంలో వున్న అహోబలం, శ్రీశైలం, మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రవచ్చే హిందువులవల్ల చాలా ఎక్కువ హాశ్శీలు వసూలు చేస్తూవుండేవాడు గాని ఆ దేవస్థానాల పరిపాలన సరిగా జరిగించేవాడు కాదు.

గులాం రసూలుఖానుగారికి పూర్వం కర్నూలును పరిపాలించిన నవాబులలో కొందరు చాలా శాంతముగాను న్యాయముగాను దేశాన్ని పరిపాలించారు. దేశం సుభిక్షంగా నుండేది. వారు మతపక్షపాతం చూపించకపో వడమేగాక హిందువుల దేవాలయాలను కూడా ఇనాములిచ్చి పోషించారు. కర్నూలు నవాబులు నిజాముగారి కివ్వవలసిన పేష్కషు గాకుండా వారు నిజాముగారికీ ఇంగ్లీషు కంపెనీ వారికి చాలా సొమ్మును సైన్యమునుఇచ్చి యుధ్దాలలో సహాయంచేయవలసి వచ్చేది. ఒక వంక హైదరాలీ సైన్యాలూ, ఇంకొకవంక శివాజీ సైన్యాలూ, వచ్చిపడి దేశాన్ని కొల్లగొట్టి నవాబును బాధిస్తూ వున్నందువల్ల నవాబుకు అమితమైన ధనవ్యయం కలిగి చాలా సొమ్ము కావలసి వచ్చేది. అందువల్ల వారు ప్రజలను పీడించి అనేక విధాలుగా సొమ్ము రాబట్టే వారు. పన్నుల వసూలులో క్రమపద్దతిపోయి గ్రామాధికారులే పన్నులు నిర్ణయించి వసూలుచేసే పద్ధతి ప్రారంభమైనది.

గులాం రసూలుఖానుగారి కాలంలో గ్రామాలను గుత్తకిచ్చే ఆచారం వచ్చింది. శిస్తువసూలుకు గ్రామాధికారులే నవాబుగారికి జవాబుదారులై నందువల్ల వారు నిరంకుశులై అక్రమాలు జరిగించడం మొదలుపెట్టారు. పంటలు పండినా పండకపోయినా పన్నులు పూర్తిగ వసూలుచేసేవారు. పంటలు బాగాపండిస్తున్నప్పుడు నవాబుగారి సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా యెత్తుకునిపోయేవి. ఈ బాధలు పడలేక నంద్యాల ప్రాంతపు జనులు రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయము చెయ్యడమే మానుకున్నారు.

నవాబుగారి అధికారుల జులుముకు హద్దుపద్ధులు లేకుండా పోయినవి. నర్నూరు గ్రామంలో నవాబుగారి గుఱ్ఱం చచ్చిపోతే నవాబుగారి ఉద్యోగులు ఆ గ్రామస్థులవల్ల ఐదువేలు రూపాయిలు అపరాధంగా వసూలు చేశారు!

కర్నూలు నవాబైన గులాం రసూలుఖానుకు మొదటినుంచీ కొన్ని కొన్ని పిచ్చికళలు ఉండేవి. అతనికి నిజంగా కొంత చిత్తచాంచల్యము కూడా వుండేదని అనుకునేవారు. అతనికి ఎంత తోస్తే అంతచేసేవాడేగాని ఒకరు చెబితే వినెవాడు కాదు. అతడు తన సైన్యాన్ని సముద్రయాత్రకు పంపించి వారికి జీతబత్తెములకు బదులుగా బట్టలు, గడ్ది, యిచ్చేటట్లు నిశ్చయించాడు. తన పెంపుడు కోడిపుంజుల మెడలో వజ్రాలను కట్టించాడు. ఒకసారి తానే మహమ్మదు ప్రవక్తనని ప్రకటించాడు. ఈ నవాబు కాలంలో తక్కిన వ్యవహరా లెలాగనున్నా పోలీసు రక్షకశాఖమాత్రం చాలా సమర్ధతతో పనిచేసేది. అతడు విధించే క్రూరశిక్షలవల్ల అతనిరాజ్యంలో దొంగతనాలు అణగిపోయినవి. చోరీ జరిగిన గ్రామంలో చోరీ ఆస్తిని పట్టి యివ్వలేక పోతే ఆ గ్రామస్థులే ఆసొమ్ము యిచ్చుకోవాలని శాసించాడు. అందువల్ల దొంగతనాలు చాలా అరుదుగా జరిగేవి. కర్నూలునుంచి హైదరాబాదుకు పంపించే ఖజానాకు సైనిక సిబ్బంది గాని ఇనుపపెట్టెలు బందోబస్తుగాని లేకుండా గంపలలోనే పంపించేవాడు.

