ఆ భా 3 2 261 to 3 2 290

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_2_261 క. వీరుండు క్షత్రియులఁ దన దారుణ పరశువున జామదగ్న్యుఁడు రౌద్రా కారుఁడు వధియించి తదీ యారుణమున నేనుమడువు లాపాదించెన్.

3_2_262 వ. అందుఁ బితృతర్పణము సేసినం బితృదేవతాతనికిం బ్రత్యక్షంబయి నీకిష్టంబైన వరంబు వేఁడు మనినఁ బరశురాముండు వారల కిట్లనియె.

3_2_263 తే. క్షత్రవధ నైనపాపంబు గ్రాఁగవలయుఁ గడఁగి సద్గతియును నాకుఁ బడయ వలయు నివియుఁ బుణ్యతీర్థంబులై యిద్ధరిత్రి బరగుచుండంగ వలయు మీ కరుణఁ జేసి.

3_2_264 వ. అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె నట్టి రామహ్రదంబు లాడిన వారికి నశ్వమేధ ఫలంబగుఁ గాయశోధనం బను తీర్థంబాడి కాయశుద్ధులగుదు రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్ధరించె నట్టి లోకోద్ధారంబను తీర్థమాడి కులంబుద్ధరింతురు శ్రీ తీర్థంబాడి శ్రమంతులగుదురు కపిలతీర్థంబాడి కపిల గోసహస్రదానఫలంబుఁ బడయుదురు సూర్యతీర్థంబాడి యందుపవసించిన సూర్యలోక ప్రాప్తు లగుదురు గోభవనం బను తీర్థంబాడి గోసహస్రసమృద్ధు లగుదురు శంఖినీ తీర్థంబాడి యుత్తమరూపంబు వడయుదురు యక్షేంద్ర తీర్థంబాడి తరండకుం డను ద్వారపాలకుం జూచిన వారు సరస్వతీస్నాతులైవారు నగ్నిష్టోమ ఫలంబు వడయుదురు మాతృతీర్థ దర్శనంబునం బ్రజావృద్ధియగు బ్రహ్మావర్తంబును శరవశంబునుం జూచిన సర్వవ్యాధి విముక్తులగుదురు శ్వావిల్లోమాపహం బను తీర్థంబునం దేకాదశ దీర్థంబులు గల వందుఁ బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు నెఱకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుషతీర్థం బాడి సర్వ దురిత విముక్తులై దైవత్వంబు వడయుదురు దాని తూర్పున నొక్కయిరవున నాపగయను మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్క బ్రాహ్మణునకుం గుడువబెట్టినఁ గోటి బ్రాహ్మణులు గుడిచిన ఫలం బగుఁ బితృదేవతలు దృప్తియు నొందుదురు బ్రహ్మోదుంబరంబు సప్తర్షికుండంబుఁ గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వడయుదురు కపిలకేదారంబుఁ జూచి పాపవిముక్తులై యదృశ్యు లగుదురు నరకంబను తీర్థంబాడి కృష్ణచతుర్దశి నాఁ డీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు మూఁడు కోట్ల కూపహ్రదంబులు గల యి లాస్పదంబను తీర్థంబాడి పితృతర్పణంబులు సేసిన వారికి వాజపేయఫలం బగుఁ గిందానకిం జప్యంబు లను తీర్థంబు లందుఁ జేసిన దానజపంబు లక్షయంబు లగు నారద తీర్థంబైన యంబాజన్మంబునందుఁ బ్రాణత్యాగంబు సేసిన వారు సర్వలోకంబులం బడయుదురు శుక్ల దశమిం బుండరీకం బను తీర్థంబాడు పౌండరీక ఫలంబు వడయుదురు రందు వైతరణీస్నాతులై రుద్రునకు నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు రెందేని దేవత లనేక సహస్ర వర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనంబను తీర్థంబాడి యగ్నిష్టోమాతిరాత్ర ఫలంబులు వడయుదురు ద్వైపాయనుం డనేక తీర్థంబులు మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనం బరగిన తీర్థం బాడిన వారికి సర్వతీర్థస్నాన ఫలంబగు వ్యాస వనంబును మధు వటియు నను తీర్థంబుల నాడిన గోసహస్రదాన ఫలంబు వడయుదురు కౌశికీ దృషద్వతీసంగమంబున స్నాతులై సర్వపాప విముక్తు లగుదురు కిందత్తంబునఁ దిల ప్రస్థదానంబు సేసి పితరుల ఋణంబు నీఁ గుదు రహస్సుదిన తీర్థంబుల నాడి సూర్యలోక ప్రాప్తులగుదురు మృగధూమంబున గంగాస్నాతులై మహాదేవు నర్చించిన మహాత్ము లశ్వమేధఫలంబు వడయుదురు వామనం బను తీర్థంబాడి వామను నర్చించిన వారు విష్ణులోక ప్రాప్తులగుదురు పావనం బను తీర్థంబాడి కులంబు పవిత్రంబు సేయుదరు శ్రకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్టోమఫలంబు వడయుదురు ఋషు లందే నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టినైమిశ కుంజం బాడి ఋషితృప్తి సేయుదురు బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్తు లగుదురు.

