అంబటి వెంకన్న పాటలు/మబ్బులు, ఐదొద్దుల ఆనపాట

వికీసోర్స్ నుండి

ఐదొద్దుల ఆన పాట



కన్నెపిల్లలారా వలలో
సన్నజాజులారా వలలో
గడుసుపిల్లలారా వలలో
పడుసు మొగ్గలారా వలలో
జెల్లపిల్లలారా వలలో
సందమామలారా వలలో
పదంబాడ రారే వలలో
పాట నేర్చుకోరే వలలో
కండ్లు దుడుసుకోరేవలలో.
కథను తెలుసుకోరేవలలో.

ఆనదేవుని తల్లి॥
వర్షాల దేవంట వలలో
వర్షాల దేవీకి వలలో
ఒక్కడే కొడుకంట వలలో
ముర్వంగ బెంచింది వలలో
గార్వంగ జూసింది వలలో
పాపెడ దీసింది వలలో
పాపొలె జూసింది వలలో
దిష్టిసుక్కబెట్టి వలలో
దిక్కుల దిట్టింది వలలో
కండ్లు దుడుసుకోరేవలలో.
కథను తెలుసుకోరే వలలో.

అట్టబెరిగినాడు కొడుకు వలలో
ఆనదేవుడమ్మ వలలో

కొడుకా ఓ కొడుకా వలలో
కొడుకా ఆనదేవా వలలో
వన్నెచిన్నెలుండి వలలో
మెరిసేటి మెరువురా వలలో
ఉరుము ఉరిమి నువ్వు వలలో
రాలేటి పిడుగువురా వలలో
మతులుజెడ్డ లొకం వలలో
సుతులు గల్వవయ్యా వలలో
కొడుకా ఆనదేవా వలలో.......
సక్కనాల తండ్రీ వలలో.........
ఆడంగ ఈడంగ వలలో
ఆభూమి జేరంగ వలలో
చిటపటలాటాడి వలలో
చినుకుగార కొడుకా వలలో
కునుకుదీస్తే నువ్వు వలలో
మినుకుదీపమారు వలలో
వగర బతుకులల్లో వలలో
సిగురు ఆశ నువ్వు వలలో
ఆపూలు పండ్లన్ని వలలో
నీ సేతి భాగ్యంరా వలలో
బంగారు నా తండ్రి వలలో.......
వరాల మూటవురా వలలో........

పచ్చని చెట్లన్ని వలలో
మేనమామలనుకో వలలో
వాగుల్ని వర్రెల్ని వలలో
చెల్లెండ్లనుకోరా వలలో
సారెలొద్దు కొడుకావలలో
చీరలొద్దు కొడుకా వలలో

ఒంపు సొంపులున్న వలలో
సక్కని చెల్లెండ్లు వలలో
సుక్కనీరు లేక వలలో
గొంతులెండి ఉండ్రు వలలో
ముద్దులు చెల్లెండ వలలో
సల్లంగ జూడయ్య వలలో
ఆడంగ ఈడంగ వలలో
ఆభూమి జేరంగ వలలో
చిటపటలాటాడి వలలో
చినుకుగార కొడుకా వలలో
కొడుకా ఆనదేవా వలలో
సక్కనాల తండ్రి వలలో
బంగారు నాతండ్రి వలలో
వరాల మూటవురా వలలో
ఓ ఎడ్జి నాగన్నా వలలో.........
నా ఎండి కొండవురా వలలో.........
గీత దాటబోకు వలలో
కోట దాటబోకు వలలో
ఎనకటి కాలమునవలలో
ఎతులు జితుల లేవు వలలో
ఎడ్డి కాలమయ్య వలలో
గుడ్డి కాలమయ్య వలలో
కాలు అడ్డమేసి వలలో
కాలువ నీళ్ళకూ వలలో
గొట్టొడ్లు అలికితెనో వలలో
పుట్లు గట్లు దెగెనే వలలో
ఆ బువ్వ దిన్న జనము వలలో
జడువకుంట బతికే వలలో
సద్దజోన్న సేలు వలలో

సవారి పండుగలే వలలో
పాల పిట్టెలెన్నో వలలో
పాట బాడెనయ్యో వలలో
తొట్టెల్ల బిడ్డల్ని వలలో
ముక్కుల్ల సమరేసి వలలో
ముద్దుగ జూసేనే వలలో
జోగాల బాడేనే వలలో
రెక్కల్లు పిక్కల్లు వలలో
దిక్కుల్ల సూరీడే వలలో
మబ్బుల్లో మసకల్లో వలలో
ఆ నీలి సెంద్రూడే వలలో
కొడుకా ఆనదేవా వలలో....
సక్కనాల తండ్రీ వలలో....