ఇంగ్లీషు కుంఫినీవారి రాజ్యాన్ని కూలద్రోయాలని ఇతడు కుట్ర చేస్తూవున్నట్లు అనుమానించి 1839 లో కుంఫినీవారు ఇతని రాజ్యం లాక్కొని ఇతణ్ని తిరుచురాపల్లికి రాజకీయ ఖైదీగా పంపారు. అక్కడ ఇతడు క్రైస్తవమతాభిమానం చూపుతున్నాడని ఒక మహమ్మదీయుడికి కోపం వచ్చి ఇతనిని 1840 లో పొడిచి చంపాడు.

కర్నూలు నవాబు రాజ్యాన్ని లాక్కునేటప్పుడు అతడు అదివరకు తన సరదారులకూ, బంధువులకూ యిచ్చిన జాగీరులు కూడా కుంఫినీవారు తీసుకొని ఆయన కుటుంబం వారికి రెండు లక్షరూపాయలకు పైగా పింఛనులను రద్దుచేశారు.

ఈ రాజ్యాన్ని లాక్కున్న తరువాత దానికి ఒక బ్రిటిషు కమీషనరును ఏజెంటు అనే పేరుతో నియమించి భూమిని రైతువారీ బందోబస్తు చేశారు. 1858 లో తక్కిన నాలుగు తాలూకాలూ కలిపి ఒక కలెక్టరుక్రింద ప్రస్తుతమున్న కర్నూలు జిల్లాను నిర్మించారు. శ్రీశైలాన్ని కొన్నాళ్ళు కుంఫినీవారే పరిపాలించి 1840 లో ఆ దేవస్థానానికి పుష్పగిరి పీఠాధిపతులను ధర్మకర్తలుగా నియమించారు. (Imperial Gazetteer-Provincial Series, Madras Vol.I pp.406-7)

ఏనుగుల వీరాస్వామయ్యగారి వర్ణన

ఏనుగుల వీరాస్వామయ్యగారు 1830-1831 మధ్య కాశీ యాత్ర చెయ్యడంలో ఈ కర్నూలు నవాబురాజ్యంలో చేరిన పుణ్యక్షేత్రాలను దర్శించారు. అక్కడి రాజకీయ సాంఘిక స్థితిగతులను వర్ణించారు. వీరాస్వామయ్యగారు కడపనుండి శ్రీశైలానికి ప్రయాణం చేసే దారిలో దువ్వూరు వరకు కడపజిల్లా చేరిన భూమి అనిన్నీ, తరువాత వంగలి అనేవూరు 'కందనూరి నవాబు' దనిన్నీ వ్రాస్తూ రూపసింగు అనే సర్దారుకు కొలువుకుగాను ఈ గ్రామం వగైరా కొన్ని వూళ్లు జాగీరుగా ఇవ్వబడిన వని ఇలా వ్రాశారు. "ఎగువ అహోబిళములో ఉత్సవకాలమందు 400 వరహాలు హాశ్శీలు వసూలు అవుతున్నవి. వాటినంతా కందనూరి నవాబు పుచ్చుకొని వెనక గుళ్ళసంగతినే విచారింపడు"(కాశీయాత్రచరిత్ర, పుట 10)

