ఆ భా 1 1 061 to 1 1 090

వికీసోర్స్ నుండి

1_1_60 కందము

ఒనరుఁ ద్రయోదశపర్వం

బనఁగా ననుశాసనాద్యమగు పర్వయుగం

బున మేలై విబుధశ్రే

ణినుతంబై యానుశాసనికపర్వ మిలన్


(అనుశాసనం మొదలైన రెండు ఉపపర్వాలతో అనుశాసనిక పర్వం భారతంలోని పదమూడవ పర్వమౌతోంది.)


1_1_61 వచనము

మఱియు నశ్వమేధారంభంబును సంవర్తమరుత్తీయోపాఖ్యానంబును స్వర్ణకోశసంప్రాప్తియు నుత్తరగర్భంబున నశ్వత్థామాస్త్రదగ్ధుండై శ్రీకృష్ణుచేత సంజీవితుండయిన పరీక్షితుని జన్మంబు నర్జును నశ్వానుసరణంబు నెడనెడ రాజులతోడి యుద్ధంబును జిత్రాంగదపుత్త్రుండైన బభ్రువాహనుం డాహవంబున నర్జునుం బరిభవించుటయు నశ్వమేధ మహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును ననుగీతయు బ్రాహ్మణగీతయు గురుశిష్యసంవాదంబును ననువృత్తాంతంబుల నొప్పి నాల్గువేలు నన్నూట యిరువది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4420 శ్లోకాలు కలిగి.)


1_1_62 తేటగీతి

అభిమతంబగు నశ్వమేధాదికద్వి

పర్వయుతమై చతుర్దశపర్వ మనఁగ

నాశ్వమేధికపర్వ మత్యంత నిబిడ

వస్తువిస్తారమై బుధవరుల సభల.

(అశ్వమేధం మొదలైన రెండు ఉపపర్వాలతో ఆశ్వమేధికపర్వం భారతంలోని పదునాల్గవ పర్వమౌతోంది.)


1_1_63 వచనము

మఱియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదురసంజయ సహితంబుగా నాశ్రమవాసంబునకుఁ జనుటయు సకలరాజ్యభారధౌరేయులైన కొడుకుల విడిచి కుంతీదేవి గురుశుశ్రూషాపరయయి వారి పిఱుందన పోవుటయు సమరనిహతులైన పుత్త్రపౌత్త్రుల నెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవరప్రసాదంబునఁ గాంచి విగతశోకుండయి గాంధారీ కుంతీ విదుర సంజయులతోఁ బరమసిద్ధికిం జనుటయుఁ బాండవులు నారదువలన నిఖిలయాదవ వ్యసనం బెఱుంగుటయు నను వృత్తాంతంబుల నొప్పి వేయునూటయాఱు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 1106 శ్లోకాలు కలిగి.)


1_1_64 కందము

అమితార్థయుక్తితో నా

శ్రమవాసాది త్రిపర్వసహితం బయి యా

శ్రమవాసపర్వ మత్యు

త్తమ కథలను వెలయుఁ బంచదశపర్వంబై.


(ఆశ్రమవాసం మొదలైన మూడు ఉపపర్వాలతో ఆశ్రమవాసపర్వం భారతంలోని పదునైదవ పర్వమౌతోంది.)


