ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/సంకట స్థితి - పరిష్కారం

వికీసోర్స్ నుండి

సంకట స్థితి - పరిష్కారం

12

కొంత కార్నెగీ వాటాలలో కొన్నింటిని స్టాక్ మార్కెట్టులో ప్రవేశపెట్టేటందుకు యితరుల చేతుల్లోకి - వాస్తవానికి బ్రోకర్ల చేతుల్లోకి. ప్రేవేశపెట్టాలని ఫ్రీక్ ఎప్పుడూ వుద్దేశపడుతుండటం కార్నెగీకి తెలుసు. చివరకు పిట్స్ బర్గు బ్యాంకరయిన ఒక కోటీశ్వరుడికి కార్నెగీ కంపెనీ వారి రెండు శాతం వాటాలను అమ్మి కొన్ని అభివృద్ధులను సాధించవలసిందని కంపెనీ కోశాధికారికి సూచన చేసినప్పుడు, దీనిని మించేటట్లుగా కోక్ ధరను గురించి కార్నెగితో నోటి మాటగా చేసుకొన్న ఒడంబడికను బొత్తిగా త్రోసిపుచ్చినపుడు సహజంగా శాంతస్వభావుడయిన ఆ స్కాబ్ దేశీయుడు వున్మత్తుడయినాడు.

హెన్రీ ఫిప్స్ ఫ్రీక్ పక్షంవహించటం కార్నెగీని అన్నిటికంటె అధికంగా గాయపరచింది. ఫ్రీక్స్‌ను కంపెనీ నుంచి తొలగించాలని నిశ్చయించుకొని 1899 శరత్తులో తీక్షణముఖుడై ఇంటికి తిరిగివచ్చాడు. యింతకు పూర్వం ఎన్నడూ భాగస్థులతో అతనికి తీవ్రమయిన వివాదా లేవీ రాలేదు. అయినా, కార్నెగీ తప్పనిసరి అయి తాను తీసుకోటానికి నిశ్చయించుకొన్న చర్యను అసహ్యించుకున్నాడు. తన స్టాకును యితర భాగస్థులకు అమ్మి కంపెనీలోనుంచి ప్రశాంతంగా విరమించుకోమని అతడు ఫ్రిక్స్‌కు సూచన చేశాడు. అందుకు ఫ్రీక్స్ నిరాకరించాడు. ఈ కారణంగా ఖరీదయిన దావా నడిచింది. అతణ్ని పంపించి వేయటం కోసం రాజీ పడవలసివచ్చింది. చివరకు ఫ్రీక్స్ వెల్లిపోయినాడు. తరువాత ఫ్రిక్స్ కార్నెగీతో సంధియత్నాలు చేశాడు. వా రిరువురూ తిరిగి మిత్రులయినారు. అయినా వెనుకటి సంవత్సరాలలొ కనుపించిన సౌమనస్యం వారికి మళ్ళీ ఎన్నడూ చేకూరలేదు. తన్ను ఎన్నో రెట్లు మించిన కోటీశ్వరుడయి జీవించి మరణించినా ఫ్రీక్స్‌కు తన పథకాలమ నిరంతరం భగ్నం చెయ్యటమే పనిగా పెట్టుకుంటాడని కార్నెగీ అంటే అనిష్టం.

ఈ కలహం కార్నెగీని వ్యథ పెట్టింది. ఒక వంక అతడు వ్యాపారికమయిన బాధ్యతలనుంచి విడుదలపొందాలని అతిగా కుతూహల పడుతున్నాడు. మరొకవంక తన జీవితమంతా దేన్ని సాధించాడో దాన్ని వదలిపెట్టి వెళ్ళిపోవట మన్న భావాన్ని ఎదుర్కో లేక పోతున్నాడు. మహాశక్తిమంతుడయిన జె. పియర్ పాంట్ మోర్గన్ అధ్యక్షాన నడుస్తున్న మోర్గన్ బ్యాంకింగ్ హౌస్ ఉక్కు వ్యాపారపు పెట్టుబడులను కొనటం ప్రారంభించింది. ఈ సమయంలో కార్నెగీ సంస్థకు స్వాబ్ అధ్యక్షుడు. కార్నెగీ సంస్థ ఓహియా రాష్ట్రంలో ఈరి సరస్సు వొడ్డున కోన్నియాట్ దగ్గర క్రొత్త ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి దానికి ఎదురుదెబ్బ తీసింది. మిస్సాబి ఇనుప ఖజానాన్ని ఈ క్రొత్త కర్మాగారానికి సూటిగా పడవలమీద చేర్చటానికి వీలుంది.

