ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/నూతనపరిస్థితులు

వికీసోర్స్ నుండి

మావిద్యాభివృద్ధికొఱకునుఁ మాతల్లి సదా పాటుపడెను. ఆపదయందు ధైర్యము, సంపదయం దణవకువయును విడువక, ఆయిల్లాలు సంసార యాత్ర సలిపెను. ఇట్టి సుగుణాన్వితయగు జనని గర్భావాసమున నుద్భవించుట మహాభాగ్యముగదా ! దయామయుఁడగు భగవంతుఁడు మాజననీ జనకుల కాత్మశాంతి యొసంగి, వారి సుగుణములు వంశమున నిలుచునటు లను గ్రహించుఁగాక !

9. నూతనపరిస్థితులు

నేను గుంటూరు వచ్చుటకుఁ బూర్వమే "జనానాపత్రికా" ప్రకటనము నిలిచిపోయెను. పత్రికాధిపత్యమును, పుస్తకముల స్వామ్యమును, వెనుక గున్నేశ్వరరావుగారి కిచ్చివేసితిని. ఇపు డవి తిరిగి వారి నుండి నేను గైకొంటిని. కాని, పత్రికను పునరుద్ధారణము చేయ నెన్ని మాఱులు నేను సంకల్పించినను, ఆకార్యము కొనసాగలేదు. గుంటూరు కళాశాలలోపని యెక్కువగ నుండుటచే మరల పత్రికను నెలకొల్పుటకు నేను వెఱచితిని. సంవత్సరములనుండి జరుగు సంస్థకొక సారియంత రాయమేమైన సంభవించెనా, దానిని బునరుద్ధరించుట కన్నియు ప్రతిబంధములే యగుచుండును. వ్రాయు నభ్యాసము నాకు క్రమక్రమముగ తగ్గిపోవుటచేత, పత్రికాప్రకటనము కష్టముగఁ దోఁచి, దానియం దనిష్టము గలిగెను. ఆపత్రిక కాకపోయిన వేఱొకటి నెలకొల్పరాదాయని మిత్రు లనిరి. ఒకానొక సమయమున మరల పత్రిక నొకటి స్థాపింప నెంచి, పత్రికకు మంచి పేరు కుదుర్చుఁ డని తోడి యుపధ్యాయ మిత్రులగు వంగిపురపు కృష్ణమాచార్యులుగారి నడిగితిని. నాకు స్ఫురించిన "విద్యావిలాసిని" అను పేరు మంచిదని యాచార్యులవారు సమర్థించిరి. "సత్యసంవర్థని"నె యేల పునరుద్ధ

1908. ఎడమనుండి కుడివైపునకు: 1. పంక్తి. రాయసం కృష్ణమూర్తి, వెంకటశివుడు, వెంకటరామయ్య,

2 పంక్తి. సుభద్ర, మహలక్ష్మి, కనకమ్మయు, రత్నమ్మ, రత్నమ్మ సీతమ్మయు, నరసింహము.

3 పంక్తి. సుబ్బారాయుడు, సీతమ్మ, సూర్యనారాయణ.

రింపరా దని నా కంతఁ దోఁచెను. ఒక పర్యాయము విరమించిన పత్రికను మరల జరుపుట అశుభసూచకముగఁ గానఁబడెను ! వీని యన్నిటి పర్యవసానము, మరల నే నే పత్రికను నెలకొల్ప కుండుటయే ! పత్రికాస్థాపనమును గూర్చి తగినంత నిశ్చయోత్సాహము లుండె నేని, తీఱిక లేకుండుట, మంచిపేరు దొరకకుండుట మున్నగు సాకు లెవ్వియు నడ్డుపడెడివి కావు.

నాచేత ప్రత్యేకపత్రిక యొకటి లేకున్నను, ఇతర పత్రికలకు వ్రాయుచునే వచ్చితిని. "మద్రాసు స్టాండర్డు" "సంఘసంస్కారిణీ" పత్రికలకు నే నపుడపుడు వ్రాయుచుండువాఁడను. ఆంధ్ర పత్రిక సంవత్సరాదిసంచికకు వ్యాసమేదియైన వ్రాయుఁడని, పూర్వము 'జనానాపత్రిక' ను జదువుచుండెడి శ్రీ కాశినాధుని నాగేశ్వరరావు పంతులుగారియొద్ద నుండి వచ్చినపిలుపు నాదరించు చుండువాఁడను. ఇట్లు నేను వ్రాఁత బొత్తిగ మఱచిపోకుండ నేదో యొకటి గోఁకుచు వచ్చితిని గాని, ఈకాలమున మొత్తముమీఁద నాకలము త్రుప్పుపట్టి యుండె ననియే చెప్పవలెను.

