అంబటి వెంకన్న పాటలు/గోగుమల్లెలు

వికీసోర్స్ నుండి

వందనాలు వందనాలు



వందనాలు వందనాలు వందనాలమ్మో
తెలంగాణ తల్లీ నీకు దండాలోయమ్మో ॥వంద॥

జింకపిల్లలోలె గంతులేసే కృష్ణ గోదారమ్మలున్నా
పీకతుమ్మలు బెరిగి బోళ్ళు గుట్టలతోని బిల్లువారుడేంది
చెంగనాలుదోలె వాగువంక చెరువు అలుగు దునుకుతున్నా
శెల్కపంటలతోని సేతకూలి లేక సెమట బిండుడేంది
నిండు గర్భినోలె సాగరు కుండలు మోసి మందికిచ్చుడేంది
దూప దీరక నువ్వు అస్కులాడుకుంట ప్రాన త్యాగమేందీ ॥వంద॥

కుంకుమోలె దుక్కి పొతము జేసుకోని భూతల్లి వొడిలోనా
సినుకు కోసం జూసి తనుకులాడుతు నువ్వు తల్లడిల్లుడేంది
ఎవడెక్కి దిగలేని ఏడాకులా మర్రి నీడ నీకున్నా
పత్తి పురుగుల మందు గత్తరొచ్చి రైతు రాలిపోవుడేంది
పారే ముత్తెమంత దున్నుకుంటే సాలు రాజనాలు బండు
మన పాలుకొచ్చేనీల్లు మలుపుకుంటె ఇంక ఎన్ని సిరులు నిండు ॥వంద॥

వీరులోలె నీ కన్న కొడుకూలంత నీకు దాపుగున్నా
విధిరాత అనుకుంట సంకెళ్ళతో నువ్వు బంధీగున్నవేంది
యాబయ్యారుకు ముందే ఎన్నోతీర్ల బతుకుదెరువు నీకున్నా
యాబయ్యారేండ్లుగ వలసబాటలు బట్టి వంగి నడుసుడేంది
కట్టుబట్టలతోని కడుపుగట్టుకోని ఈడికొచ్చినోల్లు
కన్నశెరలా బెట్టి నిలువునా నినుముంచి రాజ్యమేలుడేంది ॥వంద॥

వనరులెన్నో ఉండి ఒంటిసేతా బతికే దమ్ము నీకున్నా
దమ్మిడ్కి గోరగాని దగాకోరుల ముందు సెయ్యి జాపుడేందీ
కాయకష్టము జేసి గంజి గట్కలు దాపి ఇల్లు గడుపుడేందీ
కుటిల నీతితోని కుట్రజేసినోల్ల పంచ జేరుడేందీ
ఆదినిష్ఠూరాన్ని వదిలిపెట్టుకోని పోరుజేసుడేంది
మోసగించినోల్ల మెడలు వంచకుంట ఇడిసి పెట్టుడేందీ ॥వంద॥

మురిసి మెరిసే రంగు బట్టలెన్నో నేసె పట్టుదనము ఉన్నా
ముతక చీరలు గట్టి గోషిబెట్టుకోని అలిసి పండుడేందీ
వెండి బంగారాలు వెలలేని ఖనిజ సంపదెంత ఉన్నా
జనుము గజ్జెలు గట్టి దుశిరేరు తీగల కడియాలేసుడేందీ
ఈరోగోలలు బట్టి శివమెత్తి ఆడంగ సిందు దొక్కవేందీ
మనవాన్నో మందోన్నో ఆంధ్రభూతం బట్టె తరిమి కొట్టవేందీ ॥వంద॥


కదలిరా...



కదలిరా తెలంగాణ భూమి పుత్రుడా
తరలిరా తెలంగాణ రైతు మిత్రుడా
విప్లవాలు ఉదయించిన వీరభూమి పిలుస్తుంది
ఉద్యమాల పురిటిగడ్డ రా రమ్మని అంటోంది ॥కదలిరా॥

గుండెలోని ఆశను మండె బోసుకున్న రైతు
దిగబాటు మడికట్లను దున్నుకున్న బక్కరైతు
నారుబోసి నాటేసి నవుసుతున్న పొలంజూసి
దోసిలొగ్గి నీల్లుదాపి తన దూపను మర్శిపోతె
కల్లంలో నదరు రాశి తూర్పాలతో ఎగిరిపోతె
మోసాన్ని నిలదీయ పోరు నాగలందుకొని ॥కదలిరా॥

ఎవసాయం సంగతేందో శ్రీవరీ సాగుయేందో
మూలమేదో జెప్పకుంట రోజుకో తీరుమాట
ఆలిపుస్తులమ్ముకొని ఇత్తనాలు కొనితెస్తే
పైసపైస అప్పుజేసి పురుగుమందులు గొడితే
దిగుబడే తక్కువంటే గిట్టుబాటు ఇయ్యరంట
ధర మనమే నిర్ణయించ చండ్రకోలలందుకొని ॥కదలిరా॥

బతికిసెడ్డ తెలంగాణ బంగపడ్డ తీరుఏందో
పచ్చని నా తెలంగాణ బీడయ్యిన గతిఏందో
మొఘలాయిల నెదిరించిన పాపన్న కాలంలో
పచ్చని పైరులతోని పరవశించినా తల్లి
మనభాష తెలుగంటూ మనమంతా ఒక్కటంటూ
మనబతుకును ముక్కలుగ చేసే నక్కల తరుమా ॥కదలిరా॥


తెలంగాణ ఆటపాట



తెలంగాణ ఆట పాట పల్లెలు దరువేసెనంట
వట్టికోట గట్టిమాట సుద్దాల దండుబాట
కాళోజి గొడవజేయ కలెబడి పోరాడుదాం
కలిసి వస్తరా తెలంగాణ బిడ్డలు
గెలిసి తెద్దమూ మనకన్న తల్లినీ ॥తెలంగాణ॥

రజాకార్లు భూసాములు పీడించిన కాలంలో
బాంచన్ దొర కాల్మొక్తని బతిలాడిన రోజుల్లో
ప్రజాయుద్ధభేరి మోగ గజ్జెగట్టెనీ పాట
దొరఘడీలు కుప్పగూల దద్దరిల్లెనీ ఆట
కలిసి వస్తరా తెలంగాణ బిడ్డలు
గెలిసీ తెద్దమూ మనకన్న తల్లిని ॥తెలంగాణ॥

ఉధ్యమాలు కొత్తగాదు పల్లెలొ మన పల్లెలో
విప్లవాలె ఆనవాల్లు నేలలొ తెలంగాణలో
నెత్తుటి పాదాల అడుగు జాడల్ని జూడగా
పదం పదం గలిపి మనం వెనుదీయక సాగుదాం
కలిసి వస్తరా తెలంగాణ బిడ్డలు
గెలిసి తెద్దమూ మనకన్న తల్లినీ ॥తెలంగాణ॥

కళాకారులంత గలిసి కదందొక్కి సాగంగా
కవి గాయకులెందరో గొంతెత్తి పాడంగా
పల్లె పల్లెనా ఎగిసె తెలంగాణ నినాదం
కన్నతల్లి రుణందీరె బాటనె బయలెల్లుదాం

కలిసి వస్తరా తెలంగాణ బిడ్డలు
గెలిసి తెద్దమూ మనకన్న తల్లినీ ॥తెలంగాణ॥

కాలయముల కతంజేయ నడుంగట్టి నడవరో
తెలంగాణ కడ్డొస్తే గోరీ గడదామురో
అటో ఇటో తేల్చుకునే తరుణం వచ్చిందిరా
తెలంగాణ భూమి పుత్రులేకం గావాలెరా
కదలి పోదమూ తెలంగాణ బిడ్డలు
సాధించుకొద్దమూ మనకన్న తల్లినీ
తెలంగాణ తల్లినీ....... ॥తెలంగాణ॥


నెనరు గల్ల తెలంగాణరా..



నెనరు గల్ల నా తెలంగాణరా
నెర్రెబారిన సంగతి వినరా
వలస పాలకుల కుట్రలతోని
నెగల లేక నేడు నవుసుతుందిరా ॥నెనరు॥

పెద్దమనుషులుగా గద్దెలెక్కెను
పేరుకాడ పెద్ద మోసమె జేసెను
మాయ మాటల గారడి జేసెను
మనని వాల్లు నిలువు దోపిడి జేసెను
మనల ముంచి ప్రాజెక్టులీడగట్టి... సుక్కనీరు లేకుంట జేసెను
ఓయమ్మో మనకు వచ్చె కాల్వల జూడమ్మో
మాయమ్మో కనపడని గండ్లు బెట్టెనమ్మో ॥నెనరు॥

పాయదెర్లు జూపి పాలన జేసిండ్రు
తెలంగాణ బతుకంతా తెర్లు జేసిండ్రు
అందిన కాడికి మూట గడుతుండ్రు
అన్ని రంగాలల్ల అవమానిస్తుండ్రు
నక్క జిత్తులా నాటకాలతో... రోజుకో తీరుగ మాటలాడుతుండ్రు
ఓయమ్మో పోలికేకలు బెట్టగ రారమ్మో
మాయమ్మో పొలిమేర దాటగ తరిమేదామమ్మా ॥నెనరు॥

తేనెబూసిన కత్తో తేనె తెట్టోగానీ
నెహ్రు గారప్పుడే జెప్పి పోయినారు
ముష్కరులు ఆంధ్రోళ్ళు ముడిపెట్టి పోతున్న

కలిసుండ లేకుంటె విడిపోవచ్చనే
కచ్చెబట్టి నేటి కాంగ్రేసు దొరలూ..కాదు కాదని ఏండ్లు జరుపుకోచ్చెను
ఓయమ్మో మన భూములు గుంజు కున్నరమ్మో
మాయమ్మో మన బతుకులు బుగ్గి జేసెనమ్మో
వలసాంధ్ర పాలన మనకొద్దే మాయమ్మో
వడిసెల రాళ్ళయ్ గెదుముదమే మాయమ్మో


తెలంగాణ పల్లెలు



తెలంగాణ పల్లెలు పదిజిల్లలు జూడు
ఎవనికెంత జెప్పినా తీరదు గోడు
గుణములోన బంగారు తంగెడుపూలు
తలలూపి ఆడంగ గోగుమల్లెలు ॥తెలంగాణ॥

మన సదువులు కొలువులన్ని మంటగలిసెనే
మనని మనమె తిట్టుకునే కాలమొచ్చెనే
మనకు సిచ్చుబెట్టి వాల్లు మంచిగున్నరే
మన బతుకుల నిప్పుబెట్టి తప్పుకున్నరే
ఇంటిదొంగలాట మనకు ఎక్కువాయెనే..
ఇదికూడా సీమాంధ్రుల ఎత్తులాయెనే...
తెలంగాణ పల్లెలు పదిజిల్లలు జూడు
తెర్లుజేయ జూసినోన్ని తరిమెను నేడు ॥తెలంగాణ॥

కదలలేని మోటబాయి కర్రదిప్పెనే
గంపజలతో గల్లుమంటూ గంతులేసెనే
సద్ద జొన్నసేలు ఊగి సవారయ్యెనే
వలస పక్షులా ఆకలి తీర్చలేమనే
మక్కజొన్న కందిసేలు కలవరించెనే
గెట్టుదాటి వచ్చినోల్ల నెల్లిపొమ్మనే
తెలంగాణ పల్లెలు పదిజిల్లలు జూడు
అదును కోసమెదురు సూసె తల్లులు నేడు ॥తెలంగాణ॥

ప్రజా తెలంగాణ కేక మారుమోగెనే
ప్రజలంతా ఏకమయ్యి కదల సాగెనే

అలుపులేక అస్సొయిధులా ఆటలాడెనే
హైవేలే ధూంధాంల వేదికాయెనే
పాలపిట్టె తెలంగాణ పాటబాడెనే...
మబ్బీదిన నెలవంక పున్నమాయెనే...
తెలంగాణ పల్లెలు పదిజిల్లలు జూడు
తెగబడి కొట్లాడే జనాసంద్రం నేడు ॥తెలంగాణ॥

నిజాంబాదు నల్లగొండ మెదకు జిల్లలే
ఓరుగల్లు కరీంన్నగరు పోరుబిడ్డలే
ఓయమ్మో నీ బలగం గొప్పదాయెనే
ఉధ్యమాల ఉగ్గుదిన్న పిల్లలాయెనే
తిరగబడితె ఎర్రెర్రని మోదుగుపూలే
నిప్పుల గుండాలు దొక్కె కొరివీరూలే
తెలంగాణ పల్లెలు పదిజిల్లలు జూడు
అదును కోసమెదురు సూసె తల్లులు నేడు ॥తెలంగాణ॥


తేట తెలుగు పదాలే...



తేట తెలుగు పదాలె నా పంచ ప్రాణము
తెలంగాణ తెలుగు భాష ఎంత జీవము
అమ్మపాల కమ్మదనం మన తెలుగు తీయదనం
ఊటలూరు మోటబాయి పాటలల్లె ప్రవాహం ॥తేట॥

ఓకొడుకా ఇల్లిడిసి యాడాదై పాయెరా
ఆరుద్ర ఒరుపిచ్చే ఆన సినుకు లేదురా
సడాకెందుకెక్కినవని లడాయింట్ల బుట్టినా
ఉర్దూ పద సంగమమే తెలుగు తేనె తీపిరా
పల్లె బతుకు వలసబోయిందిరా...
నువు జేసే కచ్చీరు యాడుందిరా...
తెలుగు సాహితీ ఘనతను జగతికి అందించగా
యుగయుగాలదీ భాషనే శాసనాలు వెలిసెగా ॥తేట॥

తెలంగాణ కాక బుడితె తెలుగు యాదికొస్తదా
తెల్లారే తెలుగుబోయి ఆంధ్రశబ్ధమైతదా
అసలు తెలుగు ఆదికవిని అందించిన నేలరా
ఆది తెలుగు శబ్దానికి ఆయువైన దరువురా
కోటిలింగాలల్ల కొలువైనదీ పాట...
నాగబ శబ్దాలు నర్తించేనీచోట...
దేశ భాషలందు తెలుగు లెస్స అని పలుకగా
తేనెలొలికే మన యాసను తొక్కిపెట్ట జూసినా ॥తేట॥


జోహారు జోహారు



జోహారు జోహారు జయశంకర్ సారో...
జ్యోతీగా వెలిగేటి దృవతార మీరో.... ॥జోహారు॥

కన్నవాళ్ళా కంటిచూపువయ్యినావు
కొత్తపల్లి ఇంటిపేరు నిలిపినావు
అక్కంపేట పల్లె నెపుడు మరువాలేదు
అన్యాయమేడున్న ఎదిరించి నిలిసేవు
బాధలెన్నో జూసినావో.. మాకు
బతుకూ పాటం నేర్పినావో... ॥జోహారు॥

నోరూలేని ప్రజల నాలుకయ్యినావు
నొసటి గీతా మార్చే మనిషివయ్యినావు
విద్యార్థి ఉద్యమ ధీరుడయ్యినావు
వీరా తెలంగాణ బాట నడిసినావు
ముల్కీపోరూ జేసినావో...
ముందు వరసాలో నువ్ నిలిసీనావో.... ॥జోహారు॥

ఒక్కన్ని నేనంటూ ఎక్కడాగలేదు
మొక్కవోని మొండి గుండె దైర్యమె నీది
సీమాంధ్ర దోపిడిపై ఉక్కూ పిడికీలెత్తి
సింహగర్జన జేసే శిష్యబృందంతోటీ
దిక్కూలొక్కటి జేసినావో....
పెద్ద దిక్కువై మము నడిపినావో.. ॥జోహారు॥

తెలంగాణ పోరాట పొద్దోలె విరబూసి
తెర్లుజేసే వలసపాలనా కెదురేగి
పొలికేకాలే వేసి పోరు బాటను జూపి
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే
ఒడుపూలెన్నో నేర్పినావో.....
ఓరుగల్లుపై నువ్వెలిసినావో... ॥జోహారు॥

తల్లీ తెలంగాణ నీ పాటే పాడింది
దీక్షబూనిన పల్లె నీ బాటె నడిసింది
చిరకాల నీ స్వప్నం సాధించి తెచ్చింది
బంగారు తెలంగాణ బాటల్లో కదిలింది
వేలాది అమరూల త్యాగమే......
స్వేచ్చ స్వాతంత్ర్యాలు నిండెనే...

జోహారు జోహారు అమరా వీరూలో...
తెలంగాణ పోరాట వెలుగు దివిటీలో....


జైజై తెలంగాణ



జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ ప్రతిపల్లెలోనా
మారుమోగిన మాట జయశంకరా నువ్వు
మట్టిబిడ్డల గుండె ధైర్యమైతీవయ్య జై తెలంగాణ ॥జై తెలంగాణ॥

స్వార్ధంతొ నిండినా రాజకీయాలను
శుద్దిజేయగ పొద్దుపొడుపల్లె వస్తావా
స్వాతంత్రపోరులో సత్యాగ్రహోద్యమం
చేపట్టినా గాంధీ మార్గాన వస్తావా
స్వారాజ్య కాంక్షతో భగ్గు భగ్గున మండె
భగత్‌సింగు బాట చూపించ వస్తావా
సీమాంధ్ర కుట్రలతో సిచ్చుబెట్టేటోల్ల
బుద్దిసక్కగజేసె బుద్దుడై వస్తావా
రారార రారార రారార రారారా
రాతిగుండెలు రగిలి రణరంగమేజేయ
రాష్ట్రాన్ని సాధించ కదిలొస్తరా...
జై తెలంగాణ ప్రతిగుండెలోన
జేగంటలూ మోగె జయశంకరా.... ॥జై తెలంగాణ॥

వలసాంధ్ర పాలన వొడిపించె వనరులు
వడిసెలను చేబూని వడివడిగ వస్తావా
అవమాన భారము పెనుమంటలయ్యెను
ఆంధ్రోళ్ళ ననిచేసే ఆయుధాలిస్తావా
బంధగీ శౌర్యంతో దొడ్డికొమురయ్యవై
బాధలన్ని దీర్చె బంధువై వస్తావా

సబ్బండ కులపోల్ల ఐక్యంగ నిలిపేటి
సర్వాయి పాపన్నవై నువ్వు వస్తావా
రారార రారార రారార రారారా
రాతిగుండెలు రగిలి రణరంగమే జేయ
రాష్ట్రాన్ని సాధించ కదిలొస్తరా...
జై తెలంగాణ ప్రతిగుండెలోన
జేగంటలూ మోగె జయశంకరా.... ॥జై తెలంగాణ॥

నలుదిక్కులా నువ్వె పొలికేకలేయంగా
నల్లసూర్యుడయ్యి నడిపించ వస్తావా
ఎనకడుగు వేయని కొమరంభీమువై
ఎక్కుపెట్టిన వీరవిల్లువై వస్తావా
ఏటవాలూ కొండ ఎదనిండ బాధుండ
ఎరుపెక్కిన ఎర్ర సూర్యుడై వస్తావా
సాయుధ నేలపై సంగ్రామ సమయాన
ఆయుధాల జమ్మిచెట్టువై పుడతావా
రారార రారార రారార రారారా
రాతిగుండెలు రగిలి రణరంగమే జేయ
రాష్ట్రాన్ని సాధించ కదిలొస్తరా...
జై తెలంగాణ ప్రతిగుండెలోన
జేగంటలూ మోగె జయశంకరా.... ॥జై తెలంగాణ॥


మనలోకం భూలోకంలో



మనలోకం భూలోకంలో జననినాద రణరంగంలో
విరబూసిన విప్లవయోధుడురా మన సాంబశివుడు
వీరత్వం నిండిన శూరుడురా మన సాంబశివుడు
ఆశివున్ని మాయం జేసి మన బతుకును చీకటి జేసి
మహరాజుగ పాలిస్తున్నారో వలసాంధ్ర దొరలు
మనననిచే కుట్రలు జేస్తుండ్రో సీమాంధ్ర దొరలు
తనువెల్లా గాయం జేస్తుండ్రో .... ॥మనలోకం॥

దాసిరెడ్డి గూడెంలోన లక్ష్మమ్మ చంద్రయ్యలకు
పెద్దకొడుకై జన్మించినాడో మన సాంబశివుడు
ఐలయ్యను మరిపించినాడో మన సాంబశివుడు
అందరిని కదిలించినాడో మన సాంబశివుడు ॥ఆశివుని॥ ॥మనలోకం॥

చిరునడకల ప్రాయంలోనే చిరుతోలె కదిలెను శివుడు
నలగొండకు నడకలు నేర్పిండో మన సాంబశివుడు
వలిగొండకు ఒడుపే జూపిండో మన సాంబశివుడు
వడిసెలగా తానే ఉరికిండో మన సాంబశివుడు ॥ఆశివుని॥ ॥మనలోకం॥

అమ్మ నాన్న అక్కా చెల్లె అన్న తమ్మి బంధాలన్ని
అన్ని ఉద్యమ పాటై బతికిండో మన సాంబశివుడు
అజ్ఞాతవాసం జేసిండో మన సాంబశివుడు
ఆదెరువై నీడను పంచిండో మన సాంబశివుడు ॥ఆశివుని॥ ॥మనలోకం॥

అరవయ్యేండ్ల పోరాటంలో అమరులైన వీరుల కథలో
నాయకుడై నడిసిన ధీరుడురా మన సాంబశివుడు
చెలరేగిన ఉద్యమ కెరటంరా మన సాంబశివుడు
చెదిరిపోని తీయని చెలిమేరా మన సాంబశివుడు ॥ఆశివుని॥ ॥మనలోకం॥


కొండా కోనల్లారా...



కొండా కోనల్లారా ఎక్కడే...... మా సాంబ శివునీజా డెక్కడే
ఎండా వానల్లారా ఎక్కడే..... అంత జాడన్న జెప్పరే
సందామామా కన్నా సక్కాని రూపోడు కొదమసింహంలాంటి కోర సూపున్నోడు
మీ అడవీ రారాజు ఎక్కడే.... ఏదిక్కు బోయిండో సెప్పరే..... ॥కొండా॥

వీర తెలంగాణ విప్లవాల గడ్డా వొడుపున్నా వొలిగొండా నల్లగొండా పులిబిడ్డా
వీరత్వం నిండీన దాసిరెడ్డి గూడెం కోనాపురి లక్ష్మమ్మ చంద్రయ్యలా కొండ
అమ్మానాన్న అయినావాళ్ళా నెడబాసిండు అంధకారం జీల్చె బంధూకు బట్టిండు
ఆదివాసీ అడవీ బిడ్డల్లో గలిసిండు నల్లామల నీకన్నా పెద్దకొడుకయ్యిండు
మా సాంబ శివుడేడ ఉన్నడే.... తెలంగాణ పులిబిడ్డ ఎక్కడే....... ॥కొండా॥

ఆకాలయ్యి వస్తే కడుపూ నింపీనవంట అలిసిపోయి వస్తే నీడా నిచ్చినవంట
గాయాల పాలైతే కట్టూగట్టినవంట గండాలెన్నొచ్చినా అండాగున్నారంట
కన్నా తల్లులోలె జూసుకున్నారంట కంటికి రెప్పోలె కాపాడినారంట
పక్షులా రాగాల పాటా బాడినరంట పరుపూ బండామీద జోకొట్టినారంట
సుద్దూలు జెప్పిన బుద్దుడే.... తొలిపొద్దు వెలుగోలె ఉంటడే..... ॥కొండా॥

సాయుధపోరాట నేలా గన్నావాడు సాహసాన శివుని మించినోడే లేడు
ఆయుధాల నిడిసి అందరితో గలిసి తెలంగాణ పోరు జెండా బట్టినాడు
చెట్టుసాటు నుండి శ్రీరామచంద్రుడు బలశాలీ వాలీని బలిజేసి పొయినట్టు
అర్ధరాత్రి పూటా దొంగదాడీ జేసి అలుపులేనీ వీర యోధున్ని సంపిండ్రు
చీకటీ నువ్వయినా జెప్పవే.... ఓ గుడ్డి సాక్ష్యాన్ని ఇయ్యవే.... ॥కొండా॥

మూడు కోట్లా ప్రజల గోడు జూసినోడు తెలంగాణే లక్ష్యంగా పోరుజేసినోడు
మోడువారీనోల్ల బతుకుల్లో వెలుగయ్యి మోదూగు పువ్వోలే వికసించినా శివుడు
శత్రువెవడు తనకు లేడాని అనుకుండు శరనన్న ప్రతివాన్ని చేరాదీసినాడు
మనుషుల్లో మృగమూల సంగతే మరిసిండు తనువంతా నెత్తుటి ముద్దయ్యి కూలిండు
ఎగిరేటి జెండాలో బిడ్డడో... ఎదురుచూసే తెలంగాణకో...


మాయన్న దమ్ముల్లారా..



మాయన్న దమ్ముల్లారా.. బహుజన బంధువులారా
మహారణ ధీరుల్లారా.. పోరాట యోధుల్లారా...
వీరాధి వీరుల బాటన ఒక్కటయ్యి నడువండయ్యో ॥మాయన్న॥

మనల జూసినోడే లేడు మందలించే మనిషే లేడు
మారు తల్లి బిడ్డాలోలె బతుకులెల్లా దీస్తున్నాము
అరవయ్యేండ్ల స్వాతంత్రంలో అధికారం అందనె లేదు
అట్టడుగు వర్గాలంటూ అణగదొక్కి పోతున్నారు
ఆలోచించి అడుగూలేసే అదును మనకు వచ్చిందయ్యో ॥మాయన్న॥

అయినదేమో అంచుకు బెట్టి కానిదేమో కంచంల బెట్టి
కడుపునిండ లేదనుకుంటే కండ్లనీల్లు దప్పవు రన్నా
ఇంటోన్ని మోసం జేసి బైటోని బాటనబోతె
ఇడుపులెంటా దిరిగీ మనమూ అడుకతినక తప్పదురన్న
ఇగనన్నా దెలుసుకోని అవతలోన్ని గెలవాలయ్యో ॥మాయన్న॥

తప్పుజేసినోడు గూడా తమ్ముడే అనుకోవయ్యో
తప్పు దెలుసుకోనీ వాడు తప్పకుండా వస్తాడయ్యో
శత్రువోలే జూస్తే మీరు శత్రుపక్షముంటాడయ్యో
శరణంటే చేరాదీసే గొప్ప గుణముండాలయ్యో
జనబలము గల్లా మనము జైత్రయాత్ర జేయాలయ్యో ॥మాయన్న॥

పోరుజెండలెత్తినోల్లు పొలికేకాలేసినోళ్ళు
పోరాటంలో ఒరిగినోల్లు అంత మన వాళ్ళేయ్యో
బతుకు తీపి నెడబాసి వాళ్ళు బాధలెన్నో పడ్డారయ్యో

బరిగీసి నిలిసీ వాళ్ళు బందూకై నిలిసేనయ్యో
వేలాది అమరుల త్యాగం మనదేనని చాటండయ్యో ॥మాయన్న॥

ఫూలే మహనీయుని మాట పాటించి తీరాలయ్యో
సావిత్రి భాయి మనకు సదువులా తల్లేనయ్యో
బడుగు బలహీనుల కోసం బాధలెన్నో బడ్డారయ్యో
భారమెంతో అనుభావించి బాట మనకు జూపిండ్రయ్యో
భాధ్యతే మీదనుకుంటే భవిష్యత్తు మనదేనయ్యో ॥మాయన్న॥


అమ్మా కదిలింది సూడో....



అమ్మా కదిలింది సూడో..
తెలంగాణ తల్లీ రగిలింది సూడో
ఎల్లమ్మ తల్లోలె ముక్కుపోగేసుకొని
గంగమ్మ తల్లోలె నొష్ట బొట్టు బెట్టుకొని
మూడున్నర కోట్ల ప్రజల మునుంబట్టి రమ్మంటూ ॥అమ్మా॥

వచనం: అమ్మా తెలంగాణ తల్లీ
నీ బిడ్డలం అరిగోస దీస్తున్నవమ్మా
మా గొడ్డాగమైందీ మా బిడ్డాగమైందీ
మా భాషబొయింది- యాసబొయింది
మా బతుకుదెరువే పోయింది

సమ్మక్క సారక్కల సంకనేసుకున్నది
ఎములాడ రాజన్నను ఉరికురికి రమ్మందీ
కంఠమయ్యను గెదిమి కల్లుకుండ దెమ్మందీ
ఆశ ఊశన్నతోని పచ్చాపలు దెమ్మందీ
కుడుమంటే పండుగనీరో ఈ తల్లీ
కూడుండి పోయె గదరో
కొంరెల్లి మల్లన్నకు-బాదలన్ని జెప్పింది
కొరివోలె రగిలేటి -ఈరన్నను లేపింది
కన్నబాధలనుభవించి కసితోని అడుగేసి ॥అమ్మా॥

వచనం: అమ్మా తెలంగాణ తల్లీ
నీ బిడ్డలం అన్యాలమైపోతున్నవమ్మా
మాకు నీల్లులేవు మా పిల్లలకు పాల్లేవు

మాకు ఉద్యోగాల్లేవ్ మా పోరగాల్లకు పెద్దపెద్ద సదువుల్లేవ్
ఈ ఫ్లోరిన్ ఇసంనీల్లు ఏ పగోనిగ్గూడ వొద్దు తల్లీ

సీతమ్మ తెరలుబడ్డ భద్రాద్రి జేరింది
కన్నీటి పాయలన్ని కలెదిరిగి సూసింది
పచ్చనైన కాపురంలో సిచ్చుబెట్టినోల్ల తరుమ
కాపురాలగుట్ట కాడ కాపుగాసి కూసుంది
లతీప్‌సాబ్‌ని బిలిసెరో ఈ తల్లి
ఇమామ్ముషిలి సవారయ్యెరో
శఠగోపం బెడ్తోల్ల-సంగతేందో జూద్దమనీ
బోనాలు శివసత్తులు-సిందాట భాగోతం
పిల్లల మర్రోలె ఎదిగి ఏడు పాయలై సాగి ॥అమ్మా॥

పెద్దఘట్టు చెరువుగట్టు కలెదిరిగీ సూసింది
లింగమంతునీ జాతర రంగులోన మునిగింది
ఊరూరు దిరిగి తల్లి జోగడిగి తెచ్చిందీ
కరీన్నగరుజేరి తల్లి అగ్గి రాజేసింది
యాదగిరీ సర్సింహ్మునిరో... ఈతల్లి
ఏగిరంగ రమ్మందీంరో
జడల రామలింగయ్యను-జడలిప్పి ఆడమంది
ఆకాశగంగమ్మను-నేలమీద దించమంది
ధరేశ్‌పురం జేరితల్లి దరువేసి ఆడింది ॥అమ్మా॥

వచనం: అమ్మా తెలంగాణ తల్లీ
ఇగ ఆల్లకు మనకు పొత్తు గలవదు
అనుమానంతోని అడుగు బడదు
ఏరుబడి సంసారం జేస్తలేరా ఆపతంటే అందరొక్కటైతలేరా
స్వాతంత్రం వచ్చిన నాడు ఎన్ని రాష్ట్రాలుండే

మరె ఇయ్యాల ఇరవై తొమ్మిదెట్లయినయ్
కష్టజీవులను జూసి కన్నీరు బెట్టింది
మట్టిమనుషులను జూసి పొలికేక బెట్టింది
ఒల్లునిండుకున్న తల్లి ఇల్లిల్లు దిరిగింది
తనబిడ్డల గోస జూసి రగిలి కొలుపు జెప్పిందీ
పల్లెలన్నీ దిరిగిసూడనో ఈతల్లి
పయానమే గట్టిందిరో..
కిష్టకాలువై పొంగి - జానపాడు దరిజేరి
సైదన్న శిగమొచ్చి - ఈరగోల సేతబట్టి
ఎట్టి బతుకు మనకెందుకు ఎదిరిద్దం రమంటూ ॥అమ్మా॥

వచనం: అమ్మా తెలంగాణ తల్లీ
మా కళలు మేం కాపాడుకుంటం
మా వృత్తులు మేం రక్షించుకుంటం
మా నీల్లు మాగ్గావాలె మాభూములు మాగ్గావాలె
మా తెలంగాణ మాగ్గావాలె మా అభివృద్ధి మేంజేస్కోవాలె
మా తెలంగాణ మాగ్గావాలె మా పాలన మేంజేస్కోవాలె
నీ రాక కోసం ఎయ్యి కండ్లతోని ఎదురు సూస్తున్నం తల్లీ

గొట్టొడ్లను అరసేత పిండిజేసినా తల్లి
సద్దజొన్న కంకులతో పిడికిలెత్తినా తల్లి
అందరి బతుకునుగోరే బతుకమ్మే నాతల్లి
నిండూ బోనంకుండయ్ కదిలింది మాతల్లి
పొలికేకలు బెట్టంగారో ఈ తల్లి
దిక్కులు ధని బలికెను గదరో
కన్నెర్రా జేసింది-కత్తులే దూసింది
అడుగుల్లో గజ్జె ఘల్లు - భూమి దద్దరిల్లంగ
కొంగు నడుముకూజుట్టి కొడవలెత్తి రమ్మంటూ ॥అమ్మా॥


అయ్యో దేవుడ



అయ్యో దేవుడ ఎట్ల బతుకను నేను కంగాలు కాలంలో
అభివృద్ధి కనికట్టు అవినీతి జేయంగ కడుపే గొడుతున్నరో
ప్రజల భూములు మింగి పరెషాను జేస్తుండ్రు
పరిహారమంటుంటే ప్రానాలుదీసి మొండిసెయ్యిస్తున్నరు
గతములో ఏలిన తెలగుదేశాపోల్లా మించలేదంటున్నరు ॥అయ్యో॥

ప్రాజెక్టు గడుతున్నమనుకుంట వచ్చి ఉన్నభూమిగుంజెను
ఎకరానికెన్నెన్నో ఆశలుబెట్టి ఏమి ఇయ్యరాయెనూ
నీల్లు పాడుగాను వచ్చేది ఎన్నడో ఉన్నభూమిబాయె
సవటభూమి బోల్లు రాల్లున్నయని చెప్పి సగము రేటుజేసే
అసలు నేను భూమి అమ్మనని అంటుంటే
పట్టుబట్టినారు బాధపెట్టినారు
భూమిలేనోల్లను జేసిండ్రు మమ్ముల
నీల్లు వస్తయంటూ ఆశరేపుతుండ్రు ॥అయ్యో॥

ఆరోగ్యశ్రీ అయితే బాగనే ఉన్నది ఆదూకుంటానన్నది
దవఖాన పేరుతో బయటికెల్తే మనకు బోలేడు ఖర్చున్నది
నూట ఎనిమిది బండి స్విచ్చాపుకున్నది నూటనాలుగెందుకూ
నూకలు జెల్లంగా పేదోల్ల బతుకుల్ని ఆదుకున్నాదెవ్వరూ
కూరగాయలు మరిసి రీచార్జికార్డులు
కొనెటట్టు జేసిండ్రు కొంపలు గూల్చిండ్రు
అప్పులల్లా ముంచి అభివృద్ధి అంటుండ్రు
గారడీ జేస్తుండ్రు గంతులువేస్తుండ్రు ॥అయ్యో॥

కిలో బియ్యం రెండు రూపాయలంటె బాగనే ఉన్నదిరో
ఎవని ముక్కులబెట్ట ఎన్నొద్దులొస్తయ్ ముక్కిడ్సి తినుడాయెరో
మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు రాల్లు రాప్పలాయెనో
అవినీతి పాలనా జోరు పెరిగీపాయె అడిగినోడే లేడురో
ఇంకేంది మీకెన్నో ఇస్తున్నమంటుడ్రు
ఇడుపులెంటా దిరిగి అడుకతినమంటుండ్రు
ఇన్నితీర్లా బిచ్చమెందుకేస్తరు మాకు
ఇంటికో ఉద్యోగమెందుకియ్యాలేరు ॥అయ్యో॥

బడుగు బలహీనులు అణగారినోల్లంత కాసుకోనే ఉన్నరూ
ఓటు సీటు కాడ కప్పగంతులాట కనిపెడ్తనే ఉన్నరూ
పేరుకే పేదోల్ల పార్టంటూ నమ్మించె నాయకూలొస్తున్నరూ
పెదవన్న ఇప్పరు పదవీకాంక్షతోని సిద్ధాంతం అడ్డంటరూ
మహాకూటమి వాల్లు మాయమాటలవాల్లు
తెలంగాణ నయ్యంటె సయ్యంటు కూసుండ్రు
తెగువజంపుకోని అండ్లనే ఉంటుండ్రు
తెలుసుకో ఓబిడ్డా తెలంగాణ సాధించు


ఓయమ్మా నల్లగొండ



ఓయమ్మా నల్లాగొండ ఒడుపులేని ఎర్రాగొండ
నదులెన్నో పారుతున్నా నవుసుతున్న మొండిబండా ॥ఓయమ్మా॥

భూస్వాములనెదిరించినావు దేశముఖ్‌ల తరిమీనావు
రజాకార్ల రక్తంతాగి రణభూమిగా మారినావు
నీలినీలి కొండల్లోనా నల్లగుండె నేనన్నావు
త్యాగాలెన్నో జేసీనావు తనువునే అర్పించినావు
ప్రపంచాన నెత్తుటి గురుతు పౌరుషాన రగిలే కొండ ॥ఓయమ్మా॥

వాగువంకలెండీపాయె చెరువు కుంట కబ్జాలాయె
బావులన్ని బండలు దేలే బతుకులేమో నెర్రెలు బారె
భూగర్భాన నీరేలేదు ఫ్లోరోసిసు పిండము బెరిగే
ఫ్లోరైడు భూతంగన్నా అంశలా స్వామిని జూడు
తాటికల్లు పచ్చీపులుసు తాగకుంటే పానం బోవు ॥ఓయమ్మా॥

మూసీనది బోసీబాయె మురికినీటి కూపామాయె
కృష్ణమ్మా బిరబిర ఉరికే ఎడమసేత ఎత్తిపోసే
గోదారి గలగలబారే మాగోడు వినకా పాయె
బోరుబాయి కారెంటుకోత ఒక్కమడి దడువకపాయె
వానసినుకు అదునూమీద పడకుంటే ఉరితాడాయే ॥ఓయమ్మా॥

ప్రాజెక్టులెన్నో ఈడ ముంపులల్ల ఊరుజాడ
తాగునీరు లేనేలేదు సాగునీరు ఊసేలేదు
ఉద్యమాలు అణిచిపెట్టి ఉన్నయన్ని ఊడ్చుకపాయె
విప్లవాలు పోరాటాలు లెక్కలేని పరిపాలనాయె
బీడునేల పెరిగీపాయె నీల్లుగానీ తాగూడాయే ॥ ఓయమ్మా॥


నల్లనల్లని గుండెరా..



నల్లా నల్లని గుండెరా నలగొండ
నలుదిక్కులా నిండెరా నలగొండ
తెలంగాణ రైతాంగ పోరాటమందునా
సింగుడుడ్డిన కొండరా నలగొండ ॥నల్ల॥

వెండితెర రూపాలు మదిని గెలవంగా
వెన్నెల్లో పాటకు సిందేసి ఆడంగా
అలరారే గీతాలు సాహిత్య కుసుమాలు
సరిహద్దులే దాటి రాజ్యమేలంగా
జనగీతి రణభూమి రాగమెత్తంగా
జానపదరాగాలు జగతి నిండంగా
గ్రందాలయ భూదాన ఉద్యమం బుట్టంగా
దేశ దేశాలల్ల మన చరిత పలుకంగా
కొండల్లో.... నీలగిరి గుండెల్లో..... ॥నల్ల॥

రామసక్కని కొండ రంజిల్లె నలగొండ
రాసకొండలు రగిలె ఉద్యమాలకండ
విరబూసి ఎగిరే మోదుగు పూజెండ
విప్లవాల ఖిల్ల నా జిల్లా నలగొండ
పోరాట స్ఫూర్తి మన దొడ్డి కొమురయ్య
పొలికేకతో జనము బైలెల్లెనయ్య
రజాకార్లు దొరలు భూస్వాములంతా
కొమురయ్య ఐలమ్మ పాదాల చెంతా
కొండల్లో.... నీలగిరి గుండెల్లో..... ॥నల్ల॥

మూడు గుండ్ల బండ సెరికల్లో ఈగంగ
ముడుపుగట్టి మొక్కి శివమెత్తి ఊగంగ
జడలు గట్టిన చెరువుగట్టు లింగన్నా
ధారేశుపురమందు నిలిసినా ఎల్లమ్మ
కోర్కెలు దీర్చేటి కోట మైసమ్మ
కొలువంగ మముగాసె తల్లీ నువ్వమ్మా
జానపాడు దర్గా లతీఫ్‌సాబు గుట్టా
ఉర్సులో ఊరంతా ఏకమై సాగంగా
కొండల్లో.... నీలగిరి గుండెల్లో.... ॥నల్ల॥

కండ గలిగిన తెల్ల పరుపు రాల్లా బండ
నల్లేనే గుండ్లంట నాపరాల్లా బండ
వాగు వంకలు ఎత్తిపోతల్లో ఘనగంగ
కిష్ట మూసి బారే నీ కాల్లు కడుగంగ
సాగు జేద్దామంటే ఉన్న భూములు బాయె
సంబరంగ నీల్లు ఆంధ్ర కెల్లిపాయె
గోదారి నీవంక కన్నెత్తి సూడకా
బీడు వారిన నేల పలుగు రాల్లా కొండ
కొండల్లో.... నీలగిరి గుండెల్లో.... ॥నల్ల॥


పాట



పాటా....ఆ.. పాటా....ఆ..
రేలారే....రేలారే.......రేలా రేలారే రేలలపాట

పాటా నువ్ బుట్టినావు కొండా కోనలలోన
బతికి బట్టగట్టినావు ఎండా వానలలోన
పాటానువ్ బుట్టినావు రగిలే గుండెలలోనాపాటా...
పనిలో తోడుంటనంటవు ఓ... ఓ... శ్రమజీవులనల్లుకుంటవు
మదినిండిన భావాలే పురిటి నొప్పులా తీరై
పుడమిని జూడంగ నువ్వు పురుడుపోసుకుంటవు... ॥పాటా॥

పొట్టకూటి కోసమే జెర్రిపోతులాటంట
గారెడోల్ల జంగమోల్ల బాలసంతులా పాట
బబ్బుమక్క బబ్బుమక్క మద్దెల దరువెయ్యంగ
సిందుభాగోతులోల్ల సెమట సుక్క ఈ పాట
అర్ధరాత్రి ఒక్కడుంటెరో... ఈ పాట
గుండె ధైర్యమిచ్చి నడిపెరా
పాటా పనితోనే ఉంటదీ ఓ..ఓ.. శ్రమజీవులనల్లుకుంటదీ ॥పాటా॥

రంగునీల్ల కామునితో కలిసి ఆడు ఈ పాట
కరువులోన తానమాడి కప్పబాడె నీ పాట
బండెడు కష్టము జేసి గుండెనిండినా బాధ
మరిసిపోయి మురిసిపోయె మహామంత్రవీ పాట
కోలాటం ఆటల్లోరా..... ఈ పాట ఆంబోతై లెంకగొట్టురా
పాటా పదునెక్కుతుంటదీఓ..ఓ..జనపధమైసాగుతుంటదీ ॥పాటా॥

ఆటకోయిలలు బాడే కోకిలమ్మదీ పాట
రివ్వు రివ్వునా వీచే కొండగాలిదీ పాట
కమ్మని రాగాలుబుట్టు పండూ ఎన్నెల పూట
గూగూగూ గూశంత గువ్వపిట్టెలా పాట
ఊటబాయి మోట గిరుకలో... ఈ పాట
ఊడిగానికెదురు దిరిగెరా
పాటా ఎరుపెక్కుతుంటదీ ఓ..ఓ.. జనపదమై సాగుతుంటదీ ॥పాటా॥

పసిపోరల కేరింతలు అమ్మముద్దు జేసెనంట
సంటిపిల్ల ఏడుపాప తల్లిబాడు జోలపాట
కర్మగాలి కన్నకొడుకు లోకానికి ఎడబాస్తే
కంటికి పుట్టెడు సోకం కన్నతల్లిదీ పాట
తల్లి తెలంగాణ కోసమూ ఈ పాట తల్లడిల్లిపోతుందిరా
పాటా పదునెక్కుతుంటదీ ఓ...ఓ..గనగనగన గజ్జెగడుతదీ ॥పాటా॥


ఇంటినిడిసి పోయి



ఇంటి నిడిసి పోయి కొడుకా ఏడేండ్ల పొద్దాయె కొడుకా
తెలంగాణ అనుకుంట దిరిగీ ఇల్లుముంచి పోతవారా
ఎందుకొచ్చిన ఉద్యమాలు... ఎవని సాలు దోలె నీకూ...
ఉన్నదో లేనిదో తినుకుంట నీడకు
కండ్లముందుంటేనే నిమ్మలంగుంటదీ

పాదాబి వందనమమ్మా నా పంచ ప్రానానివమ్మా
తెలంగాణ తల్లివమ్మా సహనాన భూతల్లివమ్మా
అన్నీదెల్సిన దానివమ్మా... అడ్డు నాకు రాకే తల్లీ...
తెలంగాణ వేరైతే తిప్పలన్నీ బోయి
పిల్ల పిల్లాతరమూ సల్లగుంటాదే ॥ఇంటి॥ ॥పాదాబి॥

ఆలీపిల్లల జూడు కొడుకా ఆల్ల అవతారము జూడు కొడుకా
సద్ద జొన్న సేలు లేవు పత్తి రైతుల సావు జూడూ
గొడ్లు లేనెవసాయమయ్యా... గొడ్డూబొయ్‌నట్టయ్యె కొడుకా...
ఎరువు పురుగు మందులమ్మినోడు
కోట్లు సంపాదించె వర్మీ కంపోస్టాచ్చే ॥ఇంటి॥

కోట్ల పైసా భూమికిచ్చీ కూట్ల మన్నుబోసె తల్లీ
ఫ్యాక్ట్రీల మోతల్లో తల్లీ మనబూమిలో మనమె కూలి
ఇల్లు పిల్లల జూస్తె తల్లి... ఆల్ల బతుకాగమైపోతదమ్మా..
ఎన్ని బాదలన్న బడి మనమూ ఇప్పుడు
తెలంగాణ సాదిస్తే దర్జాగ బత్తరూ ॥పాదాబి॥

తెలంగాణ వస్తెనే మనకూ బతుకుదెరువు ఉంటదంటూ
కాలుగజ్జెగట్టి కొడుకా కలెదిరుగుతున్నావు కొడుకా
కంటికేమో కునుకు రాదు... తెలంగాణ జాడే లేదూ....
ఏండ్లకొద్దిగ మనమూ బాంచ బతుకుల మగ్గి
ఏ జెండ మోసిన ఏముందిరా కొడుకా ॥ఇంటి॥

పరిగేరుకునె కొడుకూలమ్మాతెలంగాణ పంటరాశిని జూస్తలేరు
మోచేతి నీళ్ళకే అమ్మా వాల్లు మొఖవాసిపోతుండ్రు తల్లీ
పార్టీల తీరే ఇంతా... పదవీ కోసమె చేసేదంతా....
ఇంకానైన మనము ఎదురు దిరగాకుంటె
చేవజచ్చి బతుకుడెందుకే తల్లీ. ॥పాదాబి॥

ఉర్దు బాషా జదవలేకా నవాబుకూడిగాలు జేసినాము
మానపానాన్ని సంపుకోలేకా పౌరుషంగా బెరిగినాము
ఆడపిల్లల అమ్ముకోనీ... వలసబాటలు బడితీమయ్యా...
తెలంగాణ తల్లి గోస జూడలేకా
కన్నతల్లిని నన్ను కసిరిచ్చి పెడితీవి ॥ఇంటి॥

ఇంగిలీసు జదువుకోని ఇకమతులతో వొచ్చెనమ్మా
ఆస్తిపాస్తులు హైద్రబాదు సూసి సోపతి జేసెనమ్మా
భాషపేరుతోనె అమ్మా... మేటేశమేసిండ్రె తల్లీ...
సెయ్యెత్తు బెరిగినా సెట్టంతా ఎదిగినా
నీ కంటి పాపనే ఆ సంటి బిడ్డనే ॥పాదాబి॥

పైస కోసమె కొడుకా కొందరూ తెలంగాణ పాటందుకున్నరు
పదవీ కోసమె కొడుకా కొందరూ తెలంగాణ పేరెత్తు తున్నరూ
తల్లిబాధా వెలువనోల్లా... కన్న రుణమూదీర్చనోల్లా....

