ఆ భా 7 5 331 to 7 5 360

వికీసోర్స్ నుండి

--రానారె 17:00, 15 ఆగస్ట్ 2006 (UTC)


7_5_331

వ. చెప్పి యప్పుడు ధర్మనందనధనంజయులు వారింప నతం డుడుగక యట్లు

సేసె ననియు నెఱింగించి యిట్లు భారద్వాజుండు పడిన బలంబులు విఱిగె

నేమును నిరుత్సాహుల మయితి మేనుంగుపేరినెపంబుగా నట్టిమాట

పుట్టుట కృష్ణకృతం బయినకపటోపాయంబు గానోపు నని యంతయు

నేర్పడం బలికె ననుటయు ధృతరాష్ట్రుండు సంజయుదిక్కు మొగం బై.


7_5_332

మ. వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ శ్రీరాముతో

సరిసేయం దగువాఁడు దండ్రితల పాంచాలాత్మజుం డట్లు ని

ష్ఠురుఁ డై పట్టె ననంగఁ ద్రుంచె నన వించున్ వారితో గూడ నా

తురుఁ డై పోయెనొ పోక నిల్చి యలుకన్ దోర్దర్పముం జూపెనో.


7_5_333

క. తను నాధృష్టద్యుమ్నుం

దునుముటకై కోరికనియె ద్రోణుఁడు పరమా

స్త్రనిరూఢిఁ బరశురాముఁ డ

తని కిచ్చినయంతవట్టు దన కతఁ డిచ్చెన్.


7_5_334

వ. అట్టిజనకు నాద్రుపదనందనుం డట్లు సేసిన నక్కొడు కెట్లు సేసెనో విన

వలతుం జెప్పు మనవుడు నమ్మహీపతి కతఁ డి ట్లనియె.


7_5_335

తే. కృపునిపలుకులు విని దట్టకెంపు గదురు

గన్నుఁగవ నశ్రుజలములు గ్రమ్ముదేరఁ

బాణితలమున నొత్తి నాద్రోణతనయుఁ

డిట్టు లనుఁ దగఁ గౌరవాధీశుతోడ.


7_5_336

ఉ. చావులు లేవె యెందు ననిఁ జచ్చుట యొప్పదె యిట్లు లోకసం

భావితు నమ్మహాత్ముఁ దల వట్టె నొకం డనువాఁడి మాట య

మ్మైఁ వడిఁ దాఁకి చిత్తమున కార్తి యొనర్ప సహింపరాదు గా

కే విన నున్కి వాఁ డెఱుఁగడే నను నిమ్మెయి భంగపెట్టునే.


7_5_337

క. నాదివ్యాస్త్రంబులు బా

హాదర్పము నింకఁ గాల్పనా గురుఁ డాజిం

దా దిక్కుమాలి పగతుని

చే దైన్యముఁ బొందె నటె యిసీ యేమందున్.


7_5_338

క. దీనికి మూలము ధర్మజుఁ

డానిక్కము గల్గురాజు నని దండితుఁగా

నే నెట్లు సేసి పుత్తునొ

కో నాచిత్తము కలంకయును నెవ్వగయున్.


7_5_339

ఆ. పుత్రుఁ గమట యెల్ల శత్రునిచేఁ దల

వట్టి తాను దునుమఁ బడుట కయ్యె

నస్త్రగురునకింక నన నేమి గలదు నా

యిచ్చుబాస కౌరవేంద్ర వినుము.


7_5_340

మ. హరియుం బాండవులున్ మదీయపటుబాహాశక్తిదివ్యాస్త్రని

ర్భరసంతాపపరీతు లై యొదుఁగ ఘోరస్ఫారసంక్రీడఁ ద

త్తురగస్యందన వారణప్రకరముల్ ద్రుంగన్ విజృంభించెద

న్సురసంఘంబులు వచ్చి యడ్డుపడిన న్దుర్వారదర్పోద్ధతిన్.


7_5_341

క. తనుఁ దాన చెప్పికొను టొ

ప్పనిపని యగు నైనఁ దండ్రిపరిభవము

గనరు గదిరి యి ట్లంటిని

విను మే నే మనిన నేమి వృథవో దధిప.


-: అశ్వత్థామపూన్కివలనఁ గౌరవయోధులు మరల ననికిఁ గడంగుట :-


7_5_342

వ. అని పలికి మఱియు ని ట్లను మాతండ్రి నారాయణు నారాధించి

యొక్కమహాస్త్రంబు వడసె నది నాకు నిచ్చె నద్దివ్యసాధనంబు వధ్యు

లవధ్యు లను విభాగంబు లేక విరోధివిధ్వంసనంబు సేయుఁ దత్ప్రయోగం

బున జయంబు సేకొననియెదం జూడు మనుటయు నమ్మహీపతియు ననుజుల

సేనాపతులును శంఖంబులు పూరించి సిణనాదంబులు సేసి మరలిన

భేరీమృదంగాది తూర్యధ్వనులు నింగిముట్టఁ దురంగరింభారథనేమిగజపద

ఘట్టనంబుల నేల గ్రక్కదల మనసైన్యంబులు మరలి యురవడించె ననిన

విని ధృతరాష్ట్రుండు.