1_1_65 వచనము

మఱియు యాదవులెల్ల మదిరాపానపరవశు లయ శాపనిమిత్తంబున సముద్రతీరంబునఁ దమలోఁ బోరి పొడిచికొని పరలోకగతు లగుటయు దాని నెఱింగి రామకృష్ణాదియాదవ విరహితంబయిన ద్వారవతి కర్జునుం డరిగి విషణ్ణచిత్తుండయి వసుదేవాది యాదవులనెల్ల సంస్కరించి యాదవకళత్రంబుల నెల్లఁ దోడ్కొని వచ్చుచో గాండీవదివ్యబాణంబులశక్తి దఱిఁగిన వనచరభయంబువలనఁ దత్కళత్రంబుల రక్షింప నోపమియు నర్జునుండు ధర్మరాజుకడకు వచ్చి వ్యాసవాక్యప్రబోధితుండై సన్న్యసించుటయు నను వృత్తాంతంబుల నొప్పి మున్నూఱు శ్లోకంబులు గలిగి పదియాఱవ పర్వంబై మౌసలపర్వం బునాఁ బరగె మఱియుఁ బరీక్షిద్రాజ్యాభిషేకంబును రాజ్యపరిత్యాగము సేసి పాండవు లేవురు ద్రౌపదీసహితులై పరమసిద్ధికిం జనుటయు నను వృత్తాంతంబుల నొప్పి నూటయిరువది శ్లోకంబులు గలిగి పదియేడవ పర్వంబై మహాప్రస్థానికంబునాఁ బరగె. మఱియుఁ గర్ణు నరకప్రాప్తియుఁ దన్మోక్షణంబును స్వర్గంబున భారతవీరుల సంగమంబును గర్మపరిపాకోపభోగంబు నను వృత్తాంతంబుల నొప్పి యిన్నూఱు శ్లోకంబులు గలిగి పదునెనిమిదవ పర్వంబై స్వర్గారోహణంబునాఁ బరగె ని ట్లష్టాదశపర్వంబులు గలిగి.

(300 శ్లోకాలతో మౌసలపర్వం భారతంలోని పదహారవ పర్వం, 120 శ్లోకాలతో మహాప్రస్థానికం పదునేడవది, 200 శ్లోకాలతో స్వర్గారోహణం పదునెనిమిదవది అవుతున్నాయి.)


-:భారతసంహితానిర్మాణప్రశంస:-

1_1_66 మత్తేభము

అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థమలచ్ఛాయమై

సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో

త్తమనానాగుణకీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజా

తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.


(కథలనే కొమ్మలతో, వేదార్థమనే నీడతో, ధర్మార్థకామమోక్షాలనే పూలతో, కృష్ణార్జునుల సద్గుణాలను ప్రశంసించటం వలన కలిగే మేలు అనే పండ్లతో వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన భారతం అనే కల్పవృక్షం ప్రార్థింపదగినది.)

1_1_67 వచనము

ఇట్టి మహాభారతంబు ననేకవిధ పదార్థ ప్రపంచ సంచితంబు నుపపర్వ మహా పర్వోపశోభితంబు నుపద్వీపమహాద్వీప సంభృతం బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె గరుడ గంధర్వ యక్షరాక్షస లోకంబులందు వక్కాణింప శుకుం బనిచె నాగలోకంబు నందు వక్కాణింప సుమంతుం బనిచె. మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నేనా వైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుం బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా ఘోరయుద్ధం బయ్యె నందు.

(ఉపద్వీపమహాద్వీపాలు గల భువనాన్ని బ్రహ్మ నిర్మించినట్లు ఉపపర్వమహాపర్వాలు గల మహాభారతాన్ని వ్యాసుడు మూడు సంవత్సరాలలో నిర్మించి, దాన్ని, దేవలోకంలో చెప్పడానికి నారదుని, పితృలోకంలో చెప్పడానికి నల్లనివాడైన దేవలుని, గరుడగంధర్వయక్షరాక్షసలోకాల్లో చెప్పడానికి శుకుని, నాగలోకంలో చెప్పడానికి సుమంతుని, మనుష్యలోకంలో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయనుని పంపాడు. నేను ఆ వైశంపాయనుని వద్ద మహాభారతకథ విని వచ్చాను. కృతయుగాంతంలో దేవదానవులకు, త్రేతాయుగాంతంలో రామరావణులకు యుద్ధాలు జరిగినట్లు ద్వాపరయుగాంతంలో పాండవులకూ కౌరవులకూ మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో.)


