ఉత్తరహరివంశము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

ప్రథమాశ్వాసము

శ్రీసర్వమంగళాకుచ
వాసంతీవకుళగంధవద్వనమాలా
వాసుకివిలాస వేద
వ్యాసమునిమనోనివాస హరిహరనాథా.

1


వ.

దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

2


క.

హరివంశప్రథమకథాం
తరమునఁ గల వింతలెల్లఁ దప్పక మదిలోఁ
దిరమయ్యెఁగదా మీఁదట
నరవర! యే కథలొకో? వినం బ్రియ మనుడున్.

3


క.

జనమేజయుఁ డిట్లను న
మ్మునితో; బలదేవులావు మును విని మఱియుం
దనియదు మది ముద మొదవఁగ
వినఁగోరెడు జెప్పవే వివేకనిధానా!

4


క.

ఘనబలుఁ డుదగ్రతేజుం
డనఘుఁ డనంతుఁ డన విందు మాదిమకథలం
దనుటయు వైశంపాయన
మునిపతి భూపాలచంద్రమున కిట్లనియెన్.

5


శా.

పాతాళాధిపుఁడైన శేషుఁడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతిం బుట్టిన శంకరుం డని జనుల్ పేర్కొన్నచో నంధకో

ద్భూతస్నేహముఁ గామపాలతయుఁ దప్పుం దప్పుఁ గాకేమి ప్ర
ఖ్యాతిం బొందఁడె పాండురాంగమహిమన్ హాలహలస్వీకృతిన్.

6


వ.

మఱియును.

7


సీ.

కడిమి జరాసంధగంధసింధురముఁ ద
                 ద్బంధుమండలి[1]తోన పాఱఁ ద్రోలె
బలియు నాగాయుత[2]బాహు జగత్ప్రాణ
                 తనయు గదాకేలి దర్ప మడఁచె
[3]వీఁకతోడ వరాటవీఖేలనమ్మున
                 ధీరుఁ బ్రలంబదైతేయుఁ జంపెఁ
దెగువ రాసభరూపు ధేనుకాసురుఁ బట్టి
                 విన్నాణమున మేను విఱిచి వైచె


గీ.

నగరపరిఖాపయఃపూరణంబు సేయ
సీరముఖమునఁ గాళిందిఁ [4]జీఱి తెచ్చె
మెఱసి మూఁడులోకంబుల మేటిమగలు
రాయనేర్తురె యా[5]దవరాముతోడ.

8


సీ.

కౌరవాధీశ్వరు కన్యకారత్నంబుఁ
                 గామించి సాంబుండు గజపురంబు
సొచ్చి మ్రుచ్చిమి సేయఁ జూచిన నెఱిఁగి యా
                 రారాజు వానిఁ గారాగృహమున
నిగృహీతునిఁ జేయ నెఱ[6]సిన వార్త వే
                 గమ విని నగరంబు గంగలోనఁ
ద్రవ్వివైచెద నని తన భూరిహలమున
                 నెత్తి [7]యెత్తేఁపె నయ్యేటినీరు


గీ.

పఱపెఁ బట్టణ మిట్టట్టు వడఁ గదల్చి
కొడుకుఁ గోడల రావించి కోటవెలికి

వియ్య మని శిష్యుఁడని కాచి విడిచె నతని
సీరపాణితో రాజులు చెనయువారె.

9


గీ.

అతఁడు నాఁగట నెత్తినయంతనుండి
యేటి ది[8]క్కున కంతయు నెగసియుండు
హస్తినాపురి; యది యేల యమున నాఁటఁ
గోలె మథురాపురము చుట్టికొంచుఁ బాఱు.

10


క.

హలపాణిమహిమ చెప్పం
గలవా రెవ్వరు పురాణకథలన్ మఱియుం
దెలిసికొనుము నేఁ జెప్పక
నిలిచినచోటులు వివేకనిర్మలబుద్ధిన్.

11


క.

అనుటయు నా జనమేజయ
జనపతి యిట్లనియె; రుక్మి సచ్చిన మగుడం
జని యాదవనగరంబున
జనార్దనుం డేమి సేసె సౌజన్యనిధీ?

12


వ.

అనుటయు వైశంపాయను డిట్లనియె.

13


మ.

తనవీటన్ హరియుండ రాక్షసులు రత్నస్వర్ణసందోహమున్
వినతిం గప్పము దేరఁ బుచ్చికొనెఁ దద్విఘ్నంబుఁ గావించినన్
వనదత్తాఖ్యుల దైత్యులం దునుమ నోర్వంజాల కంభోరుహా
సనుచేతన్ నరకుండు లబ్ధవరుఁడై చాలెం గ్రియాహానికిన్.

14


మ.

అతఁ డంతంతకు వాలి వాలుబలిమిన్ హాలాహలాహంక్రియా
ద్భుతభంగిన్ వివిధాస్త్రధారలు సమిద్భూమిన్ వెలార్చుం బ్రభా
పతితీవ్రద్యుతి సోదరరాప్తరథినీపాదాంతకుంతంబులం
బ్రతివీరప్రమదాకపోలఫలకప్రాంతాలకాంతంబులన్.

15


మ.

ధనదాంతఃపురణారహారములు యాదఃపాలబాలాఘన
స్తనకాశ్మీరము ధర్మరాట్కులవధూసంవ్యానకౌశేయమున్

దనుజేంద్రారివరావరోధదయితాధమ్మిల్లమాల్యంబులున్
గినుకం దెచ్చి ఘటింపఁజూచు జయలక్ష్మీనిత్యనైపథ్యమున్.

16


వ.

ఇట్లు వర్తించి వర్తించి దిగ్విజయంబు సేయు తలంపున.

17

నరకాసురుఁడు స్వర్గముమీఁద దండయాత్ర వెడలుట

సీ.

ఒకనాఁడు దనుజనాయకుసేన[9]తో దివ్య
                 ధామంబుపై కటు దాడి వెట్టి
వజ్రిమందిరము కవాటంబుఁ దనవింటి
                 కొప్పునఁ బొడుచుచుఁ గ్రూరసింహ
నాదుఁడై సమరంబు నా కిమ్ము చాలవేన్
                 జయ మిమ్మనుడుఁ బాకశాసనుండు
నైరావతం బెక్కి యమరసైన్యంబుతో
                 నగరంబు వెలి కేఁగి మగతనంబు


తే.

మిగులఁ దద్దైత్యవాహినిమీఁద నడచె
నప్పు డుభయబలంబులు నసికుఠార
కుంతతోమరక్షురికాదిఘోరశస్త్ర
ఘట్టనంబున నసమసంగరము సేయ.

18


గీ.

అచలగతి నుండె దనుజసైన్యంబు మిగులఁ
బరఁగి [10]దైవసైన్యంబుచేఁ దెరల దయ్యె
దనుజసింహనాదములు డెందములు సొరఁగ
దిరుగఁబడఁ జొచ్చె నమరకుంజరబలంబు.

19


క.

అట్టియెడన్ [11]సురబల మి
ట్టట్టు వడం జేసి దనుజు లసిముసలగదా
ఘట్టనముల బలర్దమను
కట్టెదురన [12]నెఱపి రసమకౌతుకమతులై.

20

క.

అరగయ్యంబున దివిజులు
దిరుగుడువడి రింకమీఁద ధృతి చెడి తిరుగుం
బురుహూతుఁ డనుచు దమవా
రరసినఁ దలపువ్వు వాడదని సంతసిలన్.

21


చ.

నిలు నిలు మంచు దానవుల నిర్జరనాథుఁ డదల్చి మింట మం
టలగతిఁ దూపులుం జటులటంకృతులున్ నిగుడారఁ బోర న
క్కొలఁది నుదారసారరణకోవిదబాహులు లోకపాలకుల్
గలసిరి కారుచిచ్చునకు గాడ్పులు దోడగు చంద మొందఁగన్.

22


వ.

వా రెవ్వరంటేని.

23


గీ.

వచ్చె యక్షగుహ్యకులతో వైశ్రవణుఁడు
దోచె దారుణభుజగయాదోబలముల
తోడ వరుణుండు గాలమృత్యువులతోడ
నడచె దండధరుండు దానవులమీఁద.

24


వ.

అప్పుడు.

25


గీ.

ముర నిశుంభ హయగ్రీవ నరకముఖులు
బరవసంబునఁ దలపడ్డ బవర మచట
భీకరం బయ్యె నుద్భటలోకపాల
రచితసమకాలబహువిక్రమముచేత.

26


వ.

ఇట్లు సంకులసమరంబు చెల్లు సమయంబున వరుణుతోడ హయగ్రీవుండును
దండధరునితోడ నిశుంభుండునుం బురుహూతుతోడ నరకుండును గుబేరునితోడ
మురుండుమ మఱియుం దక్కినగీర్వాణులతో నితరపూర్వగీర్వాణులుం దలపడి
పరిఘప్రాసముసలబరశుతోమరశక్తిప్రముఖంబు లగు వివిధాయుధంబుల
నొండొరుల గం డడంగించు సమయంబున.

27


గీ.

కినుకఁ బాశహస్తుఁడు హయగ్రీవు నొంచె
మర్మభేదిబాణాసారమహిమ నతఁడు

గిరివిధంబున నచలుఁడై వరుణుమీఁద
శితశరపరంపరా[13]సారశతము లేసె.

28


క.

ఏసిన వరుణుడు దనుజు శ
రాసారములోన ముంచె నతఁ డాతని బా
ణాసనము క్షురప్రంబున
నేసెను లస్తకము విఱుఁగ నింద్రుఁడు సూడన్.

29


వ.

