కంకణము/కంకణము ముక్తయై తరించుట

వికీసోర్స్ నుండి

కంకణము ముక్తయై తరించుట

శా. అయ్యయ్యో! యొడలెల్లజల్లుమనునేలా? యిప్డు నాకేమిరా
   నయ్యెన్? దిమ్మిరివోవునట్లయగు నాయంగంబు; లాత్మన్ భయం
   బయ్యెన్; రాఁగలముప్పు చొ ప్పెఱుఁగ రాదయ్యెన్; భయంబేల? నా
   కియ్యబ్ధిన్ బడుకంటెగొప్పదగుముప్పేమున్న దూహించినన్.

చ. కువలయజీవితాంతకుని క్రూరకరాయతపాశభీతి నా
   కవుననుకొంట కట్టిసమయమ్మునుగా దటువంటిచిహ్న లె
   య్యవియునుదోప; వూరకభయంపడనేమిటి? కింతకున్‌శుభం
   బవునొకొ నన్నుదైవము దయామయదృష్టులఁ జూచె నేమొకో.

చ. కళలు తొలంగి రాహువుముఖంబునఁజిక్కివిముక్తమైన య
   ప్డలఁతి యలంతిగా ధవళమై కనవచ్చు సుధాంశుబింబ మ
   ట్లలఁతియలంతిగా ధవళమై కనవచ్చెడు నాదుమేను ని
   మ్ముల ననుఁగూడ నీశ్వరుడు ముక్త నొవర్చునె యిమ్మ హోదధిన్?

మ. ధవళంబైన కొలందిఁ గంటికిసమస్తంబున్ గడున్ వింతగా
    ధవళంబై కనవచ్చు; జిత్త మిపు డేతత్సాగరంబన్న భీ
    తి వడంబోక, సమత్వముం జెడక, శాంతింబొంది యుప్పొంగు; నిం
    తవిశేషంబగునూతనత్వ మెటు లొందంజాలినానోకదా!

శా. హేయం బంటిని సాగరంబు; నిపుడెం తేనిన్ మన: ప్రీతి సు
    శ్రేయంబున్ శుభదాయకంబుననుచుం జింతింతు; నెం దేనియున్
    శ్రేయో శ్రేయవిచారనిర్ణయము భాషింపంబడున్ దానవ
    స్థాయత్తమ్మగు చిత్తవృత్తి కనుసార్యంబైన భావంబునన్.

శా. కల్లోలంబులు గానరా వెచట, వైకల్యంబులే కార్తిలే
    కుల్లం బూరటగాంచె, సాగరగతోద్యోగంబు లీలావిలా
    సోల్లాసంబుగఁ దోఁచె నార్తజనరక్షోపాయపారీణుఁడౌ
    నాలక్ష్మీశుకృపామహత్వమున ముక్తాకారముందాల్చితిన్.

గీ. ధవళమయి నన్నుఁజుట్టె వింతయగునొక్క
   దివ్యతేజంబు చక్రాకృతిని నదేమొ!
   సాగరవిచారమునఁ గానఁజాలనైతి
   నిమ్మహోత్కృష్టదర్శన మింతవఱకు.

మ. వలయంబై ధవళాంబుజాభమయి దివ్యంబై మహోద్యత్ప్రభా
    నిలయంబైన పవిత్ర తేజ మిది దీనింగంటి, నాపుణ్యముల్
    ఫలియించెన్, సమసెన్ సమస్తభవసంబంధానుబంధంబులున్
    బొలిసెన్ బుద్బుదవర్తనమ్ము, లొలసెన్ ముక్తోన్నత శ్రీలహో

క. ఎన్నఁగ ముక్తాస్ఫోటమ
   హోన్నతపదవిని వహింప నొండొకగతి యుం
   డ న్నేరదు సాగరగతి
   కన్నను నెవ్వారికనుచుఁ గనుఁగొంటి నిటుల్.

క. అని మనమున ననుకొనినం
   తనె తత్తేజంబునుండి "తథ్యము! తథ్య"
   మ్మనుశబ్దారంభముతో
   వినఁబడియెను నాకు నిట్లు విస్ఫుటఫణితిన్.

మ. పరమంబైనరహస్య మియ్యది గ్రహింపంగంటి వీభాగ్యమున్
    దఱు చెవ్వారికినైనలేశమునుబొందన్ రాదుసూ! సాగరాం
    తరకల్లోలములం దనామకగతిన్ నాశంబునుం బొందు నీ
    సరివారిన్ మణిపూసవైతివి భవజ్జన్మంబు సామాన్యమే?

గీ. సాగరంబునఁ జొచ్చి లేశమ్ము నీవు
   జీవనతరంగములయందుఁ జిక్కుకొనవు;
   స్వాతి శుభజన్మనక్షత్ర మీతెఱంగు
   నీకు ముక్తాకృతి ఘటించె నిక్కువంబు.

మ. కలవిందేబహురత్న రాసులు, జగత్కల్యాణుసంచారముల్
    గలవిందే నినుఁబోలువారికిని ముక్తాస్ఫోటభాగ్యోన్నతుల్
    గలవిందే, కలవానితో సుఖపడంగా లేక హేయంబుగాఁ
    దలఁపం గూడదు సాగరమ్మునిదిసిద్ధాంతంబుముమ్మాటికిన్.


________