1_1_68 తరలము

పదిదినంబులు భీష్ముఁ డాహవభారకుండు గురుండు పం

చదివసంబులు గర్ణుఁడున్ దివసద్వయంబు దినార్ధమం

దుదితతేజుఁడు శల్యుఁ డత్యధికోగ్ర వీరగదారణం

బది దినార్ధము గాఁగ నిట్లు మహాభయంకరవృత్తితోన్


(భీష్ముడు పది రోజులు, ద్రోణుడు అయిదు రోజులు, కర్ణుడు రెండు రోజులు, శల్యుడు సగం రోజు యుద్ధభారం వహించారు. భీమునికి దుర్యోధనునికి మధ్య గదాయుద్ధం మిగిలిన సగం రోజులో జరిగింది. ఇలా భయంకరంగా.)


1_1_69 శార్దూలము

ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షౌహిణుల్

రూఢిం గౌరవసైన్య మీ యుభయమున్ రోషాహతాన్యోన్యమై

యీడంబోవక వీఁకమైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న

ల్లాడెన్ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్.

(పాండవసేన 7 అక్షౌహిణులు, కౌరవసేన 11 అక్షౌహిణులు. వీరి మధ్య 18 రోజులు జరిగిన ఘోరయుద్ధం వల్ల శమంతకపంచకం అనే చోట భూమి చలించిపోయింది.)


1_1_70 వచనము

ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయనమహాముని విరచితంబై ప్రవర్తిల్లుచుండు.

(ఇటువంటి మహాభారతం వ్యాసమహామునివిరచితమైనది.)


1_1_71 సీసము

ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక

విహితావధానులై వినుచునుండు

వారికి విపులధర్మారంభసంసిద్ధి

యగుఁ బరమార్థంబ యశ్రమమున

వేదముల్ నాలుగు నాదిపురాణముల్

పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ

శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్త్వంబులు

నెఱిఁగిన ఫల మగు నెల్లప్రొద్దు

ఆటవెలది

దానములను బహువిధక్రతుహుతజప

బ్రహ్మచర్యములను బడయఁబడిన

పుణ్యఫలముఁ బడయఁబోలు నశేషపా

పక్షయంబు నగు శుభంబుఁ బెరుఁగు

(ఈ మహాభారతాన్ని శ్రద్ధతో వినేవారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. శుభం వర్ధిల్లుతుంది.)


1_1_72 ఉత్పలమాల

సాత్యవతేయవిష్ణుపదసంభవమై విబుధేశ్వరాబ్ధి సం

గత్యుపశోభితం బయి జగద్విదితం బగు భారతీయ భా

రత్యమరాపగౌఘము నిరంతరసంతతపుణ్యసంప దు

న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.


(ఈ పద్యంలో నన్నయ మహాభారతాన్ని ఆకాశగంగగా వర్ణించాడు. విశేషణాలను రెండిటి పరంగానూ అన్వయించుకోవచ్చు. సత్యవతీ పుత్రుడైన వ్యాసుని వాక్కు నుండి పుట్టినది(లేదా వ్యాసుడనే ఆకాశం(విష్ణుపదం) నుండి పుట్టినది), పండితుల స్నేహం చేత ప్రకాశించేది (లేదా సాగరసంగమం చేత ప్రకాశించేది) అయిన భారతం అనే గంగాప్రవాహాన్ని విన్నా, కొనియాడినా అందరికీ అభివృద్ధిని కలిగిస్తుంది.)


1_1_73 వచనము

అనిన విని శౌనకాది మహామునులు శ్రీమహాభారతకథాశ్రవణకుతూహల పరులయి యక్కథకున కిట్లనిరి.