ఇట్లు ఖండింతలైన కోదండంబు సకాండంబుగా దిగవిడిచి.

30


చ.

వరుణుఁడు వైచెఁ బాశమున వైచిన నబ్బలితంపుఁ గైదువుం
గరమునఁ బట్టి దానవుఁడు క్రమ్మఱవైచెఁ దదస్త్ర మంబుధీ
శ్వరునకు నొవ్విసేయద నిజప్రభుఁ డంచు సురారి రేఁగి ని
ఘరగద [14]నూచి వైచిన గడున్ వడిమస్తముమీఁదఁ దాఁకినన్.

31


క.

నెత్తురు గ్రక్కుచు మూర్ఛా
యత్తుండై తెలిసి వరుణుఁ డనిమొన నిలువం
జిత్తంబులేక బీరపుఁ
[15]బొత్తము గట్టుకొనిపోయెఁ బోయినపోకై.

32


వ.

ఇట్లు వరుణుండు పాఱ వెండియు నొక్కదెస.

33


సీ.

తఱిమి నిశుంభుఁ డంతకుమీఁద నిరువదే
                 నమ్ము లేసిన నతం డతనిమీఁద
నేసె సాయకశతం బింద్రుఁడు చూడ న
                 ద్దనుజుఁ డారవిసూనుధనువు నఱకె
నతఁడు దండం బెత్తి యద్దైత్యు బొరిపుచ్చ
                 [16]నాదిగొనంగ బాణాసనంబు
వైచి వాఁ డసితోడ వైవస్వతునిమీఁద
                 నడచె నద్దేవదానవులు కడఁగి

తే.

జోడు గానికైదువులఁ బోరాడి రచట
ముందఱ సురాసురుల బలంబులు గడంక
వాసవుఁడు [17]బలుఁడును బోరువడువు దోఁప
నట్లు గదిసి జయోల్లాస మతిశయిల్ల.

34


మ.

గద దట్టించి నిశుంభు మస్తకము నక్కాలుండు వ్రేయన్ మెయిన్
సదరం బైననొకింత కన్దిరిగియున్ శాతాసిచే వాఁడు జో
డు దెగన్ వేసిన మేను [18]వ్రస్సి యముఁ డాటోపంబుఁ జైతన్యముం
బ్రిదులన్ యామ్యబలంబు లావలనికిన్ భీతిం దొలంగించినన్.

35


క.

ఇట్టిక సూఁడినవాఁ[19]డో
యొట్టిడుకొన్నాఁ[20]డొ యనుచు నుల్లసమాడం
బట్టగుచు మగిడి చూడక
పట్టణమున కేఁగె లజ్జబండతనమునన్.

36


వ.

మఱియు నొక్కదిక్కున.

37


గీ.

శ్రీదుఁ డుద్ధతి మాణిభద్రాదులైన
యక్షులును గుహ్యకులును విద్యాధరులును
మొనసి తోతేరఁ దాఁకె నమ్మురునితోడఁ
జేరి నడవ డెబ్బదివేలు [21]పౌరవులును.

38


వ.

ఇట్లు (నడచి) శరపరంపర లాదనుజేంద్రుపయిం గురిసిన.

39


చ.

మురదనుజుండు [22]పౌరవసమూహమునుం గని రాజరాజుపై
శరనికరంబు వుచ్చి తనచక్కిన యెక్కిన యక్షగుహ్యకుల్
విరియఁగ ఖడ్గపాశముల వ్రేసిన వచ్చినత్రోవ వట్టి [23]కా
తరమున మాణిభద్రసహితంబుగ వచ్చినవారు పౌరులున్.

40


గీ.

కైదువులు విడిచి యెడళ్లు గగురుపొడు[24]
నంత నంత గకాపిక లైనవారిఁ
గని మురుండు కుబేరుని గదిసి యేసెఁ
బ్రతిభ [25]యాళీవిషోపమబాణతతుల.

41

చ.

చను[26]మఱలందు పక్షమునఁ జక్షురుపాంతములందు ఱెప్పలన్
మునిఁగిన బాణజాలముల ముప్పిరిగొన్న భయంబు ఖేదమున్
మనమున నిండఁగాఁ దొడఁగి మార్కొనలేక కుబేరుఁ డేఁగె న
ద్దనుజుల నింత చేసినవిధాతకు గో డనఁబోవు చాడ్పునన్.

42


గీ.

మఱియు దానవనైన్యంబు మాఱులేక
యొప్పి తప్పిన నిర్జరయోధవరులఁ
దోలి తొప్పఱవెట్ట నింద్రుండు నిలిచె
బవరమున నొక్కరుఁడు [27]నేఁదుపల్లువోలె.

43


ఉ.

దేవత లెల్లఁ బాఱిన మదిన్ రణకౌతుక ముల్లసిల్ల నై
రావణదంతి నెక్కి నిజరాజితకార్ముకఘోరశింజినీ
రావము సూప నేపునఁ బురందరుతో నరకుం డెదిర్చె నా
నావిధసింహనాదుఁడయి నాగముపైఁ జనుసింగమో యనన్.

44


మ.

ఇటురా! చూతువు చేతిలా వనుచు మ్రోయించెన్ గుణం బప్పు డు
త్కటసంగ్రా[28]మము సెల్ల నిద్దఱకు దైత్యస్వామి నారాచమొ
క్క[29]టి యేసెం దెగ నిండఁ జాఁపి హరిమైగాఁడన్ సురేంద్రుండు నె
త్తుట జొత్తిల్లుచు మూర్ఛవోయి కరిపైఁ దూలెన్ విచైతన్యుఁడై.

45


సీ.

అంతలోన[30]న తేఱి యమరేంద్రుఁ డెనిమిది
                 బాణంబు లతనిపైఁ బఱపి మఱియు
రథము డెబ్బదిట సారథిఁ దొమ్మిదిట నేసి
                 పడఁగ శాతక్షురప్రమున నఱకి
సూతు నంతట శితాశుగపరంపరచేత
                 జముఁ గూడ ననిచి రథ్యముల నాల్గు
శరములఁ జంపి తచ్చాపంబు క్రూరభ
                 ల్లమున ఖండించిన నమరవైరి


తే.

విరథుఁడై చేతఁ గరవాలు వెలుఁగుచుండ
దాఁటి గజకుంభములఁ గాలదన్ని వజ్రి

వక్ష మదరంట వ్రేసిన వ్రాలె నతఁడు
మీఁదమీఁదనె ప్రాణంబు మిడు[31]కుచుండ.

46


వ.

ఇట్లు వ్రేసి.

47


గీ.

కరటికుంభస్థలం బొక్కఘాతఁ గొన్న
మురిసి హరి మూర్ఛదేఱకమున్న పాఱె
నది రయంబున దనుజుఁ డల్లంత నుఱికెఁ
జూప ఱగ్గింప విక్రమాటోపలీల.

48


వ.

ఇట్లు సంగరవిజయోత్సాహంబున సింహనాదంబుచేసి వరుణ సైన్యవార్ధి
బడబానలుండును దండధరసేనావనదవానలుండును హరసఖవీరభటహరిణ
శార్దూలుండును సురరాజశూరపరివారవారివాహపవనుండును నను కైవారంబులు
సెలంగ నరకాసురుండు.

49


క.

సమరమున గెలిచి పగతుర
సమస్తసంపదలు సేర సంతోషమునం
దమవారు మిగుల నుబ్బఁగ
నమరావతి సొచ్చె విభవ మరయుతలఁపునన్.

50


వ.

ఇట్లు సొచ్చి.

51


సీ.

నృత్తగీతంబులు నిస్సాణపటహసం
                 జాతంబులును లేనిచదుకములును
గాశ్మీరనికరంబుఁ గల్హారపుష్పోప
                 హారంబు లేనిసౌధాంగణములు
మణితోరణంబులు మహనీయశృంగార
                 [32]వారణంబులు లేనివాకిళులును
గర్పూరధూమంబుఁ గాంతాకటాక్షని
                 రీక్షలు లేనిగవాక్షములును


తే.

గదళికాదుకూలంబులుఁ గంపమాన
చమరవాలంబులును లేనిచంద్రశాల

లును గనుంగొని ప్రమదకల్లోలలోల
మానసుండయ్యె దిక్పాలమర్దనుండు.

52


వ.

