Jump to content

లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/తెలుగు భాషా భానుడు సి. పి. బ్రౌన్

వికీసోర్స్ నుండి

తెలుగు భాషా భానుడు

సి. పి. బ్రౌన్


తెలుగు భాషా సాహిత్యాలు కొడిగట్టి పోకుండా చేతులడ్డుపెట్టి కాపాడిన మహానుభావుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలందించి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

తెలుగు సాహిత్యం 18వ శతాబ్ద కాలానికి క్షీణ దశకు చేరుకుంది. అప్పటి సాంఘిక, రాజకీయ పరిస్థితులతో పాటు, తెలుగులో సృజనాత్మక కవులు కొరవడటం, నిరక్షరాస్యత పెరిగిపోవడం, తెలుగు భాషాసాహిత్యాలను పోషించి, ప్రోత్సహించిన విజయనగర రాజుల వంటి ప్రభువులు ఆ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణాలు.

సి.పి. బ్రౌన్ ఈ ప్రాంతానికి అధికారిగా వచ్చి, తాళపత్ర నిక్షిప్తమైవున్న అనర్ఘ తెలుగు సాహిత్యాన్ని సేకరించి, వెలికితీసి, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించారు. ఆయన మాటల్లోనే "తెలుగు సాహిత్యం మరణశయ్యపై ఉంది. 1825 నాటికి దీపం మిణుకుమిణుకు మంటున్నది. తెలుగు సాహిత్యం చనిపోవడం నేను చూశాను. అయితే ముప్పె ఏళ్ళలో దాన్ని తిరిగి బ్రతికించగలిగాను". బ్రిటిష్ జాతీయుడైన సి.పి. బ్రౌన్ 10.11.1798న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ కలకత్తాలో ఒక అనాధ శరణాలయానికి, మిషనరీకి మేనేజర్ గా పనిచేశాడు. ఈయన సంస్కృతం సహా ఎన్నో భాషల్లో పండితుడు. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన తండ్రి మరణానంతరం 1812లో ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు. తిరిగి 1817 ఆగస్టు 4వ తేదీన మద్రాసుకు చేరుకున్నాడు. భారత్ లో సివిల్ సర్వీసులో ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైన శిక్షణ పొందడానికిగాను హెయిలీ బర్రే కళాశాలలో జేరాడు.

1820లో మద్రాసు గవర్నర్ థామస్ మన్రో, ప్రతి ప్రభుత్వాధికారి ఒక స్థానిక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉత్తర్వులు వేశాడు. కాబట్టి పాఠ్యాంశాలలో భాగంగా సి.పి. బ్రౌన్ ఒక స్థానిక భాషను నేర్చుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితిలో ఆయన తెలుగు భాషను ఎంచుకుని, వెలగపూడి కోదండరామ పంతులు శిక్షణలో తెలుగు నేర్చుకోవడానికి పూనుకున్నాడు.

బ్రౌన్ తెలుగు పరీక్షను, సివిల్ సర్వీసు పరీక్షను 1820లో పాసైనాడు. కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న హన్‌బర్రీకి డిప్యూటీగా బ్రౌన్‌కు ఉద్యోగం వచ్చింది. హన్బర్రీ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడటం గమనించిన బ్రౌన్ ఆయన నుంచి స్ఫూర్తిని పొంది, తాను కూడా తెలుగు మీద పట్టు సాధించాలని పూనుకున్నాడు. ఆయన 1824లో మచిలీపట్టణానికి, ఆ తరువాత రాజమండ్రికి బదిలీ చేయబడ్డాడు. బందరులో సి.పి. బ్రౌన్ చేసిన తెలుగు భాషా సేవ వారి మాటల్లోనే:

“తెలుగు దేశానికి రాజధానియైన బందరు (మచిలీపట్టణము)లో నేను మూడు సంవత్సరములు న్యాయాధిపతిగా వ్యవహరించేను. అక్కడ నేను సంస్కృతాంధ్ర గ్రంథముల వ్రాతప్రతులు చాలా సంపాదించేను. వాని సంపాదన నాకొక "పిచ్చిగా" పరిణమించిందంటే అతిశయోక్తికాదు. అక్కడ నేను ఒక దమ్మిడీ నిలవచేయలేదు. నా వద్ద ఎప్పడూ ఇరవై మంది బ్రాహ్మణులు, శూద్రులు వీటి గురించి పనిచేసేవారు. వారికందరకు జీతము లేర్పాటు చేసెను. ప్రాచీన కావ్యాలు కాగితాల మీద వ్రాయడము, సప్రమాణికములైన పాఠములతో వానిని సంస్కరించడము, పదానుక్రమణికలు తయారుచేడము, వ్యాఖ్యానాలు వ్రాయడము వారి పని."