(అప్పుడు శౌనకాది మహామునులు మహాభారతకథ వినాలనే కుతూహలంతో ఆ కథకునితో ఇలా అన్నారు)


-:శమంతపంచకాక్షౌహిణీ సంఖ్యాకథనము:-


1_1_74 మత్తేభము

అనఘా మున్ను శమంతపంచకము నయ్యక్షౌహీణీసంఖ్యయున్

వినఁగా మా కెఱిఁగించి భారతకథావిర్భూతికిం గారణం

బును దద్భారతవిస్తరోక్తివిభవంబుం బాండవాడంబరం

బును భీష్మాదికురుప్రవీరచరితంబుం జెప్పు ముద్యన్మతిన్


(రౌమహర్షణీ! శమంతపంచకం అంటే ఏమిటో, అక్షౌహిణి అంటే ఏమిటో మాకు తెలిపి భారతకథకు కారణం, పాండవుల గొప్పదనం, భీష్మాది కురువీరుల చరితం తెలియజేయండి.)


1_1_75 కందము

అనిన విని రోమహర్షణ

తనయుం డమ్మునుల కతిముదంబున వినయా

వనతుఁ డయి గురులఁ దన హృ

ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్.


(అప్పుడు ఆ రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు తన గురువులను స్మరించి సరస్వతీగణపతులను కొలిచి.)


1_1_76 ఉత్పలమాల

ఇంబుగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబిం

బంబున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం

ధ్రం బను నంజలిం దవిలి త్రావుదు రట్టి మునీంద్రలోక వం

ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్


(ఎవరి ముఖమనే చంద్రబింబం నుంచి పుట్టిన భారతంలోని వాక్కులనే అమృతాన్ని ప్రజలు కర్ణరంధ్రాలనే దోసిళ్లతో తాగుతారో అటువంటి శ్రేష్ఠుడు, పరాశరుని పుత్రుడు అయిన వ్యాసునికి నమస్కరించి.)


1_1_77 వచనము

అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగాఁ జెప్పందొడంగె.

(ఆ మునులడిగిన కథను యథాక్రమంలో వివరంగా చెప్పనారంభించాడు.)


1_1_78 శార్దూలము

త్రేతాద్వాపరసంధి నుద్ధతమదాంధీభూతవిద్వేషి జీ

మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ

ప్రీతిన్ వైరిధరాతలేశ్వరులఁ జంపెం బల్వురన్ దీర్ఘని

ర్ఘాతక్రూరకుఠారలూననిఖిలక్షత్త్రోరుకాంతారుఁడై.

(త్రేతాద్వాపర యుగాల సంధికాలంలో, గర్వించిన శత్రువులనే మేఘాలకు వాయువైన పరశురాముడు ఇరవైయొక్కసార్లు వజ్రంలా కఠినమైన గొడ్డలితో సర్వక్షత్రియులనే గొప్ప అడవిని ఖండించినట్లు రణప్రీతితో శత్రురాజులను సంహరించాడు.)


1_1_79 వచనము

అప్పరశురాముండు నిజనిశతకుఠారధారావిదళిత సకలక్షత్త్రరుధిరాపూర్ణం

బులుగా నేనుమడుంగులు గావించి తద్రుధిరజలంబులఁ బితృతర్పణంబు సేసి

తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె దానన చేసి తత్సమీప ప్రదే

శంబు శమంతపంచకంబునాఁ బరగె మఱి యక్షౌహిణీ సంఖ్య వినుండు.

(ఆ పరశురాముడు తన గొడ్డలి చేత సంహరించిన క్షత్రియుల రక్తంతో అయిదు కొలనులు ఏర్పరిచి, ఆ రుధిరజలంతో పితృతర్పణం చేసి, తన పితృదేవతల ప్రార్థనచేత తన కోపాన్ని ఉపశమింపజేశాడు. అందువల్ల ఆ స్థలానికి శమంతపంచకం అనే పేరు కలిగింది. ఇక అక్షౌహిణి అంటే ఏమిటో వినండి.)