మఱియును మగలు దిగవిడిచి పోవుటయును మానంబుతోడను మ్రంది
మందిరంబుల నడంగియున్న మగువలఁ దెగువతోడ వెడలం దిగిచి తెచ్చి గడచి
చక్కనివారి నేర్పఱచి యొక్కయెడం గూడఁబెట్టు ధూర్తదనుజులును, పోవచ్చిన
నొడిచి కచభరంబులు వట్టికొన్న నన్నన్న! నీ చెలియ లనని విడిపించుకొని కన్నీరు
దొరుగు మొగంబులఁ బయ్యెద లొత్తుకొని యేడ్చు సుదతుల నదలించు నిర్ధయదైతే
యులని సవరని పాపలం దడవితడవి తమయేలికకుం గానికగా నీవలయునని
కొనిపోవచ్చినఁ బైపడి విడువఁజాలక పెనంగు తల్లులం బ్రల్లదంబునం ద్రెళ్ళం
ద్రోచి తిట్టుచు సైకపుంబై దలిమూఁక లగపడెనని చెలంగు ఘాతుకదైతేయులును,
వెండియుం గడుసరి దానవులు మిసిమిగల పసిఁడి కాసచేసి పడఁద్రోసి గాసిం
బఱచిన ప్రాసాదంబులునుం, జతురులగు దితిసుతులు దమతమ నికేతనంబులకుం
గొనిపోవుటకై విఱుగకుండం బెఱికించి సురకుమారకులత లలకెత్తి(ంచి)న ఘటిత
మణికోటికోటీమండితకవాటసంఘాతంబులును, వారువంబులు గంధేభంబులులేని
దివిజవైరులు మగిడి పోవునప్పటికి మసలక మనోవేగంబుల నెక్కించుకొని చన
వలసి(పొలసి)నం బోవనీక దామెనలం గట్టిన దివ్యవిమానంబులును, విఱిగిన
రత్నస్తంభంబులును, విటతాటనంబులగు హేమకుంభంబులును, బగులనడచిన
పట్టెలుం, బైపడం దిగిచిన పెట్టెలు, నోడుపఱచిన చిందంబులు, నొరగం ద్రోచిన
దారబందంబులును, దప్పిపడిన నూపురంబులుం, దల్లకెడవైన గోపురంబులును,
నిలువునఁ గూలినమేడలు, నెఱదప్పినవాడలు, బాఱవైచిన దివ్యాస్త్రంబులునుం,
బలుచోట్లం బడిన శస్త్రంబులునుం, జూచి చిఱునవ్వున నరకాసురుండు భాసురం
బగుజంభారమందిరద్వారంబుం బ్రవేశించి వాహనంబు నవతరించి కక్ష్యాంతరంబులు
గడిచి యంతకమున్న యంతఃపురకాంతలు దొలంగుట యెఱింగి యచ్చట సభా
మండపముననున్న యున్నతరత్నసింహాసనంబున నాసీనుండై.

53

నరకాసురుఁ డూర్వశిని రావించి సంభాషించుట

ఉ.

ఊర్వశిఁ దోడితెమ్మనుచు నొక్కనిఁ బంపఁ బదుండ్రు వాఱి సౌ
పర్వణసౌధవీథుల యుపాంతములం దిరుగంగ నంతకుం
బూర్వసురేశ్వరుండు సురపుంగవుగద్దియమీఁద నుండి గం
ధర్వులపాట వించుఁ బ్రమదంబును బొందుచునున్న యత్తఱిన్.

54


క.

తడవం బోయిన దైత్యులు
పొడగని యూర్వశి, తొలంగిపో నేల? నినుం
దొడితెమ్మనె మారా; జదె
బడిబడి వచ్చెదరు వేగ పని విను మనినన్.

55


వ.

అజ్జోటి దిట్ట గావునం దలంకక వచ్చునప్పుడు మునుముట్టిన భయకార
ణంబున.

56


సీ.

తొడవు లూడ్చిననైనఁ దొయ్యలి[33]రూపుతోఁ
                 జిన్నవోయినపట్లు సెన్ను మీ[34]
విరులు పుచ్చినవైన వెలఁది పెన్నెఱతావిఁ
                 బాయనిజవ్వాది బయలు మెఱ [35]
బూత రాల్చిననైనఁ బొలఁతుక మైచాయ
                 గవుసెనలో నున్నక్రమము దెలు[36]
మడుఁగు మాసిననైన మగువ పిఱుందుసో
                 యగము చూపఱచిత్త మాఁకగొలు[37]


తే.

మురిపముల నుజ్జగించిన [38]ముగుదనడపు
గలికిచూపుల వీడ్కొన్న కన్నుఁగవయుఁ
జిఱునగవు నోసరించిన చిగురుమోవి
నింతి మది బీతి వెలు[39]పలి కెఱుక సేయ.

57


క.

దనుజేంద్రుఁ డాతలోదరిఁ
గనుఁగొని చొళ్ళెంబు నిమురుఁ గ్రమ్మనఁ బైకొం

గనువుపఱుచు గేదఁగిరే
కు నఖంబులఁ జీఱు [40]గులుకుఁ గోర్కులఁ దేలున్.

58


క.

అత్ఱఁ గంతయు నూర్వశి
చిత్తంబున నెఱిఁగి వాఁడు చేతోజాతా
యత్తుండై తనుఁ బిలువం
బుత్తెంచుట తెలిసి లోనఁ బూనినలజ్జన్.

59


ఉ.

తోరపుఁజన్నుదోయిపయి దొంగలిఱెప్పలదాఁచి చూపు నీ
హారము లేని క్రొమ్మెఱుఁగులై నిలువం గొలు వల్ల జొచ్చి య
చ్చేరువకంబముం గదిసి చిత్తరువో కరువో యనంగ గం
డారపుబొమ్మవోలె నచటం గద లించుక లేక యుండఁగన్.

60


ఉ.

ఆ లలితాంగిఁ జూచి నరకాసురుఁ డిట్లను బాకశాసనుం
డాలములో ననుం గదిసి యంతక పాశి కుబేరయుక్తుఁడై
తోలుపులం బడెన్ సతులు దోడనె డాఁగిరి దైత్యభీతలై
[41]ప్రోలు దొలంగి తేమిటికిఁ బొత్తులదానవు నీవు తొయ్యలీ.

61


ఉ.

నాకపురంబులో మెఱసి నందనకేళిఁ జరించి దివ్యకాం
తాకరతాలవృంతసముదాయసమీరము సోఁక రాజ్యముం
గైకొని నేఁడు దిగ్విజయగౌరవధన్యుఁడ నైన నాసభన్
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు నిండునే.

62


మ.

అవె సుత్రామరథంబు; లల్లవె కుబేరానేకపశ్రేణు, ల
ల్లవె వార్ధీంద్రుతురంగమంబు; లవె ప్రేతాధీశవీరావళుల్
దవులం బాఱినఁ బట్టి తెచ్చి రనిలో దైతేయు [42]లేసొమ్ము లిం
దువిదా నీకుఁ బ్రియంబు? గైకొనుము నీయుల్లంబు దెల్లంబుగన్.

63


ఉ.

కౌఁగిటి కాస చేసి నొడికారితనంబున నిన్నుఁ దేల్చి రా
రాఁ గొఱగానివాఁడనయి రామలలో నగుబాటు దేను నీ
కేఁ గలుగంగ సంపదల కేల విచారము పద్మగంధి? నీ
లోఁగిటఁ జేర్పనే యుభయలోకసుఖంబులు నన్నుఁ బొందినన్.

64

వ.

అనుటయు నక్కాంత చింతాక్రాంతయై యొక్కింత దెలిసి యతనితో
నిట్లనియె.

65


చ.

చతురవచోవిలాసగుణసాగర! సాగరమేఖలావనీ
పతియగునీకు నింతు లొకబ్రాఁతియె? నీ విటు గోరు టెల్ల నా
యతులితభాగ్య; మింత నిజ; మైనఁ గలంగికమున్న వైభవో
న్నతి మెఱయంగ వచ్చి యొకనాఁడయినన్ నను గౌరవించితే.

66


ఉ.

నావుడు దానవేశ్వరుఁడు నవ్వుచు నూర్వశితోడ నిట్లనున్
నీవిటు దూఱ నేర్తు వని నేరమి పెట్టితి గాక యేను మీ
దేవత లున్నవీటి కరుదెంతునె మిండఱికంబుచేఁతకై
లావున రాక వేఱొకతలంపున వచ్చినఁ గీడు పుట్టదే?

67


చ.

అనుటయుఁ బూర్ణచంద్రముఖి యద్దనుజేంద్రునితోడ నిట్లనున్
మనమున నింతమాత్ర మనుమానము గల్గిన నిందు నిన్ను ర
మ్మనుట పొసంగ, దొక్కదినమైనను నీ విహరించుచోటికిన్
ననుఁ బిలిపింప వైతి తగునా చన వింతకు నాకుఁ జెల్లదే?

68


వ.

అనుటయు నతండు.

69


క.

పగవాఁ డట దేవేంద్రుఁడు!
మగువా! నీవతని కాలువుమానిసివట! నిన్
దగవు చెడి పిలువఁ బనుచుట
మగతనమే? యిట్టిలంజమాటలు గలవే.

70


వ.

అనుటయు నచ్చెలువ విచారించి.

71


ఉ.

లంజియ నౌదు నేను విను లావున నీ వమరేంద్రు గెల్చి న
న్నుం జెఱపట్టి తెమ్మని వినోదము చేసితిగాక చిత్త మె
ల్లంజెడి యుండ రిత్తయొడలం జవి చేరునె? చిల్కవోయినం
బంజర మేమి సేయ? రసభంగము సంగతిలోన మెత్తురే.

72


ఉ.

నవ్వులమాటలో నిజమొ నాకములోన ననేకకన్యకల్
మవ్వపుఁదీఁగెలం దెగడు మానిను లుండఁగ నంత నెన్నఁడో

జవ్వన మమ్ముకొన్న [43]గడసాని ననుం గవయం దలంచితే
పువ్వులు వేడుకైనఁ గడివోయిన[44]వాళ్ ముడువం[45]గవచ్చునే.

73


వ.

అనుటయు.

74


క.

అంజెదవుగాక ననుఁ జెం
తం జేరఁగనీక యెంత [46]దఱిఁగిన మిరియా
లుం జొన్నల సరిపోవే
లంజెతనములందుఁ గొమిరెలన్ గెలువ వటే.

75


గీ.

ఆనుడు నవ్వామలోచన యతనిఁజూచి
చిఱుతనగవుల ఱెప్పల సిగ్గు దేర్చి
నీవు రాజవు! మాటలు నిన్నుఁ గడవ
నాడ నేర్తునే, విన్నప మవధరింపు.

76


చ.

శతముఖుఁ డోడె నీవతనిసంపద కంతకు రాజవైతి త
చ్చతురవిలాసినీ[47]గణము సంతతసేవ యొనర్చు నీమనో
హితముగ నింక నేననఁగ నెంతటిదాన మహిన్ మహామునుల్
క్రతువులు సేయుచోటి కధికారివిగాని కొఱంత యేటికిన్?