మోర్గన్ యిప్పుడు కార్నెగీని కొనివెయ్య గలమా అని అబ్బురపడటం ప్రారంభించాడు. ఇతడు జాన్ డబ్లియు, గేట్సు దగ్గరనుంచి బార్బుడువైరు, ఉక్కు వ్యాపారాలను కొన్నాడు. అతడు మోర్గన్‌తో యిలా చెప్పాడు. "కార్నెగీ దగ్గిర పలుకుబడి గలవ్యక్తి ఒక్కడే వున్నాడు. అతడు ఛార్లీ స్క్వాబ్. అతణ్ని పట్టగలిగితే మీపని జరుగుతుంది."

మోర్గన్ స్క్వాబ్ ను, ప్రముఖులయిన యితర ఉక్కు వ్యాపరస్థులను సిమాలోచనల కోసం ఆహ్వానించాడు. ఒక రాత్రంతా మరపుకు రాని సమావేశమం జరిగింది."

స్క్వాబ్ వారితో "వ్యాపారిక బాధ్యతవల్ల ఆయన అలసిపోతున్నాడు. అయినా ఉక్కుతో వున్న సమస్త సంబంధాన్ని వదలుకోటానికి ఆయన యిష్టపడడు." అన్నాడు. ధరలను గురించి కర్మాగారాల మూల్యాలను గురించి కొన్ని గంటల చర్చలు సాగిన తరువాత స్క్వాబ్ "ఈ విషయంలో నేను చేయగలిగింది చేస్తాను." అని వాగ్దానం చేశాడు.

అతడు ఎంతో తెలివిగా మొదట మిసెస్ కార్నెగీని కలుసుకున్నాడు.

"ఆయన యిక విరమించుకో వాలి" అని ఆమె అంగీకరించింది. ఈ భావం అప్పు డప్పుడూ ఆయన మనస్సుకు రావటం నాకు తెలుసు. అయినా దానినుంచి పూర్తిగా విడిచిపెట్టమనే భావాన్ని ఆయన అసహ్యించుకొంటుంటాడు" అన్నది.

కొంతసేపు వాళ్ళిద్దరూ దాన్ని గురించి చర్చించుకొన్నారు. "ఆయనను ఏ గోల్ఫ్ ఆటకొ తీసుకుపోయి అక్కడ ఉల్లాసంగా వున్నప్పుడు ఈ విషయాన్ని నీ వెందుకు సూచించగూడదు?" అన్న దామె. చిరు నవ్వుతో ఇంకా యిలా అన్నది. "ఈ భావాన్ని ఆయనకు నచ్చ జెప్ప గలవా డెవడయినా ఉన్నాడంటే, ఛార్లీ అది నీ వొక్కడవే" అన్నది.

అందువల్ల చార్లీస్ స్క్వాబ్ తనయజమానిని వెష్ట్ ఛెష్టర్ కౌంటీలోని గోల్ఫ్ క్లబ్‌కు తీసుకు పోయినాడు. యిద్దరూ అక్కడ ఒక పచ్చిక బీడులు మీదుగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు స్క్వాబ్ విషయాన్ని ఎత్తుకున్నాడు. మొదట అతడు ఏమాత్రం సుముఖుడుగా లేడు. "కాదు. కాదు. విరమించుకోటం నాకు యిష్టం లేదు" అని కళవళ పడుతూ అన్నాడు. ఆ తత్తర పాటు అతడు మనసులో ఒక అంతర్యుద్ధాన్ని సాగిస్తున్నట్లు వెల్లడి చేస్తున్నది. ఇప్పుడు ఆయనను ముట్టడించినవాడు చరిత్రలోకల్లా ప్రసిద్ధుడయిన సేల్స్‌మన్ అని సమకాలికుల చేత అనిపించుకొన్న వ్యక్తి. అతని అందానికి తరిమి ఒప్పించే నేర్పుకు దరిదాపుగా తట్టుకో గలగడం అంటూ వుండదు.

