ఆ భా 8 1 061 to 8 1 090

వికీసోర్స్ నుండి


8_1_061
సీ. అనుటయుఁ గాక మిట్లను హంసముల తోడ గతులు నూటొక్కటి గలవు వాన
నొక్కొటొక్కట శతయోజన వ్యాప్తి నే మెఱయుదుఁ బొడవుగా మీఁది కెగసి
చనుట యచ్చటనుండి చక్క నేలకుఁ జోడు వట్టి డిగ్గుట దూర పాత భంగి
సంగతి పరువడి చారు లీలావతి వక్ర యానము వలయక్రమంబు

ఆ. లోను గాఁగ నెట్టు లైనను మీ కోరి
నట్ల పఱచి మేటియంచ యైన
దాని నిపుడ గెలుతుఁ దక్కటియంచలు
భయము వొందఁ గాకి పదువు వొంగ.

కాకము హంసతో సముద్రము మీఁదఁ బఱచి భంగవడుట

8_1_062
వ. అనుటయు విని మున్నాహూతం బైన హంసం బక్కాకంబు నాలోకించి.

8_1_063
ఆ. నూఱు గతుల నీవు వాఱు దే నన్నియు
నెఱుఁగఁ బులుఁగు లెల్ల నెట్లు వాఱు
నడరి యాకసమున నిడుబాట నట్ల పా
ఱుదము రమ్ము జలధి చదల ననిన.

8_1_064
వ. అయ్యెడం గూడిన కాకంబు లపహసించి శత ప్రకార గతి యగు దీనితో నేకయాన పర్యవసాన హీన సముత్సాహ దోహలి వగు నీ వెట్లు నుచ్చరించెదవు పఱచి భంగ పడియెదవు గాక యనుటయు నమ్మరాళం బాగమిం బాసి పఱపఁ దొడంగినం దోన యవ్వాయసంబునుం బఱచె నిట్లు రెండును మున్నీటిపై మిన్ను దఱిసి పాఱునట్టియెడ.

8_1_065
క. రాయంచ మందగతిఁ జను
వాయస మతి తీవ్ర భంగి వలను మెఱసి లీ
లీయితము లొప్ప బహు గమ
నాయాసము నొంది పఱచు నగ్గలిక మెయిన్.

8_1_066
ఆ. ఎలమిఁ గడచి పోవుఁ బిలుచుఁ గ్రమ్మఱి వచ్చి
ముక్కు ముక్కు మీఁద మోపు జుట్టు
నేచి తిరుగు నీఁక లీఁకలతో రాయు
నొరయుఁ జిత్ర గతుల మురియు నవ్వు.

8_1_067
వ. ఇవ్విధంబునం గాకం బనేక ప్రకార ప్రసరణ చతురంబై సంచరించుటం జూచి ముదితంబు లైన వాయసంబు లధిక స్వరంబుల మెఱయుచు హంసంబుల గేలిగొని నవ్వుచుఁ దరువుల పయిం ద్రుళ్లి ద్రుళ్లి యాడుచు మరాళంబు పరాభవంబుఁ బొందెడుఁ జూడు డని పెద్ద యెలుంగునం బలుకు చుండఁ దదీయ కలకలం బాలించి హంసంబు భరితోత్సాహం బై.

8_1_068
క. పొడవునకు నెగసి యెప్పటి
పడమటి దెస నిగిడి పెలుచఁ బఱిచినఁ గూడం
గడు రయమునఁ జని యంచం
గడవం గా కీలకఱచి కాకము పాఱున్.

8_1_069
వ. పాఱి పాఱి డయ్యుటయు నయ్యంచ యుదంచిత త్వరిత గమన కళా వైదగ్థ్యంబు మెఱయం బఱచిన బీఱువడి కాకం బాకులాంతరంగంబును వికలాంగంబును నై యిట్లని వితర్కించు.

8_1_070
క. నేరక తొడరితిఁ గాల్కొని
భూరుహమును లతలు గిరులుఁ బొదలేమియు లే
వారయ బహు సత్త్వమయము
వారిధి డిగి సోఁకినపుడ వలయుం బొలియన్.

8_1_071
వ. అనుచు దీన మానసం బయి భయంబునం గలంగి డప్పి సొగసి యవశత నంతకంతకు డిగుచు చున్న యక్కాకిం గనుంగొని కల హంసం బిట్లనియె.