77


క.

యాజకులు యజ్ఞభాగ
భ్రాజిష్ణునిఁ జేయ నిన్ను భావజ[48]సౌఖ్యా
వ్యాజపదరాజుఁ జేసెదఁ
దేజముసూ వలపు దెలుఁపు దెఱవల కెందున్.

78


వ.

అనుటయు నతండు.

79


చ.

అవునిది వోలు వాసవుఁడు నంతకుఁడున్ వరుణుండుఁ బార్వతీ
ధవసఖుఁడుం బ్రతాపమునఁ దత్పద మేలెద రంచు నిట్టినే
నవిహితయాగభాగము లహంకృతిమైఁ గొనకున్న నూర్వశీ
కవకవ నవ్వరే త్రిదశకాంతలు వింతల సేయు నాపనిన్!

80

వ.

అని యొడంబడి యా వెలంది వీడ్కొలిపి యమరావతీపురంబునం దడవి
తడవి చక్కని కన్యకాజనంబుం బట్టించి తెప్పించి యందంద నందన పాదపంబులు
వెతికించి తెప్పించి యెనిమిదివేల యెనుంగులం గైకొని మాహిష్మతీపురంబునకు
వచ్చి మఱియును.

81


గీ.

త్వష్టకు నుదాహరకుఁ జతుర్దశి యనంగ
నొక్కకూఁతురు గలిగినయిక్కు వెఱిఁగి
[49]గంధగజరూపమునను నక్కన్యఁ దెచ్చి
కవసి నరకాసురుండు సౌఖ్యములఁ దేలి.

82


క.

నాకంబునయందును భూ
లోకంబునయందు ధనములు మణులు దైత్యా
నీకంబు దేర మంచివి
గైకొని యాచంద్రముఖికిఁ గానుక యిచ్చెన్.

83


వ.

వెండియు గంధర్వదేవమానుషకన్యకలం బదాఱువేలున్నూఱుగుర నప్సరో
గణంబు (లేడింటి) జెఱలుపట్టి తెచ్చి మణిపర్వతంబునం బురంబుచేసి కావలివెట్టి
కొని యుండెనట్టియెడ.

85


మ.

మురదైత్యుండు దపోవసానమున వైముఖ్యం బముఖ్యంబుగా
[50]వరదత్తాపరనామధేయమున దేవవ్రాతముం గిట్టి ము
ష్కరుఁడై కుండలముల్ హరించె నదితిం గారించి దైతేయు లె
వ్వరుఁ బూర్వంబున నింత చేయ రనుచున్ వారింత వారింపఁగన్.

86


క.

ఆకుండలములు నరకుని
జేకొమ్మని యిచ్చి యతనిచేఁ దాఁ బడసెన్
నాకొడుకులకుఁ బదుండ్రకు
నీకావలి యొసఁగు మనుచు నిచ్చలుఁ గొలువన్.

86


మ.

అతఁడున్ వారికి నాత్మరక్షయును గన్యారక్షయుం జేయనై
హితులం దోడుగఁబెట్టి యిచ్చే మహిలో నింపారఁ బ్రాగ్జ్యోతిషా

ర్పితుఁడై తచ్చతురంగరక్షకు హయగ్రీవున్ నిశుంభుం లొన
ర్చుతఱిం బంచజనున్ మురుం బనిచె ధీరుండై జగం బేలుచున్.

87


క.

ఆమురుఁడు రాక్షసకుల
స్వామి [51]సుకృతి వానిఁ జంప వచ్చుటకుఁ బరం
ధామపతి పుట్టె సుజన
క్షేమంకరుఁ డగుచు దేవకీగర్భమునన్.

88


క.

మురనరకాసురు లిరువురు
సుర లరిగెడుత్రోవ లుడిపి సుత్రామభయం
కరులై మునిగణమానస
సరోవరంబులు గలంచి చరియింతు రిలన్.

89

నరకాసుఁ డధ్వరభాగంబు లిం డని మునుల బాధించుట

మ.

ఒకనాఁ డూర్వశిమాటపొందు నరకుం డూహించి నాకాధినా
యకునిం దాపసముఖ్యు లధ్వరము చేయంబూని రావించుచో
టికి దాఁబోయి [52]ధరామరావతులు రెండింగొంటి మీ కెల్ల నే
లికనై యుండెద యాగభాగములు పాలింపన్ విభుం డయ్యెదన్.

90


శా.

పాశిం బాఱఁగఁ దోలి యంతకు దిశాపట్టంబు గావించి పూ
ర్వాశాధీశ్వరు వెన్నడిం జని ధనాధ్యక్షున్ విభాళించి కే
లీశస్త్రాస్త్రవిహారసార మెచటన్ లేకుండ నిర్మించితిన్
మీశాస్త్రంబుల నింక నెవ్వరి కగున్ మేలైన యజ్ఞాంశముల్.

91


క.

మ్రొక్కులకుఁ దగుదుఁ బూజల
కెక్కినమంత్రార్థవిధుల కెల్లం దగుదుం
బెక్కేల యేను వెలిగా
స్రుక్కక యాగముల కొకరు సొరఁ గలవారే.

92


చ.

అనుటయు సంయముల్ బదరికాశ్రమవాసులు గూడి వానికి
ట్లనిరి సురాధినాయకుఁడ యాగము లేలెడువాఁడుగాక లా

పునఁ బడునయ్య పేర్మి? యలపుం దగవుం దలపోయ కేల కూ
డనిపని సేయఁ [53]జొత్తు? వకటా వికటాచరణంబు పాడియే?

93


క.

మనుజాశను లట, బలు లట
మును లట, యాగంబు లట, నమో విశ్వసృజే
[54]విన మింతకు ము న్నెన్నఁడుఁ!
గని కని కొఱ్ఱెవ్వఁ డింటికంబము సేసెన్?

94


వ.

అనుటయు నద్దనుజుండు.

95


క.

ఏలిక నౌదు మఖాంశ
శ్రీలకు; నొరు దడవ నేల! శిర సుండగ మోఁ
కాలను సేసలు వెట్టుట
బేలుఁదనము గాక మీకుఁ బెద్దఱికంబే.

96


క.

త్రిదివసుఖమ్ము మఖమ్మున
గదియించుఫలంబుఁ దనకుఁ గాననిదయ్యం
బెదిరికి వర మిచ్చు ననుట
చదురే యతఁ డేఁగె మును దిశాపట్టముగాన్.

97


వ.

అనుటయు నమ్మునీంద్రులు విడియనాడం దలంచి యతని తోడ.

98


శా.

పాపాత్ముండవు దానవుండవు నినుం బాటించి యాగార్హుఁగాఁ
జేపట్టం దగునే మునీంద్రులకు? మాచేఁ జెల్ల దీకల్ల దు
ర్వ్యాపారంబులు ధర్మకర్మములలో వర్తించునే? నావుడుం
గోపాటోపగజంబు మానససరఃకోలాహలోత్సాహిగాన్.

99


చ.

తనపరివారముం బిలిచి దానవుఁ డాశ్రమసంభృతార్థముల్
గొనుఁడు పరంపరాకమునకున్ మును యజ్ఞపశువ్రజంబులం
దినుఁడు కుమారికావితతిఁ దెండు బలాత్కృతి నంచు నమ్మహా
మునులకు నెగ్గు చేసి మదమోహమునం దనవీటి కేఁగినన్.

100

వ.

తదనంతరంబ.

101


సీ.

జడలు [55]కంపలు వట్టి జరగనీ కున్నచో
                 విడిపింప శిష్యుల వెదకువారు
జన్నిదంబులు కాలిసంకెలలై పడ్డఁ
                 దెగఁ దన్ని మిన్నక తిరుగువారు
ముందటిదిక్కూడి మొలత్రాడుఁ దవిలిన
                 తోఁక[56]గోచులవెంటఁ దూలువారు
దగ యెత్తి పోలేక దండంబు లటు వైచి
                 “హా విధీ" యని చేతు లార్చువారుఁ


తే.

గడవసంబుల మోఁదిన గలగువారు
వల్కలంబులు దోఁచిన వంగువారుఁ
జెఱలువోయినవారలఁ జీరువారు
నై మునీంద్రులు గలఁగి రయ్యాశ్రమమున.

102


చ.

నరకునిచేత నిత్తెఱఁగునం బరిభూతికి భాజనంబు లై
హరి కెఱిఁగింత మీబదరికాశ్రమ దుర్భరబాధ లంచు న
ప్పరమమునీంద్రు లందఱు గృపాపరతంత్రుని యాదవాన్వయాం
బురుహదివాకరుం గొలువఁ బోయిరి వేడుకతోడుపాటుగాన్.

103


గీ.

అరుగు నెడ భరద్వాజ కాశ్యప వసిష్ఠ
వామదేవ జాబాలి కణ్వ బృహదశ్వ
ధూమ్రముఖ్యులు దనుజారి తొల్లి చవులు
గన్నబదరీఫలంబులు కానుకలుగ.

104


క.

తెం డనుచు దుష్టదానవ
ఖండితయాగోపకరణఘనభారంబుల్
దెం డనుచు [57]వేగమే చను
దెం డనుచున్ శిష్యులకును దెలియఁ బలుకుచున్.

105

నిరోష్ఠ్యము

చ.

చని చని కాంచె నంత ఋషిసంహతి సారసకేసరాంతరా
సనసరసాళిసంగఁ దటచందనశాఖి చలత్తరంగఁ గాం
చనసరసీజలార్ద్రయతిసంచితసైకతలింగ గంగ నం
జనగిరి గాఢగంధగజసంగతశృం రథాంగ నత్తఱిన్.