అసొంటి కాలాలు వలలో
ఇప్పుడైత లేవు వలలో
పాలు ఇస్తె తల్లి వలలో
ముసలిదైత దంట వలలో
పోతపాలు బెట్టి వలలో
పొట్టమందు లేకా వలలో
మందులు గోళీలు వలలో
తీరొక్క రోగాలు వలలో
సిత్రమైన కాలం వలలో
సింతలేని కాలం వలలో
కడుపులోని పిండం వలలో
గట్టి పడక ముందే వలలో
క్యానింగు దీపిచ్చి వలలో
టీవీల జూపిచ్చి వలలో
ఆడపోరలైతే వలలో

కడుపులోనే బొంద వలలో
కడుపుతీపి లేని కసాయి
కత్తుల కాలమురా వలలో
బాటెంటబో కొడుకా వలలో
బాటెంట రాకొడుకా వలలో
కొడుకా ఆనదేవా వలలో
సక్కనాల తండ్రి వలలో
బంగారు నా తండ్రి వలలో.........
వరాల మూటవురా వలలో......

పక్కతొక్కుడొద్దు వలలో
పాడు పనులు వొద్దు వలలో
సెయ్యెత్తు కొడుకువురా వలలో
సెయ్యి ఎత్తలేను వలలో
ఎడిపియ్యబోకు వలలో
ఆడిపియ్యలేను వలలో
కొంటె కృష్ణునోలె వలలో
సిందులెయ్యబోకు వలలో
శివుని మాయతోటి వలలో
కొంప ముంచబోకు వలలో
బంగారు నా తండ్రి వలలో.....
వరాల మూటవురా వలలో.......

నీ సుఖము జూసుకుంటె వలలో
సకలమెండిపోద్ది వలలో
మొకం జూడకుంటే వలలో
కరువు పండిపోద్దీ వలలో
ముద్దుల నీ రాణీ వలలో
పాయిరాల దేవి వలలో

పానమిచ్చు సఖియ వలలో
పాయిరంగ జూడువలలో
ఇంటినొదిలి నువ్వుమంది
ఇడుపులెంట బోకు వలలో
తల్లినయ్యి నేను వలలో
నీకు జెప్పుతున్నా వలలో
సెప్పరాని మాట వలలో
సెవిన బెట్టు కొడుకా వలలో
సక్కనాల తండ్రి వలలో......
వరాల మూటవురా వలలో.......

ఇన్ని జెప్పుతున్నా వలలో
నోరు దెరువవయ్యా వలలో
ఎన్ని మాటలన్నా వలలో
మూగబోయి ఉంటవ్ వలలో
ఎవలున్నయెన్నో వలలో
ఏశకాంతల్లు వలలో
కులానికొకతుండే వలలో
తలానికొకతుండే వలలో
బాతకానియయ్యి వలలో.....
బధ్రంగబో కొడుకా వలలో..

ఆతల్లి మాటలిన్నా గంగ
కడుపంత రగులంగా వలలో
కణకణ మండంగ వలలో
కన్నెర్ర జేసింది వలలో
భూమి దద్దరిల్ల వలలో
సిందేసి దునికిందోవలలో
గుడ్లురిమి జూసిందో వలలో

పండ్లు గొరికినాదోవలలో
నోరు సేత బట్టి వలలో
మాటలు జాడిచ్చే వలలో
గడగడ వణికిచ్చే వలలో
దడదడ బుట్టించే వలలో
ఆడదంటె నీకు వలలో
అంతలోకువేంది వలలో
నోటికొచ్చినట్టు వలలో
ఆడిపోసుకున్నవు వలలో
అచ్చమైన వాడా నీకొడుకు
ఆయమన్న వాడా వలలో
ఇగురం దప్పినోడై వలలో
ఇండ్లు ముంచబట్టే వలలో
బుద్ధిలేక వాడు నిన్నూ
రద్ది పాలు జేసే వలలో
సిగ్గు లేక వాడు దొంగ
పిల్లి ఏశమేసే వలలో
పాలపిందెలెన్నో వలలో
పాడు జేసుకుంట వలలో
పసరు శేల ముంచి వలలో
పరాఖతంటుండు వలలో
మోసగాడు వాడు వలలో
బద్మాశంటె వాడు వలలో
బాతకాని వాన్ని వలలో
శేతగాని వాన్ని వలలో
ఎట్ల గన్నవమ్మా వలలో
ఎవని మాయ తల్లివలలో
మాయ మాటలాడి వలలో
మాయమాయ జేసే వలలో

