ఆ భా 3 5 031 to 3 5 060

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_5_031 తే. నీవు గడు ధర్మవిదుఁడవు జీవహింస జీవనంబుగ నడచుట శిష్టపథమె యకట యీ ఘోరకర్మంబునకు మదీయ బుద్ధి దద్దయు దుఃఖంబు వొందె నిపుడు.

3_5_032 వ. అనుటయు లుబదకుండిట్లనియె బ్రాహ్మణులకుఁ దపస్స్వాధ్యాయ సత్య శౌచ బ్రహ్మచర్యంబులును రాజులకు దండనీతియు వైశ్యులకుఁ గృషి పశుపాలన వాణిజ్యంబులును శూద్రులకు శుశ్రూషయు నెట్లు పరమ ధర్మంబయి చెల్లునట్ల మాకును మృగమాంసోప జీవనంబు పరమ ధర్మంబు విశేషించి యిది వంశక్రమాగతం బయిన యాచారంబు విను మదియునుంగాక యిదేశంబునకు రాజైన జనకుండు రాజధర్మ తత్పరుండయి సకల వర్ణ ధర్మ రక్షణంబు వదలకుండు నట్లుగాన యాత్మ కర్మంబులు విడుచువానిం దన పుత్త్రునైనను దండితుంజేయుఁ గావున నేనును నిజకర్మ పరిత్యాగంబు సేయ నోడుదు నీ దృశ ప్రవర్తనుండ నయ్యును.

3_5_033 తే. జీవహింస యెన్నండును జేయ ననఘ యొరులు సంపి తెచ్చిన మాంస మొనర నిలిచి తగిన వెల కమ్మి బ్రదుకుదుఁ దద్ధనమున నమల మానస శాంతి నా యర్థమెందు.

3_5_034 చ. వినయము విస్తరిల్ల గురువృద్ధ జనాతిథి విప్ర దేవతా ర్చన లొనరింతు సత్యమును శౌచము నేమళ నీగి మన్ననం దనుపుదు భృత్య బంధుతతిఁ దాల్మివహింతు నసూయఁ జేయ నెం దును మదిఁ దృష్ణసొప్పఁ బరదోష కథా విముఖుండు నెప్పుడున్.

3_5_035 క. సతతోపవాస నియమ వ్రతములఁ జరియింతు నేక వనితా ప్రియుఁడన్ ఋతుకాలరతుఁడ నిందా స్తుతులందు మనంబు నాకుఁ దుల్యత నుండున్.

3_5_036 వ. అట్లగుటం జేసి హీన యోనిజండ నయ్యును నిర్మలుండ నైతిం బ్రసంగ వశంబున నింత సెప్పనలసె నీవు ధర్మబోథార్థంబు నాయున్న యెడకుం జనుదెంచితి గావున నీకు ధర్మవిశేషంబు లెఱింగించెద నవ ధాన తత్పరుండ వయి యాకర్ణింపుము.

- ధర్మవ్యాధుఁడు కౌశికునకు ధర్మవిశేషము లెఱిఁగించుట – సం. 3-198-19

3_5_037 క. తన కుల ధర్మము విడువక మనుట పరమధర్మ మండ్రు మాన్యులు చిత్తం బునఁ గృప గలుగుట ముఖ్యపుఁ బని సై రణవలయు నఖిల భావములందున్.

3_5_038 అ. విడువ వలయు విషయ విషమ వాంఛల నెద విడువుఁ బోలు గుణము వెదకి యెందుఁ గానరైరి బుధులు గలదె పరిత్యాగ శీలునకు నసాధ్యసిద్ధి యెందు.

3_5_039 సీ. సత్య హితాలాప చతురత యర్హంబు సంతత సుజన పూజనము వలయు విను కామసంరంభ విద్వేశములఁ జేసి మతిగలంగినను ధర్మంబు దప్పఁ ద్రొక్కక నడచు టత్యుత్తమ సరణి యప్రియములయందును బ్రియములందు దైన్యహర్షంబులఁ దగులక యున్నట్టి కల్యాణ వర్తన కాంక్ష లెస్స

తే. యెగ్గు సేసిన వారికి హితము సేఁత యార్యజనులు గీర్తింతు రన్యదోష కారి దన పాపమునఁ దాన కాలిపోవు వేఱవానికిఁ గీడు గావింపనేల.