కాల్ల ఏల్లాబడి ఎంతకనీ పోరేవు
ఇగనన్న నా మాట సెవినబెట్టి రారా ॥ఇంటి॥

పైస పదవీ ఆశతోనీ బుడదగుంటల బొర్లేనమ్మా
ఈసారి చేజారిపోతే ఈగకన్నా ఈనమైతం
ఆడిందే ఆటైతదమ్మా... ఆంధ్రోల్లు పాడిందె పాటైతదమ్మా...
ఇంత బతుకు బతికీ ఇంటెనుక బడ్డట్టు
ఇడుపులెంటా దిరిగి సిప్ప బట్టాలమ్మా ॥పాదాబి॥

సాతంత్ర సంభరాలల్లో దేశమంతా మునిగి ఉంటే
మనకు ఉన్న సంకెళ్ళు నేటికూడవాయె కొడుకా
అరవైల జేసీన పోరు... ఏమిచ్చెరా కొడుకా మనకూ..
మొండి చెయ్యిజూపి చెన్నారెడ్డొచ్చే
మొదలాయె నన్నట్టు జేసి పోయిండు ॥ఇంటి॥

స్వార్థపరులా కాలమమ్మా అవినీతిదే రాజ్యమమ్మా
పాలుదాగీ ఇసమూ గక్కేపాములెన్నో ఉన్నయమ్మా
ఆటి కోరలూడబీకాలే.... మన ఎంట దిప్పుకోవాలే...
ఆంధ్ర పాలకుల కుట్రల్లో మనవాల్లు
నేటికింకా సమిధలైతనే ఉన్నరూ ॥పాదాబి॥

భూమికోసంబోయి కొడుకా బువ్వకెడబాసి పోయిరీ కొడుకా
అరవై తొమ్మిదినించి కొడుకా రెండువేలా తొమ్మిదొచ్చే
వీరులెందరో వొరిగిపోయే... ఉద్యమాలు ఆగవాయే...
రామోజి సంఘీ నార్నె ఎస్టేట్లల్ల
జెండాలు బాతేటి దమ్ములేకాపాయె ॥ఇంటి॥

ఈశాన్య రాష్ట్రాల కోసం పంజాబు ఏర్పాటు కోసం
ఉరుకులాడిన కమ్యునిస్ట్‌లు తెలంగాణ కెందుకో దూరం
తెలంగాణ సాయుధపోరూ... చెప్పుకోని గడుపుతారూ...
అవకాశవాదంతో నమ్మించె వాళ్ళకే
ఈ గుడ్డి జనమింకా ప్రానాలు ఇస్తుండ్రు ॥పాదాబి॥

ఆరొందలా పది జీవో సంగతే మరిసిండ్రు కొడుకా
ఇంటి దొంగలుండ్రు కొడుకా నువ్వు ఈశ్వరుడైతేంది కొడుకా
ముక్కుసూటీ తనము నీదీ... బొక్కబోర్లా బడతవయ్యా...
రంకు రాజకీయ నాయకులయ్యా
బొంకు నేర్చుకోని బతుకుతుండ్రయ్యా ॥ఇంటి॥

పార్టీల నమ్మేది లేదూ పదవిలున్నోన్ని బిలిసేది లేదూ
విధ్యార్ధి మేదావి లోకం కండ్లెర్ర జేస్తుండ్రె తల్లీ
కవులు కళాకారులంతా... కథనాన నిలిసిండ్రె అమ్మా...
మూడున్నరా కొట్ల తెలంగాణ బిడ్డలా
హైద్రబాదు డిల్లీ గల్లీల నింపూత

పట్టు జెండా బట్టుకొడుకా ఉద్యమా జెండెత్తు కొడుకా
ద్రోహులేడా ఉండ్రో సూడూ దొంగకొడుకు లేడా ఉండ్రో సూడూ
తెలివిగల్లా కొడుకువయ్యా... గుండె గల్లా కొడుకువయ్యా...
జనమంతా గదలంగా జేజేలు గొట్టంగా
మోసగాడెవడైనా రాల్లతోని గొట్టు
నీ మాట నిలబెడతనమ్మా తెలంగాణ సాధిస్తనమ్మా....


రాజు మారినా...



రాజుమారినా అయ్యో మంత్రి మారినా
తెలంగాణ బతుకు గింత మారదాయెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
పంట భూములల్ల రింగురోడ్లు దిరిగెనే ॥రాజు॥

ఎస్సార్సి పాడుగాను - అనుడె ఉన్నదిగాని
ఇంతవరకు తెలంగాణ ఇయ్యరాయెరో
రోజులెల్ల దీసుకుంట రాజులయ్యిరో ॥రాజు॥

తెలంగాణ బిడ్డలేమో- తెర్లయ్యి బతుకుతుండ్రు
ఎవనికి బుట్టిన కొడుకులో హైద్రబాదు నిన్యరు
నా తల్లి గుండెలపై భారమైతున్నరూ ॥రాజు॥

జీవోలు అమలైతె- మావోల్లు ఎందుకూ
పోరాట జెండబట్టి తిరుగుతుంటరూ
పనిలేక రోడ్ల మీది కెందుకొస్తరూ

మనసొమ్ములు గుంజుకొని - బంగ్లగట్టె దొంగలు
మనసుట్టే తిరుగుతుండ్రు భద్రంజేసుకో
వాళ్ళనొక కంటనువ్వు గని పెట్టుకో
ఆల్లు దొరికెనా మోసగాండ్లు దొరికెనా
తెలంగాణ ద్రోహులెవరో ఇపుడు దెలిసెనా

అల్లో దొరికెనే పిల్లో తెలిసెనే
తెరసాటు దొంగలంత బైటికొచ్చెనే ॥ఆల్లు॥

తెలంగాణ పేరు జెప్పి ఢిల్లీ గల్లీల జేరి
పూట గడిపి మూట ముల్లెజదురుకొచ్చినా ॥ఆల్లు॥

తెలంగాణ తెగువనంత వొంటిమీద పులుముకొని
టైగర్లయ్ తిరిగి పిల్లి ఏశమేసినా ॥ఆల్లు॥

ఆరొందల పదిజీవో అమలు జేయించలేదు
దొంగ ప్రాజెక్టు పనుల నాపించినోడు లేడు ॥ఆల్లు॥

ప్రతిపక్షములున్నపుడు తెలంగాణ పాటబాడి
అధికారం అందంగనే ఎస్సార్సి రాగమెత్తే ॥ఆల్లు॥

ముసలి గుంటనక్కలన్ని ఒక్కకాడ జేరిప్పుడు
తెలంగాణ కడ్డెవడు ఎస్సార్సి ఎందుకనే ॥ఆల్లు॥

మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుక తిరిగినోల్లు
ఓట్లు దగ్గరైతుంటే తెలంగాణ కాల్లు మొక్కే ॥ఆల్లు॥

తెలంగాణ సాయుధులై అలిసిపోయినోల్లు ఇపుడు
పార్టీ ఏదైన గాని పొత్తులకు సిద్ధమనే ॥ఆల్లు॥

మందెవడు గానేకాదు అంతా మన వాల్లేరా
మనల ముంచి దొంగ నాటకాలు ఆడెరా
వాండ్లు దొరికెనే మోసగాండ్లు దొరికెనే
తెలంగాణ ద్రోహులెవరొ ఇపుడు తెలిసెనే ॥అల్లో॥

మన సుట్టే ఉంటరు జైజై గొడుతుంటరు
అవతలి కెల్లంగనే దేశపో అనుకుంటరు ॥ఆల్లు॥

సావాసా దోశంతో ఇడ్లీ దోశ దిన్నరు
పౌరుషాన్ని జంపి మంది మూతి నాకుతున్నరు ॥ఆల్లు॥

నీల్లుబాయె నిధులు బాయె ఖనిజ సంపదడుగంటే
ఇంక మనము గొట్టుకుంటే ఇజ్జతుండదు ॥ఆల్లు॥

తెలంగాణ విడిపోయిన ఆంధ్ర పచ్చగా బతికే
ఏర్పాట్లు జేసుకొని ఎగిరిదునికె దొంగలు ॥ఆల్లు॥

అధికారం మారంగనే అందలాలు అందుకునే
దొంగ బాటలెన్నో తెలిసి దోబూచులాడెటోల్లు ॥ఆల్లు॥

ఎట్టిజేసుకునేటోడు ఎందుకు గొరగానోడు
తెలంగాణ పేరుతోని ధనాసూరుడైపోతడు
అయితే అయ్యిండు గాని ఆదమరిసి పడుకుంటడు
అంతలోనే శత్రువుతో చేయి చేయి గలుపుతడు

తగవులు బెట్టేది ఒకడు త్యాగం జేసేది ఒకడు
మాటలు జెప్పేది ఒకడు మాట బడేటోడు ఒకడు
మూటలు గట్టేది ఒకడు మూల్గి పండెటోడు ఒకడు
పాటలు గట్టేది ఒకడు పానమిచ్చెటోడు ఒకడు
తరచి చూస్తే తేడ నీకు తెలువకుంట బోదు సూడు

ఇన్నితీర్ల గాయాలతో నెత్తురోడుతున్నదాన
ఇజ్జత్‌కు పాట్లబడి యిడుపులు బడుతున్న దాన
నిలువ నీడ లేక అలిసి అల్లాడుతున్నదాన
నివురు గప్పుకున్నదాన నిప్పయ్ రగిలే దెన్నడు


జై తెలంగాణమా



జై తెలంగాణమ జైజై తెలంగాణమా
జైబోలో గీతమ జైజై తెలంగాణమా
జైల్లు నిన్ను ఆపలేవు జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥

ఎన్నాళ్ళు ఈ శెరలు వలసాంధ్రుల చేతిలో ॥ జై తెలంగాణమ॥
ఏండ్లకొద్ది పోరాటం ఎనకడుగేయొద్దురో ॥జై తెలంగాణమ॥
తెగింపున్న పోతుగడ్డ పౌరుషాల బిడ్డవే ॥జై తెలంగాణమ॥
తెలంగాణ కడ్డొస్తె తెగబడి తరిమేసుడే ॥జై తెలంగాణమ॥
జైల్లు నిన్ను ఆపలేవే జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥

లాఠీలు తూటాలు నీకు ఎదురు నిలువలే ॥జై తెలంగాణమ॥
లాలా లజపతిరాయ్‌ని మించెను నీ బిడ్డలే ॥జై తెలంగాణమ॥
ఉద్యమాలు విద్యార్థుల త్యాగాల స్ఫూర్తిలే ॥జై తెలంగాణమ॥
ఉద్యోగులు మేధావులు అంత ఏకమమయ్యెలే ॥జై తెలంగాణమ॥
కవులు కళాకారులంత కధనాన నిలిసెనే ॥జై తెలంగాణమ॥
కాలుదువ్వి యుద్ధానికి సిద్ధమని రగిలెనే ॥జై తెలంగాణమ॥
జైల్లు నిన్ను ఆపలేవే జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥

ఆమరణ దీక్షలాయె శ్రీకాంతుల త్యాగమాయె ॥జై తెలంగాణమ॥
అరవయేండ్ల పొద్దు ఇది ఆనందం నిండెలే ॥జై తెలంగాణమ॥
అణిచేసిన ఆంధోళ్ళ అధికారం పాయెలే ॥జై తెలంగాణమ॥
సంభరంగ స్వాతంత్రం వచ్చిన సంతోషమే ॥జై తెలంగాణమ॥
జైల్లు నిన్ను ఆపలేవే జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥

మనకంట్లో ఆనందం సూడలేని ఆంధ్రోళ్ళు
సమైక్యాంధ్ర నెత్తుకొని మొత్తుకోని సస్తుండ్రు
మన సొమ్ము తినమరిగి మననిడిసి పోనండ్రు ॥సమైక్యాంధ్ర॥
ఆంధ్రా రాయలసీమ ఆగమైతదంటుండ్రు ॥సమైక్యాంధ్ర॥
పార్టీల మాటలిడిసి కుట్రలెన్నొ జేస్తుండ్రు ॥సమైక్యాంధ్ర॥
మనకంట్లో ఆనందం సూడలేని ఆంధ్రోళ్ళు ॥సమైక్యాంధ్ర॥

లగడపాటి కూతలన్ని లంగ మాటలైనగాని ॥సమైక్యాంధ్ర॥
లతుకోరు గోనెగాడు జాన బెత్తలంటున్న ॥సమైక్యాంధ్ర॥
కపట నీతి జూపిచ్చి కండ్ల గంత గట్టెటోల్లు ॥సమైక్యాంధ్ర॥
కాలుబట్టి ఏలుబట్టి మోసపుచ్చే ఆంధ్రోల్లు ॥సమైక్యాంధ్ర॥
మనకంట్లో ఆనందం సూడలేని ఆంధ్రోళ్ళు ॥సమైక్యాంధ్ర॥
తెలుగు రొమ్ము గుద్దినోల్లు ఇంగ్లీషును జీకినోల్లు ॥సమైక్యాంధ్ర॥
తెలివి అతికమై వాల్లు తెలుగో తెలుగంటుండ్రు ॥సమైక్యాంధ్ర॥
బద్మాషి కూతలతో బదునాము జేసెటోల్లు ॥సమైక్యాంధ్ర॥
భరతజాతి నిడిసిపెట్టి తెలుగు జాతి అంటుండ్రు ॥సమైక్యాంధ్ర॥
మనకంట్లో ఆనందం సూడలేని ఆంధ్రోళ్ళు ॥సమైక్యాంధ్ర॥

హైటెక్కు ట్రిక్కులున్న వలసాంధ్ర నక్కలు ॥సమైక్యాంధ్ర॥
హైద్రబాదు లడ్డ బెట్టి అంత దోసుకున్నోల్లు ॥సమైక్యాంధ్ర॥
తెలంగాణ తప్పదని ఒప్పుకున్న దొంగలు ॥సమైక్యాంధ్ర॥
తెగదెంపులు కాకముందె మాటమార్చె లంగలు ॥సమైక్యాంధ్ర॥
మనకంట్లో ఆనందం సూడలేని ఆంధ్రోళ్ళు ॥సమైక్యాంధ్ర॥

అందుకె మనమంత ఇపుడు ఒక్కతీరుగుండాలె ॥జై తెలంగాణమ॥
ఆంధ్రోళ్ళ మోసాలను పసిగట్టి నడువాలె ॥జై తెలంగాణమ॥
కలిసిరాని పార్టీలను తరిమి తరిమి కొట్టాలే ॥జై తెలంగాణమ॥

సమైక్యాంధ్ర అనేటోన్ని సంపి బొంద పెట్టాలె ॥జై తెలంగాణమ॥
జైల్లు నిన్ను ఆపలేవే జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥

తెలంగాణ ప్రతిబిడ్డ తెలివితోని ఉండాలె ॥జై తెలంగాణమ॥
తెలంగాణ నాయకులు కలిసికట్టు గుండాలె ॥జై తెలంగాణమ॥
తెలంగాణ పదిజిల్లల ఇంచుభూమి నిడువము ॥జై తెలంగాణమ॥
తెర్లుజేయ జూసినోన్ని పొలిమెర దాటిస్తము ॥జై తెలంగాణమ॥
తెగబడి పోరాడి మనము తెలంగాణ తెద్దము ॥జై తెలంగాణమ॥
జైల్లు నిన్ను ఆపలేవే జయహే జనగానమా ॥జై తెలంగాణమ॥


భారత చరితలో...



భారత చరితలో బంగరు శకము కాంగిరేసుపార్టీ తెలంగాణ ద్రోహమేందీ
భారత స్వతంత్ర పోరుజేసినా కాంగిరేసుపార్టీ.. తెలంగాణ ద్రోహమేందీ

అమెరికా రష్యా పంచన జేరక - అలీన విధానమన్నది దెచ్చి
అదరక బెదరక ముందడుగేసి - పంచశీలను రూపొందించి
ప్రపంచ చరితలో భారతదేశపు కీర్తి పతాకం ఎగురు వేసినా
శాంతిదూత నెహ్రు.. ఆనాడే జెప్పినాడు
ఆంధ్రదేశమందు తెలంగాణ ఇమడదండూ.. ॥భారత॥

వెన్నెల నిండిన చల్లని మనసు- పున్నమి నవ్వుల ఇందిరమ్మరా
పేదల బతుకులు బాగుజెయ్యగ- పెద్దల పెత్తన మదుపు జెయ్యగ
గరీబి హటావో అని నినదించి - రాజభరణముల రద్దుజేసినా
పేదోల్లతల్లి గదరా కాంగ్రేసు పార్టీ అపుడు
తెలంగాణ అడుగుతుంటె నోరిప్పదేంది ఇపుడు ॥భారత॥

అజ్ఞానపు తెరలను తొలగించంగ - నడుము గట్టెను రాజీవ్ గాంధీ
అతిచిన్న వయసులో ప్రధాన మంత్రిగ భారత ప్రతిష్ట పెంపు జేసెను
విజ్ఞానపు కాంతిని వెదజల్లంగ - సూర్యతేజమై ప్రజ్వరిల్లినా
చైతన్య జ్యోతి గదరా కాంగ్రేసు పార్టీ అపుడు
ఈ స్వార్ధమేడ బుట్టే తెలంగాణ అడుగుతుంటె ॥భారత॥

కాంగ్రెస్‌పార్టీ వారసత్వమును - పునికిపుచ్చుకొని సోనియగాంధీ
కడుబీదల బాదలు దీర్చుట కొరకై నవీన భారత నిర్మాణముకై

దేశ భవితనే తిరగ రాయగా ప్రధాని పదవిని త్యాగం జేసినా
మాతృమూర్తి గదరా కాంగ్రేసు పార్టీలోనా...
మొండిచేయి జూపెగదరా తెలంగాణ బతుకులోనా.... ॥భారత॥

ఆంధ్రప్రదేశున తెలంగాణకై మహా ఉద్యమం రగులుతుంటెరా
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అసలు సంగతి మరుగునేసెరా
అమ్మసోనియను అడ్డమేసుకొని మాయ మాటలతో ఉన్నదూడ్చుతూ
పాడుజేసే గదరా మన తెలంగాణ బతుకు
నిత్తె పోరు జేసె గదరా మన తెలంగాణ బతుకు
నెత్తుటేరు జేసే గదరా మన తెలంగాణ బతుకు


ఎంత మాయసర్కారు



ఎంత మాయ సర్కారు
శ్రీ కృష్ణలీలల సర్కారు
ఎంత మాయ సర్కారు ॥ఎంత॥

కష్టమొచ్చిందయ్య రాజు అంటె
కాళ్ళతోని దన్నుతారు
కూటికే లేదు సారు అంటె
నోటికాడిది గుంజుతారు
అన్నిఉన్న వాళ్ళకేమో.....
అడకుండనె అంత దోసీ పెడతరు ॥ఎంత॥

పోరాడి ఆపీనా పనులన్నింటినీ
పోలీసు బలగంతో జేస్తరు
అభివృద్ధి పేరుతో అప్పులల్ల ముంచి
పథకాల కొప్పేస్తుంటరు
కోట్ల సొమ్మును మింగి వీల్లు.......
గతమేలినోళ్ళను మించలేదంటరు ॥ఎంత॥

అరకులోయను మించే అందాలను ముంచి
ఉన్న ఊళ్ళకెడబాపెను
ప్రాజెక్టులా నీల్లు పాడయ్యిపోను
పక్కెమ్మటున్నోళ్లకందవు.
నీళ్ళపేరుజెప్పుకోనీ.......
మమ్ము కన్నీటి పాలు జేస్తరు ॥ఎంత॥

ఇన్నేండ్ల పొద్దుగ అల్లాడుతూ మేము
తెలంగాణంటుంటేరా
ముల్కిముచ్చట మూటలోనె ఉంచి
ముప్పుతిప్పలు బెట్టెరా
మషిబూసి ముసినవ్వు నవ్వీ....
కట్టుకతలు జెప్పి కాలమెల్లా దీసే ॥ఎంత॥

ప్రతిపక్ష పార్టీగ ఉన్నప్పుడేమో
ప్రజల పక్షమే అంటరు
రోడ్డెక్కి నినదించే ప్రతి ఉద్యమానికి
వచ్చి కూసొని వంతబాడ్తరు
అధికార పీఠం అందితే.....
అన్ని మరిసి జనుల కాల్చి పారేస్తరు ॥ఎంత॥


నమ్మొద్దు



సాకీ... నెహ్రుకాలం నించి నేటిదాకా
తేనేబూసిన కత్తి ఈ కాంగ్రేసు పాలనా...

నమ్మొద్దు నమ్మొద్దు కాంగ్రేసోన్ని
నమ్మినోల్ల నట్టేట ముంచేటోన్ని
తెలంగాణ తెర్లు తెర్లు జేసేటోన్ని
తేటగున్నకాడ వచ్చి వాలేటోన్ని ॥నమ్మొద్దు॥

అన్యాలమనీ తెలిసీ కాంగ్రేసోల్లు
ఆంధ్రా తెలంగాణ మంత కలిపేసిండ్రు
నెహ్రుజీ మాటల్ని మింగేసిండ్రు
నేల విడిచి స్కాములెన్నో జేసేస్తుండ్రు
ముల్కీసంగతులన్నీ నీటిమీది రాతలై
మనవనరులు మేసి మేసి తెగబలిసిండ్రు
ఆంధ్రులు వలసావాదులు
ఎన్నాల్లు మా కడుపు గొడతరు ॥నమ్మొద్దు॥

అభివృద్ధిని ఎరజూపి కాంగ్రెసోల్లు
అనాదిగా మోసాలు జేస్తనే ఉండ్రు
రింగురోడ్డు పేర రంగు మార్చేస్తుండ్రు
తెలంగాణ ముఖచిత్రం చెరిపేస్తుండ్రు
హైద్రబాదు తాత ఆస్తి అనుకుంటుండ్రు
అఖిపక్ష ఒప్పందం ఐదారుసూత్రాలై
అరవైతొమ్మిది మల్లా తిరగేస్తుండ్రు

మంత్రులూ ముఖ్యామంత్రులూ
ఇంకెన్నీ పానాలు దింటరు ॥నమ్మొద్దు॥

ప్రత్యేక రాష్ట్రమంటూ నినదిస్తుంటే
ఎత్తిన మనగొంతులేమో నొక్కేస్తుండ్రు
తగువులెన్నొపెట్టి మనని విడదీస్తుండ్రు
పాయదెర్లు జూపి పరిపాలిస్తుండ్రు
ఆగమేఘాలమీద శంకూ స్థాపండ్లుజేసి
తెగిపోయే కాల్వలకు నీల్లిడిసీ పెడుతుండ్రు
సూడరో అరెరే సూడరో
గా కాటన్‌దొర లెక్కనే ఫోజులు ॥నమ్మొద్దు॥

తెలంగాణ పాటబాడి కాంగ్రేసోల్లు
తల్లితెలంగాణ మీద నిప్పేస్తుండ్రు
తెలంగాణ భూములన్ని అమ్మేసిండ్రు
వేలకోట్లు మూటగట్టి నీతంటుండ్రు
పదవీ పైసకు లొంగి ప్రతినిధులు ఎందరో
అన్ని మూసి హరితాంధ్ర జపం జేసుకుంటుండ్రు
లుచ్చలు అరెరే లుచ్చలు
కన్నతల్లినమ్మే లతుకోరులు ॥నమ్మొద్దు॥


గణగణగణ తెలంగాణ



గణగణగణ తెలంగాణ గర్జనలే జేద్దాము
జనజన జన తెలంగాణ జంగు సైరనూదుదాము
సత్యాగ్రహ సాయుధులై శాంతియుద్ధమందాము
అరవయేండ్ల బానిస సంకెళ్ళు దెంచి వేద్దాము
కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా... ॥గనగన॥

అరవైలో ఒరిగిపొయిన వీరుల కథ విన్నాము
అలుపెరుగని పోరాటం జేస్తూనే ఉన్నాము
రెండు వేల తొమ్మిదిలో త్యాగాలను జూసినము
రెండుగ విడిపోయి బతికె బాటనె బయలెల్లుదము
తెలంగాణ తొలిపొద్దు పొడిచేడు బోదాము
తెగువ నింపుకొని పోరులో తెగబడి కొట్లాడుదాము
కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా... ॥గనగన॥

కడుపురగిలి కదిలొచ్చిన ఖమ్మంమెట్టు బోదాము
ఖణఖణ మండే గుండెల ఆశయాలమవుదాము
కసితో అడుగేసి కదిలె కరీంనగరు బోదాము
కన్నరుణము దీర్చుకున్న వాళ్ళ కాల్లు గడుగుదాము
ప్రాణాలకు తెగించిన మెదకు జిల్లా బోదాము
పాలకుల మెడలొంచిన వాళ్ళ ప్రతిన బూనుదాము
కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా... ॥గనగన॥

విప్లవాలు విరబూసిన నల్లగొండ బోదాము
వీరుల పాదాలు గడిగి నేల రుణము దీర్చుదాము

ఉద్యమాల సెలయేరు పాలమూరు బోదాము
ఊపిరిచ్చి మూగబోయిన గొంతును ముద్దాడుదాము
ఆత్మగల్ల ముద్దుబిడ్డ అదిలబాదు బోదాము
అమరులార మీ త్యాగం వృదాకాదనందాము
కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా... ॥గనగన॥

ఒడుపుతోని అడుగేసే ఓరుగల్లు బోదాము
వందనాలు మీకంటు చేతులు జోడిద్దాము
నిప్పురవ్వలోలె రగిలె నిజాంబాదు బోదాము
రాజుకున్న రంగారెడ్డి హైద్రబాదు జేరుదాము
ఆంధ్ర వలస పాలనకు ఎదురు నిలిసి పోరుదాము
సమైక్యాంధ్ర నినాదాన్ని సంపి బొంద బెడదాము
కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా... ॥గనగన॥


కరకర పొద్దోలె...



కరకర పొద్దోలె కదిలె నల్లగొండరా
కన్న రుణం దీర్చుకునే బాట నడిసెరా
ఉరిమేటి ఉప్పెనయ్యి మెరిసేటి మెరుపయ్యి
ఉద్యోగులు విద్యార్థులు గర్జించి దునికినారు
అంధకారమలుముకున్న చీకట్లను పారదోల
అమరులాశయాల బాట ఆమరణ దీక్షబూనీ
ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాలో
విప్లవాల బాట నడిసి వీరుడైన పోరుబిడ్డ ॥కర॥

తెలంగాణ రాష్ట్రముకై తెగబడి కొట్లాడుతుంటే
తెర్లుజేయ వలసాంధ్రులు నిర్భంధం పెంచెనని
ప్రజాస్వామ్య దేశములో నియంతలుగా ఏలుతుంటె
మంత్రులుగా మనమింకా కలిసి ఉండెదెట్లననీ
పదవులను పట్టుకుంటే ప్రజలు ఆగమైతరనీ
పట్టిన పట్టిడువకుంట పోరాట జెండబట్టి ॥కర॥

ఢిల్లీ సర్కారు యమా ఢిల్లకి జేస్తున్నదనీ
నల్లారి కిరణన్న నకరాలు బెరిగెననీ
సకలజనులు సమ్మెజేసి సతమతమైతున్న గానీ
సచ్చిన పామోలె ఒక్క మాటన్నా జెప్పరనీ
సోనియమ్మ తెలంగాణ ఇస్తదనీ ఎదురు సూస్తె
సోయిదప్పి సీమాంధ్రుల పంచేజేరి పాయెననీ ॥కర॥

తానా తందాన తాన తెలంగాణ మంత్రులంత
జాన బెత్తలేసి కొలిసి మూలమూల ముర్కసూసి
కుక్కకు బొక్కోలె ఒక్క మాటేదో సెవిన బడితె
గోతికాడి నక్కలోలే కాసుకోని ఉంటరనీ
తెలంగాణ ప్రజలనింక వంచించే దెందుకనీ
తేపతేపకు ఢిల్లీలో మంతనాల మాటేందని ॥కర॥

కన్నశెరల బడి పెంచితె కంత్రిగాల్లయ్యెననీ
అన్నదమ్ములను మరిసి ఆంధ్ర పాట బాడెనని
తనవాల్లే పగవాల్లుగ మొనగాల్లయ్ లేసెనని
తప్పటడుగులేసి వాల్లు తల్లి కుతిక బట్టెనని
మోచేతి నీల్లు గతికి మోతెబరులమంటుంటే
మోడుబారి బతుకుడింక ఎన్నాళ్ళని ఎదురుదిరిగి ॥కర॥

అరవయేండ్లుగా మనని అడుగడుగునా ఎడబాపి
అరిగోసల పాలుజేసి చెరసాలల బెట్టెనని
విభజించి పాలించె సీమాంధ్రుల నమ్మొద్దని
తెలంగాణ బతుకుల్లో చితిమంటలు రేపొద్దని
చెరబట్టిన శత్రువును చేతులెత్తి మొక్కకుండ
పొలిమేర దాటించి వాన్ని రాష్ట్రం సాధించాలని ॥కర॥


కదిలింది - రగిలింది



కదిలింది రగిలిందీ వీరతెలంగాణ
కన్నెర్రజేసిందీ పోరు తెలంగాణ ॥కదిలింది॥

కొడుకు బాధలేజూసీ గుండె దైర్యమేజెప్పి
కొండంత అండగా తానే దాపుంట నడువమంటుంది
కొదమసింహామై రణముజేయగ
ఎవడేందో కనిపెడతానంది
సీమాంధ్ర ఎత్తులు సాగవు అంటు సింత బరిగెలే పట్టమంది
తెలంగాణ సాధించేదాక తెగువతో ముందుకు పోదామంది ॥కదిలింది॥

బాగో ఆంధ్ర అంటూ పొలికేక లేసింది
బందనాలన్నీ తెంచేయమంటుంది
జాగో తెలంగాణ జమిడీక మోగించి
విప్పి కోలాటం ఆడమంటుంది
ఇక జయము గలిగే జెండాను పట్టుకోని
వలస పాలకుల తరమమన్నది
సీమాంధ్ర ఎత్తులు సాగవు అంటు సింత బరిగెలే పట్టమంది
తెలంగాణ సాధించేదాక తెగువతో ముందుకు పోదామంది ॥కదిలింది॥

ఉడికిన నెత్తుటితో ఉక్కుపిడికిల్లెత్తింది
ఉగ్రరూపమెత్తి నరసింహుడయ్యింది
మన సమ్మక్క సారక్క శౌర్యాన్ని జూపించి
సమయమిదేనంటూ సయ్యంటూ దునికింది
ఇగ ద్రోహంజేసే నాయకుడెవడో పాతరబెడదాం పదపదమంది

సీమాంధ్ర ఎత్తులు సాగవు అంటు సింత బరిగెలే పట్టమంది
తెలంగాణ సాధించేదాక తెగువతో ముందుకు పోదామంది ॥కదిలింది॥

ఉరుమై ఉరిమింది అగ్గిపిడుగై రగిలింది
సూనామిలా మారి సుట్టు కమ్మూకుంటుంది
ఉద్యమాలతోనీ ఉప్పెనగా మారింది
యుద్ధం జేద్దం రారమ్మని సిద్ధంకమ్మంది
పార్టీలు పంతాలను వదిలి పార్లమెంటులో బిల్లు పెట్టమని
సీమాంధ్ర ఎత్తులు సాగవు అంటు సింత బరిగెలే పట్టమంది
తెలంగాణ సాధించేదాక తెగువతో ముందుకు పోదామంది ॥కదిలింది॥


దునుకరో మాయన్నా..



దునుకరో మాయన్నా ధూంధాం జేయరో
దుమ్ముదులిపి ఆంధ్రదొరల పొలిమెర దాటియ్యరో
గెదుమరో మాయన్న ఉద్యమాల పిడుగులారా
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

తెలంగాణకు జరిగే ఏండ్లకొద్ది అన్యాయం
ఎన్నాళ్లని అడుగుతుంటే దేవునోలె గూసుండ్రు
దేవులాట లేనోళ్ళు డేపుదీసి అడిగిండ్రు
మన బాధలు జెప్తుంటె ఇసం నవ్వునవ్విండ్రు
తెలంగాణ తేకుంట అభివృద్ధి పేరుతోని
అన్ని కొల్లగొట్టెరో తెలంగాణ జిల్లాల్లో
అగ్గిబెట్టుతున్నరో పదిజిల్లల పల్లెల్లో
తెలంగాణ మోసగాళ్ళ పనిబడదాం లేవరో ॥దునుకరో॥

పెద్దమనుషులొప్పందం పెన్నానది పాలాయే
అరవైతొమ్మిదిపోరు చెన్నారెడ్డి పాలాయే
మల్లిప్పుడు తయారయ్యె మందిని ముంచేటోల్లు
మభ్యపెట్టె ఎత్తులతో మత్తుజల్లుతుండ్రు సూడు
తెలంగాణ తేకుంట అభివృద్ధి పేరుతోని
నీల్లు దెంకపాయెరో ఆంధ్ర వలసపాలకులు
నిదులు దెంకపాయెరో వలసాంధ్ర నాయకులు
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

ఆరొందలపది జీవొ అమలే కాలేదు సూడు
ముల్కీనీబందనెపుడో ముక్కిపోయినది సూడు

పావలా వడ్డితోని పరేషాను ఉంది సూడు
ఓటుకొక్క కోటరిచ్చి మల్లముంచిపోతడాడు
తెలంగాణ తేకుంట అభివృద్ధి పేరుతోని
కోట్లు మూట గట్టెరో దొంగ తెల్వులున్నోల్లు
జనం కడుపుగొట్టెరో దగుల్బాజీ నాయాల్లు
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

కాంగ్రేసు కమ్యునిస్టు బీజేపీ టీడీపీ
గోడమీది పిల్లోలే గోతికాడి నక్కోలె
ఎప్పుడెట్ల దిరుగతరో ఎవనికొంప ముంచుతరో
బుక్కముచ్చు పార్టీలను బుజ్జగించెదేందిరా
తెలంగాణ తేకుంట అభివృద్ధి పేరుతోని
ఏండ్లు గడుపుతున్నరో మోసకారి తనముతో
ఏమిజేయకుందుమా ఎదురుదిగ్గకుందుమా
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

వలసాంధ్ర పాలన భలె కమ్మగుంది అనుకుంట
సంలాంగొట్టి గులాంగిరి జేసేటోల్లు బెరిగెనంట
సమైఖ్యాంధ్ర సమ్మగని హరితాంద్రే అందమనీ
తెగువజంపుకొని మంది కాళ్లు బిస్కుతున్నరంట
తెలంగాణ రాకుంట కుట్రలెన్నొజేసి వాల్లు
కోట్లు మూట గట్టెరో రెండు నాల్కెలున్నోల్లు
జనం కడుపుగొట్టెరో నమ్ముకున్న నాయకులు
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

తెలిసి తెలువనీ జనము కోటరుకు ఓటేసి
పెత్తనాన్ని మందికిచ్చి బానిసలై బతుకుతుండ్రు

అన్ని దెలిసినోల్లేమో ఎనకపట్టుబడుతుండ్రు
అందినంత మూటగట్టి ఆంధ్ర భజన జేస్తుండ్రు
తెలంగాణ దేకుంట సమైక్యమంటోన్ని నమ్మి
మనల ముంచుతున్నరో నమ్ముకున్న నాయకులు
మాయ మాయ జెసెరో నీతిదప్పినా కొడుకులు
తెలంగాణ ద్రోహులను తరుముదాము లేవరో ॥దునుకరో॥

మననీల్లు మన పాలన మనకే గావాలనీ
మనభూములు మనకొలువులు మనకే దక్కాలనీ
తెలంగాణ పదిజిల్లల ఇంచునిడువగూడదనీ
మనమీద పెత్తనాలు మందికెట్ల ఉంటయనీ
తెలంగాణ ఇయ్యకుంట మసిబూసేటోని మీద
రణము జేయ నడువరో తెలంగాణ తమ్ముడా
రాజ్యమేలుకుందమో తెలంగాణ చెల్లెలా

మాయజేసెటోల్లని తెలంగాణ తమ్ముడా
పొలిమెర దాటిద్దమో తెలంగాణ చెల్లెలా
అదునుబోతె రాదురో తెలంగాణ తమ్ముడా
ఆగమయ్యి పోతమో తెలంగాణ చెల్లెలా
ప్రజా తెలంగాణకై తెలంగాణ తమ్ముడా
పాలపిట్టె బిలిసెరో తెలంగాణ తమ్ముడా
తెలంగాణ ద్రోహులను పొలిమెర దాటిద్దమో ॥దునుకరో॥


కాలిగజ్జెగట్టుకోని..



కాలిగజ్జె గట్టుకోని ఆటాడుదమా
కమ్మని రాగాల గొంతెత్తుదమా
బాధలేడ ఉంటె ఆడ పాటబుట్టునంటరా
బానిసత్వమున్న కాన్నె పోరుబుట్టునంటరా ॥కాలి॥

గద్దరన్న వెంట జనం ప్రవహించే పాటయ్యి
విమలక్క వెంట నడిసె విప్లవాల పిడుగయ్యి
అసోయ్ ధూలా అడుగుల్లో రసమయన్న దరువయ్యి
అలుపెరుగని పోరాటం నడుపుతున్నదీ పాట
మిత్ర పాట దండోరై భూమి దద్దరిల్లెనే
మిడుతల దండోలె వచ్చె ఆంధ్రోన్నెదిరించెనే
అగ్గిరవ్వలై దునికే అంబటి వెంకన్న పాట ॥కాలి॥

నిన్నగాదు మొన్నగాదు ఉన్నదొక్క బాధ గాదు
నీకు నేను నాకు నువ్వు జెప్పుకుంటే తీరిపోదు
యాబయ్యేండ్లు దాటిపాయె ఎన్కటున్న బత్కుబాయె
ఎన్నడన్న తెలంగాణ నిమ్మలంగ లేకపాయె
ఆంద్రోల్లు జూడుతమ్మి ఎట్ల జేస్తుండ్రో
ఆంగ్లేయుల మించి వాల్లు దోస్క పోతుండ్రో
గల్లు గల్లు మంటూ వాళ్ళ సుద్దులన్ని జెప్పంగ ॥కాలి॥

ప్రత్యేక తెలంగాణ ప్రానాలు బోతుంటే
పార్టీలు పాడుగాను పూటకొక్క మాటమార్చె
సీమాంధ్ర బాబులంత శివాలెత్తి ఊగుతుంటే

సమైఖ్యాంధ్ర తొత్తులుగా సవాలిసురుతున్నారే
ఆంద్రోళ్ళు జూడు తమ్మి ఎడ్డోళ్లజేసెనే
ఆంగ్లేయుని లెక్కవాల్లు విభజించి ఏలెనే
మిమ్ము పాతరేసె దాక ప్రజాగొంతు మూగబోదు ॥కాలి॥

పత్రికలు టీవీలో సమైక్యాంధ్ర రాగమంట
పాలకులు పోలీసులు ఆల్ల పట్టె ఉన్నరంట
సీమాంధ్ర న్యాయమంట తెలంగాణ నేరమంట
పాలకులొస్తున్నరంటె ప్రజలను బందించెనంట
ఆంద్రోళ్ళనడిగెటోడు ఒక్కడు లేడాయెనే
ఆగడాలనాపె దిక్కు మనకు లేకపాయెనే
పాటే మన లీడరంటూ పల్లెపల్లె దరువేయ ॥కాలి॥


గుత్పలే పట్టాలె



గుత్పలే పట్టాలె ఎన్నీయల్లో
గుంజికొట్టాలింక ఎన్నీయల్లో
సమైక్యమంటోన్ని ఎన్నీయల్లో.... సీమాంధ్ర దొంగల్ని ఎన్నీయల్లో
వలసాంధ్ర పాలకునెన్నీయల్లో దంచి తరుమాలింక ఎన్నీయల్లో ॥గుత్పలే॥

పొత్తు గలిపిన కాడ ఎన్నీయల్లో పొత్తి గలుగాలేదు ఎన్నీయల్లో
పోలు దిరిగిన కాడ ఎన్నీయల్లో పొలికేకా బుట్టింది ఎన్నీయల్లో
బంధిపోటాంద్రోల్లు ఎన్నీయల్లో మనల బంధీజేసేనెన్నీయల్లో
గయ్యి గయ్యిన లేసి ఎన్నీయల్లో గడప దాటొచ్చిండ్రు ఎన్నీయల్లో ॥గుత్పలే॥

కయ్యాల కాపురమెన్నీయల్లో కలిసున్నదేడరా ఎన్నీయల్లో
ఆంధ్రప్రదేశున ఎన్నీయల్లో అన్ని ఆంధ్ర పాలె ఎన్నీయల్లో
ఇన్నాళ్ళ నాబతుకు ఎన్నీయల్లో కన్నీటి పాలాయెనెన్నీయల్లో
పాలించె రాజులు వాళ్ళాయెనల్లో పంచాదిలో దిక్కు మనకెవ్వడల్లో

         వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీడెందుకయ్యా
         వొద్దువొద్దని నాడు నెత్తిగొట్టుకున్నా గద్దలోలె వచ్చి వాలేనయ్యా
         వొచ్చింది మొదలూ ఓ తిక్కలయ్య ఒక్కటొక్కటి వాల్లు వొడిపించెనయ్యా
         ప్రాంతానికో తీరు పాలించుకుంట ప్రాణాలతో ఆటలాడేనయ్యా
         తెలంగాణ జనుల తెర్లుజేసుకుంట తేట తెలుగు మాటలల్లేనయ్యా

భారత చరితను ఎన్నీయల్లో బంగపరిచేటోల్లు ఎన్నీయల్లో
చట్టసభల నిండ ఎన్నీయల్లో బద్మాశులే ఉండ్రు ఎన్నీయల్లో
పార్లమెంటు మాట ఎన్నీయల్లో పక్కనే పెట్టిండ్రు ఎన్నీయల్లో
ఆడితప్పిన మాట కెన్నీయల్లో అగ్గిబుట్టినాది ఎన్నీయల్లో ॥గుత్పలే॥

విప్లవాలు దెస్తె ఎన్నీయల్లో విద్రోహులన్నారు ఎన్నీయల్లో
ఉద్యమాలు జేస్తే ఎన్నీయల్లో ఉత్తదేనన్నారు ఎన్నీయల్లో
అరవయేండ్ల గోసా ఎన్నీయల్లో అనిచేయ జూస్తుండ్రు ఎన్నీయల్లో
పొలిమెరలు దాటించ ఎన్నీయల్లో పొర్లిచ్చి కొట్టాలె ఎన్నీయల్లో

          వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీడెందుకయ్యా
          ద్రౌపతీ సామేత కృష్ణరాయబారి కురుక్షేత్ర యుద్ధమె రగిలించెనయ్యా
          ఉస్మానియా కాకతీయ క్యాంపస్‌లో ఉచ్చుబెట్టి ముండ్లకంచెసెనయ్యా
          తెలంగాణ పదిజిల్లాల లోన పోలీసు బలగాల క్యాంపాయెనయ్యా
          నాటి రజాకారు పాలనే మించే ప్రజాస్వామ్యమేడ బతికున్నదయ్యా
          విద్యార్థి ఉద్యోగి మేధావి ఎవడైనా విద్రోహులన్నట్టు జూస్తున్నరయ్యా ॥గుత్పలే॥


ఎయ్యాలెరో...



ఎయ్యాలెరో అడుగెయ్యాలెరో
ఏసినంక ఎనకడుగు ఎయ్యొద్దురో
చెయ్యాలెరో పోరు జెయ్యాలెరో
చేసినంక శత్రువూకు లొంగొద్దురో
తెలంగాణె లక్ష్యంగ తెగువతోని నడువాలె
తెర్లు జేయ జూసినోన్ని తరిమి తరిమి కొట్టాలె ॥ఎయ్యాలె॥

సీమాంధ్ర నాయకుడు సిత్రమైన ఏశగాడు
సిన్నగ మన పంచజేరి సిచ్చుబెట్టి పోతడాడు
అడుగు ముందుకేద్దమంటె అడ్డమొచ్చి పడ్తడాడు ॥ఎయ్యాలె॥

కాలుకాలు గొట్టుకుంట నారదుడై వస్తడాడు
కలిసిఉంటె సుఖమంటు కాళ్ళ బంధమేస్తడాడు
కయ్యాలు మనకు బెట్టి కదలకుంట జేస్తడాడు ॥ఎయ్యాలె॥

ఆగిపోతె అణగదొక్కి ఆటలాడుకుంటడాడు
అలిసిపోతే మనమీద స్వారిజేయ జూస్తడాడు
లగడపాటి లాంటి లంగ దొంగ బాటనొస్తాడు ॥ఎయ్యాలె॥

ఇప్పుడెనుక పట్టుబడితె ఈనంగా జూస్తడాడు
నిప్పుబెట్టి మన బతుకుల సప్పుడుజేకుంటడాడు
ఉత్తగనే మాయజేసి తొవ్వకడ్డమొస్తడాడు ॥ఎయ్యాలె॥

మనం గొట్టుకుంటె వాడు మంత్రిపదవులిస్తంటడు
మనం మొత్తుకుంటె వాడు విగ్రహాలు పెడుతంటడు
ఏమిచ్చిన సీమాంధ్రుడు ఎనకటోలె జేస్తడాడు ॥ఎయ్యాలె॥

అడుగులనెడబాపెటోడు అంగ్లేయుని వారసుడు
ఆదమరిచి కూసుంటె ఆయపట్టు బడతడాడు
ఆరునూరు ఏదైనా ఆన్ని ఎల్లగొట్టుడే ॥ఎయ్యాలె॥

ఎవనిగుంపు వాడైతె పలసనయ్యిపోతాము
ముంపు ముంచుకొస్తుంటె ముచ్చటెట్ల బెడదాము
ఈరునికెల్నట్టు అంత తెలంగాణె ఆయుధంగా

ఎయ్యాలెరో అడుగెయ్యాలెరో
తెలంగాణ జేరెదాక నడువాలెరో


తెలంగాణ ఇచ్చెనన్నా...



భారత చరితలో బంగరు శకము కాంగిరేసుపార్టీ
తెలంగాణ ఇచ్చెనన్నా
భారత స్వతంత్ర పోరుజేసినా కాంగిరేసుపార్టీ..
వెనకడుగు వేయదన్నా.. ॥భారత॥

అమెరికా రష్యా పంచన జేరక
అలీన విధానమన్నది దెచ్చి
అదరక బెదరక ముందడుగేసి
పంచశీలను రూపొందించి
ప్రపంచ చరితలో భారతదేశపు కీర్తి పతాకం ఎగురు వేసినా
శాంతిదూత నెహ్రు.. ఆనాడు అన్నమాట
అమలుజేసె గదరా ఈనాడు సోనియమ్మా ॥భారత॥

వెన్నెల నిండిన చల్లని మనసు
పున్నమి నవ్వుల ఇందిరమ్మరా
పేదల బతుకులు బాగుజెయ్యగ
పెద్దల పెత్తన మదుపు జెయ్యగ
గరీబి హటావో అని నినదించి రాజభరణముల రద్దుజేసినా
పేదోల్లతల్లి గదరా ఆనాడు ఇందిరమ్మ
ఆ పేరు నిలిపె గదరా మన అమ్మ సోనియమ్మా ॥భారత॥

రాజకీయ రణరంగధీరుడు
ప్రగతి బాటలో వెలుగు సూర్యుడు

రాజీవ్‌గాంధి అడుగుజాడలో
భారతావని భవిత లక్ష్యమై
రాజీలేని ఈ పోరు జేయగా పదవులెన్నియో త్యాగం జేసినా
మాతృమూర్తి గదరా మన అమ్మ సోనియమ్మా
మన గోస దీర్చె గదరా మన తల్లి సోనియమ్మా.. ॥భారత॥

కాంగ్రెస్‌పార్టీ వారసత్వమును
పునికిపుచ్చుకొని సోనియగాంధీ
కష్టజీవులు పేదరైతులు
మహిళామణులకు అండగ నిలువగ
నవీన భారత నిర్మాణముకై పార్లమెంటుకే వన్నెదెచ్చినా
ధీరవనిత గదరా మన అమ్మ సోనియమ్మా
తెలంగాణ ఇచ్చె గదరా మన అమ్మ సోనియమ్మా ॥భారత॥

అరవయేండ్ల ఈ మహా ఉద్యమం
అమరవీరుల త్యాగఫలమురా
అదును జూసి అరె అన్ని నేనని
ఎగిరెటోల్లను తరిమి కొట్టెరా
బడుగు జీవుల బాధలు దీర్చగ బడిసెలందుకొని పోరుజేయగా
అందరేకమయ్యి తెలంగాణ దెచ్చె గదరా
అవినీతి జరగకుండా అభివృద్ధి జేసుకోరా

(తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాసినటువంటిది)


ప్రజాతెలంగాణమా....



తెలంగాణ ద్రోహం పాలకుల పాపం...
తెలంగాణ శత్రువినాశనం......
పాలపిట్టె ప్రియదర్శనం.......
ప్రజా తెలంగాణను సాధించుకుందాం......

