అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 17

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

అక్కన్న మాదన్నలకు దేవి కలలో కనఁబడి దాదాఁపు సంవత్సరమగుచున్నది. ఇది కడపటివారము. ఈ వారము దాఁటులోపల తమపతనము నిశ్చయమని ఆ సోదరులు దిన మెదరుచూచుచు తానాషా తుదకు తమ్ము పొండని చెప్పు కాలము చెంతనే యున్నదని తలంచుచు ఒకదినము సాధారణముగ ఎప్పటివలెనే నగరికి పోయిరి. ఉదయము పదునొకండు గంటలవఱకు సుల్తాను గోష్ఠియందు గడిపిరి. ఏవేవోపనులు విచారించిరి. ఔరంగజేబును తఱుమఁగొట్టుట కుపాయము లాలోచించిరి. పదునొకండు గంటలకు వెలికివచ్చి తమ బంగారు పల్లకిలో కూర్చుండిరి. పల్లకీవారు రెండడుగులు పోయిరో లేదో అత్తిమత్తరాయని సిబ్బంది కనఁబడెను. రెండవదర్వాజా దాఁటు సరికి సిబ్బందియెక్కువయై మంత్రుల పల్లకీవారిని చావవెూది తటాలున అక్కన్న మాదన్నల మీఁది కుఱికి వారి తలలు ఖండించివేసిరి. వారితోకూడ వచ్చుచుండిన వారి మేనల్లుఁడు రూస్తంరావు ఈ దురంతరమును చూచి చేయునది లేక ఒకరిరువురతో పోరి ఇంటికిపోఁగా నాతని తఱుముకొని పోయి ఇంటిలోనే కత్తితోపొడిచి చంపిరి. వారి యింటిచుట్టును హిందువులును బ్రాహ్మణులును నివసించు పేటమీఁద నుఱికి వేయిమంది బ్రాహ్మణులను నఱికివేసిరి. మంత్రులభార్యలు తత్క్షణమే బావులలోదుమికి ప్రాణత్యాగ మొనరించిరి. అక్కన్న కొమరుని మల్లన్నను ఆ దాది గుడ్డలలోచుట్టి ఎచ్చటికో ఊరి వెలుపలికి కొనిపోయి ఒక మూరువాఁడు, మహమ్మదీయుఁడు, మాదన్న భక్తుఁడుండ, వానికడ వదలి భానుజీకడ చేర్పుమని పలికి తాను మరలివచ్చి తనయజమానురాండ్రు దుమికిన బావిలోనే పడి మరణించెను. ఆ దినమును రాత్రియు లెక్కలేని హత్యలు జరిగినవి. మంత్రులదేహములను వీథులవెంట లాగిరి.

అక్కన్న మాదన్నలు పడిపోఁగానే నౌకరులు సుల్తాను కడకు పరుగునపోయి ఏడ్చుచు రొదచేయుచు విషయమంతయు చెప్పసాగిరి. సుల్తాను దిగ్భ్రమజెందెను. నోటమాటరాక మూర్ఛపోయెను. నౌకరులును బానిసలును పన్నీరుచల్లి సేద దేర్చిరి. అబ్దుల్‌రజాక్ మొదలైనవారు పరుగున చెంతకు వచ్చిరి. ఇంక నేమున్నది! మహామంత్రులు స్నేహితులు ఇట్టి దుర్మణము పాలయినారన్న దుఃఖము సుల్తానునకు పొంగిపొంగి వచ్చుచుండెను. ఆతఁడు పిచ్చిపిచ్చిగా పలవింపసాగెను. ఎవరేమిచెప్పినను శాంతింపలేదు. ‘కోటదర్వాజాతలుపులు తెఱచి వేయుఁడు. ఔరంగజేబునుగాని మొగలాయీవారి నెవరినైన గాని వచ్చి గోలకొండను స్వాధీనము చేసికొని పొమ్మనుఁడు. ఇఁక మాకు గోలకొండ అక్కఱలేదు. ఈ రాజ్యమును మీరే అనుభవింపుఁడు. ఎంతపాపాత్మురాండ్రు ఈ యంతఃపురస్త్రీలు. మీ కందఱకు వినాశకాలము వచ్చినది. గోలకొండ నాశనమైపోవు కాలమువచ్చినది. మొగలాయీలు వచ్చి మిమ్ము ముక్కలుముక్కలుగా నఱకు కాలమువచ్చినది. హా! అక్కన్న మాదన్నలు మా అన్నదమ్ములు. వారుపోయిన తర్వాత మా కెందులకయ్యా ఈ రాజ్యము, ఈ యైశ్వర్యము?’