ఇల్లు లూటి జేసే వలలో
వల్లు గుళ్ళ జేసే వలలో
బతుకు ఎండబెట్టివలలో
మెతుకు గుంజుకుండే వలలో
ఈ తీరు మాటలతో గంగ
తిర్నాల జేసింది వలలో
గడగడ లాడించి వలలో
శివమెత్తి ఊగింది వలలో
తూర్పాల బట్టింది వలలో.......
తూర్పెల్లి పోయింది వలలో.........

ఓరోరి నా కొడుక వలలో
సినుకుల కనకయ్య వలలో
ముత్యాల జల్లయ్య వలలో
మడుగుల బుడుగయ్య వలలో
వరదల బురదయ్య వలలో
వొండుల గండయ్య వలలో
చిరుచిరు జల్లుల్లో వలలో
సింగార మొలికించి వలలో
తొలకరి జల్లుల్లో వలలో
పులకరింప జేసి వలలో
గాలితో కలెగలిసి వలలో
పూలను ముద్దాడి వలలో
పుడితివి నా కొడుకా వలలో
సక్కనాల దేవా వలలో
ఏమిజేద్దూ కొడుకా వలలో......
ఎట్లజేద్దు కొడుకా వలలో.......

కయ్యాలు జెయ్యంగ వలలో

గయ్యాలి గంగొచ్చెవలలో
గయ్యాలి గంపలతో వలలో
మాట బడితినయ్యా వలలో
ఎందుకిట్ల నన్ను వలలో
పండ్లమ్ముతున్నవురా వలలో
ఏమిజేద్దు నిన్ను వలలో
ఏడిపిస్తవుంటే వలలో
ఏమిజేద్దు కొడుకా వలలో
ఎట్లజేద్దు కొడుకా వలలో
సిన్నవాడి వైతే వలలో
సెట్టుకు గట్టేద్దు వలలో
యశోదమ్మ లెక్క వలలో
రోటికి గట్టేద్దు వలలో
ఏమిజేద్దు కొడుకా వలలో..........
ఎట్లజేద్దూ కొడుకా వలలో..........

తల్లి మాటలాకు కొడుకూ
మారు బలకలేదు వలలో
నేత గీత గీసి వలలో
సింతజేసుకుంట వలలో
అదట్న లేసిండు వలలో
అటీటు జూసిండు వలలో
తానమాడినాడు వలలో
తండేడు రింగన్నయ్ వలలో
అంచుదోతి గట్టి వలలో
ముద్దుగ ముస్తాబై వలలో
ఉడుత సార్కలోలే వలలో
ఉత్తరీయమేసి వలలో
సెప్పు దొడిగి సామి వలలో

సెట్టున గదిలిండు వలలో
బుర్రున లేసిండు సామీ......
ఇల్లడిసి పోయిండు వలలో.......

సినుకు రాలలేదు వలలో
సింత జేసె జనలు వలలో
కంతల్ల కండ్లయి వలలో
డొక్కలెన్నుబట్టి వలలో
ముర్కశిర కార్తెల్లె వలలో
ముల్లు నానదాయెవలలో
ఆరిద్రకార్తంత వలలో
దారిద్రమైపాయె వలలో
పాలపిట్టలేమో వలలో
కనపడకుంటాయె వలలో
గౌరమ్మ బతుకమ్మయ్ వలలో
గుడిమీద ఎండంగ వలలో
పడుసు జంటలోలె వలలో
కలిసి తిరిగె పిట్టె వలలో
యాడికెల్లి పోయే వలలో
యాడ గానరావు వలలో
పొద్దుందాక జూస్తేవలలో
కుక్కలేడ్పులాయె వలలో
తెల్లవార్లు జూడు వలలో
సీత్ప అరుపులాయెవలలో
ఇండ్లు సగము గూలి వలలో
ఇడుపుకొచ్చినారు వలలో
ఎక్కడున్నవయ్యా వలలో........
సక్కనాల దేవా వలలో...........