106


క.

అనిమ్నగలోనఁ గృత
స్నాను లయి మునీంద్రు లమలినస్వాంతశరీ
రానూనమహిము లగుచును
దానవరిపుఁ గానఁ జనిరి ద్వారావతికిన్.

107


మ.

చని వా రందఱు దేవతారచితపంచక్ష్మాధరాంతస్థలం
బున నొప్పారెడువీడు చొచ్చి మన ముప్పొంగం[58]గ దాశార్హ నా
వినుతిం బొందుసభన్ నిషణ్ణులగుచున్ [59]విచ్చేయ శైనేయుఁ డా
సనపాద్యాది సపర్యలం దనుపఁగా సంప్రీతచేతస్కులై.

108


చ.

అచటికి దానవాంతకుఁడు నంతటిలోఁ జని యానుపూర్వితో
నుచితవిధోపచారముల నూఱటగాఁ గుశలానుయోగవా
క్యచతురత న్ముదం బెసఁగ నందఱ ధన్యులఁ జేసి భక్తి న
ప్రచలితుఁడయ్యె వారలు నుపాయనముల్ మునుసూపి పిమ్మటన్.

109

మునులు నరకుని యాగడములు శ్రీకృష్ణునకు విన్నవించుట

క.

నరకుఁడు యాగంబులకున్
జొరకుఁడు మీ రనుచు ఋత్విజుల నడుచుటయున్
సరకులఁ జూఱాడుటయును
వరకులకన్యకలఁ బట్టి వా డేఁగుటయున్.

110


వ.

విన్నపంబుచేసి తమ తెచ్చిన విధ్వస్తోపకరణంబులు విచ్చి చూపి.

111


మ.

 అది నాయుద్గమనీయవస్త్ర మది నాయాషాఢరాంభద్వయం
బది నాస్రుక్సువపాత్రవర్గ మది నాయజ్ఞోపవీత వ్రజం

బది నాదారవయంత్రపీఠ మది నాయైణోత్తరీయాజినం
బది నారాంకవకంబళం బని పదార్థాలోకనవ్యగ్రులై.

112


వ.

వేఱువేఱ యెఱింగించి.

113


క.

నారాయణ! నీమన్నన
కారణముగ నేము బదరికావనభూమిం
జేరితిమి నరకుఁ డిమ్మెయిఁ
గారించెం దనకుఁ జేటుఁగాలంబునకున్.

114


క.

నీతోఁ జెప్పినయంతకు
మాతలఁపులు దుఃఖజలధిమగ్నంబులు గా
కాతల నాతలఁ కేలా
దైతేయాంతకుఁడ వెల్లతగవుఁ దెలియవే.

115


వ.

అని మునిలోకంబు శోకంబు గ్రోధంబును బోధంబు సడలింపజేయ నిలింప
వైరి తెఱం గెఱింగించుటయును.

116


మ.

అరుణాంభోరుహపత్రనేత్రుఁడు సముద్యద్భ్రూకుటీభంగభా
సురఫాలస్థలుఁడుం జలాచలమనశ్శూలాయమానవ్యధా
పరివేషాననభానుమండలుఁడు నై ప్రత్యక్షరౌద్రం బనన్
నరకాలంభవిజృంభణంబు నెఱపెన్ నారాయణుం డాకృతిన్.

117


వ.

అప్పు డప్పరమపురుషుం గొనియాడం దలంచి యత్తాపసోత్తము
లిట్లనిరి:

118


సీ.

పన్నగంబుల రాజు! బగవాఁడఁ గూడి నీ
                 శయనంబుఁ బయనంబు నంతరింప
దుగ్ధవారాశికూఁతురు నాలుఁ గూడి నీ
                 శరణంబుఁ జరణంబు సవదరింపఁ
దామరపగవాఁడు దయితుండుఁ గూడి నీ
                 బడి చూపుఁ గుడి చూపుఁ [60]బరిఢవింపఁ
జందురుచెలికాఁడు సయిదోడు గూడి నీ
                 యుల్లంబు మొల్లంబు నుపచరింప

తే.

గంపమానమనోధ్యానగతులు మాన
కేకతం బున్నమునులకు నేకతంబు
లేక పొడగాన వచ్చు నీలీల గాన
నన్యు లేనాఁట ధన్యులే యంబుజాక్ష!

119


గీ

అనుచుఁ గొనియాడి వందన మాచరించి
మునులు సంతోషవార్ధిని మునిఁగి యాడఁ
గొలువునం దున్న యాదవకోటి యెల్ల
మొగుపుఁగేలు ఫాలంటున మోచియుండె.

120


గీ.

ఇట్లు మ్రొక్కిన మునియాదవేంద్రసమితి
సంతసము నొంద నరకునిఁ జంపువాఁడ
నందఱుచు జూడ నని పంతమాడు హరికి
మఱియు మ్రొక్కుచు సంయము ల్మగిడి చనిరి.

121


క.

తదనంతరంబ రాముఁడు
మొదలగు యాదవుల కెల్ల మోదము వెఱఁగున్
మది మొలవఁ జక్రధరుపై
వదలక వినువీథిఁ బుష్పవర్షము గురిసెన్.

122


ఉ.

తోడన దివ్యగంధములతో సుఖశీతలమారుతంబు ద
ట్టాడ వియత్తలంబుగలయంతటఁ గారుమెఱుంగుమూఁకకున్
జోడగుకాంతి పర్వ మఱిచుట్టులఁ బాయు తొలంగుమంచు బె
ట్టాడెడుమాట లుప్పతిలె నంతటిలో గగనాంతరంబునన్.

123

ఇంద్రుఁడు నరకునిదుండగములు నివేదింపఁ గృష్ణునికడకుఁ బోవుట

క.

ఈరీతిఁ దోఁచి నంతట
నైరావణదంతి నెక్కి యమరులతో జం
భారి చనుదేర యాదవ
వీరులు నిలుచుండి రధికవిస్మయమతులై.

124


క.

వాసవుఁ డేనుగు దిగి, సిం
హాసనముననుండి దిగి జనార్దనుఁ డన్యో

న్యాసక్తిఁ గౌఁగిలింపఁగ
నాసభవారలకు ముదము నచ్చెరు వయ్యెన్.

125


వ.

ఇట్లు పరస్పరపరిరంభణం బాచరించిన యనంతరంబ జంభాంత
కుండు.

126


శా.

రాముం గౌఁగిటఁజేర్చి [61]యాహుకుని నాప్రద్యుమ్ను నక్రూరునిన్
బ్రేమం బారఁగఁ గౌఁగిలించి వరుసన్ బేర్వేర భోజాంధక
స్తోమం బెల్ల వయోవిశేషగతి రాఁ దోడ్తోఁబరీరంభలీ
లామాధుర్యమునన్ సుఖాంబునిధిఁ దేలం జేసె నెయ్యంబునన్.

127


మ.

హరి చేయించిన యర్ఘ్యపాద్యమధుపర్కాద్యోపచారంబులన్
హరి సమ్మోదము మోమునం బొడమఁగా నర్హాసనాసీనుఁడై
కరమద్దేవు కపోలఫాల[62]చిబుకగ్రైవేయసంక్రీడకుం
దిరుగం జేయుచు నొయ్యనొయ్యఁ జెవికిం దియ్యంబుగాఁ బల్కుచున్.

128


క.

నరసీరుహసంభవుచే
నరకుం డేవరము వడసి నమ్మినవాఁడో
పురములు గైకొని [63]కొఱఁకుల
తెరువులఁ బట్టించె నన్ను దిక్పాలకులన్.

129


వ.

అంతనుండి.

130


చ.

చొరనిబిలంబులున్ వెడలఁజూడని క్రంతలు గాలు రాపడం
దిరుగని త్రోవలున్ విడియఁ దీర్పరిగొందులు నాలుబిడ్డ లే
కరయని రేలుఁ జీమ చిటుకన్నను విప్పనిమూఁకలు బయిం
జిరుఁగని చీరలుం గలవె చేరిన యీ సురకోటి కచ్యుతా.

131


వ.

నా తెఱంగు వినుము.

132


శా.

లోకాలోకనగంబు [64]చెంపలకుఁ గల్లోలాహతాంబోధివే
లాకుంజంబులకుం జనం జనఁగ నాలా [65]వెంత చింతాభరం

బాకంపంబు మనంబునం బెనుపఁగా నైరావతోచ్చైశ్శ్రవ
స్స్వీకారంబున దిక్కులం దిరుగ వచ్చెన్ దేవకీనందనా!

133


వ.

అది యట్లుండనిమ్ము.

134


క.

ఇటమీఁద నాకు నరకుఁడు
కుటిలమతిం గీడు చేయఁ గోరేడు నతనిం
జటులతరచక్రధారా
త్రుటితశిరఃకమలుఁ జేయు తోయజనాభా!

135


క.

ఈవైనతేయు నెక్కినఁ
గావింపఁగ రానిపనులుఁ గలవే నీకున్
గోవింద! తిరుగు నీతఁడు
దేవతలకుఁ డిరుగ రాని తెరువున నైనన్.

136


చ.

అనుడు జనార్దనుండు నరకాసురుఁ జంపుట కింత యేల నీ
కనిమిషనాథ! మున్ బదరికాశ్రమతాపసపంక్తి ముందటం
గినిసి ప్రతిజ్ఞ చేసి రణకేళికి నప్పుడ పోపువాఁడనై
పనివడి నేఁ దలంచితి సుపర్ణుని నాతఁడు వచ్చె నింతలోన్.