వీరాస్వామయ్యగారు అహోబళంనుంచి మహానందికి వెళ్ళారు. తరువాత కందనూరినవాబు రాజ్యంలో చేరిన బండత్కూరు మీదుగా వెలపనూరు చేరారు. ఇక్కడ నవాబుతరపు ఉద్యోగస్థులు కొందరు ఉన్నారు. అటుతరువాత ఆయన ఆత్మకూరు చేరారు. ఇది ఆ నవాబు తాలూకు ఉద్యోగస్థులు వుండే కసుంబాబస్తీ. శ్రీశైలయాత్ర చేయవచ్చిన వారిదగ్గర హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలు ఆత్మకూరులో వున్నారు. నవాబుపరిపాలనను వీరాస్వామయ్యగారు ఇలాగ వర్ణించారు. 'తాలూకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్క మేటీకి ఒక్కొక్క అములుదారుని ఏర్పరిచాడు. ఈ అములు దార్లందిరి పైన అక్బరునవీసు అనే అధికారిని నియమించాడు. నవుకర్లకు జీతానికి జాగీరు లిచ్చాడు. కుంఫినీవారికి సాలుకు లక్షరూపాయిలు కప్పం కడతాడు. అతని రాజ్యము బళ్లారిజిల్లా కలెక్టరు ఆజ్ఞకు లోబడినది. కలెక్టరుతరపున ఒక వకీలు కందనూరులొ కాపుర మున్నాడు. నవాబు కాజీకొర్టు పెట్టి న్యాయవిచారణచేస్తాడు. కుంఫినీకోర్డులకు నిమిత్తంలేదు. నవుకర్లకు జీతాలు స్వల్పము - సరిగా ఇవ్వడం లెదని వాడుక(పుట12)

శ్రీశైలం దేవస్థానము

శ్రీశైలయాత్రకు తీసే హాశ్శీలు కందనూరి నవాబుకు చేరుతున్నదనిన్నీ, ఉత్సవాని కయ్యే ఖర్చుగాక హశ్శీలుకూడా పుచ్చుకుంటారనిన్నీ చెప్పి వాటి వివరాలను వీరాస్యామయ్యగారు ఇలాగు వ్రాశారు.

'సిద్ధాపురంలో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి ఒకటికి 3 డబ్బులు హాశ్శీలు పుచ్చుకొంటున్నారు. పరషవారి (యాత్రికుల)వద్ద నవాబు సరకారు ఆజ్ఞప్రకారం మనిషి 1 కి 3 డబ్బులు హాశ్శీలు పుచ్చుకున్నా కిరాతకుల నాయకుడు ధర్మాత్ముడుగానే వున్నాడు. కందనూరునవాబు వగైరాలు పల్లకీలమీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు.

'శ్రీశైలంగుడి హాశ్శీలుమూలముగా సంవత్స్దరం ఒకటికి 18000 కందనూరునవాబుకు వచ్చినా, గుడి యేగతిని పొందేదిన్నీ విచారింపడు. ఎవరైనా మరమ్మతు చేసినట్లయితే సెలవంత హాశ్శీలు తీసుకొను చున్నాడు. రాజాచందులాలా యీ నిర్భంధంచేత కొంత మరమ్మతుచేసి విడిచినాడు. మైసూరునుంచి వచ్చేవాళ్ళకు హాశ్శీలు లేదు. గుడిలో ఏపక్కచూచినా అడివి పెరిగివున్నది. వ్యాఘ్రభూయిష్ఠము. అడివినికొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్నీ, దేవికిన్నీ ఎవరైనా ఆభరణాలూ, వస్త్రాలు సమర్పిస్తే వాటి మదింపంత రూకలు హాశ్శీలు పుచ్చుకొవడమే గాకుండ కొన్ని దినాలు పోనిచ్చి ఆవస్తువులనే ఆ కందనూరు నవాబు అపహరిస్తున్నాడు ' (పుటలు 15-19)