కార్తులన్ని బాయె వలలో
కాల్వ సాగదాయె వలలో
సిన్నపోరగాళ్ళ వలలో
వల్లు దడవదాయే వలలో
కన్నీళ్ళింకి పాయె వలలో
సోకం మిగిలిపోయే వలలో
పెసరి శేలు జూడు వలలో
పసరు బిండినాయివలలో
కసరు గక్కి నాయి వలలో
వసరు బారినాయి వలలో
ఆందసేండ్లు జూడు వలలో
అర్రులొంచినాయి వలలో
పూతబడ్డ సేలు వలలో
ఎండి వరుగులాయే వలలో
సెనిగ శేలు జూడువలలో
శెనికేసినట్టుండే వలలో
పచ్చని శేలన్ని వలలో
ఎక్కిళ్ళు బట్టినయి వలలో
ఎక్కడున్నవయ్య వలలో.....
సక్కనాల దేవా వలలో........

మదిల దలవగానే వలలో
మళ్ళి సూడగానే వలలో
రయ్యురయ్యుమంటూ వలలో
ఎయ్యికాళ్ళ జెర్రి వలలో
ఏడేడు లోకాలు వలలో
పధ్నాలుగు లోకాలు వలలో
పచ్చోలే దిరుగంగ వలలో
పంచాది బెడ్తోడు వలలో

తుంబుర బట్టిండు వలలో
టిమటిమ గొట్టిండు వలలో
తుర్రు పిట్టెమీద వలలో
రానే వచ్చిండు వలలో
నారాయణనుకుంట వలలో
దగ్గెరికొచ్చిండు వలలో
వందనాలు తల్లీ అమ్మా
వర్షాల దేవమ్మా వలలో
ఇవరించి సెప్పంగా వలలో
వైనంగ గూసుండు వలలో
ఆనదేవుడమ్మా నీ కొడుకు
అందమైన వాడే వలలో
సక్కనైన వాడే వలలో
సల్లనైన వాడే వలలో
నిప్పులేక తల్లీ వలలో
పొగెట్ట బుడుతాది వలలో
ఒక్కసెయ్యి గొడితే వలలో
సప్పుడెట్ట బుట్టు వలలో
కులానికొకతమ్మో వలలో
కులుకుల సిలుకాలు వలలో
ఏడు మందితోని వలలో
కలెమెలిగిపోతుండు వలలో
ఎట్ల వస్తడమ్మా కొడుకు
ఎన్నుకంటి ఉంటే వలలో
ఏడోద్దులాకుండ్రు వలలో
ఆ గుడ్డి కుమ్మరిదీ వలలో
గుణము గల్లదమ్మా వలలో
సామినిడువదమ్మా వలలో
ఇడిసి ఉండదమ్మా వలలో

ఆ గుడ్డి కుమ్మరిదీ వలలో
సామినా ఆడించి వలలో
జలకాలాడించి వలలో
ఉయ్యాలలూగించి వలలో
బంతినారు బోసి వలలో
చామంతి నారేసి వలలో
ఆ పూల వనమల్లో వలలో
సామితోని దిరిగి వలలో
సొగసులు నింపింది వలలో
వయ్యార వొంపింది వలలో
సెలికలు ఏసింది వలలో
కులుకులు జూపింది వలలో
దాని మాటలింటే వలలో.....
దాసులయ్యి పోతం వలలో.....

సల్లని ఆనదేవా వలలో
తెల్లని ఆనదేవా వలలో
మట్టికుండ మీద వలలో
ఎండిమబ్బు సామీ వలలో
నువ్వు బోకు దేవా వలలో
కలికిరాళ్ళ మీద వలలో
కాలమైత ఉంది వలలో
పలుగు రాళ్ళ లెక్కవలలో
పగడాలు బండే వలలో
పడే బండమీద వలలో
రదనాలు బండే వలలో
పోవద్దు ఓ సామీ నన్ను
సంపొద్దు నా సామీ వలలో
సామి ఆనదేవా. వలలో

సక్కనాల దేవా వలలో
నువ్వు లేక నేను వలలో
నెర్రబట్టి పోతా వలలో
నిన్ను ఇడిసి నేను వలలో
బతకలేను సామీ వలలో
ఉండలేను దేవా వలలో
వదల లేను సామీ వలలో
సామి ఆన దేవా వలలో
సక్కనాన దేవా వలలో
పోవొద్దు ఓ సామీ వలలో.....
ముద్దులాన దేవా వలలో.......