తెలుగులో కోర్టు తీర్పు ఉత్తర్వులు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది.

ఆ కాలంలో గుంటూరు ప్రాంతం భయంకరమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నది. 1882-83లలో ఈ క్షామాన్ని ఎదుర్కోవటంలో బ్రౌన్ కనబరచిన పాలనాదక్షత అందరి మన్ననలు పొందింది. 1834లో ఆయన ప్రభుత్వోద్యోగం నుంచి విడుదలై లండన్ కు వెళ్ళిపోయి 1885 నుంచి 1838 వరకు అక్కడే ఉన్నాడు. 1838లో ఈస్టిండియా కంపెనీకి పర్షియన్ అనువాదకుడుగా బ్రౌన్ తిరిగి మద్రాసుకు చేరుకున్నాడు. మద్రాసు కాలేజి బోర్డు సభ్యుడుగా కూడా సేవలందించి 1854లో అనారోగ్యం వల్ల ఉద్యోగ విరమణ చేసి, లండన్ కు వెళ్ళిపోయాడు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఆయన 1884 డిసెంబర్ 12న కన్నుమూశాడు.

బ్రౌన్ తెలుగు భాషాసాహిత్యాలకు చేసిన సేవలు ఎనలేనివి. ఉచిత విద్యను, ఉచిత ఆహారాన్ని అందించే పాఠశాలలను నెలకొల్పారు. ఈ విషయం సి.పి. బ్రౌన్ తన స్వీయచరిత్రలో ఈ విధంగా వ్రాసుకున్నారు -

"నేనెక్కడ పనిచేసినా, బాలురకు తెలుగు, హిందూస్థానీ విద్యాభ్యాసము నిమిత్తము ఉచిత పాఠశాలలను నెలకొల్పేవాడను. ఆయా ప్రాంతము వారినే ఉపాధ్యాయులుగా నియమించేవాడను. 1821లో కడపలో రెండింటిని, 1823లో బందరులో రెండింటిని స్థాపించేను.

1844లో మదరాసులో ఒక ఉచిత పాఠశాల పెట్టేను. అందులో 80 మంది తెలుగు, తమిళ విద్యార్ధులుండేవారు. ఇది ఏడేండ్లు నడచినది. కానీ దాని యాజమాన్యము మరొకరికి అప్పగించేను. కాని అది సరిగా నడవలేదు. తరువాత క్రైస్తవ మిషనరీలకు దాన్ని అప్పగించేను."

1824లో ఆయనకు వేమన సాహిత్యం విూద ఆసక్తి కలిగింది. వేమన సాహిత్యాన్ని తెలుగు ఛందస్సును, వ్యాకరణాన్ని తిప్పాభొట్ల వెంకటశివశాస్త్రి, అద్వైత బ్రహ్మశాస్త్రి మార్గదర్శకత్వంలో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేమన పద్యాలను సేకరించి, 698 పద్యాలతో 1827లో మొదటి సంపుటాన్ని 1164 పద్యాలతో 1839లో రెండవ సంపుటాన్ని ప్రచురించాడు. వీటికి ఆంగ్లానువాదాలు కూడా ప్రచురించాడు. బందరు నుంచి ఆయనను రాజమండ్రికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన తెలుగు సాహిత్య సేవను, భాషాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిపోయే దశలో ఉన్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించాడు. కొందరు వ్రాయసగాళ్ళను తన స్వంత డబ్బుతో నియమించి, వారితో ఈ కావ్యాలకు వ్రాత ప్రతులను సిద్ధం చేయించి, పండితులతో చర్చించి, దోషాలను సరిదిద్ది పరిష్కరించాడు. ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్ర మహాభాగవతాన్ని పునర్ముద్రించాడు. శోభావిహీన అయిపోయిన తెలుగు సరస్వతికి ఆశ్రయం కల్పించి, పూర్వవైభవాన్ని తెచ్చాడు.

తెలుగు నేర్చుకోవడంలో ఆసక్తివున్న బ్రిటిష్ వారి కోసం ఆయన ఎన్నో వ్యాకరణ పుస్తకాలను, ఛందో గ్రంథాలను వ్రాశాడు. తెలుగు-ఇంగ్లీషు; ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను, తెలుగు వాచకాలను మొదటిసారిగా తయారు చేశాడు. సాహిత్య పత్రికలలో ఎన్నో వ్యాసాలను వ్రాశాడు. క్యావాలను అనువదించాడు. ఇవన్నీ ఇప్పటికీ మదరాసు ఓరియంటల్ లైబ్రరీలో ఉన్నాయి.