వీరాస్వామయ్యగారు నివృత్తిసంగమానికి వెళ్ళారు ఇది కొండక్రింద నున్నది. కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. ఆయూరున్నూ కందనూరు నవాబుదే. కృష్ణకు యీవలిపక్క వరకూ కందనూరువారి రాజ్యం, ఆవలిపక్క హైదరాబాదువారి రాజ్యము. అందువల్ల కృష్ణ దాటడానికి మనిషి కింత అని కందనూరివారు ఇవతలిపక్కా, హైదరాబాదువారు అవతలపక్కా హాశ్శీలు పుచ్చుకుంటున్నారు.(ఇంకావివరాలకు వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర చూడండి)

దక్షిణదేశ రాజకీయాలు

మొగలాయిచక్రవర్తుల క్రింద దక్షిణదేశానికి పరిపాలకుడుగా నుండిన హైదరాబాదు సుభాదారుడే ఇంగ్లీషు ప్రభుత్వమువారికి నమ్మిన స్నేహితుడైన ఘనత వహించిన నిజాంప్రభువు అయినాడు. మొగలు సామ్రాజ్యం అస్తమించిన తరువాత ఇంగ్లీషుపరిపాలనలొ దక్షిణ హిందూదేశంలో వున్న మహమ్మదీయ రాజ్యాలపైన నిజాముగారి అధికారం పోయినా చాలాకాలంవరకూ ఆయనకు మంచి పలుకుంబడి వుంటూవుండేది.

1889 మొదలు హైదరాబాదురాజ్యానికి నిజాముప్రభు వైన నాజర్ ఉద్దౌలా అనేఆయన ఇంగ్లీషువారిపట్ల స్నేహభావంతోనే ఫుండేవాడు. ఆయన మంత్రి రాజ్యతంత్రనిపుణుడైన రాజా చందూలాలా అనే బ్రాహ్మణుడు. ఇంగ్లీషుకుంఫినీవారికి మిత్రుడుగా వుండేవాడు. అయితే నిజాంప్రభువుగారి సోదరుడికి మాత్రం ఇంగ్లీషువా రంటే అసహ్యం. ఆయన కుంఫినీవారికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూవున్నట్లు ఇంగ్లీషు వారికి తెలిసినందువల్ల ఆయనను హైదరాబాదులోనుంచి దూరప్రదేశానికి ప్రవాసం పంపించారు.

ఈదేశపు మహమ్మదీయులలో స్వమతాభిమానం చాలా ఎక్కువ. పరమతసహిష్ణుత చాలా తక్కువ. తమకు యిష్టంలేని రాజ్యాంగ వ్యవస్థపట్ల తమవారిలో విరోధభావం వ్యాపింపచెయ్యడానికి అవకాశంకోసం చూస్తూవుండడము మొదటినుంచీ వుంటూనేయున్నది. దేశీయులలో ఒకరితో ఒకరు రహస్యంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి ఈదేశంలోచాలా అవకాశాలు వుంటూవున్నందువల్ల రహస్యాలోచనలకూ, కుట్రలకూ చాలా వీలుగా వుంటూవుండేది. రహస్యపు ఉత్తరప్రత్యుత్తరాలమార్గంగానూ, బజారు పుకారుల మూలంగానూ అనేక వార్తలు ఈదేశంలో ఆనోటా ఆనొటాపడి చాలా త్వరగా వ్యాపిస్తూవుండేవి.

తురకల రక్షరేకులు, తాయత్తులు

ప్రపంచ మంతా మహమ్మదీయులకు తావేదులన్నా, రక్షరేకులన్నా చాలా ప్రీతి. ఈ తాయత్తులలో కాగితాలపైనా, రక్షరేకులపైనా భగవంతుడి పేరో, లేకపోతే ఖురానులోనుంచి ఒక వాక్యమో వ్రాసి వుంటుంది. అయితే అందులోని అక్షరాలూ, మాటలూ, వాక్యాలూ, పైకి కనబడేఅర్ధాన్నేకాక వేరే ఇంకొక అంతరార్ధాన్నికూడా స్ఫురింపచేస్తూ వుండేటట్లు వ్రాయడానికి వీలున్నందువల్ల హిందువులపైననూ,వారిలాగనే కాఫరులైన ఫరంగీలపైననూ ద్వేషాన్ని పురిగొల్పే 'జిహాద్ ' అనే మతయుద్ధాన్ని ప్రకటించడానికి ఉపయోగించేవారు.

