ఆ భా 7 5 241 to 7 5 270

వికీసోర్స్ నుండి

--ప్రకాశ్ స్వామినాథన్

7_5_241

క. పిలిచికొనియైనఁ బార్థుం

బొలియింపఁడ శక్తి నతఁడు పోరికి నెవ్వా

రలు రమ్మన్నను వ్రత మయి

తలకొని చనుఁ గర్ణుఁ డేల తప్పంజేసెన్.


7_5_242

వ. అని వెండియు.


7_5_243

తే. నాతనూజులు దుర్బుద్ధులీతెఱంగు

నీవుఁ దలఁపవ యాశక్తి నీరజాక్షుఁ

డొడిచికొనియెనె మొఱకుచే నున్నతియ్య

పండు వెస నాఁచికొనిన నేర్పరియుఁ బోలె.


7_5_244

వ. అనిన నమ్మహీపతికి సంజయుండిట్లనియె.


7_5_245

తే. రాత్రు లీపని కర్ణుతో రాజు ననుజ


సమితియును నేనుఁ దగఁ జెప్పుదుము నరేంద్ర

యతఁడు లెస్సగ విని యెల్లి యక్కిరీటి

సచ్చుఁ బటుశక్తి నని బాస యిచ్చు మాకు.


7_5_246

వ. ఏము వెండియు నాకర్ణునితో నిట్లందుము వివ్వచ్చుండు సచ్చినం దక్కటి

పాండవులం దొక్కనిఁ బద్మనాభుండు పట్టంబు గట్టుం గావున ననర్థ

మూలం బగు నమ్మాధవుండు దెగిన జగతీరాజ్యంబు మనకు దక్కు నింద్ర

దత్తం బయినశక్తి నతని సమయించుట గార్యంబు.


7_5_247

క. అని చెప్పినయమ్మాటలు

విని యెల్లవిధముల గృష్ణవిజయులలో నొ

క్కనిఁ బొరివుచ్చెదఁ జూడుం

డనుచుఁ జనున్ సూతసుతుఁ డహంకారముతోన్.


7_5_248

తే. వినుము వేగిన సంగ్రామమునకుఁ బోయి

నప్పు డక్కర్ణునకు మాకు నందఱకును

దోఁప దాబుద్ధి వెండియుఁ దోఁచి మగిడి

వచ్చి శిబిరంబు సొరఁగ దైవంబుకతన.


7_5_249

వ. దైవం బన వేఱొకండు గలదె కృష్ణుండ యది యెట్లనిన నట్లర్జును

బోధించునప్పుడు సాత్యకి శౌరితో నాసూతసుతుం డీశక్తి యిన్నిదినంబులు

ధనంజయుమీఁదఁ బ్రయోగింపమికిఁ గారణం బేమి యని యడిగిన నతండు.


7_5_250

తే. వానివా రెల్ల నీపనివాని కెపుడుఁ

గఱపుదురు వాఁడుఁ బూన్కిమైఁ గడఁగి వచ్చు

దాఁకుదల నేను వారలందఱును మఱచు

నట్లు సేయుదు నరునకునై కుమార.


7_5_251

వ. అని పలికి ధృష్టద్యుమ్నాదులం బేర్కొని యాతనిం గలిపికొని సాత్యకి

నుద్దేశించి.


7_5_252

క. మీరును బ్రాణములు ద్రిలో

కీరాజ్యము నాదుబూద్ధికిం బార్థుక్రియం

గూరిమికిం బాత్రంబులె

యీరేయి గదా సుఖించి యే నిద్రింతున్.


7_5_253

వ. అని చెప్పె నట్లు గావున మనకుఁ బశ్చాత్తాపంబు వలన దనుటయు ధృత

రాష్ట్రుండు మీరు దైవోపహతుల రమ్మహాశక్తి దృణీభూతుం డగుఘటో

త్కచునకుగా వ మ్మయ్యె నింక మీవా రెవ్వరు నెప్పరుసున బ్రతికెదరు

చేయునదిలే దట మీఁదివృత్తాంతంబు సెప్పుమనవుడు నజ్జనపతికి సంజయుం

డిట్లనియె.


