ఆ భా 7 4 151 to 7 4 180

వికీసోర్స్ నుండి


7_4_151

వ. అప్పు డమ్మేటి మగండు.


7_4_152

క. మన మూఁక దఱిసి యుద్ధతిఁ

జనఁ జన నీ నందనులు వెసం దాఁకియు ను

బ్బిన యతని వీఁక కోర్వక

కనుకని సిగ్గు సెడి పాఱఁగా గురుఁ డంతన్.


7_4_153

క. ఒండొకతే రెక్కి సము

ద్దండతఁ జని భీమసేనుఁ దాఁకి శరము లొం

డొండ నిగిడించి నొంచిన

గం డడఁగక యతఁడు కనలు గదిరిన మదితోన్.


7_4_154

చ. అరదము డిగ్గి యప్పటు శరావళి కోర్చి మొగంబు వాంచి స

త్వరుఁ డయి వాన పైఁ గురియ వంచిన మస్తక మొప్పఁ బోవు సుం

దర వృషభంబు లీలఁ జని దర్ప మెలర్పఁగ నొక్కచే నొగల్

వెరవునఁ బట్టి తేరు ప్రజ విస్మయ మందఁగ వీచి వైచినన్.


- భీముఁడు ద్రోణాది రథికుల నతిక్రమించి యర్జునుఁ జేరబోవుట –


7_4_155

ఆ. నుగ్గునూచ మైన నగ్గరుఁ డొండొక

యరద మెక్కి యల్ల నరిగె సేన

మొగమునకు రయంబు మిగుల విశోకుఁడు

దేర భీముఁ డెక్కెఁ దేరు ప్రీతి.


7_4_156

వ. ఇవ్విధంబున ధనురాచార్యు బెట్టు వఱచి బిట్టు సను నా కెట్టి బిరుదున

కెదుర్పం జాలక భోజ బలంబును గాంభోజానీకంబును యవనాది మ్లేచ్ఛ సైన్యంబులును

బసులు పులికిం బాఱు తెఱంగునం గలంగి పఱచె నట్లప్రతిహత గతిం బోయి సాత్యకి

సమరోల్లాసంబు గనుంగొనుచు నట కడచి యవ్వడ ముడి దివ్య రథంబు మెఱయఁ

గౌరవ్య యోధులతోడం బెనంగు సవ్యసాచిం జూచి సింహనాదంబు సేసిన నతనిం

గనుంగొని ప్రియంబున నయ్యర్జునుండును హరియును గర్జారవంబుల గగనంబు

నినిచి రమ్మహా రవంబు లాకర్ణించి యుధిష్ఠిరుండు భీముసంజ్ఞాపనంబునకు

సంతుష్టాంతరంగుండై తన లోనన యతని నగ్గించి యన్నరనారాయణుల

యెలుంగులు వినం గనుటకుం బొంగుచు నప్పార్థుండు దన ప్రతిజ్ఞ నెఱపి వచ్చి

తన్నుం గౌగిలించి కొనుటం గోరుచుం గౌరవపతి యిమ్మెయిం దమ్ములు బంధులుం

దెగం బొలియుట దెలిసి యయినను వీరునకుం జొచ్చి యున్న వారి నైనం గాంచి

కొనునొకో యని యూహించుచుఁ గయ్యంబు సేయుచుండె ననిన విని ధృతరాష్ట్రుండు

సంజయున కిట్లనియె.


7_4_157

ఆ. ఇట్లు సింహనాద మిచ్చిన భీముని

మార్కొనంగ మగఁడు మన బలమునఁ

గలిగెనేని మదాత్మజులఁ గాల్పఁ బుట్టిన

చిచ్చు వాఁడు వానిఁ జెనయ టరిది.