"వ్యాపారంలో పెట్టేందుకు మోర్గన్‌కు వందలకొద్ది మిలియన్లున్నాయి. అతడు మనకు చాలా క్లెశకరమయిన ప్రతిద్వంది అయితీరుతాడు. అంతే కాదు అతడు మీరే మడి గితే అది దరిదాపుగా ఇవ్వటానికి సంసిద్ధుడయినాడు" అన్నాడు స్క్వాబ్.

"కావచ్చు. నాకు డబ్బుతో పని లేదు. వ్యాపారం నుంచి బయటకు వెళ్ళి నేను చేసే దేముంది?" అన్నాడు కార్నెగీ అడ్డు చెబుతూ.

"డబ్బును దానంచేస్తూ మహానందాన్ని అనుభవించ వచ్చు. మీ ఐశ్వర్య సువార్తను నిరూపించి చూపవచ్చు."ఇలా అతడు యజమాని నిశ్శబ్దంగా వింటూంటే వాక్య పరంపరను క్రుమ్మరించాడు.

చివరకు కార్నెగీ అడిగాడు. "దీన్ని గురించి ఇతర భాగస్థుల అభిప్రాయ మేమిటి? మరి, వాళ్ళతో నీవు సంప్రదించావా?"

"మేము ముగ్గురమో, నలుగురమో ఒకరితో ఒకరు ఏదో చెప్పుకున్నాము" అని స్క్వాబ్ ఒప్పుకున్నాడు. "అయితే వాళ్ళంత అంగీకరిస్తారని నా నిశ్చయం. మాలో ఉక్కు వ్యాపారంలో వుండిపోదలచుకొన్న వాళ్ళెవరయినా వుంటే మోర్గస్ రూపొందిస్తున్న ఆ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్‌లో స్టాకును, బాండ్లను పుచ్చుకొంటాము. మీరు వెంటనే డబ్బు రూపంలోకి మార్చుకొనేందుకు గాని దాన ధర్మాల కుపయోగించుకొనేందుకు గాని అనువైన బాండ్లనే తీసుకోవచ్చు."

మధ్యాహ్నామైంది. వాళ్లు కొద్దిసేపటికి విడిపోబోయే టంతవరకూ కార్నెగీ ఇంకా కొంత మాట్లాడాడు. "ఇతర భాగస్థులను కలుసుకో" వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో అని అతడు ఆదేశించాడు.

ఇతర భాగస్థు లందరూ అమ్మకానికి అంగీకరించారు. స్క్వాబ్ ఆ విషయాన్ని మోర్గస్‌కు తెలియజేశాడు. అప్పుడు ఆ బ్యాంకరు కార్నెగీని టెలిఫోన్ మీద పిలిచాడు. ఇరువురూ శుభాకాంక్షలను చెప్పుకున్న తరువాత అతడు అతి ముఖ్యమయిన విషయాన్ని ఎత్తుకున్నాడు. "మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు దాన్ని గురించి మాటాడగూడదు?" అని ఆ బ్యాంకరు సూచన చేశాడు.

"మిష్టర్ మోర్గస్, ఫిప్టీ ఫష్ట్ స్ట్రీట్ నుంచి వాల్‌స్ట్రీటు ఎంతదూరమో, వాల్‌స్ట్రీటునుంచి ఫిప్టీ ఫష్ట్ స్ట్రీటు అంతే దూరం" అని ఆ ఉక్కు రాజు మధురంగా ప్రత్యుత్తర మిచ్చాడు.

"అందులో వున్న అంతరార్థ మేమిటో మోర్గస్ వెంటనే గమనించాడు. ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిదారుల్లోకల్లా పెద్ద అయిన వాడు ప్రపంచంలోని బ్యాంకర్లలో కల్లా పెద్ద అయినవాడిచేత పోషింపబడదలచ లేదు. ఉక్కు డబ్బుకంటే గొప్పది. కొండే మహమ్మదు దగ్గరికి రావాలి.

"సరే! నేనే వస్తా"నని మోర్గస్ గుర్రుమన్నాడు.