1_1_80 సీసము

వరరథ మొక్కండు వారణ మొక్కండు

తురగముల్ మూఁడు కాల్వురును నేవు

రను సంఖ్యగలయది యగుఁ బత్తి యది

త్రిగుణం బైన సేనాముఖంబు దీని

త్రిగుణంబు గుల్మంబు దీని ముమ్మడుఁగగు

గణము తద్గణము త్రిగుణితమైన

వాహినియగు దాని వడి మూఁట గుణియింపఁ

బృతననాఁ బరగుఁ దత్పృతన మూఁట


ఆటవెలది


గుణితమైనఁ జము వగున్ మఱిదాని ము

మ్మడుఁ గనీకినీసమాఖ్య నొనరు

నదియుఁ బదిమడుంగులైన నక్షౌహిణి

యౌ నిరంతర ప్రమాను సంఖ్య.


(ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాలిబంట్లు ఉన్న సైన్యవిభాగాన్ని 'పత్తి' అంటారు.

అలాంటి విభాగాలు మూడు ఉంటే 'సేనాముఖం' అవుతుంది.

మూడు సేనాముఖాలు ఒక 'గుల్మం'.

అవి మూడు ఉంటే ఒక 'గణం'.

మూడు గణాలు ఒక 'వాహిని'.

అవి మూడు ఉంటే ఒక 'పృతన'.

మూడు పృతనలు ఒక 'చమువు'.

మూడు చమువులు ఒక 'అనీకిని'.

అవి పది ఉంటే ఒక 'అక్షౌహిణి' అవుతుంది.)


1_1_81 వచనము

ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నఱువదేనువేలు నాఱునూటపది గుఱ్ఱంబులు, లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూట యేఁబండ్రు వీరభటులును గలయది యొక్క యక్షౌహిణి యయ్యె; నట్టి యక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరగె; నట్టి కురుక్షేత్రంబునందు.

(21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది భటులు కల సైన్యవిభాగం ఒక అక్షౌహిణి. అటువంటి పద్ధెనిమిది అక్షౌహిణులతో కురుపాండవులు యుద్ధం చేయటం వల్ల ఆ శమంతపంచకానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. అలాంటి కురుక్షేత్రంలో.)


1_1_82 చంపకమాల

ప్రతిహతశత్రువిక్రముఁడు పాండవవంశవివర్ధనుండు సు

వ్రతుఁడు పరీక్షిదాత్మజుఁ డవద్యవిదూరుఁ డుదారకీర్తి ని

ర్మితవివిధాధ్వరుండు జనమేజయుఁ డన్ జనపాలుఁ డుత్తమ

స్తుతమతి దీర్ఘసత్త్ర మజితుం డొనరించె శుభాభికాంక్షియై.


((ఆ కురుక్షేత్రంలో) గొప్పవాడు, పరీక్షిత్తు కుమారుడు అయిన జనమేజయుడు శుభాన్ని కోరుతూ దీర్ఘకాలం సాగే యజ్ఞాన్ని చేశాడు.)


-:సరమ వృత్తాంతము - జనమేజయుని పురోహిత వరణము:-

(ఇక్కడి నుండి భారతకథ ఆరంభమౌతుంది.)


1_1_83 వచనము

ఆప్రదేశంబునకు సరమయను దేవశుని కొడుకు సారమేయుండను కుర్కుర కుమారుండు క్రీడార్థంబు వచ్చి క్రుమ్మరుచున్న నలిగి జనమేజయు తమ్ములు శ్రుతసేనుండును నుగ్రసేనుండును ననువార లాసారమేయు నడిచిన నది యఱ చుచుం బఱతెంచి తనతల్లికిం జెప్పిన నాసరమయు నతికోపాన్వితయై జనమే జయునొద్దకు వచ్చి యిట్లనియె.

(ఆ ప్రదేశానికి, సరమ అనే పేరు గల దేవతల కుక్కకు కొడుకైన సారమేయుడనే కుక్కపిల్ల వచ్చి ఆడుకోసాగింది. అందుకు జనమేజయుని తమ్ములైన శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు కోపించి సారమేయుని కొట్టగా, ఆ కుక్కపిల్ల ఏడుస్తూ తన తల్లి అయిన సరమకు ఆ విషయం చెప్పింది. ఆమె కోపంతో జనమేజయుని వద్దకు వచ్చి ఇలా అన్నది.)