7_4_158

చ. అనవుడు నాతఁ డిట్టు లను నమ్మనుజేంద్రున కప్డు కర్ణుఁ డ

య్యనిల తనూజు మార్కొని రయంబున వింశతి సాయకంబు లే

సిన నతఁ డేడు తొమ్మిదులు చెచ్చెర నేసి సిడం బొకంట నే

పునఁ గుదియించె నా రథిక పుంగవు లట్లు దొడంగి యుద్ధతిన్.


7_4_159

వ. పెనంగునెడ భీమసేనుండు.


7_4_16 0

క. సూత సుతు విల్లు ద్రుంచిన

నాతఁడు బలువింట గొంచె నతని వెస మరు

త్సూతి యదియుఁ ద్రుంచుచుఁ ద

త్సూతునిఁ దురగములఁ ద్రుంచె దుర్దమ లీలన్.


7_4_161

ఆ. విరథుఁ డై యతండు వృషసేను రథ మెక్కఁ

బాఱుటయును గలఁగఁ బాఱె సేన

లట్టియెడ నృపాలుఁ డాచార్యు పాలికిఁ

జనియెఁ దేరు దోలికొని రయమున.


- దుర్యోధనుఁడు ద్రోణుని దూఱనాడుట –


7_4_162

వ. చని యడిచిపాటు గదుర నతనితో నిట్లనియె.


7_4_163

క. నరుఁడును సాత్యకియు వృకో

దరుఁడును మనసేనఁ గలఁచెదరు సైంధవుఁ జే

రిరి నీకుఁ దగునె నరునిం

జొరనిచ్చితయేని వారిఁ జొర నీ ననఘా.


7_4_164

క. సమరంబున నీ వోడుట

సముద్ర మింకుట జయించె సాత్యకి గురుఁ గ

య్యమున నని యెసఁగు జన వా

దను మేలుఁగ దలఁచి తొక్కొ ధనురాచార్యా.


7_4_165

క. ఈ భంగి నీ వడంగుట

మా భాగ్యము గాక యింక మాటలు వల దీ

క్షోభం బెట్టు లుడుగుఁ జెపు

మా భవదీయ బల శౌర్య మతులకుఁ దగఁగన్.


7_4_166

చ. అనవుడు నాతఁ డిట్టులను నక్కడ నిక్కడ నొక్క రూపునన్

మనమొన కైన యీ యెడరు మాన్పఁగ నోపిన యంత మాన్చెద

న్వినుము విశిష్ట కార్య మనవీవర సైంధవుఁ గాచికోల య

ర్జునునకు నీకునుం గలిగె జూదము నేఁ డధికంపుటొడ్టుగన్.


7_4_167

క. మును శకుని బుద్ధిమై గెలి

చిన యది యస్థిరపు గెలుపు సెడ కీ జూదం

బున వెడలఁ బాటు సూవే

మన వెరవును లావు కలిమి మనుజాధీశా.


7_4_168

వ. కావున నీవు సుస్థరోత్సాహుండ వై సాహాయ్యంబునకు నద్దెస నున్న కర్ణాదులం గొని

కవ్వడి మొదలగు నమ్మువ్వరకుం జాలి సింధు రాజ రక్షణంబు నిర్వహింపు మేను సేనా

ముఖంబున నిలిచి తక్కిన యందఱ నిలువరించుట మేలు నీతో వచ్చుట కర్ణంబు గాదు

పొమ్మనుటయు నతండు మరలి తన్నుం గాన పురికొలిపికొనుచు నట సనియె నప్పుడు

యుధామన్యుండు నుత్తమౌజుండును మున్ను కృతవర్మ చేత నివారితు లై నరుని తోడి

వఱుమం జనక కెలని కుఱికి యఱిముఱి మనమొన దెరల్చికొని బయలికి వెడలి కపి

ధ్వజ గాండీవ గుణ రావంబుల కతంబున నతని యున్న యెడ యుపలక్షించి తిరిగి

వచ్చి బలుపున మన బలంబు వాయఁ బాపికొని చొచ్చి వివ్వచ్చుం జేరవచ్చుచున్నం

గని యక్కురు విభుండు వారల వారింపం గడంగిన.


