ఆ భా 1 2 031 to 1 2 060

వికీసోర్స్ నుండి

1_2_31 తేటగీతి

అమ్మహాశ్వంబుధవళ దేహంబునందు

నల్ల గలిగిన నీ విప్డు నాకు దాసి

వగుము మఱి యందు నల్ల లేదయ్యెనేని

నీకు నే దాసి నగుదుఁ బన్నిదము సఱుము.

(ఆ గుర్రం శరీరంలో మచ్చ ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి. మచ్చ లేకపోతే నేనే నీకు దాసిని అవుతాను. అరచేతిలో చేయివేసి పందెం వేయి.)


1_2_32 వచనము

అని యిట్లిద్దఱు నొండొరులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు సఱచిన వినతి యయ్యశ్వంబు డాసి చూతము రమ్మనినఁ గద్రువయు నిప్పుడు ప్రొద్దులేదు ఱేపకడయ చూత మని యిద్దఱు మగుడి వచ్చితమ నివాసంబుల కుం బోయియున్నయప్పుడు.

(అలా వారు పందెం వేసుకున్నారు. వినత కద్రువతో ఆ గుర్రం దగ్గరకు వెళ్లి చూసివద్దాము అనగా కద్రువ, 'ఇప్పుడు కాదు. పతిసేవకి సమయమైంది. రేపు ఉదయమే చూద్దాము', అన్నది. ఇద్దరూ తిరిగి వారి నివాసాలు చేరుకున్నారు.)


1_2_33 సీసము

కద్రువ కొడుకులకడ కేఁగి యేను

మిమ్మందఱ వేఁడెద నన్నలార

నా పంపు సేయుండు నన్ను రక్షింపుఁడు

కామచారులకు దుష్కరము గలదె

యుల్ల తెల్లనితురగోత్తమువాలంబు

నల్ల సేసితి రేని నాకు దాసి

యగు మన వినత మీ రట్లు సేయనినాఁడు

దానికి మఱి యేను దాసి నగుదు


ఆటవెలది

జంటపన్నిదంబు సఱచితి మిట్లుగాఁ

ననినఁ బాము లెల్ల ననయ మిదియుఁ

దల్లి పనిచె నని యధర్మువు సేయంగ

నగునె యెఱుక గలరె మగువ లెందు.

(కద్రువ తన పుత్రులైన నాగుల వద్దకు వెళ్లి, "కుమారులారా! వినతతో నా పందెం ప్రకారం ఆ గుర్రం తోక మీద మీరు మచ్చ ఉండేలా చేస్తే తను నా దాసి అవుతుంది. మీరు అలా చేయకపోతే నేను ఆమెకి దాసిని అవుతాను. నన్ను కాపాడండి", అనగా ఆ పాములన్నీ, "ఇది నీతిలేని పని. తల్లి చెప్పిందని అధర్మం చేయవచ్చా?")


1_2_34 వచనము


అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభంబునకు సుముఖులు గాకయున్నఁ గద్రువ కోపోద్దీపితముఖియై.

(అని ఆలోచించి ఆ పని చేయటానికి ఇష్టపడకపోగా కద్రువ కోపంతో.)


1_2_35 కందము


అనుపమముగ జనమేజయుఁ

డను జనపతి సేయుసర్పయాగ నిమిత్తం

బునఁ బాములు పంచత్వము

పనియెడు మని యురగములకు శాపం బిచ్చెన్.

(జనమేజయుని సర్పయాగంలో పాములు మరణం పొందుగాక అని శపించింది.)


1_2_36 వచనము

అందు శాపానుభవభీతచిత్తుండై కర్కోటకుం డనువాఁ డు తల్లి పంచిన రూపంబున నుచ్చైశ్శ్రవంబువాలంబు నీలంబుగాఁ బట్టి వ్రేలుచున్న మఱు నాఁడు ఱేపకడయ కద్రువయు వినతయుం జని యత్తురంగంబుఁ జూచి వినత యోటుపడి కద్రువకు దాసియై నోసిపనులు సేయుచున్నంతఁ బంచశత వర్షంబులు నిండి రెండవయండం బవిసిన నందు.