3_2_265 సీ. అనఘుఁడు మంకణుం డను నొక్క బ్రహ్మర్షి తన చేయి వ్రయ్యంగ దర్భఁ గొనిన సాంద్రమై శాకరసం బందు నిర్గతం బగుడును హర్షించి యాడుచున్నఁ జూచి సహింపక సురలును మునులును హరుపాలి కరిగి దేవాది దేవ ముని నృత్త మేవిధంబున నివృత్తం బగునట్లుగాఁ జేయవే యనిన హరుఁడు

ఆ. దపసి రూపమపుడు ధరియించి యమ్ముని కడకు వచ్చి యేమి కారణమున నాడె దేమి విస్మయం బిందుఁ జూచితి చెప్ప నుచిత మేనిఁ జెప్పు మనిన.

3_2_266 వ. నా కరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండనయి హర్షించి యాడెదననిన నిది యేమి విస్మయంబు దీని జూడు మని హరుండు తన యంగుష్ఠంబున నంగుళితాడనంబు చేసిన నందు హిమసన్నిభం బయిన భస్మంబు వెలువడినం జూచి లజ్జితుండయి నీవు పరమేశ్వరుండ వని నమస్కరించి వేదమంత్రంబుల స్తుతియించి దేవా నీ ప్రసాదంబున నాకుఁ దపోవర్థనంబు గావలయు ననిన నమ్మునివరునకు నీశ్వరుండు గరుణించి నీకుఁ దరోవర్ధనమగు నేను నీయాశ్రమంబున నుండుదు ననియె నట్టి సప్తసారస్వత తీర్థంబు లాడిన వారికి సారస్వత సిద్ధియగు బ్రహ్మాది దేవతలచే నధిష్టితంబు లయిన యౌశనస తీర్థంబును గపాలమోచనంబు విశ్వామిత్రంబుఁ గార్తికేయంబు ననియెడు తీర్థంబుల నాడి పాపవిముక్తు లయి బ్రహ్మలోకంబు వడయుదురు.

3_2_267 క. వేదములయందు వినఁగఁ బృ థూదక తీర్థంబ యుత్తమోత్తమము సురేం ద్రాది సురవరులకును వ్యా సాది మహాయోగివరుల కాస్పద మగుటన్.

