ఆ భా 1 4 050 to 1 4 080

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్



- దుష్యంతుడు శకుంతలను వివాహంబు సేసికొనఁ గోరుట -

సం. 1-67-1


చ. ఇది మునినాథకన్య యని యెంతయు నిస్పృహవృత్తి నున్న నా

హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్యసం

పద నెఱిఁగించినన్ మదనబాణపరంపర కిప్పు డుండ నా

స్పద మయి సంచలించె నళిపాతవికంపితపంకజాకృతిన్.51


వ. అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యిట్లనియె.52


క. ఆవల్కలాజినములకు

నీవన్యఫలాశనముల కీవిటపకుటీ

రావాసములకు నుచితమె

నీ విలసిత రూపకాంతి నిర్మల గుణముల్.53


ఉ. ఈ మునిపల్లె నుండుటిది యేల కరం బనురాగ మొప్పఁగా

భామిని నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్యల

క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా

దామలతుంగ హర్మ్యతలహారి హిరణ్మయకుట్టిమంబులన్.54


సీ. బ్రాహ్మంబు దైవంబుఁ బరగ నార్షంబుఁ బ్రా

జాపత్యమును రాక్షసంబు నాసు

రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు

నను నెనిమిది వివాహములయందుఁ

గడుఁ బ్రశస్తములు సత్క్షత్త్రవంశ్యులకు గాం

ధర్వ రాక్షసములు ధర్మయుక్తి

నీకును నాకును నెమ్మిఁ బరస్పర

ప్రేమంబు గాముండు పెంపఁ దొడఁగెఁ


ఆ. గాన యెడయుఁ జేయఁగానేల గాంధర్వ

విధి వివాహమగుట వినవె యుక్త

మనిన లజ్జఁ జేసి యవనత వదనయై

యాలతాంగి యిట్టు లనియెఁ బతికి.55


క. కరుణానిరతులు ధర్మ

స్వరూపులింతకు మదీయజనకులు ననుదెం

తురు వారు వచ్చి నీకి

చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్.56


వ. అనిన దానికి దుష్యంతుం డిట్లనియె.57


తే. తనకు మఱి తాన చుట్టంబు తాన తనకు

గతియుఁ దన్నిచ్చుచోఁ దానకర్త యనఁగ

వనజ నేత్ర గాంధర్వ వివాహ మతి ర

హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు.58


వ. అని దుష్యంతుడు గాంధర్వ వివాహ స్వరూపంబు సెప్పి శకుంతల నొడం బఱిచిన నది యిట్లనియె.59


చ. నరనుత నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ

గురుతర యౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా

వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో

నిరుపమ కీర్తి యట్లయిన నీకును నాకును సంగమం బగున్.60


వ. అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రా నస్మత్ప్రధాన వర్గంబుఁ గణ్వ మహాముని పాలికింబుత్తెంచెదనని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె. నిట శకుంతలయుఁ దన చేసిన దాని మునివరుం డెఱింగి యలిగెడునోయని వెఱచుచుండె నంత నమ్మహాముని వనంబున నుండి కందమూల ఫలంబులు గొని చనుదెంచి లలిత శృంగారభావంబున లజ్జావనత వదనయు నతి భీతచిత్తియునై యున్న కూఁతుం జూచి తనదివ్యజ్ఞానంబున నంత వృత్తాంతంబు నెఱింగి క్షత్త్రియులకు గాంధర్వ వివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కిట్లనియె.61


- భరతుని జననము -

సం. 1-68-1


తే. తల్లి నీకులగోత్ర సౌందర్యములకుఁ

దగినపతిఁ గంటి దానికిఁ దగఁగ గర్భ

మయ్యె నీదుగర్భమున వాఁ డఖిలభువన

వనమహనీయుఁ డగు చక్రవర్తి సుమ్ము.62


వ. నీ ధర్మ చరితంబునకు మెచ్చితి నీ కోరినవరం బిచ్చెద వేఁడు మనిన శకుంతలయు నా చిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను నా కుద్భవిల్లెడు పుత్త్రుండు దీర్ఘాయురారోగ్యైశ్వర్య బల సమన్వితుండును వంశకర్తయుఁ గాను వలయు ననిన నమ్మహాముని కరుణించి దాని కోరినవరం బిచ్చి యథాకాల విధుల గర్భ సంస్కార రక్షణంబులు సేయించి యున్నంత వర్షత్రయంబు సంపూర్ణం బైన శకుంతలకు భరతుం డుదయించి కణ్వనిర్వర్తితజాత కర్మాది క్రియాకలాపు డయు పెరుఁగుచుఁ గరతలాలంకృత చక్రుండును జక్రవర్తి లక్షణలక్షితుండును సింహసంహననుండును దీర్ఘబాహుండును ననంత జవసత్త్వ సంపన్నుండును నై పరగుచు.63