7_5_254

తే. భీమనందనుచావునఁ బ్రేముడించి

ధర్మతనయుండు బాష్పాంబుధార లడర

మేను డిల్లంబుగాఁ దేరిమీఁద వివశుఁ

డగుచుఁ జదికిలఁ బడుటయు నచ్యుతుండు.


7_5_255

వ. రయంబునం జని కరంబులం బొదివి యతని నాలోకించి.


7_5_256

క. ప్రకృతిజనునట్టు లిమ్మెయి

వికృతిం బొందంగఁ దగునె విను మిట్లయినం

జకితం బగు నీసైన్యము

సకలము లెమ్ముత్సహింపు సమరంబునకున్.


7_5_257

వ.నీవు వహించుగురుభారంబు దలంపక యింతయలంత నొందిన జయంబు

సేకుఱునే యనిన నతండు గన్నీరుకరతలంబున నొత్తికొని మెత్తనిమాటల

ఘటోత్కచుగుణంబులు గుణుతించి కామ్యకవనంబునను గంధమాదన

యాత్రను దమకుఁ జేసినసాహాయ్యం బుగ్గడించె వాఁడు నాకు భక్తుం

డేనును సహదేవుకంటెను వానికిం గూర్తు నట్టిపట్టి లే కున్న నాకు

శోకంబు గాకుండునే యని తత్ప్రతివీరునిదెసకు నెలసిన యంతరంగంబు

రోషాకాంత్రం బగుటయు నిక్కుమారు నిట్లు సేసిన యీదుర్జాతుండ

కాఁడె మున్న నభిమన్యువిల్లు నఱికి చిక్కువఱచి యబ్బాలునిం బలువుర

చేతఁ జంపించె నప్పుడు దవ్వుల నున్నసైంధవుని సవ్యసాచి సమయించె నది

దానికి మాఱుగా దీరెండుక్రూరకర్మంబులకుఁ గర్ణునిఁ గడికండలు సేయక

శాంతిం బొంద నేర్తునే యని బిగువుటెలుంగునం బలికి దిగ్గన లేచి

యాద్రోహికి నిన్నయు నేఁడును దోడ్పడినద్రోణుం దెగటార్పవలయు

నప్పనికిఁ బావని వోవునేసూతసూనుం డున్నెడకుం బోయెద నని శంఖం

బొత్తి చాపంబు పుచ్చికొని రథంబు నడప సూతు నియమించి చనుచుండె

నప్పుడచ్యుతుండు దమ తేరిపైకి వచ్చి వివ్వచ్చు నీక్షించి.

7_5_258

క. తనచేతన సూతుసుతుం

దునుముదుఁ గా కనుచు నలుకతోడ రయమునం

జనియెడు ధర్మసుతుండీ

తని నూరకు చూచుచునికి దగునే మనకున్.


7_5_259

ఆ. అని రథంబు పెలుచఁ జన నిచ్చె నట్లు క్రో

ధాంధవృత్తి నరుగునవ్విభునకు

సమ్ముఖంబు గాఁగ సత్యవతీసుతు

డరుగుదెంచి కరుణ నాదరించి.


7_5_260

వ. అతండు ప్రణతుండైన దీవించి యిట్లనియె.


7_5_261

సీ. అనిమిషనాథుఁ డిచ్చినశక్తి యర్జును సమయింపఁ గర్ణుండు సంగ్రహించె

నది యున్న దాన నయ్యాపద వాటిల్లె నేని నయ్యలఁత సహింప వశమె

యీఘటోత్కచునకు నింతియ కాలమైయానెసంబునఁ దెగటాఱెఁజూవె

యిట్లు మేలిదిదైవమిచ్చినదురితనిస్తారంబు నీకింత దలఁచి నీవు


ఆ. సంభ్రమంబు దక్కి సైన్యంబు దోడ్పడ

మనుజపతులఁ దమ్ములను సుహృజ్జ

నములఁ గూర్చికొని రణంబు సేయుము కురు

ప్రతతితోడ నీదుబలము మెఱయ.