అతడు బండిని పిల్చి కార్నెగీ ఇంటికి వెళ్ళాడు. పదిహేను నిమిషాలలో పర్వతమంత లావా దేవీకి ఒప్పందం కుదిరింది. వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడే కార్నెగీ చిన్న కాగితపు ముక్కమీద 40,00,00,000 [నలబై కోట్లు] డాలర్లు అని అంకెవేసి మోర్గస్ చేతికిచ్చాడు. ఇది అతని భాగపు ధర. అతి కఠిన శిలవంటి మోర్గన్ ముఖంలో అణుమాత్రమైనా మార్పు కనిపించ లేదు. "అది తృప్తికరంగానే వున్నది" అన్నాడు. మరికొంతసేపు మాట్లాడి, బండియెక్కి వాల్‌స్ట్రీట్‌కు వెళ్ళిపోయినాడు. "అడిగినట్లయితే ఆయన కింకో పదికోట్ల డాలర్లు ఎక్కువ ఇచ్చివుండేవాణ్ని" అని తరువాత మోర్గన్ స్క్వాబ్‌తో అన్నాడు.

కనుక మోర్గన్ 110,00,00,000 (నూట పదికోట్లు) డాలర్ల కాపిటల్ షేర్లతో యునైటెడ్ స్టేట్స్ కార్పొరేషన్ అన్న మహాసంస్థను నిర్మించాడు. ఇరవై అయిదు సంవత్సరాలకు పూర్వం పదిహేను పదహారు సంవత్సరాల వయసులో పెన్సిల్వేనియా కొండల్లో బండి తోలి బ్రతికిన కుర్రవాడయిన స్క్వాబ్ దీని కధ్యక్షుడు. ఈ వ్యాపారాన్ని ఇంతకంటే అధిక శక్తి మంతుడయిన వ్యక్తి చేతుల్లో పెట్టేందుకు అవకాశం లేదని చార్లీ పూర్వ యజమాని అంగీకారపూర్వకంగా భావించాడు.

వ్యాపారాన్ని విడిచిపెట్టటంవల్ల కలిగిన క్రుంగుబాటు తలపు కార్నెగీలో ఎక్కువ కాలం నిలువలేదు. తరువాత వెంటనే అతడు తాను చేయిదలచుకున్న పనులను గురించి ఆలోచన ప్రారంభించాడు. చార్లీ చెప్పినమాట సత్యం. తన ధనా న్నంటినీ దానం చెయ్యటంవల్ల అతడెంతో ఆనందాన్ని అనుభవించబోతున్నాడు. అతని వయ సిప్పుడు అరవై ఆరు సంవత్సరాలు. ఇక యెక్కువ కాలం మిగిలివుండక పోవచ్చు.

దానం చెయ్యటంలో వెనుకంజ లేనిమాట నిజం. తన 40,00,00,000 నలబైకోట్ల డాలర్ల ధనాన్ని దానం చెయ్యటం ప్రారంభించిన సరసమై దయాన్వితమైన గుండ్రని మోము, తెల్లని గడ్డము గల ఈ కురుచై లావైన చిన్న మనిషి, అతని గడ్డమే మరికొంత నిడివిగలదైన దైతే శాంతాక్లాస్‌కు ఆదర్శమయిన ప్రతిమూర్తిని వహించిన ట్లుండేవాడు. అయితే ప్రతిఫల రహితంగా అతడు సహాయంచేసిన వేలకొలది పాఠాశాలలకు కళాశాలలకు, ధర్మసంఘాలకు వ్యక్తులకు అతడు ఇప్పుడే శాంతా క్లాస్.

