Jump to content

బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు

వికీసోర్స్ నుండి

బహుముఖ_ప్రజ్ఞాశాలి_మహాకవి_దాసు_శ్రీరాములు

1

బహుముఖ ప్రజ్ఞాశాలి

మహాకవి దాసు శ్రీరాములు

డా. దాసు అచ్యుతరావు

దాసు శ్రీరాములు గారు కీ.శ. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో ఆంధ్రదేశంలో జన్మించి ఆంధ్ర సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను వారి రచనలతో, విశిష్ట వ్యక్తిత్వంతో ప్రభావితం చేసిన మహా పురుషులు.

ఆయన మహాకవి, వాగ్గేయకారులేకాక (1) ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు (2) ప్రముఖ న్యాయవాది (3) సంఘ సంస్కర్త (4) పత్రికా నిర్వాహకుడు (5) ధర్మశాస్త్ర, జ్యోతిషశాస్త్ర నాట్యశాస్త్ర కోవిదుడు (6) ఆయుర్వేద శాస్త్ర పరిశోధకుడు. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి.

జననం, విద్య

దాదాపు నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల దాసు వంశంలో ఏప్రిల్ 8, 1846న కృష్ణాజిల్లా కూరాడ గ్రామంలో తన మాతామహుడగు కూరాడ రామచంద్రయ్య గారి ఇంట్లో శ్రీరాములు గారు జన్మించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో అల్లూరి అగ్రహారికులు, సంపన్న కుటుంబీకులు కన్నయ్య, కామమ్మ పుణ్యదంపతులకు ఏకైక సంతానం. తొమ్మిదవ ఏటి వరకు ఇంటి దగ్గరే తండ్రిగారి వద్ద, అడవి సుబ్బారాయుడు గారి వద్ద విద్య నభ్యసించారు. కొద్దికాలం బందరు నోబెల్ స్కూలులో ఇంగ్లీషు, తెలుగు అభ్యసించడానికి వెళ్లారు. కాని కొంత కాలం తర్వాత తల్లిగారు అల్లూరుకు తీసుకువచ్చారు. తర్వాత శ్రీరాములు గారు ఇంట్లోనే ఉంటూ, స్వయంకృషితోనే కవితా పాటవం సంపాదించారు. 12వ ఏటనే “సోమలింగేశ్వర శతకం' ప్రౌఢశైలిలో రాసారు. 'అష్టావధానం', 'వ్యస్తాక్షరి', 'శతషండక వనం' ప్రక్రియలలో నైపుణ్యం సంపాదించారు. 14వ ఏట 'సాత్రాజితి విలాసం' అనే యక్షగానం రాసారు. 1859లో తన 13వ ఏట జానకమ్మ గారితో వివాహమయింది. ఒకరోజు ఇంట్లో చెప్పకుండా 'ఆంధ్రగీర్వాణ పీఠము'గా పేరు గాంచిన ఆకిరిపల్లె వెళ్లి సంస్కృత వ్యాకరణంపై పట్టుసాధించారు. అప్పటి నూజివీటి ప్రభువులు నెలకు 8 అణాల ఉపకారవేతనం ఇచ్చేవారు. ఆ తర్వాత శ్రీరాములుగారు ఇంకొకరి దగ్గరకు వెళ్లి విద్యనేర్చుకోలేదు. స్వయంకృషితోనే అనేక విద్యలు నేర్చుకున్నారు. విద్యాదాతలు అయ్యారు కూడా.


ఉపాధ్యాయునిగా శ్రీరాములు గారు

అల్లూరు విడచి గుడివాడలో ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా చేరి, విద్యార్థులకు తెలుగు బోధిస్తూ, స్వయంగా ఇంగ్లీషు నేర్చుకున్నారు. తరువాత కౌతరంలో పనిచేసారు. డోకిపర్రు గ్రామస్తుల కోరికపై అక్కడ పాఠశాల నెలకొల్పారు. విద్యాబోధన చేస్తూ ఇంగ్లీషు టెస్టులు, ప్లీడరీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసారు. బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టడానికి 1878లో డోకిపర్రు విడిచి వెళ్లేటప్పుడు ఆ గ్రామస్తులు శ్రీరాములు గారిని వెండి పూలతో పాదపూజచేసి, బంగారు పూలతో శిరస్సు పూజించి, ఊరి పెద్దలు స్వయంగా 'మేనా మోసి' గౌరవించి వీడ్కోలు చెప్పారు. అటువంటి భక్తిపూర్వక సత్కారం తరువాత కాలంలో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికే దక్కింది.