అబ్దుల్‌రజాక్ లారీ సుల్తానునకు ఊరటచెప్పసాగెనుకాని సుల్తానున కికనెక్కడి ఊరట. వెంటనే తనగురువును దర్శించెను. ఆ స్వామి వేదాంతము తప్ప ఇఁకనేమి చెపఁగలఁడు. తానాషా తన సర్దార్లతో మొగలాయీవారికి కోటనువదలివేయుఁడని చెప్పుచుండెనేగాని మానలేదు. సర్దారులు కదలక నిలిచియుండిరి. తానాషా దుఃఖాతిరేకమున నిట్లనుచున్నాఁడని వారు మొగ మొగంబులు చూచుకొనుచు మంత్రులమీఁద సుల్తానునకు ఇంతప్రేమ కలదని తమకు ఇంతవఱకు తెలియరాదాయెనని తమలోతాము చెప్పుకొనసాగిరి. తానాషా మరల నారంభించెను. ‘అక్కన్న మాదన్నలు మాకు ప్రాణము వారే మాజీవము. ఈ దేశమునకు ఎంత సేవచేసినారు! ఎంత మేధావులు! రాజ్యము విస్తరించినారు, ధనము చేర్చినారు, ఊరిని కాపాడుచున్నారు, మహమ్మదీయులతో చాలస్నేహముచేసినారు. మామీఁద వారికెంతోప్రియము. రాజ్యములు రాగలవు పోఁగలవు, అట్టి స్నేహితులు రాఁగలరా? వారిది ఎంత సమదృష్టి. హిందూముసల్మాౝభేదమే వారికిలేదు. అయ్యా! మాకు ఈ సింహాసనమిక అక్కరలేదు. ఈతక్తు, ఈరాజ్యము, ఈయైశ్వర్యము అక్కరలేదు. సన్న్యాసము. సన్న్యాసము. మక్కాకు పోవలసినదే. కాశీరామేశ్వరాలలో పకీరుగా తిరుగుటమేలు. పొండు, తెరచి వేయుఁడు, ఖిల్లా దర్వాజాలంతయు తెరచివేయుఁడు,”

తానాషా ఈమాటనేచెప్పి పనవిపనవి యేడ్చుచుండెను. ఆసందర్భమున సుల్తానుతో మాటలాడ గలిగినవాఁ డెవఁడు? దర్వాజాలు తెఱచినయెడల నిఁకనేమున్నది. మొగలాయీలు ప్రవేశించి సర్వసంహారము చేయుదురు. మంత్రులను ఖూనీ చేయించినవారి యుద్దేశము అదికాదు. వారికి ఆ మంత్రులుపోయి వేఱుమంత్రులు రావలయుననియు అట్లుచేసిన ఔరంగజేబు సంతోషించుననియు, తమ పగతీరుననియు. అబ్దుల్‌రజాక్ లారీ చాలజాలితో సుల్తానును చూచుచుండెను. అతఁడు మాత్ర మేమిచేయఁగలఁడు. మొగలాయీవారు భేదడండోపాయములలో చాల సమర్థులు; ఎంతద్రోహమునకైనను వెనుదీయనివారు. వారితో తానాషాయొక్క అంతఃపురమందలి స్త్రీ వర్గము చేరినది. వారికి రాజనీతియేమి తెలియును. వారెఱిఁగినదంతయు కడుపుమంట తీర్చుకొనుటయే. పూర్వద్వేషములను మనసున నుంచుకొనియు కొందఱు ద్రోహులతో చేరియు అక్కన్న మాదన్నలను చంపించి హిందువులను కడతేర్చిన ఔరంగజేబు సంతోషించునని తలంచిరి. మొగలాయీపక్షపాత మవలంబించుటకు వారికిఁగలకారణమీమాత్రమే. గొప్పసామ్రాజ్యమును ఈ మహామంత్రులు కాపాడుచుండి రనియు వారి పతనముచేత నీ సామ్రాజ్యము నశించుననియు నామూర్ఖురాండ్రుకు తెలియదుగదా. మిగిలిన సర్దారులు కొందఱు ద్రోహులు. అక్కన్న మాదన్నలమీఁద వ్యక్తి ద్వేషముగల వారు కొందఱు. మొగలాయీలు బలవంతులుగాన ఎట్లును గోలకొండపడిపోయిన తమయుద్యోగములకు లోటుండదని తలంచిన వారు కొందఱు. అబ్దుల్‌రజాక్‌లారీ పైబృందములలో వేటితోను చేరఁడు. ఆతఁడు బుద్ధిమంతుఁడును సమర్థుఁడును. అక్కన్న మాదన్నలు రాజభక్తులనియు దేశభక్తులని మహాసమర్థులనియు నాతఁ డెఱుఁగును. పాడువేదాంతము వారిని చెఱచినది. తానో స్వయము రాజభక్తిసంపూర్ణుఁడు, వయసు చెల్లినవాఁడు. ఆతని చూపులో ఎంతభావము కలదోగాని చాలగొప్పవాఁ డనిమాత్రము తెలియుచుండెను. ఆతఁడు మెల్లగా తానాషా సమీపమునకు వచ్చి మోకాలిపై నిలిచి నెమ్మదిగా ‘జహాపనా’ అనెను.