అసంఖ్యాకంగా శాఖలను నిర్మించే విషయంలో అతడు ఇప్పుడుకూడా న్యూయార్క్ ప్రజాగ్రంథాలయ ధర్మకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. తొలుతగా మిలియను డాలర్లు ఇచ్చి ఇంతకు పూర్వపు సంవత్సరం పిట్స్‌బర్గులో కార్నెగీ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభం చేశాడు. తరువాత తరువాత అతడు తన జీవిత కాలంలో ధర్మాలుగా యిచ్చిన మొత్తం 1,60,00,000 (ఒక కోటి అరవై లక్షల) డాలర్ల అయినది. స్కెలెన్ల పార్క్‌లో అతడు కట్టించి ఘన నిర్మాణానికి నాలుగు శాఖలున్నవి - స్కూల్ ఆఫ్ అప్లయిడ్ సైన్సు, స్కూల్ ఆఫ్ అప్లయిడ్ డిజైను, స్కూల్ ఆఫ్ అప్లయిడ్ ఇండస్ట్రీస్, మార్గరెట్ మారిసన్ కార్నెగీ స్కూలు, ఇవన్నీ యువతులకు గృహ శాస్త్రంలోను, దానికి సంబంధించిన అనుబంధ విషయాలల్లోను శిక్ష రాయిచ్చే సంస్థలు. ఇవన్నీ ఆ యా శాస్త్రాలల్లో పట్టభద్ర బిరుదా లిచ్చేవే.

వ్యాపారంనుంచి విరమించుకొన్న తరువాత కార్నెగీ చేసిన మొదటి పనులలో ఒకటి, ఉక్కు కర్మాగారాలు కొలుముల్లో పనిచేసిన వారి సంక్షేమంకోసం 50,00,000 (యాభై లక్షల) డాలర్‌లు ప్రత్యేకించి వుంచటం అతడు ఇందులో ఒక మిలియను డాలర్ లు తాను వారికోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయ పాలనకోసం వేరుగా పెట్టి వుంచాడు. మిగిలిన ధనమంతా వయోవృద్ధుల పింఛనులకోసం కర్మాగారంలో వికలాంగులయిన వారికి సహాయ మివ్వడం కోసం మృతినొందిన కార్మికుల కుటుంబాలకు సహాయ మివ్వటంకోసం వుద్దేశింపబడింది.

ఆ సంవత్సరం వసంతంలో నాలుగు స్కాబ్ విద్యాలయాలలోను అతిప్రాచీనమై ప్రబల ప్రతిష్టను గడించుకొన్న సెయింటు ఆండ్రూస్‌కు లార్డు రెక్టరుగా నియమితుడు కావటం కోసం స్కాట్లండు వెళ్లాడు. విశ్వవిద్యాలయాలలో లార్డు రెక్టర్ ఒకప్పుడు ప్రముఖోద్యోగిగా వుండేవాడు. ఐతే శతాబ్దులు గడచిన తరువాత అది ఒక గౌరవ పదవిగామారి పోయింది. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎన్నుకొన్న ఒక ప్రముఖవ్యక్తి ఆ పదవిని స్వీకరిస్తుండేవాడు. సెయింటు ఆండ్రూస్ చరిత్రలో గడిచిన అయిదు శతాబ్దాలలో ఈ పదవిని నిర్వహించిన విశిష్టవ్యక్తులు సుదీర్ఘ పట్టికలో తాను ఒకడుగా వుండే అవకాశమిచ్చిన ఈ గౌరవానికి కార్నెగీ గర్వించటం ఎంతో సమంజసం. ఈ ఎన్నుకో బడటం విషయంలో ఇతడు బ్రిటిష్ పౌరులు కాని వారిలో ప్రధముడు, తరువాత 1902 లో కూడా విద్యార్థులు అతణ్ని మరోమారు కూడా ఈ రెక్తర్ పదవికి ఎన్నుకొన్నప్పుడు అతడు ఇంకా విశేషంగా గర్వించాడు.

రెక్టర్స్ నైట్స్‌లో అతడు ఎంతో సంతోషించాడు. వీటిలో రెక్టర్ సంపూర్ణంగా విద్యార్థులతో కలిసి మెలసి చలిస్తాడు. ఎంతో ఆదాన ప్రదానం జరుగుతుంది. వీటిలో ఉండటానికి అధ్యాపక వర్గంలో ఒకడికయినా అనుమతి దొరకదు. మొదటి రెక్టర్స్‌నైట్ గడచిన తరువాత ప్రిన్సిపాల్ డొనాల్డ్‌సన్ "భలాన రెక్టరు మాకు ప్రతిగా మాటాడాడు. మరొక రెక్టర్ మాకు అనుకూలంగా మాటాడాడు. వారిద్దరూ వేదికనుంచే మాటాడారు. రెక్టరు కార్నెగీ చక్రాకారంగా వున్న మా మధ్య కూర్చుని మాతో మాట్లాడాడు." అని విద్యార్థులు చెప్పుకొన్నట్లు అతనికి తెలియ జేశాడు. సెయింట్ ఆండ్రూస్‌లో దరిదాపు రెండువందల మంది విద్యార్థులే వుండటంవల్ల యిలా చేయటం ఏ మంత కష్టమయిన పని కాదు.

