ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కేతన

వికీసోర్స్ నుండి

కేతన

కేతన యనెడు కవి తిక్కనసోమయాజి కాలమునం దున్నవాఁడు. ఈ యంశ మీతని యాంధ్రభాషాభూషణమందలి యీ క్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.

            గీ. 'కవిత చెప్పి యభయ కవిమిత్రు మెప్పింప
                నరిది బ్రహ్మ కైన నతఁడు మెచ్చఁ
                బరఁగ దశకుమారచరితంబు చెప్పిన
                ప్రోడ నన్ను వేఱె పొగడ నేల ?'

దీనివలన నితఁడు తిక్కనసోమయాజి కాలమువాఁడగుట స్పష్టపడినందున, ఇతఁడు పదుమూడవ శతాబ్దమధ్యమున ననఁగా నిప్పటికి రమారమి యాఱు వందలనలువది సంవత్సరముల క్రిందట నున్నాఁడనుట నిశ్చయము. ఇతడాంధ్రభాషాభూషణమును రచించుటకు ముందు తెలుఁగునకు వ్యాకరణ మేదియు లేదనుట నన్నయభట్టారక చరితమునం దుదాహరింపఁబడిన పద్యమువలననే కాక యాంధ్రభాషాభూషణమునందలి యీ క్రింది పద్యము వలనను దేటపడుచున్నది.

            ఉ. క్రొత్తగా నాంధ్రభాషకును గొంచక లక్షణ మిట్లు చెప్పునే
                యుత్తమ బుద్ధి యీతఁ డని యోరలవోవక విన్నఁజాలు మీ
                రొత్తిన మీకు మాఱునకు నుత్తర మిచ్చుట చాల యెగ్గు మీ
                చిత్తమునందు న న్నెరపు సేయకుఁడీ కవులార ! మ్రొక్కెదన్.

            క. నేరములు కాళిదాస మ
                యూరాదులకై నఁ గలుగు నొరులకు లేవే!
                సారమతు లైన సుకవుల
                కారుణ్యమె నేర్పుకలిమి కవిజనములకున్."

ఈతడు దండివిరచిత మయిన దశకుమారచరిత్రమును తెనిఁగించుట చేతఁ బండితు లీతని "నభినవదండి" యని పొగడినట్లీక్రింద నుదాహరింపబడెడి యాంధ్రభాషాభూషణములోని పద్యములో కవియే చెప్పచున్నాడు.

          క. "వివిధ కళానిపుణుఁడ నభి
              నవదండి యనంగ బుధజనంబులచేతన్
              భువిఁ జేరు గొన్నవాఁడను
              గవిజనమిత్రుఁడను మూలఘటికాన్వయుఁడన్."

ఈ కవియింటిపేరు పైని పేర్కొనఁబడినట్లు మూలఘటికవారు; ఈతని తండ్రి పేరు మ్రానయ్య. [1] ఇతఁడు శివభక్తుఁడు. ఇతర డాంధ్రభాషాభూష ణమును, దశకుమారచరిత్రమును మాత్రమేకాక విజ్ఞానేశ్వరీ యమను యాజ్ఞవల్క్యధర్మశాస్త్రమును గూడ తెనిఁగించెను [2]

అనేక లక్షణగ్రంధములు పుట్టి యున్న యీ కాలమునం దాంధ్రభాషాభూషణమంతగా నుపయుక్తము కాకపోవచ్చునుగాని యితర లక్షణగ్రంథములు లేని పూర్వకాలమునం దది పరమప్రయోజనకరముగా నుండినదనుటకు సందేహము లేదు. [3] కేతనకవిత్వము తిక్కనాదుల కవిత్వముతో సరిరాకపోయినను సలక్షణమయి మధుర మయినదిగానున్నది. ఈతని కవిత్వశైలి తేటపడుట కయి యీతని గ్రంథమునుండి కొన్ని పద్యము లుదహరింపఁబడుచున్నవి.

1. ఆంధ్రభాషాభూషణము.