1824 నుంచి తిక్కన, పోతన, వేమన వంటి ప్రసిద్ధ కవుల రచనలను సేకరించడం ప్రారంభించాడు. 1835-38 మధ్య లండన్‌లో ఉన్నప్పుడు ఆయన 2,106 దక్షిణ భారతీయ భాషలకు చెందిన వ్రాత ప్రతులను ఇండియా హౌస్ లైబ్రరీ నుంచి సేకరించి, మద్రాసు లైబ్రరీకి పంపాడు.

తెలుగు, సంస్కృత గ్రంథాల నెన్నింటినో పరిష్కరించి, ప్రచురించాడు. Madras Journal of Literature and Science కు సంపాదకుడుగా పనిచేశాడు. ఆయన ప్రాచీన కావ్యాలు సేకరిస్తున్నప్పుడు చోటు చేసుకున్న అనేక సంఘటనలను కథలు కథలుగా లండన్ నుంచి వెలువడే ది ఆసియాటిక్ జర్నల్లో వ్రాశాడు.

తెలుగు సాహిత్య పరిరక్షణకు బ్రౌన్ తన స్వంత డబ్బును ఖర్చు చేశాడు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రతి పైసా పొదుపు చేసేవాడు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో వుండి కూడా తెలుగు కోసం ఖర్చు చేయడానికి వెనకడుగు వేయలేదు. తనకు వస్తున్న జీతంతో ఎంతో మంది పండితులను, వ్రాయసగాళ్ళను పోషించాడు.

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కావ్యాలను సేకరించి ప్రచురించడమే కాక బ్రౌన్ జనసామాన్యం నోళ్ళలో సజీవంగా వుంటూ, తరం నుంచి తరానికి బదిలీ అవుతున్న మౌఖిక సాహిత్యాన్ని ఎంతో సేకరించి, గ్రంథస్థం చేసి భద్రపరిచాడు. ముద్రణకు అనువుగా వుండటానికి వీలుగా తెలుగు లిపిని సంస్కరించాడు. 'అరసున్నాను, బండి"ఱ"ను పరిహరించి, క్రావడిని మార్చాడు. తెలుగు పద్యపాదాలను 'యతి' స్థానంలో విరచడం ఆయన ప్రారంభించిన సంప్రదాయమే. బ్రౌన్ దొరకు యావత్ తెలుగు జాతి రుణపడివుంది.

బ్రౌన్ సమాధి సందర్శన

2009 ఏప్రిల్ 26వ తేది నా జీవితంలో మరపురాని రోజు, లండన్లోని కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో ఉన్న సి.పి. బ్రౌన్ సమాధిని సందర్శించడం ఒక మధుర స్మృతి. లండన్ రావలసిందిగా యు.కె.లోని తెలుగు వైద్యబృందం పంపిన ఆహ్వానం పురస్కరించుకుని లండన్ వెళ్ళిన
సి.పి. బ్రౌన్ సమాధివద్ద నివాళులర్పిస్తున్న మండలి, యార్లగడ్డ


ప్రసిద్ధ చిత్రకారుడు మూల్‌రెడి సమాధి
కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటిక ముఖద్వారం


కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో భారత సుప్రీం కౌన్సిల్ సభ్యుడు సర్ విలియం కెస్‌మెంట్ సమాధి
కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో ఒక అద్భుతమైన శిల్ప సౌందర్య శోభిత సమాధి
నేను, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు దేశానికి ఎనలేని సేవలు చేసిన సి.పి. బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ సమాధులు ఎక్కడున్నవో అన్వేషించి, వాటిని సందర్శించే అవకాశం కలిగితే ఈ యాత్రకు ఒక సాఫల్యత చేకూరుతుందని భావించాము.

ఇంటర్నెట్ సాయంతో కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో బ్రౌన్ సమాధి ఉందని తెలుసుకున్నాము. ఆ స్మశాన వాటిక బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైనది. 2 లక్షల 56 వేల మంది పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న గౌరవనీయులు, మహాశూరులే కాక, అప్రతిష్టపాలైన వ్యక్తుల భౌతికకాయాలు కూడా ఈ స్మశాన వాటికలో ఖననమయ్యాయి. ఈ స్మశాన వాటికలో తమతమ మతాలకు, సంప్రదాయాలకు అనువుగా ఉత్తర విధులు నిర్వర్తించుకునే అవకాశం ఉంది. 1833లో ఈ స్మశానంలో అంత్యక్రియలు మొదలైనాయి. ఇది లండన్‌లో మొట్టమొదటి ఉద్యానవన స్మశాన వాటికగా పేరుగాంచింది.