8_1_072
ఆ. నీ వనేక గతులు నేర్తిది యేగతిఁ
జనుట చెపుమ వాయసంబ యేను
గడవ నరిగి పిలువఁ గా నేల తడసెద
వెఱక లేటి కిట్టు లెడల విడువ.

8_1_073
వ. అనిన నట్టియెడ.

8_1_074
క. తలకొని జలమును పక్షం
బులు దుండము దోఁక సోఁక బొరిఁ బొరి నెగయన్
బలమఱి మెయి దిగఁ బడఁగా
సొలసి యెగయ లేక వాయసుఁడు వెగడొందెన్.

8_1_075
వ. ఇట్లు మున్నీటి నీటి పయిం బడి యగ్గలం బగు దురవస్థకు బెగ్గలంబు నొందు కాకంబు నాలోకించి పలుక నగుం గాక పలికినట్లు యెవ్వరికిఁ జేయఁ దీరుఁ బని దీరెం గదా యనిన రాయంచకు నక్కాకం బిట్లనియె.

8_1_076
క. ఎంగిళులు గుడిచి క్రొవ్వునఁ
బొంగిన మెయి తోడ గర్వమునఁ దిరుగుచు నా
కు గలదె యెందు నెదురు వి
హంగమ పతి నైన గెలుతు నని మును దలఁతున్.

8_1_077
క. నా కొలఁది యిప్పు డెఱిఁగితి
నీ కరుణా లోకనంబు నిగిడించి శర
ణ్యా కావు నన్ను మగుడం
గాకులలోఁ గలుపఁ దగవు గాదే నీకున్.

8_1_078
వ. అని యిత్తెఱంగున.

8_1_079
క. ఆకలతఁ బొంది పలుకుచుఁ
గా కా యని చంచు దెఱపగా నఱచుచు నీ
రాకరమున మునిఁ గెడున
క్కాకిం గలహంస పరమ కారుణ్యమునన్.

8_1_080
క. వెరవునఁ దత్తనువుం దన
చరణంబుల నిఱికి యెత్తి చా వుడిపి బల
స్ఫురణంబు మెఱయ వీఁపున
ధరియుంచుచు వచ్చెఁ బక్షి తతులు నుతింపన్.

8_1_081
వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి రాయంచ యక్కాకి దెప్పిఱిన దానిచో నచ్చటి కాకులు విన నింక నిట్టియ విసయంబు లెన్నండును జేయకు మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం దానును వలయు చోటికిం జనియె నీవు నా కోమటి కొడుకుల యెంగిలి కూటం బెరిఁగిన యక్కాకంబు చందంబునఁ గురు కుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి యెక్కుడు వారల ధిక్కరించెదవు నీ కొలఁది యెఱుంగవు దీనం జేటు వాటిల్లుఁ గాన తెటపడ నెఱింగించెద నాకర్ణింపుము.

8_1_082
చ. విరటుని గోవులన్ మరల వెల్చి మదంబున నీదు తమ్మునిం
బొరిగొనఁ బార్థుఁ దాఁక కెట పోయితి నాఁ డల ఘోష యాత్ర లో
గురుపతి డించి క్రీడి కృపకుం దగు పాత్రము సేసి యెక్కడన్
సురిఁగితి చెప్పుమా నిజము సూత తనూభవ నాకు నేర్పడన్.

8_1_083
వ. అని వెండియు.

8_1_084
చ. పనివడి జామదగ్న్యుఁడు సభన్ వినిపింపఁడె మీకు నెల్ల న
ర్జును భుజ వైభవంబు మధుసూదను పెంపును నాఁడ ద్రోణ శాం
తనవులుఁ జెప్పరే బహు విధంబుల వారల గెల్వ రామి మున్
వినమె యెఱింగియున్ మఱియు వీఱిఁడి మాటలు వేయు నేటికిన్.

8_1_085
క. ఒంటిమెయిఁ దాఁక నా ము
క్కంటికి వశ మగునె కృష్ణ గాండీవున ని
ట్లంట యుడిగి తగు రథికుల
జంటగొని రణమ్ము సలుపు శత్రులు దలఁకన్.

8_1_086
తే. గొంతి కొడుకును దేవకి కొడుకు మనము
గనియెదము దినకర నిశాకరులుఁ బోలె
వెలుఁగ నయ్యెడ ఖద్యోత విలసితంబు
తోడి దగుఁ గాక నీ పెంపు దోఁపఁ గలదె.