3_5_040 క. ధార్మికులు సలుపునుత్తమ కర్మముఁ జెడనాడు నాస్తిక జనము విను మా దుర్మతుల తెఱఁగు గైకొని ధర్మమునెడఁ బ్రీతి వదలఁ దగదు బుధునకున్.

3_5_041 క. మది మఱపునఁ బాపము దన కొదవుటయును బిదప వగచి యొక సగమును నే నిదిసేయ నింకననియెడు మదిఁ బెఱసగమును నరుఁడు మలుఁగు నఘంబున్.

3_5_042 తే. పాపముల కెల్ల నెక్కుండు పాతకములు సువ్వె క్రోధలోభంబులు సుప్రతాత్మ వాని రెంటి జయించిన వాఁడుగాని యెందుఁ బరమ ధార్మికుఁడని యెన్నఁ బడఁడు.

3_5_043 వ. శిష్టచరితంబులు గాని మార్గమంబలు గొన్ని తృణసంవృతంబులైన కూపంబుల వోలెఁ గపట ధర్మ సంవృతంబులై యుండు వాని దవ్వులన పరిత్యజించి శిష్టాచారంబుల నడపుట ధర్మలక్షణం బనినం గౌశికుండు శిష్టాచారంబు లెయ్యని యెఱింగింపు మనుటయు ధర్మవ్యాధుం డిట్లనియె.

3_5_044 సీ. దానంబు సత్యంబుఁ దపము యజ్ఞము నార్జవముఁ గామలోభాది వర్జనంబు గురుజన శుశ్రూష క్రోధ రాహిత్యంబు దమము సంతోష మధ్యయన నిరతి దాంభికత్వములేమి దైన్యంబు వొరయమి యనసూయ యలహంక్రియాభీయుక్తి దలఁపంగ నాద్యమైతనరు ధర్మమ యెప్డుఁ గొనియాట నాస్తిక గోష్ఠిఁ జనమి

తే. శీలసంరక్ష తీర్థ సంసేవ శౌచ మఖిల భూతంబులందు దయార్దృడఁగుట మితహితోక్తులు సంశ్రిత మిత్త్రగుప్తి యిన్నియును శిష్టచరితంబు లిద్ద చరిత.

3_5_045 క. విను శిష్టచరిత గైకొని యనసూయత నడవ నడవ నంతఃకరణం బునఁ బొదలునట్టి సమ్మద మనఘా దుర్లభము సూవె యన్య పథములన్.

3_5_046 వ. కావున శిష్టాచార నియతింజేసి గురుశుశ్రూష సలిపి కృతాధ్యయనుండవై పరమజ్ఞాన పరిపక్వం బైన చిత్తంబుతోడం గామక్రోధ మహామకర సంకీర్ణయు విషయజల పరిపూర్ణయునైన మోహ జలధి నస్ఖలిత ధైర్యంబను తెప్పంజేసి యశ్రమంబున నిస్తరించి కృతార్థుండ వగు మని మఱియు నిట్లనియె.

3_5_047 క. క్రమమున శిష్టాచార క్రమ మెఱుఁగఁగ ధర్మమునకుఁ గడు వాటం బై విమలం బగుఁ జిత్తము స త్యమును నహింసయును దనకుఁ దావలములుగన్.

3_5_048 ఆ. విను మహింస ధర్మవితతి కెల్లను మేటి యదియు సత్యయుక్త మైన వెలయు ననఘ శిష్టచరితలందు సత్యమ కడు నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు.

3_5_049 తే. వేదవిఱితంబులును శాస్త్రవిహితములును శిష్టచరితంబులును ననఁ జెప్ప నొప్పి ధర్మములు మూఁడు విధములఁ దనరు చుండుఁ గడఁగి యిన్నియు సద్గతి కారణములు.