ఇంగ్లండ్ రాజు - మూడవ జార్జి కుమారుడు హెచ్.ఆర్.హెచ్. ది డ్యూక్ ఆఫ్ ససెక్స్ అంత్యక్రియలు 1843లోను, ఆయన సోదరి యువరాణి హెచ్.ఆర్.హెచ్. సోఫియా అంత్యక్రియలు 1848లోను ఇక్కడ జరగడంతో ఈ స్మశాన వాటిక ప్రఖ్యాతి మిన్నంటింది. ఈ స్మశానవాటికలో నమోదైన వారిలో 550 మంది సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీలో స్థానం పొందిన 700 మంది ప్రసిద్ధ వ్యక్తుల భౌతికకాయాలు ఇక్కడ ఖననమయ్యాయి. ఈ స్మశానవాటికలో ఆయా కాలాల అద్భుత నిర్మాణ శైలికి ప్రతీకలుగా నిలిచే విధంగా, అపురూపమైన కట్టడాలున్నాయి. కట్టడానికి, కట్టడానికి సారూప్యత లేకుండా అత్యంత సౌందర్యోపేతంగా నిర్మితమైన కట్టడాలున్నాయి. అత్యంత అద్భుత సౌందర్యరాశి అయిన ఒక స్త్రీమూర్తి పాలరాతి ప్రతిమవున్న సమాధి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రముఖ చిత్రకారుడు విలియం మూల్‌రెడి ఆర్.ఏ.{1786-1863) సమాధి వద్ద ఆయన మరణశయ్యపై వున్నట్లుగా పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పడమే కాక, దాని చుట్టూ ఆయన చిత్రించిన చిత్రాలను చెక్కారు. ఒక ప్రముఖ చిత్రకారుడికి శిల్పకళా వైభవంతో సమర్పించిన నివాళిగా ఇది కనిపిస్తుంది. మహర్షి దేవేంద్రనాథ్ టాగూరు సమాధి కూడా అక్కడే వుందని మాకు తర్వాత తెలిసింది. ప్రముఖుల స్థాయిని బట్టి, విశిష్టతను బట్టి సమాధులు నిర్మితమయ్యాయి.

ఈ రకంగా లక్షల సంఖ్యలో వున్న సమాధులలో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సమాధిని అన్వేషించి, కనుగొనడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. సెమెట్రీ నిర్వాహకురాలు శ్రీమతి ఎవిస్ మాకు మ్యాపునిచ్చి వెతుక్కోమన్నారు.

29,377వ సమాధిగా నమోదు చేయబడిన సి.పి. బ్రౌన్ సమాధిపై ఆయన 17 డిసెంబర్ 1884న (మరణించిన ఐదవ రోజున) ఖననం చేయబడినట్లు చెక్కబడివుంది. ఈ సమాచారం పొందడానికి 2 డాలర్ల రుసుము చెల్లించవలసి వచ్చింది. సమాధులు చూసుకుంటూ, వెతుక్కుంటూ వెళుతుంటే ఒక ఆంగ్ల వనిత - ఆమె కూడా ఏదో సమాధి అన్వేషణలో తిరుగుతూ మాకు తారసపడ్డది. ఆమె మాతో మాటలు కలిపి, మా అన్వేషణలో తోడ్పడింది. చివరికి బ్రౌన్ సమాధిని చూడగానే పడిన శ్రమంతా మరచిపోయాము. ఒకానొక దశలో సమాధిని చూడకుండానే వెళ్ళిపోతామేమో అన్న భావన కలిగి మనసంతా వికలమైంది. అలాంటి సమయంలో సమాధి కనిపిస్తే ఎంతటి మధురానుభూతి కలుగుతుందో వర్ణించలేను. సమాధి కనిపించిందన్న ఆనందం ఒక వైపు కలిగితే, ఆ సమాధి వున్న దుస్థితి మూలంగా కలిగిన వేదన ఇంతా అంతా కాదు. సమాధి మీద అక్షరాలు కనిపించీ కనిపించకుండా వున్నాయి. డా. లక్ష్మీప్రసాద్ గారు అక్కడున్న గడ్డిమొక్కలను పీకి, ఆ సమాధి అక్షరాలపై రుద్దితే, బ్రౌన్ పేరు కనిపించింది.