మ. అమితో గ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూలఖ

డ్గమదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁ డై కణ్వాశ్రమోపాంత భూ

జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ

న్యమదేభుబుల నెక్కుచుం దగిలి నానాశైశవ క్రీడలన్.64


వ. ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దన మహాసత్త్వంబునం జేసి దమియించు చున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందులమునులెల్ల నాతనికి సర్వదమనుం డను నామంబుఁ జేసిరి కణ్వమహామునియు నక్కుమారు నుదారతేజోరూప విక్రమగుణంబులకు సంతసిల్లి వీఁ డఖిలభువన యౌవ రాజ్యంబునకు సమర్థుండగు సమయం బరుగుదెంచె నని విచారించి యొక్కనాఁడు గూఁతున కిట్లనియె.65


ఆ. ఎట్టిసాధ్వులకును బుట్టినయిండ్లను

బెద్దకాల మునికి తద్ద తగదు

పతులకడన యునికి సతులకు ధర్మువు

సతుల కేడుగడయుఁ బతుల చూవె.66


- కణ్వ మహాముని శకుంతలను దుష్యంతు పాలికిం బుపుట -

సం. 1-68-10


వ. కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీ పతి పాలికి నరుగు మని మహా తపోధను లైన తనశిష్యులం గొందఱఁ దోడువంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతు పాలికి వచ్చి సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుండై యున్న యారాజుం గనుంగొని.67


క. గురునాశ్రమంబునను ము

న్నరుదుగఁ బతివలనఁ గనిన యనురాగము నా

దరణము ననుగ్రహంబును

గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్.68


క. ఎఱుఁగఁడొకొ నన్ను నెఱిఁగియు

నెఱుఁగని యట్లుండు నొక్కొ యెడదవ్వగుడున్

మఱచె నొకొ ముగ్ధు లధిపులు

మఱవరె బహుకార్యభారమగ్నులు కారే.69


చ. తలపఁగ నాఁడు వల్కినవిధం బెడఁ దప్పఁ దలంచె నొక్కొ చూ

డ్కులు విరసంబు లై కరము క్రూరము లైన నిమిత్త మేమియో

కలయఁగఁ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా

వలవదు బుద్ధిమంతులు నవ ప్రియము లైన ధరాధినాథులన్.70


వ. అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగంబున.71


క. మఱచినఁ దలఁపింపఁగ నగు

నెఱుఁగనినాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్

మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని

కఱటిం దెలుపంగఁ గమలగర్భునివశమే.72


వ. అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నా పూర్వవృత్తాంతం బెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కిట్లనియె.73


జననాథ వేటనెపమున

గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం

బున నందు నాకు నీయి

చ్చినవరము దలంప వలయుఁ జిత్తములోనన్.74


క. బాలార్కతేజుఁ డగు నీ

బాలుఁడు నీకొడుకు వీని బౌరవకులర

త్నాలంకారు నుదారగు

ణాలయు యువరాజుఁ జేయు మభీషేకముతోన్.75


- దుష్యంతుఁడు శకుంతలను నిరాకరించుట -

సం. 1-68-18


వ. అనిన విని దుష్యంతుండు దాని నంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ పోలె నిట్లనియె.76


క. ఏ నెఱుఁగ నిన్ను నెక్కడి

దానవు మిన్నకయ యనుచితంబులు పలుకం

గానేల యరుగు మంబురు

హానన యెందుండి వచ్చి తందులకు వడిన్.77


వ. అనిన విని వెల్ల నై వెచ్చనూర్చి నిశ్చేష్టితయై కెందమ్మి రేకులవలనందొరంగు జలకణంబుల పోలెఁ గోపారుణితనయనంబుల బాష్పకణంబులు దొరఁగం దలవాంచి యారాజుం గటాక్షించుచు హృదయసంతాపంబు దనకుఁ దాన యుపశమించుకొని పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కిట్లనియె.78


- కుపిత యైన శకుంతల దుష్యంతునకు ధర్మ ప్రబోధ మొనరించుట -

సం. 1-68-22


ఆ. ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ

వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగియెఱిఁగి

యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని

తప్పఁ బలుక నగునె ధార్మికులకు.79


చ. విమలయశోనిధీ పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే

దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్

యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా

ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునే తన్ను మ్రుచ్చిలన్.80



వోలం సురేష్ కుమార్

http://www.volamsite.com