ప్రజా తెలంగాణమ నా ప్రాణమైన గానమా
ప్రాణాలే త్యాగమ నా జమ్మిచెట్టు రూపమా ॥ప్రజా॥

ఖనిజాలకు లోటు లేని కండగల్ల భూమిరా
యాస భాషలను జూడ కమ్మనైన తెలుగురా
ప్రాణమైన తల్లి మా పాలవెల్లి నువ్వమ్మా... ॥ప్రజా॥

వనరులెన్ని బోతున్నా నోరుమెదపమైతిమా
మనని మనమె తిట్టుకొని పలుసనయ్యిపోతిమా
వలసాంధ్ర పాలకులా కుట్రకు బలియైతిమా ॥ప్రజా॥

ఆకలి అవమానపోరు సదువులెల్ల దీస్తిమా
ఆయమన్న కొలువులన్ని ఆంద్రోళ్ళే మింగెనా
అలుపులేని పోరాటం అమరత్వం మిగిలెనా ॥ప్రజా॥

నీల్లుండి కరువులోన అల్లాడుట న్యాయమా
నిధులుండి కన్నీళ్ళతో కడదేరుటె ధర్మమా
నియంతలుగ ఏలుతుంటె నినదించుటె నేరమా ॥ ప్రజా॥

నెత్తుటి గాయాలతోని కదిలే ఓ కెరటమా
ఏమున్నది బతుకంతా పోరాటమె మార్గమా
ఉద్యమాల రూపమ నా ఊపిరై ఉండుమా ॥ప్రజా॥

పదిజిల్లల సెలకలల్ల గోగుమల్లెలైదమా
పదిలమని పాటబాడె బతుకమ్మలమైదమా
జానపదరూపమ నా అడవితల్లి అందమా ॥ప్రజా॥

వీరుల త్యాగాల వీణ విప్లవాల రాగమా
విద్యార్థి మేథావుల ఆశయాల సారమా
నమ్ముకున్న నీ ప్రజలను నడిపించే గీతమా ॥ప్రజా॥

ఏకాశి కానెకాదు ఏరే ముందంటిమా
ఎగిసే కెరటాల తీరు వడివడి అడుగేస్తిమా
ఏరువాక పున్నమ నా బతుకమ్మ రూపమా
ఏకమయ్యి తెలంగాణ రాష్ట్రం సాధిస్తిమా


ఏదో చెప్పాలని



ఏదో చెప్పాలంటోంది నామనసే నీతో
ఏదేదో చెప్పాలంటోంది ఈ క్షణమే నీతో
ఎకడెక్కడికెక్కడి కెలుతుందో....
అది నీ చుట్టే కనిపిస్తుంది
నేనెంత చేసినా ఏమిచేసిన
తిరిగి నున్ను మరి చేరనంటది ॥ఏదో॥

సందె గాలితో చిందులేసి నీ సంగతి చెప్పాను
ఆ సందమామను నేలకు పిలిచి వివరం అడిగాను
చిగురాకులలోని కొత్తధనం
ఆ పువ్వులలోని మూగతనం
ననువీడి పోనంటొంది... నా వెనకే నడిచొస్తుందీ
ఓమైనా ఓమైనా ఇది ప్రేమా ఏమైనా
నాతోనే జతకలిసి పాడవె ఏమైనా
మాటాడవె నువ్వయినా ॥ఏదో॥

సరిగమపదనిస రాగాలెన్నో వేళ్లకు నేర్పాను
తకధిమి అడుగులతో జతకలిసి నడకలు నేర్చాను
అడుగుల సవ్వడి రాని క్షణం
అంతకు మించిన కొంటె తనం
నన్నెపుడో ముంచేసింది నీ వశమే చేసేసింది
ఓమైనా ఓమైనా నను చేరవే నా మైనా
నాతోని జతకలిసి చెప్పవే ఇకనైనా
మనసిప్పవె ఇపుడైనా ॥ఏదో॥


ఓ పిల్లో నువ్వు....



ఓ పిల్లో నువ్వు సయ్యంటు వస్తావా
జాబిల్లో నేను అడిగింది ఇస్తావా
సకిలించే గుర్రాల సౌకుదోలినోన్ని
పొగరుబోతు గిత్త మెడలు వంచీనోన్ని
కొండరాళ్ళను పిండిజేసేటి మొనగాన్ని
కోటి సూర్యప్రభల తేజమున్నావాన్ని ॥ఓపిల్లో॥

పో పిలగో నా పొంకనాలెంకన్న
ఏందయ్యో పెద్ద నీగొప్ప లంతేనా
పండూ వెన్నెల పాలుబోస్తే తాగినదాన్ని
నిండూ పున్నమి నీడనిస్తే పెరిగినదాన్ని
సప్తసంద్రాలల్ల ఆటలాడినదాన్ని
చంద్రవంకను నేను సిగల బెట్టిన దాన్ని ॥పోపిలగో॥

సందెగాలికి నేను చిందులాడేటోన్ని
సందమామల పులుసు ఆరగించేటోన్ని
సల్లగాలికి పింఛమిప్పి ఆడే నెమలి
సందెవేళకు దెచ్చి నీకిస్త కోమలీ ॥ఓపిల్లో॥

గాలీ వానకు నేను గంతులేసేదాన్ని
పారేటి వరదల్లో పరుగులెత్తేదాన్ని
నల్లగొండ నాగిరెడ్డి పెల్లీ నాదీ
నువ్విచ్చే ఆ నెమలి కోడిపెట్టే నాకు ॥పోపిలగో॥

ఎగిరేటి పక్షుల రెక్కలిరిసేటోన్ని
దునికేటి సెలయేటి కెదురుదిర్గేటోన్ని
సీతమ్మ దెమ్మన్న జింకపిల్లను దెచ్చి
సిటికెలో నీకిస్త నా చిట్టి జాబిల్లి ॥ఓపిల్లో॥

కుందేళ్ళతో పరుగు పందెమాడినదాన్ని
పులిపిల్లలను దెచ్చి పాలుబోసిన దాన్ని
చెంగుచెంగున ఎగిరె జింకపిల్లల నేను
మేకపిల్లలోలే కాసుకొచ్చిన దాన్ని ॥పోపిలగో॥

ప్రతిపొద్దు తొలి ముద్దు పెట్టాలనుకున్నోన్ని
నూరేండ్లు నీతోడు ఉండాలనుకున్నోన్ని
సతాయించకు నన్ను సందేళ జాబిల్లి
నా పంచ ప్రాణంగ జూసుకుంటా మల్లి ॥ఓపిల్లో॥

ప్రేమానురాగంతో పరవశించేదాన్ని
ఈ మాటకోసమే ఎదురు చూసిన దాన్ని
ఆడదాని అసలు మనసు దెలిసిన నీకు
నన్ను నేనే పూలహారమై అర్పిస్తా
ఓ పిలగో నామది గెల్సినెంకన్న
పా పిలగో నేను నీఎంట వస్తున్నా...


పూడిపోయిన హృదయం....



పూడిపొయిన హృదయాన్ని పూడికనే దీసిననే
బీడుబడ్డ మనసునేమో ప్రేమ సాగు జేసిననే
తనువు తరీ శెల్కలల్ల తకధిమితోం సాల్లల్ల
ఇత్తనాల ముద్దులెయ్య కూలికొస్తవో పిల్లా ॥పూడి॥

పూడిపొయన హృదయాన్ని పూడిక నువ్ దీసినవా
బీడుబడ్డ మనసునేమొ ప్రేమసాగు జేసినవా
తనువూ తరీ శెల్కలల్ల తకధిమితోం సాల్లల్ల
ఇత్తనాల ముద్దులేస్తే పొద్దుకెంత ఇస్తవయా ॥పూడి॥

ఇకమతుల తుకమడుగు దున్ననేను బొతున్నా
సిలకా అంబటాలకు సద్దిదెస్తవొ లగా
ఇకమతుల తుకమడుగు ఇరుజాలు నీకెరుకా
సిరుతానీ పాలుబువ్వ నీకు దెస్తనో లగా ॥తనువు॥

కుదుపులతో కుమ్మేస్త వొడ్డు వొరం దీసేస్తా
వొదినగీ వొక్కపూట వొరంబెడ్తవో లగా
కుదుపులతో కుమ్మొద్దు వొడ్డువారందియ్యొద్దు
మర్దినీ మాటలతో మాయ జెయ్యకో లగా ॥తనువు॥

సింగుడ్ని దెచ్చిస్త మబ్బుల మీదెక్కిస్త
మరదల మది పొలము నాటుబెడ్తవో లగా
సింగుడు నాకేమొద్దు మబ్బుల మీదెక్కొద్దు
బావ నీ మది పొలము బిర్రుగున్నదో లగా ॥పూడి॥

కొప్పులో పువ్వులుగా సుక్కలనే దెచ్చిస్త
మనవరాల అరటితోట కావలుంటవో లగా
కొప్పులో పువ్వులొద్దు సుక్కలు నువు దేవొద్దు
తాతనీ అరటి తోట పండుబన్నెదొ లగా ॥తనువు॥

నెలపొడుపు దెంపిస్త నడుముకునే జుట్టిస్త
కోడల నాబొడ్డు మల్లె కలుపు దీస్తవో లగా
నెలపొడుపు దెంపొద్దు నా నడుముకు జుట్టొద్దు
మామ నీ బొడ్డుమడీ ఎండిపాయెనో లగా ॥పూడి॥

బంగారు గొలుసులిస్త ఎండి కడియాలు దెస్త
మనువరాల మాపటేల మంచమేస్తవో లగా
బంగారు గొలుసులొద్దు ఎండి కడియాలు వొద్దు
తాత నీకు మాపటేళ తొవ్వ దొరుకదో లగా ॥పూడి॥


ఎట్లా జేద్దునేనూ....



ఎట్లాజేద్దు నేనూ సంసారం పాడుగాను
ఎన్నడన్న ఈ బతుకు నిమ్మలంగ లేకపాయె
ఎంత సేతజేసినా ఎనకేమి ఉండదాయే ॥ఎట్లా॥

ఉల్లిగడ్డ ఎల్లిపాయ కొత్తిమీర కర్రెపాకు
కసిరిచ్చి ఇసిరేసే కండ్లనీల్లు దెప్పిచ్చే
అంగట్ల అడుగేస్తే అన్ని నన్ను జూసి నవ్వె ॥ఎట్లా॥

గ్యాసునూనె పిరమాయె గ్యాసు దొర్కకుంటాయె
పొయ్యిమీద వండలేక పొగజూరినట్టాయె
అగ్గిపెట్టె బగ్గబగ్గ మంటమండి తగలబెట్టె ॥ఎట్లా॥

రెండు రూపాయలకే కిలో బియ్యమిస్తరంట
వొండుకొని తినేటోడు ఒక్కడన్న లేడంట
సన్నబియ్యమడుగబోతె ఉన్న ఆస్తి జాలదాయె ॥ఎట్లా॥

రేట్లేంత పెరుగుతున్నా భేరమాడెటోడు లేడు
ఉద్దెరడిగెటోడు లేడు కొసిరి కొనేటోడు లేడు
అడుగబోతె అవమానం అమ్మెటోడు దిట్టబట్టె ॥ఎట్లా॥

ఉప్పుగొనేటట్టు లేదు పప్పుదినేటట్టు లేదు
చికెనుముక్క మటనుబొక్క కొరికె దమ్ము లేనేలేదు
రేట్లు మంట మంతున్నా ఆర్పె దిక్కు గానరాదు ॥ఎట్లా॥

పోరగాళ్ళ సదువేమో ప్రిస్టేజి సవాలాయె
ఫీజు మోతగుంటె స్కూలు మంచిదని ఉర్కుడాయె
గవిరిమెంటు బళ్ళుజూడ పదికోటి మిగలదాయె ॥ఎట్లా॥

కంచెడంత కల్లుదాగి సప్పుడేక బండెటోడు
చీపులిక్కరొచ్చినంక బట్టసోయి ఉంటలేదు
వానరాని వర్దబోనీ రోడ్లమీద బంతుండు ॥ఎట్లా॥

పొదుపు సంఘంల జేరి పావులకు అప్పుదెచ్చి
ఇల్లు సెల్లు కలర్‌టీవి కొప్పుమీద కొప్పుబెట్టి
ఇన్‌స్టాలుమెంటు బతుకు ఇజ్జతన్న దక్తలేదు ॥ఎట్లా॥

అన్నీ పుక్కిడే అన్నట్టు లొల్లిబెట్టే
రేడియోలు టీవీల సీరియల్ల గోలబెట్టె
అయ్యగారి నోటిమాట అన్నిదీరినట్లు నవ్వె ॥ఎట్లా॥


అరెరే అరెరే ఆడేద్దాం...



గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడికొంగ
తుమ్మల్లపెద్దమ్మ తుర్రుపిట్టె జారిపాయె... జారిపాయె.......

అరెరే అరెరే ఆడేద్దాం - ఆనందాల చిందేద్దాం
అమ్మా నాన్న అన్నీ మరిచి ఆకలి దూపను ఓడిద్దాం
అలుపే లేని చేపల ఒడుపుతో జీవనయానం సాగిద్దాం
రై రైయ్యని రైలటాడేద్దాం(కూ. చికు చికు) సై సైయ్యని సైలాటాడేద్దాం... ॥అరెరే॥

గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
నీకు నాకు పొత్తులేదు నిన్ను నేను ఎత్తుకోను
మొత్తుకోక సంభరంగ సిత్తుపత్తు ఏదో సెప్పు

తోడు పంటలు వేసేద్దాం తొలకరి జల్లు కురిపిద్దాం
కోతులకందని కొమ్మల నెక్కి ఊడల ఊయలలూగేద్దాం
వాగువంకలు తిరిగేద్దాం - పిట్టెగూళ్ళను కట్టేద్దాం
రాళ్ళను పేర్చి ఇండ్లను కట్టి పెద్దల బాధ్యత తీర్చేద్దాం
రివ్వున ఎగిరే రింగన్నలమై
గిర్రున దిరిగే బొంగరాలమై గుండ్రని భూమిని చుట్టేద్దాం
రై రైయ్యని రైలటాడేద్దాం. (కూ.చికు చికు) సై సైయ్యని సైలాటాడేద్దాం.. ॥అరెరే॥

గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
జగిల్లో ముగిల్లో జంగారి పాపల్లో
ఎక్కడిదొంగలక్కన్నే గప్‌చుప్ పిల్లివచ్చే ఎల్క భద్రం
కండ్లు గట్టిగ మూసేద్దాం - మట్టి కుప్పలు పోసేద్దాం

కందిరీగను బంధించేయగ నాదస్వరమే పలికిద్దాం
నింగి నేలను కలిపేద్దాం - నేలా బండా ఆడేద్దాం
కోయిల కూతకు బదులే పలికి తీయని పాటలు నేర్చేద్దాం
నీలాకాశం నీడల్లోన....
హద్దులు చెరిపే ఆనందంలో పొద్దుగూకులు గడిపేద్దాం
రై రైయ్యని రైలటాడేద్దాం(కూ. చికు చికు) సై సైయ్యని సైలాటాడేద్దాం.. ॥అరెరే॥

గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గూడుగుత్తె. ఏక్‌టంగ్ సాత్‌లొడుగు బుర్రెమూడు
నల్లింగొడు అదరకోను ఆరెకన్ను ఏలచిక్కు..

కంపతుమ్మలు దుశ్శేద్దాం - కప్పగంతులు వేసేద్దాం
కలతలు లేని కమ్మని స్నేహం మనదేనంటూ చాటేద్దాం
శిర్ర గోనెను ఆడేద్దాం - సీసంగోలిని కొట్టేద్దాం
సీతారాముల బొమ్మల పెల్లికి పేరంటాలై కూసుందాం
అష్టా చెమ్మ ఆటల్లోన
కష్టాలెన్నో మరిచే పోయి కాలం గతినే మార్చేద్దాం
రై రైయ్యని రైలటాడేద్దాం(కూ. చికు చికు) సై సైయ్యని సైలాటాడేద్దాం.. ॥అరెరే॥

గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
గద్దొచ్చె కోడిపిల్ల .... కియ్యం-కియ్యం
రాజు వెడలె రవి... తేజము లదరగ
ధగ ధగ ధగ ధగ.... కిరిటము మెరువగ
బాగోతాలే వేసేద్దాం - కోలాటాలే ఆడేద్దాం
బారుల దీరిన కొంగల నడిగి పాలో నీల్లో తాగేద్దాం
నిత్యం నీటిలో ఈదేద్దాం - బుడుబుంగలమై మునకేద్దాం
గల గల పారే సెలయేరల్లే గంతులు వేసి దునికేద్దాం
దాడీ ఆటల దరువుల్లోన
మాడిన సూర్యుని పొమ్మని వేడి సందమామనే రమ్మందాం
రై రైయ్యని రైలటాడేద్దాం. (కూ.చికు చికు) సై సైయ్యని సైలాటాడేద్దాం.... ॥అరెరే॥


కళలకు వారసులం



కళలకు వారసులం పల్లె కళాకారులం
సంస్కృతి సంప్రదాయ వారధులే గట్టినం
జగతిని జాగృత పరచ గజ్జగట్టి ఆడినం
జనం మదిలొ చెదిరిపోని గురుతులుగా మిగిలినం ॥కళలకు॥

శివుని చేతిలో ఉన్న ఢమరుకమే ఒగ్గురా
మల్లన్న బీరప్పలు మనకు గురువులంటరా
పాల్కురికి సోమన్న కోలాటం ఆటరా
ఆదిజానపద కళల తోలుబొమ్మలాటరా
సిందేసి ఆడినం.... సిందు బాగోతమాడినం
డోలు మధ్యల రాగం తీయగా
అరిగిన గొంతులు తాళమేయగా
సిందేసి ఆడినం.... సిందు బాగోతమాడినం ॥కళలకు॥

మూఢత్వపు ముసుగుదీయ కళలేగా ఆయుధం
నిదురమత్తు నొదిలించగ గమ్మత్తులు జేసెదం
వీరుల త్యాగాల కథల వీరగాధ జెప్పినం
భారత రామాయణాల బతికించిన వైద్యులం
భాగోతమేసినం.... యక్షా గానాలు బాడినం
రాజువెడలె రవి తేజములదరగా
ఇంటికెల్తే కలికుండలు అదరగా
భాగోతమేసినం.... యక్షా గానాలు బాడినం ॥కళలకు॥

ఆకలి పేగుల మూలుగు తుంబుర నాదమై
తాన తందన సయ్యని బుర్రకథలు జెప్పినం
ఆటకోయిలా పిల్లల ఆనందం సెంచులే
కనికట్టుతొ పనిబట్టే కాటుకా పాపలే
నెత్తురే జిమ్మినం.... గారడి ఇద్యల్ని జేసినం
కనికరమన్నది కానరాదురా
కళలకాదరణ లేకపాయెరా
నెత్తురే జిమ్మినం.... గారడి ఇద్యల్ని జేసినం ॥కళలకు॥

పగటి ఏశాలిప్పుడు నవ్వుల పాలాయెనా
టీవీలో సీరియల్ల మోజు బెరిగిపాయెనా
బడిఈడు పిల్లలపై సినిమా ప్రేమాయెనా
పాశ్చాత్యపు విష సంస్కృతి పడిగ విప్పి ఆడెనా
ఆలోచనేదిరా ..... మందికి ఆపదలెన్నొచ్చినా
పల్లె కళలకు పదును బెట్టగా
పౌరుషంబుతో అడుగులెయ్యరా
ఆలోచనేదిరా మందికి ఆపదలెన్నొచ్చినా ॥కళలకు॥


రోజింత నిరుపేద



రోజింత నిరుపేద వైతున్న రైతన్న
రోగాల పుట్టయినా మన చరిత జూడన్న ॥రోజింత॥

మెది నీల్ల బోరంట
పారేది గింతంత కాల్వలేమో రాకపాయే
మనకిచ్చే కారెంటు ఏడు గంటలంటా ఏలపాల లేకపాయే
కన్నీటి తుకమడుగులాయే వరిపంటకురిపెట్టుడాయే
సెమటసుక్కలు బిండుడాయే బతుకులెండి పండుడాయే ॥రోజింత॥

టక టక టాక్టర్లు
దున్నిపోతయంట పసులు కోతకాయె
ఎకరాల కెకరాలు మనకేడ ఉన్నయ్‌రా పెద్దల్ల పాలాయె
పైసలాశ జూపుడాయె మనకున్న భూమి గుంజుడాయె
ఎనకటోలె పెత్తనాలు మల్లదొరల సేతికి బోవుడాయే ॥రోజింత॥

నాటేసే మిషినంటా
నడుములొంచెనంటా కూలి బతుకులాగమాయె
వరికోత మిషినంట తెచ్చిండు పాటేలు అందరొంగి మొక్కుడాయె
ఊపాది హామితో తంటా ఉన్న పనులు ఊడెనంటా
రోజుకు వందేమో గాని కందిపప్పుకు వందాయెనంటా ॥రోజింత॥

సద్దజొన్న సేలు
బర్లు మేకల పాలు కాననన్న రాకపాయె
బుషితోని నుషిజేసి హర్లిక్స్ బూస్టంటూ రంగుసీసలు నింపుదాయె

వరి పత్తి అందాల పంట వులిగడ్డ టమాటలంట
పండించినోల్లకు మన్ను కొన్న దళారులాకందె మిన్ను ॥రోజింత॥

రైతంటే ఎవరయ్యా
గంటెడు భూమోడా ఎకరాల తోటేసినోడా
అదిరిచ్చి బెదిరిచ్చి అన్నిలోండ్ల దెచ్చి మాఫీగావాలన్నవాడా
మనని బ్యాంకు నమ్మాకుంటే మందికాడా అప్పుదెచ్చి
గిట్టుబాటు రాకాపోతె ఉరితాడు పట్టుకున్నాడా ॥రోజింత॥

పార్టీల తీరేందో
పడరాని పాట్లేందో నాగలంటగట్టే సూడు
ఓట్లోచ్చినాయంటే కోటితిప్పలైనా రైతుసుట్టే తిరుగుతాడు
ఆశలెన్నో బెట్టి వాళ్ళు అడుగుమందు జల్లిపాయె
మల్లగాన రాకపాయె వాల్లు ఐదేండ్లకొచ్చుడేనాయె ॥రోజింత॥


అన్నన్నా మా ఓటరన్న



అన్నన్నా మా ఓటరన్న
ఒక ముచ్చట జెప్పుత ఇనుకోరన్నా
అరవయేండ్లుగా అగ్రకులాలకే ఓటు వేస్తిమయ్యో నాయనా
అందరికందరు మనల ముంచగా మాయజేసెనయ్యో నాయనా ॥అన్నన్నా॥

ఓటు వేయడం తప్పుగాదురా పోటిజేయడం ముప్పుగాదురా
ఓటు గొప్ప రాజ్యాంగ హక్కురా
ఓటు కొరకురా కుప్పిగంతులు సీటు కొరకురా కప్ప గెంతులు
ఏండ్ల పొద్దుగా ఇదే తంతురా
జనం బాధలు జూసే నాయకుడు ఒక్కడు లేడయ్యో నాయనా
ఓట్ల పండుగల వంగి మొక్కుతరు దేవుడంటరయ్యో నాయనా ॥అన్నన్నా॥

వందనోటుకే మురిసి పోతవు ఓట్లపండుగా దసరా జేసుతవ్
మత్తు దిగితె మరి సోయికొస్తవు
తిరిగి సూడగా మహా ఓటురా ఎవనికేసివో ఎప్పుడేస్తివో
ఎందుకేస్తివో తెలువదాయెరా
ఎదను బాదుకొని కుమిలిపోయినా ఏమి లాభమయ్యో నాయనా
ఎనకటి నించి బడుగు బతుకులు ఏమి మారెనయ్యో నాయనా ॥అన్నన్నా॥

తాతకేసినం తండ్రికేసినం కొడుకుకేసినం బిడ్డకేసినం
కొడలుకైనా ఓటు వేసినం
అన్నకేస్తిమి తమ్మునికేస్తిమి ఒక్కఇంట్లనే ఇద్దరికేస్తిమి
ఒక్కఓటు మనకెయ్యమైతిమి
కుటుంబ పాలన పెరిగిపోయినా నోరు మెదపమయ్యో నాయనా
కులాల మధ్యన సిచ్చుబెట్టినా ఎదురు తిరగమయ్యో నాయనా ॥అన్నన్నా॥

బీసీ కులాలు ఏకమైతయని ముందే తెలిసిన దగుల్భాజిలు
కుట్రజేయగా సిచ్చు బెట్టెను
కులాల నడుమ కుంపటి బెట్టగ బీసి.ఎ.లో ఇతరుల జేర్చి
వాళ్ళకు వాళ్లకె తగవు బెట్టెను
అగ్రకులాల ఎత్తుగడలతో ఆగమైతిమయ్యో నాయనా
అధికారం మనకందకుంట ఏమైన జేసరయ్యో నాయనా

అన్నన్నా మా ఓటరన్న ఈ కాంగ్రేసోల్లా కథలు జూడనో
అంతులేని అభివృద్ధి అంటరు హరితాంధ్రంటరురో నాయనా
అంతుజిక్కని మాయ మాటలు అర్ధంగావయ్యో నాయనా

ప్రాజెక్టుల పేర భూమిగుంజిరి ఊళ్ళకు ఊళ్ళు ఊడ్చివేసిరి
నిలువ నీడ లేకుంట జేసిరి
పేదల భూములు అమ్ముతున్నరు కోట్లకు కోట్లు మింగుతున్నరు
తండ్రి కొడుకులే ఎదుగుతున్నరు
టీవీ ఛానల్ పత్రికలల్ల వాళ్ళ గొడవలేరో నాయనా
పావులిచ్చి రూపాయ ప్రచారం జేసుకుంటరయ్యో నాయనా ॥అన్నన్నా॥

జనం ఉంటెనె జగం అంటరు జగం అంటేనే జనం అంటరు
జగమే జనమని మురుసుతుంటరు
జనం భూములే గుంజుకుంటరు జగాన్ని మించే ధనికులైతరు
ఒక్క ఇంట్లనే ముగ్గురుంటరు
కూటికి లేని పేదవాళ్ళనే ముంచుతుంటరయ్యో నాయనా
అధికారాన్ని గుప్పిటబట్టి అనిచివేస్తరయ్యో నాయనా ॥అన్నన్నా॥

పోరగాళ్ళకు ఉచిత సదువనే ఉపాధినిచ్చే పథకముందనే
ఇందిరమ్మ రాజీవులుండ్రనే

ముసలి వాళ్ళకు పెన్షనుందనే ఆడవాళ్ళను ఆదుకుంటననే
ఇందిరమ్మ రాజీవులుండ్రనే
పథకాలన్ని కార్యకర్తలే పంచుకున్నరయ్యో నాయనా
పరిపాలించే రాజులు మీరు అదుపుజేయరేందో నాయనా ॥అన్నన్నా॥

పథకాలెన్నో తెచ్చిపెడితిమని పేదల బతుకులు బాగుజేస్తిమని
కాంగ్రేసోల్లు కథలు జెప్పెను
తెచ్చిన పథకం ఎవరికందెను చేయని పనులా బిల్లు మింగెను
మొండి చెయ్యి పైకెత్తి చూపెను
ఐదు ఏండ్లకే ఆంధ్ర రాష్ట్రము అవినీతిల ఫస్టో నాయనా
అభివృద్దయితే తెల్లకార్డులు ఎట్ల పెరిగినయ్యో నాయనా

అన్నన్నా మా ఓటరన్న ఈ మహాకూటమి కథలు జూడనో
అర్దంలేని హామీలియ్యగ వ్యర్థమాటలయ్యో నాయనా
రంగుబొమ్మలా పెట్టెలియ్యగ రాత ఎట్లమారో నాయనా

తెలుగు దేశమే గొప్పదన్నడు తెలుగుభాషనే జెప్పుకున్నడు
తెలంగాణ ఇపుడెందుకన్నడు
తెలంగాణ ఒక విప్లవశక్తి తెగించి కదిలితే ఆపలేమనీ కుట్రపూరితా కూటమన్నడు
సమైఖ్యాంధ్రని సంక దింపని చంద్రబాబు జూడో నాయనా
సందికుదరని కేసీయారును సంకనెత్తుకుండో నాయనా ॥అన్నన్నా॥

ఎర్రజెండలు పసుపు జెండలు గులాబిజెండలు గుట్టుసప్పుడుగ
పూలదండలై మెడలు నిండెను
ఏకమైన ఈ పద్దతి ఏంది ఎవరు రాసినా సిద్ధాంతలివీ
ఎట్ల అడుగుతరు ఓట్లు వెయ్యమనీ
తెలంగాణను తేల్చని మీరు ఆంధ్ర తొత్తులయ్యో నాయనా
తెగువ జంపుకొని బుడదగుంటలో పందులైతిరయ్యో నాయనా. ॥అన్నన్నా॥

సక్కధనాల తెలంగాణరా ఒక్కతీరుగా రగులు తుండెరా
వొళ్లో కొచ్చిన తెలంగాణరా
మహా మాయల అగ్రకులమురా కుళ్ళిన కూటమి ఎత్తుగడలతో
కుప్పగూల్చగా తయారయ్యెరా
తెలంగాణపై తలో తీరుగా మాటలాడుతుండ్రో నాయనా
తెగువజంపుకొని మంది మూతులు నాకుతున్నరేందో నాయనా ॥అన్నన్నా॥

కులములేదని మతము లేదని ఎర్రజెండలు ఎగురుతుంటయి
కులసంఘాల వింగుపెడతయి
గాడిద గుర్రం ఒక్కటె అంటూ కులవృత్తులలో కుంపటి బెట్టగ
ఎత్తులేస్తరు ఎగదోస్తుంటరు
అగ్రవర్ణముల కులము సంఘము అట్నే ఉంటదిరో నాయనా
అధిక జనం గల బడుగు జీవులను కూడనియ్యరయ్యో నాయనా ॥అన్నన్నా॥

నాలుగు జెండలు రెపరెప లాడగ నాయకులంతా ఒకటైపోయిరి
నాలుకలేని మనుషుల జేసిరి
సిద్ధాంతాలను పక్కకు బెట్టిరి నెత్తుటి జెండకు రంగులద్దిరి
సాయుధపోరని సంకలు గుద్దిరి
సద్దిగట్టుకొని గోషిబెట్టుకొని జిందాబాదంటం నాయనా
గుడిసె భూమికే ప్రాణాలిచ్చే గుడ్డి బతుకు మాదో నాయనా ॥అన్నన్నా॥

తెలంగాణ సిద్ధాంత కర్తలు విద్యావంతులు బుద్ధిమంతులు
కవులు కొందరు కళాకారులు
అలిసిపోయినరు అమ్ముకున్నరు తెలంగాణను తెర్లు జేసినరు
కూటమి అంగడి సింగిడన్నరు
కూసొని బతికే అగ్రకులాల కుట్రలు జూడయ్యో నాయనా
పదవులకాడ అందరువాళ్ళే పనికిరాము మనమో నాయనా

అన్నన్నా మా ఓటరన్న నీ మనసు మార్చుకో ఈసారన్నా
మానవత్వము మంచితనమును జూసి ఓటు వేయో నాయనా
గెలిసినంక మననిడిసిపోతె వాని గల్లబట్టి గుంజో నాయనా

పత్రికలల్ల టీవీలల్ల అగ్రకులాలె అనగదొక్కుతరు
ఐదుగురొకటై కలిసిపోతరు
ఎంత ఎగిరినా ఖర్చుజేసినా కానరాదు మన బొమ్మఎక్కడ
రెండు గీతల వార్త రాదురా
వేలకు వేలు పత్రికలోల్లకు ఖర్చుబెడతరయ్యో నాయనా
కడుపుగొట్టినా విషయం జెప్పిన కాల్చుక తింటరురో నాయనా ॥అన్నన్నా॥

ఆకలి చావులు ఆత్మహత్యల ఆంధ్రప్రదేశున యువతరానికి అరచేతులలో
బూతుబొమ్మలు
బడిలో గుడిలో బస్సురైళ్ళలో సెల్‌ఫోన్‌లల్లో సినిమాహాల్లో
ఇంటర్‌నెట్‌లో ఇరుకుసందులో
ఏడ జూసినా బట్టలూడినా పోస్టరు బతుకాయె నాయనా
హాలీవుడ్‌లా నీలిచిత్రముల మించిపాయె గదరో నాయనా ॥అన్నన్నా॥

పొద్దుబొడవకా ముందే లేస్తిమి ముందుగాల ఒక కోటరు గొడ్తిమి
పొద్దుగూకులా తాగుతుంటిమి |
పొంగిపొర్లేటి సారా విస్కి పొర్లి కక్కగా తాగబడితిమీ
ముప్పయేండ్లకే సొక్కిపోతిమీ
అరవయేండ్లకే పెన్షను మంచిదే బతికెటోడు లేడో నాయనా
అదుపుదప్పినా పాలన ఇంకా ఎంతకాలమయ్యో నాయనా ॥అన్నన్నా॥

ఎస్సీఎస్టీ బీసీల్లారా మైనార్టీ మహావీరుల్లారా
కపటం మోసం లేని మనమురా
ఎనబై శాతం ఉన్నజనముగా అన్నదమ్ములై కలిసిఉన్నము

అధికారానికి దూరమున్నము
అగ్ర కులాలు ఎన్నడు మనని కలవనియ్యరయ్యో నాయనా
నలుగురి కోసం నలబై మందిమి కొట్టుకుంటిమయ్యో నాయనా ॥అన్నన్నా॥

ఓటువేసె మాయన్నల్లారా అక్కల్లారా తమ్ముల్లారా
చెల్లెల్లారా చెవినబెట్టరా
ఎనబై శాతం ఉన్నఓట్లురా ఎవరికిబడితే వాళ్ళకు వేయక
ఆలోచించి ఓటు వేయరా
ఒక్కఇంట్లనే ఇద్దరు ముగ్గురు అక్కడక్కడా పోటీలుంటరు
పోటాపోటిగ సంపాదిస్తరు
ఇట్లాంటోళ్లను ఇంటికి బంపగ వీరుడయ్యి రారో నాయనా
చీము నెత్తురు మనకు ఉన్నయని చిన్న సాక్షమియ్యో నాయనా ॥అన్నన్నా॥


జాతిరత్నమై మెరిసెనే



జాతి రత్నమై మెరిసెనే ఫూలే
జోతిగా వెలుగు నిచ్చేలే
ఘనమైన ఫూలే చరిత దెల్సుకోని
జగమందు మన భవిత రాసుకుందామా ॥జాతి॥

పువ్వులమ్ముకునే పేదోల్ల గుడిసెల్లో
పురుడుబోసుకుండు తూరుపు దిక్కోలే
కులము పేరుతోని మతము పేరుతోని
జరిగే అవమానంతో గుండె బగిలినాడు
మూఢనమ్మకాల ముసుగులో ముంచేటి
బ్రాహ్మణ కుట్రల్ని ఎదిరించాలని చాటి ॥జాతి॥

కులమేంది మతమేంది ఎవడెట్ల బోతేంది
అగ్రవర్ణం జోలికోవొద్దు నా బిడ్డా
ఎద్దు ఎవసం జేసో సెట్టు పుట్టలు బట్టో
పూలతోటలు బెంచి పూలమ్ముదామంటూ
శతపోరినా తండ్రి మాటలు వినకుండా
తనజాతి సేవకే అంకిత మయ్యిండు ॥జాతి॥

ఆంగ్ల గ్రంధాలెన్నో అధ్యయనం జేసిండు
కుల మతా సారాన్ని కాచి వడబోసిండు
అంటరానితనము అజ్ఞానమేందంటూ
తన తండ్రి గోవిందరావునడిగినాడు
అగ్రవర్ణంబెట్టే బాదల్ని భరియించి
అనగారినా జాతి వీముక్తికై బతికి ॥ జాతి॥

దేవుండ్ల పేరుతో జరిగేటి ఘోరాలు
కండ్లార జూసిండు ఎదిరించి నిలిసిండు
మనిషిజచ్చి ఇల్లు మునిగి ఉంటే మనము
కర్మఖాండలు జరిపి కట్నకానుకలడిగి
కాలు ఎలును ముంచి ఇచ్చేటి తీర్ధాన్ని
వొద్దాని తల్లికి బాపని మోసం జెప్పే ॥జాతి॥

ఏడ్చుకుంటా వచ్చి ఏకాశి పేరుతో
మనలముంచి మెడలు వంచేటి బ్రాహ్మల
మాయమాటలు నమ్మి మంత్రాలను నమ్మి
మోసపోయి బతుకులీడ్చుక పొయినోల్లు
ఎంతకని నమ్మేరు నోములు రతములు
ఏమొచ్చినాదంటూ నిలదీసి అడిగిండు ॥జాతి॥

మొగడు జచ్చీనంక పిల్లల్ని గన్నట్టి
బల్సినోళ్ళజాతి పసివాళ్ళ పారేస్తే
వొళ్లోబెట్టుకోని పెద్దజేసిన తల్లి
సావిత్రిభాయమ్మ సారస్వతీయమ్మ
అక్షరాలతో దళితులాకిళ్ళ నిలిసింది
ఓనమాలు నేర్పే పనిలోన మునిగింది ॥జాతి॥

మనుషుల్ని విభజించి మానవ విలువలు సంపి
హింసామార్గం బట్టి హితబోధ జేస్తున్న
బ్రాహ్మణాధిపత్య భావజాలం మీద
తిరుగుబాటు జెండలెత్తినాడు ఫూలే
సాహు మహరాజుతో కలిసి నడిసీనాడు
సదువులమ్మ ఒడిన దలితుల్ని సాదిండు ॥జాతి॥

ఆదిలోన భూమి అంత మనదేనండు
అభివృద్ధి మూలాలు మనచేతి బిక్షండు
కర్ణాల లెక్కలు కలిగినోల్లు దొరలు
అదిరించి బెదిరించి ఏలుముద్రలతోని
భూమిగుంజుకోని ఎట్టిపని జేపించి
వెతలల్ల ముంచీన కథలు పాటలు బాడి ॥జాతి॥

బడుగు బలహీనుల్ని ఎడబాపెటందుకు
వేసేటి ఎత్తుల్ని పసిగట్టామన్నాడు
అణగారినా ప్రజలు ఎదిగొచ్చెటందుకు
అందర్ని ఐక్యంగా పోరాడమన్నడు
రాజ్యాధికారాన్ని చేపట్టకా పోతే
రాలిపోతది బతుకు రగిలిపొమ్మన్నడు ॥జాతి॥


ఏందిరో



ఏందిరో అగ్రకులము నాటకం
ఎట్టరో ఈ దొంగ బూటకం
ఇప్పుడైనా మనము తెగువ జూపకపోతే
మారదింకా మన బీసి జాతకం ॥ఏందిరో॥

ఎనకటి సందైనా ఎనకేమి లేదంటే
ఇప్పుడైనా మేము ఎదిగింది ఏందంటే
బహుజన కులముల్ల తెలివి బెరిగిందాని
ఆస్తి పాస్తులతోని అదర గొడుతుండ్రాని
కపట బుద్ది మీ కడుపులో బెరగంగా
క్రిమిలేయరు ముందలేసిండ్రు
మన బీసీలనెడబాప జూస్తుండ్రు ॥ఏందిరో॥

అర్ధములేని మీ అభివృద్ధి జపముతో
కన్న శెరలు బడి పోటిబడుతుంటే
కేజీనుంచి మొదలు పీజి దాకా మేము
గవిరిమెంటుబోసే గంజిదాగుకుంటా
ఇప్పుడిప్పుడె పెద్ద సదువుల్ల కొస్తుంటె
అది ప్రైవేటుకు అప్పజెప్తుండ్రు
అండ్ల రిజరువేషను లేదంటుండ్రు ॥ఏందిరో॥


ఎదురి నిలిసి



ఎదురు నిలిసి తిరగబడతరా - ఏలెటోని కావలుంటరా
బడుగు జనులకు దాపుగుంటరా - తోటివాళ్ళనె తొక్కుతుంటరా
తేల్చుకోండిక తమ్ములారా-దళిత బహుజన బిడ్డెలారా
అదునుబోతే మల్ల రాదయ్యో మాయన్నలారా....
అగ్రకులముకు లొంగి పోవొద్దో మాతమ్ములారా..... ॥ఎదురు॥

వెన్నుజూపక తిరిగినోల్లం వెన్నుపోటు దెలువనోల్లం
నీతికి న్యాయానికై మేం నిలువెల్లా కాలినోల్లం
కాలమెంతా మారుతున్నా ప్రగతిని సాధిస్తవున్నా
బతుకుభారం దీరదాయె నిత్తెపోరు దప్పదాయె
ఎంగిలిస్తరి మెతుకులాకై ఎదురు సూడక తప్పదాయె...
మంచికి..... సోటేడ ఉంది
మంచికి సోటేడ ఉందయ్యో మాయన్నలారా...
మానవత్వం జాడ లేదయ్యో మా తమ్ములారా.... ॥ఎదురు॥

మన భూములు గుంజుకుండ్రు బానిసల్ని జేసుకుండ్రు
పాటేలు దొరలమంటూ పెత్తనాన్ని పెంచుకుండ్రు
ఎదురుదిరిగీనోల్ల నెప్పుడు కన్నశెరలు బెట్టుతుండ్రు
ఊడిగంలో ముంచి మనని ఊర్లకూర్లకు పంచుకుండ్రు
కుట్రలకు బలియవ్వకుండా కుటిలనీతికి లొంగకుండా...
చేతివృత్తులు...... తెగువ జూపగ
చేతివృత్తుల తెగువ జూపండో మాయన్నలారా...
అభివృద్ధికి ఆదిమనమయ్యో మాతమ్ములారా.... ॥ఎదురు॥

పార్టీలు పుట్టినపుడు బ్యానర్ల ఊయలూపి
గద్దెగట్టి గజ్జెగట్టి అంతెత్తు జెండ నిలిపి
అడ్డాల పార్టీని గడ్డాల వరకు బెంచితె
అదునుమీదికొచ్చె వరకు అగ్రకులమే ముందలుంటది
ఎండ్లజూసిన బీసీబతుకులు ఎదగనివ్వక అనుచుడేందనీ....
గొంతెత్తి..... గోడుజెప్పగ
గొంతెత్తి కదిలివస్తారా మాయన్నలారా.....
గొడ్డుసాకిరి చెల్లదంటారా మా చెల్లెలారా ॥ఎదురు॥

విద్యార్థి ఉద్యమంలో తిరిగేటి యువకులందరు
కొట్టుకోని తిట్టుకోని శత్రూవూలై మసిలేటోల్లు
ఎస్సి ఎస్టీ బీసీలే అగ్రకులము గానరాదు
కేసులల్లో ఇరికిమీరు సదువులాగం జేసుకుంటరు
సిద్ధాంతం ముసుగుదీసి జరిగే ఘోరాలు జూసి....
జాతీకోసం.... పోరుజేయగ
జాతికోసం పోరుజేయండో మా తమ్ములారా.....
దగా మోసం కనిపెట్టండో మా చెల్లెలారా.... ॥ఎదురు॥

ఆదినించి అనిగి మనిగి ఉన్న మనకు ఏమి మిగిలే
అధికారం అందలేదు అవమానం నూరుపాల్లు
జెండలెన్ని బట్టుకున్న అండ మనకు లేకపాయె
అగ్రకులము రాజ్యమందు ఆసరా మనకుండదాయె
జనం మనది బలం మనది ఏకమైతె జయం మనదనీ...
ఉగ్రరూపం..... ఎత్తిరాండని
ఉగ్రరూపం ఎత్తిరాండయ్యో మాయన్నలారా......
ఐక్యంగా ఉద్యమించండో మాతమ్ములారా....
బడుగుజీవుల బాగుకోరండో మాయక్కలారా....
దండుగట్టి ముందునడవండో మా చెల్లెలారా.... ॥ఎదురు॥


బీసి సోదరా..



బీసి సోదరా బరిగీసి నిలువరా
అరవయేండ్లు గడిచిన ఏ మార్పులేదురా
గళం విప్పరా జనబలం నీదిరా
సాహసంలో నినుమించిన వీరుడెవడురా
చతుర్వర్ణ ధర్మంతో చదరంగపు ఆటరా
అగ్రవర్ణ ఎత్తులతో అనిచేస్తున్నారురా
పోరాటం జెయ్యరా...
మన హక్కుల సాధనకై ఉక్కుపిడికిలెత్తరా
రా... తరలిరా మన బలగం పిలుస్తోంది రా.. కదలిరా...
బీసి సోదరా ఈ తరం నీదిరా తరతరాల దోపిడినెదిరించ కదలిరా

మనువాదుల కెదురు నిలిసి మనవాదం నిలిపినా
మహనీయులు ఫూలే అంబేద్కర్లను తలువరా
బహుజనులదే రాజ్యమని రగిలిన పాపన్నరా
బాంచ బతుకులెన్నాళ్ళని బంధూకులు ఎత్తెరా
ఎవరు ఏదైనా ఏకమైతే సాధ్యమవునురా
ఎవనికాడుగ వేరయ్యిపోతే ఏముంటదిరా
నాడు వామనడు ఏసిన మూడడుగులేనురా
నేడు మనబతుకును తొక్కేసిన పాదమయ్యెరా
శిరసులెత్తకుంటెనే చితిపేర్చేస్తరు
బడిసెలెత్తకుండానే బలిచేసేస్తరు ॥బీసి సోదరా॥

విసునూరు దొరఘడీల కుప్పగూల్చివేసినా
వీరవనిత ఐలమ్మల వారసత్వముందిరా

దేశముఖూ గుండాలను గడగడలాడించినా
నల్లా నరసింహుడయ్యి గర్జించి దునుకరా
మనము కొలిసి మొక్కే సమ్మక్క సారక్కలురా
సమరభేరిని మోగించి రణం జేసినారురా
కొరివీరుడు వెలసినట్టి రుద్రభూమిరా
కొదమ సింహాలై కొట్లాడే తెగువ నింపెరా
చిన్న చీమలేనురా పామును చంపెరా
పెద్ద గుంపు నీదిరా ఎనకడుగేందిరా ॥బీసి సోదరా॥

సాయుధపోరాటంలో ఆయుధమే నీవురా
సత్యాగ్రహ ఉద్యమంలో చేయూతే నీదిరా
తూటాలను త్రుంచేయగ ప్రాణాలెదురొడ్డినా
దొడ్డికొమురయ్య గుండె బలమే నీకుందిరా
నీవు నీ వాళ్ళనె శత్రువుగా చూడబోకురా
నిమ్న వర్గాలను కలిపేటి బాట నడువరా
మనము అనుకుంటె ప్రళయం సృష్టించగలమురా
కడలి కల్లోలం ఆపుట ఎవడబ్బ తరమురా
కుమిలిపోవుడేందిరా కెరటం నీవురా
తీరం చేరగా ఎదురే లేదురా ॥బీసి సోదరా॥


గర్జించరా....



గర్జించరా నువ్వు గర్జించరా
బెస్తబోయుడ తుడుము మోగించరా
బాధలే తీరంగ అడుగెయ్యరా
బెస్త సేవా సంఘం దండొచ్చెరా ॥గర్జించరా॥

బెస్తసేవా సంఘ దండు కదిలీనాది
పదము కలిపీ కదము తొక్కండిరా
ఊరు ఏదైతేంది చెరువు ఏడుంటేంది
చెరువూ కుంటలు మన సంఘానియే
నీల్లున్న సొటంత మనదేనురా
నిలదీసి అడుగంగ నువ్ కదలరా ॥గర్జించరా॥

కరువులోన మనము రకంగట్టిన్నాడు
కానరాలేదెవడు ఇపుడొచ్చెరా
గంగమ్మ బిడ్డలు విడిపోయి బతకొద్దు
కాంటాక్టు దొరగాన్ని కట్టెక్కనియ్యొద్దు
సాపలు బట్టేదే మనవృత్తిరా
తీర రేఖలు చెర్లు మనయేనురా ॥గర్జించరా॥

సాపల్ని పోసేది పట్టేది అమ్మేది
అన్నీ మనమే చెయ్యాలిరా, చేపియ్యాలిరా
సాపల్ని నిల్వుంచె సామాన్లు ఇయ్యాలె
మండలానికొక్క మార్కెట్టు గట్టాలె
చెర్లోని మనవాడు సేటేనురా
మనమీద మందోడు సేటేందిరా ॥గర్జించరా॥

సహకార సంఘంగ మత్స్య సొసైటీకి
కేంద్ర సహకారంలో సభ్యత్వమియ్యాలె
ఫిషర్ మెన్ పోస్టులు భర్తిజేసెటపుడు
బెస్త వాళ్ళకె ఆ ఉద్యోగ మియ్యాలె
తెలంగాణల బెస్త వృత్తోల్లకు
ప్రత్యేక ప్యాకేజి లియ్యాలెరా ॥గర్జించరా॥

అశోకుని ధర్మశాస్త్రానికున్నంత
ఇటలీ రోమన్న్యాయ శాస్త్రానికున్నంత
బెస్తకుల తీర్పునకంత పేరుండేది
కులపెద్దకంతటీ గౌరవముండేది
పోలీసు కేసూతో ఏమొచ్చెరా
పొడుగూత పైసల ఖర్సాయెరా ॥గర్జించరా॥

వొంటి మీద నీకు ఏ రంగు జెండున్నా
కులమంటె చెరువంటే కుట్రలు జెయ్యొద్దు
మనమంత ఐక్యంగ కలిసి కట్టుగుంటే
మనచెర్ల మందోడు వల ఏసి పోతడా
అందరొకటిగ మనము నిలవాలెరా

అవతలోన్ని తరిమికొట్టాలిరా
ఎనబెట్టి వలకట్టు గట్టాలిరా
బెస్తసేవాసంఘం దండొచ్చెరా


కదలరా నువ్వు నడవరా



కదలరా నువ్వు నడవరా ఓ అణచబడ్డ నా సోదరా..
ఎదిరించి ముందడుగు వెయ్యరా నీ పాలనొచ్చె దాక నడువరా
పొలికేకలు బెట్టి తరుమరా
నువ్వు పోరుజెండానెత్తి నడువరా ॥కదలరా॥

చాతుర్వర్ణ సిద్ధాంతంలో సూదరోల్లమై బతికినం
చరిత నిండినా అబద్దాలను కర్మా అనుకుంటూ మోసినం
అగ్రకుల అధికారంలో అవిటివాళ్ళయ్ మిగిలినం ॥కదలరా॥

తెల్లదొరల పరిపాలనలో కాయకష్టమే జేసినం
నావాబులేలిన రాజ్యంలోన బికారులోలే బతికినం
భూస్వాముల నాటి శెరలింకా దీరక బాంచలన్నట్టె ఉన్నము ॥కదలరా॥

పోరాడె తెగువను జంపి అమ్మ అయ్యంటు అడిగినం
ఐదుపదుల స్వాతంత్రంలో అద్రగానమే అయ్యినం
ఇగనన్న మనమంత ఏకమై మన బీసీల రాజ్యం కోసమై ॥కదలరా॥


బీసీ దళం



రగిలింది బీసి దళం - కదిలింది మహాజనం
పిడికిలెత్తె జనబలం - పల్లవించె మన గళం
పదపదమని అగ్రజులతో పందెమాడె ఈక్షణం ॥రగిలింది॥

అనాదిగా అగ్రకులమే పెత్తనాలు జేసెనేందీ
అదికారం చెలాయించే పనిలో వాల్లుండుడేందీ
అవమానం భరించగ అన్యాయం మనకేందనీ ॥రగిలింది॥

సూదరోల్లను జేసి కులాలుగ విడదీసి
సామెతలు కట్టుకథలు కల్పించి ఈసడించి
తెలివిలేని వాల్లజేసి తెలువనట్టు ఉన్నరనీ ॥రగిలింది॥

ఎస్సి ఎస్టీ బీసీలు మైనార్టి సోదరులు
అగ్రకులా శూద్రులార మీరు మేమంత ఒకటే
అధికారం ధరించగ అనిచివేసే కుట్రేందనీ ॥రగిలింది॥

జనబలమే లేని వాల్లు ధనమదముతొ కక్ష్యగట్టి
మనవాళ్లను కొల్లగొట్టి మన సంపద దోసెననీ
అనిచివేత ఎన్నాళ్ళని అగ్రకులమునెదిరించగ ॥రగిలింది॥

అధ్భుతమది మనచరితను మట్టిలోన కలిపెననీ
ఆదిలోన వీరులమై అట్టడుగున ఉండుడేందనీ
చీమునెత్తురున్నోల్లుగ సింహాలై ఘర్జించగ ॥రగిలింది॥

శ్రమతత్వమె మనతత్వం మలినమన్నదే లేదుగ
కుచ్చితాలు కుట్రలేవి లేక కూడి ఉన్నముగ
రాజకీయ అధికారం సాధించగ మనమంతా ॥రగిలింది॥


గర్జించరా నువ్.....