8_1_087
వ. అనిన విని కర్ణుండు గమల నాభుని పెంపును బార్థుని బలిమియు నెఱుంగక యేనే వారిఁ దొడరెద నెట్లు చెప్పినను దొడరుదుఁ దొడరి వా రొండె నే నొంటె నగుదు నింతియ నీవు వెడమాట లాడక యుడుగు మని పలికి యచ్చటి మహీపతులు వి నమ్మద్రపతి కిట్లనియె.

- కర్ణుఁడు శల్యునితోఁ దనకు గలిగిన శాపంబుల తెఱంగు సెప్పుట –

8_1_088
సీ. తలఁచిన నెదకు సంతాపంబు సేయంగఁ జాలెడు నట్టివి జామదగ్న్యు
కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక యే సరకు గొందునె మురహరుఁ గిరీటిఁ
జెప్పెద విను మస్త్ర శిక్షార్థి నై మహేంద్ర నగంబునకు జమదగ్ని సుతునిఁ
గోరి పోయినఁ గృపాంభోరాశి యగు నమ్మహాముని గులము నన్నడుగుటయును

తే. బొంకునకు నోర్చి బ్రహ్మాస్త్రమునకుఁ గాఁక
బ్రాహ్మణుఁడ నని చెప్పి తత్పాద భక్తి
గలిగి మెలఁగంగ శిక్షించె నలఘు బహు వి
థాస్త్ర శస్త్ర సంవేదిఁ గా నతఁడు నన్నుఁ..

8_1_089
వ. భర్గవాభిథానం బగు మహాస్త్రంబు లోనుగా ననేక దివ్యాస్త్రంబు లిచ్చెఁ బదంపడి బ్రహ్మం బగు నస్త్రంబు నొసంగె నొసంగి సమరంబున నాపత్సమయంబున దీని బ్రయోగింపు మని యానతిచ్చె మఱు నాఁ డత్తపోధన సత్తముండు మదయాంక తలంబున నొఱగి నిద్రించు చుండ నొక్క జంతువు నా క్రింది తోడఁ దొలిచిన నమ్మహాత్మునకు నిద్రా భంగం బయ్యెడు నని కదల కుండితిఁ దదనంతరంబ మేలుకని యతండు నెత్తుటి వెల్లువఁ గని తత్ప్రకారం బడిగి యేను జెప్ప విని మద్ధైర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు గా వెవ్వఁడవని యొత్తి యుడుగుటయు వెఱచి సూత సుతుండ నని చెప్పితిఁ జెప్పు నప్పు డక్కీటకంబు నాలోకించిన నది యదృష్ట పూర్వ వికృతాకారం బై యుండె నర్జున హితంబు గోరి యింద్రుం డమ్మునీంద్రునకు నన్నుఁ దేటపఱచి యతనిం గోపింపం జేయువాఁ డై కీట తనువు దాల్చి యట్లు సేసెం గానోపు నా సంయమి గోపించి కపటంబున బ్రహ్మాస్త్రంబుఁ బరిగ్రహించి తది నీకు వలయు కాలంబున దోఁపమియు మృత్యువాసన్నం బైనం దోఁచుటయు నాపద ముట్టిన యెడ భార్గవాస్త్రంబు దోఁప కుండుటయుం గలిగెడు మని శపించె నిది జామదగ్న్యు కోపంబు తెఱంగు బ్రాహ్మణ శాపంబు తెఱం గెఱింగించెద నాకర్ణింపుము.

8_1_090
సీ. శ్రమమునకై యేను సకలాంబకములు నెక్కుడు వెస సేయ నయ్యెడకు నొక్క
యాఁ బెయ్య యుఱికి నా యజ్ఞానమున సంపతాఁకునఁ గూలుడు దానిఁ గలుగు
బ్రాహ్మణుం డధిక కోపంబున నిది హోమధేను వత్సం బిట్లు దీని శల్య
నిహతంబుఁ జేసితి నీవు నా వచన శల్యంబున నిహతుండ వగుము నీకు

తే. సమర మేకాగ్ర నిర్భరోత్సాహ వృత్తి
నడవ నరదంబు చక్రంబు పుడమిఁ గ్రుంగ
వలయు నెవ్వీరు మార్కొని గెలువఁ గోరి
శ్రమము సేసెద వతని చేఁ జావు మీవు.