(శాపానికి భయపడి కర్కోటకుడనే పాము, కద్రూవినతలు మరునాడు గుర్రాన్ని చూసేటప్పుడు, దాని తోక పట్టుకొని మచ్చలా కనపడేట్లు వేలాడటం వల్ల వినత పందెం ఓడిపోయి కద్రువకు దాసిగా పనిచేయసాగింది. కొంతకాలానికి వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలి.)


-:వినతకు గరుడుండు జనియించుట:-


1_2_37 ఉత్పలమాల

ఆతతపక్షమారుతరయప్రవికంపిత ఘూర్ణితాచల

వ్రాతమహార్ణవుండు బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా

ధూతపతంగతేజుఁ డుదితుం డయి తార్క్ష్యుఁ డు తల్లికిన్ మనః

ప్రీతి యొనర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్.

(మహాబలవంతుడైన గరుత్మంతుడు జన్మించి తల్లికి ఆనందం కలిగించేలా ఆకాశంలోకి ఎగిరాడు.)


1_2_38 కందము

దారుణకల్పాంత మరు

త్ప్రేరిత హవ్యవహశిఖలపెల్లిది యని బృం

దారకమునిబృందస్తుతి

బోరనఁ దా నగ్నిసూక్తములతో నెసగెన్.

(దేవతలు, మునులు అతడిని అగ్నిస్తోత్రాలతో స్తుతించారు.)


1_2_39 వచనము

అంత.

(అప్పుడు.)


1_2_40 కందము

హరికులిశక్షతి యెఱుఁ గని

గురుతరపక్షములతోడి కులగిరివోలెన్

గరుడండు గగసగతి నురు

తరజపమున నరుగుదెంచి తల్లికి మ్రొక్కెన్.

(పూర్వం ఇంద్రుడు తన వజ్రాయుధం ప్రయోగించి పర్వతాల రెక్కలు ఖండించాడు. ఆ వజ్రాయుధప్రయోగం ఎరుగని రెక్కలుగల పర్వతంలా గరుడుడు ఆకాశమార్గాన వచ్చి తల్లికి నమస్కరించాడు.)


1_2_41 వచనము

ఇట్లు నిజజననికి మ్రొక్కి కద్రువ పాలికిం బోయి.

(ఇలా తల్లికి మొక్కి కద్రువ వద్దకు వెళ్లి.)


1_2_42 చంపకమాల

తడయక మ్రొక్కియున్న వినతాసుతు నప్పుడు సూచి యాత్మలో

నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి నా

కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరుచుండుమ యేమి పంచినన్

మడవక చేయు మీ వని సమర్పణ సేసెఁ బ్రభుత్వ మేర్పడన్.

(నమస్కరించగా కద్రువ వినతపుత్రుడిని చూసి అసూయపడి అతడితో, 'నా కుమారులను ఎత్తుకొని తిరుగుతూ ఉండు. ఏ పని చెప్పినా తిరస్కరించవద్దు', అని తన కొడుకులను అతడికి అప్పగించింది.)


1_2_43 వచనము

గరుడండును గద్రువ పంచినపను లెల్లను వినత యనుమతంబున సతివినయపరుండై చేయుచు.

(గరుడుడు కూడా కద్రువ చెప్పిన పనులన్నీ వినత అంగీకారంతో చేస్తూ.)


1_2_44 కందము

ఆపన్నగముఖ్యులఁ దన

వీపునఁ బెట్టికొని పఱచి విపినములు మహా

ద్వీపములు గిరులు నఖిలది

శాపతిపురములును జూపె జన వారలకున్.

(ఆ నాగులను తన వీపుమీద పెట్టుకొని ఎగిరి, వారికి అడవులను, ద్వీపాలను, పర్వతాలను, అష్టదిక్పాలకుల నగరాలను చూపించాడు.)


