Jump to content

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/నాగయ్య

వికీసోర్స్ నుండి

మరపురాని మహా నటుడు

నాగయ్య

అది తిరువాన్కూరు మహారాజావారి దర్బార్ హాలు. మహాపండితులు, సంగీత, నాట్య, నటన కళాకోవిదులతో సభా భవనం క్రిక్కిరిసి పోయింది. మేళతాళాలతో సకర రాజ మర్యాదలతో రాజదర్బారు ప్రవేశించాడొక తెలుగు నటుడు. మహా రాజు గద్దెదిగి ఎదురేగి ఆ నటశ్రేష్టుని సాదరంగా కౌగలించు కొన్నాడు. తన గద్దె ప్రక్కను ఏర్పాటు చేసిన సమున్నతమైన ఆసనంపై కుర్చుండజేసి, వేదమంత్ర పఠనం మధ్య, నటునికి పాదపూజ చేసి అమూల్యమైన కానుకలను అందచేయటంతోపాటు ' అభినవ త్యాగరాజ ' బిరుదంతో సత్కరించాడు.

మైసురు సంస్థానాధీశ్వరుడు తన రాజ ప్రాసాదంలో ఆ నటరాజుకు సకల రాజ లాంఛనాలతో స్వాగతంపలికి పెద్ద వెండి పళ్ళెంలో 101 బంగారు కాసులు పోసి బహూకరించాడు.

ఇలా రాజాస్థానాలలో అపూర్వమైన సత్కారాలను అందుకొన్న తెలుగు నటశిరోమణి చిత్తూరు నాగయ్య.

భారతదేశంలో భక్తి రస ప్రధానమైన పాత్రలు ధరించి ఆయనవలె ప్రజల మన్నన లందుకున్న వారెవరూ లేరు.

నాగయ్య 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవారు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత తనయుడుకని బాల్యంలోనే ఆకర్షించింది.

తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు.

ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించాడు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగాడు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.

కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు.

మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.

చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నాడు.

నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.

కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు.

1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశాడు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.

చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు.

నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.

1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.

బి. యన్. రెడ్డిగారు మూలానారాయణ స్వామితో కలిసి వాహినీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. వందేమాతరం, సుమంగళి, దేవత, మున్నగు చిత్రాల్లో నటించిన నాగయ్యకు అశేష పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

"ఫిల్మ్‌ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్‌ముని' గా కీర్తించాడు.

కె. వి. రెడ్డిగారు, 'భక్త పోతన' చిత్రంలో, పోతన పాత్ర ధారణకు నాగయ్యను ఎన్నుకొన్నారు. పోతనగా, నాగయ్య చూపిన హావభావాలు, భక్తుడుగా ఆయన అభినయం చిరస్మరణీయం. 'పావన గుణ రామా' అను పాట ఈనాటికీ చిత్రం చూచిన వారిని మైమరిపిస్తుంది. అసమాన నటుడుగా ప్రశంసలందుకొన్నాడు.

నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి త్యాగయ్య చిత్రాన్ని నిర్మించి చరిత్ర సృష్టించాడు. ఆ చిత్రం ప్రారంభించుటకు ముందు తిరువాయార్ లోని త్యాగరాజుల వారి సమాధి వద్ద కొన్ని రోజులు ఉపవాస దీక్ష చేశాడు. 'త్యాగయ్య' చిత్రంలో నాయకుడుగా సంగీత దర్శకుడుగా అఖండ కీర్తినార్జించాడు. త్యాగయ్య చిత్రం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి భారతదేశ కీర్తి పతాకను ఎగుర వేసింది.

తెలుగు చిత్రాలతోపాటు నాగయ్య తమిళ చిత్రాలలో కూడా నటించాడు. మోసాలు, తంత్రాలు తెలియని నాగయ్య 'భక్త రామదాసు' చిత్ర నిర్మాణంలో పెక్కు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. 'రామదాసు' అనుభవించిన సంకటాలను అనుభవించాడు. చిత్రం ఎలాగో బయట పడింది. కాని నాగయ్య ఆశించిన రీతిలో రాలేదు. మరలా మనశ్శాంతిని కోల్పోయి పుట్టపర్తి సాయిబాబాను ఆశ్రయించాడు. బాబా ఆధ్వర్యంలో, మద్రాసులో నాగయ్య షష్టిపూర్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య.

నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.

నాగయ్య మహానటుడే కాదు, మహాదాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించాడు.

"నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను. అందరి మాటా నమ్ముతాను. అందర్నీ విశ్వసిస్తాను! అదే నా అర్థిక పతనానికి కారణమైంది" అని తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడాయన.

లక్షలార్జించిన నాగయ్య చివరిదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించాడు. చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది, డబ్బుకోసం!

పోతన, త్యాగయ్య, రామదాసు మున్నగు పాత్రలలో భక్తి రసామృతాన్ని పంచిపెట్టిన నాగయ్య నటించిన వేమన, పోతన చిత్రాలను చూచి ఒక బాలుడు యోగిగా మారి ముమ్మిడివరం 'బాలయోగి' అయ్యాడు.

ఒకమారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు వచ్చారు. ఆయన దర్శనం కోసం నాగయ్య, గుమ్మడి మరో మిత్రుడు వారి దగ్గరకు వెళ్ళారు. నాగయ్య గారు వచ్చారని విన్న రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నాగయ్యను ఆహ్వానించారు. నాగయ్యతో పాటు వచ్చిన మూడోవ్యక్తి, రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేస్తే "మావంటి వారికి పాదాభివందనం ఎందుకయ్యా? మీ ప్రక్కనే వున్న నాగయ్యగారికి చేస్తే మీకు పుణ్యం వస్తుంది అన్నారట" రాధాకృష్ణన్. ఆమాటకు నాగయ్య పులకించి పోయాడు.

నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశాడు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో 'నటయోగి నాగయ్య' కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.