ఆ రోజు రాత్రి లండన్లో మాకు ఆతిథ్యమిచ్చిన డా. గోవర్ధన్ రెడ్డిగారికి ఈ విషయం చెప్పాము. డా. గోవర్దన్ రెడ్డిగారు ఏది ఏమైనా దానికి పునరుద్ధరణ చేయవలసిందేననీ, అందుకు ప్రయత్నిస్తాననీ చెప్పారు. మర్నాడు రాత్రి లండన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డా. రాముల దాసోజు మమ్మల్ని విందుకు ఆహ్వానించారు. వారితో నాకు అంతకు పూర్వం పరిచయం లేదు. డా. లక్ష్మీప్రసాద్ గారి ద్వారా కలిగిన పరిచయమది. స్వర్గీయ ఎన్.టి. రామారావుగారు లండన్లో పర్యటించిన సందర్భంలో వారి ఇంటనే బసచేసిన విషయాన్ని రాముల దంపతులు గుర్తు చేసుకున్నారు.

మేము బ్రౌన్ సమాధి గురించి, దాని దురవస్థ గురించి వారి దృష్టికి తెచ్చాము. వారు తమ సంఘ సభ్యులతో చర్చించి, దాని పునరుద్ధరణకు పూనుకుంటామని మాటిచ్చారు. ఈ రోజున దాదాపు 2 లక్షలు వ్యయం చేసి బ్రౌన్ సమాధిని లండన్ తెలుగు సంఘం వారు పునరుద్ధరించడం యావత్ తెలుగు జాతికి ఎంతో ఆనందదాయకం. ఇందుకుగాను లండన్ తెలుగు సంఘాన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. లండన్ సందర్శనకు వెళ్ళే ప్రతి తెలుగువాడు కెన్‌సల్ గ్రీన్ స్మశాన వాటికలో సి.పి. బ్రౌన్ సమాధిని సందర్శించడం ద్వారా అదొక యాత్రా స్థలంగా రూపుదిద్దుకొంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

శ్రీ సి.పి. బ్రౌన్ ఫోటో ఇంతవరకు లభ్యం కాలేదు. ఇంగ్లాండులో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏదో ఒకరోజున ఆ ఫోటో కూడ లభ్యం కావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం బ్రౌన్ ఊహాచిత్రాన్నే ఉపయోగిస్తున్నాము.

మేము లండన్ పర్యటనకు వెళ్ళివచ్చిన పిమ్మట బ్రౌన్ సమాధి గురించి పత్రికలలో చదివిన వారిలో కొందరు లండన్ వెళ్ళినపుడు బ్రౌన్ సమాధిని చూసి వచ్చామని ఎంతో సంతోషంగా చెప్పారు. వారిలో తిరుమల తిరుపతి దేవస్థానాల పూర్వపు అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డిగారు ఒకరు.

మేము ఆ స్మశానవాటిక సందర్శనకు వెళ్ళినపుడు దానికి ఇన్ చార్జిగా వున్న శ్రీమతి ఎవిస్ "ఈ సమాధిని సందర్శించడానికి వచ్చినవారు మాకు తెలిసినంతవరకు విూరే" అని చెప్పారు. ఆ విషయం పత్రికలలో రావడం, దానివిూద అంతకు పూర్వమే సమాధిని సందర్శించినవారు "మేము ఎప్పడో చూశామ"ని ప్రకటనలు చేయడంతో అదొక వివాదంగా పరిణమించింది. అయితే, దీనివల్ల తెలుగువారందరికీ బ్రౌన్ సమాధి గురించి తెలుసుకునే అవకాశం కలిగి, గొప్ప కుతూహలాన్ని రేకెత్తించింది. కీడులో మేలన్నట్లుగా ఈ వివాదం ద్వారా బ్రౌన్ సమాధి ప్రశస్తిని అందరూ గుర్తించే అవకాశం లభించింది. ఏదిఏమైనా ఈ రోజున లండన్ తెలుగు సంఘం ఒక మహత్తరమైన కృషి జరిపి, తెలుగు భాషా భానుణ్ణి మళ్ళీ ప్రకాశింపజేసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ అధ్యక్షులు డా॥రాములు దాసోజుకు, వారి కార్యవర్గానికి తెలుగు ప్రజలందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.

కెన్పల్ గ్రీన్ స్మశానవాటిక నిర్వాహకురాలు శ్రీమతి ఎవిన్తో.