       క. "భాషావేదులు నను విని
           యా షణ్ముఖపాణినులకు నగు నీడని సం
           తోషింప నాంధ్రభాషా
           భూషణ మను శబ్దశాస్త్రముం గావింతున్.


          క. పోcడిగ బహువచనంబులు
              వీఁ డనుటకు మీండ్రు వీరు వీరలు నయ్యెన్
              కాఁడునకు కాండ్రు కాఱును
              వాఁ డనుటకు వాండ్రు వారు వారలు నయ్యెన్.

2. దశకుమారచరిత్రము.

           క. మించి మదించిన రిపుల హ
              రించక సత్కీర్తి యీ మహీతల మెల్లన్
              నించక దీనుల దయఁ బో
              షించక ప్రఖ్యాతి కలుగునే నరనాధా !

           క. నుతకీర్తి వడసి జనవ
              ర్థితులై వర్ధిల్లి దుష్టనిగ్రహశిష్ట
              ప్రతిపాలకులై త్రిజగ
              ద్ధితముగ నేలంగఁదగు మహీతల మెల్లన్.

          ఉ. ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁ బోరి రాజిలోఁ
              గాముఁడు శంబరుండు శశిఖండధరుండు గజాసురేంద్రుఁడున్
              రాముఁడు రావణుండు సురరాజసుతుండును సింధునాథుఁడున్
              భీముఁడు దుస్ససేనుఁడు నుపేంద్రుఁడుఁ గంసుఁడుబోరునాకృతిన్

3. విజ్ఞానేశ్వరీయము

          మ. సుర సేవించిన వాతివాఁడి యయినన్ సొమ్మెల్లఁ బోనాడినన్
              బురుష ద్వేషిణియైన గొడ్డయిన నెప్డుం గూఁతులం గన్న మైఁ
              బరపౌరోగము గల్గె నేనియును నభ్భార్యం బెడంబాసి య
              ప్పురుషుండొండొక పెండ్లియాడినను నొప్పుం దప్పు లేదేమియున్.
                                                               ఆచార.

              క. మాటలు నేరక పలికిన
                 నోటమిగాఁ గొనక కార్య మున్న నిజముఁ దాఁ
                 దాటించి నృపతి ధర్మం
                 బేటముగాఁ బాడి నిర్ణయింపఁగ వలయున్ --- వ్యవ.

             ఉ. వేకనిబండివానికిని విప్రునికిన్ బతికి న్వివాదికిన్
                 వ్రేఁకపు మోపువానికిని వృద్ధునికిన్ గడుఁజిన్నబిడ్డకున్
                 వ్రేఁకటియాడుమానిసికి వేదుఱువానికిఁ దెవ్లుగొంటుకున్
                 దేఁకువతోఁ దొలంగునది తెల్లముగా నెదు రేగుదెండెంచినన్
                                                   ----ప్రాయశ్చిత్త

ఈ కవి బాణభట్టవిరచిత మయిన కాదంబరిని తెనిఁగించినట్ల కనఁబడుచున్నది. కేతనకృత మయిన కాదంబరిలోనిదని రంగరాడ్ఛందమునం దీ పద్యముదాహరింపఁబడియున్నది.

             గీ. 'జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెరఁగిన
                 నా విభుండు వాని లేవనెత్తి
                 కౌగిలించి వానిఁ గనుఁగొని కేయూర
                 కాభిధాన మొసఁగెఁ గడుముదముస'

కాదంబరిలోని వని యుదాహరింపఁబడిన పద్యములలో నొక దానియందు భాస్కరునికేతన యని యుండుటచేత కాదంబరి గ్రంథకర్త యితఁడు గాక తిక్కనసోమయాజి పెదతండ్రి యైన కేతన యని తోఁచుచున్నది.[4]

అభినవదండి యను నామాంతరము గల యీ కేతనకవిచేత విరచితమైన దశకుమారచరిత్రము పండ్రెండాశ్వాసముల పద్యకావ్యము నా కీ నడుమ లభించినది. ఆ గ్రంధములోని

        ఉ. 'శ్రీరమణిగృహాంగణము చెన్ను వహింప నలంకరింపఁగాఁ
             దోరణముం బ్రదీపమును దోహలియై యొడఁగూర్చెనాcదగం
             జేరి యురంబునంద తులసీవనమాలయుఁ గౌస్తుభంబు నొ
             ప్పారఁగ నుల్లసిల్లు హరి యన్నమతిక్కని ధన్యుఁ జేయుతన్.