ఆన దేవుడైన నీ కొడుకు
ఆడ జేరినాడు వలలో
ఆటలాడుతుండు వలలో
పూటగడుపుతుండు వలలో
పెండ్లం అడ్డమొస్తే వలలో
దెబ్బగొట్టి వచ్చు వలలో
గుండ్లు అడ్డమొస్తే వలలో
పక్కకు డొలిపొచ్చువలలో
ఎవ్వరాపినాను వలలో
ఆగిపోని సామీ వలలో
నిన్ను మరిసి సామీ వలలో
పడుసు పిల్లలెంట దిరిగే వలలో
కొడుకా ఓ కొడుకా వలలో
కొడుకా ఆన దేవా వలలో
ఎక్కడున్నవయ్యా వలలో
ఏడ నిన్ను జూడ వలలో
పాడు బుద్ది నీకు వలలో

ఎట్ల వచ్చెనయ్యా వలలో
నువు లేని లోకాన్ని వలలో
కరువొచ్చి కర్సింది వలలో
కాలమంటు లోకం వలలో
కలవరిస్తు ఉంది వలలో
కన్నీరు బెట్టంగ జనమూ
అస్కులాడుతుండ్రు వలలో
ఎక్కడున్న వయ్యా వలలో........
సక్కనాల తండ్రి వలలో.........

చెరువులెండి పాయె వలలో
బావులెండి పాయె వలలో
మడుగులెండి పాయే సుక్కా
నీరు లేక పాయే వలలో
సొప్పగూడు లేక పసులు
సొక్కిపోయే గదరావలలో
మన్ను బుక్కి పసులు వలలో
తల్లడిల్లె గదరా వలలో
ఎద్దెద్దు పంచకం వలలో
ఎద్దు గతుకుతుందివలలో
ఆవావు పంచకము వలలో
ఆవు గతుకుతుంది వలలో
గంగిగోవు పాలు వలలో
ఇంకి సంకలిండే వలలో
దూడలాడ్త లేవు వలలో
దూపదీర్త లేదు వలలో
వొండు దాగి పసులా వలలో
డొక్కలెన్ను బట్టే వలలో
మేత లేక పసులు వలలో

కోతకైతు ఉన్నయ్ వలలో
పచ్చులు అల్లాడే వలలో
జువాలు తండ్లాడే వలలో
ఎక్కడున్నవయ్యా వలలో.......
సక్కనాల తండ్రి వలలో.....

పసిబిడ్డ తల్లులదీ వలలో
మసిగుడ్డ బతుకాయే వలలో
బువ్వలేక మంది వలలో
బుగ్గి పాలు అయ్యేవలలో
సిన్న పిల్లలంతా వలలో
మన్ను దిన్న పామైవలలో
ఆటలాడ్త లేరు వలలో
పాట బాడ్త లేరు వలలో
ఎక్కడ బోతివిరా వలలో
సక్కనాల తండ్రి వలలో
ఒక్కనాడు నిన్ను వలలో
పల్లెత్తు అననైతీ వలలో
ఏడదాగినవురా వలలో....
సక్కనాల తండ్రి వలలో......

అరిగోస దీస్తుంటే జనము
ఆ తల్లి కదిలింది వలలో
కోట బురుజు లెక్కివలలో
ఒంటి తంబమెక్కి వలలో
కొండబొబ్బ బెట్టే వలలో
కోటి కూతలేసే వలలో
ఎక్కడున్న వయ్యా వలలో
సక్కనాల తండ్రి వలలో

కప్ప కాముడాడి జనమూ
వల్లు తడుపుకుండ్రు వలలో
కండ్లు దుడుసుకుండ్రు వలలో
కాళ్ళు ముడుసుకుండ్రు వలలో
వలలు సేత బట్టి బెస్తలు వలలో
ఏటకెళ్ళినారు వలలో
నీల్లు లేని సెర్లా వలలో
పునుకుతుండ్రు సూడు బెస్తలు
దిగులు గుండెతోనిబోయులు
కుమిలిపోయినారువలలో
ఉప్పెనొచ్చి పాయే వలలో
బతుకులాగమాయేవలలో
కనికరించు కొడుకా వలలో......
బంగారు నాతండ్రి వలలో........