గర్జించరా నువ్వు గళమిప్పరా
దళిత బహుజన నువ్వు దండెత్తరా
అభివృద్ధి మన చేతి చలువేనురా
అన్నిట్ల మన వాటకై సాగరా ॥గర్జించరా॥

పల్లకి మోసేటి బోయీలమైనాము
పాకి పనిజేసేటి బాంచోల్లమైనాము
సూదరోల్లుగ మనము అనిచేయబడ్డాము
పూర్వజన్మల పాపమనుభవించీనాము
పై మూడు వర్ణాల కుట్రేనురా
వాల్లు పున్మాత్ములెట్లయ్యె నిలదియ్యరా ॥గర్జించరా॥

గడ్డపారా గన్ను సుత్తె కొడవలి జాడా
మాయమై పోయింది మల్ల దొరకాకుంది
వరికోత మిషినొచ్చె ప్రొక్లేను పొడువొచ్చె
ట్రాలర్లు మరబోట్లు వలలుజింపురుకొచ్చె
కులవృత్తులభివృద్ది ఓ సోదరా
ఆ కులమోల్లకే ముందు దక్కాలెరా ॥గర్జించరా॥

అయ్యాల పనిజేసే యంత్రాలమైనాము
అష్ట కాష్టాలల్ల అవమాన పడ్డాము
ఇయ్యాల ఓటేసే మరమనుషులైనాము
ఇడుపులెంటా దిరిగి అడుకతింటున్నాము
ఇగనన్నా ఎదిరించు ఓ సోదరా
వాల్ల ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా ॥గర్జించరా॥

రాజులేలిన నాడు పరిపాలనాల్లదే
రాజకీయాలల్ల అధికారమాల్లదే
అరవయేండ్ల నించి అనిగి మనిగున్నాము
అన్ని రంగాలల్ల అనగారి పొయినాము
ఆలోచనన్నది మనకేదిరా
అదునొచ్చె ఇపుడన్నా అడుగెయ్యరా ॥గర్జించరా॥

చట్టాలు జేసేటి సభలల్ల వాల్లాయె
చక్రాన్ని దిప్పేటి విష్ణు మూర్తులాయె
ఊరికొకడున్నోంది పెత్తానమెట్లాయె
ఎమ్మెల్యే మంత్రులూ ముఖ్యమంత్రేట్లాయె
జనబలము సామర్యమున్నోల్లము
జైగొట్టి బీసీల జెండెత్తుదాం అరె...
జైగొట్టి బహుజన జెండెత్తుదాం ॥గర్జించరా॥


నిప్పోలె బీసీలు..



నిప్పోలె బీసీలు రగిలేనల్లో నివురు దొలిగిన చైతన్యమేనల్లో
సర్వాయి పాపన్న... ఎన్నీయల్లో సాకలి ఐలమ్మ ... ఎన్నియల్లో
దొడ్డి కొమురయ్య... ఎన్నీయల్లో
నల్ల నరసింహులు... ఎన్నీయల్లో
మహనీయుని పూలె అడుగుజాడల్లో
మనవాళ్ళు ఐక్యంగ కదిలేనల్లో ॥నిప్పోలె॥

ఆదిలోన భూమి మనదేనల్లో - సకలజాతీ గుంపులెలిసేనల్లో
వీరాధి వీరులు నిలిసేనల్లో - రాజ్యాల పాలన జేసేనల్లో
జాంభవంతుడు మొదలు ఎన్నీయల్లో
సార్వాయి పాపన్న మన సైన్యమల్లో
తాలె లెల్లే లెల్లే లెల్లీయల్లో- లెల్లె లెల్లె లెల్లె లెల్లీయలో
కొండల్ని పిండేము ఎన్నీయల్లో కోనల్ని తిరిగేము ఎన్నీయల్లో
శ్రమజీవులమ్మనము ఎన్నీయల్లో సేత కూలెటుబాయె ఎన్నీయల్లో
ఏండ్లా పొద్దుగ మన బీసీ బతుకుల్లో
ఎదుగు బొదుగూ లేదు ఎన్నీయల్లో
తాలె లెల్లే లెల్లే లెల్లీయల్లో... తగువు జేయా మీరు కలిసి రారల్లో

వారెవ్వరయ్యా వీరెవ్వరయ్యా ఆదిమానవుని అంశేనయ్యా
వేదాల నొల్లించె బాపండ్ల నొదిలేస్తే
రెడ్లు కమ్మ వెలమా దొరలు ఎవరయ్యా
వారెవ్వరయ్యా వీరెవ్వరయ్యా ఆదిమానవుని అంశేనయ్యా
వలసొచ్చినార్యులు ఒడిపిల్ల గంటయితే
సబ్బండ కులపోల్లు వరిగొలుసూలయ్యా
వారెవ్వరయ్యా వీరెవ్వరయ్యా ఆదిమానవుని అంశేనయ్యా ॥నిప్పోలె॥

వాగులు పారంగ ఎన్నీయల్లో - వంకలు తిరుగంగ ఎన్నీయల్లో
సెలయేటి హోయలల్లో ఎన్నీయల్లో - సేదదీరి పెరిగీ ఎన్నీయల్లో
శ్రమతత్వమున్నోల్లమై నిలిసినాము
మన కష్టమెటుబాయెనెన్నీయల్లో
ఇన్నాళ్ల మోసాలు ఎన్నీయల్లో ఇగసాగబోవంటూ నినదించెనల్లో
ఆంధ్ర దేశములోన ఎన్నీయల్లో అరవయేండ్లా సందీ ఎన్నీయల్లో
అధికారములున్నోల్లు ఎన్నీయల్లో అంత అగ్రకులమే ఎన్నీయల్లో
మనచేవ జచ్చింద ఎన్నీయల్లో
సాపకిందికి నీరు ఎటొచ్చెనల్లో
ఇన్నాళ్ల మోసాలు ఎన్నీయల్లో ఇగసాగబోవంటూ నినదించెనల్లో

ఈ పార్టీ నీదంటూ ఎన్నీయల్లో ఆపార్టీ నాదంటూ ఎన్నీయల్లో
అగ్రకులమోల్లకు ఎన్నీయల్లో బేదాలు లేవంట ఎన్నీయల్లో
అధికారమే వాళ్ల ఏకైక లక్ష్యం
అంత కలిసీపోతరెన్నీయల్లో
ఇన్నాళ్ల మోసాలు ఎన్నీయల్లో ఇగసాగబోవంటూ నినదించెనల్లో
రాజ్యానికే దాపు ఎన్నీయల్లో - పోతరాజు కాపు ఎన్నీయల్లో
కట్టమైసమ్మ ఎన్నీయల్లో - వరద కడ్డు కట్ట ఎన్నీయల్లో
బతుకమ్మ తల్లి ఎన్నియల్లో-మన బతుకు ఎటుబాయె నెన్నీయల్లో
ఇన్నాళ్ల మోసాలు ఎన్నీయల్లో ఇగసాగబోవంటూ నినదించెనల్లో

వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా అగ్రకులమోల్లుగ ఎట్లయ్యెనయ్యా
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా ఆదిమానవుని అంశేనయ్యా
జంతువోలె దిరిగె మానవా గుంపు
పరిణామ క్రమములో గిట్లయ్యెనయ్యా
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా - సృష్టిని జేసినా సుంటెవ్వడయ్యా
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా అనగదొక్కి మననీ ఎదిగినోల్లయ్యా ॥నిప్పోలె॥


బానిసత్వ బంధనాలు



బానిసత్వ బంధనాలు తెంచేయుటకు
నీ ముందు నిలిసె విద్యుత్ బీసీల సంఘము
అణిగి మణిగి బతికేదింకెన్నాళ్ళంటూ
ఫూలే అడుగుల జాడ చాకలి అయిలమ్మ నీడ
బంధూకులుగా మారి బడిసెలెత్త మన్నది
పోరాటం జేయందే పొద్దుబొడువదన్నా
చీకట్లను చీల్చే చిరుదివ్వెలు మీర ॥బానిసత్వ॥

దినసరి కూలీగ దినదిన గండంగా
ఏపియస్‌ఈబీలో ఎడ్డిబతుకులేందంటూ
విద్యుత్ సౌధాలో విరిసిన విప్లవమై
ట్రాన్స్‌కో జెన్‌కోలో మనహక్కుల సాధనకై
హోరెత్తిన చైతన్యం అన్న కుమార్‌‌స్వామిగా
పెను ఉప్పెన కెరటమైన ముత్యం వెంకన్నరా
బీసి ఉద్యమనేత టైగరారు కృష్ణన్న
అండదండతో కదిలె అన్న కరెంటన్న
పోరాటం జేయందే పొద్దుబొడువదన్నా
చీకట్లను చీల్చే చిరుదివ్వెలు మీరన్నా ॥బానిసత్వ॥

క్యాజ్వల్ లేబరకు స్కిల్డ్ వర్కర్‌కు
ఓ అండెమ్ కార్మికునికి ఏ అండా లేదుగా
మనలో సామర్ధ్యం పనిలో నైపుణ్యం
ఎంతున్నా ఎట్టిజేసి మట్టి గలిసి పాయెగా

బాధ్యతగా పనిజేసిన బదునామే మోస్తిరా
పనిభారం పెరుగుతున్న నోరు మెదపరైతిరా
మీలో మీరే కుమిలి మీ వాళ్ళను మరిచిపోయి
ఒంటరిగా మిగిలిపోతే అంతేనన్నా
పోరాటం జేయందే పొద్దుబొడువదన్నా
చీకట్లను చీల్చే చిరుదివ్వెలు మీరన్నా ॥బానిసత్వ॥

వైర్లను అల్లినా పోళ్ళను ఎక్కినా
వృత్తికి ప్రతిరూపమైన పనిలోనే ఉన్నరా
చెక్కిన నగిషీలు చేసిన వస్తువులు
క్లాంపులు కాసారాలు కష్టపడి చేసినా
అదే పనిలో మగ్గిపోయి అడుగంటుతున్నరా
అనాదిగా ఎదుగు బొదుగు ఏది లేకపాయెగా
పర్మనెంటు కాదేందని ప్రమోషన్‌లు రావేందని
పాలకులను ప్రశ్నించి లొల్లిజేయ ఢిల్లి జేరు
పోరాటం జేయందే పొద్దుబొడువదన్నా
చీకట్లను చీల్చే చిరుదివ్వెలు మీరన్నా ॥బానిసత్వ॥


ఎట్ల మారును...



ఎట్ల మారును ఎట్ల మారునురా... ఎనకబడ్డా బతుకులు
ఏడ జూసిన అగ్రాకులమేరా...ఏమీజేదూ కర్మా ॥ఎట్ల॥

మనకు గుడిసే లేనప్పుడాల్లు మిద్దెలల్లో ఉన్నారంట
మిద్దెలల్లో మనమొచ్చి ఉంటే వాల్లు బంగ్ల గట్టీరంట
అంతరాల భేదం బెంచినరో ... అన్ని రంగాలల్ల
అందుకునే మార్గం మూసినరో.... ॥ఎట్ల॥

కులవృత్తూలల్లా జేరి కూడు దొరకాకుంట జేసే
సేతివృత్తులల్లా జేరి సేతులిరిసి పొయిలా బెట్టే
అభివృద్ధి పేరుతో వాళ్ళంతా... యంత్రాలను దిప్పీ
అడుకతినేటోల్లను జేసినరో.... ॥ఎట్ల॥

మనకు ఉన్న రిజరువేషన్ మారుపేర్లతొ గొట్టినారు
ఉద్యోగాలు సదువూలల్ల ఉన్నంతగా ఎదిగినారు
అగ్రకుల పేదల పేరూనా... బలిసినోల్లు ఇపుడు
బక్కోని కడుపులు గొడుతున్నరో... ॥ఎట్ల॥

భూమి మీద పెద్దలు వాల్లే భుక్తి మీద గద్దలు వాల్లే
ఉద్యమాలు పోరాటాలు అన్ని వాల్ల ముక్తి కొరకే
జిత్తులామారెత్తులు వేసెనురా... మనని సంపీ వాల్లు
వీరులంటూ పాటలు పాడెనురా.... ॥ఎట్ల॥

కమ్మకట్టు కులమోల్లంటూ కలిసి ఉండలేనోల్లంటూ
కట్టుకథలు జెప్పి మననీ జట్టుగట్ట నియ్యరు బిడ్డా

సామెతలు ఇప్పీ సెప్పుతరో... మాయన్నల్లారా
బీసీలను విడదీస్తుంటరురో ॥ఎట్ల॥

బాంచన్‌దొరా కాలుమొక్తం అన్న కాలం బోకాపాయె
బతిలాడి వాళ్లని మనమూ వీరునోలె జేసుడాయె
మనమిచ్చిన గుండే ధైర్యంతో... మాయన్నల్లారా
ఎడబాపె కుట్రలు జేసినరో ॥ఎట్ల॥

గ్రామస్థాయినించీ మొదలు అసెంబ్లీ దాకా జూడు
అగ్రకులామోలె అంతా అడుగు బెట్టానియ్యరు మననీ
అణిచి వేసే కుట్రలు జేసెనురో... అధికారంతోనీ
మనని కలిసి ఉండానియ్యరురో ॥ఎట్ల॥

స్వాతంత్రం రాకాముందు సంగతేమి అడుగుతలేను
తెలంగాణ ఆంధ్ర గొడవ అసలు నేను తేనే తేను
ఐదుశాతమున్న జనమేరా... అరవయేండ్లా సందీ
అన్ని హక్కులనుభవించెనురా... ॥ఎట్ల॥

యాబయైదు నించీ మొదలు రెండువేల నాలుగు వరకు
మూడువేల రెండొందాల మంది శాసన సభకొచ్చినోల్లు
రెండువేల పై చిలుకందరురో... అగ్రకులమోల్లుంటే
మూడొందలు బీసీలున్నరురో... ॥ఎట్ల॥

అధికారం అందూకున్నరు అందలాలు ఎక్కుతున్నరు
పదిహేను శాతం వాల్లు పరిపాలన జేసుతున్నరు
ఎనబయ్యయిదు శాతం మనవాల్లు... మట్టితల్లి బిడ్డలు
ఎట్టి జేసి బతుకుతున్నరురో... ॥ఎట్ల॥

ఎమ్యెల్యేలు మంత్రూలంతా ముఖ్యమంత్రీ స్పీకర్లంతా
యాబయ్యేండ్లు ఏలీనోల్లు అంత అగ్రకులమేనంటా
ఎన్నడన్న ప్రశ్నించినోడుండా... ఎడ్డి బీసీ బతుకు
ఎడమ కాలు చెప్పే నయ్యమురో... ॥ఎట్ల॥

పెన్షండ్లు కోపను బియ్యం ఆరోగ్యాశ్రీ బిచ్చమేసి
అధికారం గుప్పిట బట్టే అగ్రకులము ఎత్తులు జూడు
కుక్కలోలె తోకాడిస్తరురో... తెలిసి తెలువానోల్లు
ఎంగిలిస్తరి జూసి మురిసెనురో... ॥ఎట్ల॥

కొమురెల్లి మల్లన్నారా కొమరంభీము వీరత్వంరా
భూస్వాములకెదురు నిలిసీ గెలిసీనట్టి ఐలమ్మారా
సర్వాయి పాపన్న శౌర్యమురా... మన బీసీలల్ల
నిండితే మన పాలనొస్తదిరా...పూలే బాటల
కదిలితే రాజ్యం వస్తదిరా...


ఆలోచించురన్నలారా



ఆలోచించురన్నలారా బహుజన యోధులు మీరు
అదునుబోతే రాదు మనకు అవకాశమిప్పుడే పోరుకూ
రాజకీయధికార జెండనెగరేయంగ
బడుగు జీవులమంతా ఏకమై కదులుదం ॥ఆలోచించు॥

కత్తీకలము ముందలేసి ఓనమాలు దిద్దబెట్టి
కుట్రలెన్నో జేసుకుంటా బ్రహ్మజ్ఞానినంటూ మురిసీ
సదువూలమ్మా ఒడికి మననీ దూరంజేసీ
సావిత్రి పూలేని మరిపించ జూసిండ్రు ॥ఆలోచించు॥

మనల ముంచెటోని సుట్టే జైకొట్టి జెండాలు బట్టి
పటేలు పట్వారీ దొరలా గెలిపించుకుంటాము మనమూ
పదవూ లొచ్చినంకా మనకోసమెవడైనా
ఒరిగినోడున్నాడా మన గోస దీర్చిండా ॥ఆలోచించు॥

బ్యానర్లు గట్టేది మనమే జెండాలు మోసేది మనమే
ఇల్లు పిల్లల నిడిసి పోయి ఈరంగ మాడేది మనమే
అమెరికా సదువుల్లో కొలువుల్లో వాల్లంతా
మన కడుపుగొట్టేగా ఎదిగిపోతున్నదీ ॥ఆలోచించు॥

చక్రాన్ని కనిపెట్టినోల్లం పనిముట్లనే జేసినోల్లం
ఉత్పత్తి కులాలు మనయి ఉత్తుత్త పోల్లము గాదు
మనము మొండికేస్తే మైలబడుతరు వాల్లు
మరునాడే మనకాళ్ల కాడికొచ్చుంటరు ॥ఆలోచించు॥

అనిగి మనిగి ఉండేటోల్లు ఎదుగుతుంటే సూడలేరు
పదవొచ్చి కుర్చీలో ఉంటే పక్కకూ నిలబడాలేరు
ఎంత సదువూకున్న ఎదిరించే దమ్మున్న
ఎనకపట్టుబట్టి ఎనకడుగు వేస్తున్నం ॥ఆలోచించు॥

ఎర్రెర్ర అంగీలు దొడిగీ నెత్తుటీ మడుగుల్లో మునిగీ
స్థూపంలో సుక్కయ్యి మీరు ఎంతెత్తు నిలిసిండ్రు సూడు
అమర వీరులంటే ఎవ్వరో గాదు
దళిత బహుజనులేరా దగా పడుతున్నం ॥ఆలోచించు॥


విద్యుత్తు బిసీలురో...



విద్యుత్తు బీసీలురో ఓరన్న విప్లవం దెస్తున్నరు
కదిలొచ్చె పులిబిడ్డలై మాయన్న కదముదొక్కుతున్నరు
అడుగడుగునా నాటి మనుధర్మ పాలనే
అడ్డుదగిలి మనని అణిచివేస్తుందని
అన్నదమ్ములోలె కలిసేటి బీసీల
విడదీసె ఎత్తుల ఏస్తూనే ఉండ్రని
ఎట్లయిన బీసీల ఐక్యంగ నడుపంగ
ఉగ్రరూపము దాల్చె ఉద్యోగ సంఘము ॥విద్యుత్తు॥

ఎన్నేండ్లు గడిసినా ఉన్న ఉద్యోగమే
ప్రమోషనే లేని పాడు బతుకైపాయె
చట్టసభలల్లోన అడిగెటోడు లేక
బీసీల బతుకేమో పట్టుబండలాయె
విద్య ఉద్యోగాలు రాజకీయాలల్ల
రిజర్వేషన్‌లడిగి రణరంగమే జేయ ॥విద్యుత్తు॥

అవమానమే మోసె బీసీల మీద
ఏ అట్రాసిటి కేసు చెల్లదని అంటుండ్రు
ఎనకటి నుంచైనా ఏ చరిత జూసిన
బడుగు బలహీనులు బాంచలే నంటుండ్రు
అట్టడుగు వర్గాలకణిచేయబడ్డోల్లకు
అట్రాసిటి చట్టమందజేయాలంటు ॥విద్యుత్తు॥

అడుగడుగునా కుటిల వలసాంధ్ర పాలనే
అడ్డుదగిలి మనని అణిచివేస్తుందనీ

అన్నదమ్ములోలె విడిపోదమంటుంటే
అభివృద్ధి పేరుతో కలిసుందమంటుంటే
ఉగ్రరూపము దాల్చి ఉక్కు పిడికిళ్ళెత్తి
సీమాంధ్ర దొంగల్ని ఉరికిస్తమంటున్న ॥విద్యుత్తు॥

హైద్రబాదు నడిబొడ్డున వెలిగేటి
నావాబుల నాటి పవరు ప్రాజెక్టేది
హైటెక్కు మోసంతో ఆక్రమించేసిండ్రు
హైమాక్సు రంగుల్లో మము ముంచి కూసుండ్రు
సకల సంపదతోని విలసిల్లె నగరము
ఆనవాల్లే లేక అల్లాడుడేందనీ ॥విద్యుత్తు॥

నల్లబొగ్గూ గనులు నా నేల నిండున్న
థర్మలు ప్రాజెక్టు ఆంధ్ర కెట్లా బాయె
నదుల నిండా పొంగి పొర్లేటే నీల్లున్న
నలగొండ గొంతెండీ గుడ్డి బతుకెల్లాయే
నీల్లు నిధులు బొగ్గు గనులన్నీ దోసినా...
సిగ్గు లేని వలస పాలనింకొద్దనీ ॥విద్యుత్తు॥


లోకానికి వెలుగులు



ప॥ లోకానికి వెలుగులు నింపి
       చీకటిలోకం బయలెల్లినవా
       లైన్‌మేనూ ఫ్లోర్‌మేనూ ఏదైనా ఏముందయ్యా
       ప్రతి ఘడియ గండం నీకయ్యో... నా సక్కని దేవా
       సతి బాధలు జూసేదెవరయ్యో...

చ॥ ఉరికురికీ స్థంబాలెక్కి
       ఊరందరికీ వెలుగుల నిచ్చీ
       తెల్లారకముందే నువ్వు గమ్యాన్ని చేరితివయ్యా
       నా పయనం నడుమనే ఆగిందో.. నా సక్కని దేవా
       నడిసంద్రపు నావై పోయిందో...

మే. చ॥ సుడిగాలిలో దీపం నువ్వు
            జడివానల్లో మెరుపే నువ్వు
            నడిరాతిరి వేళల్లో నడిసేటి మినుగురు నువ్వు
            ఎందరికో వెలుగే నువ్వయ్యో... ఓ లైన్‌మేనన్నా
            సతి బతుకును చీకటి జేసినవో...

చ॥ ఎక్కడ ఏమూలకు ఎవరూ
       కరెంటు షాకుతొ పడిపోయిననూ
       నేనున్నా మీకంటూ ఎదురేగి పోయేవయ్యా
       నిను జూసే దిక్కే లేదయ్యో... నా సక్కని దేవా
       నిలువెల్లా కరెంటు కమ్మినదో...

చ॥ పది నేను సదువాలేదని
          పాపం సావుకు ఏమెరుకయ్యా
          పరుగూన నినుజేరి పరలోకం జేర్చిందయ్యా
          అధికారులు దళారులయ్యిండ్రో.... నా సక్కని దేవా
          మన ఫైలును పక్కన బెట్టిండ్రో....

మే.చ॥ సోకంలో ఇంటిని ముంచి
          లోకం తెలియని నీ పిల్లలను
          చీకట్లో వదిలేసి చిరుఆశను చిదిమేసినవా
          ఈ గోసను జూసేదెవరయ్యో.. ఓ లైన్‌మేనన్నా
          ఈ ఏడుపు నీకినపడదయ్యో...

చ॥ నువ్‌బోయిన నాటీనుంచి
          ఆపీసుకు నే తిరిగీతిరిగీ
          అయినోన్ని కానోన్ని అందరినీ అడిగీ అడిగీ
          అయిదేండ్లు గడిసి పోయిందో... నా సక్కని దేవా
          ఉద్యోగం ఊసే లేకుందో

చ॥ లోకులు పలుగాకుల మాదిరి
         చీటికి మాటికి మమ్ముల పొడిసే
         నీఇల్లు పిల్లల్ని నేనేమీ జేదూనయ్యా
         మము గూడా తీసుకపోవయ్యో.. ఈ బాధలకన్నా
         బతికుండి సుఖమే లేదయ్యో...

మే.చ॥ నీ గాథను విన్నది సంఘం
          విద్యుత్‌బీసీ ఉద్యమ సంఘం
          నలగొండా నా చెల్లే నీ బాధలు దీర్చుతమంటూ
          వాగ్దానం చేస్తున్నామమ్మా... నీ ఉద్యోగముకై
          నీకండగ నిలబడతామమ్మా..


బీసీల సింహగర్జన



బీసీల సింహ గర్జన బహుజనమై సాగుతుందిరా
హోరెత్తిన పోరుగర్జన ఢమరుకమై మోగుతుందిరా
ఘన గర్జన జన గర్జన రాజకీయ రణగర్జన
గద్దెమీది గబ్బిలాల తరిమికొట్టు గళ గర్జన
ఊరు వాడ ఒక్కటయ్యి ఉరుకొచ్చిన పెను ఉప్పెన ॥బీసీల॥

మనువాదుల పీడనింక మనలనిడిసి పోలేదని
మాయజేసి బీసీలను ఏలే మహరాజులని
పడగనీడ పరమాత్ముని పానుపెట్ల అయితదని
పదిశాతం లేనివాళ్ళ పథకమట్లె ఉంటదని
తెలుసుకున్న బీసీలు తెగబడి కొట్లాడగ
అలుపెరుగని ఉద్యమాల ఊపిరి మీరేనని
రండి కదలిరండి జనబలము గుండె నిండి
వర్ణ ధర్మ రాబంధుల వధించుటే లక్ష్యంగా ॥బీసీల॥

అగ్రవర్ణ రాజ్యంలో స్వాతంత్ర్యం మనకేదని
బీసీలను ఎడబాపుతు పరిపాలన జేసెనని
ప్రజాస్వామ్య దేశంలో బానిసలే మనమని
రాజ్యాంగం మనకిచ్చిన రక్షనేది లేదని
దిక్కులేని బీసీలకు లెక్కగూడ లేదని
మనకోసం రాజ్యాంగం సవరించినదెప్పుడని
రండి కదలిరండి జనబలము గుండె నిండి
పార్లమెంటులో బీసి బిల్లును సాధించగా ॥బీసీల॥

ఓట్లు మావి సీట్లు మీవి చెమట మాది పంట మీది
ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని అగ్రకులపు ఆగడాలు
పార్టీలు బీసీల డిక్లరేషనే చేసి
పదవులిచ్చె కాడ మనకు మొండిచెయ్యి చూపకుండ
చట్టసభలలో బీసి రిజర్వేషనుండాలని
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒకటి లేదేందని
రండి కదలిరండి జనబలము గుండె నిండి
ఒక్కటయ్యి నినదించగ నలుదిక్కుల నుండి ॥బిసీల॥

కులాలన్ని వేరైన కూడి ఉండె సంఘమని
కుట్రలతో విడదీసె ఎత్తులింక చెల్లవని
ఎలక్షన్‌ల సహపంక్తి భోజనాలె మోసమని
ఎప్పుడైన హరిశ్చంద్ర నాటకాలు నమ్మొద్దని
ఓటుమనదె సీటు మనదే అధికారం మనదేనని
అగ్రకులపు ఎత్తులను చిత్తుజేసె ఆయుధమై
రండి కదలి రండి జనబలము గుండె నిండి
బీసీ రాజ్యాధికార స్థాపన జేయండి ॥బీసీల॥


మంగలి వృత్తి



మంగలీ వృత్తి నిడువలేనురా
పస్తులుండి నేను సావలేనూరా
బువ్వబెట్టే హేరుడ్రెస్సింగు సెలూను
కన్నాతల్లిరా కడుపు నింపే తల్లిరా ॥మంగలీ॥

మీసమో చిన్న గడ్డమో - ఇంక రాలేదనీ మీ ఆత్రము
పూటకోసారీ గీసుకోని - మూతికడ్డం సిగ్గు సెయ్యిబెట్టీ
చిన్నగా లేతమీసం చిరుగడ్డమే నీకొచ్చెనా
అద్దమే మీ లోకమూ - మదినిండుగా ప్రేమరూపము
కదిలిస్తే సాలు నవ్వుతో ఆకథ సాంతిమి మాకు జెప్తరు ॥మంగలీ॥

కాలేజీలో జదివే పిల్లలూ - కారు సోకులల్ల పసికూనలు
ఖైదీ గుండాలై వస్తరు - ఇప్పీకటింగ్ జెయ్యమంటరు
ముందు ఫంకు దియ్యమంటరు - గ్యాంగులీడరైపోతరు
సంటరు పాపెడ అంటరు - జగదేకవీరునోలిగుంటరు
చిరంజీవి ఫ్యానునంటరు మాకు మంచిగా దోస్తులైతరు ॥మంగలీ॥

రెహమాను కాటింగుతో - యమ రెచ్చిపోయి సిందులేస్తరు
జుంపాల జుట్టుతోని అపరిచితుని జెయ్యమంటరు
అటీటుగాని నెత్తితో వచ్చి - జాని కటింగ్ జెయ్యమంటరు
కండ్లమీదికొస్తే జుట్టు సూడలేక దస్తి గడతరు
ఎందుకో ఇన్ని ఫోజులు అయ్యి సూశి గడిసె నా రోజులు ॥మంగలీ॥

నల్లనీ ఒత్తు జుట్టోలు ఆర్మి కటింగ్ జెయ్యమంటరూ
ఉండేదే రెండు పోసలు లైటుగా జెయ్యమంటరూ
మీసకట్టు దువ్వుకోని - రాజశేఖరు వెంకీ నంటడు
కత్తెరెక్కూవందుకుంటే - ముఖము మాడ్సుకోనుంటరు
బట్టతలే బాగుందిసారంటే సంటి పిల్లలోలె నవుతరూ ॥మంగలీ॥

ఒల్లుతేటగైతుంటరా నా ఒంటికేమో ఆనందమూ
మా కులవృత్తిజేసీ మేము గొప్పగానే బతుకుతున్నమూ
ఎనకేసి మమ్ముల కొందరూ మా వృత్తినెగతాలి జేస్తరు
మీ సావులూ పెండ్లీలలో మా సాయమే లేదంటరా
మేము గనక ఈసడిస్తే మనిషి మనిషి తీరుగ ఉంటడా ॥మంగలీ॥


మంగలోల్ల బిడ్డలం



మంగలోల్లా బిడ్డలాము మనమంతా
దండుగట్టి సాగుదాము మాయన్నా
మనము వృత్తి జేయకుంటే జగమంతా
జంతు జాతిగ మనిషి మిగిలేనన్నా
మానవత్వానికే మనమూ ఓరన్నా
మారుపేరై నిలిసినాము మాయన్నా ॥మంగలోల్ల॥

జిట్టెడు పొట్టకు పుట్టెడు శెరలంటూ
ఆకలి తీర్చుకోను ఏటకోసం పోయి
ఎనుగుల్ల కంపల్ల చెట్ల కొమ్మల్లల్ల
ఎంట్లు గట్టిన జుంపాల జుట్టు చిక్కి
అడవులల్లో జంతువులోలే మానవులు
తిరుగుతుంటే మనిషి రూపాన్ని ఇచ్చింది
మన జాతి బిడ్డలు మరువొద్దు మాయన్నా
ఘన చరితలో మనమూ సగపాలు ఓరన్నా ॥మంగలోల్ల॥

ఏడాది పొడుగూనా నెత్తులు గడ్డాలు
ఈసడించుకోక ఇగురంగ జేస్తుంటే
బతిలాడి అడగంగ కారుకు పచ్చేర్ల
కట్టడిచ్చుకుంటా కసిరిచ్చి తిడుతారు
రాళ్ళు పెళ్ళ తాళ్ళు కలిసీన ఒడ్లన్నీ
పనిబాట్లోల్లకనీ పక్కకు పెడతారు
కత్తూల కర్సెల్లదాయెరో ఒరన్నా
కడుపుకేమి తిందామురా మాయన్నా ॥మంగలోల్ల॥

పోలు రాయకుంటే లగ్గమెట్లయ్యేను
గుండుజెయ్యకుంటే ఖర్మెట్ల జరిగేను
పండుగ పబ్బాలు పెండ్లిలు సావుల్లో
మనచేయి తగలందే కార్యమెట్లయ్యేను
కులమాని కొందరు మతమానికొందరూ
మనిషితనము మరిసి మసలుకుంటుంటే
ఏ భేధము లేక మనమంతా ఓరన్నా
సేవలెన్నో చేసి బతుకుతున్నామన్నా ॥మంగలోల్ల॥

పెండ్లీలు సావుల్లో అదును చూసి మనమూ
అదిరించి బెదిరించి అతికారమనలేదా
మీసాలు మెలీదిప్పే ఆసాములెవరైనా
మనముందు మెడలొంచికూసోక తప్పిందా
కట్టడియ్యాకుంటె కొపమొచ్చిన గాని
కావాలని ఏనాడు కత్తి కాటియ్యలె
ఈసడించినోల్ల ఇడువొద్దు ఇపుడన్నా
ఇడిపోయి మనమెపుడు బతుకొద్దు మాయన్నా ॥మంగలోల్ల॥


కలెదిరిగి సూడరనేల



కలెదిరిగి సూడరనేల
కాంతులీను బంగరునేల
తెలుగు సీమ నేనెక్కడ బోయిన కానరాదు బంజరునేల
గోల్కొండ ... బంగరు రంగుల కోట
విలసిల్లే ఆసియాలో అందరినోట ॥కలెదిరిగి॥

వాగులు వంకలో చేపపిల్లలు
చెంగున ఎగిరి దునుకు తుండెగా
పచ్చని పైరులు ఊగి ఆడగా
పల్లెతల్లి పులకించి పాడగా
గడ్డిపూల అందము జూసి ఎడ్డి గుడ్డిగ బతికేయొచ్చు
తెలంగాణ..... తీరొక్క రంగుల నెలవు
మదిలోన..... నిలిచిపోయె బొమ్మల కొలువు ॥కలెదిరిగి॥

సేతి వృత్తులు బువ్వ బెట్టగా
సెయ్యిజాపక బతికిన రోజులు
కల్లుమీద వచ్చిన సొమ్ము
ఖజానాలు అలుగెల్లి పాయెగా
కన్నుగుట్టిన ఎందరో రాజులు కడదాకా ఓర్వనిపోరులు
ఓయమ్మా....సౌభాగ్యం నిండిన తల్లి
నిలువెల్లా.... నిను దోసిన జడవని తల్లి ॥కలెదిరిగి॥

సెలయేళ్ళు పొంగి పొర్లగా
నెమళ్ళ గుంపు నాట్యమాడగా
వజ్రపురాసులు కుప్పనూర్చగా

అంబరమంటిన సంభరాలురా
తెలుగుసీమ నేనెక్కడబోయిన కానరాని బంజరునేల
వైభోగం.... అడుగంటిన వైనం దెలుసా
మొఘలాయి.....పాలకులే జేసిన మోసం

కలెదిరిగి సూడరనేల
కాలుతున్న ఈ బంగరునేల
తెలంగాణలెక్కడజూసిన తెల్దుమ్మల బీళ్ళు బెరిగెరా
ఓయమ్మా..... పలుగురాళ్ళె నీపైన
నల్లేనే.... నీ మెడలో నల్లబూసలు ॥కలెదిరిగి॥

సుభేదార్ల నియమించి పాయెగా
పస్తులున్న శిస్తోసులు జేసెగా
కూటికి నీటికి కోటి బాధలై
కరువు రక్కసి రాజ్యమేలగా
తెలుగు సీమనెక్కడికేగినా దళిత బతుకులు మట్టి గలిసెగా
ఈ పాపం... ఔరంగాజేబుది గాదా
ఈ గోరం.... మొఘలాయి పాలన గాదా ॥కలెదిరిగి॥

దొరల పెత్తనాలెక్కువయ్యెను
కులమదముతో కాలుదువ్వెను
దోపిడిదారులు లంచగొండులు
దోసుకతినుడు మొదలు బెట్టెను
పేదల నెత్తురు బీల్చెజెనిగలు వాడవాడనా దాపురించెను
అన్యాయం....ఆర్పేందుకు ఎవరున్నారు
ఈ గోస.....దీర్చేందుకు ఎవరొస్తారు ॥కలెదిరిగి॥

సినుకులేదని నెర్రె బారితే
ముప్పొద్దులు గురిసిన వానలు
ఇల్లు పిల్లీ కుక్కకూనకు
వూపిరాడక ఉచ్చుబిగిసెను
పీనిగలెత్తే దిక్కేలేక తెల్లని బొక్కల దిబ్బలాయెను
ఈ రాజ్యం... సూసేటి నాథుడు ఏడని
పొలిమేర... దేవతలే ఎదురు సూడగా

కలెదిరిగి సూడరనేల
బహుజనులా పూరి గుడిసెలా
కల్లుగుండల పండువాసన కలెగల్సిన మాయి వాసన
ఓ దీపం...సీకట్లను బెదిరిస్తుంది
ఆ రూపం....వెన్నెలోలే విరబూసింది
ఆ దీపం... పున్నమోలె పురివిప్పింది
ఆ రూపం పాపన్నగ వెలుగిచ్చింది
సర్వాయి పాపన్నగ మనకిచ్చింది


పొడిసేటి పొద్దును



పొడిసేటి పొద్దును ఓయమ్మా తల్లి మాయమ్మా
పొత్తిళ్ళలో దాచె సర్వమ్మ......
ఉదయించే బాలుడు లోకాన నడిజామునా
సర్దారు సర్వాయి పాపన్న
సర్వాయి పేటంతా ఉయ్యాలే ఊపంగా
రేకల్లు బారంగా జోగల్లు బాడంగా
కేరింతలే కొట్టే బాలుడూ తల్లి సర్వమ్మ కంటి పాపడు
బహుజన సూర్యుడై - రాజ్యాన్ని ఏలెనే ॥ఉదయించె॥

పచ్చని చెట్లన్నీ తలలూపి ఆడంగ
పల్లె తల్లులంతా పులకించి ముర్వంగ
పండిన ఆకుల్లు పక్కలూ బర్వంగ
ఎండిన మోడుల్ల సిగురు బుట్టంగ
పాల పిట్టెల గుంపు పైకెగిరి సాగంగా
ఎల్లమ్మ తన గుళ్ళో మువ్వగట్టంగ
ముత్యాల బాలుడూ - ముచొచ్చే పాపడు ॥ఉదయించె॥

ముద్దు బుద్దు గోరుముద్దలుదిని
అల్లారు ముద్దుగ పెరిగినాడమ్మా
తోటి పోరగాళ్ల జేరినాడమ్మ
తాటిగిల్లలు దిప్పి ఆడినాడమ్మా
కోడె నాగోలే తిరిగినాడమ్మా
లేగదూడోలే దునికినాడమ్మా
ఆ ముద్దు బాలుడు - అయ్యిండు సూరీడు ॥ఉదయించే॥

పెద్దలు దేవండ్లు ఆశబడకుంట
దొరలు భూసాముల కంటబడకుంట
సంక దించక తల్లి సాదింది సర్వమ్మ
తన కొంగునెప్పుడూ నిండూగ గప్పింది
ఇరుగు పొరుగూజేరి ముద్దుజెయ్యంగ
సీదరించగ తల్లి దిష్టిదీయంగా
చిట పట అంటూనే - ఉప్పుదిప్పేసెనే ॥ఉదయించె॥

కర్ర కత్తులు బట్టి సాముజెయ్యంగా
సూసినట్టి దొరల కన్ను జెదరంగా
ఎవరి కొడుకంటె సర్వమ్మ కొడుకాని
ఊరు ఊరంతా నోరు దెర్వంగా
సూద్రులల్లో ఈడు వీరుడైతాదని
ముసలోల్లు మీసాలు దిప్పి సెప్పంగా
సర్వమ్మా కళ్ళల్లో -కన్నీరే దిరగంగా ॥పొడిసేటి॥

పెరిగి పెద్దోడై ఎదిగినాడమ్మా
బుద్ది దెల్సిన బుద్ధుడైనాడమ్మా
దళిత బహుజనులాకు అండగనిలిచి
దండు గట్టిన మొండి ధైర్యమున్నోడమ్మా
పేదసాదల తోడున్నాడమ్మా
గోడు విన్న మా దేవుడైనడమ్మా
ఆయింటి రారాజు - పేదింటి మారాజు ॥పొడిసేటి॥

తల్లి మాట గాదనక తాళ్ళు గీసిండు
పోద్దుగూకులు దిరిగి పసుల గాసిండు
ఎట్లయిన బాధలు దీర్చాలనుకుండు
యాప తుమ్మలకింద సింత జేసిండు

గొడ్లదోలుక పొయ్యి బీట్ల దోలిండు
లింగాన్ని మొక్కీన ఏమున్నదనుకుండు
బానిస బతుకులూ - మదిలోన మెదలగా ॥పొడిసేటి॥

కొండల్లో ఎండల్లో కాలేటి బండల్లో
కాయకష్టము జేపిచ్చిన దొరలా
రెక్కలు ముక్కలు జేసి సెమట జిందినోళ్ళ
శ్రమను దోసుకున్న సుభేదారుగాళ్ళ
అంతుజూడ బయలు దేరుతనన్నడు
దీవెండ్లిస్తే సాలు రాజైతనన్నడు
దండమే పెట్టిండో - తల్లినే అడిగిండో ॥ఉదయించే॥

కూలి నాలి పేద జనముల్ల గల్సిండు
అన్ని కులాలను పోగు జేసిండు
నిఖార్సయిన పోతు కల్లు గీసిండు
తాటి రేకలుగట్టి కల్లు వొంపిండు
ఏడేడ దొరని ఎట్టెట్ట బట్టాలె
దోసుకున్న సొత్తు నెట్టరాబట్టాలె
ఉపాయం జేయంగా - చిరుతోలె దిరిగిండో ॥పొడిసేటి॥

ఉల్లెల్లి వాసన్లు కలగూర శామల్లు
వాసనంటక మనమూ ఉండాలె కొడుకా
కల్లు సారల జోలికోవొద్దు కొడుకా
కౌసు నీసుల ముట్టు కోవొద్దు కొడుకా
శివుని ఆజ్ఞమీద బతకాలె కొడుకా
శివలింగమే మనకు దేవుడోరయ్యా
నేనెట్ట జెప్పనో - నిన్నెట్ట ఆపనో ॥ఉదయించె॥

కష్టాన్ని నమ్మిన తల్లులెందరో
కన్నీటి పాలెందుకైతున్నరంటూ
తాత ముత్తాతల కాలంనించి
శివపూజ జేసిన ఏమున్నదంటూ
ఎదురుప్రశ్న తల్లి నడిగినాడమ్మా
చిక్కుపశ్నే ఏసి కూసున్నడమ్మ
దలితుల తోడున్నా - సర్వాయి పాపన్న ॥పొడిసేటి॥

కులవృత్తి జేసిన కాటమయ్యను జూడు
సంఘమందున మంచి పేరుగల్లోడు
పసులగాసిన బతుకు నాదానుగాదురా
ముస్తాదులో గూడ వీరుడున్నడురా
దొరలు భూస్వాముల జోలికిబొయ్యి
ఎదిరిస్తే మనబతుకు బూడిదయ్యెనురా
వొద్దురా పాపన్న - దిక్కుమొక్కు నువ్వేరా ॥ఉదయించె॥

గెలకల్లు బారంగ గీత బెట్టిన మనకు
వొంటి మీద మోకు కాతలేందమ్మా
పుట్ట పుట్ట కన్నీరు ఉట్టంగ
బతుకునిండ సెమట ఊట బుట్టంగా
మూడుపూటల తాళ్ళెక్కే బతుకూల
ఉగ్గమెపుడు దెగి పట్టుమంటుందో
ఉగ్రుడై పాపన్నా - తల్లినే అడగంగ ॥ఉదయించె॥

తల్లి మాట జవదాటలేకున్నాడు
పేదప్రజల గోస జూడలేకున్నాడు
ఎట్టయిన పేదోల్ల తోడుంటననుకుండు
అడిగింది లేదనక దానాలు జేసిండు

సర్వమ్మ దాసిన పైసలు దీసుకుండు
మనసులోనే అమ్మ కాళ్లకు మొక్కిండు
కూలీ నాలి పేదోల్ల - కూడదీయ గదిలేరా ॥ఉదయించె॥

వైదికాచారాలు వొద్దనుకున్నాడు
బాపనోల్లనెపుడు బాజుకే బెట్టిండు
శూద్రులల్లో అగ్రకులమూలెవ్వరిని
దరిదాపుల్లోకి రానియ్యలేదు
జానపదులు బాడే పాటల్లో పాపన్న
ఉగ్రరూపం దాల్చే నర్సిహ్ముడయ్యిండు
సిందోల మువ్వేలే - గోసంగి ఆటేలే ॥పొడిసేటి॥

మాదిగ డప్పుల్లో దరువేసి ఆడిండు
ఎల్లమ్మ తల్లీని మదినిండ గొల్సిండు
జమిడిక మోతల్లో పాటయ్యి కూసుండు
బహుజన కులమూల బందువై పోయిండు
మోదుగు పువ్వుల్లో ఎరుపయ్యి పూసిండు
ఆదివాసుల్లోన తునికాకై రగిలిండు
బహుజన వీరుడై - బందూకై ఎదిగెనే ॥ఉదయించె॥

ముత్రాసి ఎల్లయ్య మేకపోతును దెచ్చి
తల్లి ఎల్లమ్మాకు బలి ఇవ్వ జూడంగ
జల్తిచ్చినా పోతు జాడిచ్చి ఉరుకంగా
ఇగవురికి అగవురికి పట్టుకొచ్చియ్యంగా
మడులు మాన్యాల్ని ఎల్లయ్య కిచ్చిండు
దళితుడైనా గాని పూజార్ని జేసిండు
సర్వాయి పాపన్న - రాజ్యాన్ని ఏలంగా ॥ఉదయించె॥

వెన్ను దన్నయ్ వున్న సాకలి సర్వన్న
సైన్యాల నడిపేటి ధీరుడయ్యిండు
నల్లగొండ జిల్లా వేములకొండన
పాపన్న సైన్యాలు విడిది జెయ్యంగా
రాతి కట్టడాల్ని గట్టించెనోయన్న
సొరంగ మార్గాల్ని దొవ్వించె పాపన్న
బహుజన వీరుడై - దళితుల దేవుడై ॥ఉదయించె॥

దొరలు భూసాముల్లో గుబులు రేపంగ
పెత్తందార్ల పెడరెక్కలిరువంగా
ఫిరంగులాపేటి కోటల్ని గట్టిండు
వేలల్లో సైన్యాల్ని వెంట బెట్టుకుండు
సుభేలు, జమీన్‌లు భూసాములేకాక
మొఘలాయి సైన్యాల సడుగులిరగొట్టంగా
కదిలెను పాపన్న - కణ కణ మండంగా


కదిలెను పాపన్నా



కదిలెను పాపన్నా
మొఘలుల నంతం జేయంగా
సురకత్తి మీసమును గిరగిర దిప్పీ
శత్రువు గుండెల కత్తులు దూసి
కదిలే కదిలేరా మన వీరుని సైన్యం
కదిలే కదిలేరా మగధీరుని సైన్యం
జలపాతపు హోరయ్యీ... జడివానలో మెరుపయ్యీ
ఆ శత్రురాజులను చీల్చి చంపుటకు ॥కదిలే॥

ఆ....ఆ.... గుబగుబ గుబగుబ గుర్రములురుకగా
ఆ....ఆ......ఆ......ఆ.................ఆ..............
ధగధగ ధగధగ కత్తులు మెరవగా
మెరుపులు నేల రాలినట్టుగా
ఉరుములు భూమిని తాకినట్టుగా
రగిలే రగిలేరా మన వీరుని సైన్యం
రగిలే రగిలేరా జగధీరుని సైన్యం
జలపాతపు హోరయ్యీ... జడివానలో మెరుపయ్యీ
ఆ శత్రురాజులను చీల్చి చంపుటకు ॥కదిలే॥

ఆ.....ఆ.....కన్నులు జెదిరే కోటలు గట్టి
ఆ....ఆ......ఆ......ఆ............ఆ..............
బురుజుల మీద.... ఫిరంగులెత్తి...
దొరల ఘడీలను దెబ్బపెట్టున
నేల గూల్చగా గుర్రపు డెక్కలు

కదిలే కదిలేరా మన పాపన్న సైన్యం
కదిలే కదిలేరా మన బహుజన సైన్యం
జలపాతపు హోరయ్యీ... జడివానలో మెరుపయ్యీ
ఆ శత్రురాజులను చీల్చి చంపుటకు ॥కదిలే॥

ఆ.......ఆ......ఆగ్రహ జ్వాల ఆకాశంకేగి
ఆ......ఆ......ఆ......ఆ..........ఆ...........
బాంబుల మోత దద్దరిల్లగా
ముట్టడించి గోల్కొండ కోటని
చిత్తుగ సింహ ఘర్జన జేసి
పాలన జేసెనురా మన వీరుడు పాపన్న
గోల్కొండను ఏలెనురా పర్వాయి పాపన్న

కదిలే కదిలేరా మన పాపన్న సైన్యం
కదిలే కదిలేరా మన బహుజన సైన్యం
జలపాతపు హోరయ్యీ... జడివానలో మెరుపయ్యీ
ఆ శత్రురాజులను చీల్చి చంపుటకు ॥కదిలేII

ఆ....ఆ.... సుఖ భోగాలు.. త్యాగం జేసి...
ఆ....ఆ......ఆ......ఆ........ఆ.............
బహుజన రాజ్యం .... నాడే తెచ్చి
దలితుల పక్షం నిలిచిన వీరుడు
ధరణి కి వెలుగులు తెచ్చిన సూర్యుడు

వీరుడు సూరుడు పాపన్నా... విప్లవ వీరుడు పాపన్నా...
బహుజన సూర్యుడు పాపన్నా...