         ఉ. హారిక పర్ఘకాంచనమయాచలసానువునందు నిర్జర
             స్ఫారవిలాసముం గలుగు జాహ్నవిఁ దాల్చిన శంకరుండు నీ
             హారకరావతంసుఁ డణిమాదిగుణప్రదవీక్షణుండు ది
             క్పూరితకీర్తిశాలి యగు కొమ్మయతిక్కనిఁ గాచుఁగావుతన్.

అను మొదటి రెండు పద్యములవలనను దశకుమారచరిత్రము తిక్కన సోమయాజి కంకితము చేయబడినట్లు దెలిసికోవచ్చును. కవి యిష్టదేవతా వందనాదులు చేసిన తరువాత

        "వ. అని యిష్ట దేవతా ప్రార్ధనంబును సుకవిచరణారవిందాభి వందనంబునుం జేసి నా రచియింపంబూనిన కృతి కధీశ్వరుండైన కొట్టరువు తిక్కనామాత్యునకు నిజస్థానం బగు విక్రమ సింహపురం బభి వర్ణించెద"

అని యేతత్పురవర్ణనమును తత్పురాధీశ్వరుఁ దగు మనుమసిద్దివర్ణనమును జేసి,

        "వ. ఇట్లు కీర్తిపాత్రంబైన మనుమసిద్ధిమహీవల్లభునకుఁ గరుణారస పాత్రంబైన కొట్టరువు తిక్కనామాత్యుండు నిజకులక్రమాగతం బగు మంత్రిపదంబున వర్తిల్లుచు.

         గీ. అందలంబు గొడగు లడపంబు మేల్కట్టు
             చామరములు జమిలిశంఖములును
             గంబగట్లు భూమి కానికగాఁగఁ బెం
             పెసఁగు రాచపదవు లెల్లఁ బడసె”

అని చెప్పి తిక్కన తన్ను రావించుట లోనగు విషయముల నిట్లు చెప్పెను

          సీ. వేఁగి విషయమున వెఱ్ఱి (ంటి) రా లనుపేర
                               నభిరామ మగు నగ్రహారమునకు

              నగ్రణి యగువాని నభినవదండినాఁ
                      బొలుపు మీఱినవానిఁ బ్రోలనార్యు
              ననుఁగుcదమ్ముని సంస్కృతాదిభాషా కావ్య
                      కర్తృత్వమున నుతి గన్నవానిఁ
              గౌండిన్యగోత్రుని బండారు కేతదం
                      డాధీశుమఱఁది నధ్యయనపరుని
 
              మూలఘటికాన్వవాయసముద్రపూర్ణ
              హిమమయూఖుని మారయ కమలకమల
              వదన యగుసంకమాంబకు [5] వరతనూజుఁ
              గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని.

వ. అత్యాదరంబున రావించి యాసనార్ఘ్యపాద్య తాంబూలాంబ రాభారణ దానాద్యుపచారంబులఁబరితుష్టహృదయం జేసి నీవు సంస్కృతాద్యనేక భాషాకావ్యరచనా విశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గావున నొక్కకావ్యము రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయునని సగౌరవంబు గాఁ బ్రార్థించిన నేనును మత్కావ్యకన్యకకుఁ దగు వరుండగు నతని మనోరధంబు సఫలంబు గావింపఁదలంచి.