3_2_268 వ. అందు శరీర త్యాగంబు సేసిన వార లపారపాప విముక్తులై ముక్తులగుదురు సురకన్యా సరస్వతీ సంగమస్నాతు లయిన వారు బ్రహ్మహత్యాది పాతంకంబు వలనఁ బాయుదురు దర్భినిర్మితం బయిన యర్థకీలతీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగుదురు బ్రాహ్మణులు పరమ సిద్ధు లగుదురు శంతబును సహస్రంబు నను తీర్థంబులందుఁ జేసిన దానోపవాసంబులు శతసహస్ర గుణంబు లగు వేల్పులెల్లం గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి రట్టి తైజసం బను తీర్థంబును దాని తూర్పున నుండు కురుతీర్థంబును స్వర్గద్వారం బను తీర్థంబును జూచిన వారికి స్వర్గద్వారంబు వివృతంబగు రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల నర్చించి సర్వ దుఃఖ విముక్తు లగుదురు స్వస్తపురంబుఁ బ్రదక్షిణంబు సేసి గోసహస్రదాన ఫలంబు వడయుదురు గంగ మడువున నొక్కకూపంబున మూఁడుకోట్ల తీర్థంబులు సన్నిహితంబు లయియుండు నందుఁ గృతస్నానులయిన వారికి సర్వతీర్థ స్నాన ఫలంబగు బదరీవనంబునందు వసిష్ఠాశ్రమంబునం ద్రిరాత్రంబులు బదరీఫలభక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు రేకరాత్రం బను తీర్థంబున నేకరాత్రోపవాసంబు సేసి బ్రహ్మలోకంబు వడయుదు రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోక గతులగుదురు దధీచి తీర్థంబునం గన్యాశ్రమంబునందుఁ ద్రిరాత్రంబు వసియించిన వారికి స్వర్గ ఫలంబగు.

3_2_269 క. జలరుహసంభవుఁ డాదిగ గలవేల్పులు ఋషులు సిద్ధ గరుడోరగులున్ నెలనెల సేనింతురు భూ తలమున సన్నిహతి యనఁగఁ దగు తీర్థంబున్.

3_2_270 వ. సూర్యగ్రహణంబున దాని నాడిన వారు శతాశ్వమేధ ఫలంబు వడయుదురు ధర్ముఁడు దపంబు చేసిన ధర్మతీర్థం బాడి ధర్మశీలు రగుదురు జ్ఞానపావనంబును సౌగంధికంబు నను తీర్థంబుల నాడినం జూచిన సర్వపాప విముక్తులగుదురు దేవశ్రవ యను సరస్వతీహ్రదంబు నందు వల్మీకంబున వెలువడు జలధార లాడి పితృతర్పణంబు సేసిన వారశ్వమేధ ఫలంబు వడయుదురు సుగంధయు శత కుంభయు బంచ యక్షయుఁ ద్రిశూల ఖాతయు నను తీర్థంబు లాడి దుర్గతులవలనం బాయుదురు తొల్లి పార్వతి యందేని శాకాహారిణియై దివ్యసహస్ర వర్షంబులు తపంబు సేసెనట్టి శాకంభరీ తీర్థం బాడి యొక్కదివసంబు శాకాహారు లయిన వారు పండ్రెండేండ్లు శాకాహారతపంబు సలిపిన వారి ఫలంబు వడయుదురు సువర్ణాఖ్యం బను తీర్థంబున రుద్రుం బూజించి రుద్రలోక గతులగుదురు ధూమవతి యను తీర్థంబును రథావర్తం బను తీర్థంబును ధార యను తీర్థంబ నాడి శోకవిముక్తు లగుదురు.

3_2_271 క. ధారుణి లోపల స్వర్గ ద్వారం బయి ఋషినిషేనితం బగు గంగా ద్వారం బాడిన ధన్యులఁ జేరును శతకోటి తీర్థ సేవా ఫలముల్.

3_2_272 వ. మరియు సప్త గంగా సంగమంబును ద్రి గంగా సంగమంబును శక్రావర్తంబును గన స్వలంబును గంగా సరస్వతీ సంగమంబు నాదిగాఁ గల పుణ్యతీర్థంబుల నాడి పుణ్యలోకంబులు వడయుదురు భద్రకర్ణేశ్వరంబున రుద్రపూజయు నరుంధతీవటంబును సింధు ప్రభవంబును యమునా ప్రభవంబు నను పుణ్య తీర్థంబుల సేవయు సర్వసిద్ధికరంబులు వేదిక యను తీర్థంబును ఋషి కుల్యయను తీర్థంబును గృత్తికా మఘ తీర్థంబులును విద్యా తీర్థంబును వేతసికయను తీర్థంబునుం జూచి దురితంబుల వలనం దొలంగుదురు బ్రహ్మతీర్థం బాడి పద్మ వర్ణ యానంబుల బ్రహ్మలోకగతు లగుదురు.