137

శ్రీకృష్ణుఁడు సత్యభామతో నరకాసురుని వధింపఁ బోవుట

ఉ.

నావుడు నింద్రుఁ డుబ్బ యదునాయకుఁ డప్పుడ సత్యభామతో
నావిహగేంద్రు నెక్కి వివిధాయుధుఁడై వియదంతరంబుపై
త్రోవఁ జనంగ నాతఁడునుఁ దోడన యభ్రగజంబు నెక్కి సం
భావనఁ గొంతద వ్వరిగి పాసి చనం దనవీటిచోటికిన్.

138


గీ.

హరియు మహిష్మతీపురి కరుగుదెంచి
రక్షగాఁ జుట్టి తిరిగెడు రాక్షసులకు
దొలుత జముబానసమునింటి త్రోవ చూపి
పాంచజన్యంబు చేనంది బలము మెఱసి.

139


గీ.

కత్తివాతులతో నూరు గాచి తిరిగి
యాడు [66]మురపాశముల గాంచె నాఱువేల

వానిలో నిపిశాచముల్ వచ్చి వచ్చి
పొదువ నన్నింటిఁ దునుకలప్రోవు చేసె.

140


మ.

కని శౌరిన్ మురుఁ డంత మార్కొని గదాఘాతంబుల న్నొంచి [67]మీఁ
ద నవార్యాద్భుతశక్తి వైచుటయుఁ గోదండంబు సారించి య
ద్దనుజారాతి శితక్షురప్రమునఁ దత్కంఠంబు ఇండిచి శం
ఖనినాదంబున భూనభోంతరభయోత్కంపంబు గావించినన్.

141


ఉ.

అంత నిశుంభుఁ [68]డెయ్దుకొని యాశుగముల్ దనమీఁద నేయ దై
త్యాంతకుఁ డంతకంతకు గదాహతి నొవ్వఁగ సత్యభామ దు
ర్దాంతమదంబుతో ఘనగదం గడు బెట్టుగ వైచె దైత్యు న
త్యంతరయంబునన్ రుధిరధారలు గ్రక్క రణాంగణంబునన్.

142


క.

ఆలోకించి మురాంతకు
డాలోననె శరపరంరాంభోనిధిక
ల్లోలములఁ దేల్చి వానిం
గాలుని కందిచ్చె రౌద్రఘనవాయుగతిన్.

143


శా.

కేలీవిక్రముఁడైన చక్రికి హయగ్రీవుండు మార్కొన్న నా
భీలాయోధన మయ్యె నయ్యెడ శరప్రేంఖడ్గళోద్వేలకీ
లాలాలోలము చేసి వానితల నేలం గూల వైచెన్ జయ
శ్రీలోలుండు మురారి పంచజనుఁ బంచెం దత్సహాయుండుగాన్.

144


వ.

ఇట్లు విజృభించి దనుజాంతకుఁడు.

145


క.

ప్రాగ్జ్యోతిషంబు గదిసి స
దృగ్జ్యాటంకృతులు లేక దితిజులమీఁదన్
దృగ్జ్యోత్స్న జేవురింపఁగ
దిగ్జ్యాగగనాంతరంబు దివురఁగ నార్చెన్.

146


క.

విని కడగి యసుర లెనుఁబది
యెనిమిదివే లొక్కమొగిన యెత్తిన హరియం

గినిసి విశిఖంబు లేసిన
మొనపడు గగనంబు మొయిలు మూఁగినమాడ్కిన్.

147


వ.

ఇట్లు మధుసూదనుం డేయుసాయకంబులు గాలువలు గట్టి గట్టి మెయిమఱు
వులు సించియుఁ, గాయంబులు నొంచియు, మర్మంబులు గీఱియు, మహీతలం
బులు దూఱియుఁ, బ్రేవులు వెఱికియుఁ, బెనుమూఁకల కుఱికియు, సీసకంబులు
వగిలించియు, శిరంబులు నొగిలించియు, గైదువులు గఱచియుం, గరవాలం
బులు సఱచియు, నెత్తురులు సిమ్మియు, నెనళ్ళు గ్రుమ్మియు, జరణంబులు
దొలిచియుఁ, జర్మంటు లొలిచియు, బాహుదండబులు గత్తరించియు, బయళ్ళకు
నొత్తరించియుఁ, బలుగండలు సెండియు, బరులురాసి మండియు, గుండెలు
ద్రుంచియుఁ, గుత్తుకలు ద్రెంచియు, నురంబులు గాఁడియు, నరంబులు
దోఁడియు, నుదరంబులు వ్రచ్చియు, నూరువులు గుది గ్రుచ్చియు, మకుటం
బులు విఱిచియు, మదంబులు చెఱచియు, జంఘలు సెల(లి)సియు, జఘ
నంబుల బల(లి)సియు, బాణులం బెనంగియుఁ, బ్రాణంబుల మ్రింగియుఁ,
జట్టలు వాపియుఁ, జమత్కారంబులు మాపియుఁ, బై పయిం దోఁచిన నేచిన దనుజ
సబలంబు చలంబు కొని పోరి పోరిలోఁ దునుక లయ్యునుఁ దుము రయ్యునుఁ
నింతింత లయ్యును నిసుమంత లయ్యునుఁ జిఱును గ్గయ్యునుఁ జిదురుప
లయ్యును మం చయ్యును మడిమం చయ్యును రూపు చెడి తిరుగుడు వడి వాహి
నులు చిక్కువడి చిందఱవందఱై మతిచెడి మల్లామడియై యేపుదెగి [69]యవురు
సవురై యనువు దప్పి యదవదయై యంతంత విచ్చి యరవరలై పాఱలేక
పలపలనై వెఱఁగుపడి వెలవెల్లనై చిడుముడి పడి చెల్లాచెదరై పొడవడంగి
ప్రోవున నొక్కండై పోవిడిచినఁ బోయినపోకై పోయినం గని దనుజనాయ
కుండు తనమొనక భయదాయకుం డై నిజరథనిహితబహువిధసాయకుండై
చాలుఁ జాలుఁ బోకుపోకు నిల నిలు మని యదలించి కోదండంబు ధరియించి
గొనయంబు సారించి సారథికి రథవేగం బుపదేశించు సమయంబున.

148

క.

కమ్ములఁ దవిలెడు నేనిక
కొమ్ములు నెమ్ములును సుభటకోటులయమ్ముల్
నెమ్మనము నూఁకు నెఱుపగ
నుమ్మలికపుఁ గింకఁ గొంక కురవడి నేసెన్.

149


మ.

దనుజుం డేసినసాయకంబులు గరుత్మంతుండు పక్షావళీ
ఘనకక్షాంతరవీథులన్ [70]నిలిచి వీఁకన్ మేను వొంగంగ హు
మ్మని జాడించిన లాగు వేగమునుగా నాయంపచా లేసె నా
తనిపై సారథిపై హయంబులపయిం [71]దట్టాడఁ బెట్టాడుచున్.

150


సీ.

క్రేగంటి చూపున గిఱిగొన్న సన్నగే
                 దఁగిఱేకుల కన్నదమ్ము లగుచు
జడకొప్పులోను [72]నచ్చపుసజ్జకములైన
                 విరవాదులకు వింతవిందు లగుచు
బిగువుఁజన్నులమీఁదఁ బెనుపడం బై న చెం
                 గలువ క్రొవ్విరుల సంగడము లగుచు
[73]గేలకి హరి వైవఁ గేలఁ దాలిచిన సం
                 పఁగిబంతికొనల జోపాప లగుచు


తే.

[74]వేగ నరకాసురుం డేయు వేగిరంపు
బాణములఁ బ్రాణములు సత్యభామమేనఁ
గుసుమశృంగారముల కెల్లఁ గ్రొత్త సేయ
నెనిమిదిదెఱంగులై సొబ గినుమడించె.

151


క.

పగలిటిభానుఁడు వోలెను
ధగధగ యను మొగము దివుర దనుజుం డేసెన్
జగదేకనాథుమీఁదను
దెగ నిండఁగ దిగిచి యొక్కదివ్యశరంబున్.

152


క.

అరచందురు డెందములోఁ
జొరఁబాఱి వణంకు తోఁకచుక్కయపోలెన్

నరకుం డేసిన బాణము
హరినిటలతటంబు నాటి యల్లలనాడెన్.

153

సత్యభామ నరకాసురునితోఁ బోరాడుట

ఉ.

కాఁడినయమ్ముచే సొలసి కంసవిరోధి శిరోధి వ్రేలఁ జే
యాడక మూర్చవోయె భుజగాంతకు టెక్కలకొక్కలాగునం
దోడుగఁ దాలవృంతములఁ దూకౌని చల్లనిగాలి చల్లెఁ దో
డ్తోడనె సత్యభామ విభుఁడుం గనుఱెప్పలు విచ్చెఁ జచ్చెరన్.

154


ఆ.

అట్లు సేదదేఱి యరవిందనయనుండు
సత్యభామఁ జూచి చంద్రవదన!
శార్ఙ్గ మింద నీవు సమరంబె కోరు[75]చో
నవసరంబు వచ్చె ననుచు నిచ్చె.

155


ఉ.

ఇచ్చినఁ బొంగి యచ్చెలువ యింపును దెంపును లోన మానమున్
మచ్చరముం బెనంగ మురమర్దనుపై నరకాసురేంద్రుపై
నచ్చపుఁజాయలం గువలయచ్చదగుచ్ఛవిషచ్చటావలిన్
మెచ్చని వానిఁ గీల్కొలిపె మేలపుఁ జూపుల వాఁడితూపులన్.

156


మ.