          ఉ. కొమ్మయశౌరిసూనున కకుంఠితకీర్తి విలాస మొందఁ గ
             ద్యమ్మున దండి చెప్పిన కథాక్రమ మొప్పఁ దెనుంగుబాస గ
             ద్యమ్మును బద్యముం బెరయ నంచితభావరసోదయాభిరా
             మ మ్మగునట్లుగా దశకుమారచరిత్రము చెప్పఁబూనితిన్.

ఈ దశకుమారచరిత్రకవిత్వము కవి చెప్పుకొన్నట్టు తిక్కన మెచ్చునంత రసవంతముగానే యున్నది. ఇందుండి కొన్ని పద్యము లిం దుదాహరింపఁబడుచున్నవి.

          చ. పలికిన నుల్కిపాటు మదిఁ బట్టుకొనంగ నెలుంగుదిక్కు చూ
              డ్కులు పచరించి యాత్మపతి ఘోషముచందము కారణంబుగాc

           దలఁకక డాయఁబోయి విదితంబుగఁ గాcచె రథంబు మీఁద ని
           ర్మలమణిమండనద్యుతినిరాకృతహంసుని రాజహంసునిన్ -ఆ 2

       ఉ. ఏపునఁ బోరు సేనలకు నెల్లను మీఱి సముల్లసద్భుజా
           టోపముమై నరాతులఁ బటు ప్రదరంబులఁ బాఱద్రోలి యా
           భూపతి యగ్గమైన రథమున్ రథపుం గదియించి లంఘన
           ప్రాపితతద్రథుండ నయి పట్టి వెసం దెగఁజూచి యార్చితిన్ --ఆ 4.

       చ. కనుగొనునంత నా మనసుఁ గన్నుల మన్మథుఁ డింతిపాలు చే
           సిన మెలఁగఁగలేక గత చేష్టుఁడ నై యిదినిద్రవోవుచో
           మనమున కింతపుట్టెె గరిమం బగు విభ్రము మంగకంబు నొం
           దినతఱి జూచువారలకు ధీరత యెక్కడిదంచు లోలతన్ --ఆ 6.

       ఉ. అల్లుఁడ వీవు రాజ్యమున కంతకు నర్హుడ వీవు భూమికిం
           దల్లివి తండ్రివిన్ బహువిధంబుల దాతవు నీవు మాకులం
           బెల్ల సముద్దరింప నుదయించిన పుణ్యుఁడ వీవు నీకు నే
           నెల్లి మదీయపుత్రిఁ బురమెల్ల నెఱుంగఁగఁ బెండ్లిచేసెదన్ --ఆ 8.

       ఉ. నీ వలవోకఁజూచి తరుణీతిలకంబుమనంబు రూపమున్
           భావగతంబులైన గడుఁ బ్రౌఢత చూపుట గోరి యచ్చుపా
           టై వఱలంగ నున్న తెఱఁ గంతయు వ్రాసితిఁగా తలంచెదన్
           దేవసమాన నా యెఱుక తెల్లమొ బొంకొ నిజంబు చెప్పుమా --ఆ 10

       శా. సైన్యంబు ల్మద మెక్కి బాహుబలముల్ శౌర్యంబులుం జూపి ని
           ర్దైన్యస్ఫూర్తి గడంగి ఫెూరపటుసస్త్ర ప్రౌఢిమన్ నిష్ఠురా
           నన్యోన్యాహవనోత్థితాగ్నికణరౌద్రాకారతన్ లోకసా
           మాన్యాతీతమహో గ్రవిక్రమరణోన్మాదప్రకారంబులై --ఆ. 12

ఈదశకుమారచరిత్రములో భారతాంధ్రీకరణ విషయమేమియు జెప్పఁకుండకపోవుటచేతఁ దిక్కన యీ గ్రంథరచననాటికి భారతము చేయ నారంభించి యుండడు.

  1. ఈతని తండ్రి మ్రానయయైనట్లు విజ్ఞానేశ్వరము నందలి ప్రాయశ్చిత్త కాండములో కడపటనున్న యీ క్రింది పద్యమువలన నెఱుఁఁగవచ్చును.