తానాషా అతనివైపు చూచెను. ఆచూపులో నాతఁడు మరల మనలోకమునకు వచ్చుచున్నాఁడని యనిపించుచుండెను. ‘జహాపనా’ యను నాచల్లని పిలుపు ఆతనికెంతయో హృదయాహ్లాదకరముగా నుండెను. మరల నాతఁడు ‘జహాపనా’ యనెను. ‘అబ్దుల్ రజాక్ సాహెబ్, చెప్పండిభాయి’ అని సుల్తాను ప్రియముగా పలికెను. రజాక్ ఇట్లు చెప్పనారంభించెను. ‘జహాపనా, దయచేసి తొందరపడవలదు. మనకింకను చాల పని యున్నదిగదా. తాము మహావేదాంతిగదా. ఎవరికిని కాలము రాక వారుపోరుగదా. ఎవరికైన నసీబ్ తప్పునా? మంచిమంత్రులు ఘోరపుచావు చచ్చినారు. ఐనను మేమున్నాముగదా. నేను ఇన్నిదినములు తమనౌకరి చేసితిని; తమకొఱకు కత్తిపట్టితిని, తమపేరుచెప్పి పొడుచుచున్నానుగదా. నావంటివారు చచ్చువఱకు తాము దర్వాజా తెఱిపింపకూడదని నాప్రార్థన. మాప్రాణములు హరించి మాశవములమీఁద నడచి శత్రువులోపలికి వచ్చిన మాకు హాయిగానుండును. మాప్రాణములు సంతోషముగా పోఁగలవు. నమ్మక్ తిన్న ఋణము తీరును. హుజూరు సెలవైన ఖిల్లాను నేను కాపాడెదను. నాప్రాణాలమీఁద ఔరంగజేబును లోపలికి రానిండు. సర్కారువారి పాదములవిూఁద అనుగ్రహము కోరుచున్నాను. సెలవిండు” అని చాల దీనముగాను పౌరుషముతోను వేడుకొనెను.