గనయంబున్ గొనయంబు నెన్నడుముతోఁ గర్ణావతంసంబుతో
జనుదోయిం గనుదోయిసాయకముతో సంధానహస్తంబుతో
జెనకం జేయుచు నేయుచుండె సతి లక్ష్మీభూతదైతేయత
ర్జనగర్జారవజఠరాంగరుధిరాసారంబు దోరంబుగన్.

157


క.

అరవిందనయన శరముల
సరవిం దనయనువు చూపఁ జాలము గుడు సై
పరివేషముగల చంద్రుని
సరివేషము దాల్చె మొగము జగము నుతింపన్.

158


చ.

కమలముఖీకటాక్షకటకాముఖపాణినఖోపకారివి
క్రమమణిపుంఖరింఖదభిరామరుచుల్ గరమొప్పెఁ జెక్కులం

జెమటలఁ బత్త్రభంగములు చిందఱవందఱ లైనఁ దోన సం
భ్రమమున వీరలక్ష్మి సమరక్రమరక్షకు వ్రాసెనో యనన్.

159


శా.

సత్త్రాజిత్తనయాకరాంతరధనుర్జ్యారావ మైరావతీ
సూత్రానర్గళనిర్గతస్తనితమై సుత్రామచాపప్రభా
పాత్రభ్రూలతికావిలాసముల కొప్పం గప్పు శార్ఙ్గాంబుము
క్పత్రిక్రూరమహాశనుల్ దనుజరాడ్గాత్రంబు గోత్రంబుగన్.

160


సీ.

తంత్రీవినోదంబు తడవు సైపనివ్రేళ్ళ
                 గొనయంబు తెగలపైఁ గోరుకొనుట
యద్దంబుపిడి ముట్ట నలయు పాణితలంబు
                 లస్తకం బిఱియించు లావుకలిమి
చెలికత్తె నౌత్తిలి చీర లేనియెలుంగు
                 సింహనాదంబుచేఁ జెదర కునికి
ప్రమదనర్తనకేలిఁ బరిఢవింపని పదం
                 బై దుఠాణంబుల నలఁతఁ బడమి


తే.

సోయగపుఁజిత్రరూపంబుఁ జూచుచోట
వేసరువిలోచనంబులు వికృతదైత్య
లక్ష్య మీక్షించుటయు మొక్కలం[76]పుగెలుపు
గైకొనియె సత్యభామ సంగ్రామసీమ.

161


మ.

అరిఁ జూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలామకరంద[77]బిందుసలిలస్యందంబు లందంబు లై
తొరుగం బయ్యెదకొం గొకింత దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం కురియుచుం దన్వంగి కేళీగతిన్.

162


ఉ.

ఊచనకట్ట వంపని పయోరుహలోచన మింట మంటలం
బూఁచిన బాణజాలమునఁ బూర్వసుపర్వపురాణగర్వమున్
వేఁచినచందమున్ విపులవీరరసంబున నాత్మచిత్తముం
దోఁచిన చందముం దెలియఁ దోఁచిన నచ్చర లిచ్చ మెచ్చరే.

163

ఉ.

అక్కమలాయతాక్షి నరకాసురుపై సరి నేసె బాణముల్
పెక్కుదెఱంగు లయ్యసుర భీకరుఁడై నడు మాఱుతూపులన్
గ్రక్కునఁ బార్శ్వ మేడువిశిఖంబుల నొంచిన సత్యభామ గెం
పెక్కిన మోము లేనగవుటీరికలం దళుకొత్త నత్తరిన్.

164


గీ.

[78]గొడుగు కామయు విల్లునుఁ బడగతోన
తుమురు సేసి రథ్యంబులఁ దునిమి వైచె
నతివ యతఁ డొండుకోదండ మందికొన్న
నఱకె వేఱె విల్లెత్తిన విఱుగ నేసె.

165


క.

గద విసరి వైచె నరకుఁడు
వదలక సతి దునిమె శక్తి వైచెను దితిజుం
డది ముదిత దుమురు సేసెను
దుదిఁ బరిఘము వైచె నతఁడు దొయ్యలి విఱిచెన్.

166


మ.

సతి దైతేయపతి న్నిశాతవిశిఖాసారంబుల న్నొంప దే
వతలున్ సంయములు న్నుతించిరి మఱి న్వామాక్షి తత్సూతు ను
దతి నేసెం [79]దల నేలఁగూల నొకటన్ దైత్యాంతకుం డిచ్చె లా
లితకంఠాభరణంబుతో నతివకునన్ లీలాపరీరంభమున్.

167


ఉ.

ఏఁచు [80]నుపేంద్రునిం బదక మిమ్మని రుక్మిణి మున్ను, దేవుఁడుం
బూఁచినపూఁవు దప్పుటకుఁ బోకులఁబోవుచునుండు నిమ్మెయిన్
డాఁచినసొమ్ము చేరె నిచటన్ మదిఁ గోరనిసత్యభామకున్
నోఁచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్.

168


వ.

ఇవ్విధంబున సత్యభామ చేసిన సంగరంబునకు సంతోషించి.

169


గీ.

చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి,
తరుణినుదుటఁ బైకొన్న కుంతలము లొత్తిఁ
రమణికుచమధ్యమునకు హారములు ద్రోచి
పొలఁతిపయ్యెదకొంగుపైఁ బొందుపఱిచి.

170


మ.

హరి యక్కామినిచేతివిల్లు గొని యేయం జొచ్చినన్ ధీరుఁడై
నరకుం డొండుశరాసనంబు గొని యన్యస్యందనం బెక్కి వే

తొరిఁగించెన్ శరముల్ మురారిపయి నైదున్ రెండు రెండైదులు
న్సరి నై దేడులు సత్యభామయెడలన్ సౌపర్ణుగాత్రంబునన్.

171


క.

క్రమ్మఱ నేడుశరంబుల
నమ్మురరిపు వేసె విభుఁడు నద్దనుజుని చా
పమ్ముఁ దుమురు సేసెను ర
థ్యమ్ముల సారథిని నంపధారలఁ బొదివెన్.

172


గీ.

తన రథంబుననుండి యద్దైత్యవిభుఁ
దాఁటి దనుజాంతకుని యురస్స్థలము వేసి
తిరిగి [81]గరుడుని నడిచి యేతెంచి తోన
పరిఘమున వైచె నది శౌరి పగుల నేసె.

173


శా.

ఱాలన్ వైచె సురారి యొండొరుల మీఱంబాఱి యయ్యిద్దఱు
న్శైలానోకహముద్గరంబులను బాశప్రాసఖడ్గంబులన్
శూలవ్రాతగదాకదంబపరశుస్తోమంబులన్ భిండివా
లాలీపట్టిసమాలికాపరిఘసాహస్రంబులం బోరుచున్.

174

శ్రీకృష్ణుఁడు చక్రము ప్రయోగించి నరకుని సంహరించుట

ఉ.

అంతట దానవాంతకుఁ డహంకరణంబునఁ బేర్చి వేడ్కతో
వింత యొకింత సూపి పృథివీతనయుం దనయుగ్రచక్రవి
క్రాంతికి విందుచేనె సదరంబుగ డెందము దాఁకి ప్రక్కలొ
క్కంతగ నేలఁగూల దనుజాకృతి త్రాసునఁ దూఁప భూతముల్.

175


వ.

ఇట్లు.

176


చ.

అతిశితచక్రధార నరకాసురు వ్రక్కలు చేసి డాసి దై
వతపతి కింక రక్కసుల వాఁడిమి పొడిమి మాల్చి గెల్చి యూ
ర్జితవిహగేంద్రపక్షపరిశీతలమారుతచారుతానికి
రితసమరాంతసంతతపరిశ్రముఁ డై హరి యున్నయత్తఱిన్.

177


సీ.

మాఁగువాఱిన చంద్రమండలంబునుఁ బొలె
                 వదనారవిందంబు వన్నె దఱుఁగ

మకరందమున నిండుమధుకరంబులుఁ బోలె
                 నేత్రోత్పలంబులు నీటఁ దేల
నెఱి దప్పి వ్రాలిన నీలమేఘమువోలె
                 గచభారబర్హ మగ్గలము వీడఁ
దొడఁగి చాలఁ జలించు తొండంపుగవవోలె
                 నూరురంభాస్తంభయుగము వడఁకఁ


తే.

గడఁక లేనితనూవల్లి ఘర్మజలము
దళముగాఁ జిందఁ జెందనితాల్మితోడ
వగపుచిత్తరువో కళవళముకరువొ
యనఁగ నొకకాంత గానంగ నయ్యె నంత.

178


వ.

ఇవ్విధంబున నవ్వామలోచన వసుదేవనందను ముందట నిలిచి.

179


క.

అమరారి చెవులముందఱఁ
గొమరారి వెలుంగు నమృతకుండలముల న
త్తిమిరారిద్వయ మన నె
త్తి మురారికిఁ జూపి యపుడు దెలియఁగఁ బలికెన్.

180


ఉ.

ఏను వసుంధరన్ యదుకులేశ దయాకర సూకరాకృతిం
బూనిననాఁడు నీవు ననుఁ బొందినఁ బుట్టినవాఁడు వీఁడు నీ
చే నపరాధుఁ డైన మఱి చెప్పెడి దెవ్వరికింకఁ గింక లో
నూనఁగ నీక కుండలము లొప్పఁగ నొప్పన గొమ్మ క్రమ్మఱన్.

181


గీ.

అకట యిచ్చివవాఁడు దయ్యంబ కొన్న
వాఁడు దయ్యంబఁ దీనికి వగవ నేల?
కాలపా[82]కంబు దప్పింపఁ గమలనాభ!
నాదు దుఃఖప్రలాపంబునకుఁ దరంబె.