జతలు జతలు గలిసి వలలో
రథము జేసుతుండ్రు వలలో
గంగమ్మ పండుగను వలలో
ఘనంగ జేస్తుండ్రు వలలో
ఆన సినుకు మీద వలలో
కథలు జెప్పుతుండ్రు వలలో
ఉన్నొక్క కార్తంటా వలలో
ఉత్తర కార్తంటా వలలో
ఉత్తర జూసిండ్రా జనము
ఎత్తుకుంటే గంపా వలలో
దేశ పచ్చులయ్యి వలలో
ఆగమైతరయ్యా వలలో
ఎక్కడున్నవయ్యా వలలో......
సక్కనాల తండ్రి వలలో........

తల్లీ బిలువంగా వలలో
పొలికేక లెయ్యంగా వలలో
ఉత్తర ఉరిమింది నాలుగు
దిక్కులు మెరిసింది వలలో
పులులు సింహాలు వలలో
ఏనుగు కుంభాలు వలలో
చకచక గుర్రాలు వలలో
ఉరుకు జూపినట్టు వలలో
ఎండి కొండలెన్నో వలలో
పగిలి ఎగిసినట్టు వలలో
కనపడె మబ్బుల్లో వలలో
ఆ మబ్బు తెప్పల్లో వలలో
అక్కడుండు సామీ సక్కని
ఆన దేవుడమ్మా వలలో
లోకాలు జడువంగా వలలో
ఉరుమయ్యి ఘర్జించే వలలో
ఆ మబ్బు తెప్పల్లో సామీ
చెక్కున మెరిసిండు వలలో
పడమట బట్టింది వలలో
సాటంతా మొగులు వలలో
తూర్పున బట్టింది వలలో
మొంటెంతా మొగులు వలలో
ఆ మొగులీ మొగులూ వలలో
కలె గలుపూకుందీ వలలో
సుట్టు కమ్మినాది మబ్బు
కలిమా పండోలే వలలో
పలపల సినుకులతో సామీ
భూమి జేరెనమ్మా వలలో

ముంగిళ్ళ గురిసెనులే వలలో
ముత్యాల ముసురు వలలో
జల్లున గురిసెనులేవలలో
జోరు వానల్లు వలలో
ఉడుకపోత దీరా వలలో
కుండపోత ధార వలలో
తొర్ర బావులన్నీ వలలో
తొణికిస లాటాడే వలలో
మూల బావులన్నీ వలలో
జాలు బట్టినాయి వలలో
బుడిగ బావులల్లో వలలో
బుగ్గ బుట్టినాది వలలో
పీక బావులన్నీ వలలో
తోక లిడిసినాయి వలలో
గంపదించి జనమూ వలలో
గంతులేస్త ఉండ్రు వలలో
సిన్నపోరగాళ్ళు వలలో
వరదల్ల మునిగిండ్రు వలలో
పసులు జీవాలు వలలో
చెంగనాలు దోలే వలలో
భూమిలోని జీవి వలలో
తానమాడినాది వలలో
పచ్చులన్ని గలిసి వలలో
పాటబాడినాయి వలలో
పొర్లిన వాగుల్లో బెస్తలు
షికారి జేస్తుండ్రు వలలో
సున్నము జాజూతో జనమూ
శెల్కలల్ల జేరే వలలో
మువ్వల పట్టెళ్ళు వలలో

ఘన ఘన గంటల్లో వలలో
ఎడ్ల డొక్కలల్ల వలలో
సేతి అచ్చులేసే వలలో
కంకనాలు గట్టి వలలో
నాగలంట గట్టే వలలో
ఉరుకొచ్చే ఆనదేవా వలలో
ఊపిరొదలకుంటా వలలో
ఉర్కొచ్చే ఉర్కొచ్చే వలలో......
అగ్గి పిడుగోలే వలలో.......