తానాషాహృదయము ద్రవించిపోయెను. అతనినోట మాటరాలేదు. కొన్నినిముసము లాతఁడు జడునివలె నుండెను. రజాక్ మరల ఆమాటలనే పలికెను. తానాషా ఇష్టములేని వానివలెనుండి మెల్లగా ‘సరే, రజాక్‌భాయి, తమ ఇష్టప్రకారమే కానిండు. ఈఖిల్లా అంతయు తమస్వాధీనము, మనకెట్లును వినాశము తప్పదు. అది తమ మనసుప్రకారమే కానిండు. ఈ కొద్దిలో తమ కాయాసమేల.” రజాక్ పరమానందముతో సుల్తానునకు సలాముచేసి వెడలిపోయెను. దర్వాజాలు తెఱువ లేదుగదాయని యందఱును సంతోషించిరి. సుల్తానును వదలి రజాక్ ఈవలికిరాఁగానే గోలకొండ మీఁదికి మొగలాయీసైన్యము వచ్చుచున్నదని చారులు వచ్చి నివేదించిరి. కాని పాదుషాసైన్యము తాను సదుద్దేశముతో వచ్చుచుండునట్లు ప్రకటించియుండినది. షాఆలము సిఫారసుమీఁద పాదుషా తానాషాకు బహుమతులు పంపెను. ఎట్లును అక్కన్న మాదన్నలు పోయినారు. తానాషా సంధిషరత్తులకు ఒప్పుకొనియుండెను. ధనము చేకూర్చుటకు ఆలస్య మగుచుండెనేగాని తానాషా విరోధింపలేదు. పైగా పాదుషా కుమారుఁడు సుల్తానును క్షమింపవలసినదనియు సిఫారసు చేసి యుండెను. ఇవెల్ల నాలోచించి చక్రవర్తి గోలకొండసుల్తానును మన్నించుమర్యాదగా నాతనికి గొప్పదుస్తులు నగలు పంపుచు వీనిని కొనిపోవుపనిని మీర్‌హషీం అనువానికే పెట్టెను. ఇది చాలసాభిప్రాయము. మీర్‌హషీం గోలకొండసైన్యమునుండి అంతకు కొన్నినెలలక్రిందనే మొగలాయీలకడకు పాఱిపోయి యుండెను. అట్టివానినిపంపిన గోలకొండవారికి తప్పక కోపమువచ్చును. కాని రహస్యముగా పాదుషా, ఈ సాకుతోపోయి గోలకొండను స్వాధీనము చేసికొనిరమ్మని హషీమునకు ఆజ్ఞ యిచ్చియుండెననియు, గోలకొండవాఁడే కాఁబట్టి అతనికి లోగుట్టులన్నియు తెలిసియుండుననియు సంధికి వచ్చియున్నందున గోలకొండవారు కొంతకాలము యుద్ధప్రయత్నము మానియుందురనియు కొంద ఱనుకొనుచుండిరి. ఈవిషయము గోలకొండ చారుల చెవులలోపడినది. దానిని వారు అబ్దుల్‌రజాక్‌లారీతో చెప్పిరి. అబ్దుల్‌రజాక్‌సాహెబు, షారెజుఖాను మొదలైనవారితో మొగలాయీవారిని డీకొనుటకు సంసిద్ధుఁడుగా నుండెను. మీర్‌హషీం అనువానివెంట నాతనికుమారుఁడు అబ్దుల్‌కరీం అనువాఁడు వచ్చుచుండెను. ఇంకను గొప్పసర్దారులు వచ్చుచుండిరి. రజాక్‌సాహెబు తనప్రయత్నములను చాలరహస్యముగా నుంచియుండెను. అబ్దుల్‌కరీమును మీర్‌హషీమును గోలకొండకు ఇరువదిమైళ్లదూరమున మునగాలకడకు వచ్చిరి. వెంటనే రజాకుయొక్క యాజ్ఞచేత షేక్‌నైజాము అనుసర్దారును నాతని యధీనమం దుండిన ఆప్ఘనుసైనికులును మొగలాయీవారిమీఁద ఆకస్మికముగా దుమికి, ముట్టడించి పూర్తిగా దోఁచుకొనిరి. ఈదెబ్బలో మీర్‌హషీం చనిపోయెను, అబ్దుల్ కరీము బంధింపఁబడెను. ఆకస్మికయుద్ధముగాన షాఆలముకడ నుండి సాయమువచ్చుటకు అవకాశము లేకపోయినది. ఇదంతయు 1685 సం. నవంబరునెలలో జరిగినది.

వెంటనే మొగలాయీసైన్యము గోలకొండను వదలిపోయెను. ఇంతవఱకును మొగలాయీలు గోలకొండకు వెలుపలనుండి నానాబాధలు పడుచుండిరి. కోహీరులో నుండిన షా ఆలముయొక్క స్కంధావారములోని సిబ్బందికి అన్నములేదు. గుఱ్ఱములకు ఉలవలుకాదుగదా గడ్డికూడ లేదు. సామానులు లాగు బండ్లయెడ్లకు నీళ్లేగతి. ఈస్థితిలో పాదుషా తనకుమారుని వెంటనేబయలుదేరి బిజాపూరును ముట్టడించుటకు తనకుసాయము రమ్మని ఆజ్ఞాపించెను. బిజాపురము సులభముగా మొగలాయీలను లొంగునట్లు లేదు. అంతవఱకు షోలాపూరులోనుండిన పాదుషా ఇప్పుడు స్వయముగానే బిజాపూరుముట్టడికి పూనుకొనెను. బిజాపూరును స్వాధీనముచేసికొనినతర్వాత గోలకొండమీఁదికి రావలయునని పాదుషా సంకల్పము.