'జిహాద్ ' అనే మతయుద్ధం

1838 లో ఇంగ్లీషువారు ఆప్ఘనిస్థానం మీదికి దండయాత్ర చెయ్యడానికి సైన్యాలు పంపినప్పుడు ఇలాంటి అర్ధాలు స్పురించే తాయత్తులూ, రక్షరేకులూ దేశంలో చాలాచోట్ల కనబడ్డాయి. ఆ సమయములో హిందూదేశ మంతటావున్న మహమ్మదీయ ప్రజలలో రహస్యమైన ఉద్రేకం కలిగినట్లు కనబడింది. అయోధ్యరాష్ట్రంలో నుంచి అరబ్బీదూతలు బయలుదేరి దేశంలో నలుమూలలా తిరుగుబాటు చేయడానికి ప్రచారం చేశారు. ఆసమయంలో భగవంతుడి సహాయం ఇంగ్లీషువారికి వుండబట్టిగాని లేకపోతే హిందూ దేశంలో వారి రాజ్యం భగ్నం అయ్యేదే. ఆఖరికి జాతివాళ్ళు చాలామంది ఆహుతి అయ్యెవారే. ఈకుట్రాలోచనలు జరిగినట్లు చాలా దాఖలాలున్నాయి.


ఇలాంటి అరబ్బీదూతలు కొంతమంది చెన్నపట్నందగ్గరనే పట్టుబడ్డారు. ఆసమయంలో వారిదగ్గర దొరికిన రక్షరేకులలో పైకికేవలమూ మహమ్మదీయ మతానికి సంబంధించిన ఖురానులోని సామాన్యపదాలుగా కనబడే మాటలే చిత్రంగా కూర్చబడి, వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాఫరులపైన జిహాద్ అనే మతయుద్దానికి తురకలను పురిగొలిపే అర్ధం స్ఫురిస్తుంది. ఈమాటలను తురకంలోలాగనే కుడినుంచి యెడమకు చదవాలి. ముఖ్యంగా ఈకింది పట్టికలోని గళ్లలో నాలుగైదు పంక్తులను ఇలాగ చదివి చూడండి:-

6 5 4 3 2 1
తొలగించు పీడను మాప్రజలకూ మాకూ కరుణామయుడా ఓ దేవా(1)
నాశనం చెయ్యడు మరెవ్వరినీ గట్టి కోటగోడల మధ్య ఉన్నవారిని తప్ప రక్షిస్తాడు సద్ధర్ములను భగవంతుడు(2)
రక్షించు మమ్ములను నీ సేవకులైన పంపి నీ ప్రవక్తను ఓ భగవంతుడా (3)
వెయ్యి తరిమి దుష్పరిపాలకుల్ని ఈ క్రూర నిరంకుశ ఈ మహానగరాల నుండి ఓ ప్రవక్తా(4)
నాశనం చెయ్యి వారిని ఓ భగవంతుడా యుద్ధం చెయ్యండి నాస్తికులపైన కాఫరుల పైన(5)