ఆబర్ డిస్, ఎడింబరో, గ్లాసో, సెయిండ్ మాధ్చూన్ అన్న నాలుగు విశ్వ విద్యాలయాలు ఆర్థికంగా స్తోమతతప్పి వున్నదని శక్తివుండికూడా విశ్వవిద్యాలయవిద్యను అనేక మంది బాలురు పొందలేకపోతున్నారనీ గమనించి కార్నెగీ 1,00,00,000 (కోటి) డాలర్‌లు నిధితో స్కాచ్ యూనిర్శిటీ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ఇందులో సగభాగం పై నాలుగు సంస్థల ఉపయోగంకోసం మిగిలిన సగభాగంవిద్యార్జనను ఆశించే యువకులకు సహాయం చెయ్యటం కోసము వుద్దేసింపబడ్డాయి. విశ్వవిద్యాలయ ప్రధానాచార్యులను, వారి కుటుంబాలతో వచ్చి ఒక వారం రోజులు గడిపిపోవలసిందని ఆహ్వానించారు. యూనివర్శిటీ ట్రస్టుకు అధ్యక్షుడయిన ఎరల్ ఆఫ్ ఎల్జిన్, బ్రిటిష్ మంత్రివర్గంలో స్కాట్లండు తరపున కార్యదర్శి అయిన లార్డు బాల్ఫోర్ కూడా వారు వచ్చినపుడు విచ్చేశారు. తరువాత తరువాత ప్రిన్సుపాల్స్ వీక్‌' అన్నది స్కిబోలో ప్రతిసంవత్సరం జరిగే ఒక వుత్సవమయింది. అది ఎప్పుడూ ఒక సంతోషకరమైన సమయంగా వుంటుండేది.

మొదట ప్రిన్సిపాల్స్ వీక్ అయిన తరువాత ప్రిన్సిపాల్ లాంగ్ వెల్లెటప్పుడు కార్నెగీతో కరచాలనం చేస్తూ "స్క్వాబు విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌కు ఏలా మా సమావేశాలను ప్రారంభించుకోవాలో తెలుసుకోటానికి అయిదు వందల సంవత్సరాలు పట్టింది. ఇందుకు అందరూ ఒక వారాన్ని కలసి గడపటమే పరిష్కారం" అన్నాడు.

తా నిప్పుడు సంపూర్ణ స్వేచ్చ కలవాడు కనుక విశ్రాంతిని పుచ్చుకొన్న ఆ పారిశ్రామికుడు తను చేయ దలచుకొన్నది ఎంత వుందో గమనించి మనోహరమైన ఆశ్చర్యాన్ని పొందాడు. అమెరికన్ బ్రిటిష్ పత్రికలకు తాను వ్రాసిన వ్యాసాలు కొన్నింటిని సమకూర్చుకొని, మరికొన్ని అదనపు విషయాలను చేర్చి 1901 లో "ది ఎంపైర్ ఆఫ్ బిజినెస్" అన్న పేరుతో ఒక సంపుటిని ప్రచురించటం ఈ చేయదలచిన పనులలో ఒకటి. అతడు జేమ్స్‌వాట్ జీవిత చరిత్ర వ్రాయటమనే అభిలాషతో ఉర్రూతలూగుచున్నాడు. ఫిపు ఎవెన్యూకు రెండు మైళ్ళకు పైన నైన్‌టీన్‌త్ నైన్‌టీఫస్టు స్ట్రీట్లకు మధ్య అత డొక నూతన గృహాన్ని నిర్మించాడు. కుటుంబం 1902 లో ఆ నవమందిరానికి మారింది. అది చాలా విస్తీర్ణం కలది దాన్ని నిర్మించుకొన్న యజమానిలా బలిష్ఠము; చోకము అయినది దాని నమూనా అతిసామాన్య మయినది. దానిచుట్టూ వున్న నేల వసంతం మొదలు వేసగి వరకూ వుండే పూలతో కళకళలాడు తుండేది. ఆ గృహ యజమాని శయ్యాగృహంలో గోడమీద ఒక బొమ్మ వ్రేలాడు తుండేది. అది బిల్ జోన్స్ చిత్రం.