నిన్నెట్లా మరిసిపోతిమో



కాటమయ్య అంశన పుట్టి......
గౌతముని అడుగులో నడిసి..........
దలిత బహుజన రాజ్యాన్ని
తొలుతన పసిగట్టిన రాజువు
పాపన్నా... సర్వాయి పాపన్నా..

నిన్నెట్లా మరిసి పోతిమో.... ఇన్నాళ్ళు
నిన్నెట్లా ఇడిసీ ఉంటీమో..... ఇన్నేళ్ళు

కన్నతల్లికి దండం బెట్టి
బహుజనులను ఏకంజేసి
ఎల్లమ్మను నిండుగ కొలిసి
మదినిండా పండుగ జేసీ
విప్లవజ్యోతులు రాజేసి దారి జూపినా దండివి నువ్వు
పాపన్న సర్వాయి పాపన్నా ॥నిన్నెట్లా॥

వీరత్వం జూడగ పులులూ
నీ కోసం ఎదురు సూసెగా
బొమ్మలల్లే కుందేలు పిల్లలు
నినుజూసి గంతులేసెను
పాలుదాగు పసిపోరలు నీ అడుగుల సవ్వడి గనెను
పాపన్న సర్వాయి పాపన్నా ॥నిన్నెట్లా॥

సంటి పిల్లలను సంబురంగ
ఎత్తుకొని ముద్దాడినోడురా
పొగజూరిన పేదల గుడిసెల
గంజిగట్కలు తాగినోడురా
అణగారినోళ్ల నాదుకొనుటకు
బతుకుతీపి నెడబాసినావు పాపన్న....
సర్వాయి పాపన్నా...........

మనమెట్లా మరిసిపోతిమో... ఇన్నాళ్లు
మనమెట్లా యిడిసి వుంటిమో... ఇన్నేళ్లు
ఇగనైనా గొలుసూ దామనీ... ఇయ్యాలా
ఎట్లైనా ఊపుదామనీ... ఉయ్యాలా
ఇగనైనా నిలుపుదామనీ... ఈ ఆన
నీ బాటె నడుసుతామనీ... మా ఆన
ఇగ నిన్ను మరువా బోమనీ..పాపన్నా...
నీ బాట విడువా బోమని...మా ఆనా...


కన్నపేగు నాదికాదా



కన్నపేగు నాదికాదా కడుపుతీపి లేనె లేదా
కన్నబిడ్డనమ్ముకునే కసాయి దాన్నని
కంటిపాప వంటి నిన్ను కాటేసే పాముననీ
కాకులోలె పొడిసిందీ లోకమూ
కన్నెర్ర జేసిందేం పాపమూ ॥కన్నపేగు॥

సదువు సంధ్య రాని వాల్లం రెక్కలే నమ్మినోల్లం
పురుడు జేయలేనోల్లం పూటకెల్లకున్నోల్లం
ఆదుకునే దిక్కులేకా ఆగమైన బతుకు మాది
సాదుకునే వశముగాక సంపి బాయిలెయ్యలేకా
తండ్లాట జూడలేక ఓ బిడ్డో నిన్ను
అంగట్ల బెట్టినానే నా బిడ్డా.... ॥కన్నపేగు॥

కంటినిండ సోకమున్న కండ్లల్ల బెట్టుకున్నా
కలిగినోల్ల ఇంట్ల మీరు బాగ బత్తరనుకున్నా
గొట్టె రాజ్యమాయె మనది గొడ్డుబాయె నేల మనది
ఎడ్డి బతుకు ఎన్నాళ్ళింకా ఏదుకుంటే రానే తల్లీ
గుండెరాయి జేసుకుంటి ఓ బిడ్డో ఈ
గూడెమంత దిడుతున్నా నా బిడ్డా.... ॥కన్నపేగు॥

కడుపులోనె బొందబెట్టే ఇద్య మాకు రాకపాయె
కన్నగోస జూడలేకా కడుపు గట్టుకొనుడాయె
కంటిపాప వంటి నిన్ను పెద్ద జేయ లేకున్నా
సంటిదానివైన నిన్ను కాటువేసే పామునైనా

కాకులోలె పొడిసే లోకం జాలిజూపదోయమ్మా
కర్మభూమి బిడ్డా మనదీ రాత మారదనుకున్నా
పాపమంత నాదేనా ఓ బిడ్డా...ఈ
ప్రపంచానిదీ కాదా నా బిడ్డా ॥కన్నపేగు॥

కడుపులోనే బొందబెట్టే ఇద్య మాకు రాకపాయె
కన్నగోస జూడలేకా కడుపుగట్టుకొనుడాయె
సదువు మీకు బతుకు దెరువు బాటమాకు ఉన్నదంటే
కడుపుతీపి నెడబాసే కోకిలమ్మ నెందుకైతా
కన్న పేగు నాదికాదా ఓ బిడ్డో.. నేను
అందరోలె మోయలేదా నా బిడ్డా.. ॥కన్నపేగు॥


మేంవచ్చే ఈ బాటనా..



మేంవొచ్చే ఈ బాటనా .... ఓ ఎంకన్నా
మాకెదురు నువ్వొస్తావా....మా ఎంకన్నా
నిను మొక్కిన ఫలమేముందయ్యో ఓ ఎంకన్నా
మా ఆపద దీర్చవెందుకయ్యో మా ఎంకన్నా.... ॥మేంవొచ్చే॥

ఉమ్మనీటిలో పిండమునేసి
ఊపిరుదుతూ ఊసులాడుతూ
భూమిమీద బడదోసే ఘడియన
విలవిలలాడిన తల్లిబాధవు
ఈ సృష్టికి మూలం నీవైతే ఓ ఎంకన్నా
మాయజగతిలో దేవుడు ఎవరయ్యో మా ఎంకన్నా ॥మేంవొచ్చే॥

అనాద పుట్టుకలాకలి సావులు
కరువు రక్కసి కరాళ నృత్యం
భూమి బ్రద్దలై ఎగసిన సంద్రం
మట్టిగల్సెను మానవ జన్మలు
కలిమాయను గనలేకున్నావా ఓ ఎంకన్నా
కలియుగమున వెలసిన దేవుడివో మా ఎంకన్నా ॥మేంవొచ్చే॥

దేవుడున్నడని భారం నీవని
పుట్టెడప్పులతో ఉపాసంవుండీ
పొద్దుగూకులు కష్టం జేసిన
పొట్టకూటికి నోసమైతిమి
నువుజూపిన బర్కతి ఏదయ్యో ఓ ఎంకన్నా
నీ మర్మం దెల్వదాయే మాకు మా ఎంకన్నా ॥మేంవొచ్చే॥

మట్టిగుండెతో నిండుగ గొల్సి
మెట్టు మెట్టుకు బొట్టును పుదిస్తే
తలనీలాలను దీసుకుంటివి
నిలువుదోపిడీ జేసుతుంటివి
ఈ భక్తుల జూసేదెవరయ్యో ఓ ఎంకన్నా
లోకాన్ని గాసెదెవరయ్యో మా ఎంకన్నా ॥మేంవొచ్చే॥

రాతిగుండెతో మొండిబారిన
కసాయిదేవుడు శ్రీనివాసుడు
తిరువీదులలో వెలసినవాడు
అమ్మలనొదిలి మమ్ములజూడడు
ఏరాగం వినిపించేనయ్యో ఈ నల్లరాయికి
ఏ బోనం జేసి పెడుదునయ్యో ఈ బండరాయికి ॥మేంవొచ్చే॥

('జై బాలాజి' సినిమా కోసం రాసిన పాట)


ఏడు గుర్రాల రథము



ఏడు గుర్రాల రథము ఈ మూడు గిల్లల బండి
చక చక మని సాగేనండి మన పల్లే తొవల నుండి
ఎపుడంటే అప్పుడు గదిలి ఎక్కడంటే అక్కడ ఆపి
ఆపదలు దీర్చేనయ్యా మీముంగిట నిలిచేనయ్యా ॥ఏడు గుర్రాల॥

ఆప్ టికెటు లేనే లేదు అరిసి దింపే కాకీ లేదు
ఆటాన తక్కువ బడితే మాటాడక తీసూకుంటం
అందరొకటే ఆటోలల్లా పేద గొప్ప భేదం లేదు
మమతాను రాగాలె మనప్రేమా బంధాలు ॥ఏడు గుర్రాల॥

పిండి మందు బస్తాలైనా గొర్లు మేకలు ఏయి గాని
ఇసుగులేక మోసుకపోయి సేవచేసే గుణము మాది
కూలి ఖర్సు లేదు మీకు నెత్తి మోత బరువూ లేదు
మీరిచ్చే దీవెనలే మా బతుకు నడిసే బాట ॥ఏడు గుర్రాల॥

రైల్‌టేషన్ బస్టాండ్లల్లో ఆరేతిరి సినుకుల్లల్లో
ఇంటికి జేరంగా మీరు బద్రంగా తీసుకపోతం
అపుడపుడు ఆ సీకట్లో పడరాని బాధలుపడతం
ఈ ఆటో మాకాదెరువు లేకుంటే నిత్తెం కరువు ॥ఏడు గుర్రాల॥


సదువుకున్న మనకు



సదువుకున్న మనకు ఇంక ఏమ్మిగిలెరా
సర్కారు ఏదైనా ఏంఒరిగెరా
బతుకంతా రోడ్డుమీదే దినమంతా బాదబాదె
మనరాతమారదనీ సరేపోనియ్యనుకోని......
ఆటోనే నమ్ముకుంటిమో-అప్పుజేసి కొనుక్కుంటిమో ॥సదువు॥

సర్టిఫికెట్లెన్నున్నా ఉద్యోగం రాకపాయే
నిరుద్యోగి నీ బతుకు ఈగకన్న హీనమాయే
రెక్కలిరుగ పని జేసిన గిట్టుబాటు లేకపాయే
ఓరయ్యో నీ బతకు పిడ్సగట్టి సాగదాయే
ఉద్యోగాలియ్యలేము ఉపాదైతే ఇస్తమని
కల్లబొల్లి మాటలన్నీ కథలోలె జెప్పుడాయే ॥సదువు॥

లోనుకొరకు తిరిగి మనకు తిప్పలెక్కువైపాయే
ఆపీసులు బ్యాంకు సుట్టు కాల్లు అరగదీసుడాయే
పలుకు బడి జూపిస్తేనే లోను సాంక్షనైతదంట
లంచమిస్తేనే గాని ఫైలు ఇంచు కదులునంట
కనికరించి మనల నెవడు ఆదుకున్నడో..
అటో ఇటో ఆటోలె మనకు దిక్కురో... ॥సదువు॥

సెవను సీటరొస్తుంటె ఓంగార్డుల తరుముడాయే
ప్యాగోలు దిరుగుతుంటె సూడులేక ఉరుముడాయే
అడుగడుగున ఆర్‌టీవో అడ్డు దగులుకుంటుంటే
పైస పైస గూడబెట్టి ఆని పాడెనేస్తున్నం

మా పిల్లలు పస్తులతో పూటపూట సస్తుంటరు
మంచి సదువు సెప్పియ్యక వాల్లు ఆగమైతుంటరు ॥సదువు॥

కడుపునొచ్చినాగాని కాలునొచ్చినా గాని
ఆటోపనిబెట్టంగనే ఇంట్ల కూసున్నాగాని
పూటకెల్లదని తెలిసి ఆయిలు గ్రీజుల్ల మునిగి
కన్నావతారమెత్తి బతుకుబండి నడుపుతుంటె
కనికరమే లేకపాయె గవిరిమెంటుకూ
కన్నశెరలు బెట్టె మమ్ము ముంచెంటదుకూ ॥సదువు॥

బైపాసు రోడ్లమీద బస్సు యాక్సిడెంట్లు లేవ
బ్రిడ్జిమీదినుంచి దొలి జల సమాధి జెయ్యలేద
ఖర్మభూమి మనదేశం ఎర్కున్న సంగతేగా
ఎవనికెవడు పగోడయ్య ఎందుకిట్ల మారెనయ్య
మనమంతా ఒక్కటేరా కష్టజీవులం
మనకు సిచ్చుబెట్టెటోన్ని బట్టి తరిమికొడదమూ


పిల్లలం - బడిపిల్లలం



పిల్లలం బడిపిల్లలం-మల్లెలం మందారలం
పిడుగులం మేము బుడుగులం బందెట్లో మూగజీవులం
తల్లీ దండ్రీ గురువులెవ్వరూ
మా మదిలోన ఉన్నది గానరూ.. ॥పిల్లలం॥

పిట్టెలోలె గూడుగట్టాలనీ ఉంటదీ
పురుగులోలె మట్టిలాడాలనీ ఉంటదీ
సాపలోలె నీటిలీదాలనీ ఉంటదీ
కనుపాపలోలె మీరు జూడాలనీ ఉంటదీ ॥పిల్లలం॥

కాకులోలె గోల జెయ్యాలనీ ఉంటదీ
కోయిలోలె కూత గుయ్యాలనీ ఉంటదీ
దూడలోలె దుంకులాడాలనీ ఉంటదీ
దుడ్డుగట్టెతో మీరు గొట్టొద్దనీ ఉంటదీ ॥పిల్లలం॥

చెట్లోలె ఆనకు దడవాలనీ ఉంటదీ
సినుకులోలె వరద గావాలనీ ఉంటదీ
ఎద్దులోలె గుద్దుకోవాలనీ ఉంటదీ
ముద్దుతోనే బుద్ది నేర్పాలనీ ఉంటదీ ॥పిల్లలం॥

పారేటి నీలల్ల పడవలెయ్యాలనీ ఉంటదీ
పడవలో ఎక్కి తిరగాలనీ ఉంటదీ
ఆటలెన్నో ఆడుకోవాలనీ ఉంటదీ
ఆటపాటల సదువుగావాలనీ ఉంటదీ ॥పిల్లలం॥

ప్రతిరోజు బడికంటే పానం మీదికె వస్తదీ
ఆదివారమొస్తాదన్నా ధీమా ఉంటదీ
బందులొచ్చి బడులు బందుబెట్టాలని ఉంటది
ఇంటికాడ జేరి ఆటలాడాలని ఉంటదీ ॥పిల్లలం॥

అద్దమెందుకో నా సేతిలోనే పగులుతుంటదీ
తిలకం బొట్లు నూనె సీసలెప్పుడు జారుతుంటయి
అమ్మతోని మమ్ము సావు దెబ్బలు గొట్టిస్తయి
ఆ ఒక్క క్షణము మమ్ము నాన్నకు దగ్గర జేస్తయి ॥పిల్లలం॥

నెమలీకన్ను నాతో ఆటలాడుతూ ఉంటదీ
దానికాకలైతే నా చాక్పీసు పౌడరు దింటదీ
ఉడ్కపోతల నన్ను ఉయ్యాల ఊపు తుంటదీ
గిర్రగిర్రా దిరిగి నింగి నేల నవ్వుతుంటదీ ॥పిల్లలం॥

సీతాకోక చిలుక పట్టి ఆడాలని ఉంటదీ
తూమిష్కలా గుంపు వేటగాన్ని జేసి పోతదీ
తేనెతెట్టెకు రాల్లు గొట్టాలనీ ఉంటదీ
తేనేటీగల గుంపు కరవకుంటె బాగుంటదీ ॥పిల్లలం॥

అమ్మనాన్నలు మాతో ఆడుకోవాలని ఉంటదీ
అడిగింది వెంటనే తెచ్చి ఇయ్యాలని ఉంటదీ
ఊ అంటె మమ్ముల సీదరించొద్దనీ ఉంటదీ
మేము నిద్రబోకముందే నాన్న రావాలని ఉంటదీ ॥పిల్లలం॥

పుస్తకంలో మునిగి సదువుకోవాలని ఉంటదీ
బొమ్మల్ని జూస్తుంTe కడుపు నిన్నట్టయ్ తుంటదీ
వీజియస్సు విక్రమోల్ల మోత పెరుగుతున్నదీ
ఆ వర్కుబుక్కులతోని మెడలిర్గి సస్తట్టున్నదీ ॥పిల్లలం॥


నన్నుగన్నా తల్లివమ్మా...



నన్నుగన్నా తల్లీవమ్మా ఓయమ్మ
చెత్తకుండీవైనవమ్మా మాయమ్మా
మనసుగల్లా దానివమ్మా ఓయమ్మా
మనిషికన్నా మేలు నువ్వే మాయమ్మా ॥నన్ను॥

పానమున్న ఈ మనుషులకన్నా
జీవమిచ్చిన తల్లి నువ్వే మిన్నా
తొమ్మిది నెలలు పెరిగిన సోటే
మురికి కూపమని తెలిసేనమ్మా
కనికరం లేకుంట కని పారేసేనా.....
కన్నతల్లి నాకెందుకోయమ్మా ॥నన్ను॥

ప్లాస్టిక్కు పేపర్ల సప్పుళ్ళతోని
జోలపాటలు నాకు పాడితివమ్మా
చిత్తు కాగితాలు పై కెగరేసి
ఈగల్ని దోమల్ని ఊపితీవమ్మా
ఎంగిలిస్తారాకు పక్కేకేసినవే....
ఎత్తుకోని నన్ను ముద్దాడినవే ॥నన్ను॥

గుక్కపెట్టి ఏడ్చి ఎక్కిలొస్తే నాకు
పెరుగు సుక్కల పాలు అందిస్తివమ్మా
తెల్లవార్లు నువ్వు జాగాగరముండి
నాజాడ పది మందికందిస్తివమ్మా
కండ్లుండి ఈ జగతి గుడ్డిదైపోతుంటే...
పురిటి బిడ్డగ నన్ను దాసుకుంటీవమ్మా ॥నన్ను॥

దయగల్ల తల్లులు దీసుక పోయి
పాలో నీలో పోసి పెద్ద జేసిండ్రు
ఎనకో ముందో వాల్ల పిల్లలు బుట్టంగ
ఎడమసేతాబట్టి ఈసడించిండ్రు
అమ్మా అని నోరార బిలవంగా.....
అమ్మగారని పిలిసె పని జూపిచ్చిండ్రు
నన్ను సంపావైతివమ్మా ఓయమ్మా
చెత్తకుండీ తల్లీవమ్మా మాయమ్మా ॥నన్ను॥

మట్టు వాసన ఇంక బోనే లేదు
ఎట్టి పనిల పానమల్లాడుతుంది
పాలు తాగిన యాది రానే రాదు
పాలసేర్లు బలిగె పని జెప్పిండ్రు
లేతసేతులు నాయి కదలకుంటైతే...
కాల్చి పెట్టిన వాత సోపతయ్యేనమ్మా ॥నన్ను॥

తడబడే అడుగులు మారనే లేదు
తనువు పాడుగాను మారింది కొంత
జింకపిల్లని పులులు వేటాడినట్టు
ప్రతివాని చూపులు నా వొంటిమీద
వావి వరుసలు మరిసి వయసు తేడానిడిసి..
కన్నబిడ్డల చెరిచె కామంతో మగవాళ్ళు ॥నన్ను॥

చీమలు పురుగులు కాకులు కుక్కలు
పందులు బర్రెలు ఇరుగు పొరుగమ్మా
సకలజీవికి నువ్వు ఆధారమమ్మా
నువులేక ఈ జగము ఎట్లుంటదమ్మా
కడుపుతీపీ లేని తల్లులెవ్వరో.....
కచ్చితంగ నీకు తెలిసుంట దమ్మా


అమ్మా నేనేమి....



అమ్మా నేనేమి జెప్పనే ఈ లోకం తీరే గమ్మతి
మాయమ్మా నేనెట్ట బతకనే ఈ మనుషుల తీరే గిట్టది ॥అమ్మా॥

తల్లీబిడ్డల నడుమ తండ్రీ కొడుకుల నడుమ
కన్నప్రేమా నేడు కరువాయెనమ్మా
అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య
రక్తసంబంధాలే మయమయ్యేనమ్మా
వావి వరుసలు నేడు మాటవరుసకు లేవు
మనిషి మనిషికి మద్య యుద్ధమే పుడుతుంది ॥అమ్మా॥

శివుడు శ్రీరాముడూ బొజ్జ గనపయ్యాల
మట్టి బొమ్మల జనము బద్రంగ జూసేరు
ముక్కు సెవులు సెయ్యి యిరిగిపోకుండాను
గట్టికాపల నడుమ తెచ్చి పూజించేరు
కన్న తల్లిదండ్రులకాపదొచ్చినదంటే నేడు
సూసేటోడు ఆసరయ్యెటోడు లేడు ॥అమ్మా॥

పైస కోసమె జనము పాకులాడుతుండ్రు
నీతి న్యాయం మానవత్వమేడుందమ్మా
పార్టీల వేటంత పదవి కోసమెనంట
ప్రజల బాధ దీర్చెటోడు ఎవడమ్మా
నిజము జెప్పేటోన్ని సైసడెవడూ సూడు
నిక్కచ్చిగుంటోన్ని దరిజేరనియ్యరూ ॥అమ్మా॥

సదువూకున్న జ్ఞానమంత ఎగిరిపోయి
మూఢనమ్మకాల భజన జేస్తుంటరు
రంగురంగుల పూస గవ్వపెంకులతోని
ఆదిమానవులోలె మెడ హారమేస్తరు
ఏకముఖి రుద్రాక్షకెంతయిన బెడతరు
ఏనాడు తనవాళ్ళకు ఎడమ సేతెయ్యరు ॥అమ్మా॥

నోములు పూజలు రథమందు ఏముందో
యోగివేమన ఫూలె అంబేద్కరే చెప్పే
మహనీయుల మాట చెవిన బెట్టక మనము
గంగిరెద్దులోలె గడ్డి దింటున్నాము
వరుణయాగం జేస్తే ఒరుపిచ్చె కాలము
ఒక్క సినుకూ లేదు ఇదిఏమి యాగము ॥అమ్మా॥

ఉండేదే ఒక్కడు లంకంత కొంపలా
ఎకరాల భూమినీ కబ్జాబెడుతుంటడు
అక్రమాలకు మరిగి అవినీతి సొమ్ముతో
న్యాయదేవత కండ్లు గట్టేసి పోతడు
సస్తె తీసుకపొయ్యేదేమి లేదని తెలిసి
మరిసిపోయిన మనిషి మానవత్వం మరిసే ॥అమ్మా॥


ఎంతాని జెప్పుదూ...



ఎంతాని జెప్పుదు దేవూడో
ఏలేటి మారాజు లీలలు
ఎందెందు వెతికినా దేవుడో
అందందు అవినీతే నాయనా ॥ఎంతాని॥

దగ్గూతో దమ్మూతో మూల్గేటి ముసలోన్ని
రిక్షాలో ఏసూకా దవఖానకు బోతే
గేటూకాడా మొదలు ఐదు పది రూపాలు
ఇస్తేనే లోపలికి పంపిస్తనంటారు
నర్సులు డాక్టర్ల సంసారమే సాగు
రోగుల్ని జూడంగ దరిజేరారొక్కరూ
కాలీగ బెడ్లున్నా కసిరిచ్చి పెడతారు
బెడ్లులేవని చెప్పి నేలా మీదేస్తారు
పైసాలిచ్చేకాడా నాయనో....
పదిమంది సెయిజాపె దేవుడో.... ॥ఎంతాని॥

కార్పొరేటు దావకానలోని వాల్లు
కనికరమే లేనోల్లు కండ్లు లేని వాల్లు
ఒట్టి జరమే సారు వొచ్చింది నాకంటే
కాదుకాదు నీకు క్యాన్సరే ఉందండు
ఆరోగ్యశ్రీ వైద్యం ఆపరేషనె ముందు
పెట్టేది రూపాయ కొట్టేది పదివేలు
ఆరు రోజులు దిప్పె అరగంట టెస్టూకు
కన్నాతిప్పలు బెట్టే పల్లేటూరోల్లను

పానాలే పొయనంకా నాయనో....
పైసాలడుగుతారు దేవూడో... ॥ఎంతాని॥

బస్సు దొరకానోల్లె ఎక్కి కూసుండ్రంత
వన్నాటు యైటంట వొర్లూకుంటురింది
వన్నాటు ఫోరంట ఎవనికోసమొనంట
ఒక్కాటి సత్తెంగ లేనె లేదని అంట
గవిరిమెంటు వైద్యం గతిమల్లెదైపాయె
ఆరోగ్యశ్రీతోని ఆయింత కరువాయె
మెట్లెక్కిపోతుంటె ఐదొందలంటారు
ఆ కాస్త పానాన్ని ఐసూలో పెడతారు
కోట్లు ఖర్సూబెట్టి నాయనో...
ప్రైవేటు బాటాయె దేవుడో... ॥ఎంతాని॥

ఇందిరమ్మ ఇండ్లు ఒక్కడిరవై పొందు
ముసలోల్ల పెన్షండ్లు ఏలిముద్రలె ముందు
సచ్చినోల్లకె సగము వొచ్చినోల్లకు లేవు
అధికారమనె గుత్ప సేతా బట్టుకుండ్రు
ఆడపిల్లల సొమ్ము ఎటుబాయెనో సూడు
ఆపద్బందు పథకం ఇచ్చినోడే లేడు
ఊపాధిహామంట కాంగ్రేసోల్లకె పంట
పేరూకే వందంట ఇచ్చేదిరవాయంట
అధికార్ల అండతో నాయనో....
ఆసామి కూలోడే దేవుడో... ॥ఎంతాని॥

భూమున్నా లేకున్నా బుద్దున్నా లేకున్నా
ఎద్దున్నా లేకున్నా ఎవసాయం రాకున్నా

కందిసేనును జూసి పజ్జొన్న సేనన్నా
పత్తిసేనును జూసి వొత్తి సేనంటున్నా
మంత్రుల్ని జూడంగ పైకంతా ఉత్తములే
మాయమాటలతోని మనలా ముంచెటోల్లె
కాంగ్రేసు నాయకుడై కర్రదిప్పితె సాలు
వొచ్చిపోయె మంత్రీకొంగి మొక్కితె సాలు
ఆదర్శ రైతతనే నాయనో....
ఆదరణ మనకింకా ఎట్లానో... ॥ఎంతాని॥

అంగన్‌వాడి కొలువూ అంగట్లో సరుకేగా
పాలకుల నిర్వాకం అసలోనికెసరేగా
తడిలేని బతుకంతా ఎండీ నెర్రెలాయె
తనబతుకు రోజింత హీనమయ్యిపాయె
లంచమడిగేటోల్లా కనిపెట్టే టోడెవడూ
అవినీతి పరులనూ శిక్షించెటోడెవడూ
అన్యాయామై పాయె బీదలూ....
ఆగమ్మా పచ్చూలే బాధకూ.... ॥ఎంతాని॥

అమ్మా జూడు అభయ హస్తముందంటాడు
ఆపధ్భందు పథకం ఇచ్చినోళ్ళే లేరు
మీసేవే మాదంటూ ఎన్నెన్నో జెప్పుతారు
నీతిలేని పథకాలు ఎన్నెన్నో అల్లుతారు
భారి సాయమేదో బాగా జేసినట్టు
బంగారు తల్లీని బదునాము జేస్తారు
గెలిసినంక అన్నిమరిసి మనలనిడిసి తిరుగుతారు
మళ్ళీ ఐదేండ్లాకు ఓట్ల కోసం వస్తారు
వలసాంధ్ర పాలనా దేవుడో...
వొడువాని దుఃఖమే దేవూడో... ॥ఎంతాని॥

చెరువు కుంటాలన్ని మాయమయ్యి పోతున్నా
చెలిమలూరే వాగు వంకాలెండుతున్నా
నీళ్ళు లేక పల్లె తల్లడిల్లుతున్నా
నీడా లేక ప్రజలు గోడెల్లబోస్తున్నా
విపరీతమై ధరలు వలపోతబోస్తున్నా
విద్యుత్తు బిల్లులు విల్లంబై గుచ్చినా
విద్యా ఉద్యోగాలు వ్యాపారమైతున్నా
విలువగల్ల బతుకు బుగ్గి పాలైతున్నా
కనదాయె కాంగ్రేసు దేవుడో...
కండ్లున్న గుడ్డిదే నాయనో.. ॥ఎంతాని॥

విద్యా వైద్యం నేడు వీధిపాలైపాయె
విద్యార్థుల బతుకు ఆత్మహత్యలాయె
రాజధాని ఢిల్లీ రణరంగమైపాయె
కామాంధుల క్రీడ దినగండమైపాయె
కాంగ్రేసు పాలన కారాగారామాయె
కన్నీటి కాపురాలెన్నో గూలిపాయె
సర్కారు సేతలు సావు మార్గమాయె
సంహారమే సాగే సంగ్రామమే సాగే
బతికేటి యాళ్ళనే లేదురో...
మా బాధల్ని దీర్చేది ఎవ్వరో....


కడుబీదల బతుకుల్లో...



కడుబీదల బతుకుల్లో వెలుగు నింపగా తెలంగాణలో
కదిలిండు జననేత సూర్యతేజమై జనందారిలో ॥కడు॥

అన్నదాత రైతన్నకు ఆపదేందనీ
ఆత్మహత్యజేసుకునే కాలమేందనీ
అగ్గిపెట్టెలో పట్టే చీర నేసినా
బుగ్గిపాలు అయిపోయిన బతుకులేందనీ
కుటీర పరిశ్రమలు కూలుడేందనీ
కూడులేక పేదలు అల్లాడుడేందనీ
పటపటమని పండ్లుగొరికి కదులుతున్నడో జనందారిలో
తొడగొట్టి సవాలిసిరి సాగుతున్నడో జనందారిలో ॥కడు॥

చెరువుకుంటలా జాడా యాడలేదనీ
సేతివృత్తులా సేతులు ఇరిగెనేందనీ
గంగవరంపోర్టుకాడ బెస్త బోయులు
గతిలేని వాల్లుగ మిగిలున్నరేందనీ
కులవృత్తీదారులను కుప్పగూల్చగా
అభివృద్ధి ఫలాలను దోసుడేందనీ
అందరినీ ఏకమయ్యి కదలమన్నడో జనందారిలో
అదునుబోతె రాదు అడుగులెయ్యమన్నడో జనందారిలో ॥కడు॥

తాగనీల్లులేక తనుకులాట ఏందనీ
ఫ్లోరిన్ ఇసమునీళ్ళ శాపమేందనీ
దగ్గుదమ్ము గోలిలేదు దవాఖానలో
మందులన్ని మనమె కొని సచ్చుడేందనీ

మురికివాడ పేదలను సూడరేందనీ
అంధులు వికలాంగులంటే చులకనేందనీ
నిలువెల్లా రగిలిపోయి నిప్పుజెరిగెనో జనందారిలో
తెలంగాణ గోడు జూసి తల్లడిల్లెనో జనందారిలో ॥కడు॥

అధికారుల అవినీతి పెరిగెనేందనీ
అడుగడుగున అన్యాయం జరిగెనేందనీ
చెమటోడ్చిన బతుకెళ్ళక గడుపుడేందనీ
ఉప్పిడి ఉపవాసంతో ఎండుడేందనీ
తెలంగాణ సాధనకై తరలి రమ్మని
తెగబడి కొట్లాడె గుండె బలము నీదని
మూడున్నర కోట్ల ప్రజలనొకటి జేసెనే జనందారిలో
అమరులాశయాల సమరశంఖమూదెనె జనం దారిలో


నోటికదుపులేదా నీకు..



నోటికదుపు లేద నీకు మంత్రీగారు
గెలిసి గద్దెనెక్కి మీరు మాట్లాడ్తరు ॥నోటి॥

ఉల్లిగడ్డ గొయ్యబెట్ట ఏడ్పిచ్చి సంపుతుంది
కొత్తిమీర కర్రెపాకు కొనలేరని నవ్వుతుంది
మంచినూనె మందలిస్తె మసిలి మీద జిల్తుంది
తాలింపు గింజలన్ని తల్లడిల్లి తంతుంటే ॥నోటి॥

టామాట మారుమాట లేని భేరమయ్యెనంట
దొసకాయ రేటడిగితె నోరు సేదు గొట్టెనంట
బెండకాయ బీరకాయ బెంబేలెత్తించెనంట
నలబై కిలగొనగలిగితె నవ్వుకుంటొచ్చెనంట ॥నోటి॥

కోపను బియ్యందెచ్చి వండుకొని తినేమాకు
పచ్చిపులుసు పప్పుచారు కారం పచ్చడె మాకు
చింతపండు చెట్టెక్కే చింత దప్పదాయె మాకు
పచ్చడ కారాలు నూరె నోరు మండె మీ ఘాటుకు ॥నోటి॥

పెసరుపప్పు దినబోతె కసరు కసిరి గొడుతుంది
కందిపప్పు కొందమంటె తీసి వంద బెడుతుంది
ఎర్రపప్పు శెనిగెపప్పు ఎర్రిలేపి సంపుతుంది
శనివారం ఎంతమొక్కు ఒక్కపప్పు ఉడుకదాయె ॥నోటి॥

బియ్యం పప్పు ఉప్పు ఉల్లిగడ్డ సింతపండు
మనకున్నా లేకున్నా మందికి ఎగుమతి మెండు
అందరికీ సాయమిచ్చే అన్నపూర్ణ మనదన్నరు
గొప్పలకుబోయి మనం సిప్ప బట్టుడెందుకంట ॥నోటి॥

పప్పు రేటు పెరిగిందా తినకుంటే ఏందన్నవ్
పనికిరాని ఓటర్లు పడిఉంటే మేలన్నవ్
దొడ్డు బియ్యమూ స్టాకు బొచ్చెడంత ఉందన్నవ్
సన్నాబియ్యం మాకు అవసరమేముందన్నవ్ ॥నోటి॥

గబ్బూడని సబ్బులెన్నో అదుపులేని అమ్మకాలు
డిటర్జెంట్స్ కాస్మొటిక్స్ ఎవరడుగును మోసాలు
సైజులు తగ్గించి వాల్లు రేట్లను పెంచేస్తుంటరు
ఒక్కపూట న్యాయానికి వందలేండ్లు దిరుగాలె
నియంత్రించినోల్లు లేరు నిమ్మకు నీరే మీరు ॥నోటి॥

పసిపిల్లల పుస్తకాలనెప్పుడన్న జూసిండ్రా
పదిపేజీలుంటే సాలు రేటు నూటముప్పయంట
ఎల్‌కేజి సదువు కొరకు పీజి ఖర్సు మించెనంట
సదువుకొనాలేనోల్లను ఎన్నడన్న ఆదుకుండ్రా ॥నోటి॥

ఎన్ననినే జెప్పుకుందు ఏ నెంబరుకని జేద్దు
అడుగడుగునా దగాకోర్లు అధికారుల అవినీతే
పరిపాలన సక్కగుంటె పకడ్భందిగమలైతే
ఏండ్లకొద్దిగా మేము ఎనుకబడే ఎట్లుంటం ॥నోటి॥


కలిగంజికి లేని (బాల్యం 1098)



కలిగంజికి లేనీ బతుకులు
కన్నోళ్ళను వీడిన తల్లులు
కన్నబిడ్డనే సాదలేని ఈ దారిద్రం మనకేందమ్మా
కసాయి లోకం కత్తులబోనులో పారేస్తివి ఏందమ్మా
నను ఏరేస్తివి ఏందమ్మా
పసితనమంతా పామునీడలో బతకకమంటివీ ఏందమ్మా
నను సావమంటివీ ఏందమ్మా ॥కలి॥

కలగన్నానే కమ్మని బాల్యం కనరాలేదే తీయని లోకం
కలిగినోల్ల పాదాలకాడ నన్నొదిలి పోతివి ఏందమ్మా
కమ్మని అమ్మా పిలుపుకు నన్ను దూరం చేస్తివి కదనమ్మా
ఎందుకె నన్ను ఎడబాపినవు
ఆటపాటల రంగుల లోకం అందించేదిక్కెవరమ్మా ॥కలి॥

బడిలో చదివే భాగ్యమే నాకు ఇవ్వనే లేదే బ్రహ్మే నాకు
కటిక దరిద్రం కడుపు నిండగ కండ్లనీల్లు పురుడోసుకుంటయి
కలాముఅబ్దుల్ సచిన్ సానియా కాలేమని కంగారు పడతయి
బందీ అయిన లక్ష్యం మాది.
ఆశల సౌధం కన్నల నిండగ ఆదుకునే దిక్కెవరమ్మా ॥కలి॥

అవమానాలే నిత్యం నాకు అమ్మా నాన్నే తీరని లోటు
అందరు పిల్లలు కార్లు మేడలు కాన్వెంట్ స్కూల్లో ఆడుతరమ్మా
ఆకలి దూప అన్నదమ్ములై కన్నీళ్లే నాకక్క చెల్లెలై కలిసేనమ్మా
ఎవ్వరు లేని ఏకాకిని నేను
అందరున్న ఈ అంధకారమున వెలుగునింపె దింకెవరమ్మా ॥కలి॥

సమతా మమతే సాధ్యం కాదా సంసారాలే సంద్రం తీరా
మాతృత్వం నీ మమకారాన్ని పెంచలేదుగా
నాన్నకు నేను గుర్తురానుగా
కవుల కల్పనే రాగబంధము కాకుంటే ఈ కథ ఏందమ్మా
ఎందుకె నన్ను ఎడబాపినవు
ఆట పాటల రంగుల లోకం తీయని బాల్యం ఏదమ్మా ॥కలి॥

నేనెవ్వరినే ఈ లోకంలో నేలకు రాలే తార జన్మలో
ఏడు ఏండ్లకే ఈడు పిల్లలని కామపు కత్తులు విసిరెను లోకం
ఏమి దెలువని పసికందులను కడుపుజేస్తరు కాటికిదోల్తరు
ఎదురే లేని యజమానులుగా
కాలిన చేతులు కడుపుబిండినా కన్నబిడ్డ నీకందదు గదనే ॥కలి॥

స్నేహితునోలే చేయందిస్తే స్వార్ధంలేనీ చెలిమే ఉంటే
చెలిమలో నీరై సెలయేరై నే ప్రవాహమల్లే పరవశించనా
అలలే నాకు ఆదర్శంగా అలుపులేక ఈ ప్రపంచాన్నినే గెలవగలేనా
ఎవరెస్టయినా ఎదురేదైనా అధిరోహించగ
అందరమొకటై బంధనాలను తెంచివేద్దము

('బాల్యం 1098' టి.వి సీరియల్ టైటిల్ సాంగ్ కోసం)


నేనిప్పుడడుగుత



నేనిప్పుడడుగూత చెప్పు
నువ్వు దాసిపెట్టిన గుట్టు నిప్పు ఆర్యా
నేనిప్పుడడుగూత చెప్పు
ఇన్నాళ్లు గుండెల్లో గూడుగట్టిన బాధ
డప్పు సప్పుడయ్యి దరువేసేటప్పుడు ॥నేనిప్పు॥

జంభూద్వీపం నిండ ఉన్నా నాగజాతిని జంపంగ మీరు
సర్పయాగం జెయ్యలేదా మాకు శాపాలెన్నో బెట్టలేదా
ఉత్త పుణ్యానికే ఉరెల్లగొట్టంగ
స్ముృతులు పురాణాలు సృష్టించలేదా ॥నేనిప్పు॥

మీ సప్త మహారుషుల కన్నముందున్న ఈ జాంభవంతుడు
సకల సంపద మెండు గుండి జంభూదీపమునేలుతుంటే
బతుకుదెరువూ లేక దేశ సంచారంతో
అడ్డదారినొచ్చి కుట్ర జెయ్యాలేదా ॥నేనిప్పు॥

బ్రహ్మ సత్యామంటిరయ్యా అయ్యో జగతి మిద్యా అంటిరయ్యా
శూన్యవాదం దెస్తిరయ్య మాయవాదం బెడితీరయ్యా
బౌద్ధంలో బ్రాహ్మలు చేరి ఆగంజేసి
బుద్ధుడు మావిష్ణు రూపమంటిరీ గాదా ॥నేనిప్పు॥

అక్షరాలన్నిటినీ మీరు పరబ్రహ్మ స్వరూపమన్నరు
కాలమె నేనని చెప్పి సృష్టిమూలమయ్యే విష్ణువు
రెండువందల కోట్ల ఏండ్ల కింద బుట్న
ప్రకృతిని మీ పరము జేసుకున్నారెట్ల ॥నేనిప్పు॥

హరప్పాతోనే మొదలు అక్షరాలు బుట్టినట్టు
చరిత దెలుసుకోలేదా నువ్వు ఏడ జూసి రాలేదా
లిపిలేని కాలాన రుగ్వేదమెట్లొచ్చే
అన్నిటికీ మూలంబు వేదాలు ఏట్లాయే ॥నేనిప్పు॥

ఆర్యా త్రై వర్ణికంటూ వర్ణాలతో వేరుజేసీ
సూదరోల్లను విడదీసి పంచములను ఈసడించి
కర్మకాండల్ని సృష్టించి బ్రమలెన్నో పుట్టించి
నక్క జిత్తుల ఏషమెందుకేసినట్టు ॥నేనిప్పు॥

చార్వాక లోకాయతులు మీకెదురు దిరిగిన వాల్లుగాదా
శిరమెత్తినా శంభుకున్నీ మీరు శిరసును ఖండించలేదా
మూలవాసుల్నంత ఒకజాతి బిడ్డలుగ
చేయదలసిన నందరాజుల్నెవడూ జంపే ॥నేనిప్పు॥

మహ్మదీయులైన గానీ అయ్యో మౌర్య రాజులైన గానీ
ఎంతటి మహరాజులైనా మీ ఆదిపత్యం లేకపోతే
ఊము మింగాకుంట ఊపిరాడకుంటా
కాళ్ళబంధమోలె అడ్డు దగలా లేదా ॥నేనిప్పు॥

ఆదిమా కాలాన మనిషి ఆహార వేటలో అలిసి
ఆకలయ్యి ఉన్నపుడు సచ్చిపొయిన జంతువులనూ
తోలు వొలిసి సుద్దిజేసి ఇచ్చి మీకు
వొంటికి రక్షణ ఇచ్చింది ఏవరూ ॥నేనిప్పు॥

కొండల్లో బండల్లో రన్నా దేవుండ్ల కాల్లు గాలుతుంటెరన్నా
అయ్యో ఏడు కొండల ఎంకన్న కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా
మనసు గరిగీ మా దళిత జాతి ప్రేమ
చేతుల్ని చెప్పులుగ చేసియ్య లేదా ॥నేనిప్పు॥

మమ్ము బానీసల్ని జేసినారు మీరు స్వేచ్ఛా జీవులయ్యినారు
లేని దేవుండ్ల సృష్టించినారు నడుమ పూజారులై నిలిసినారు
యాడ ఉన్నా గాని పిలిసి కాల్లు మొక్కి
కట్న కానుకలిచ్చే కథ జెప్పి పోలేదా ॥నేనిప్పు॥

మట్టి నించి బువ్వదీసి మీ పొట్ట నింపిందెవ్వరయ్యా
కంచు ఇనుము బంగారం కరిగించి పనిముట్లు జేసిస్తే
అంటు ముంటు జాతి సూదరోల్లని మమ్ము
అన్నిటికీ దూరంగ ఉంచ కారణమేందీ ॥నేనిప్పు॥

సావు పుట్టుక ఏదీ గాని మమ్ము ఇడిసి పెట్టినదేడ నువ్వు
ఇల్లుగొన్నాగాని నువ్వే అయ్యో బండి గొన్నాగాని నువ్వే
మంత్రాలు జదువంగ మషిబొట్లు బెట్టంగ
ఇండ్లుగూల లేదా యాక్సిడెంట్లు లేవా ॥నేనిప్పు॥

మక్కాకు బోయిన జనము అయ్యో తొక్కులాటల జావలేదా
అయ్యప్ప అనుకుంట వస్తే గాకొండ గూలి సావలేదా
శిలువెక్కినా ఏసయ్య మల్లెట్ల దిగివచ్చెనయ్యా
దేవుడంటూ బోతే గాశారమెంటొచ్చే
మనమంటే పాపులం పసిపిల్లలేంజేసే ॥నేనిప్పు॥

నేనిట్ల అడిగీతే మీరు ఆ వేదాంతమే జెప్పుతారు
పూర్వ జన్మల పాపమంటరు మీ పుక్కిటి పురాణ మిప్తరు
కర్మ సిద్ధాంతాల కట్టుకతలు జెప్పి
ఎన్నాల్లు మమ్మింక మోసాలు జేస్తారు

మీ ఆటలిగ జాగవయ్యా మాయా మంత్రాలు ఆపాలయ్యా
ఎర్రిగొర్లను మమ్ముజేసి అయ్యో ఎడ్డి జీవాలను జేసి
ఏలుకేస్తే కాలుకేసేటి మిమ్మూల
ఎదిరించె జాంభవులు భూమ్మీది కొచ్చే


ఆదిజాంభవంతుడ నేను



ఆది జాంబవంతుడ నేను ఆది శక్తి వంతుడ నేను
జంబు రాజ్య పాలన జేసిన ఆదిమహారాజును నేను ॥ఆది॥

ఆదిమా కాలంలోన గుంపుగా బతికిన మనిషి
జంతువోలె దిరిగినపుడు సొక్కిసోలి అలిసీనపుడు
ఏటాడి ఆకలి దీర్చగ బోయలై నిలిసేనయ్యా
నీటిలోన సాపను జూసి పట్టి తెచ్చె బెస్తాలయ్యా
తినగల్ల ఆకుకూర ముందు దెలిపె ముదిరాజయ్యా ॥ఆది॥

ఆపదల్లో దాపుగుండి కాపుగాసె బంటోలయ్యా
సచ్చిపొయిన జంతువులను సుద్దిజేసె మాదిగబిడ్డ
కుంట సౌడుమన్ను దెచ్చి కుండజేసె కుమ్మారన్న
పనిముట్ల అచ్చులుబోసి కంచుగరగబోసిన గుంపు
కొలిమి మంటకాడ రగిలి పదును బెట్టే కమ్మారన్న ॥ఆది॥

కాడిమేడి నాగలి గొర్రు బండి జేసె ఒడ్లోలన్నా
పనులల్లో అలసిన వాళ్ళ దూపదీర్చె గౌడన్నా
సబ్బండ జాతులు గలిసి ఒక్క తీరుగున్నా రాజ్యం
బాధలేయి లేకా జనము కలిసి కట్టుగున్న రాజ్యం
సంచార ఆర్యాజాతిని సావుతిప్పలు బెట్టిన వాన్ని ॥ఆది॥

చెట్టు పుట్ట గుండు గుట్ట పచ్చనీ ప్రకృతి వొడిలో
సేదదీరి పెరిగినాము గంగవొడిలో ఆటాడినము
జాముపొద్దులు జూసీ మేము జాములెల్లదీసినాము
అమ్మతల్లికి మొక్కి మేము ఆదమరిసి బతికినాము
కట్టు కతలుజెప్పే వాళ్ళను కన్నశెరలు బెట్టినాము ॥ఆది॥

కులము మతము లేకా జనము కూడి ఉన్న కాలంమాది
మనుషులంత ఒక్కతీరు గుంపుగున్న సంఘం మాది
సంపదెంత సృష్టించినను సంఘబంధమొకటేనయ్యా
వస్తు బదులు దీసుకోని ఆపదెల్ల దీసినమయ్యా
వేదమంటూ మాయావాదం జంభూద్వీప చరితను మింగే ॥ఆది॥

ఆకాశ దేవుండ్ల వాల్లు శూన్యంలో సృష్టించిండ్రే
అవతార కథలు జెప్పి రాక్షస జాతిని జేసే
కుట్రజేసి మానవజాతిని విభజించిన మనువుగాన్ని
కుతికబట్టి సావగొట్టే నా జాతి బిడ్డలు బుట్టే
జాంబవా తాతా అంటూ నన్ను తట్టి లేపి నిలిపే ॥ఆది॥

సిందోల్ల రాగంలోన సిందేసి ఆడుత నేను
ఒగ్గుడోలు మద్దెల్లోన నాదమై పలుకుతాను
మాష్టోలు జేప్పే కథలో నీతిగా నిలబడతాను
గొల్ల కురుమ ఏషంలోన డప్పుల దరువైతాను
నక్కబుద్ది ఆర్యాజాతిని నడుములిర్గ దన్నుతాను ॥ఆది॥

నేను ఈసడించినోడు డొక్కలోన బుట్టినోడు
ఢక్కలోడు నాబిడ్డ కండ్ల నిండ దిరుగుతుండు
బుద్ధుడు పూలె పెరియార్ నారాయణ గురువును జూడు
బహుజనా వీరుడు సర్దారు సర్వాయి పాపని జూడు
కలియుగము గాదురా ఇపుడు కల్కికి సోటేలేదు ॥ఆది॥

అష్ట కష్టాలనుభవించి సదువు రాళ్ల శిఖరము నెక్కి
జాతినుద్దరించా దలసే జగతి రత్న అంబేద్కరు
యాడజూడు ఎనకాటోలె మూలవాసి గుంపులేరా
ఊరికొగడు లేనివాడు రాజ్యమేలుతున్నాడేందీ
బహుజన దలితాసేన బంధూకెత్తిన సైన్యం నేను ॥ఆది॥


రగిలింది యువజనం...