          క. 'తజ్ఞులకఁ దెలియునట్లుగఁ
             బ్రాజ్ఞులు మది మెచ్చఁ దెలుఁగుసపద్యములను ద
             త్వజ్ఞుడు మ్రానయ కేతన
             విజ్ఞానేశ్వరము జగతి వెలయఁగఁ జెప్పెన్'

    [ఇతని తల్లి గంగమాంబ. నివానాసము వెఱ్ఱి (వెంటి , రాలు ]

    ధర్మశాస్త్రములను కేతనయే మొట్టమొదట తెనిఁగింప నారంభించెను. ఇటీవలి కవులు సహితము మఱి యెవ్వరును ధర్మశాస్త్రముల నాధ్రీకరింపఁ బూనుకోలేదు. కేతనయొక్క విజ్ఞానేశ్వరములోని మఱి రెండు పద్యముల నిం దుదాహరించు చున్నాను.

         చ. ఒకనికిఁ గూఁతు నిచ్చి తగ మంకువ గైకొని పెండ్లిసేయ ను
            త్సుక మతి నున్నచోట గుణశోభితుఁ డొక్కఁడు వచ్చె నేనియున్
            బ్రకటిత దోషముల్ మొదటి భర్త పయిం గలవేని తండ్రి క
            న్యక గుణవంతుఁ డైన పతి కచ్చుగ నిచ్చుట ధర్మ మెమ్మెయిన్. ఆచారకాం.

         ఉ. జాతర పెండ్లియత్సవము జన్నము చేయఁ దొడంగియున్నచో
             బాఁతిగ రాజమంత్రులు తపస్వులు వేల్పు లవశ్యకార్యముల్
            ప్రీతి నొనర్చుచోఁ దఱిమి పిల్వఁగ నప్పను లెల్లఁ దీరఁగా
            భూతలనాథుముద్ర గొనిపోయిన భృత్యులు వారిఁ దేఁదగున్. వ్యవహార.

  2. ["కేతన తెనిఁగించినది యాజ్ఞవల్క్య స్మృతి యను ధర్మశాస్త్రము కాదు. ఆ స్మృతికి విజ్ఞానేశ్వరుఁడు రచించిన 'మితాక్షరి' అను వ్యాఖ్య ననుసరించినది. పేరికిది విజ్ఞానేశ్వరీయమే కాని దానికిది యనువాదము కాని, అనుసరణముకాని కాదు. మితాక్షరి విపులమగు గ్రంథము.కేతన పయి మితాక్షరిలోని విషయములను జనసామాన్యమున కుపయోగించు వానిని గూర్చి సంగ్రహముగ నొక చిన్న గ్రంథమును రచించి, దానికి 'విజ్ఞానేశ్వరీయమ'ని పేరు పెట్టి యుండవచ్చును. మూలమునందు వేర్వేఱు కాండములలో నున్న విషయము లిందు తార్మాఱయి యున్నవి]
  3. [ కేతన తనకుఁ బూర్వమున నున్నదియు, ద్వితీయ నాగవర్మచే 12 వ శతాబ్దికిఁ బూర్వము రచింపబడిన 'కర్ణాటక భాషాభూషణము' ననుసరించి 'ఆంధ్రభాషా భూషణము'ను రచించెననియు, ఆ నాగవర్మ తొలుత వేంగినగర నివాసియై యుండి, రాజకీయ కల్లోలములు కారణముగా కర్ణాటక దేశమున కేఁగెననియూ, ఆంధ్ర కర్ణా టక భాషాభూషణములు రెంటికిని చాల పోలికలు కలవనియు భాషా సాహిత్య విమ ర్శకులు, బహుభాషావేత్తలు నగు శ్రీ తిరుమల రామచంద్ర గారు వివరించి యుచున్నారు.]
  4. [ కేతనమంత్రి చరిత్రమును జూడుఁడు ]
  5. [ కేతన తల్లి గంగమ, తండ్రి మ్రానయ యని విజ్ఞానేశ్వరీయము వలనఁ దెలియవచ్చుచున్నది.]