7_4_169

క. ఆ యిరవురతో నజ్జన

నాయకునకు నయ్యె దారుణం బగు రణ మం

తాయత నృపచారము రో

షాయత్తత నుత్తమౌజుఁ డార్చుచుఁ దునిమెన్.


7_4_170

తే. తునిమి తోడన యుర మాడ సునిశితాస్త్ర

చయము నిగిడింప రా జొండు చాప మెత్తి

యతని హయముల సారథి నవనిఁ గూల్చె

నాతఁ డరిగె యుధామన్యు నరదమునకు.


7_4_171

క. అరిగి తురగము సూతుం

బొరిగొన విరథుఁ డయి నృపతి పొలి వోవక యు

ద్దుర గతి గద గొని చని త

త్తురగంబుల సారథిని జిదుర్పలు సేసెన్.


7_4_172

తే. రథము డిగ్గి తొలంగి రా రథికు లమ్మ

హీశుఁ డేతెంచి యెక్కె మద్రేశు తేరు

వారు నీ యోధు లిరువుర బారి సమరి

యా రథము లెక్కి యర్జునుఁ జేరఁ జనిరి.


7_4_173

వ. అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లను మన వారెల్లం గర్ణుండు గౌంతేయుల

గెలుచు నని యాసపడుదు రా ధర్మదనయుం డాతని యాటోపంబు దలంచి రేలెల్లను

గన్ను మూయండు.


7_4_174

ఆ. అట్టి జెట్టి యనిలు పట్టిచే విరథుఁ డై

పోయి పోయి నట్లు పోయెఁ గాని

మరలి కయ్యమునకుఁ జొరఁ డెట్టు లాతని

తెఱఁగు సెప్పు నాకుఁ దేటపడఁగ.


7_4_175

చ. అనవుడు నాతఁ డిట్టు లను నన్నర నాథున కట్లు సూత నం

దనుఁ బొరివుచ్చి భీముఁడు మదంబున నర్జును దిక్కు వోవఁగా

గని యతఁ డాయితం బయి తగం దన పే రెలుఁగెత్తి పిల్చె నా

ధ్వని విని యా వృకోదరుఁ డుదగ్ర గతిన్ మరలెన్ మహీశ్వరా.


7_4_176

వ. అట్లు దార్కొని యర్కప్రతాపు లగు నయ్యిరువురు నొండొరుల శరంబులు దూలించుచుఁ

దురంగంబులయంగంబులం దూపులఁ గీలించుచు సారథుల బెట్టు వఱుచుచుఁ జాపంబులు

విఱుచుచు మైమఱువు లఱువుళ్లు సేయుచు మేనులు నెత్తుట జొత్తిల్లఁ జేయుచు

నొండొరులకు వేఁడిమి సూపి యేపునం బెనంగునెడ నయ్యనిల తనయుండు.


7_4_177

క. విలు దుమురు సేసి గుఱ్ఱం

బుల సూతునిఁ బిలుకుమార్చి భుజగనిభ శలం

బులఁ జేడ్పఱిచిన సిగ్గఱి

కలఁగి పఱచి యొండు రథముఁ గర్ణుం డెక్కెన్.


7_4_178

క. అన విని ధృతరాష్ట్రుం డి

ట్లను నమ్మిన బంటు పిఱికి యై యిటు పఱనం

గని మంద బుద్ధి దుర్యో

ధనుఁ డేమని తలఁచె నొక్కొ తన చిత్తమునన్.


7_4_179

వ. అది యట్లుండె నాకర్ణునిబింకంబు పిదప నెట్లయ్యె ననవుడు సంజయుం డతని కిట్లనియె.


7_4_180

తే. అననంబునఁ గ్రోధ మహానలంబు

భీషణముగ రాధేయుండు భీముదెసకు

మరలి యురవడిఁ గవియ నయ్యిరువురకు మ

మహాద్భుతం బగు సంగ్రామ మయ్యె నధిప.