కార్నెగీ కార్పొరేషన్ రద్దయిన తరువాత పూర్వం దానిలో భాగస్థు లయిన వాళ్లు, వీరు మొత్తం నలుబదిమంది వారిలో చివరివాడుకూడా మరణించేటంత వరకు పూర్వపు జీవిత స్మృతులను నిలుపుకోటం కోసం కార్నెగి వెటర్నెన్సు ఎసోసియేషన్ అన్న పేరుతో ఒక సంస్థను స్థాపించుకొన్నారు. నూతన గృహనిర్మాణం పూర్తిఅయిన తరువాత మిసెస్ కార్నెగి తన భర్తకు సంతోషకరంగా "ప్రధమంగా మనం కార్నెగి వెటరన్లను ఆహ్వానిద్దాం" అన్నది. వారు విందుకు వచ్చినపుడు గృహానికి శుభాకాంక్షలు పలికారు. 'వెటరన్సు డిన్న' రన్నది. తరువాత ప్రతిసంవత్సరం ఆ క్రొత్త యింట్లో ఒక ఆచారంగా జరుగుతూ వచ్చింది. అందరూ దీనికోసం ఎదురు చూస్తుండేవాళ్లు. సంవత్సర మంతటిలో అనుభవించు ప్రముఖమైన ఆనంద సమయాలల్లో ఇది ఒకటి కావటంవల్ల అలా ఎదురుచూసే వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఆతిథేయి కార్నెగి. ఆ వెటరన్లను "నా బాలుల్లారా!" అని కార్నెగి పిలుస్తుండేవాడు. వారు తనయెడ అతిప్రీతిని ప్రదర్శిస్తుంటే ఆనందం అనుభవిస్తుండేవాడు. ఆ ప్రేమ వాళ్ళ కన్నుల్లో మెరుస్తుంటే తిలకించి పరవశుడౌ తుండేవాడు. తన ఆత్మకధ టిప్పణిలో అతడు ఇలావ్రాశాడు.. "సంపద లేకపోయినా ఇది కావాలి. బహు కోటీశ్వరత్వం కంటె ఇది ముఖ్యం. ఔను, వేయిమారులు ఔను."

మొదటి విందువేళ వారు మిసెస్ కార్నెగీని వెటరన్స్ ఎసోసియేషన్‌లో గౌరవ సభ్యురాలినిగా ఎన్నుకొన్నారు. వెంటనే ఒకరు "చిన్ని మార్గరెట్ ను కూడా ఎన్నుకుందా" మని సూచన చేశారు. ఈ సూచన వెంటనే అంగీకరింపబడింది.

వెటరన్లలో ఒకడయిన చార్లెస్ స్క్వాబ్, ఒకనాటి గ్రామీణ దరిద్ర బాలుడు, నేటి స్టీల్ ట్రస్టు సంస్థకు ప్రధాని రివర్ సైడు డ్రైవ్‌మీద, ఒక బలిష్టమైన సౌధాన్ని నిర్మించాడు. దీన్ని ఇతడు తన కతి ప్రియమైన ఫ్రాన్సులోని లొయిరీ నదిమీది దుర్గపు నమూనా ననుసరించి కట్టాడు. ఇది గోపుర శిఖరాలతో ఒప్పే ఒక గృహ నిర్మాణం.

అతని పూర్వ యజమాని అప్పుడప్పుడూ ఎవరైనా మిత్రుణ్ని "నీవు చార్లీ నూతన భవనాన్ని చూశావా?" అని తనలో తాను నవ్వుకుంటూ అడిగేవాడు. "దానితో పోల్చి చూస్తే నా ఇల్లు చిన్ని కుటీరంలా కనిపిస్తుంది" అనేవాడు.