రగిలింది యువజనం - కదిలింది మహాజనం
పిడికిలెత్తి బహుజనం - పల్లవించె నా గళం
పదపదమని పదనిసలతో పందెమాడె ఈక్షణం ॥రగిలింది॥

ధృవప్రాంతపు నక్కలుగా వలసొచ్చిన ఆర్యజాతి
మనవాళ్లను కొల్లగొట్టి మన సంపద దోసెననీ
సంఘర్షణ జరిగి జరిగి సంక్లిష్టత ముడివీడి ॥రగిలింది॥

ప్రకృతి శబ్దాలతో భీతిల్లిన సంచారులు
అర్ధంలేని వ్యర్థ పదాలెన్నో ఉచ్చరించి
సృష్టిగతిని మార్చేసే మహామంత్రమిది యంటే ॥రగిలింది॥

అవతార కథలుజెప్పి అజ్ఞానం పెంచెననీ
దేవుండ్లను సృష్టించి మూడంలో ముంచెననీ
పొంతనలేని గీతను మన రాతగ జేసెననీ ॥రగిలింది॥

ఎస్సి ఎస్టీ బీసీలు మైనార్టి సోదరులు
అగ్రకులా శూద్రులార మూలవాసులం మనమని
మూలాలను శోదించి - మార్మికతను ఛేదించి ॥రగిలింది॥

మనచరితను ఘనచరితను మట్టిలోన కలిపినట్టి
బ్రాహ్మణులను దునుమాడగ మనువాదుల మంటగలుప
మనవాదం వినిపించగ పెను ఉప్పెన కెరటమై ॥రగిలింది॥

మనతత్వమె మానవత్వమై జగతిన వెలుగొందగా
జంబూ ద్వీపమునేలిన ఆది మహా రాజయినా
జాంబవంతునీ అంశగ సాగిందీ మహాజనం ॥రగిలింది॥


అన్నరారో... మల్లన్న లేరో



అన్నరారో మల్లన్న లేరో
గొల్ల కురుమ గొంగడేసి ఆడెలేరో
అన్నరారో బీరన్న లేరో
వొగ్గుడోలు గల్లుగల్లు మోతలేరో
            ఢిల్లెం భళ్ళెం - ఢమరుక నాదం
            సదరన్ పండుగ - సందడి జేద్దం
            దున్నకుర్ర కాలుదువ్వి రంకెలేయగా
            దుంకులాడి భలేభలె దుమ్మురేపగా ॥అన్నరారో॥

చంద్రవంశ రాజులయ్యి అన్నలారో
చంద్రవంక జుట్టెనయ్య అన్నలారో
క్షత్రీయ పుత్రులయ్యి అన్నలారో
యుద్ధాలు జెసెనయ్య అన్నలారో
యయాతి వీరులయ్యి.... యశోదమ్మ బిడ్డలయ్యి
యాదవరాజులయ్యి అన్నలారో...
యాడజూడు ఉంటరయ్య అన్నలారో... ॥అన్నరారో॥

పూజగొల్ల కర్ణగొల్ల అన్నలారో
ఆలగొల్ల ఎర్రగొల్ల అన్నలారో
అరవయ్యారు తీర్లయ్యి అన్నలారో
ఆవులే గాసినారు అన్నలారో
ఎదురు లేని మనుషులయ్యి ... ఎవుసమే జేసినారు
రాష్ట్రకూట రాజులయ్యి అన్నలారో.....
రాజ్యమే ఏలినారు అన్నలారో... ॥అన్నరారో॥

గోలు కొండ గొల్లకొండ అన్నలారో
గొల్లగట్టు పెద్దగట్టు అన్నలారో
శ్రీశైల మల్లన్న అన్నలారో
చెరువుగట్టు లింగన్న అన్నలారో
ఏడుకొండలోడు సామీ........ ఎంతసక్కనోడు సామీ.....
సందిగొల్లవాడు సామీ అన్నలారో....
తలుపుదీస్తే నిద్రలేసి నవ్వెనేరో... ॥అన్నరారో॥

అన్నరారో మల్లన్న లేరో
ఆలమందలాగమాయె సూడవేరో
అన్నరారో బీరన్న లేరో
ఆపదెల్ల కాపరయ్యి కాయవేరో

విష్ణుమాయలంట జూడు అన్నలారో
ఆవురూపు దాల్చెనంట అన్నలారో
బొల్ల్యావు తానయ్యి అన్నలారో
కాటమయ్య కాపుగాసె అన్నలారో
కుదురుగుంటె ఆలమంద... కూసోని ఆడవచ్చు.....
బెదిరిపోతె ఆవులన్ని అన్నలారో....
దేశపచ్చులైతమయ్య అన్నలారో. ॥అన్నరారో॥

సారంగధరుడంట అన్నలారో
సాహసాల వీరుడంట అన్నలారో
హోయసాల రాజులంట అన్నలారో
హోరెత్తి దునికెనంట అన్నలారో
సేనాని ఎర్రయ్య... సేవజేయ కదిలెనంట....
కాటమారాజుకేమో అన్నలారో.....
కాళ్ళు జేతులాడవాయె అన్నలారో.... ॥అన్నరారో॥

నీతిగల్ల జాతికేమో అన్నలారో
నిలువ నీడ లేకపాయె అన్నలారో
ఎదురుబడితె యాదవులు అన్నలారో
ఎదురేగి శానార్థి అన్నలారో
పాలు పెరుగు సల్లబోసి ... పాయిరంగ సాదినోల్లు......
పాడుబడ్డ బీడుల్లో అన్నలారో.....
గొల్లగొడునెల్లదీసె అన్నలారో.... ॥అన్నరారో॥

గొర్రె దిరిగె సోటు లేదు అన్నలారో
గొర్లు బతికె యాళ్ళ లేదు అన్నలారో
నీతిగల్ల జాతికేమో అన్నలారో
నిలువ నీడ లేకపాయె అన్నలారో
పుల్లారెడ్డి స్వీటొచ్చె... మల్లారెడ్డి మటనొచ్చె....
సమైక్యాంధ్ర పాలనలో.... అన్నలారో......
సావలేక బతికినాము... అన్నలారో.... ॥అన్నలారో॥

మొగిలిపువ్వు ఆసనంట అన్నలారో
మొనగాళ్ళ కెరుకనంట అన్నలారో
మల్లెపువ్వు మత్తులంట అన్నలారో
మాకు ఏమి దెల్వదంట అన్నలారో
మనువుగాని వారసులు... మాయ మాయ జేసెటోల్లు...
మంకుపట్టు నిడువకుంట అన్నలారో....
మమ్ము ఎర్రిగొర్ల జేసి ఆటలాడెనేరో.. ॥అన్నరారో॥

మారెమ్మ పోషమ్మ అన్నలారో
మైసమ్మ ఎల్లమ్మ అన్నలారో
గంగమ్మ తల్లికి అన్నలారో
ఘనమైన పూజజేసి అన్నలారో
బంధారి మింగి మేము .... బాధలెన్నొ పడుత వుంటె...

చెటు పుట్ట లమ్మినారు ... అన్నలారో...
కొండ గుట్టలన్ని కూలగొట్టె నేరో..... ॥అన్నరారో॥

గావుబట్టి సంపెటోన్ని అన్నలారో
పొట్టేలు పట్టు నాది అన్నలారో
ఎగిరి దునికె దున్నపోతు అన్నలారో
మెడలిరిసే ఒడుపు నాది అన్నలారో
రుద్రమాంబ కత్తిబట్టి.... ఉగ్రరూపమెత్తుదాము..
యముడైనా ఎవ్వడైనా అన్నలారో...
ఎదురునిలిసి పోరుదాము అన్నలారో.... ॥అన్నరారో॥

ఏడు రోజులానలాయె అన్నలారో
ఎల్సిపోని సినుకులాయె అన్నలారో
పాత గోడలన్ని గూలె అన్నలారో
కాగునిండ సీకటాయె అన్నలారో
గొర్లమంద బెట్టుకోని... గొంగట్ల ముడ్సుకోని...
దేశపచ్చులైతె మాకు అన్నలారో....
దేవుడే దిక్కాయెనన్నలారో.... ॥అన్నరారో॥

బీల్లులేక బొల్లుబట్టి అన్నలారో
పొలిమేర దాటినాము అన్నలారో
దొనలల్ల నీళ్ళు దాగి అన్నలారో
గొర్రెతోటి గొర్రెనైతి అన్నలారో
దుడ్డుగట్టె సేతబట్టి ... ఎలుగొడ్డు లెక్కదిరిగి...
అడుగుదీసి అడుగుబెడ్తె అన్నలారో...
సుట్టు భూతరాకాశీ అన్నలారో..... ॥అన్నరారో॥

సూడుమీద ఉన్న గొర్ల అన్నలారో
కన్నబిడ్డలోలె జూస్తి అన్నలారో

పోతపోతనే ఈంతె అన్నలారో
పిల్లలెత్తుకోని తిరిగి అన్నలారో
మేకకింత మండగొడ్తె .... గొడ్డలే గుంజ్కపాయే....
నోరుమెచ్చనోల్లజేసి అన్నలారో... మా
నోటికాడి ముద్ద గుంజె అన్నలారో..... ॥అన్నరారో॥

సెయ్యనీ తప్పుకేమో అన్నలారో
దండుగైతె కట్టినాము అన్నలారో
పండుగ పబ్బాలొస్తే అన్నలారో
గుంటనక్కలెంటబడే అన్నలారో
దొంగలొచ్చి మమ్ముగొట్టి... గొర్ల గొట్టుకోని పాయె...
తోడేళ్ళ గుంపుతోని అన్నలారో....మాకు
నిత్తెపోరు దప్పదాయే అన్నలారో..... ॥అన్నరారో॥

గొర్రె దిరిగె సోటులేదు అన్నలారో
గొల్ల కుర్మగోస జూడు అన్నలారో
తొకకింత పన్నుగట్టి అన్నలారో
తోకముడ్సుకుంటిమయ్య అన్నలారో
పోలీసు మాలీసు ......మున్సబు కరనాలకు.......
గొర్లు మేకలిస్తె మేము అన్నలారో....
మా గోసజూసినోడు లేడు అన్నలారో... ॥అన్నరారో॥

అమ్మవారుబోసి గొర్లు అన్నలారో
తల్లడిల్లి పాయెనయ్య అన్నలారో
బొగ్గలొచ్చి మూతులాసె అన్నలారో
తుమ్మలేక సోలిపాయె అన్నలారో
పెద్దపార్శ్వ నొప్పిలేసి...... గొర్లు ఆయపాయ జేసెనయ్య.......
తలతిక్క రోగమొచ్చి అన్నలారో.......
తిరిగి తిరిగి నేలరాలె అన్నలారో..... ॥అన్నరారో॥

ఆడోల్ల దూరముంచి అన్నలారో
బండ్ల బాట బందుబెట్టి అన్నలారో
పచ్చకాయ పుచ్చకాయ గట్టిమేము
సావలేక బాధలెన్నో ఏదినాము
దిక్కుమొక్కు లేకమేము.......గావు కేక బెట్టినాము....
గొంగళ్ళ శీరపోతు అన్నలారో మాకు
సిత్రమైన సోపతాయె అన్నలారో ॥అన్నరారో॥

సెరువుకాడ బెస్తబోయు లన్నలారో
సేత రెండు సాపలిచ్చె అన్నలారో
దూపగొనీ తాళ్ళజేర అన్నలారో
గౌడు మంచి కల్లుబోసె అన్నలారో
మంగలన్న నెత్తిజేసి... మనిషినే జేసినాడు...
సకలవృత్తిదారులంత.... అన్నలారో.....
సంబరాలు జేసినారు.... అన్నలారో... ॥అన్నరారో॥

గొర్రె మేకపిల్ల జస్తె అన్నలారో
మాదిగన్న కిచ్చినాము అన్నలారో
తిత్తులల్ల నీళ్ళు తాగి అన్నలారో మాకు
ఎండదెబ్బ దెల్వదాయె అన్నలారో
సెబ్బండ గుంపు మనది.... సావలేక బతుకుడేంది....
ఎదురుబడితే ఎవ్వరైన అన్నలారో...
ఎదురేగి శనార్థులే అన్నలారో.... ॥అన్నరారో॥

సద్దజోన్న గట్కలల్ల అన్నలారో
సల్లబోసుకొచ్చినాము అన్నలారో
రాగిముద్ద దీసుకొచ్చి అన్నలారో
రాగమే దీసినాము అన్నలారో
ఎంతకాని ఏగమయ్య.... ఏమిజేసి బత్కమయ్య....

ఒగ్గు మద్దెలొక్కతీరు గొట్టనాము
డొక్కడోలుగొట్టి మిమ్ము పిలిసినాము ॥అన్నరారో॥

పిల్లగొర్రె బట్టుకొచ్చి అన్నలారో
కాలు గజ్జెగట్టి మేము ఆడినాము
సింతకాయ మాడికాయ తొక్కుతోని
అంబలి గంపెత్తుకోని వచ్చినాము
బొల్లి దాన్ని ముల్లిదాన్ని........మీకు ఎలగాల్లదాన్నిడ్సిన
ఓలింగా ఓలింగా అన్నలారో...
ఒక్కతీరు అడుగులాయె అన్నలారో.... ॥అన్నరారో॥

కొమురెల్లి మల్లన్న అన్నలారో
కోడెమొక్కు దీరనుంది అన్నలారో
చెరువుగట్టు లింగన్న అన్నలారో
జడలిప్పి ఆడుతుండు సూడవేరో
దున్నకుర్ర కాలుదువ్వి రంకెలేయగా...సదరన్ పండుగ సందడేరో....
ఆనాటి బాధలింక లేవులేరో....
మన కష్టాలు తీరిపాయె సూడవేరో...


వొద్దిరాజుల...



వొద్దిరాజుల గన్నతల్లి బాలనాగమ్మా
మా వొడ్డెరోల్ల రాజ్యమెక్కడ బాయెనోయమ్మా
సీతమ్మ శెరలు బడ్డవ్ సీత్వ అరుపై మిగిలిపోయినవ్
రాళ్ళగూటిలొ రత్నాల పిల్లలను వదిలేసి పొయినవ్ ॥వొద్దిరాజుల॥

బతుకు దెరువుకు వచ్చినార్యులు బతుకులాగంజేసినారు
రాజ్యాలను ఏలినోల్లను రాక్షసూలని సంపినారు
చతుర్వర్ణ ధర్మమంటూ బాంచోల్లను జేసినారు
మనువు రాతను మనకు రాసి మానవత్వం మరిసినారు
చెమట నెత్తుటి ఊటబుట్టిన శెలిమలైనముగా...
చండ్రనిప్పుగ రగిలి నివురు గప్పుకున్నముగా..... ॥వొద్దిరాజుల॥

పానగల్లు పట్నమమ్మా వొద్దిరాజుల నిలయమమ్మా
పనికి పెద్దా బిడ్డలమ్మా రెక్కలసలే దాయరమ్మా
వొరిసేను కోతగోసీ అడిగెసూడు తూమెడొడ్లని
సిత్పగొడ్డలి తూము నింపి శ్రమను దోసెను భూసామి
నెత్తిగొట్టుకోని దుమ్ము ఎత్తిపోస్తిమిగా....
నెగల లేని లోకాన శిలలమైతిమిగా.... ॥వొద్దిరాజుల॥

మొండి బండకు గన్నుగొట్టి బరాలయ్యి మోగినోల్లం
స్థిరనివాసం చెక్కుచెదరని ఇంటికే బూనాది రాళ్లం
బావులెన్నో తొవ్వి జనులకు నీటి దూపను దీర్చినోల్లం
బండగొట్టే వొడ్డెరోల్లుగ బాధలెన్నో బడుత ఉన్నం
నిలువ నీడా లేక మేమూ బతుకుతున్నముగా...
బండదొనలో నీల్లు దాగిన బతుకులయ్యెనుగా.... ॥వొద్దిరాజుల॥

బండరాల్లను పిండిజేసే ఒడుపు మనమూ నేర్చినాము
కొండరాల్లను ఒక్కపెట్టున ఎత్తి కోటలు గట్టినాము
నీతి న్యాయం దప్పకుంటా బతుకులెల్లా దీసీనాము
నీడపట్టు దెలువకుంటా మండిపోయె సూర్యులైనం
రంగు రాళ్ల క్వారీలు అన్ని మనయేరా.....
హక్కుమనదీ కూలోల్లుగ ఎందుకుంటమురా... ॥వొద్దిరాజుల॥

మాయ మర్మం తెలువనోల్లం మాయలను ఛేదించినోల్లం
మాయల పక్కీరు పానం కనిపెట్టిన మొనగాల్లం
సప్తసంద్రాలైన దాటి తల్లినీ సాధించినోల్లం
సాహసంలో బాలవర్దీరాజుకే మేము తమ్ములం
ఎవడుజేసిన కుట్రలో మరి అనిగి ఉన్నమురా...
ఏకమయ్యెదిరించి రాజ్యం దెచ్చుకుందంరా....
చేయిజారిన రాజ్యాన్ని ఏలుకుందంరా...


మూలాలు జూడాలె



మూలాలు జూడాలె తమ్ముడా
మూల గ్రంధాన్ని దేవాలె తమ్ముడా
ఆది ఏదోగాని తమ్ముడా ఆనవాళ్లున్నాయి ఇక్కడ
మాయలు మర్మాల సంగతేమోగాని
ఆధారమే లేక భూమీ.....
ఇంత బారాన్ని మోస్తుందా తమ్మీ ॥మూలాలు॥

మనిషెట్ట బుట్టింది - మానవ పరిణామ మెట్టుంది
మాటెట్ట బుట్టింది - ఏటిలో పాటెట్ట బుట్టింది
అమ్మా ఆకలి అన్న తొలికేక పిలుపుల్లో
అలుపేదో... ఆయాసమేదో... ఇవరంగజెప్పిన
సాక్ష్యాలు మనకున్నయి
రాగి శిలా శాశనాలల్లున్నయి
ఆధారాలె ఉన్నయి
భాషకు రూపాలె అండ్లున్నయి ॥మూలాలు॥

ఊరెట్ట బుట్టిందీ - ఊరు పేరెట్ట బుట్టింది
బొడ్రాయి యాడుంది - మాయిముంతెవడు బెట్టింది
పసరు ఆకుల మింగి పచ్చి పిందెలు గొరికి
ఇసమేదో... పదార్ధమేదో... ఇవరంగ జెప్పిన
సాక్ష్యాలు మనకున్నయి
తాటాకు గ్రంధాల్లో దాగున్నయి
ఏ మూలకో వున్నయి
తొలి మనిషి ఆయుషుతో ఉన్నయి ॥మూలాలు॥

ఏ నొప్పికేమున్నదీ - అయ్యో ఏ బాధకేమున్నది
పురుగు ముడితేంవున్నది - పిల్లలు బుట్టకుంటేంవున్నది
కాల్లుజేతులు ఇరిగి కదల లేనోల్లకు
శెట్టేదో... పసరు కట్టేదో... ఇవరంగ జెప్పిన
సాక్ష్యాలు మనకున్నయి
తాటాకు గ్రంధాల్లో దాగున్నయి
మూలాలు మనకున్నయి
ఆయుర్వేద శాస్త్రాలు అండ్లున్నయి ॥మూలాలు॥

మతమెట్ట బుట్టిందీ భూమ్మీద కులమెట్ట బుట్టింది
అగ్రకులమెట్ట అయ్యింది కుటిల నీతెట్ట బెరిగింది
పూసగుచ్చినట్టు పూలె అంబేద్కర్లు
పాటల్లో... నోటి మాటల్లో ఇవరంగ జెప్పిన
గ్రంధాలు మనకున్నయి
బ్రాహ్మల మోసాలు గండ్లున్నయి
ఆధారాలె ఉన్నయి
అవతార గుట్టును జెబుతున్నయి

మూలాలు జూడాలె తమ్ముడా
మూల గ్రందాన్ని దేవాలె తమ్ముడా
ఆదిఏదో గాదు తమ్ముడా
నాగజాతే లేరా తమ్ముడా
రాతి, కంచు లోహ యుగములన్నరుగాని
మట్టియుగము జాడ మాయమయ్యెను ఎట్ల... ॥మూలాలు॥


మన కాన్షీరామ్‌



సాకీ: ఓట్లు మాయి సీట్లు మీయెట్లా అని ప్రశ్నించి
అట్టడుగు వర్గాల తట్టిలేపిన గొంతు మూగబోయింది

దళితా బహుజనులా సూరీడే మన కాన్షీరాము
మన బతుకుల్లో వెలుగులు నింపిండే ॥దళితా॥

పంజాబు రాష్ట్రంలోన రోపారు జిల్లా ఉంది
రోపారు జిల్లాలోన కవాస్‌పూర్ గ్రామమందు
నింగీ నేలంతాటోల్లు కాన్షిరామ్ నినుగన్నోల్లు
ఉన్నత విజ్ఞానాన్నిచ్చి నిను బుద్దిగ బెంచీనారు
ఈ లోకం పోకడ దెలవాక మన కాన్షీరాము
మనుషులంతొకటే ననుకుండు ॥దళితా॥

ప్రజాస్వామ్యదేశంలోన సువిశాల రాజ్యంలోన
చతుర్వర్ణపాలన ఏందీ మతఛాందస రోగం ఏందనీ
నినదించిన గౌతమబుద్ధుడు నిలదీసిన అంబేధ్కరుడు
అంతటి మహనీయులకు అవమానం జరిగిందంటూ
ధీనాభాన్ జేసిన ఉధ్యమము మన కాన్షీరాము
మునుముందుకు దీసుక పోయిండే ॥దళితా॥

శూద్రులల్లో అగ్రజులయ్యి సురకత్తులు గుచ్చేవాళ్ళు
నిశాని గాళ్ళని జేసి నిలువున ముంచిండ్రు మనలా
ఊరుకొకడే ఉంటడు వాడు ఊరంతా ఏలుతుంటడు
మనతాత తండ్రుల గూడ అరే తురే గొడుతుంటడు

మనువాదుల వేళ్ళను తెగనరకా మన కాన్షిరాము
రాజ్యాన్ని ఏలాలన్నాడే ॥దళితా॥

పూలే అంబేధ్కర్లాకు సిద్ధాంత వారసుడమ్మా
సామాజిక చైతన్యాన్ని కలగన్న నాయకుడమ్మా
అగ్రకులపోల్ల పాలనా అంతాన్నే జూడాలన్నడు
అణగారిని వర్గాలన్ని ఐక్యంగా ఉండాలన్నడు
ఐక్యతకై ఉద్యమించిండే మన కాన్షీరాము
అందరినీ ఏకం జేసిండే మన కాన్షీరాము
మనరేపటి నల్లా సూరీడే ఈ కాన్షీరాము


ఒలిగేనాత్రులు



ఒలిగే నాత్రులు ఎలిగేనల్లో జాంభవ చరితాలెల్లియల్లో
తాలె లెల్లే....లెల్లే లెల్లియల్లో లెల్లె లెల్లే... లెల్లీయల్లో ॥ఒలిగే॥

వీరాధి వీరుడు లెల్లీయలో - రాజాధి రాజుడు లెల్లీయలో
ఆజానుబాహుడు లెల్లీయలో - మనతాత జాంభవుడు లెల్లీయలో
ఏదీ లేని నాడు లెల్లీయలో - ఆది తానై నిలిసే లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో- లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

ప్రకృతి శక్తులు లెల్లీయలో - ఆరాధ్యులైనారు లెల్లీయలో
నీలవేణీయమ్మ లెల్లీయలో - జాంభవంతుని తోడు లెల్లీయలో
సకల జాతి గుంపు లెల్లీయలో - సంభరంగ బతికే లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో- లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

నల్లాని రూపోడు లెల్లీయలో - సల్లాని మనసోడు లెల్లీయలో
గుండె గల్లవాడు లెల్లీయలో - గుట్టు తెలిసిన వాడు లెల్లీయలో
మానవ చరితను లెల్లీయలో - మలుపు తిప్పినవాడు లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో - లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

తోలు వొల్సినాడు లెల్లీయలో - తొండాలు జేసిండు లెల్లీయలో
డప్పుల్ల దరువేసి లెల్లీయలో - లోకాన్ని మేల్కొలిపె లెల్లీయలో
నగరాలు నిర్మించి లెల్లీయలో - నాగరీకుడయ్యే లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో- లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

రాజ్యానికే దాపు లెల్లీయలో - పోతరాజు కాపు లెల్లీయలో
కట్టమైసమ్మ లెల్లీయలో - వరద కడ్డు కట్ట లెల్లీయలో

బతుకమ్మ తల్లి లెల్లీయలో - చెరువు నీల్లా దిరిగే లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో- లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

చెట్టు పుట్టల జూసి లెల్లీయలో - సుట్టూర నీల్లల్ల లెల్లీయలో
సకల జీవకోటి లెల్లీయలో - గంతులేసి ఎగిరే లెల్లీయలో
ఆది జాంభవ రాజ్యం లెల్లీయలో - పులకించి తులతూగె లెల్లీయలో
తాలె లెల్లే లెల్లే లెల్లీయలో- లెల్లె లెల్లె లెల్లే లెల్లీయలో ॥ఒలిగే॥

వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా - సృష్టికి మూలంబు బ్రహ్మెట్లనయ్యా
సీకటి ఎలుగుల నడుమ బ్రహ్మ నడిమికిజీలి సృష్టిబుట్టెనాని చెప్పితీవయ్యా
మగవాని కడుపూనా ఓ తిక్కలయ్యా ఆడా మగా బుట్టె అది ఎట్లనయ్యా
నువ్వు బెట్టి వావి వరుసేనయ్యా ఒక్కనికి బుట్నోలు ఏమైతరయ్యా

ముసలీ తనముల మీకు ముడ్డి కడుగంగ
చిన్న పిల్లల పెండ్లి జేసుకుంటీరయ్యా
కట్టు కతలు జెప్పి ఇన్నాల్లు మమ్ములా
కనికట్టు జేసిండ్రు ఇంక సాలయ్యా
జంతువోలె దిరిగే మానవా గుంపు
పరిణామ క్రమములో గిట్లయ్యెనయ్యా
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా - సృష్టికి మూలంబు బ్రహ్మెట్లనయ్యా
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా - మనరాత రాయంగ మనువెవ్వడయ్యా


మాహాధి జాంభవుని



మాహాధి జాంభవుని వారసులారో...
జగతీకీ వెలుగైన మా ఆది సూర్యులు మీరో..

దొంగ వేదాలెన్నో సృష్టించి మిమ్మూల
స్మృతులు పురాణాలు పురుష సూక్తమంటూ
నిచ్చెన మెట్లేసీనారో.....
నిలువునా విడదీసీనారో.... ॥మాహాది॥

క్షీరసాగర మధనం కలిసి చీలుకుదమంటూ
మీ శ్రమతో బుట్టీన అమృతాన్ని దాగి
నాగజాతినీ తొక్కినారో....
మిమ్ము రాక్షసులుగా జేసినారో.. ॥మాహాది॥

మూలవాసి బిడ్డ హీరణ్య కశిపుడు
అర్ధరాత్రి నిద్రలో ఉండగా వచ్చి
నిలువునా చీల్చేసినాడో....
నరసింహుడైనట్టి క్రూరుడో... ॥మాహాది॥

తల్లిరో మాయమ్మ రేణుకా ఎల్లమ్మా
శీలాన్ని శంకించే జమదగ్ని రాముడు
నువు లందలో దాసుకోనుంటె...
నిన్ను వెంటాడి సంపంగ వచ్చే... ॥మాహాది॥

హత్యలెన్నో జేసే ఆర్యజాతినీ మీరు
విలువాగల్లా ప్రాణమంటూ ఇడిసిపెట్టీ
మీ నీతినీ వొదులుకో లేదో...
మానవతకే మారు పేరయ్యినారో.... ॥మాహాది॥

అనుమానపు మొగుడు ఆరామచంద్రుడు
అగ్ని పరీక్షతో అవమానం జేసిండు
ఇదిఏమీ కథయాని అంటే....
నింద మీ మీద మోపిండు సూడో.... ॥మాహాది॥

బూతననూ సంపినట్టి దుష్టుడే శ్రీకృష్ణుడయ్య
మేనత్త రాధతో వ్యభిచారం జేసెనయ్యా
దుష్ట దుర్మార్గాలే జేసినాడో...
ధర్మరక్షణంటూ బొంకినాడో.... ॥మాహాది॥

కురు పాండవులకేమో కొట్లాట బెట్టిండు
రణరంగ సమయాన కర్ణున్ని సంపిండు
యుద్ధనీతినే మరిసి పోయిండో...
గీతాసారాన్నే భోధించే కృష్ణుడో... ॥మాహాది॥

ఐరావతమూ కల్పవృక్షంబు అమూృతం
ఆర్య సంతతి వాల్లు జుర్రుకోని మురిసె
మీ ఎంగిలీ మింగీన జాతే...
నేడు ఎంతో గొప్పదంటూ మురిసే... ॥మాహాది॥

వామన అవతారం పొట్టి బాపడు వాడు
మూడడుగూల జాగ అడిగి మోసంజేసె
శత్రూవూలైన శరణంటె మనమో...
బలిదానాలు జేసేటి గుణమో... ॥మాహాది॥


లేవర మాదిగ లేవరా..



లేవర మాదిగ లేవరా మరొ పోరు బిలుస్తుంది సూడరా
పోరులొ వీరుడవవ్వరా వీర సైనికుడయ్యి కదలరా
లేవరా...ఆ...ఆ...లేవరా లేవరా లేవరా... ॥లేవర॥

అదిగో.... అదిగో అదిగో అదిగో
ఆది మనమే అయినప్పుడు జంబు రాజ్యమున్నప్పుడు
అణువణువు మనదేనని నిలువరా
ఆదిమకాలంలోన హాయిగున్న మన బతుకు
ఆగమెట్ల అయ్యెనని అడగరా
లేవరా...ఆ ....ఆ.... లేవరా లేవరా... ॥లేవర॥

అదిగో.... అదిగో అదిగో అదిగో
చెట్టంతా కొడుకులను కుక్కలోలె గొడుతుంటే
కన్నతల్లి గోస జూసి కదలరా
మన స్త్రీలను చెరిచినోల్ల చిత్రహింస బెట్టినోల్ల
మనవాడల కీడుద్దాం రండిరా
లేవరా...ఆ...ఆ...లేవరా లేవరా లేవరా... ॥లేవర॥

అదిగో.... అదిగో అదిగో అదిగో
ఉత్పత్తి కులాలుగ సంపదెంత సృష్టించిన
నిలువ నీడ లేదేందని అడుగరా
పార్టీలు యుద్ధాలు ఉద్యమంలో మనవాళ్ళు
అసువులు బాసిన కారణమడగరా
లేవరా...ఆ...ఆ...లేవరా లేవరా లేవరా... ॥లేవర॥

అదిగో.... అదిగో అదిగో అదిగో
అభివృద్ధికి మూలమైన మూలవాసులం మనమే
పనికత్తి సేతబట్టి కదలరా
మనువుగాని వారసులు మనవాళ్ళను చెరబట్టే
నిలబడక తెగ నరకా కదలరా
లేవరా...ఆ...ఆ...లేవరా లేవరా లేవరా.... ॥లేవర॥

అదిగో.... అదిగో అదిగో అదిగో
అండ పిండ బ్రహ్మండం ఓంకారమైన కాడ
ఆది మహా శబ్దాన్ని చేయరా
జాంబవతి అరుంధతి అన్ని మనమె అయిన కాడ
మానవీకరణే జరగాలిరా
లేవరా...ఆ...ఆ...లేవరా లేవరా లేవరా...

జయహో జయహో జయహో..
జయహో జంబుద్వీప పాలక
జయం జయం నీకిదె మా కానుక


ఏమీ జేదూమమ్మా



ఏమీ జేదూమమ్మా -మేమెట్లా ఏగుదుమమ్మా
సిన్నబేరగాళ్ళ బతుకు బాధలు ఎట్లా జెప్పుదుమమ్మా ॥ఏమీ॥

ఇల్లు దల్సుకుంటే ఆకలితో అల్లాడే పిల్లలే యాదికొచ్చే
అన్ని మర్సిపోయి అంగట్ల సేటుతో బేరమాడి మాలుదెస్తే
పుచ్చిపోయినయెన్నో పురుగుబట్టినయెన్నో
పాశిపోయినయెన్నో పనికిరానియేన్నో ॥ఏమీ॥

పొద్దుగూకకముందే సరుకు అమ్మకముందే పైసలియ్యమంటొచ్చే
రేటు తుక్కువజెయ్యి సేటు సగము సరుకు పాడయ్యిపోయినదంటె
కన్నకూతలు గూసి కసిరిచ్చి మమ్ముల
ఒక్కరూపాయైన వదిలిపెట్టడు వాడు ॥ఏమీ॥

చిన్న మడిగెలల్ల తోపుడు బండ్లల్ల చాయజేసి మేమమ్మాలంటే
పొగజూరె పొయ్యొద్దు కట్టెలు బెట్టొద్దు గ్యాసుతోనే మంటెయ్యాల
బర్రుమాని మండి సప్పున జల్లారే
పిన్నుగొట్టి కొట్టీ కండ్లల్ల పొగనిండే ॥ఏమీ॥

కంటికీ నదరో ఇంటీకి ఎలుగో వెలుగు పథకం గ్యాసు దెస్తే
గ్యాసుకొరకు లైన్ల పొద్దంత నిలబడితె ప్రాణమంత గావరాయె
ఈ బాధ పడలేక గ్యాసనూనె గొంతె
మూడు లీటరుబొయ్యి ముప్పయై కూసుంది ॥ఏమీ॥

ఆరోగ్యశ్రీ అంటు దవఖానకు బోతె అయ్యె ఖర్సు దప్పదాయె
రేషనుకార్డుతో బియ్యానికని పోతే కూపండ్లు ఎవడియ్యడాయె

ఉప్పు పప్పు ధరలు ఉప్పెనోలె పెరిగే
చెప్పులరిన గాని ఒక్క పని గాదాయె ॥ఏమీ॥

కష్టమెరుగనోల్లు కడుపునిండినోల్లు కన్నీటి గాథా గానరానొల్లకు
మండలాధికార్లు కమీషనర్లకు గుండెబాదుకోని మా గోసజెప్పితె
మల్లెప్పుడటుపక్క మొఖమెత్తి రాకుంట
ఎకిలినవ్వు నవ్వి ఎగతాలి జేస్తుండ్రు ॥ఏమీ॥


బెస్త కులమందు వీరుడో...



బెస్త కులామందు వీరుడే మాయన్న జగన్నాధం
చెరువే తన ప్రాణమన్నడే మాయన్న జగన్నాధం
గంగమ్మ ముద్దుబిడ్డ గోకారం పెద్దబిడ్డ
ఉద్యమాల పోరుగడ్డ నల్లగొండ పులిబిడ్డ ॥బెస్త॥

కొండంత గుండే నీది కొరమేను ఒడుపే నీది
సెరువంత మనసే నీది శెలిమంటి గుణమే నీది
దైర్యానికి మారు పేరువే మాయన్న జగన్నాధం
దగాకోర్ల తరిమి కొడితివే మాయన్న జగన్నాధము ॥బెస్త॥

తెలంగాణ చెరువులల్ల ఎల్లకాలం బతుకలేక
పట్నాలు జేరి బెస్తలు పాశిపనిలో మునిగినారని
చెరువులకు కావలున్నడే మాయన్న జగన్నాధము
బెస్తోల్లయే చెరువూలన్నడే మాయన్న జగన్నాధము ॥బెస్త॥ 7

చెరువులెండి బెస్తబోయులు వలస బాటలు పట్టినారని
సాపలే పడుతున్నరంటే ఊర్లెకొచ్చి ఉంటరాని
బైటోనికి సందు ఈయకా మాయన్న జగన్నాధము
బాధ్యతగా నడుసుకున్నడే మాయన్న జగన్నాధము ॥బెస్త॥

బెస్తోడై పుట్టిగూడ చెర్లనాగం జేసెటోల్లను
మంకుపట్టును వీడకుండ మందికి పాలిచ్చెటోల్లను
సడుగులిరుగా దన్నామన్నాడే మాయన్న జగన్నాధము
సంగతేందో జూడామన్నాడే మాయన్న జగన్నాధము ॥బెస్త॥

వాళ్ళవృత్తిని జేసుకుంటనే బెస్తవృత్తిలో చేరెటోన్ని
నోరులేని బెస్తబోయుల ఆగమాగం జేసెటోన్ని
అంతుజూడ పోరుజేసిండే మాయన్న జగన్నాధము
ఆ పోరులో వీరుడయ్యి నిలిసిండే మాయన్న జగన్నాథము ॥బెస్త॥

చెరువుకుంటలు వాగువంకల బెస్తోల్ల సంపదెనన్నవు
కులమంటె సంద్రమన్నవ్ కూడుంటేనె గెలుపన్నవు
నీత్యాగం మరువ లేనిదే మాయన్న జగన్నాధము
నీ పాదాలకు వందనాలయ్యో మాయన్న జగన్నాధం ॥బెస్త॥


గంగమ్మ గార్వాల బిడ్డ



గంగమ్మ గార్వాల బిడ్డా
గంగవరమున పుట్టిన బిడ్డా
చౌడుపల్లి నూకరాజు
మమ్ము ఎడబాసిపోతివీ రోజు ॥గంగమ్మ॥

కన్నతల్లి వొడినే మరికీ కడలి వొడిలోనే పెరిగినావయ్యా
అలల జూలుపట్టి ఆడి ఉప్పెనోలే దునికినవయ్యా
వైజాగు తీరాన ఓ బిడ్డా....ఆ..
వొడొవొడిగ నడిసేది మా బిడ్డా ॥గంగమ్మ॥

పోర్టుపేరుతోని మనలా పొలిమేర దాటిస్తరాని
తాతల నుంచున్న తలము చేజారి పోతున్నదాని
పోరుజేయా కదిలె ఈ బిడ్డా........ఆ...
ప్రాణ త్యాగాన్ని జేసిండు మా బిడ్డా ॥గంగమ్మ॥

తీరాన జేరినా గవ్వా నీ పేరడుగుతున్నదీ కొడుకా
ఎగిసేటి కెరటాలు బిడ్డా నీకెదురేగి వస్తున్నయయ్యా
మాయన్న లేడంటూ ఓ బిడ్డా
ఎక్కెక్కి ఏడ్చెరా మాయయ్యా ॥గంగమ్మ॥

సుక్కల్లో జేరినవయ్యా మాకు దిక్కును చూపించరావా
గంగమ్మ బిడ్డలకంతా గుండె దైర్యానివై నిలిసి నావా
లైటవుజులో వెలిగి నువ్వూ
మా చీకట్లు తొలగించ రావా ॥గంగమ్మ॥

(గంగవరం కాల్పుల్లో అమరుడై గంగమ్మ ఒడిజేరిన చౌడుపల్లి నూకరాజు స్మృతి.........)


నడువర సోదర..



నడువర సోదరా నడువరా
మన పాదయాత్ర సాగుతుందిరా
అలుపులేక అడుగులెయ్యరా
మన బెస్త బతుకు ఆగమయ్యెరా ॥నడువరా॥

వలలో....వలలో....వలలో. . వలలో
పురాణాల కాలంలో మహావిష్ణువవతరించ
మొదటి జన్మనిచ్చెను మన సాపరా
అడవులన్ని తిరిగి అలసి ఆగిపొయిన రామునికీ
బాట జూపినోడు మన గుహుడురా ॥నడువరా॥

వలలో.... వలలో.... వలలో. . వలలో
నీటిలోన పుట్టిన జలజీవులెన్నొ తినిచూసి
సాపను అందించినోడు బెస్తరా
సంద్రంపై తేలియాడ అలలమీద ఉరుకులాడ
సాపలోలె ఈదిందే మనమురా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
భూమి మీద ఖండాలను ఒకటిగ జేయంగ మనము
ప్రాణాలకు తెగించి కదిలామురా
దేశదేశాల నడుమ సంబంధం కలపంగ
సంద్రంలో దిక్సూచే మనమురా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో... వలలో
సప్తమహా సముద్రాలు ఉప్పొంగిన జడవకుంట
కలెదిరిగిన హెన్రీ మనవాడురా
భారత పశ్చిమ తీరం చేరిన వాస్కోడిగామ
తెగువతోని ముందుకు నువ్ కదలరా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
ప్రకృతి బీభత్సానికి ఎదురు నిలిసి పోరాడే
దమ్మున్నజాతి మన బెస్తరా
సిపాయిలా కన్నముందే స్వాతంత్రోద్యమపోరు
చేసిన ఆ కోలులు బెస్తోల్లురా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
గంభీర సంద్రంలో అమవాస్య చీకటిలో
సుక్కలు ఆ చంద్రుడే దిక్కురా
ఆపదలెన్నొచ్చినను ఆదుకుందీ గంగమ్మ
తల్లి దీవెనా ఉంది నడువరా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
ప్రపంచాన్ని ఒకటిజేయ దీవులు జలసంధులెన్నొ
పసిగట్టిన వాళ్ళే మనవాళ్ళురా
ఎక్కడ ఏ మూలనున్న ఏ పేరుతొ మనమున్నా
అంతా మన బెస్తలని కదలరా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
బెస్తజాతి గొప్పదిరా ప్రపంచానికే వెలుగురా
తీరమెంట ప్రతి అనువు మనదిరా
కరువు అలుగుబోసె నేల తెలంగాణ ప్రాంతంలో
చెరువుకుంట భూములన్ని మనయిరా ॥నడువరా॥

వలలో.... వలలో....వలలో.... వలలో
చెరువు మనదె చేప మనదె వాగు వంక ఏరు మనదె
ఇంటి దేవతా ఇచ్చిన వరమురా
గంగమ్మ బిడ్డలుగా గంగపుత్ర బెస్తలుగా
ఏకమయ్యి పోరుజేయ నడవరా ॥నడువరా॥


అలలమీద



అలలమీద స్వారిజేసె గంగ పుత్రులారా
కౌసు బతుకులీడ్చుతున్న బెస్తబోయులారా
కట్టుగట్టి కదందొక్కి కదలిరండిరా
దండుగట్టి తుడుంగొట్టి మదించండిరా
ఉరుములోలే ఘర్జిస్తూ వుప్పెనోలె భయపెడుతూ
ఉద్యమించ ముందుకురికి రండిరా ॥అలల॥

దినదినమో గండమై బతుకునిండ సుడిగుండాలే
పెను ఉప్పెనకెదురీదిన ఒడ్డుమీద చేప బతుకులే
ఆరుపదుల సాతంత్రం ఆర్సుకున్నదేముంది
ప్రళయానికి ఎదురీది ఎనకేసినదేముంది
కడలివొడిలో సదువుకునే బెస్త జాలరీ బిడ్డలు
పోటీకి తట్టుకునే వెసులుబాటు ఏడుంది ॥అలల॥

పూట పూట పస్తులుండి ఊరూరా సాపలమ్మితే
కూడు నీల్లు దొరకకా ఒట్టి సాపలై ఎంతీమీ
పసరు ఆకుదినే 'మేక' పులిలా ఘర్జించె నేంది
గంగవరం పోర్టుకాడ ముప్పు 'తిప్ప'లయ్యెనంది
అజ్ఞానం నిండి మనం బతుకుడింక ఎన్నాళ్ళనీ
ఆగడాలు చూసి గూడ అడగకుండ ఎన్నేల్లనీ ॥అలల॥

కౌసు నీసు బతుకులన్నీ ఈగ కన్న హీనమాయెనే
మనసు సంపుకొని బతికిన మనుసులోలే జూడరాయెనే
మనకోసం మాటాడే ప్రతినిధులే లేరేంది
పూటకొక్క మాట మార్చే పుండాకోర్లు బెరిగెనేంది
కమీషన్ల పేరుతోని చెప్పిన కథలన్నిగూడ
మన బెస్తల జీవితాన్ని గంగపాలు జేసెనేంది ॥అలల॥


జాలరీ నీ బతుకు



జాలరీ నీ బతుకును జలగండం వీడదా
అడుగడుగున సుడిగుండం నిన్ను ఇడిసి పోదా
బెస్తబోయుడా ..సముద్ర జీవుడా.... ॥జాలరీ॥

ముప్పొద్దుల నీట వున్న మన దూపదీరదు
మనల ముంచి తనుంబెంచే మధ్య దలారీలు
వృత్తిజేసుకునే మనము సోరుప్పుతొ సొరగొంతే
సూడరాయెరో...
కౌసు నీసు బతుకులనీ ఈసడించెరో ॥జాలరీ॥

ఆపదలు ఎన్నొచ్చిన ఆదుకున్న వాళ్ళెవరు
వుచ్చులోన జిక్కినంక హెచ్చరికలు జేతురు
సచ్చినంక మనమీద మొసలి కన్నీరుబెట్టే
దగాకోరులు...
ఏలకేలు దండుకునే దోపిడి దొరలు ॥జాలరీ॥

కెరటాలు ఎగిసి పడిన తెరసాపనిడువవు
సుట్టు మబ్బు గమ్మినా యుద్ధాన్ని ఆపవు
ఆకాశం ఘర్జించిన కన్నతండ్రి పిలుపనీ
కదిలిపోతివో
అలల మీద తెప్పోలే తేలి పోతివో ॥జాలరీ॥

ఈ బాధలు దీరుటకు నడుంగట్టి నడవాలే
మన గాథ జెప్పుటకు ఢిల్లీ దాకా బోవాలే

పిడులిప్పిన వలలన్ని ఎనబెట్టి మీరంతా
తరలిరండిరో
కరిగిపోని ఆశయంతో ముందు నడవరో
కడలి లోని తరంగాల లక్ష్యమవ్వరో ॥జాలరీ॥

గంగవరం పోర్టు మనని గరీబోల్ల జేసెను
తల్లిలాంటి గంగ వొడికి మనలను ఎడబాపెను
మన బతుకుల సునామిని సృష్టించిన ప్రభుత్వాలు
కుప్పగూలునో...
తప్పక మన ఉసురు దగిలి కొట్కపోవునో ॥జాలరీ॥

తీరప్రాంత బెస్తలను తిప్పలెన్నో బెట్టెను
అభివృద్ధి పేర వాళ్ళ బతుకుదెరువు గూల్చెను
గరీబోళ్లనాయింత గతిలేని వాళ్ళజేసే
కుట్ర జూడరో...
ప్రభుత్వాలు ఎందుకింత కక్ష్య గట్టెనో ॥జాలరీ॥


మనవృత్తి



సాకీ: ఇసురొలలు బోయి కచ్చొలలు వొచ్చినంక
ఆడు ఈడని గాదు అందరు శికారిగాళ్ళే.....

