ఎందరో వికీమీడియన్లు/వాసి రాసి

వికీసోర్స్ నుండి

వాసి >>> రాసి

ఇప్పటివరకు తెవికీ వ్యాసాలకు లబ్ధ ప్రతిష్టులైన వారి నుండి బహిరంగ ప్రశంసలు పొందిన వ్యాసం ఒకటే ఉంది. అది మాలపల్లి నవల గురించి వచ్చిన వ్యాసం. ఆ ప్రశంస ఇచ్చినది వాడ్రేవు చినవీరభద్రుడు గారు. పొందినది వుక్కుం మహేష్‌ కుమార్ గారు. ఆ వ్యాసాన్ని మొదలుపెట్టినది వేరేవారైనప్పటికీ అందులో సింహభాగం రాసినది మహేష్ గారే. అదే కాదు ఆయన రాసిన ఏ వ్యాసమైనా ఉత్తమ స్థాయిలోనే ఉంటుంది.

చిన్న చిన్న దిద్దుబాట్లు చేస్తూ కొద్దికొద్దిగా సమాచారం చేరుస్తూ వ్యాసాన్ని నిర్మిస్తారాయన. బౌద్ధ సంబంధ వ్యాసాలు, ప్రాచీన యాత్రికులు, చారిత్రికులు, జియాలజీ, పుస్తకాలు మొదలైన అంశాలపై వ్యాసాలు రాస్తారు. రాసేది ఏ వ్యాసమైనా చాలా సమగ్రంగా తీర్చిదిద్దడం ఆయన విశిష్టత. మొలకలుగానో, అసమగ్రంగానో రాయడం ఆయన పద్ధతి కాదు.

వ్యాసాలు రాయడంతో సరిపెట్టకుండా, తెవికీలో చర్చా ధోరణులను, పద్ధతులనూ సంస్కరించాలని కూడా సంకల్పించారు. కొంత పని కూడా చేసారు. చర్చల్లో చాలా విపులంగా, విశ్లేషణాత్మకంగా రాస్తారు.