3_2_273 చ. సురుచిర కీర్తి నైమిశముఁ జూచిన మాత్రన పాయుఁ బాప మ చ్చెరువుగ నందు మాసము వసించి యనంతఫలంబు లొందఁ గాం తురు బహుతీర్థ సేవనము తోడ సమానము నైమిశంబు నం దరుదుగ నొక్కనాఁడు శుచియై యుపవాసము సేయఁ గాంచినన్.

3_2_274 వ. మఱియు గంగోద్భేవతీర్థంబు నిదీవతీర్థంబు గంగాద్వారంబు దిశాపతి తీర్థంబు లనియెడు తీర్థంబుల నాడి వాజపేయ ఫలంబుఁ బడయుదురు బాహుదయను తీర్థంబాడిన ననేక సత్రయాగ ఫలంబగు నెందేని రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూ ప్రదేశంబున గోప్రదానం బాడియు దేవతలకు ఋషులకు యజ్ఞభూమి యయిన తీరంబుల గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వడయుదురు కోటితీర్థంబునం గుమారు నర్చించియు వారణాసియందు రుద్రునర్చించియుఁ గపిలా హ్రదంబాడియు రాజసూయ ఫలప్రాప్తు లగదురు మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మ కల్పితం బయిన యూపంబుఁ బ్రదక్షిణంబు సేసియు వాజపేయ ఫలంబు వడయుదురు.

3_2_275 సీ. పలువురఁ గొడుకులఁ బడయంగ వలయు నందొక్కరుండయినను నోపి గయకు నరుగునో యనియును నశ్వమేధంబొప్ప జేయునో యనియును శ్వేతమైన యాఁబోతు విడుచునో యనియును గోరుదు రనవద్యులైన గృహస్థు లట్టి గయకేఁగి యుభయ పక్షములు వసించినఁగడుఁ బుణ్యు లుభయ పక్షముల వారి.

ఆ. నుద్ధరింతు రందయొగిఁ బిండమిడిన వా రనఘ పితృదయను గృతార్థులగుదు రందు ఫల్గు తీర్థమాడిన వారికిఁ బరమసిద్ధితో శుభంబు పెరుఁగు.

3_2_276 వ. మఱి యక్షిణీ తీర్థంబునందు జలపానంబు సేసి బ్రహ్మ హత్యాదిదోష విముక్తులగుదురు మణినాగం బను తీర్థంబాడిన వారికి నాశీవిషవిషంబు లొందవు గౌతమ వనంబునం దహల్యహ్రదం బాడి యుదపానం బను తీర్థంబాడియు నశ్వమేధ ఫలంబుఁ బడయుదురు రాజర్షి జనక కూపంబాడి విష్ణులోక ప్రాప్తులగుదురు కంపనయు మహానదియు నను తీర్థంబుల నాడిన వారు పౌండరీక ఫలంబు నొందుదురు దేవపుష్కరిణిని మహేశ్వర ధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధ ఫలంబు వడయుదురు తొల్లి కూర్మ రూపుండయిన యసురచేతం గోటితీర్థంబు లపహృతంబులయిన వానిఁ దెచ్చి విష్ణుండెందేని నిలిపె నట్టి మహేశ్వర పథంబను తీర్థంబాడియు విష్ణుస్థానంబున సాలగ్రామం బను తిర్థంబాడి విష్ణునర్చించియు నందు సన్నిహితచతుస్సముద్రం బయిన కుపంబు నాడియు విష్ణులోకగతులగుదురు భరతాశ్రమంబునఁ జంపకారణ్యంబున దేవి సహితు నీశ్వరుంబుజించి మిత్రావరుణ లోకంబు వడయుదురు కన్యా సంవేద్యం బను తీర్థంబునఁ గన్యాదానంబు సేసి యక్షయఫల ప్రాప్తులగుదురు దేవకూటంను తీర్థంబాడి బ్రహ్మలోకంబుఁ బడయుదు రెందేని విశ్వామిత్రుండు సిద్ధింబొందె నట్టి కౌశిక హ్రదంబాడియుఁ గుమారవీరాశ్రమంబున నొక్క మాసంబు వసియించియు నశ్వమేధఫలంబు వడయుదు రగ్నిధారయుఁ బితామహసరంబునం బుట్టిన కుమారధారయు నాడి త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తులగుదురు గౌరీ శిఖరకుండం బాడిన నందినీకూపంబాడిన నశ్వమేధ ఫలంబగుఁ గాళికా కౌశికా సంగమంబునందుఁ ద్రిరాత్రోపవాసంబు సేసినవారి సర్వపాప విముక్తులగుదు రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హులగుదురు గోకర్ణంబను తీర్థంబాడిన జాతి స్మరణంబు వడయుదురు సరస్వతీ తీర్థస్నాతులయి వృషభ ద్వీపంబునం గుమారుఁ బూజించి దేవవిమానగతులగుదురు నందయు నౌ లకమును గరతోయంబును గంగాసాగరసంగమంబు నను తీర్థంబులనాడి శతాశ్వమేధఫలంబు వడయుదురు శోణానర్మదా ప్రభవంబును బదరీ తీర్థంబును నాడి యాయుష్మంతులగుదురు మహేంద్రంబు రామతీర్థంబును మతంగకేదారంబును వంశగుల్మంబు ననుతీర్థంబుల నాడి యశ్వమేధ ఫలంబుఁ బడయుదురు.