182


క.

తనయుని[83]కి పదిలముగ నా
తనయునికిం గలుగ దితనితనయునికైనన్

వనజోదర యాదరమునఁ
గనుఁగొని ప్రాగ్జ్యోతిషంబు గరుణింపఁదగున్.

183


మ.

దివిజుల్ దల్లడిలం దదీయజనయిత్రీకుండలద్వంద్వముం
జెవులం బెట్టికొనంగ రూపగుట సూచెం గాని యాతప్పు నీ
చెపులం బెట్టికోనంగరాని రివు గాసిం బెట్టి కట్టిండి నా
సవుఁ డెట్టుం దనుఁ జంపజాలు టితఁ డెంచం జూడఁ డింద్రానుజా.

184


గీ.

శత్రులకుఁ బుత్త్రులకు నొక్క సందమగుట
పెద్దలకు మంచి గుణమని పేరుకొనఁగ
సకలదానవసంఘంబుఁ జంపినట్లు
కొడుకుఁ జంపితి మునికోటికోర్కి దీర్ప.

185


క.

అట్టేల జగము లన్నియుఁ
బుట్టింపం బెంపఁ బురుషులు ముగురై
పుట్టిన వేలుపవఁట నా
పట్టియెడం దగునె నడిమిపని మానుటకున్.

186


గీ.

కన్నమోహంబు విడువదు గాన యేనును
వగపుమై నెంతదూరిన వనజనాభ!
నెలవు లే దింక గజతలసేతుబంధ
నంబు చేసిన నాదట నవ్వుఁబాటు.

187


వ.

అనిన విశ్వంభరుఁడు దేవీ నరకాసురునకు వగవం బనిలేదు వాడు సురముని
వర్గంబునకు నెగ్గు చేసెం గావున వధియింపవలసె దుష్టశిక్షణంబును శిష్టరక్షణంబు
నుం జేయ నవతరించిన నాకుం బుత్త్రమిత్త్రాదు లని చూచుట ధర్మంబుగా
దీయర్థంబు నీ వెఱింగి నదియ యదియునుంగాక కాలంబు గడవ నెవ్వరికి నశక్యం
బని యూఱడిలం బలికి నరకాసురతనయుండగు భగదత్తునకుం బ్రాగ్జ్యోతిషం
బొసంగి వసుంధరాకాంత వీడ్కొని నిజపురంబున కభిముఖుండై చనుదెంచు
నప్పుడు వైనతేయుఁడు నభోమండలమున మురళి భంజళి కాసుడాల వల్గితంబు

లనుగతివిశేషంబుల రా నమందానందంబున రైవతకసమీపంబునకు వచ్చుటయు
హరిరాక యెఱింగి బలభద్రసాత్యకిప్రముఖసోదరులు ప్రద్యుమ్నసాంబానిరుద్ధాది
పుత్త్రపౌత్త్రవర్గంబును యదువృష్ణిభోజాంధకానీకంబునుం జతురంగబలసమేది
తంబుగా నెదుర్కొనుటయుం బరస్పరవాహనావతరణంబులు చేయునెడం గృష్ణుండు
బలభద్రునకు నమస్కరించి గాఢాలింగనమ్ముఁ జేసి తనకు మ్రొక్కిన సాత్యకి
ప్రద్యుమ్నసాంబానిరుద్దారుల దీవించి యదువృష్ణిభోజాంధకవర్గంబులం దగు
తెఱంగుల నాచరించి బలభద్రాదులు నిజవాహనంబు లెక్కం దానును గరుడాధిరో
హణంబు చేసి వందిమాగధసందోహస్తుతిరవంబులును వేణువీణాగానంబులును
భేరీమృదంగాదినిస్వనంబులును రోదోంతరాళంబు నిండ నిండువేడుకతోఁ బుర
ప్రవేశంబు చేయునెడం జంద్రశాలికల బాలికలు సేసలు చల్లం జామరానిలంబులు
మార్గశ్రాంతి నపనయింప రాజమార్గంబు దఱిసి నిజమందిరతోరణంబున సుపర్ణావత
రణంబు చేసి సకలజనంబుల నిజనివాసంబులకు ననిచి సత్యాసహితంబుగా నంతః
పురంబునకుం జని సముచితవ్యాపారంబుల సుఖం బుండె ననుటయు విని యభిమన్యు
పౌత్త్రుండు సంతోషపులకితగాత్రుండై మునీంద్రా తరువాతివృత్తాంతం బెఱింగింపు
మనుటయు.

188


[84]శా.

పారావారనగాధిరాజతనయాపాంగేక్షణోదంచిత
శ్రీరాజత్పులకావళీవరతనుప్రీతిప్రకాశాంతరా
కారుణ్యామృతవర్షి భాషణవిధా కళ్యాణరత్నాకరా
దూరీభూతతరాంతరాయనివహా దుష్టాత్మశిక్షాపరా.

189


క.

[85]చక్రపరశ్వథయుతదో
ర్విక్రమజితదానవేంద్ర వివిధవినోదా
పక్రాంతహృదయ భావ్యా
శక్రప్రముఖామరౌఘ సతతనిషేవ్యా.

190

[86]మాలిని.

జలధిగిరినివాసా చంచదుద్యద్వికాసా
విలసితదరహాసా వృత్తసచ్చిద్విలాసా
ప్రళయబహుళరూపా పండితాంతఃప్రదీపా
దళితవివిధపాపా దైత్యసంహారికోపా.

191


[87]గద్యము.

ఇది శ్రీ మదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధానవి
రాజితిక్కనసోమయాజీప్రణీతం బైన శ్రీమహాభారతకధానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణసాహిత్యరసపోషణసంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచనసోమనాథ ప్రణితంబైన యుత్తరహరివంశంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. మునుబా
  2. ప్రాణు
  3. విస్మయవికచాటవిఖేలనంబున
  4. జీల్చి
  5. బల
  6. సె నవ్వా
  7. పఱపిన
  8. క్కంతకంతకు
  9. గూడి దివ్యపురంబుపై దాడి వచ్చి యేచి
  10. నమరుద్గణంబు
  11. సురబలముల నట్టిట్టు వడంగఁజేసి యసి
  12. పఱపి
  13. పరశ్శతము
  14. పూంచి
  15. బొత్తన మటు గట్టితొలఁగె
  16. నయిది
  17. బలిపోరిన
  18. డస్సి
  19. డా
  20. డ వ
  21. శా
  22. శా
  23. రా
  24. నా
  25. మొన
  26. నేడు
  27. రంభమునూప నీడుగని
  28. ట నే
  29. నఁ దెలిసి
  30. కమిడుక
  31. వారంబులును
  32. మేనిలో
  33. ఱు
  34. యు
  35. పు
  36. పు
  37. ముదురు
  38. వీడు టె
  39. వొడలు గులుకుచు నిక్కున్ (మెచ్చున్)
  40. పోలఁ దొ
  41. లీసొమ్ము లం
  42. కడసారె
  43. వేన్ము
  44. దలంతురే
  45. దఱిని
  46. మణుల సంగతిసేవ యొనర్తు
  47. సుఖనీరాజ
  48. కదిసి గంధర్వుఁ డనుచు నక్కన్వఁ దెచ్చి (కదిసి కందర్పురూపునం గన్యఁ దెచ్చి)
  49. వరదంతావళ
  50. బలుఁడు
  51. ధరామరేశ్వరుల దండిం బిల్చి (ధరామ రామరుల వెట్టింగొంటి)
  52. జూతు
  53. విన మెన్నఁడు మున్నిట్టివి కన మెన్నఁడు గోరవిట్టి కర్జము సేయన్.
  54. క్రవ్వలు
  55. గోఁచు
  56. గూడరాఁ జ
  57. సుదాశార్హ
  58. వేవేగఁ బ్రద్యుమ్నుఁ డా
  59. బరికరింప
  60. సాత్యకిని నాప్రద్యుమ్ను నక్రూరునిన్ (a) సత్యకసుతున్ రాజేంద్రు నయ్యాహు, (b) సాత్యకిని.
  61. వంక
  62. కొండల
  63. డాపలకు (దెంపలకు); డంపులకు; చెంపలకు.
  64. వేది
  65. మురు పాళెముల
  66. యం, తప చక్రం బటుమీఁద వైచుటయు
  67. డాదిగొని
  68. యెప్పరుస పట్టయి
  69. విఱిచి
  70. దట్టాడు చిట్టాడుచున్
  71. ప్నచంపక సజ్జక
  72. గెలిచిన
  73. వెఱచి
  74. దు
  75. పుఁదెంపు (బుఁ దెలుప)
  76. ఘర్మ
  77. గొడగు
  78. దెగ నిండ గోల
  79. నుబ్రేమనీ(వీ)
  80. గరుడని
  81. శంబు దప్పదు—నకుఁదలంచి
  82. కిం బదిలము
  83. ఈ పద్యము పంచమాశ్వాసాంతమందు నున్నది.
  84. ఈ పద్యము చతుర్ధాశ్వాసాంతమందున్నది.
  85. ఈ మాలిని చతుర్ధాశ్వాసాంతమందున్నది.
  86. వ్రాఁతప్రతులలోఁ బ్రథమాశ్వాసము సంపూర్ణము గాకుండుటచే శ్రీ కం. వీ. గారో మఱెవరో వచనమునుఁ క్రొత్తగా రచించియు, 5, 6 ఆశ్వాసముల నుండి యీయాశ్వాసాంతపద్యములఁ గయికొనియు సంపూర్ణపఱచియుందురు.