7_5_262

క. కలఁక యుడిపి చిత్తము ని

ర్మలధర్మోదాత్తముగ నమర్చి నెగడు మె

వ్వలనఁ గలుగు ధర్మం బ

వ్వలనికి జయమంగళము లవశ్యముఁ గలుగున్.


7_5_263

వ. అని హితోపదేశంబు సేసి.


7_5_264

క. విను మేనగుదివసంబున

నినుఁ బొందు ననూనమేదిరాజ్యశ్రీ

యనుమాన మేమియును లే

దని గ్రక్కున నమ్మునీంద్రుఁ డరిగె నరేంద్రా.


7_5_265

వ. ఇటమ్మహాముని సనుటయు సావధానుండై పాండవాగ్రజుండు ధృష్ట

ద్యుమ్నుం గనుంగొని గురునిపురోభాగంబునఁ గౌరవసేన భీమసేనుండు

దాఁకి తెరల్చుచున్న వాఁడు నీ వక్కుంభసంభవుసంరంభంబు మాన్పుము

తద్వినాశం బాచరించుట కయి యనలంబున జనియించినవాఁడవు శిఖండి

ప్రముఖపాంచాలకుమారులం గొని యరవాయి గొనక యడరు మని పలికి

కెలంకుల నున్ననకులసహదేవద్రుపదవిరాటద్రౌపదేయశైనేయకేకయుల

నాలోకించి మీరుచు ఫల్గనపురస్సరంబుగా ద్రోణవధంబునకు గడంగుఁ

డనుటయు.


7_5_266

క. వారలు దమతమబలములుఁ

దారును గవియుటయు నత్యుదగ్రత గురుఁడ

వ్వీరానీకము మార్కొని

పోరికిఁ దనసైన్యసమితిఁ బురికొల్పి తగన్.


7_5_267

వ. బరవసంబు వాటించెఁ గురువిభుండును గోల్తల సేసె నప్పు డిరుదెఱంగుల

నాహినులును దగ యెత్తితూలంజొచ్చె నీసైనికులు డప్పియు నిదురయుం

గదిరి మేను లలయం గొందలంపడి రెల్లవారికినాత్రియామ సహస్రయామ

యయితోఁచె నట్లైనను నిజధర్మంబు ప్రతిపాలింప నడరి పెనంగుచుండిరి

నిద్రాపరవశత్వంబున దివియలవారును హీనప్రయత్న లైనం దమంబు

గవియం దొడంగె నట్టియెడం గునికి కునికి యాయుధంబులు వడ విడుచు

వారును వాహనంబులు వోయినట్ల పోవం దెరలువారును జొక్కునం

దమవారిం దామ యెదిరి పొడుచువారుచు మఱియు ననేకప్రకారంబు

లగువికలసంచారంబుల గాసి యగువారును నగుటయుం గని గాండీవి

యిరువాఁగు నుద్దేశించి యెలుంగెత్తి.


7_5_268

క. అడరెడునిద్రాభరమునఁ

గడు డస్సితి రెల్లవారుఁ గలనను జాడ్యం

బెడలఁగ జొక్కుమడఁపుఁ డి

ప్పుడ చంద్రుఁడు వొడుచు వెండి పోరుట యొప్పున్.


7_5_269

వ. అనిన విని మనవారలందఱు నట్ల మే లని కర్ణదుశ్శాసనుల యనుమతి

వడసి విశ్రమించిరి పాండవసైన్యంబును విశ్రామంబు నొందె గగనంబున

దేవగణంబు ధనంజయు ధర్మజ్ఞత్వంబు ప్రస్తుతించె నయ్యవసరంబున.


7_5_270

ఆ. కరుణ గలవు మమ్ము గారవంబున సుఖా

న్వితులఁ జేసి తనఘ నీకు సురలు

వరము లెపుడు నిచ్చువారు గావుత మనో

రథముఁ బొందు మమరరాజతనయ.