మనవృత్తి గూలిపోతున్నదీ
బెస్త కులవృత్తి అడుగంటుతున్నదీ
మాల్కోల మన వలలు మూలకే చేరినయ్
కరువుతో అల్లాడి ఊరిడిసె కాలమై...
వలసెళ్లి పోతుండ్రు ఈదమ్మో...
కష్టాల కెదురీద రావమ్మో ॥మనవృత్తి॥

తరతరాలుగా మనకు ఆస్తి ఈ చెరువు కుంటేనురా
ఏరుబడితె పంచి ఇచ్చే ఎలుము బద్దేను గదరా
కంతల్లో కండ్లుజేరా వల కచ్చులు గట్టేది
పెచ్చులేసి తాళ్ళుబెట్టి పూసపదులు గట్టేది
కదురు దిప్పిన యాదిరాదు ఈదమ్మో.....
పిడులిప్పె యాల్లలేదు ॥మనవృత్తి॥

పసిపోరడు నేలబడితే వలపూస గట్టేడిదీ
పచ్చి బాలింతలా సుట్టు వలదాపు గట్టేడిదీ
కలికుండ గంజిపేర్పు కమ్మనాసన లేడబాయే
సందమామల పులుసు మసిలే శెవులటికలేడబాయే
గాడిపొయిల జాడ లేదు ఈదమ్మ...
గడియకో గండమాయె

రాత్రి పగలు ఏదిలేక చెరువార దిరిగేదిరా
వాగు వంకంలు ఎంత పొంగినా ఎదురీది బతికేదిరా

వలసేదుకొస్తుంటెరా పాము కాటేసినాదో
ఆయపట్టున సాపదగిలి ఆవుసే తీరినాదో
ఇన్సూరెన్సు మనకు లేదు ఈదమ్మో...
ఎక్స్‌గ్రేషియా రాదులే... ॥మనవృత్తి॥

ఎనబెట్టీ వలలేస్తేనే అరబాలు బెట్టేడిదీ
మాల్కోల గట్టొస్తేనే చెర్లపాలిచ్చేడిదీ
సహకార చట్టాలతో కాళ్లాడకుంట జేసే
ఏటేట రకముబెంచి మన బతుకు లూటి జేసే
చెరువు కుంటలు ఆగమాయె బెస్తోల్ల
బతుకుదెరువు ఆగమాయె ॥మనవృత్తి॥

మత్స్యకార్లనే పేరుతోటి సబ్బన్న కులపోల్లురా
మన మంచి తనమునే చూసి చెరువుల్లో జెనిగాయెరా
బస్తోల్లు ఊరిడిసినారనీ చెర్లన్ని మింగిండ్రురా
అరవయేండ్లుగ బెస్తలంత అరిగోస దీసిండ్రురా
కచ్చొలలు వచ్చినంక ఈదమ్మ....
కతమాయె బెస్తలంత ॥మనవృత్తి॥


గంగమ్మతల్లికి



గంగమ్మతల్లికీ కన్నబిడ్డలం
గంగపుత్రులం మేం బెస్తబోయులం
ఆశ ఊషన్నకు అన్నదమ్ములం
గంగపుత్రులం మేం బెస్తబోయులం
చెరువు నింతె గంగమ్మ పండుగే జేసినం
కట్టమైసమ్మ కాడ యాటలే కోసినం ॥గంగమ్మ॥

కదురుదిప్పి నూలుపోగు కరిబెట్టీనం
ఆశలన్ని ఎలుంబోసి వలలు గట్టినం
పూన్పుగట్టి పూసబెట్టి ఎనబెట్టీనం
సాపజాడ గనిపెట్టి వలలిసిరీనం
ఏపూటకాపూట గండాలు గట్టెక్కీ
బతుకుపోరు జేస్తున్న బెస్తబోయులం ॥గంగమ్మ॥

అలలమీద అమ్మగాల్లాడినోళ్ళమూ
సెరువు ఒడిలో సేదతీరి పెరిగినోళ్ళమూ
పొద్దు మాపు నీళ్ళమీద సందమామలం
రొయ్యమీసాలు దిప్ప కొర్రమేనులం
సాపలన్ని గోసేసి దండెమ్మీదెండేసి
ఎండబెట్టి ఒరుగుజేసె ఒడుపు నేర్పినం ॥గంగమ్మ॥

సుక్కపొద్దుకాడ లేసి ఏటకెళ్ళినం
చెట్టు పుట్ట ఘల్లుమనగ అడుగులేసినం
వాగుకడ్డమూ దిరిగి ఎదురు నిలిసినం
ఎదురెక్కిన సాపలకై ఎదురీదినం
సాపజెల్ల పిల్లలన్నీ ఊరూరా దిరిగమ్మ
కేకలేసి సూర్యున్ని తట్టి లేపుతం ॥గంగమ్మ॥

పర్క జెల్ల పిల్లలే ప్రాణమన్నము
బెస్తవృత్తి మాది మేమె చేసుకున్నము
మత్స్యకారులంటు వచ్చి మమ్ము ముంచెను
మా బెస్తవృత్తిలో దొంగలంత జేరెను
ఎవరివృత్తి వాల్లకుంది బెస్తోల్లదె కమ్మగుంద
కన్నోళ్ళు ఎవ్వరంటే మందిని జూపిస్తరా... ॥గంగమ్మ॥


ఎందుకో మన బతుకు



ఎందుకో మనబతుకు
ఎండిపోయినట్టాయే
కులం అండా లేక మనము
కుక్కలోలె బతుకులాయే
గంగపుత్రుడా-బెస్తబోయుడా.... ॥ఎందుకో॥

సంఘబందము మొదలు చేసిందే మనమురా
కట్టుబాట్లకు లొంగి కచ్చితంగ బతికినం
తప్పుజేసినోల్ల మనమూ ఎనక ముందు జూడకుంట
ఎత్తికట్టినం... ఎల్లగొట్టినం
కులమంటే సంద్రమని తొడలు గొట్టినం ॥ఎందుకో॥

మనసెరువు కుంటాలల్ల సాపపిల్లలను జాది
మనల ముంచి తనుం బెంచే మద్యదలారీలు
వృత్తిజేసుకునే మనము సోరుప్పుతొ సొరగొంతే
సూడరాయెరో... దరిజేర రాయెరో...
కౌసు నీసు బతుకులనీ ఈసడించెరో ॥ఎందుకో॥

వల గొరికిన సాపని ఎట్లనయిన పడతవు
కొరమేను దొరికినా నువ్వు చిందులేయవు
ఒక్కొక్కటి ఒల్సుకొని ఒడ్డుజేరే ఒడుపున్నా
నెగలమైతిమో.. ఎదురు నిలవమైతిమో...
కుళ్ళుతున్న సమాజంలో ఇమడ మైతిమో ॥ఎందుకో॥

కార్తులన్ని బొయినగాని కాల్వజాగని ప్రాంతం
సెరువునిండ నీల్లురాక కరువుదీరె పనిలేక
పొట్టసేత బట్టుకొని బొంబాయి మద్రాసుకు
బతుకబోతిమో... ఊరిడ్సిపోతిమో
కన్నతల్లి గంగ జాడ చూడ వస్తిమో ॥ఎందుకో॥

తీరం ఉండి కడుపునిండనోల్లేమో ఆళ్లాయే
ఏడాదికి నెలరోజుల షికారేమో మనదాయే
ఆంధ్ర తెలంగాణ బాధ ఒక్కటెట్ల అయితదనీ
అడగవేందిరో.. అడుగు దొక్కవేందిరో
ఆత్మగల్ల తెలంగాణ పోరు నడుపరో


మరిసినా



మరిసినా మరుపొస్తలేదు కంటికీ కునుకొస్తలేదు
అమ్మలాంటి సెరువు కొడుకా బువ్వబెట్టిన తల్లిరా
కంప తుమ్మలు జుట్టుకోని నెత్తురోడుతున్నదీ ॥మరిసినా॥

వానసినుకులు వరదలయ్యి వాగువంకలు తిరిగి తిరిగీ
సెరువు వొడిని సేరిపొంగ అలుగులెల్లే సూడు గంగ
పొద్దుగాల ముద్దుబెట్టి బైటికొచ్చిన పొద్దుపొడుపూ
తల్లీ వొడినా జేరేతీరు
కానరాదాయే-కరువు బోదాయే.. ॥మరిసినా॥

సెరువునీళ్ళను సెలుగుకుంటూ శెలగపిట్టెలు వచ్చి వాలే
తల్లిగంగలొ తానమాడి నీరుకోల్లు కూతబెట్టే
ఒంటికాలు దొంగజపము ఒడుపుగా సాపల్నిబట్టే
కొంగలా గుంపేడజేరే
జాడ లేదాయే- నేనేడ జూడాలే ॥మరిసినా॥

జమ్ముపిట్టెలు కాల్చుకోని తాంబేళ్ళను వొండుకోని
మూడుపొద్దులు మెసలకుంట ఎపుడుజూడు నీసుకూర
ఆకలి దూపల్లుబాయ సూడసక్కని పువ్వులోలే
సెరువునిండా పచ్చులుండే
ఆరోజు రాదాయే-ఎదురు సూపాయే... ॥మరిసినా॥

ఎంకన్న ఏనుగాడు తోటిపిల్లలతోని గలిసీ
నీలల్లో నడవరాక పడుతు లేస్తూ కేకలేస్తూ
ఒండుబిసికీ ఆటలాడి బుడుబుంగాలయ్యి మునిగే

గీసలను ఆ గిట్టలాను
మరిసి పోయేనే-వతనాగమాయేనే... ॥మరిసినా॥

వల భుజానికేసుకోని సాపలకు మాయయ్య బోతే
సద్దిదీసుకోని పొయ్యిసాపలను అమ్మెత్తుకొచ్చే
సాపలమ్మో సాపలంటూ సుట్టు పట్టు ఊర్లు దిరిగీ
మమ్ముబెంచీ పెద్దజేసిన
తల్లి కరువాయే- జాబిల్లి రాదాయే.. ॥మరిసినా॥

ఏరిచ్చిన సాపలెన్నో గడ్డమీద ఎగురుతుంటే
నాలుగ్గండ్లు మూడుగాళ్ళతో ఉరికి ఉరికి పట్టుకొచ్చి
సేతగాక ఉండలేక కసురుకుంటూ ఇసురుకుంటూ
కనబడేటి పెద్దమన్సుల
కలలు ఏమాయే- కన్నీటి పాలాయే... ॥మరిసినా॥

సద్దగటుకా సందమామలు గోంగూర బుడ్డబరకలు
బుడద మట్టలు రొయ్యపిల్లలు అంటుపులుసు బెట్టుకోని
సేతిఏల్లు బొడ్డుగిన్నే సగము అరిగేదాక నాకిన కమ్మనైన రోజులన్నీ
మదిల నిలిసేనే-గడికీ యాదికొచ్చేనే... ॥మరిసినా॥

రంగు రంగుల పూలు దెచ్చీ బతుకమ్మలను బేర్చి
తాంబాలం నిన్న్య గౌరినీ తలమీద బెట్టుకోని
భూ తల్లి గొంతుగలుపా ఆడిపాడే అమ్మలక్కలు
నిండు జెర్లో సాగదోలే
సంభరాలేయి - ఆసక్కదనమేదీ... ॥మరిసినా॥

సెరువు కింద వరిపొలాలు కరువులేక పారె నీల్లు
సెరువు ఆరన బర్లు గొర్లు మేతమేసి నీల్లు దాగు

గొడ్డుగోద పురుగుపుట్ర సకలజీవికి ప్రానమైన
గంగమ్మతల్లి నీడ
కానరాదాయే- కరువుబోదాయే... ॥మరిసినా॥

సెరువు కుంటలు అన్నిబొయ్యి ఇంటి జాగలు బుట్టుకొచ్చే
నిలువనీడా లేని జనమూవొంపులల్లో గూళ్ళు గట్టే
ఇల్లుగూలీన తల్లిగంగ పొంగి పొర్లి తెర్లుజేసిన
ఆగమ్మ పచ్చులాను
మరిసిపోయేనే-మల్లి సూడరాయేనే... ॥మరిసినా॥

ఎవనిమీద మన్నుబోసెనో సెరువుజాడ గానరాలె
ఎవడు బెట్టిన కుంపటో మరిసెరువు జందెకిడిసీనట్టయ్
కాల్వలున్న సెర్లమీద నీటిసంగం పెత్తనాలతో
కులంకట్టు గూలిపాయె
ఏమి జేద్దూనో- ఎట్టజేద్దూనో... ॥మరిసినా॥


కదిలింది మన జనం



కదిలింది మన జనం - బెస్త సంఘ యువ జనం
కదురుదిప్పె ఈ క్షణం - కదందొక్కె జన బలం
గలగల మని హోరెత్తే సెలయేరై ఈ క్షణం ॥కదిలింది॥

నీళ్ళు నిలిసి ఉన్న తావు కుంటగ జేసింది మనం
కంప కట్టె రాయి రప్ప తేటగ జేసింది మనం
నీటిలోన తిరుగాడే సాపపిల్లలను బట్టి
ఒడ్డుమీద సాపలయ్యి తన్నుకొనుట ఏందనీ ॥కదిలింది॥

కట్టుగట్టి ఐక్యంగా కదందొక్కి బతికె మనం
సాప జెల్ల పిల్లతోనే బతుకులెల్ల దీసె మనం
బతుకు పొలకబోకుండా బాధలేమి రాకుండా
బతికిన కుల కట్టుబాటు ఆగమయ్యెనేందనీ ॥కదిలింది॥

నమ్మితె ప్రాణాలు ఇచ్చె బెస్తజాతి మనదిరా
తప్పుజేస్తె చెప్పుమోసె నీతిగల్ల జాతిరా
నీతి నమ్మకాల నిపుడు తుంగలోన దొక్కుతుంటె
గంగమ్మ బిడ్డలుగా గడపదాటి పోదమనీ ॥కదిలింది॥

బెస్తబోయుడంటేనే ఎంతో పేరుండె గదా
పంచాది ఏదైనా తన మాటే తశ్వ గదా
మందిమాట బట్టుకొని పైస బలం పెరిగి మనం
అగ్రకులా పల్లకినీ మోసుడింక ఎన్నాళ్లనీ ॥కదిలింది॥

చెరువు అలుగుబోయాలని గంగకు మొక్కింది మనం
గండాలను బాపాలని పండగ జేసింది మనం
చెరువు కుంటలిపుడు జాడలేకుండా పోతుంటే
మా సంపద మాకేనని నిలదీసి అడుగంగా ॥కదిలింది॥

సాపలు పట్టడమేగా ఆదినుండి బెస్తవృత్తి
షికారితో మన పిల్లల ఉన్న ఊర్లజదివిస్తీ
కంప్యూటరు కాలమొచ్చె కార్పొరేటు సదువొచ్చె
కన్నశెరలు బడ్డా పై సదువులంద వేందనీ ॥కదిలింది॥

మత్ససంపదా గుట్టు తెలుసుకున్న దళారులు
మనవృత్తిని కొల్లగొట్టె అగ్రకులా నాటకాలు
చెర్లను కాంటాక్టుబట్టి కోట్లకు పడగెత్తె వాల్లు
మనకూటిలో మన్నుబోసి కుట్రజేసే నేందనీ ॥కదిలింది॥

మన చెరువు కుంటలల్ల మందికేంది అధికారం
మనకు మనం విడిపోవుటెకదా మందికవకాశం
దళారులను తరిమికొట్ట దండుగట్టి నడవాలె
మనకు చిచ్చుబెట్టెవాన్ని ఏకమయ్యి తరమాలనీ ॥కదిలింది॥


వాగువంకల నీల్లు



వాగు వంకల నీల్లు ఎండి పాయెనమ్మా....
ఎట్లనో తెలుసా ఎట్లనో తెలుసా
దూపదీర్చే తల్లులాగమయ్యేనమ్మా.....
ఎట్లనో తెలుసా ఎట్లనో తెలుసా ॥వాగు॥

వానల్లు గురువంగ వాగులుప్పొంగేది
వాగుల్లు బొర్లంగ సెరువలుగుబోసేది
వంకల్లు బారంగ ఎంత సక్కంగుండె
శెలిమల్లు గుప్పంగ సేదబాయి నిండే
పారేటి వాగుల్ని పక్కకు దోసిండ్రు-
దోసిళ్ళతో బోసే కాల్వల్ని దొవ్విండ్రు
సుక్క సుక్క నీరు ఇంకేటట్టు జేసి
వాటర్‌షెడ్లు దొవ్వి నీల్లు పొదుపన్నారు
భూమిల నీరైతే పెరిగిందో లేదో
నీళ్ళపేరుతోని నిధులు కొల్లగొట్టే
అడిగేటోడెవడాన్ని నిలదీసెటోడెవడు
వాగెండ బెట్టంగ నాటాకాలాడిండ్రు
వుష్కాగులో బొర్లె కాంటాక్టులయ్యిండ్రు
లోయలూ బడదొవ్వి వాగుల్ని మింగిడ్రు
కోట్లకు పడగెత్తి ఉష్క బుక్కూతుండ్రు
వాగు వంకలు గిట్ల మాయమైపోతుంటే...
ఎట్లాని కాదురా ఎదిరించ నువ్ రారా ॥వాగు॥

చెరువు కుంటలు నేడు మాయమయ్యేనమ్మా...
ఎట్లనో తెలుసా ఎట్లనో తెలుసా

దూపదీర్చే తల్లులల్లాడెనమ్మా.....
ఎట్లనో తెలుసా ఎట్లనో తెలుసా ॥చెరువు॥

చెరువంటే బెస్తోల్ల సొత్తాని తెలిసి
ఎడబాపె కథజేసి ఎదురు సూస్తుంటరు
ఇంతలో మనవాళ్ళు గూడుంబ తాగేరు
ఎవనికాడుగ మారి ఏతులూ గోట్టేరు
ఎడ్డి రాజ్యమైనా పల్లెటూరిలోన
సెరువార్న తప్పక పాటేలు బాయుండు
రోజింత మడిజేసి అచ్చుగట్టుకుంట
నడిజెర్ల తుకమడుగు అలికి కూకుంటడు
చెర్లల్ల ముందూగ కంపా తుమ్మలు బెంచి
చెరువునిండాకుంట గండి బెడ్డుంటడు
అడిగేటోడెవడాన్ని నిలదీసెటోడెవడు
బాయెండి పోతుంటే చెర్ల బోరేస్తడు -
పైపులేసి పొలము పారిచ్చుకుంటడు
చెర్లల్ల బెరిగినా కంప తుమ్మలు అమ్మి
బొగ్గుబట్టీకాడ పెద్దబోదైతరు
చెరువు కుంటలు గిట్ల మాయమైపోతుంటే
ఎట్లాని కాదురా ఎదిరించ నువ్ రారా ॥చెరువు॥

ఊంవుంచె తావేది ఉరికేటి పట్నాన
చెరువో కుంటో కబ్జాజేసి పెడుతుంటరు
ధనబలము నిండుగా అధికారులండతో
బెస్తోల బతుకుల్ని బుగ్గిజేస్తుంటరు
చెరువుకుంటకు నీల్లు దెచ్చేటి వాగుల్ని
అంటేసి చెరువుల్ని ఎండబెడుతుంటరు
కంపు కాలుష్యాల మురుగునీటిని బంపి

మున్సిపాలిటి చెత్త రోజింత బోస్తరు
చెరువు శిఖము తన తాతా జాగీరానీ
పట్టాభూములోలె అమ్ముకునేటోన్ని
అడిగేటోడెవడాన్ని నిలదీసెటోడెవడు
రోజు గడిసిపాయె నెలలు గడిసీపాయె
శతపోరినా మనము శెంకెము జెయడాయె
ఆకాశభవనాలు అంతెత్తు గట్టిచ్చి
అవినీతి సామ్రాజ్యమేలుకుంటుంటరు
అన్నోడే పలవంట ఐతెమాయేగాని...
ఎట్లాని కాదురా ఎదిరించ నువ్ రారా ॥చెరువు॥


ఇనుకోర మాయన్న....



ఇనుకోర మాయన్న ఇవరంగ జెబుత
బెస్తబోయుల మాట తెలిసింది జెబుత
పట్టువదలని వీరులే పుట్టె ఇంట
తలపెడితె కార్యంబు విజయమే నంట ॥ఇనుకోర॥

శంతనడు గంగమ్మలా నోముఫలమంట
బెస్త బోయూలయ్యి వర్ధిల్లిరంటా
నమ్మకానికి మనము గీటు రాయేనంట
నావాబులా బీబీ ముఖము దాయాదంట
మూడుపొద్దులు కడలి వొడిజేరి బతకంగ
గంగమ్మ దీవెనతొ ఒడ్డుజేరుతరంట ॥ఇనుకోర॥

జలజీవులై బతికె గంగపుత్రూలంత
బెస్తబోయూలంట సత్యవంతూలంట
సత్యవంతూలంట గంగ శాంతనులంట
విధినైన ఎదిరించె తెగువున్న వాళ్ళంట
ముల్లోకముల సంగతేమున్నదో గానీ
మూడొంతులా నీల్లు కలె దిరిగినోల్లంట ॥ఇనుకోర॥

గుహుడు మనజాతికే ఆయువు పట్టంట
మత్స్యగందీ చరిత రమణీయమేనంట
చెప్పితే మనకత తెల్లవారొడవదు
మల్లిసూడక చరిత తిరగరాయాలంట
మూడుపొద్దులు కడలి వొడిజేరి బతకంగ
గంగమ్మ దీవెనతొ ఒడ్డుజేరుతరంట ॥ఇనుకోర॥

కామమ్మ కథ ఎంతొ ఆర్ద్రమైనది గాదా
బెస్తింటి ఆడోళ్ళు లొంగి బతకని గాథా
శౌర్యానికే మారు పేరు వీళ్ళంట
పూలనూదేవిలా కానరారంట
మూడుపొద్దుల సాపలా గంప నెత్తిన
సూర్యుడే సూల్లేక సుట్టకుదురాయే ॥ఇనుకోర॥

ఊడిగం జేసేటి వృత్తిగాదంట
బెస్తోళ్ళు బానిసగ బతకలేరంట
తిరగబడినా కోలులూ బెస్తలంట
వలస పాలనను నాడెదిరించెనంట
మూడుపొద్దులు కడలి వొడిజేరి బతకంగ
గంగమ్మ దీవెనతొ ఒడ్డుజేరుతరంట ॥ఇనుకోర॥

ఉద్యమాలకు పెద్దబిడ్డలైనోళ్ళంత
మనజాతిబిడ్డలే పేరెందుకంటా
పెద్దసదువులు నేర్చి బిడ్డలుండ్రంట
మచ్చుతునకా మన ముత్యాలరాజంటా
మూడుపొద్దుల కడలివొడి జేరె పిల్లలా
సదివించ మీరంత సాయమియ్యాలంట ॥ఇనుకోర॥

పుట్టిండు వ్యాసుడు పెరిగిండు మనవెంట
పాండిత్య సంపదకు పెట్టింది పేరంట
పాండురాజు వంశ వారసత్వామంట
రాజ్యాలుబొయ్ బుడ్డగోషెచ్చె నేందంట
మూడు పొద్దుల కడలి వొడిజేరి బతకంగ
ముమ్మాటికీ నీటివనరులే మనయంట ॥ఇనుకోర॥


సాపలు పచ్చాపలు



సాపలు పచ్చాపలు సాపలు సందమామలు
సాపలు వొట్చాపలు ఉష్కదొందు బొమిడీలు
బుడ్డబర్క బుడ్డమట్ట బొచ్చెరవ్వు కొరమేను
కొడిపె గండె జెల్లలు కొంగముక్కు సాపలు
బంగారు తీగలు మీసాల రొయ్యలు
మూడొంతుల నీటిని శాసించిన గా సాపని
పట్టుకొచ్చే ఇద్యను గనిపెట్టినోడు బెస్తరా ॥సాపలు॥

సృష్టిలోన మొట్టమొదట బుట్టినదట ఈ సాప
హనుమంతుని కడుపులోన బెంచినదట మన సాప
బతుకనీకి దిక్కులేక లోకహితం కోసమనీ
మహావిష్ణువంతటోడే సాపరూపు దాల్చెనట ॥సాపలు॥

జలజీవులకెన్నింటికో ఆధారం మనసాప
నిండు జెరువును సూస్తే తీరునట మనదూప
జనం జన్మమన్న పదం జనతోనే బుట్టినట్టు
పుట్లకొద్ది పిల్లలకై జెననిడిసెను మనసాప ॥సాపలు॥

రోగాలు నొప్పులను నయంజేసె మందు సాప
గుండె నొప్పులకు గూడ సాపనూనె గోలీలట
ఆయుర్వేదమల్లోపతిల సాపకు ఇలువెక్కువట
ఉబ్బసానికి బత్తిని సాప మందు ఇచ్చునట ॥సాపలు॥

ఎండబెడితే నిలువ ఉండునని చెప్పిన జాతి మనది
వొట్చాపలు దోసొరుగులు వొండుకుంటె ఎట్లుంటది

సూర్యరశ్మిలో ఉన్న శక్తినంత నింపుకొని
మనుషులకందించే ఒట్టి సాపెంత గొప్పదీ ॥సాపలు॥

కండలు కరిగేటి పని జేసేటి మనుషులంత
కచ్చితంగ సాపల కూరొండుకొని తింటరు
కల్లుతాగేటపుడు సాప కాల్చుకొని తింటరు
వొట్టియో పచ్చియో సాపలు గావాలంటరు ॥సాపలు॥

దొంగశివుడు జంగమోడు తరుముకుంట వొస్తుంటే
ముక్కంటికి దొరకకుంట గంగమ్మను దాసినము
ఆపదలుండ్రంటె సాలు పానమైన ఇచ్చేజాతి
ఆశన్న ఊశన్నల కాపాడిన బెస్తజాతి ॥సాపలు॥

వాగువంకలు సెరువుకుంటలల్ల దిరిగి మనం
వల కట్టుగట్టి ఎక్క సాపలెగిరి పడుతుంటయ్
ఆయపట్టునా సాప తగలగాలె భద్రంరా
జెనిగలోలె మననెత్తురు తాగెటోలు తయారుండ్రు ॥సాపలు॥

ఉప్పునీటి కయ్యలేదు రొయ్యల చెరువులు లేవు
గొట్టెరాజ్యము మాది తెలంగాణ ప్రాంతము
చెరువులెండి బావులెండి షికారేది లేక మేము
భూతల్లి రొమ్ముదాగ బుక్క బుక్క ఫ్లోరినే ॥సాపలు॥

బావులు సెరువుల్ల నీల్లు తాగిన నాడు మనిషి
ఏ నొప్పి రోగమూ లేనే లేదని కుమిలే
ఫ్లోరిను ఇసము లేని నీలల్లనే సాపదిరుగు
ఎనకటి రోజులుబోయి ఎంత మాయకాలమాయే ॥సాపలు॥

సాపల గంపెత్తుకొని బస్సెక్కుదామంటే
కౌస నీసు కంపంటూ కసిరిచ్చి దింపుతరు
నిలువజేసే సోటు లేక అమ్ముకునే వసతిలేక
ఆగమ్మ పచ్చులమై రోడ్డుమీద బతుకుడాయే ॥సాపలు॥

పాలకొరకు ప్రభుత్వాలు డైరీలను పెంపుజేసే
రేడియోలు టీవీలల్ల గుడ్లుదినమనీ చెప్పే
గుడ్లు పాలను మించిన పౌష్టికాహారీ సాప
సర్కారునుంచి మాకు సాయమేమో కరువాయే ॥సాపలు॥

నీటిలోన ఆక్సీజన్ సమముజేసే మనసాప
సాపరెట్టతోనే నీల్లు ఫిల్టరైయ్యి తేటగుండు
ఫిల్టర్లో క్యాండిల్లకు ఫార్ములా ఏదో కాదు
సాపరెట్టలో ఉన్న రసాయనా ములకాలే ॥సాపలు॥

జపాను జర్మనీ చైనా దేశాలలోను
బెంగాలు కేరళ ముంబయి రాష్ట్రంలోను
తీసుకునేతిండిలోన సగము సాపలేనంట
ఫాస్టుఫుడ్‌లలో సైతం సాపలే ఎక్కువట ॥సాపలు॥

పొద్దుకు మూడుసార్లు సాపల కూరేసుకున్న
విసుగన్నది రాక మనకు పూటపూట రుచిపెరుగు
పచ్చి సాపలు దింటే గుండె బలము పెరుగురా
వొట్టి సాపలుండంగ వయాగ్ర ఎందుకురా ॥సాపలు॥


సల్లని సెలయేటి



సల్లనీ సెలయేటి గుణము సకల సేవలు జేసినాము
సంబరంగ మనుషులంత ఒక్కతీరుగ బతికినాము
సాకిరంటగట్టి మనని సాకలోడని పిలిసినా...
మనువు మాయాగాడు వాడు ఎవడురా
మా నుదిటిగీతా రాయగా వాడెవడురా ॥సల్లనీ॥

వీరభద్రుని అంశ మీరని పురానాన్ని జెప్పినారు
పూర్వజన్మల పాపఫలము సాకిరేవును ఇచ్చినారు
నిందలే నీపైన మోపి రామకథను నడిపినారు
నిప్పులే దొక్కంగ సీత ముక్కునా వేలేసుకున్నరు...
కట్టుకథలను జెప్పి ముంచెనురో తిప్పరాజు
కాలు జెయ్ గట్టేసి పోయెనురో.... ॥సల్లనీ॥

మాసిపోయిన ఆకాశం మోసినోడని జెప్పినారు
మబ్బుతెప్పలు ఉతికినోడని మాయమాటలు జెప్పినారు
ఎండనే పిండేసినోడని ఎన్నికథలో జెప్పినారు
ఉబ్బి తబ్బిబ్బయినకాడ ఉచ్చుబెట్టిపోయినారు
కుట్రలను గనిపెట్ట రావయ్యో తిప్పరాజు
తిప్పలను తప్పించుకోవయ్యో.... ॥సల్లనీ॥

సదివినోని కన్న మేలని మునగ సెట్టెక్కించినారు
సదువులమ్మ వొడికి మనము చేరకుంట జూసినారు
తోటి జనులను ఈసడించే సామెతలను అల్లినారు
మనని మనమే తిట్టుకుంటే మంటబెట్టి నవ్వినారు

కలిసి ఉంటే బలము మనదేరో ఈదమ్మ
కయ్యాలను మానుకుందమురో... ॥సల్లనీ॥

పల్లెఇంటి ఆడపిల్ల సాకలోల్ల తల్లి యన్నరు
సావు బతుకు మంచిసెడ్డకు దగ్గరుండే బిడ్డే అన్నరు
సాకబోసుకున్న గానీ సారె చీరలు లేవురా
సాకిరెంతా జేసినా మా బువ్వగుల్లకు లోటురా
ఉత్తసేతుల బతుకు జేసెనురో ఈదమ్మ
ఉడుకు నెత్తురు మసులుతున్నదిరో... ॥సల్లనీ॥

ఆదినించి వెట్టిసాకిరి అవమానం పొందినోల్లం
ముట్టుగుడ్డల మురికిదీసే సౌడుసున్నం గలిపినోల్లం
సర్ఫు సబ్బుల ఫ్యాక్టరీలు నడిపే హక్కుదారు మనము
రయ్యురయ్యున దిరిగె వాషింగ్ మిషిండ్లన్నీ మనకు సొంతం
హక్కులను సాధించుకోవయ్యో తిప్పరాజు
ఉక్కు పిడికిలి ఎత్తి రావయ్యో..... ॥సల్లనీ॥


ఊరికంతా ఆడపిల్లమ్మా...



ఊరికంతా ఆడపిల్లమ్మా సాకలోల్ల తల్లీ
ఉత్తసేతుల బతుకు నీదమ్మా సాకిరికి చెల్లీ ॥ఊరికంతా॥

పొద్దు పొద్దున లేసి నువ్వు నత్తగుల్లయ్ తిరుగుతావు
నిద్రలేవని ఇంటిముందల సుప్రభాతం పాడుతావు
పోరగాళ్ళ పీతిగుడ్డలు పెద్ద మనుషుల మురికి బట్టలు
ప్రేమతోని మూటగట్టి సీదరించక ఉతుకుతావు
సేతికష్టం సెమట సుక్క సెరువు నీటిల కలుస్తుంటే
కంటినిండా అలుగు పొంగిందా సాకలోల్ల తల్లీ
ఇంటి నిండా కరువు బండిందా నా పల్లె తల్లీ
మానవత్వం జాడ నువ్వమ్మా సాకలోల్ల తల్లి
మనుషులల్లా కుల్లు ఉతుకమ్మా నా పల్లెతల్లి ॥ఊరికంతా॥

అమ్మకెరుకా అయ్యకెరుకా ఆడపిల్ల ఈడు సంగతి
మరకజూసి మనవరాలు పూతబూసిందంటే తప్ప
అత్తకెరుకా మామకెరుకా కొత్తకోడలు కొంటె సంగతి
పక్కబట్టలు కట్టుగుడ్డల మర్మమిప్పీ సెప్తె తప్పా
ఇంటి గుట్టును బైటబెట్టక ఇంటి మనిషై కావలుంటే
హీనతంగా నిన్ను జూసిండ్రా సాకలోల్ల తల్లీ
ఈతముల్లయ్ గుచ్చుకుంటుండ్రా నా పల్లెతల్లీ
మానవత్వం జాడ నువ్వమ్మా సాకలోల్ల తల్లి
మనుషులల్లా కుల్లు ఉతుకమ్మా నా పల్లెతల్లి ॥ఊరికంతా॥

ఆసామి ఇంట్ల పెండ్లికి ఊరువాడా కబురు నీవు
అన్ని పనులకు దగ్గరుండి ఆసరయ్యే మనిషి నీవు

మైలపోలు రాసెనీకు మాయరాత రాసెనెవడూ
మామిడాకులు దెచ్చెనీకు ఇస్తరాకులు వేయడెవడూ
బంతిలింతా కూడుబెట్టే మనుషులేరని అడుగుతుంటే
బండమీద బువ్వబెట్టిండ్రా మాయన్నలారా
తుండుగుడ్డల గట్టుకొమ్మండ్రా మాయన్నలారా
మానవత్వం జాడ నువ్వమ్మా సాకలోల్ల తల్లి
మనుషులల్లా కుల్లు ఉతుకమ్మా నా పల్లెతల్లి ॥ఊరికంతా॥

మనిషి ఇచ్చిన మైల ఇంటిల మల్లెపువ్వయ్ నిండుతావు
మనిషి మనిషి ఏడ్చినువ్వు కన్నపేగును కదుపుతావు
ఇంట్ల మనిషే పోయినట్టు సింతజేసి గడుపుతావు
ఇంటి ముందల బూడిదెత్తి ఇల్లు వాకిలి ఊడ్చుతావు
గాజు మెట్టే పసుపు కుంకుమ సేతులల్లో రాలుతుంటే
కంట గంగ ఉబికి వచ్చిందా సాకలోల్ల తల్లి
కట్టడొడ్లు కడుపు ఎండిందా నా పల్లెతల్లీ
మానవత్వం జాడ నువ్వమ్మా సాకలోల్ల తల్లి
మనుషులల్లా కుల్లు ఉతుకమ్మా నా పల్లెతల్లి ॥ఊరికంతా॥

సెరువు నీల్లను దొక్కినామా సెల్కపాలు అడిగినామా
మాయజేసీ గుంజిన మా మాన్యమేదని అడిగినామా
సెరువుకిందా నీటి మడుగుల సాకిరేవు సాకెరేగా
మస్సిబొంతలు మైలగుడ్డలు మాసినూరు జాతరేగా
సౌడు సున్నం సాకలడుగు సగం బొందల బతుకుతుంటే
సాయమున్నది అలుపు కూతేనా సాకలోల్ల తల్లి
పొద్దుగూకులు ఎండ నీదేనా నా పల్లెతల్లి
మానవత్వం జాడ నువ్వమ్మా సాకలోల్ల తల్లి
మనుషులల్లా కుళ్ళు ఉతుకమ్మా నా పల్లెతల్లి ॥ఊరికంతా॥

నిన్ను నువ్వు మరిసినావు మందిశుద్దిని జూసినావు
నీతిదప్పక బతికినావు నీడవే నువ్వయ్యినావు
మొండిదొరలా మెడలు వంచిన వీరవనితల కన్నదానవు
మెత్తగుంటే మొత్తిపోయే ఖర్మభూమని మరిసినావు
సాకలీ ఐలమ్మ శౌర్యం మదిల నిలిపి పోరుజేస్తే
సాగిపోయే ఏరు నువ్వమ్మా సాకలోల్ల తల్లీ
సాహసానికి మారుపేరమ్మా సాకలోల్ల తల్లీ ॥ఊరికంతా॥


పారే సెలయేరు జూడు



పారే సెలయేరు జూడు పదంబాడుతున్నది
సాకలి అయిలమ్మ చరిత గానంజేస్తున్నది
ఆకలి అవమానాలు అణిచివేత కెదురు నిలిసి...ఆ....ఆ...
అలుపులేక పోరుజెసె ఒడుపు మనకు నేర్పిందని ॥పారే॥

విసునూరు దేశముఖులు చెలరేగిన పోరులో
విప్లవాగ్ని రగిలించిన వీరవనిత నీవనీ
వతన్‌దార్లు భూస్వాముల చదరంగపు వేటలో
వడిసెల రాళ్ళందుకొని తరిమి కొట్టినావని
కన్నవాళ్ళ బంధించిన బెదరలేదని
ఎన్నుకున్న మార్గాన్ని విడువలేదని
ఉద్యమాల తొలిపొద్దుగ ఉదయించిన తల్లివనీ ॥పారే॥

బాంచనన్న బతుకుల ఈ బంధికానలో
స్వేఛ్చా గీతం పాడిన తల్లి నీవనీ
కన్నశెరలు బెట్టిన వరి పంట పొలములో
కొడవండ్లను చేతబట్టి కదిలినావనీ
కష్టమెంత జేసిన కన్నీరు ఏందని
కట్టడొడ్లు కడుపులెండి ఎన్ని నాళ్ళని
దొరఘడీల మెడలొంచిన ధీరవనిత నీవనీ ॥పారే॥

అడుగడుగున కుట్రజెసె దౌర్జన్యపు దాడిలో
ఆదెరువే లేని ప్రజల తోడు నీవనీ

రౌడీలు గూండాలు రాజ్యమేలు కాలంలో
గుత్పలతో కొట్లాడిన గుండె నీదని
కాళ్ళు మొక్కినా గాని కరుణ లేదని
కచ్చడాల ముందు ఉరికి సచ్చుడేందనీ
ఊపిరూది ఊరువాడ కదిలించిన తల్లివనీ ॥పారే॥

ఆగిపోని అడుగుల పోరాట బాటలో
అడవితల్లి నీడనిచ్చి ఆదుకుందనీ
చల్లగాలి కొంగు చెమట తుడిచినంతలో
పిల్లబాట పాదాలను తాకుతుందని
ఎన్నడైన వెనకడుగు వేయలేదని
ఏటికైన ఎదురీదే గుండె నీదని
నింగి నేల వంగి తల్లి నిన్ను జూసి మురిసెననీ ॥పారే॥


నీళ్ళు యాడా దొరకవాయే......



నీళ్ళు యాడా దొరకవాయె నేందన్నా
నీతి లేని సీమాంధ్ర పాలనలో... ॥నీళ్ళు॥

ఎక్కడ ఏ ఊళ్ళ జూడు సుక్కనీరు లేకపాయే
పల్లెలు పట్నాల గొంతు పిడ్సగట్టి ఎండిపాయే
బోరు బావులెండి పాయే నల్లలేమో రాకపాయే
బోరున విలపించేటి జనంగోడు జూడరాయే
బోనం కుండలు గావవి నీల్లులేని బిందెలు ॥నీళ్ళు॥

మంచినీటి చెరువులన్ని మురికినీటి తొట్లాయే
మనిషిలోని స్వార్ధానికి వనరులన్ని కతమాయే
పక్షులు జీవాలు దుపకల్లాడి ఆగమాయే
పసుల మేత గొనలేకా కొతకమ్ముకునుడాయే
జీవిగంజిగూడా కల్లు సార దెచ్చి పోసుడాయే ॥నీళ్ళు॥

చెరువుకుంట లేకుంట కబ్జాలు జేసుడాయే
చెదలు బట్టినట్టు నేల రియలెస్టేటై పాయే
జలవనరుల మింగి వాల్లు నీళ్ళ పొదుపు జేయ్యమనే
ప్యూరిఫైడు నీల్లు గొని పుష్కలంగ దాగమనే
గాలి నీల్లు కొని బతికే గడ్డు రోజులే వచ్చే ॥నీళ్ళు॥

అభివృద్ధి చెందుతున్న అందమైన దేశమనీ
అన్నింట ముందుండే అగ్రరాజ్య కూటమనీ
మనకున్నా లేకున్నా మంది గొప్ప కోసమని
మంచినీల్ల నమ్ముకొని మన కొంపలు గూల్చెననీ
సిరిగల్లా దేశమంటె ఉరిబెట్టి సంపుడేనా.. ॥నీళ్ళు॥


ప్రాజెక్టుల నీళ్ళులేవు...



ప్రాజెక్టుల కోసం వీళ్ళు ప్రాణాలను బలి పెడుతుండ్రు
ప్రజలను ముంచే వాళ్ళే మన పాలకులై పోయిండ్రు
ఎంత మొత్తుకున్నా నెత్తి నోరు కొట్టుకున్నా
ఏందని అడిగెటోడు లేడు ఆపద దీర్చెటోడు లేడు ॥ప్రాజెక్టుల॥

సాగరు శ్రీశైలాన సగమూ ఒండే నిండే
సల్లగ సినుకే పడితే సప్పున అలుగెలుతుండే
మూన్నాళ్ళకె మల్లా ఎండీ ముడతలు బడిపోతుండే
ముసురుకుంది కరువూ మనకూ ముందు సూపులేకా ॥ప్రాజెక్టుల॥

క్రిష్ణా గోదావరులు కిలకిల వలసలు పాయే
శ్రీరామసాగరు ఎండీ సీతమ్మ తెరలైపాయే
ఒకరిని మించీ ఒకరు ఒకటే యాత్రలు జేసే
ఒక్కడైన జనమూ గోసను జూసినోడు లేడే ॥ప్రాజెక్టుల॥

కాల్వల నీల్లే లేకా కన్నీరే వరదై పారే
బాబ్లీ కుట్రలతోని మన బతుకే బుగ్గయ్ పాయే
పైనించి వచ్చే నీల్లే మన పంటకు రాకుంటాయే
మైనరు చెర్లు నింపనోల్లు మాటల కోటలెన్నో గట్టే ॥ప్రాజెక్టుల॥

హైదరబాదు సుట్టూ అరె చెరువులు సరస్సులు ఎన్నో
హైటెక్కనె హంగుల పేర అన్నింటిని మాయం జేసే
మన భాగ్యానగరం ప్రజలా భలె దూపను దీర్చిన చెరువు
మీరాలమెట్ల బాయే మీకూ నిదుర ఎట్ల బట్టే ॥ప్రాజెక్టుల॥

చెత్తా చెదారమంతా మన హుస్సేను సాగరు నిండే
మూసీ వరదల నాపే ప్రాజెక్టులు పాడైపాయే
దుర్గం చెరువే నేడు దుర్గంధం పాలయ్‌పాయే
దూతలోలె వచ్చి మేత మేసీ పోతే సాలా ॥ప్రాజెక్టుల॥

ఉదృతమైనా ఏరు భలె చెరువుల నిండా నీరు
ఉప్పల్ రామంతపూరు అరె గొప్పగ వెలసిన ఊరు
కబ్జాదారుల నెలవై కనపడకా పాయెను చెరువు
కసితోని రగిలిపోయి నువ్వు కాలు దువ్వి లేరా
నీటి పోరు బాట నువ్వు కలిసి నడిసి రారా


గలగల పారేటి మూసీ



గల గల పారేటి మూసీ నది ఏడుందల్లో ఇలలో
మిల మిల మెరిసేటి మూసీ జాడేడుందల్లో ఇలలో
గంతులు వేసేటి మూసీ గంగల గలిసిందో దేవా
ముక్కులు మూసేటి మురుగు నీరై పోయిందో దేవా ॥గల॥

అనంతగిరి కొండ మూసీ పుట్టిన సోటల్లో ఇలలో
అనంతమై సాగే మూసీ కిష్టల గలిసిందో ఇలలో
ఉరుములు మెరుపుల్లో మూసీ ఉరకలు వేసిందో ఇలలో
ఉత్తర గంగమ్మయ్ మూసీ ఉప్పొంగి దునికిందో ఇలలో ॥గల॥

కలిసెను మూసీలో వరద కాలువలూ ఎన్నో ఇలలో
కన్నుల పండువగా మూసీ కలిమిని పంచిందో ఇలలో
లక్షల ఎకరాల పంటను పచ్చగ జూసిందో ఇలలో
లచ్చీవమ్మోరయ్ గరిసెలు గుమ్ములు నింపిందో. ఇలలో ॥గల॥

చెరువూ కుంటల్లో మూసీ అలలై ఆడిందో ఇలలో
చేపా పిల్లలకూ మూసీ తల్లయ్ పోయిందో ఇలలో
పక్షులు పలుకంగా మూసీ పరవాశించిందో ఇలలో
పసులు జీవాల దూపను దీర్చి మురిసిందో ఇలలో ॥గల॥

మూసీ వాగుల్ని ముందే మింగిన దొరలయ్యో దేవా
రెడ్డీసు దీవీసు ఎన్నని సెప్పుదు నేనయ్యో దేవా
మూసీ పొడుగూన లెక్కకు మించిన కంపెండ్లో దేవా
అక్రమ అనుమతులే అడిగే నాధుడు లేడయ్యో దేవా ॥గంతులు॥

మూసీ నదిలోకి విషపు నీటిని వదిలిండ్రో దేవా
ముచ్చటగా బతికే పల్లెల ప్రాణం దీసిండ్రో దేవా
మూసీ రక్షణకై మీరూ కలిసి రావాలే ఇలలో
ముసిముసి నవ్వుల్లో మూసిని మల్లా జూడాలే ఇలలో
మూసీ రక్షణకై మీరూ కలిసి రావాలే ఇలలో


జలజలజల వానరా..



జలజలజల వానరా వాగు లేక పాయెరా
యాడజూడు సెరువు కుంట జాడ లేక పాయెరా ॥జలజల॥

ఆకాశం నుంచి గంగ నేలరాలి వరదలయ్యి
నిలువనీడ లేక తాను ఉప్పునీటి పాలాయె
భూమాత ఒడిన గంగ కంపూ కాలుష్యమయ్యి
మురుగునీటి మడుగయ్యి అడుగంటి ఎండిపాయె
నీరు పాతాళం జేరంగ పల్లెతల్లి అల్లాడే ॥జలజల॥

పత్రికలు టీవీల్లో నీటి పొదుపు కోసమని
ప్రకటన జేయించి వాళ్ళు చేయి దులుపుకునుడాయె
కూట్ల రాయి దియ్యనోడు ఏట్ల రాయి చెస్తమని
నదుల నీళ్ళు మలిపి ఆనకట్టలెన్నొ గడుతమనె
వరదనీటి నాపలేని వగలమారి నాయకులు ॥జలజల॥

నీటి బొట్టు మీద కట్టు కథలెన్నొ జెప్పెటోల్లు
కల్లబొల్లి మాటలతో కాలమెల్ల దీసినారు
మేఘాలను మధించగ యాగాలు జేసెటోల్లు
జలయజ్ఞం పేరుతోని జనం కడుపు గొట్టినారు
చెరువు గండ్లు పూడ్చలేని చేతగాని నాయకుడు ॥జలజల॥

గలగల పారేటి మూసి నవుసుకుంట నడిసింది
మురికినీటి కాలువయ్యి ముక్కు మూసుకుంటుంది
నదులు కాలువలెండి గొలుసుకట్టు ఊడింది

సుక్క నీరు లేక నేల నెర్రెబట్టి పోయింది
జలవనరులు కబ్జాజేసి జల్సాగ దిరుగుతుండ్రు ॥జలజల॥

సెంటు భూమి మిగలకుంట అంటుగీకి తిన్నట్టు
కంటబడితె గంటెడైన కబ్జా జేసుకుంటుండ్రు
ఎటు జూసిన ఏమి లేక సెర్లమీద వాలిండ్రు
పొంగి పొర్లె కుంటల్ని కూడబోసి కూసుండ్రు
స్వార్థంతో నిండి మనిషి సాటి వాన్ని మరిసిండు ॥జలజల॥

సహజనీటి వనరులన్ని శెర్వాకం జేసిండ్రు
సాయమేదొ జేసినట్టు సంకలు ఎగరేస్తుండ్రు
ఉప్పొంగి పారేటి ఉష్కాగులు మింగిండ్రు
ఎక్కిళ్ళు బెట్టి ఏడ్చే ఎతలల్ల ముంచిండ్రు
ఊట శెలిమలెండబెట్టి ఊరేగే నాయకులు ॥జలజల॥

కంపెనీల కాలుష్యం భూగర్భంలోన బెంచి
ఫ్లోరైడ్ భూతానికి ఊతమిచ్చి ఊగెనని
తాగు సాగు నీరు లేక తండ్లాడేటోల్ల జూసి
మన రాష్ట్రం తెలంగాణ మిషన్ కాకతీయన్నది
చెరువు కుంటలన్ని గూడ జలకళతో ఉండాలని

ప్రాజెక్టులె ఈ నేలకు ప్రాణమంటు కదిలెరా
ప్రతినబూని పల్లెపల్లె ప్రభుత్వంతో నడిసెరా


ఏరంచు మా ఊరు..