3_5_050 మ. అనయంబున్ శ్రుతవంతుఁడై వినుత శిష్టాచార మార్గంబులం జను పుణ్యాత్ముఁడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్మ్యసంబూఢుఁడై కనుచుండు బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ క నధోభాగమునందు డింది కడు దుఃఖం బొందఁగా నవ్వుచున్.

- ధర్మవ్యాధుఁడు గౌశికున కహింసా స్వరూపంబు సెప్పుట – సం. 3-199-1

3_5_051 వ. అని పలికి ధర్మవ్యాధుండు మఱియు నిట్లనియె నయ్యా నీవు దొలుత నావర్తనంబు గనుంగొని యిది హింసా బహుళంబు గాదె యని పలికితివి దానికేను దగుతెఱంగు సెప్పితి నది యట్లుండె హింస యిట్టిది యహింస యిట్టిదని విభాగింప నెవ్వరికి నేర నగు.

3_5_052 క. మును తన చేసిన కర్మం బునఁ జూవె నశించు భూతములు సంపెడు వాఁ డు నిమిత్తమాత్ర మింతయె యనిచెప్పఁగ వినమె యంచితాచారులచేన్.

3_5_053 వ. అదియునుగాక.

3_5_054 క. ఫలమూలౌషధి శాకం బులు బశుమృగ తతులు భక్ష్యములుగా భూతం బుల కజుఁడు సేసె నని య స్ఖలితంబుగ మ్రోయుశ్రుతులఁ గాదన వశమే.

3_5_055 సీ. అనఘ యౌశీనరుండగు శిబి నిజ గాత్రహింస నింద్రాగ్నుల కిడఁడె మాంస మతనికి లేదయ్యె నయ్య యుత్తమగతి రంతిదేవుం డను రాజు దొల్లి యనుదివంబును గోసహస్రద్వయంబుఁ దా వధియింపఁడే వేయివత్సరములు దురిత మమ్మహితాత్ముఁ దొడరెనే వేదార్థనిరతులై యత్యంత నియతులైన

తే. ధారణీసుర ముఖ్యు లధ్వరము నందుఁ బశువరింపరే పశువులఁ బరమపుణ్య గతులు గలుగవె వారికిఁ గడఁగి యగ్ను లధిక మాంసార్థు లని శ్రుతులందు వినమె.

3_5_056 క. పితృదైవత కార్యములం దతి భక్తిని మాంస మిడుట యర్హమనియుఁ ద త్పితృ దైవ విశేషములు స మ్మతి భోజ్యము లనియు మునుల మతములు గావే.

3_5_057 మ. హతికుం డెంతయు నోజతో దునఁగ సీరాగ్రంబునం జోఁకి ప్రా ణు లనేకంబులు సచ్చు హింస యది యౌనోకాదో వేయేల మ ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కంబడుం బెక్కు జం తులు హిసావిధి గాదనంగ వశమే దోషజ్ఞ యూహింపుమా.

3_5_058 చ. సలిలము లుర్వి యాకసము సర్వము జంతు మయంబ గావునం గలుగు నవశ్యమున్ సకల ధర్మములందును హింస హింసకుం దొలఁగిన దేహయాత్రయును దుర్ఘట మైనటు లుండు నింతయుం దలఁపరు హింససేయ మని దారు తలందురు గొంద ఱిమ్మహిన్.

3_5_059 క. పనివడి యహింస వ్రతముగఁ గొని వనమున నున్న మునులకుం దొడరదె హిం సనము దరుమూల ఫల శా కనిపీడన మదియు హింస గాదొకొ తలఁపన్.

3_5_060 తే. హింస సేయని వాఁడు లేఁ డిజ్జగమున నొక్కడైనను దమతమ యోపినట్లు హింస తెరువున కెడగల్గి యేఁగవలయు నదియ చూవె యహింసనా నతిశయిల్లు.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com