కంకణము/వాయువిజృంభణము

వికీసోర్స్ నుండి

వాయువిజృంభణము

గీ. అనుచుఁ బ్రార్థించుచుండఁగ నంతలోన
   నస్మదీశ్వరార్చనమున కంతరాయ
   ముం ఘటించినాఁ డఖిలభూభువనభవన
   భంజనవిజృంభమాణ ప్రభంజనుండు.

శా. స్తంభీభూత దిగంతపూరిత పయోదవ్రాతసంచాలనా
   రంభోద్వేగసమేత దుర్భరతరా రావావదీర్‌ణైక స
   ర్వాంభోజ ప్రభవాండభాండుఁడయి నాఁ డమ్మాతరిశ్వుండు ప్రా
   రంభించెన్ బహుధాచరాచర సమగ్రధ్వంస సంచారమున్.

ఉ. స్థావరజంగమాత్మకము సర్వజగంబు క్షణంబులో గత
   స్థావరమై నమాకలిత జంగమయ్యెను, జంచలన్మహీ
   జావళియున్ శిర:కరకృతాభినయంబులఁ బాడఁజొచ్చెఁ గ
   ల్ద్రావెనొనా నిరంతరనిరర్థక జల్పనకల్పనాధ్వనిన్.

ఉ. త్రుళ్లియు నిక్కినీల్గియునుదూఁగియు వాగియువిఱ్ఱవీగియున్
   గల్లునుద్రావువాఁడు ధనగర్వితుఁడున్ దుద కొక్క పెట్టునన్
   ద్రెళ్లెద రెట్టు లట్టు చెలరేఁగియు నిట్టటు లూఁగులాడియున్
   బెల్లుధ్వనించిమించియుగుభిల్లున గూలెమహీరుహావళుల్.

మ. వరలున్ నిశ్చలమౌనధర్మము జగత్ప్రాణానుబంధంబులన్
    బరివర్జించిన యంతకాలము; జగత్ప్రాణానుబంధంబులన్
    బరివర్తింపఁగదా ఘటిల్లెను నధ:పాతాతతక్లేశ మీ
    సరణిన్ మాకని చాటె నాఁటిప్రపతత్సర్వావనీజావళుల్.

ఉ. భూతలమందుఁబోలె సురభూములయందును భూతకోటికు
   జ్జాతము గాక తప్ప దవసానదశావసరంబునన్ మహా
   వాతము; నాఁడు బిట్టడలుపాటు ఘటింపఁగఁజేసె నమ్మహా
   వాతవిజృంభణంబు భువి వారికినిన్ దివివారికిం గటా!

శా. ఘోరాకారమరుత్ప్రయుక్త భయసంక్షోభంబునన్ మేము ఘీం
    కారారావములాచరించునెడఁ గ్రేంకారారవంబొప్ప ఁగాం
    తారావాసమయూరవారములొగిన్ నాట్యంబుగావించెనౌ
    రౌరా! యొక్కరిఖేద మింకొకరి కత్యామోదమౌనేకదా?

శా. పైకిన్‌మైత్రినటించి మాపతనమున్‌వాంఛించులోలోన, మ
   మ్మాకాశమ్మునఁ జూచి యేచిపురులల్లాడించుమాత్రంబునన్
   గేకివ్రాతము మాకుఁ గూర్చునని సంకేతించి వాక్రుచ్చు నీ
   లోకం బింతటిగ్రుడ్డిదా యనుచునాలో నేనె చింతించెదన్.

శా. స్ఫారంబై బహుభీతభూతమయి ఝంఝూమారు తోద్ఘుష్టహుం
   కారంబెందు విరామ మొందకయె యోంకారాను కారంబుతో
   నీరేజప్రభవాండభాండమునఁ దానిండంగ, సాక్షాన్మహోం
   కారబ్రహ్మమయంబు లోకమను వాక్యంబప్పు డూహించితిన్.