1_2_45 వచనము

ఒక్కనాఁడు సప్తమారుతజవంబున సప్తాశ్వమండలంబుదాఁక నెగసిన నమ్మా ర్తాండు చండకిరణంబుల వేఁడిమి దాఁకి మాఁడి గరుడని వీపుననున్న యుర గులు దొరఁగి నేలంబడి మూర్ఛవోయినం జూచి కద్రువ గడునలిగి గరుడ నిం బదరి యతిభక్తి నింద్రు నారాధించి.

(ఒకరోజు గరుడుడు సూర్యమండలం వరకూ పైకెగరగా తీక్ష్ణమైన ఆ కిరణాలవేడికి అతడి వీపుపై ఉన్న పాములు మాడి, కిందపడి మూర్ఛపోగా, కద్రువ కోపంతో గరుత్మంతుడిని నిందించింది. తరువాత ఆమె ఇంద్రుడిని పూజించి.)


1_2_46 చంపకమాల

నరసురసిద్ధకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ

కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ

స్ఫురణన చేసి సుస్థిరతఁ బొందుఁ బురందర సర్వలోకసుం

దర శరణంబు నాకగుము దానవసూదన పాకశాసనా.

("ఓ ఇంద్రా! నాకు రక్షణ ప్రసాదించు")


1_2_47 వచనము

అని స్తుతియించి పర్జన్య ప్రసాదంబున మహావృష్టి గొడుకుల పయిం గురి యించి యయ్యురగుల విగతపరితాపులం జేసి కద్రువ గర్వంబున నుఱక గరుడని వినతనుం బనులు గొనుచున్నంత నొక్కనాఁడు గరుడండు తల్లి కిట్లనియె.

(అని ఇంద్రుడి అనుగ్రహంచేత కద్రువ తన కుమారులమీద వాన కురిసేలా చేసి వారికి ఉపశమనం కలిగించి, ఎవరినీ లక్ష్యపెట్టకుండా, వినత చేత, గరుడుని చేత పనులు చేయించుకుంటూ ఉండగా గరుడుడు తల్లితో ఇలా పలికాడు.)


1_2_48 ఉత్పలమాల

ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ

జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీ పనిం

బాయక వీపునం దవడుఁ బాముల మోవను వారికిం బనుల్

సేయను నేమి కారణము సెప్పుము దేనిఁ బయోరుహాననా.

("మహాబలవంతుడినైన నేను నీచమైన పాములను మోస్తూ, వాటికి సేవలు చేయటానికి కారణమేమిటి?")


1_2_49 వచనము

అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును దత్కారణంబైన యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యిట్లనియె.

(అప్పుడు వినత తనకు కద్రువతో జరిగిన పందెం వల్ల కలిగిన దాస్యం గురించీ, అనూరుడి శాపం గురించీ చెప్పి.)


1_2_50 కందము

నీకతమున నా దాస్యము

ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం

జేకొని యూఱడి నిర్గత

శోకస్థితి నున్న దానఁ జూవె ఖగేంద్రా.

(నీ కారణంగా నా దాసీత్వం పోతుందన్న అనూరుని మాట నన్ను ఊరడిస్తున్నది.)


1_2_51 వచనము

కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుమలు వాయుట యెందునుం గలయది గావున నీయట్టి సత్పుత్త్రుం బడసియు దాసినై యుండుదాననే యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుండై యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.

(కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రుల కష్టాలు తీరడం సహజమే. నీవంటి కుమారుడు ఉన్న నేను ఇంకా దాసిగా ఉంటానా, అన్న వినత మాటలు విని గరుడుడు దుఃఖితుడై కద్రువ పుత్రులతో ఒకరోజు ఇలా అన్నాడు.)


1_2_52 కందము

మా యీదాస్యము వాయు ను

పాయము సేయుండు నన్నుఁ బనుపుం డిష్టం

బేయది దానిన తెత్తు న

జేయుఁడనై యమరవరులచేఁ గొనియైనన్.