న్యాయవాదిగా శ్రీరాములు గారు

శ్రీరాములు గారు మొట్టమొదట 1878 సం.లో బందరులో న్యాయవాద వృత్తి చేపట్టి తరువాత 1883 నుంచి 1895 వరకు ఫస్టుగ్రేడ్ ప్లీడర్ ఏలూరు సబ్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఏలూరులో కాలువకు దక్షిణమువైపున ఒక ఎకరం స్థలములో స్వగృహము నిర్మించుకొని జీవితాంతమువరకు, అంటే దాదాపు 24 సంవత్సరాలు ఈ పవిత్ర ప్రాంగణములో నివసించి, ప్రముఖ న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, మహాకవిగా తమ
అపూర్వ రచనా వ్యాసంగమూ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు. మహాకవి దాసు శ్రీరాములు గారు నివసించిన ఆ పవిత్ర గృహములోనే (ప్రస్తుతము 'గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయము' నడుపబడుచున్నది.

మహాకవి దాసు శ్రీరాములు గారు ఏలూరులో నివసించిన పవిత్ర గృహ ప్రాంగణము

ప్రస్తుతము 'గాంధీ ఆంధ్రజాతీయ మహా విద్యాలయము'

శ్రీరాములు గారి విద్యాఖిమానం, బెదార్యం

ఏలూరులో ఒక పాఠశాల యాజమాన్యం, బసవరాల రామబ్రహ్మం అనే ఆంగ్లభాషా ఉపాధ్యాయుడిని అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలగించారు. ఆయన శ్రీరాములు గారిని ఆశ్రయించగా వెంటనే 'హిందూ పేట్రియాటిక్‌ స్మూల్'ను స్థాపించి ఆయననే ప్రధానోపాధ్యాయునిగా నియమించి చాలా కాలం నడిపించారు. శ్రీరాములు గారి విద్యాభఖిమానానికి బెదార్యానికి ఇది దర్భణం.

సంఘ సంన్మర్త - పత్రికా నిర్వాహకులు

దాసు శ్రీరాములు (1846-1908), కందుకూరి వీరేశలింగం (1848-1919) మరియు గురజాడ అప్పారావు (1862-1915) సమకాలీనులు. వీరేశలింగం గారి విధవాపునర్వివాహోద్యమాన్ని మొదట్లో “అనల్ప జల్పితాకల్పవల్లి' అనే పత్రిక నడిపి వ్యతిరేకించారు. కాని, తరువాత దాని అవసరం గుర్తించి మనస్ఫూర్తిగా ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.

సంఘ సంస్కరణోపన్యాసాలు - స్త్రీ విద్య - స్త్రీ స్వాతంత్య్రం

సంఘసంస్కరణ సమస్యలు ముఖ్యంగా స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్య ఆవశ్యకత గురించి ఆంధ్రదేశమంతటా సభలు నిర్వహించి అనేక ఉపన్యాసాలు చేసారు. వీరి ప్రచారానికి ప్రభావితులై అనేక పల్లెలలో బాలికా పాఠశాలలు వెలిసాయి. ఇతరులకు చెప్పటంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఆచరించి చూపెట్టారు. తన యేడేళ్ళ కుమార్తె శారదాంబకు ఆంధ్ర, సంస్కృతాలు, సంగీత విద్య నేర్పించారు. వితంతవులకు కేశఖండనం క్రూరమైన ఆచారం అన్నారు. 'రండాముండన ఖండన' అనే వ్యాసాన్ని వ్రాసి ప్రచారం చేసారు. బాల్య వివాహాలను నిరసించారు. స్త్రీలు గడపదాటకుండా ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. వారు సభలకు వెళ్లేటపుడు భార్య జానకమ్మను కూడా తీసుకువెళ్లేవారు.

వాగ్గేయకారులు - సంగీత రచనలు

తోట్లవల్లూరు వేణుగోపాలస్వామికి అంకితంగా, భగవన్నామ పఠనానుకూల "కృతులు, పదములు, జావళీలు" ముఖ్యంగా అభినయాన్ని దృష్టిలో ఉంచుకొని రాసారు. స్వరజతులు, తిల్లానాలు కూడా వ్రాసారు. అనేకమంది గాయనీ, గాయకులు కచేరీలలో గానం చేస్తున్నారు. నర్తకులు, నర్తకీమణులు నృత్యప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీరాములుగారు ‘అభినయదర్పణం' అనే గ్రంథాన్ని రాసారు. స్వయంగా ముద్రలు పట్టి చూపేవారు.