3_2_277 తే. పరమమైన తీర్థంబు శ్రీ పర్వతంబు నందు దేవహ్రదం బాడి యాదిదేవు నీశు నర్చించి వడయుదు రిష్టఫలము నశ్వమేధ ఫలంబును నవని జనులు.

3_2_278 వ. తొల్లి శతక్రతుండు నూఱుక్రతువులు సేయుటం జేసి పవిత్రంబున కృష్ణవేణియందు దేవహ్రదం బాడిన సర్వపాపవినాశనంబగుఁ బాండ్యపర్వతంబునం గావేరీతీర్థంబును దుంగభద్రయు సముద్ర తీరంబును గన్యాతీర్థంబును నాడి యశ్వమేధఫలంబు వడయుదురు గాయత్రీస్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీ జపంబుఁ జేసినవారికి జన్మదుఃఖంబులు లేవు పెన్నయను మహానది నాడిన మయూరహంస విమానగతులగుదురు గోదావరీ స్నానంబు సేసిన దశాశ్వమేధఫలంబు వడయుదురు పయోష్టియు దండకారణ్యంబును శరభంగాశ్రమంబును శుక్రాశ్రమంబును జమదగ్ని సేవితంబయిన శూర్పూరకంబును సప్త గోదావరీ తీర్థంబును నాడిన పుణ్యులు పుణ్యలోక ప్రాప్తులగుదరు.

3_2_279 సీ. అసురుల భయమున నడఁగిన వేదంబు లోంకార పూర్వమై యుండ నాంగి రసుఁ డుద్ధరించి సారస్వత ప్రముఖులఁ జదివించె నెందేని శాశ్వతముగ నమరనియక్తుఁడై యజియించె నెందేని భృగుఁడెల్లవారికిఁ బేర్మి నట్టి రమణీయతురంగ కారణ్యంబు సూచిన మాత్రన దురితకర్మంబు లెల్లఁ

తే. బాయుఁ గాలంజరంబును పర్వతంబు నందు దేవహ్రదం బాడి యభిమతములు వడయుదురు మేధికంబు నాఁబరగు తీర్థ మాడి మేధా సమన్వితు లగుదురెందు.

3_2_280 వ. మఱి చిత్రకూటంబున మందాకిరి సేవించి పితృస్థానంబునం గుమారుం బూజించి జ్యేష్ఠస్థానంబున రుద్రు నర్చించి రామనివాసం బైన శృంగిబేరపురంబున గంగాస్నాతులయి గంగాధరు నర్చించియు సర్వపాప విముక్తు లగుదురు.