1_1_84 కందము

క్షితినాథ కడు నకరుణా

న్వితులై నీతమ్ము లతివవేకవిదూరుల్

మతి దలఁపక నాపుత్త్రకు

నతిబాలకు ననపరాధు నడిచిరి పెలుచన్.

(ఓ రాజా! అవివేకులైన నీ తమ్ములు, దయ లేకుండా, చిన్నవాడని కూడా చూడక, ఎలాంటి నేరమూ చేయని నా కుమారుని కోపంతో కొట్టారు.)

1_1_85 కందము

తగు నిది తగ దని యెదలో

నగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్

మొగిఁ జేయు దుర్వినీతుల

కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్.


(ఇది సరైన పనా కాదా అని ఆలోచించకుండా మంచివారికీ, పేదవారికీ కీడు చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు కలుగుతాయి.)


1_1_86 వచనము

అని సరమ యదృశ్యయైన నతివిస్మితుండై జనమేజయుండు కొన్నిదినంబులకు దీర్ఘసత్త్రంబు సమాప్తంబు సేసి హస్తిపురంబునకుం జని యందు సుఖంబుండి యొక్కనాఁడు దేవశునివచన ప్రతీకారార్ధంబు శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తింప ననురూప పురోహితు నన్వేషించుచు ననేక మునిగణా శ్రమంబులకుం జని యెక్క మునిపల్లెం గని యందు శ్రుతశ్రవసుండను మహామునిం గని నమస్కరించి యిట్లనియె.

(అని సరమ అదృశ్యమవగా జనమేజయుడు విస్మితుడయాడు. కొన్ని రోజులకు యజ్ఞాన్ని పూర్తిచేసి, హస్తినాపురానికి వెళ్లి, కొంతకాలానికి, సరమ మాటలకు ఉపశాంతి జరిగేలా కర్మలు చేయగల పురోహితుని వెదుకుతూ, శ్రుతశ్రవసుడనే ముని వద్దకు చేరి ఇలా అన్నాడు.)

1_1_87 కందము

కరుణించి యిండు నాకుం

బురోహితుఁడు గాఁగ మీసుపుత్త్రుఁ బవిత్రుం

బరమతపోనైష్ఠికు భా

సురయమనియమాభిరాము సోమశ్రవసున్.

(గొప్పవాడు, మీ కుమారుడు అయిన సోమశ్రవసుడిని నాకు పురోహితునిగా సమర్పించండి.)


1_1_88 వచనము

అని యడిగి వాని యనుమతంబున సోమశ్రవసుం దనకుం బురోహితుం గావించుకొని వాని నభీష్టాసత్కారంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున.

(శ్రుతశ్రవసుని అనుమతితో సోమశ్రవసుడిని తన పురోహితునిగా చేసుకొని, అతడిని సన్మానించి, అతడు ఉపదేశించగా.)


1_1_89 ఉత్పలమాల

ఆయతకీర్తితో వివిధయాగములన్ సురధారుణీసురా

మ్నాయము నాహితాహుతి సమంచితదక్షిణ లిచ్చి తన్పుచుం

జేయుచునుండె రాజ్యము విశిష్ఠజనస్తుత వర్ధమానల

క్ష్మీయుతుఁ డుత్తముండు జనమేజయుఁ డాదినరేంద్రమార్గుఁడై.


(గొప్పవాడైన జనమేజయుడు పూర్వపు రాజులు చేసినట్లు యజ్ఞాలు, దానాలు నిర్వహిస్తూ రాజ్యం చేయసాగాడు.)

1_1_90 వచనము

ఇ ట్లనవరత శాంతికపౌష్టికక్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవ తర్పణాభిరతుండై యుండునంత.

(ఇలా శాంతి, శ్రేయస్సులను కలిగించే కర్మలు చేస్తూ, గురుదేవమహీదేవులను తృప్తిపరిచే ఆసక్తి కలిగి ఉండగా.)