7_5_343

ఆ. అట్లు గడఁగు కౌరవానీకములఁ గని

పాండుపుత్రు లేమిభంగివార

లై రెఱుంగఁ జెప్పు మనవుడు నమ్మహీ

శ్వరున కిట్టు లనియె సంజయుడు.


7_5_344

వ. ఇత్తెఱంగునం గురుబలంబులు పురికొనం గౌంతేయులుం గూడుకొని

సైన్యంబు సుసంగతంబు సేసికొని సంగరక్రీడ కమరి రప్పుడు గ్రీడి

నాలోకించి ధర్మతనయుండు.


7_5_345

క. గురుఁడు వడిన నవ్విధమునఁ

బరమభయాకులతఁ బొంది పఱచియు నట వే

తిరిగి కురుబలము పోరికిఁ

గర ముద్ధతి నగ్గలింపఁ గత మెయ్యదియో.


7_5_346

క. ఇలయును నింగియు నద్రువం

జెలఁగె మహారవము వారిసేనల గురుచా

వలుక నొనర్చిన నక్కడ

బలరిపుఁ డేతెంచి తోడుపడి నడచెనొకో.


7_5_347

వ. అనిన విని యమ్మనుజపతికి నతం డి ట్లనియె.


7_5_348

ఆ. న్యస్తశస్త్రుఁ డైనయాచార్యు జంపిన

నెవ్వ రొక్కొ వారి కివ్విధంబు

బలిమి గలుగఁ జేసి రలుక మై ననుచు సం

దియము పడగ నేల తెలియ వినుము.


7_5_349

చ. జనకు నధర్మవృత్తి మెయిఁ జంపుటకై తల వట్టె నొక్కరుం

డన విని రిత్త వోవునె మహాద్భుతశౌర్యము నస్త్రవీర్యమున్

మనము జగంబుఁ గన్నయతిమానుషవిక్రమశాలి వీని నె

వ్వని కెదురంగ రా దనఁగ వ్రాలిన ద్రోణసుతుండు భూవరా.


7_5_350

తే. జన్మవేళన యాతఁడుచ్చైశ్శ్రవంబు

భంగి హేషించెఁ బ్రుథివి గంపంబు నొంద

నప్పు డతని కశ్వత్థమ యని యొనర్చెఁ

బేరు జనములు విన నశరీరవాణి.


7_5_351

వ. అతఁడు సూవె కౌరవసైన్యంబు నిప్పటిసంరంభంబునకుం గారణం బని

చెప్పి వెండియు.


7_5_352

ఆ. అనఘ నిన్ను శిష్యుఁడును ధార్మికుండు స

త్యవ్రతుండు నని మహాదరమున

నడిగె నీవు ధర్మహానికి నోర్చిన

గురుఁడు నిశ్చయించెఁ గొడుకుచావు.


7_5_353

క. చలము గొని యిట్లు వడయఁగ

వలయునె రాజ్యంబు దీన వచ్చినకలిమిం

గలుగునె పెంపుం బేరును

వెలి యైతిమి లోకమునకును వేయును నేలా.


7_5_354

వ. అదియునుం గాక.


7_5_355

మ. వల దిట్లే లని యేను బేరెలుఁగునన్ వారించుచుం బాఱఁగాఁ

దల యిట్లేటికిఁ బట్టి త్రెవ్వ నడిచెన్ ధర్మప్రణాశం బెదం

దలఁపం డాగ్రహవృత్తిఁ బార్షతుఁడు దద్దైన్యంబునం గ్రోధవి

హ్వలుఁడై యీతనిపై వడిం బడక యశ్వత్థామ సైరించునే.


7_5_356

క. మనసేనల నొక్కెత్తునఁ

గొనఁ దలఁచి కడంగి వచ్చుగురుపుత్రుని మా

ర్కొన ధృష్టద్యుమ్నునిఁ గా

వను శక్యమె నీకు నిచటివారికి నధిపా.


7_5_357

వ. అనినం గోపించి యనిలనందనుం డాసంక్రందననందనున కిట్లనియె.


7_5_358

చ. అడవులనుండు తాపసులయట్టులు వల్కెదు రాజనీతి యి

ట్టొడఁబడి చేయ వచ్చి వథ కొల్లమి యొప్పునె ధర్మనిష్ఠ యె

క్కడఁ గల దాసభన్ ద్రుపదకన్యకపాటున కిట్టి వెన్నియుం

గడుకొని చేసినన్ మనలఁ గల్మష మొందఁగ నేర దర్జునా.


7_5_359

తే. అరులు మనమీఁద నురవడి నరుగుదేర

నేము సిడిముడిపడుచుండ నిట్టు లనుట

యొప్ప దురిసినపండుల మప్పు వెట్టె

దరయ దీనికి నిన్ను నే మందుఁ పార్థ.


7_5_360

క. కురువీరు లెఱుఁగుదురు ననుఁ

గుఱువీరులతెఱఁగు నేనుఁ గొంత యెఱుఁగుదున్

శరపరిఘప్రహరణములఁ

బొరిగొనియెదఁ గాక వారిఁ బోనిచ్చెదనే.