గుంటూరు వచ్చిన మొదటిదినములలో నావ్రాఁత యిట్లు తగ్గి పోయినను, తక్కిన కర్మకాండకేమియు వ్యాఘాతము గలుగలేదు. ప్రార్థనసమాజప్రచారము సంగతి యిదివఱకే ప్రస్తావించితిని. 'మంగల వానిని జూచి యెద్దుకంటె' ననునట్టుగ, గత సంవత్సరముననే నుండు విజయనగరమున "విద్యార్థి సమావేశము" జరిగెను గాన, ఈసారి నేనుండు గుంటూరునం దద్దానిద్వితీయ సమావేశము జరుప నిచటి విద్యార్థులు సంకల్పించుకొనిరి ! ఈసభను జరుపుటకై, గుంటూరు కళాశాల పురవిద్యాలయములం దుండు విద్యార్థు లొక సమాజముగ నేర్పడి, తమలోఁ గొందఱిని, పట్టణప్రముఖులలోఁ గొందఱిని, "ఆహ్వాన సంఘము"గ నేర్పఱిచిరి. ఈసభాకార్యక్రమమును క్రమముగ జరిపించు భారమును పురపాఠశాలాధికారియగు ఏకా రామయ్యగారిమీఁదను, నామీఁదను వేసిరి. శ్రీ పతి శ్రీనివాసరావుగారు సభకధ్యక్షులైరి. ఆంధ్రమండలములనుండి విద్యార్థి ప్రతినిధులు పలువురు విచ్చేసిరి. వక్తలలో ప్రముఖులు బందరు వంగవోలు కళాశాలాధ్యక్షులు. సభ జయప్రదముగ జరిగెను.

1903 - 4 సంవత్సరములకే మా కుటుంబ పూర్వఋణము లన్నియుఁ దీఱిపోయెను. అంతటినుండియు మువ్వురు సోదరులమును సంపాదించిన ధనమును గొంత నిలువచేసికొనుచు వచ్చితిమి. 1908 వ సంవత్సరారంభమున మాత లోకాంతరగతయైన పిదప, సోదరుల మిఁక వేఱుపడుట యావశ్యకమని నేను మాతమ్ములతో గట్టిగఁ జెప్పితిని. జననీజనకులు కీర్తిశేషులగుటయె సమష్టికుటుంబ సూత్రమునకు విచ్ఛేదము గలుగుటగదా! ఇపుడు సోదరుల మెవరికుటుంబ పోషణము వారలము చేసికొనుచున్నారము. వారివారి యగత్యములను బట్టియు, ప్రజ్ఞానైపుణ్యములను బట్టియు ధననిక్షేపణ కార్యము జరుగఁగలదు. ఎల్ల కాలమును సోదరు లందఱును గలసియుందు మను కొనుట వెఱ్ఱిపని. దీనివలన నన్నదమ్ములలో నైకమత్యమునకు మాఱుగా ద్వేషభావ మేర్పడవచ్చును. కావున ముందును సోదరు లందఱమును సమరసభావమున మెలఁగఁగోరితిమేని, యీసమయముననే విడిపోవుట యుక్తమని నేను నొక్కి చెప్పితిని. అప్పటికప్పుడే తమ్ముఁడు వెంకటరామయ్య సుమారైదు వేల రూపాయిల విలువ గల స్థిరాస్తిని సంపాదించెను. ఇంకఁగొంతకాలము గలసియుండి, ఆస్తి నింకను బెంపొందించిన పిమ్మట, వేఱుపడుట యుక్తమని యాతని యభిప్రాయము. కాని, యిది యిఁకఁ బొసఁగదని నేను జెప్పి, కాల విలంబన మయ్యెనేని, భూవసతికి మాఱుగా గృహకల్లోలములు పెచ్చు పెరుఁగునని నేను హెచ్చరించుటచేత, 1908 వ సంవత్సర మధ్యమున సోదరులము వేఱుపడితిమి. నేను జెప్పినచొప్పుననే, మేము వేఱుపడిన పిమ్మట, సోదరులలో వైషమ్యములకు మాఱుగా స్నేహభావ మతిశయించెను. దైవానుగ్రహమున వేఱువేఱుగ మంచియాస్తిని సంపాదించుకొనఁగలిగితిమి. చీఁకటి రాత్రుల వెనుక వెన్నెల రేలు వచ్చెడి విధమునను, వేసవి యెండల పిమ్మట తొలకరి వానలు గుఱియుచందమునను, వెనుకటి యార్థికదుర్దశ తొలఁగిపోయి, మాసంసార పరిస్థితు లంతటినుండియు మిగుల తృప్తికరముగ నుండెను.

1908 వ సంవత్సరాంతమున రాజమంద్రి పురమందిరమున జరిగిన వీరేశలింగ పుస్తకాలయ వార్షిక సభకు నన్నధ్యక్షునిగఁ గోరిరి. నేనపుడు రాజమంద్రి పోయి, పురమందిరమున వీరేశలింగముపంతులు గారిని, రాజ్యలక్ష్మమ్మగారిని సందర్శించితిని. వారిరువురు నపుడు పరిపూర్ణారోగ్య మనుభవించుచుండిరి.

10. వెంకటరత్నమునాయఁడుగారు

1891 వ సంవత్సరమున మొదట మద్రాసులో కలసికొని నప్పటినుండియు, వెంకటరత్నమునాయఁడుగారికిని నాకును మనసు గలిసిన మైత్రి యేర్పడెను. నాప్రియగురువులగు వీరేశలింగము పంతులుగారికిని, ప్రియమిత్రులగు కనకరాజు గంగరాజుగార్లకును నే నెఱిఁగింపనొల్లని సందేహములను రహస్యములను, నాయఁడుగారికి నేను జెప్పి, వారియోజనలను సమాధానములను స్వీకరించు చుండువాఁడను. మతవిషయములందు నాకువారిసహవాస సంభాషణముల వలనఁ గలిగిన లాభ మింకొకరి మూలమునఁ గలుగలేదని చెప్ప