కర్నూలు నవాబు కుట్ర

ఆఫ్ఘనిస్థానములో ఇంగ్లీషుసైన్యాలకు జయం కలుగుతుందో అపజయమే కలుగుతుందో అనే సందిగ్ధావస్థలోనున్న సమయంలో అనగా 1839- వ సంవత్సరంలో ఒకబీదతురక స్త్రీ హైదరా బాదు నగరంలో ఒక సత్రంలో కలరాతగిలి చావడానికి సిద్ధంగా వుండి, ఆ సత్రంలోనే బసచేసిన ఒకపెద్దమనిషిని దగ్గిరకి పిలిచి తానొక రహస్యం చెప్పుకోదలచినా ననిన్ని, తన కోరిక చెల్లించవలసిందనిన్నీ బ్రతిమాలింది. పాపం, ముసలమ్మ అవసానసమయంలో అడుగుతూవుందికదా అని అతడు సరేనన్నాడు. అంతట ఆమె తన మెడలోనుంచి ఒక రక్షరేకును తీసి అతనిచేతిలొ పెట్టి తాను చచ్చిపోగానే ఆ రక్షరేకును తీసుకెళ్లి ముశీనదిలో పారవెయ్యవలసిందని ప్రార్ధించింది. పాపం, ఆపెద్దమనిషి మొదట ఆవిడకోరికను చెల్లిద్దామనే అనుకున్నాడుగాని ఈవింతకోరికను గురించీ, ఆవిడ చూపిన ఆదుర్ధాను గురించీ అతనికి మనస్సులొ కొంచెం అనుమానం తగిలి ఇందులో ఏదో విశేషం వున్నదని తలచి ఆరక్షరేకును హైదరాబాదులో అధికారులకిచ్చాడు. దానిని వారు పరిశీలించగా అది నిజాంప్రభువుగారి సోదరుడు కర్నూలు నవాబుగారికి వ్రాసిన రహస్యపు వుత్తరం అని తేలింది.

జనానాలో ఆయుధాగారము

దీనిని గురించి దర్యాప్తులు చేయగా ఇంగ్లీషు వారిపట్ల ఒక పెద్ద కుట్ర జరుగుతూవున్నట్లు బయలుపడింది. ఇంతేకాదు, కర్నూలుకోటలో కొంత ఆయుధసామగ్రిన్నీ, మందుగుండుసామానున్నూ చేర్చివున్నట్లున్నూ తెలిసింది. అంతట వెంటనే ఒక ఇంగ్లీషు సైనికదళాన్ని కర్నూలుకు పంపి కోటను సోదాచేస్తామని నవాబును అడిగారు, సరే చేసుకోండి అని అతడు ధైర్యంగా జవాబుచెప్పి తన సైనికులతోటి, పరివారంతోటి కోటవెలపల మైదానంలోకి వెళ్లాడు. కర్నూలు నవాబుగారి కోటను తనిఖీ చెయ్యడానికి కమిషనర్లు వెళ్లినపుడు గులాం రసూలుఖానుగారు వారిని చాలా మర్యాద చేశారు. దానిని గురించి వారే ఇలాగ వ్రాశారు. కర్నూలు పట్నంనుంచి కోటద్వారముదాకా వీధులకు రెందుప్రక్కాలా సైనికులు బారులు తీర్చి మాకు జొహారుచేసి గౌరవంచూపారు. మేము దివానుఖానాను సమీపించగానే నవాబుగారు కొంచెముదూరము మా కెదురుగా వచ్చి, మాచేతులు పట్టుకుని ఉచితాసనమిచ్చి గౌరవించాడు. అటు తరువాత ఖరితా ఇవ్వగా నవాబు చాలా వినయంతోనూ గౌరవంతోనూ స్వీకరించాడు.'

కోటను సోదాచూడాలని కమిషనర్లు ఆయనతో చెప్పగా ఆయన మారు మాటాడక, కోటను వారికి స్వాధీనంచేసి తాను తన పరివారజనమూ హంద్రినది యుడ్డున నున్న జోహరాపురమునకు పోయి అక్కడ వేచియున్నాడు. ఈ అవమానం సహించలేక అతని మామగారైన నాందిరీఖానుగారు తిరుగుబాటుచేశాడట.

అంతట ఆ కోటను సోద చెయ్యడానికి నియమింపబడిన కమీషనర్లు కోటను, నవాబుగారి అంత:పురాన్ని జాగ్రత్తగా సోదా ఛెశారుగాని ఏమీ దొరకలేదు. కోటలో మందుగుండు సామానుయేమీ కనపడలేదు. నవాబుగారు దోషి యనడానికి తగిన నిదర్శనాలేమీ కనబడలేదు.