జగాలు ఊగేనే వలలో
సోకాలు ఆగేనే వలలో
ఆ వాగు వరదల్లో వలలో
ఆ నీటి బుడగల్లో వలలో
బయలెల్లె ఆనదేవా రయ్యున
బుర్రు పెట్టోలే వలలో
కరుకు మీద గదిలే వలలో
కమ్మరి వాడాకు వలలో
ఆన దేవుడొస్తే వలలో
ఆ కమ్మరాడల్ల వలలో
ముంగిళ్ళ నూకిచ్చివలలో
ముత్యాలు బరిసీ వలలో
పందిళ్ళ నూకిచ్చి వలలో
రత్నాలు బరిసీ వలలో
కుర్చీలు ఏసేది వలలో
కుసబెట్టి మొక్కేది వలలో
అసొంటి మర్యాద వలలో
ఆడుగంటి పాయే వలలో
వాకిళ్ళు మొత్తము వలలో

పొక్కిళ్ళు లేసినయి వలలో
పనిముట్లు సాంతీమి వలలో
సిలుమెక్కిపోయినయి వలలో
తలుపు సెక్కలన్నీ వలలో
సెదలు బట్టినాయి వలలో
గతిలేకా వాల్లు వలలో
గంజి తాగుతుండ్రు వలలో
సామిని జూసిండ్రువలలో
సరసర లేసిండ్రు వలలో
మనల మరిసినోడు వలలో
ఎన్నడు రానోడు వలలో
ఆనదేవుడైనా వలలో
ఇటొస్త ఉండానీ వలలో
కరకర పొద్దేలే సామీ
ఇటొస్తు ఉండేందీ వలలో
ఏమిజేదు ఖర్మా వలలో
ఎందుబోదు రాతా వలలో
ఏడ గూసబెడుదూ వలలో
ఏమి జేదు రాతా వలలో
దిగ్గున లేసిండ్రు వలలో
దిక్కులు జూస్తుండ్రు వలలో
అడుగు బడ్త లేదు వలలో
తొక్కులాడ్త ఉండ్రు వలలో
ఓరోరి సత్తయ్య వలలో
ఇటురికి రా కొడుకా వలలో
రామయ్య మామింట్ల వలలో
కల్లు జెప్పి రాపో వలలో
అడుగు బడ్త లేదు వలలో
తొక్కు లాడ్త ఉండ్రు వలలో

మోదుగాకు ఇచ్చి వలలో
కల్గొంపినారమ్మా వలలో
ఆ గంజి మెతుకులనే వలలో
గురిగిల బోసిండ్రువలలో
సామికి ఇచ్చిండ్రు వలలో
సగము జచ్చినారు వలలో
ఆ బాధ జూసి సామీ వలలో
భుజాన్ని తట్టిండు వలలో
నీల్లు నమిలి సామీవలలో
ధైర్యాన్ని జెప్పిండు వలలో
కొలిమి మంటలోనే మీకు
బలిమిగలుగునయ్యా వలలో
కర్లు జెయ్యిరయ్యా వలలో
తెర్లు గారు మీరు వలలో
కుసోవు ఆనదేవా వలలో
కుసోవా మా సామీ వలలో
దుమ్ము బేరినట్టి వలలో
ఈ పేద వాడల్లా వలలో
కుసోవు ఆనదేవా వలలో
కుసోవా మా సామీ వలలో
మల్లెప్పుడొస్తావో వలలో
ఈ కమ్మరాడాకు వలలో
మెరుపోలే నువ్వొచ్చి వలలో
మురిపిచ్చి పోతావు వలలో
మబ్బోలే మదినిండీ వలలో......
మర్పిచ్చి పోతావు వలలో........

ఆనించి ఎల్లిండు వలలో
ఆనదేవుడయ్యా వలలో

ఒడ్ల వాడలాకు వలలో
నాగలెత్క పాయే వలలో
ఎలుగు సలుగు జూసి వలలో
నాగండ్లు అమిరిచ్చి వలలో
తొల్లిగొట్టెమీరు వలలో
తొలుతటి వారయ్య వలలో
బాడ్షబట్టి మీరూ వలలో
బండ్లు జెయ్యిరయ్యా వలలో
ఆనించి కదిలిండు వలలో
బుర్రున బోయిండు వలలో
ఘడియ గూడ సామీ వలలో
నిలబడ లేదయ్యా వలలో
పట్టు ఇడువకుంటా సామీ
పరుగున బయలెల్లే వలలో
ఆనించి గదిలిండు వలలో.......
మబ్బుల్ల నిలిసిండు వలలో.......