(మా దాస్యం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి. దేవతలను ఎదిరించైనా మీరు కోరింది తెస్తాను.)


1_2_53 వచనము

అనిన నయ్యురగులు గరుడని కిట్లనిరి.

(ఆ నాగులు జాలిపడి గరుడునితో ఇలా అన్నారు.)


1_2_54 చంపకమాల

అమితపరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరో

త్తముఁడవు పూని నీదయిన దాస్యముఁ బాచికొనంగ నీకుఁ జి

త్తము గలదేని భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా

కమృతము దెచ్చి యిమ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్.

(అలా అయితే మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్మని వారు చెప్పగా గరుడుడు సంతోషంతో.)


-:గరుత్మంతుం డమృతంబుఁ దెచ్చుటకుఁ దల్లి యనుమతిఁ గొనుట:-


1_2_55 వచనము

అట్ల చేయుదు నమృతంబు దెచ్చి మీ కిచ్చి యేనునుం దల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువార మని నొడివి తద్వృత్తాంతం బంతయుం దల్లికిం జెప్పి యమృతహరణార్థం బరిగెద నని మ్రొక్కిన వినత సంతసిల్లి కొడుకుం గౌఁగిలించుకొని.

(అలాగేనని, వినత దగ్గరకు వెళ్లి అమృతం తేవటానికి వెళ్తాననగా, ఆమె కొడుకును కౌగిలించుకొని.)


1_2_56 చంపకమాల

అనిలుఁడు పక్షయుగ్మ మమృతాంశుఁడు వీ పనలుండు మస్తకం

బినుఁడు సమస్తదేహమును నెప్పుడుఁ గాచుచు నీ కభీష్టముల్

ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత యున్నతియున్ జయంబుఁ జే

కొనుమని యిచ్చె దీవనలు గోరి ఖగేంద్రునకున్ ముదంబునన్.

(దేవతలు నిన్ను రక్షిస్తారు గాక అని ఆశీర్వదించింది.)


1_2_57 వచనము

గరుడండును దల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై యమృతంబు దెచ్చునప్పుడు లావు గలుగవలయు నా కాహారం బుపదేశింపు మనిన వినత యిట్లనియె.

(గరుడుడు ఆమె దీవెనలు పొంది, "అమృతం తెచ్చే సమయంలో తగిన బలం కోసం నాకు ఆహారం అనుగ్రహించ", మనగా ఆమె ఇలా అన్నది.)


1_2_58 కందము

విషనిధికుక్షి నసంఖ్యము

నిషాదగణ ముండి ధారుణి ప్రజకుఁ గడున్

విషమమును జేయు దాని

నిమిషమున భక్షించి చను మమిత్రవిఘాతీ.

("సముద్రగర్భంలో ఉన్న నిషాదులు భూమిలోని ప్రజలకు కష్టాలు కలిగిస్తున్నారు. వారిని తినవచ్చు.")


1_2_59 వచనము

భక్షణవిషయంబున బ్రాహ్మణునిం బరిహరించునది యనిన గరుడండు నాకు బ్రాహ్మణు నెఱుంగు తెఱం గెఱింగింపు మనిన వినత యిట్లనియె.

("తినే సమయంలో బ్రాహ్మణులను విడిచిపెట్టు", అనగా గరుడుడు బ్రాహ్మణుడెవరో తెలుసుకోవడం ఎలా అని అడిగాడు. వినత ఇలా చెప్పింది.)


1_2_60 కందము

రయమున మ్రింగుడు గాలము

క్రియ నెవ్వఁడు కంఠబిలము క్రిందికిఁ జనక

గ్నియపోలె నేర్చుచుండును

భయరహితా వాని నెఱుఁగు బ్రాహ్మణుఁ గాఁగన్.

("వారిని మింగేటప్పుడు, గాలంలా గొంతులోకి దిగకుండా, అగ్నిలా కాల్చేవాడిని బ్రాహ్మణుడిగా గుర్తించు")