నవాబుగారి జనానాను అంటివున్న వుద్యానవనం పెద్దగోడల మధ్య గదులుగదులుగా కేటాయింపు చేయబడి వున్నది. ఏమైనావుంటే అక్కడే రొదుకుతుందని అనుకున్నారుగాని అక్కడకూడాఎంత వెదకినా అనుమానం కలిగేది ఏమీ కనబడలేదు. అయితే ఇదివరకు వచ్చిన ఆచూకీ సులభంగా తీసిపారేయడానికి వీలైనదికాదు. గనక ఈ జనానావుద్యానవనాన్ని మళ్లీ ఇంకొకమాటు ఇంకా జాగ్రత్తగా పరిశోధించడానికి నిశ్చయించారు. ఆ ప్రకారం పలుమూలలా శోధిస్తూ వుంటే అందరికీ ఆశ్చర్యం కలితేటట్టుగా ఈజనానా వుద్యానవనంలో ఒక రహస్యపు ఆయుధాగారం బయటపడింది. ఈ వుద్యానవనంయొక్క ఆవరణపు గోడలన్నీ మధ్య ఖాళీలతో రెండు వరసలుగా కట్టి, పైన సామాన్యమైన కోటగోడలలాగ కనబడుతూ లోపల బోలుగా కట్టినవే. వాటిలోపలి ఖాళీలలోనూ నేలసొరంగాలలోనూ, ఆరు యేడు వందల ఫిరంగులూ, ఫిరంగిబళ్లూ, ఫిరంగిగుళ్లూ, తోటాలూ, తుపాకులూ, మందుగుండుసామానూ, ఫిరంగులు పోతపోయడానికి కావలసిన కొలుములూ భద్రపరచి వున్నాయి. ఇందులో చాలా ఫిరంగులు కొత్తగా తయారు చేసినవి. కొలుములుకూడా అప్పటికి కొద్దికాలంక్రిందటనే వ్యుపయోగించినట్లు కనబడ్డాయి.

కర్నూలునవాబు పదచ్యుతి

ఆప్ఘనిస్థానం యుద్దంలో ఇంగ్లీషువాళ్లు ఓడిపోతారని అనుకుని దేశంలోవున్న మహమ్మదీయు లందరూ ఏకమై తిరుగుబాటు చేయడానికి కుట్రచేసినట్లూ, దానికి కర్నూలు ఒక కేంద్రస్థాన మైనట్లుగా తేలింది. "మన కళ్ల యెదుటనే ఇలాంటి గొప్పకుట్రసాగుతూ వుండడమూ, దానికి సొమ్ము చేకూరడమూ ఎంత ఆశ్చర్ల్యము!"అని దీనినిగురించి ఇంగ్లాండుకు వ్రాసిన ఆయన అన్నాడు.

కర్నూలు నవాబు గులాం రసూలుఖానును పదభ్రష్టుణ్ని చేసి తిరుచినాపల్లికి రాజకీయఖైదుగా పంపారు. అక్కడ అతడు క్రైస్తవ మతంలొ ఆసక్తి చూపుతూ క్రైస్తవదేవాలయానికి వెళ్లగా ఒక తురకఫకీరు ఆయనను 1840 వ సంవత్సరం జూలై 12-వ తేదీన కత్తితో పొడిచి చంపాడు. (South Indian Sketches A short account of some missionary stations of Church Mission Society by S.Tucker, James NIsbel & Co; 1842 pp 17-23)

-------

12. మంగలి కొండోజీ

   క॥ "ఎంగిలిముచ్చుగులాములు
        సంగతిగా గులము చెఱుప జనుదెంచి రయా
        యింగిత మెరిగినఘను డీ
        మంగలికొండోజి మేలు మంత్రులకన్నన్."

అని కంసాలి రుద్రయ్య యని ప్రసిద్ధిజెంచిన కందుకూరి రుద్రకవి చెప్పిన చాటుపద్య మొకటి చిరకాలమునుంచి ప్రచారంలో వున్నది.

ఈ రుద్రకవి విద్యానగరసామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలంనాటివాడనిన్నీ, ఇతడు రాయలవారి దర్శనంకోసం చాలాకాలం వేచియుండి మంత్రులనూ, రాజోద్యోగులనూ ఎన్నాళ్లు