3_2_281 క. యాగశతంబుల కంటెఁ బ్ర యాగ నివాసము విశేషమని మునులు మహా యోగులు సిద్ధులు సాధ్యులు నాగులు నందుండుదురు మనః ప్రియమొసఁగన్.

3_2_282 వ. ఆది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూఁ డగ్ని కుండంబు లెప్పుడుఁ గానంబడు మఱి వేదంబులు యజ్ఞంబులు మూర్తిమంతంబులై యఱువది కోట్ల పదివేలు తీర్థంబులు సన్నిహితంబులై గంగా యమునా సంగమంబు సేవించి యుండు నందుఁ గృతస్నానులైన వారు రాజసూయాశ్వమేధులయు సత్యవాదులయిఁ జతుర్వేదాధ్యయనులయుఁ బుణ్యలోకంబులు వడయుదురు భోగవతియు వాసుకియు హంసవ్రతంబు నను తీర్థంబులనాడి దశాశ్వమేధ ఫలంబు వడయుదురు.

3_2_283 క. విదితముగఁ దీర్థ కీర్తనఁ జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న భ్యుదయ మగు సర్వతీర్థ స ముదయస్నాన బహుయాగముల ఫలములగున్.

3_2_284 చ. వ్రతములు లేనివారు నుపవాస పరాఙ్ముఖులైన వారు దు ర్మతులు విహీన శౌచులుఁ గ్రమంబునఁ దీర్థము లాడనోప రా తతగుణశాలి వీ వఖిల ధర్మవిధుండవు గావునన్ శుభ స్థితిఁ జని తీర్థ సేవనము సేయుము నీకు నభీష్ట సిద్ధిగన్.

3_2_285 వ. అని సకల తీర్థ కథనంబు సెప్పిన పులస్త్యు వచనంబున భీష్ముండు దొల్లి యెల్ల తీర్థంబులు సేవించి కృతార్థండయ్యె గావున నీవును దీర్థసేవ సేసి.

3_2_286 క. పూరు పురూరవులట్లు భ గీరథ రఘుపతుల యట్లు కృత కృత్యుఁడవై ధారుణి రక్షింపుము వి స్తార గుణాధార ధీర ధర్మ తనూజా.

3_2_287 వ. రోమశుం డను దేవర్షి దేవలోకంబునుండి నీ కడకు వచ్చుఁ దదుపదేశంబున ధౌమ్యానుమతుండవయు తీర్థసేవనఁ జేయు మని చెప్పి నారదుండరిగిన నజాత శత్రుండు ధౌమ్యుంజూచి యి ట్లనియె.

3_2_288 చ. అలయక మాకు నందఱ కహర్నిశముం బ్రియకారి యైనయ త్యలఘుపరాక్ర మాన్వితు మహాభూజు నర్జును దివ్యసాయకం బులు వడయంగు నొక్కరున పూచ్చితిఁ దద్దయు వేడ్క నెద్దియుం దలఁపక యిప్డు తద్విరహి తమ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్.

3_2_289 వ. అంబుదాగమనం బపేక్షించు చాతకంబులట్లు మనమందఱ మర్జునాగమ నంబు ప్రతీక్షించు చున్నవారము వాఁడును దనపూనిన కార్యంబు నిర్వహించి కాని నివృత్తుండు గాఁ డవశ్యంబును దివ్యాస్త్రంబులు వడసి యాతని వచ్చునంతకుఁ దీర్థసేవ సేయుదమనినఁ గరంబు లగ్గగు నట్ల చేయుదమని.

- రోమశ మహాముని ధర్మరాజు నొద్దకు వచ్చుట - సం. 3-89-1


3_2_290 ఉ. నాలుగుదిక్కులందును వినన్ విదితంబగుచున్న పుణ్యతీ ర్థాలి తెఱంగెఱుంగఁగ మహాత్ముఁడు ధౌమ్యుఁ డజాతవైరి కం దోలిన చెప్పుచున్న తఱి నొప్పుగ రోమశుఁ డేఁగుదెంచెఁ దే జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజు పాలికిన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com