ఏరంచు మా ఊరు ఎగిరి దునికే సెలయేరు
గల గల పారె మూసిలొ నిత్యం అలలయ్యి కదిలేరు ॥ఏరంచు॥

ఎటువైపో సాగే గమ్యం తెలియని ఈ పయణంలో
ఏటికి ఎదురే ఈదంగ ఎన్నెల నీపై కురిసేనే
తూరుపు దిక్కున మెరిసేటి వెలుగురేకలు మీరయ్యి
నడిచెర్లో సూరీడయ్యి నడిసొచ్చే నా పల్లె ॥ఏరంచు॥

గణగణ మోగే వల పూసలతో కాలి నడకన కదిలేరే
పురుగుబూసి మిమ్ముల జూసి మీకే దండం బెట్టేనే
గండాలెన్నో నిను దాటించే గంగమ్మే నీకుండంగ
ఆపదలన్నీ తొలగిపోయి ఆనందాలు విరిసేనే ॥ఏరంచు॥

గుడిసెల్లో ఆటాడే పసివాళ్లే ఉండరులే
బుడుగు బుడుగున మునిగే తేలే బుడుబుంగల్లే వస్తరులే
నీటిలో తిరిగే చేపలతోటి పోటీ పడతావుంటరులే
నీరుకోళ్ళ కూతలు వింటూ కేరింతలే కొడతరులే ॥ఏరంచు॥

సుడిగుండాలను ఛేదించి సునామినైనా ఎదిరించే
ఒడుపే నీది జడుపే లేని గెలుపే నీదవుతున్నదిలే
సుట్టూ కమ్మిన చీకటి చీల్చే వేకువ నీవైతావులే
పల్లెకు తరగని వెలుగులు నింపే నాయకులే మనకున్నరులే


ఉదయించే సూర్యుడు..



సాకీ: ఎవరికీ ఎవరూ ఏమీ కారు - చివరికీ నీతో ఎవరూ రారు
       వెలుగులో నీతో నడిచిన నీడ - చీకటి కమ్మితే నిను విడిపోవును
       ఏదీ ఎవరికి సొంతం కాదురా...
       ఎపుడూ సృష్టికి అంతం లేదురా...

ప॥ ఉదయించే సూర్యుడు నీలోనె ఉండురా
      ప్రతిరోజు చస్తూనే బతుకుతావురా
      ఉరిమేటి మేఘం నీలోనె ఉందిరా
      ఉప్పెనగా మారేందుకు ఒప్పుకోవురా
      పడిలేచే కెరటాలను పలకరించరా.....
      ఒడిదుడుకుల నీ పయణం ఒడ్డు చేరురా ॥ఉదయించే॥

ఒకడు: నీ తీయని పాటల్లో కోయిలమ్మా - గుండె గాయాలో మానిపోవునోయమ్మా
          నీల చల్లని చూపుల్లో వెన్నెలమ్మా -
          కంటి చూపెందుకే మాకింకా ఓయమ్మా
          అమెరికోని అడ్డమీద కోయిలమ్మా - అడుకతినే కొడుకులే పెద్దలమ్మా
          అవినీతి పెద్దబోద వెన్నెలమ్మా - ఆకాశంకేసి చూసే జాబిలమ్మా

చ॥ నలుదిక్కులు నావేనని తిరుగుతున్నదీ నీవే
      దిక్కు నాకు ఎవరంటూ అడుగుతున్నదీ నీవే
      విధి రాతకు తలవంచి కుములుతున్నవో...
      ఇదే ఖర్మభూమియనీ బతుకుతున్నవో...
      నిన్నటి వరకూ నీ వెంటనె ఉంటూ
      నీతో నడిచిన వాడే శత్రువైతడూ
      ఎన్నటి నించో ఎదురు చూస్త ఉంటడు

           అదును చూసి తెలియకుండ కాటు వేస్తడు
           స్వార్ధంతో నిండి ఉన్న సంఘంలోనా
           అవిటిదయ్యి కుంటింది మానవధర్మం
           చెవిటిదయ్యి వింటుంది ఏలే రాజ్యం ॥ఉదయించే॥

ఒకడు: పాలు నీల్లను వేరు చేసినా పరంధాముడే నేనయ్యా
          ఏనుగు తిన్నా ఎలగ పండులో గుజ్జును మింగిందెవరయ్యా

చ॥. అడుగడుగున అవమానం భరిస్తున్నదీ నీవే
          అనునిత్యం చితిలోనా రగులుతున్నదీ నీవే
          అవనిలోన ఎన్నిటినో వదులుకున్నవో...
          అయినవాళ్ళ కెందరికో దూరమైనవో...
          కాసుల కోసం కన్న తల్లిదండ్రులా
          కాటికి పంపేటి కంత్రి కొడుకులున్నరూ
          ఆస్తుల కోసం అన్నదమ్ములనైనా
          హత్యలుజేసేటి ఇగో ఇస్టులున్నరూ
          స్వార్ధంతో నిండి ఉన్న సంఘంలోనా
          అవిటిదయ్యి కుంటింది మానవధర్మం
          చెవిటిదయ్యి వింటుంది ఏలే రాజ్యం ॥ఉదయించే॥

ఒకడు: బ్రాంది విస్కీ పక్కన ఉంటే బాధ్యతన్నది భారంకాదు
          ఊర్వశి మేనక పక్కన ఉంటే ఊకదంపుడిక ఎందుకు మామ
          ఎవ్వరే నీ వనమూ లోనా హెచ్చరించావే లలనా
          వేటకొచ్చిన రాజే అయినా వేటు తప్పదులే లలనా

చ॥. కులాలుగా మతాలుగా గిరిగీసుకున్నదిరా
          వర్ణాలుగ వర్గాలుగ విడిపోతు ఉన్నరురా

              అజ్ఞానం జడలిప్పీ ఆటలాడెనో...
              విజ్ఞానం తోకముడిచి పారిపోయెనో...
              బిచ్చపోని గుడిసె దోసె బడా బాబులు
              బిలియనీర్లమని ఫోజులు కొడతఉన్నరు
              బుడ్డగోశి గుంజుకునే పెద్దమనుషులు
              బుద్ధిమంతులోలె మనా మధ్యకొస్తరు
              స్వార్ధంతో నిండి ఉన్న సంఘంలోనా
              అవిటిదయ్యి కుంటింది మానవధర్మం
              చెవిటిదయ్యి వింటుంది ఏలే రాజ్యం ॥ఉదయించే॥

ఒకడు: వేరీజ్ ద డాక్టర్ వైట్ కోట్ స్టెతస్కోప్
             పట్టుకుంటే సరిపోతుందా వేరీజ్ ద డాక్టర్

వేరొకడు: ఎయ్‌రా ముక్కలు - ఎక్కా చిక్కితే లెక్కా పక్కరా
             రమ్మీ ఆడనా రమ్మే కొట్టనా
             ఎక్కిన కిక్కుతో కింగును పట్టనా - చిక్కిన లక్కుతో షో అని కొట్టనా

చ॥ చెట్లనీడనూ మించిన స్వర్గమెక్కడున్నదిరా
             ఎట్ల బతికినా గానీ ఓర్వలేని కాలమురా
             మనిషి ఆశకేనాడు అంతు లేకున్నదో...
             మానవత్వపూ జాడ మనకు మిగలకున్నదో..
             ధ్వంస రచన దర్జాగా చేసే లోకం
             దగాకోర్ల అండతోని దాడి చేసెరా
             ఉన్మాదపు ఊయలలో ఊగే లోకం
             ఊడలతో సన్మార్గపు గొంతు నులిమెరా
             స్వార్థంతో నిండి ఉన్న సంఘంలోనా
             అవిటిదయ్యి కుంటింది మానవధర్మం
             చెవిటిదయ్యి వింటుంది ఏలే రాజ్యం ॥ఉదయించే॥

ఒకడు: అల్లాహో అక్బర్...పాపులను రక్షించు ప్రభువా...
           లోకుల కాపాడు దేవుడా...
           సంఘం శరణం గచ్చామీ.. బుద్ధం శరణం గచ్చామీ

          వేసిన ప్రతిగింజ ఎపుడు మొలకెత్తదురా
          పూసిన ప్రతీపువ్వు ఎపుడు కాతగాదురా
          అంతులేని ఆశతీరి మనుషులెప్పుడైతరో...
          అసమానతలే లేని రోజులెప్పుడొస్తయో
          ఉన్ననాడు మస్తుగ కేరింతలే వేద్దాము
          లేనినాడు పస్తులతో కండ్లు మూసుకుందాము
          ఉన్నదే మనదంటూ చాటింపు వేద్దాము
          ఎండమావులా వెంటా పరుగులు మానేద్దాము
          ఏ స్వార్ధం లేనివాళ్ళు మనమేనంటా
          సర్వస్వం త్యజియించిన బుద్ధులమంటా
          సకల భోగాలను విడనాడినమంటా
          అవిటిదయ్యి కుంటింది మానవధర్మం
          చెవిటిదయ్యి వింటుంది ఏలే రాజ్యం ॥ఉదయించే॥


ఆకాశంలో మెరిసే....



ఆకాశంలో మెరిసే పున్నమి వెన్నెల రావమ్మా
ఆడపిల్లలను చంపేవాళ్ళను మనుషుల జేయమ్మా
చల్లని మనసును ఇవ్వమ్మా
అయినవాళ్ళే రాబందులయ్యి సంపుకతింటారే
నా కన్నవాల్ళే కాటికిబంపే యములై పోతారే
వీడని గ్రహణాలైతారే.. ॥ఆకాశంలో॥

కడుపులో బిడ్డ ఆడపిల్లయని తెలుసూకుంటారే
కత్తులే దూసి కన్నా పేగుని కరుగాదీస్తారే
సంపలేని తల్లి ఆడపిల్లలని ఊయల లేస్తాదే
సందమామాకన్న అందమైనా బొమ్మనమ్ముకుంటాదే
అంగడి సరుకును జేస్తాదే.. ॥ఆకాశంలో॥

కొడుకు బుడితేసాలు కొండంత అండని పొంగిపోతారే
కోడెనాగులయ్యి ఆడపిల్లలను కాటూ వేస్తారే
పుట్టినా ప్రతి ఆడపిల్లను ఎట్టీకేస్తారే
పుట్టనీ ఆ కొడుకూ కొరకు పూజలుజేస్తారే
పాముకు పాలూబోస్తారే ॥ఆకాశంలో॥

అమ్మశక్తియని కొలిసిన కాలం ఏమైపోయిందే
ఆదిశక్తియని తలసిన లోకం ఎటువైపెల్లిందే
నాటినుండి ఈ ఆడ బతుకునిండా చీకటే కమ్మిందే
కాటిలో కలిసిపోయే దాకా విడిచే పోనందే
ఆరని చితియై రగిలిందే... ॥ఆకాశంలో॥

తల్లి ఆవు తన దూడలేకపోతే నీరే ముట్టదులే
అంబా అంటూ అరిసీ అరిసీ పరుగులు దీస్తదిలే
నోరు లేని ఏ మూగజీవి లింగబేధము జూడదులే
జ్ఞానవంతులయ్యి నెత్తుటి గుడ్డుని పారేస్తున్నరులే
కంపల ఇసిరేస్తున్నరులే ॥ఆకాశంలో॥

నిన్నుకడుపులో పెంచి పెద్దజేసే తల్లి ఆడదే కదరా
నువ్వు సచ్చిపోయేదాకా సేవజేసే తల్లి ఆడదే కదరా
అట్లాంటి తల్లిని బంగారుబొమ్మను సంపివేయకురా
ఆడపిల్లలేని ఊళ్ళను జూసి ఆనందించకురా
నువ్వు ఏకాకివైపోకురా ॥ఆకాశంలో॥


అమ్మా నువ్వో...



అమ్మా నువ్వో కన్నతల్లివేగా..
ఓయమ్మా నిన్నో తల్లే కన్నదిగా
అప్పుడే మీయమ్మ నిన్ను గొంతుబిసికి చంపి ఉంటే
ఆడపిల్లవని నిన్ను గూడా అంగట్లో అమ్ముకుంటే
కన్నప్రేమను పొందే దానివా ఓయమ్మా నువ్వూ
తల్లివై జన్మనిచ్చేదానివా మాయమ్మా నువ్వూ... ॥అమ్మా॥

పుడమిలో ఈ ఆడజన్మ ఎంత లోకువయ్యెనమ్మా
అత్తమామలు అమ్మనాన్నలు అందరికీ చేదైతివమ్మా
ఎందుకే ఈ పాడుజన్మ ఎట్లరాసెనో ఆ బ్రహ్మ
కాలమేదీ అయినగానీ కర్మనీకు తప్పలేదే
ఆడిపాడే బొమ్మను జేసినరే ఓయమ్మాలారా..
అమ్ముకూనే సరుకును జేసినరే... ॥అమ్మా॥

సృష్టిలో ఏ జీవిగూడా ఇంతపాపం జేయదమ్మా
పాముగూడ పిల్లలల్లో ఆడమగ తేడాజూడదమ్మా
ఆదిశక్తివమ్మా నువ్వే.. ఆదినుంచి ఇట్లఉంటే
కమ్మనైన అమ్మపాలే కాలకూట విషమైతే
కాలమే గతిమారిపోవునే ఓయమ్మలారా
కనిపెంచే తల్లూలెవ్వరే...

ఎంతమాయా కాలం జేసినరే ఓయమ్మలారా
మగపిల్లలకే తల్లూలైనరే మాయమ్మలారా..


గాయపడుటే....



గాయపడుటే ధర్మవమ్మా
గాయపరుచుట కూడదమ్మా
గాయమే... గాయమే మది నిలిచిపోవు
గేయమై అది మేలుకొలుపు ॥గాయ॥

గాయపడనిదే పుడమితల్లీ
సృష్టికీ పురుడోసెనా...
గాయపడనిదే ఆడజన్మ
బిడ్డలను కనిపెంచునా...
గాయమంటే త్యాగమమ్మా
గాయమే నిర్మాణమమ్మా
గాయపడరా ఎప్పుడైనా మూగజీవుల గోసకు
గాయపడరా ఇప్పుడే ఈ అడవి తల్లి రక్షకు
బిష్ణోయితల్లి లక్ష్యమై.. ॥గాయ॥

గాయపడనిదే గంగమాత
ఎత్తిపోతలు దునుకునా...
గాయపడనిదే రైతుగుండే
రత్నరాసులు నిండునా...
గాయమంటే గురువుమాట
గాయమే నీ వెలుగుబాట
గాయపడరా ఎప్పుడైనా మూగజీవుల గోసకు
గాయపడరా ఇప్పుడే ఈ అడవి తల్లి రక్షకు
బిష్ణోయితల్లి లక్ష్యమై.. ॥గాయ॥

చెట్లు నరికే దుండగులకు
నీడ విలువా తెలియునా...
మనల సంపిన మొండి మనిషికీ
ప్రాణి విలువా తెలియునా...
ఆత్మత్యాగం తప్పదే
అథములను మార్చేందుకు
గాయపడరా ఎప్పుడైనా మూగజీవుల గోసకు
గాయపడరా ఇప్పుడే ఈ అడవి తల్లి రక్షకు
బిష్ణోయితల్లి లక్ష్యమై.. ॥గాయ॥

('ఆత్మగీతం' నాటకం కోసం రాసినది...)


కొండల్లో... కోనల్లో....



సాకీ... రేలారే... రేలారే.....
కొండల్లో...... కోనల్లో.......

కొండల్లో కోనల్లో కోయిల పాటల బాటల్లో
ఎండల్లో వానల్లో వెన్నెల వెలుగుల జల్లుల్లో
ఆడీపాడీ గెలిసీ నిలిసీ...
తడిసీ మెరిసీ మురిసీపోయే బొండుమల్లె పువ్వులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

రేకులు విచ్చిన వేకువపొద్దు ముగ్గుల ముంగిల్లో
రెక్కలు విప్పిన పక్షుల గుంపుల పలకారింపుల్లో
పుడమి తల్లి పులకించిపాయే
పూలవాన కురిపించిపాయే
ఆకో అలమో కాయో పండో కడుపులు నింపేనే
ఆకలి దప్పులు అలసట వెలువని జింకపిల్ల గుంపులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

జుంటు తేనే ఇప్పదారు జుర్రిన జంటల్లో
జుంబకు జుంబా రేరే రేలా అడుగుల దరువుల్లో
డప్పుడోలు తుడుమే మోగే
దిక్కులన్నీ ధింసా ఆడే
కోలాట పాటల్లో కూకీ పిట్టెలు గొంతులు గలిపేనే
కోతుల జాతర గుస్సాడి నాట్యం కొండమల్లె నవ్వులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

టేకూ సిల్లా నల్లామద్ది వెదురూ వేపల్లో
నేరెడు మారెడు తునికీ తుమ్మ కానుగ నీడల్లో
పచ్చని చెట్లే పందిరి వేసే
పాల పిట్టెలే ఈలలు వేసే
మాయామర్మం లేనీ మదిలో మల్లెలు విరిసేనే
మాపటి వేళకు చంద్రుని కోటకు మచ్చలేని జీవులు
ఈ అడవితల్లి బిడ్డలు ॥కొండల్లో॥

గుండ్లు రాళ్ళు పరుపూబండలు సెలయేటి దారుల్లో
గుంపుగ బయలెల్లే అడవీ బిడ్డల చీమల బారుల్లో
నేల బొయ్యారాల బొగ్గుగనులాయే
పాతాళమే జేరి పనిజేసుడాయే
రేయి పగలు నింగీ నేల తెలియని వాళ్ళేనే
రెక్కల కష్ఠం సుక్కల లోకం చేరుతున్న తారలు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

బాంబుల మోతకు బ్లాస్టింగు దెబ్బకు కొండలు గూలేనో
బావురుమన్నా అడవీబిడ్డల గుండెలు బగిలేనో
పేలిన తూటాల గాయాలాయే
పేగుబంధాలన్ని దూరమైపాయే
మానేకాదు మనుషులకన్న జంతువు మేలేనే
పులులు సింహాలు కుందేళ్ళ గంతులు నెమలిపిల్ల గుంపులు
ఈ అడవితల్లీ బిడ్డలూ..... ॥కొండల్లో॥

నెల్లాల్ల బిడ్డల్ని ఉయ్యాలలూపే మర్రీ ఊడల్లో
నేతలు జేసే విధ్వంసానికి ఉరి బెట్టుకుందల్లో
ఉడుత పిల్లలా ఊపిరిబాయే
ఉడుముల నడుములు ఇరిగేపాయే

సీతాకోకా చిలుకల ప్రాణం లెక్కకు రాదాయే
కోయో గొండో లంబాడీ తండో గూడుజెదిరిన గువ్వలు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

పొద్దుగూకిందంటే తోడేళ్ళ గుంపోలే గూడాలమీదల్లో
పోలీసు లాఠీల తూటాల సప్పుడు ఆగినదేడల్లో
పాలిచ్చే తల్లుల పాడు జేసెనే
పాలుదాగే పోరగాళ్ళ జంపేనే
మూడూగాళ్ళ ముసలివాళ్ళ ప్రాణాలు దీసేనే
ఎక్కడ ఏమైన ఎన్‌కౌంటరైపోయే నోరు లేని జీవులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

ఎంగిలి పండ్లను రామునికిచ్చిన శబరీ మాతల్లో
ఎలగా జీడి జిబిలిక పండ్లా జాడే లేదల్లో
మొక్కజొన్న బెండ్ల అంబలేనాయే
దిరిసెన గడ్డలు తిని బతుకుడాయే
కరువులో నాగజెమ్ముడు పండ్లు కానారావాయే
కాటుక చీకటి చుట్టూ కమ్మిన కలతలేని జీవులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

ఈటెలు బల్ల్యాలు ఇసిరే బోయల వేటను జూడల్లో
గురువులేని కాడ ఏకలవ్యులై ఎదిగీనారల్లో
రాంజీగోండు సాహసమాయే
కొమరంభీముని పౌరుషమాయే
సమ్మక్క సారక్క యుద్ధం జేసీనా పోతూగడ్డేనే
సంగ్రామమేదైనా రణరంగమే జేసి ఎదురునిలిసే వీరులు
ఈ అడవితల్లీ బిడ్డలూ.... ॥కొండల్లో॥

('ఆత్మగీతం' నాటకం కోసం రాసినది...)


ఎదిగే యువలోకం...



ఎదిగే యువలోకం ఎటువైపో నీ గమనం
నడిసే నవలోకం నవరసాల సమ్మిళితం
అలలై ఎగిసే ఆనందంలో
అలసట లేని తన పయనంలో
పోటీ ప్రపంచ సంచలనం
పెను తుఫాను చదువుల కల్లోలం ॥ఎదిగే॥

రాళ్ళను పేర్చిన బొమ్మరిళ్ళలో
వాగున కట్టిన పిట్టె గూళ్ళలో
ఎంతో జ్ఞానం ఇమిడి ఉన్నదని తెలియజెప్పెనన్నా
కొంగలు తాపిన తెల్లని పాలు
కోయిల పాడిన తీయని పాట
తృప్తిని మించిన సంపద లేదని చాటి చెప్పెనన్నా
సీసంగోలిని సూటి బెట్టడం - సీమ సింతకై రాళ్ళు రువ్వడం
అష్టా చెమ్మ జిల్లి దండలు - ఆకలిని ఓడించి గెలవడం
ఓటమి గెలుపునకర్ధం తెలిపే - ఓనమాలు గల క్రీడా లోకం ॥ఎదిగే॥

ఆటలు మరిసిన క్రికెట్ మాయలో
పాటలు కొలవెరి సంగీతంలో
జాజర పాటలు జానపదుల కోలాటమేదిరన్నా
కోతి కొమ్మల ఊయల జోరు
ఖోఖో కబడ్డి పరుగుల హోరు
పడినా లేచి కదిలే కెరటం పరుగు పందెమన్నా
అమెరిక చైనా జపాను కొరియా - పసిడి పంటలో ముందు నిలవడం

అగ్రదేశముగ ప్రపంచపటమున - జ్ఞానజ్యోతి వెలిగించి నడవడం
ఓటమి గెలుపునకర్ధం తెలిపే ఓనమాలు గల క్రీడా లోకం ॥ఎదిగే॥

బాల్యం ఇప్పుడు బాధల బడిలో
యువతీ యువకులు రంగుల కలలో
సినిమా టీవి ఇంటర్‌నెట్ సెల్‌ఫోను మాయరన్నా
శాస్త్రజ్ఞానం పెరిగిన రోజులు
సాఫ్ట్‌వేరులు ఇంజనీరులు
మహిళల మెడలో గోలుసును గుంజే ఒడుపు నేర్చెనన్నా
అమ్మా నాన్నల అక్రమ సంపద - అంతా నాదని దారి తప్పడం
అందని దానికి నిచ్చెనలేసి - లవ్వే లైఫని చిందులేయడం
చరిత్ర గతిని మార్చే యువత చెదపురుగయ్యెను సమాజానికి

ఎదిగే యువలోకం ఎటువైపో నీ గమనం
నడిసే నవలోకం నవరసాల సమ్మిళితం
అలలై ఎగిసే ఆనందంలో
అలసట లేని తన పయనంలో
ఎత్తిపోతలు దునుకంగ ఎగిరే విహంగమవ్వంగ ॥ఎదిగే॥


తాల్లో... ఎన్నీయల్లో



తాల్లో ఎన్నీయల్లో ఈదులో ఎన్నీయల్లో
తాటి వనమున్న పల్లే సూడసక్కధనము తల్లో
కంఠమహేశ్వరుడు మన ఇంటి దైవము
సర్వాయి పాపన్న నీ గుండె దైర్యము ॥తాల్లో॥

ముప్పొద్దులా గీత బెట్టా అడవీతల్లికి పెద్దబిడ్డా
మోకుఏసి కదిలెనమ్మో ముస్తాదులో మువ్వ బలుకా
పొద్దూ పొద్దునలేసి పొద్దుతో నడిసీ
ఆకలి దూప బాసి ఆకల్లు వొడిసీ ॥తాల్లో॥

కర్రల కల్లే కల్లూ దొరకకుంటే పానమెల్లు
పందాళ్ళ కల్లే కల్లూ అది దొరికినోడె రాజమల్లూ
ఆడికబట్టి తాగ రంగూ దేలును వొల్లు
ఆ వింత జూడంగ సూరారమెల్లు ॥తాల్లో॥

బొట్లు బొట్లుగ ఉట్టేనీరా పోతు పరుపుల పాలధారా
కర్రలు వొంపలు బారా కల్లు దాగుదాము పారా
యజ్ఞయాగాలల్ల దేవాన దేవండ్లు
కుతిదీర దాగంగ సురపానమన్నారు ॥తాలో॥

పరువులో బుస్సున బొంగీ గుడిలోని తీర్ధాన్ని మించీ
పండోలె కమ్మనీ వాసన పడ్సుపిల్లా ముద్దులడుగ
కల్లుకుండా తోడు కాటమయ్యను జూడు
అమ్మో నిన్నిడువ నన్నట్టు ఉంటావు ॥తాల్లో॥

సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కల్లు
ఆడపిల్లలైనా గాని బతిలాడి పోసేది కల్లు
అమ్మవారు బోసి ఆరమ్మ గోసయ్యి
అల్లాడిపోతుంటె కల్లొంపి మొక్కేది ॥తాల్లో॥

పురుడు జేసేటపుడు కల్లు జీవి బతకలేక సస్తే కల్లు
పిల్ల కుండల్లకొస్తే కల్లు గా పెండ్లిలో మెప్పించె కల్లు
సావు పుట్టుకలోను సంభరాలల్లోను
కల్లులేనిదేడ కానరానిదేడ ॥తాల్లో॥

అత్తకోడలు పంచాది అగ్గిమీద గుగ్గిలాలే
ఆలుమొగల కొట్లాట ఆపలేడు ఎవ్వడైనా
ఏతీరు పంచాది ఎన్నిరోజులైనా
కల్లుకుండాతోనే తత్వజేసేది ॥తాల్లో॥

ముంజ కొడవలి సేతబట్టి సందమామల్ని దీసి
ముసలోల్లు పసిపోరగాల్లు ముద్దుజేసే తాటిముంజ
నీళ్ళాడ పొద్దుల్లో తాటిగేగులు జూసి
ఆడోల్లు ఆశగా అడిగేది కాదా ॥తాల్లో॥

ముక్కంటి కాయల్ని జూసి తాటి గిల్లల బండ్లు జేసి
సొప్పబెండుకు కమ్మగుచ్చి గాలికమ్మలతోని ఆడి
తాటిపండ్లు గాల్చి గట్కొలే జుర్రంగ
రోగం నొప్పి లేక పిల్లలెదిగేది ॥తాల్లో॥

శామడంలో కీడు బోను సెట్లకింది కెల్లంగా
యాటకూర వొండుకోని కల్లుకుండ బెట్టుకోని

శియ్యల కూరంటూ మన పోరగాల్లు
ఈత ముండ్లు గుచ్చి వైనంగా దినలేదా ॥తాల్లో॥

ఉగాది పండుగ నాడు ఎన్ని దంచి పులగ మొండినా
బోనాల పండుగ నాడు ఈరంగ మెంతాడి అలిసినా
కల్లార బొయ్యందే దీవెండ్లు ఇయ్యరు
కాదు కాదంటావా కథ తెలుసుకుంటావా ॥తాల్లో॥

పడిగడుపునా బొయ్యి తాగే పత్తెం సొమ్ము ఈత కల్లు
ఈత గెలలు దెచ్చుకోని గడ్డాములా మగ్గబెట్టి
రోజుబొయ్యి సూడ పండ్లు బండేది
జిట్టీత పండ్లెంత కమ్మగుండేది ॥తాల్లో॥

కొరివిలోన ఈరన్న కొంరెల్లి ఎములాడైనా
సమ్మక్క సారక్కలైననూ మైసమ్మ ఎల్లమ్మలైననూ
కల్లొంపి సాకలు బోస్తేనే దేవరా
జాతర్లో మన ఎంట కదిలొచ్చె నంటా ॥తాల్లో॥

యక్షగానం బాడెటోల్లు సిందు బాగోతాలోల్లు
కాలు గజ్జెగట్టి ఆడే కళాకారుడెవ్వడైనా
కల్లు లేక పోతే కాలు గదపడంటా
ఆదిజాంభవుడైనా మీసం దిప్పడంట ॥తాల్లో॥

ఎల్లమ్మ గుల్లో నంట దొబ్బలు దోర్ణాల పంట
మల్లన్న గజ్జెల్లాగు కల్లొంపితేనే మోగు
కథజెప్పే బైండ్లోల్లు కల్లు దాగకుంటే
మారుమాట మల్ల నోట రాదంట ॥తాల్లో॥

ఇండ్లు ఆకిల్లు ఊకే తాటి ఈత పొరకలమ్మా
ఎరుకలోల్లు జంగాలు అల్లిచ్చినా గంప జల్లా
ఇల్లిల్లు దిరిగమ్మే ఈతాకు సాపలు
ఎంత మోటైపాయే ఏడ గనరావు ॥తాల్లో॥

బువ్వ గుల్లలేసుకోని ఆసాములా ఇండ్లు దిరిగీ
మైలబట్టిన బట్టలన్నీ సౌడు సున్నమేసి ఉతికి
తీపులు బెట్టిన జబ్బ నొప్పి మరువంగా
శేరు కల్లు దాగ అల్లాడుతుంటావు ॥తాల్లో॥

బుడ్డమట్టలు బట్టితేను వొండుజెర్లో బెస్తలంట
కొరిమోలే మెరిసేటి ఎండ పిడ్సగట్టిన గొంతు దడుపా
కల్లుకుండాతొటి కట్టెక్కి వొచ్చేటి
గౌండ్ల సాయమ్మాను గనిపెడ్తు కూసుండ్రు ॥తాల్లో॥

సిటారు కొమ్మన జేరి సింతసిగురుగోసె తల్లి
ఆకు కూరలు అమ్మి అలసి కోపంలో దేవున్ని దిట్టి
సీకటి బడ్డంక సీస కల్లు దాగి
బాదలెటుబాయెనో సూడంగ తెల్లారే ॥తాల్లో॥

బాడబట్టి బండ్లు జేసి తొలిగొట్టి నాగండ్లు బెట్టి
గన్ను గొట్టి సుత్తెబట్టి కత్తులు కొడవండ్లు జేసి
రెక్కల కష్టం మరువా ఒడ్ల కమ్మరోల్లు
కల్లు పుల్లుగ దాగి కలలోకి జారేను ॥తాల్లో॥

నూలుపోగు మర్మమేందో ఆడికీడికి తిరుగుడేందో
చెరకాదిప్పి కండెబోసి మగ్గంగొట్టి మక్కిపోయి

పొద్దూగూకంతల కంచెడైనా కల్లు
గొంతు దడవకపోతే గొడ్డు బతుకంటారు ॥తాల్లో॥

గొర్ల మందలు తోలుకోని కొండలు గుట్టలు దిరిగి
గౌడొచ్చె యాల్లకు నువ్వు ఎర్రటెండల తాళ్ళ జేరి
ఒక్కరేక కల్లు తాగందె నీ వొల్లు
తెల్లారి మల్లెట్ట లేసి తిరిగేవు ॥తాల్లో॥

కుమ్మరన్న మట్టి దడిపి సారెదిప్పి లొట్లు జేసే
కుమ్మరాములు గూలిపోయి అగ్గిబుగ్గయ్ ఆగమైతే
సేరుముంతా మొదలు పట్వా కల్లుదాక
అంతెత్తు నురుగూతో ఆదుకోనెదురొచ్చే ॥తాల్లో॥

బండ గాల్చె మొండి ధైర్యం కల్లు కుండలోని పొంగే
కొరాడి బండలు దీసి కొట్టాల ఖడీలు దీసి
సెమట ఊటలు బుట్టి నెత్తురోడుతున్న
ఒడ్డెరోల్లకండ కల్లుకుండేరన్నా ॥తాల్లో॥

వరికోత మునుముల్లో తల్లి వంగి వంగి నడుము లిరిగి
ఆండ్రెబెట్టి ఎడ్లగట్టి నాగండ్లతో కోండ్రలేసి
సొరగొన్న గొంతుతో మనరైతన్నా
యాపపెట్టుకింద కల్లు దాగేది ॥తాల్లో॥

కల్లంలో పడుగూ బెట్టి కావలి బండంగ పొయ్యి
కల్లుమీద బుద్దిబుట్టా గుల్లేరు సేతుల బట్టి
అద్దుమ్మ రాతిరి లొట్లు బలగొట్టా
సొయి దప్ప దాగ పొద్దు బొడిసేది ॥తాల్లో॥

తాటిమొద్దులతోటి మనమూ ఇండ్లు కొట్టాలు గట్టి
ఎడ్లబండ్లు జేసే టపుడు పోలుగర్రగ నిలిసె తాడు
వాసాలు దూలాలు బండిపోల్లు నీకు
ఏది గావాలన్న తటిసెట్టే దిక్కు ॥తాల్లో॥

కాయకష్టము జేసినోల్లు పొద్దుగూక గూడుజేరా
తాటికమ్మల గుడిసెలోన సలువరాయి సల్లధనము
సీకటి ఎలుగు ఎండ వానల్లొ కమ్మ
బడుగు జీవుల సేద దీర్చేటి అమ్మ ॥తాల్లో॥

ఇసము నీల్ల ఫ్లోరిన్‌కు ఇరుగుడమ్మ తాటికల్లు
చెరువు కుంటలు కరువు అలుగు పల్లెలెండి మొండాలయిన
నిండు ముత్తయిదోలె తెలంగాణ పల్లె
తాటి ఈదులతోనె నిగ నిగ లాడేది ॥తాల్లో॥

కల్లుదాగితె బుద్ది బెరుగు పాపన్నకది పాలు పెరుగు
యుద్ధవ్యూహం జేసెటపుడు పట్వకల్లు దాగెడు
సర్వాయి పాపన్న గోల్కొండ గొట్టంగ
తనవంతు దైర్యాన్ని నూరిపోసెను కల్లు ॥తాల్లో॥

రాజుల కాలం అయినా నవాబులా పాలనయినా
మొఘలాయి పాలనలోనూ తెల్లదొరలా రాజ్యమయినా గాని
కల్లుమీద వొచ్చె సొమ్ముతోనే గదరా
ఇపుడుగూడ భోగ భాగ్యంగ ఏలేది ॥తాల్లో॥

గాలివానల్లోన గౌడు ఉరుములురిమిన బెదరనోడు
తడ్సినట్టి తాడు మీద నెర్సుమెరుపుతో నిలిసీ

సుక్కల లోకాన్ని ఎగబాకి నువ్వు
వీరునోలె కల్లు లొట్టి దింపేవు ॥తాల్లో॥

గెలలేసి సూడంగ తాడు పులకించిపోయేను గౌడు
తాటి జగ్గలు గోసెటపుడు రంపమై సింపిన గరులు
మట్టలెన్నోజీరి ఉగ్గాలు గట్టంగ
మన బతుకు పగ్గాలు బట్టింది ఎవడు ॥తాల్లో॥

మొగికమ్మ గొట్టుకోనొచ్చి రేకలెన్నో గట్టి ఇచ్చి
కొసపంటితో కమ్మజీరి వొడుపుగా మిద్దెల్ని గట్టి
కల్లోలికి పోకుంట కాపాడుకుంటావు
నీ నిండు జీవిత మెలితయ్యి పోతుంటే ॥తాల్లో॥

కల్లు దాగినపుడు నువ్వు కత్తోలిగుండేది కాదా
తొడమీద గుసబెట్టుకోని మీసీలుదిప్పేటి సరసం
బీరు బ్రాంది విస్కీ సార వచ్చినంక
ఆలి పిల్లల మరిసీ ఎల్లెల్కల బండేవు ॥తాల్లో॥

ఆదిమానవ చరిత దెల్పే అక్షరాల తాటికమ్మ
వీరబ్రహ్మంగారొస్తె తలవొంచి మొగి వాల్చెనమ్మ
గౌడన్న సేతిని తాకందే ఆ కమ్మ
తాళ పత్ర గ్రంధ మెట్లాయెనమ్మ ॥తాల్లో॥

కత్తి కలమూ ముందలేసి ఓనమాలు దిద్దబెట్టి
బ్రహ్మజ్ఞాని నంటూ మురిసే వేద బ్రాహ్మణుడెవ్వడైనా
కమ్మ కలము ఏది లేని రోజుల్లోన
తాటికమ్మ ఘంటమెవడు జేసిచ్చే ॥తాల్లో॥

చక్రాన్ని గనిపెట్టినోల్లం పనిముట్లనే జేసినోల్లం
ఉత్పత్తి కులాలు మనయి ఉత్తుత్త పోల్లం గాదు
రాతియుగము కన్న ముందున్న మట్టి
చరితెట్ల బాయెనో జాడ దెల్వక పాయే ॥తాల్లో॥

తాడెక్కి దిగె కాడ గౌడు నీకాలు చెయ్యి భద్రమయ్యా
మూడుముళ్ల నీతోడు మూడుసార్లు ముత్తయిదు
ఆకాశ నిచ్చెండ్లు ఉడుతోలె ఎక్కేటి
నిన్ను మించిన గుండె దైర్యమెవనీకుంది ॥తాల్లో॥

తాళ్ళవాగు ఈదులొంపు కల్లుకొచ్చినోల్ల గుంపు
సబ్బన్న కులపోల్లకంత పాయిరంగ కల్గొంపెతల్లి
ప్రేమగల్ల గుణము నీ సొంతమైనా
పేరు కీర్తి లేని బతుకయ్యి పాయే ॥తాల్లో॥

తల్లి ఈదును జూసినారా కండ్లల్లో కన్నీరు గారా
గీత గీతకు వొంగి వొరిగీ బర్రెంక బొక్కలు దేలీ
పెండతట్టలు బండి జల్లలల్లుకోంగ
బతుకంత మనకోసమే నిల్సినాదీ ॥తాల్లో॥

పల్లెటూల్లో కల్లు మండువా పట్నాలల్లో కల్లు కంపోండు
తాతల నాటి నుంచొచ్చినా మన జాతి వతనాగమాయే
కల్లుకంపోండ్లల్లో కటికోల్ల యాటలు
కాల్చిన కవాబు శీకులెక్కడ బాయే ॥తాల్లో॥

మనల ముంచెటోని సుట్టే జైకొట్టి జెండాలు బట్టి
పటేలు పట్వారీ దొరలా గెలిపించుకుంటాము మనమూ

పదవూ లొచ్చినంకా మనకోసమెవడైనా
ఒరిగినోడున్నాడా గోస దీర్చిండా ॥తాల్లో॥

ఎర్రెర్ర అంగీలు దొడిగీ నెత్తుటీ మడుగుల్లో మునిగీ
స్థూపంలో సుక్కయ్యి మీరు ఎంతెత్తు నిలిసిండ్రు సూడు
అమర వీరులంటే ఎవ్వరో గాదు
దళిత బహుజనులేరా దగా పడుతున్నం ॥తాల్లో॥

పొంగి పొర్లే వాగు వంకల్లో భూసారమంతెల్లిపోను
నింగిని ముద్దాడే తాళ్ళు భూతల్లికే గుండె ధైర్యం
నిలువునా గూలంగా దళారి సేతుల్లో
పురులూడి మనమోకు వలసెల్లి పోతుంది ॥తాల్లో॥

కలిసి మెలిసి ఉన్న మనలా ఎడబాపంగ జూసినోల్లు
కమ్మ కట్టు కులమంటూ కయ్యాలు బెట్టిండ్రు మనకూ
సర్వాయి పాపన్న స్ఫూర్తితో మనమంతా
అన్నదమ్ములోలె కట్టు మీదుండాలే ॥తాల్లో॥


బతుకమ్మ పాట



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాల
తీరొక్క పువ్వుల్లో తిరునాల
తెలంగాణ బతుకమ్మ ఉయ్యాల ॥బతుకమ్మ॥

బోనమెత్తిన పల్లె ఉయ్యాలో
బొడ్డెమ్మతో మొదలు ఉయ్యాల
గడ్డిపూలు బేర్చి ఉయ్యాలో
గంతేసి ఆడేరు ఉయ్యాల
కన్నెపిల్లలాట ఉయ్యాలో
కోలాట పాటలు ఉయ్యాల ॥బతుకమ్మ॥

ఇంటింట బతుకమ్మ ఉయ్యాలో
ఇలవేలుపయ్యింది ఉయ్యాల
సకల సంపదనిచ్చే ఉయ్యాలో
సల్లని బతుకమ్మ ఉయ్యాల
తల్లులు పిల్లలు ఉయ్యాలో
తల మీద మోసెనే ఉయ్యాల ॥బతుకమ్మ॥

పెత్తరామసకు ఉయ్యాలో
పెద్దల్ని దలిసేరు ఉయ్యాల
ఎంగిలి పువు దెచ్చి ఉయ్యాలో
ఏసేరు సప్పట్లు ఉయ్యాల
ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాలో
వయ్యారి అడుగేసి ఉయ్యాల ॥బతుకమ్మ॥

ఒక్నేసి పువ్వేసి ఉయ్యాలో
రెండేసి మూడేసి ఉయ్యాలో
తొమ్మిది జాముల్లో ఉయ్యాల
తొలిగింది మన బాధ ఉయ్యాలో
సద్దూల బతుకమ్మ ఉయ్యాలో
ముద్దూల బతుకమ్మ ఉయ్యాల
ఊరూర బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలలూగింది ఇయ్యాల


గంగమ్మ...గంగమ్మ...కోల్‌



గంగమ్మ గంగమ్మా కోలు
ఘనమైనా గంగా కోలు ॥గంగమ్మ॥

ఆమబ్బు తెప్పల్లో కోల్ - ఆమంచుకోండల్లో కోల్
ఆయెండి కొండల్లో కోలు దగ్గున మెరిసిందే కోలు
ఉరుముల్లో మెరుపుల్లో కోల్ - ఉరుకొచ్చె గంగమ్మకోల్
సినుకుల్లో గంగమ్మా కోలు సిందేసి ఆడిందే కోలు ॥గంగమ్మ॥

గంగమ్మ గంగమ్మా కోల్ ముత్యాల గంగమ్మా కోల్
ముత్యాల గంగమ్మా కోల్ ముద్దుగ మెరిసిందే కోల్
రత్నాల గంగమ్మా కోలు రవ్వల గొలుసేసే కోలు
పగడాల గంగమ్మా కోలు పరవాశించిందే కోలు ॥గంగమ్మ॥

వయ్యారి గంగమ్మ కోల్ వంపులు దిరిగిందే కోల్
బంగారి గంగమ్మ కోల్ సింగార మొలికిందే కోల్
పట్టంగ పరమేశు కోలు మెలికలు దిరిగిందే కోలు
ఎత్తీపోతల్లో కోలు ఎగిరి దునికిందే కోలు ॥గంగమ్మ॥

రామాసక్కనిదీ గంగమ్మ సూడా సక్కనిదే కోల్
సుక్కోలే గంగమ్మ కోల్ సక్కంగున్నాదే కోల్
ముక్కంటి శివుడమ్మో కోలు మదిలో మోహించి కోలు
జంగమ వేశంలో కోలు ఎనుకంగ బడ్డాడే కోలు ॥గంగమ్మ॥

ఉరికురికి గంగమ్మా కోల్ ఊపిరి బట్టిందే కోల్
చెర్లున్న బెస్తోల్ల కోల్ చెంతకు జేరిందే కోల్

సాపల బుట్లోన కోలు దాగుంట నేనాని కోలు
ఎవరొచ్చి అడిగీనీ కోలు మీ బాజితన్నాదే కోలు ॥గంగమ్మ॥

మాయదారి శివుడొచ్చి కోల్ మసిబూయ జూసిండే కోల్
గంగమ్మ జాడడిగీ కోల్ గడబిడ లాడిండే కోల్
బెస్తాబోయుల్లు కోలు బుట్లోన దాసిండ్రే కోలు
నాసేసి కప్పిండ్రే కోలు వలసుట్టు గట్టిండ్రే కోలు ॥గంగమ్మ॥

ముక్కంటి శివుడమ్మో కోలు ఎనుదిరిగి వచ్చిండే కోలు
ముంగిట నిలిసిండే కోలు బుట్టొంక జూసిండె కోల్
బుట్లోన సెయ్‌బెట్టా కోలు దగ్గరికొచ్చిండే కోలు
బుద్దీగ అడిగిండే కోలు ఆశలు రేపిండే కోలు ॥గంగమ్మ॥

ఎవ్వరు ఏమిచ్చినా కోల్ ఎంతటి వారైనా కోల్
ఎత్తేడు బర్లిచ్చినా కోల్ ఎకరం రాసిచ్చినా కోల్
బుట్లోన ఓ శివుడా కోల్ సెయ్యి బెట్టనియ్యం కోల్
గంగలేదంటె ఇనపడదాకోలు పొపొపో పోవయ్యో కోలు ॥గంగమ్మ॥

జంగామ శివుడయ్యా కోల్ బుడుబుక్కలోడయ్యా కోల్
ఇడువక వెంటాడి కోల్ ఇంటికి జేరిండే కోల్
బోళా శంకరుడే కోల్ జోలె బట్టెనులే కోల్
కరిగిన గంగమ్మ కోలు కదిలెను శివునెంటా కోలు ॥గంగమ్మ॥

జంగామ శివుడయ్యా కోల్ బుడుబుక్కలోడయ్యా కోల్
బుడుబుక్కలోడయ్యా కోల్ బోళా శంకరుడే కోల్
బోళా శంకరుడే కోల్ జోలె బట్టెనుగా కోల్
గంగమ్మ కరిగిందే కోలు శివునెంట కదిలిందే కోలు ॥గంగమ్మ॥

ఆఇంటి పార్వతీ కోల్ ఈరంగమాడిందే కోల్
అనరాని మాటలతో కోల్ జుట్టందుకున్నాదే కోల్
నాల్ముచ్చు వాడంట కోలు జంగామ శివుడంట కోలు
నోరన్న దెరువడుగా కోలు పార్వతినాపడుగా కోలు ॥గంగమ్మ॥

సురకత్తి సూపోలె కోల్ సూసింది గంగమ్మ కోల్
ఉప్పొంగి గంగమ్మ కోల్ ఉప్పేనై లేసే కోల్
ఎక్కాడ జూసినను కోలు సుక్కనీరు లేదే కోలు
శపిస్తె గంగమ్మ కోలు తాగనీరు లేదే కోలు ॥గంగమ్మ॥

నా చెల్లె గంగమ్మా కోల్ దిగిరావె మా గంగ కోల్
గొంతెండిపోతుందే కోల్ గోసెల్ల దీస్తున్నా కోల్
బాసజేస్తవున్నా కోలు బతిమలాడుతున్న కోలు
ఏడున్నవో గంగా కోలు ఎల్లెంగ రావమ్మా కోలు ॥గంగమ్మ॥

సుక్కోలె గంగమ్మ కోల్ సూడా సక్కనిదే కోల్
జాలోలె గంగమ్మ కోల్ జాలు వారిందే కోల్
పాదానెట్లబుట్టే కోలు పర్వతమే గంగా కోలు
గయ్యాలి దెట్టాయె కోలు ఘనమైనా గంగ కోలు ॥గంగమ్మ॥

గంగమ్మ లేకుంటె కోల్ శివుడెట్ల బతికేనే కోల్
పుట్టంగ ప్రతిజీవి కోల్ బతికి బట్టగడ్డా కోల్
గంగమ్మ లేకుంటే కోలు గడియన్న బతికేమా కోలు
మాయమ్మ గంగమ్మా కోలు మా ఇంటి దేవతవే కోలు
బెస్తాబోయులమే కోలు మమ్ములేలరావే కోలు


బతుకమ్మ తోడున్నది



బతుకమ్మ తోడున్నది
బాధల్లో బరిగీసి నిలువన్నది
తలవంచి బాంచోలే తనువు సాలించకా
ఎదిరించమంటున్నది..
ఏరులా సాగిపొమ్మంటున్నదీ ॥బతుకమ్మ॥

పుట్టేడు సోకంలో పురుడుబోసుకోని
పువ్వుల్లో పుడమీనే పులకింప జేసింది
విప్లవాల వీరత్యాగాలందుకోని
ఉద్యమాల ఉగ్గు పాలతో పెరిగింది
కష్టాలు ఎన్నున్న కడుపులోనే దాసి
కరువూలో అల్లాడి కన్నీల్లు దిగమింగి
కదనరంగామందు కన్నెర్రజేస్తున్న ॥బతుకమ్మ॥

వందలాదిమంది వీరులొరిగిన గాని
వలసపాలనలోన బూడిదే మిగిలింది
ప్రజాస్వామ్య దేశమంటున్నరే గాని
ప్రజలను సంపేటి రజాకారయ్యింది
మనని కచ్చెబట్టి అణగదొక్కేటోల్లా
నిత్తె పోరాటంలో ముంచిపోయేటోల్లా
నిలువెల్లా ముంచెత్తే గంగల్లె వస్తున్న ॥బతుకమ్మ॥

గంపేడు శెరలల్లో గడిపేదెందుకాని
గండాలు దాటంగ గట్టెక్కామంటుంది
సాయుధపోరాట జెండనెత్తుకోని

ఆయుధాల జమ్మిచెట్టు జేరామంది
గుండె గాయంజేసి సంభూరపడెటోల్లా
గుట్టు దెలుసుకోని గునపాలేసేటోల్లా
పొలిమెరలు దాటించ పొలికేక బెడ్తున్నా ॥బతుకమ్మ॥

పంచరంగుల గడ్డిపూలు జుట్టుకోని
పల్లెల్లో బంగారు తంగేడై పూసింది
ఆశగొంటి బతుకు మనకెందుకనుకోని
ఆనంద తీరాన ఆటల్లో మునిగింది
పువ్వులోలే జన్మ ఒకరోజే సాలంటు
పురుగులోలే బతుకకుంటేనే మేలంటు
సావైన రేవైనా సాధించమంటున్న ॥బతుకమ్మ॥