సంగీత పాఠశాల స్థాపన - విద్వాంసులకు ప్రోత్సాహాలు

ఆనాటి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్రవర్తులు తిరువేంగడాచారిగారిని ప్రధానోపాధ్యాయునిగా నియమించి సంగీత పాఠశాల నెలకొల్పి, ఎందరో విద్వాంసులను పోషించారు. పండితులను గాయకులను సన్మానించారు. హరికధా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు, తిరుపతి వేంకటకవులు, మొదలైన ప్రముఖులు శ్రీరాములు గారి ఆతిధ్య సన్మానాలు పొందినవారే.

రచనలు

శతకములు, ప్రబంధములు, పురాణములు, నాటకములు, యక్షగానములు,'కృతులు పదములు జావళీలు' అను సంగీత రచనలు, ధర్మశాస్త్ర, ఆయుర్వేదశాస్త్ర పరిశోధనా గ్రంధములు మొదలైన ఎన్నో ప్రక్రియలలో ముప్పై పైగా రచనలు చేసారు. వాటిలో బహుళ ప్రచారంలో ఉన్నవి 'తెలుగునాడు', 'సూర్యశతకము', 'చక్కట్లదండ', 'అభినవగద్య ప్రబంధము', 'కురంగ గౌరీశంకరనాటిక', 'శ్రీదేవీ భాగవతము', 'దురాచారపిశాచభంజని,'ఆచార నిరుక్తి', 'వైశ్యధర్మదీపిక', 'విగ్రహారాధన తారావళి' అను ధర్మశాస్త్ర గ్రంథములు. మరియు "భృంగరాజమహిమము" అను ఆయుర్వేద శాస్త్రపరిశోధనా గ్రంథము.

దాసు శ్రీరాములు

శ్రీరాములు గారి రచనలను విశ్లేషిస్తూ, విశిష్టతను ప్రశంసిస్తూ శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు, విశ్వనాధ సత్యనారాయణగారు, విశ్వనాథ వెంకటేశ్వర్లు మొదలైన మహనీయులు వ్రాసిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. శ్రీరాములు గారి ముని మనుమరాలు శ్రీమతి వెలగపూడి వైదేహిగారు వ్రాసిన “మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు ఒక సమీక్ష" అను సిద్ధాంత గ్రంథానికి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.

19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఆంధ్ర సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు అరవై రెండు సంవత్సరాలు జీవించి, 1908 మే 16న దేవీకటాక్ష సిద్ధిపొందారు.

మహాకవికి మహనీయుల ప్రశంసలు

"కవులుండ వచ్చును, పండితులుండవచ్చును, ఐశ్వర్యవంతులుండవచ్చును కాని దాసు శ్రీరామకవి వంటి ధన్యులు కోటికొకరేని చేకూరుట అరుదు. శ్రీరామకవి చంద్రుని రెండవ శ్రీనాధునిగా నామనసున అనుకొందును. ఈయన సరసకవి, విద్వత్కవి, ఆశుకవి,దాత, నేత. ఇన్ని యోగాలు పట్టినవారు ఏకకాలంలో మృగ్యులే. ఇన్ని అదృష్టములు సంఘటించిన కవి లేనేలేడు".

- బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“దాసు శ్రీరాములు గారు గొప్ప పండితుడు, గొప్ప కవియును మాత్రమే గాక గొప్ప న్యాయవాది, గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప దేశాభిమానియై యుండి 1846-1908 సం॥ మధ్య ఆంధ్రదేశ సాంఘిక, సాంస్కృతిక, మత, రాజకీయాభివృద్ధి కొరకు పాటుపడిన మహాపురుషులలో నొకరు. ఆంధ్రదేశ ప్రజలకు, ఆంధ్రభాషకు ఆయన చేసిన సేవ అసామాన్యమైనది.”

- శ్రీ దిగవల్లి వేంకట శివరావు, ప్రముఖ న్యాయవాది,చరిత్రకారులు

“దాసు శ్రీరాములు గారు వ్రాసిన దేవీభాగవతము చదివి ఆనందించుటయు, చిన్నప్పటి మాకవితాసాధనలో వీరి గ్రంథముకూడా నొకటియగుటయు, మాకు బాగా జ్ఞాపకమున్నది ... ఈ గ్రంథములో గడుసు పోకడలెన్నియో కలవు. తెలుగు పలుకుబళ్ళు

6

పెక్కుగలవు. పలుచోట్ల ప్రౌఢరచనగలదు ... ఈ కవియొక్క భాషాజ్ఞానము మిక్కిలి దొడ్డది. వీరి లోకానుభవము దానికంటె దొడ్డది, పూర్వకథాభిమానము మరియు మిక్కిలిగానున్నది. ఈ గ్రంథము చదివినచో ఎట్టివారైనను కవులు తాక తప్పదు”.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

"ఏతావాతా శ్రీదాసు శ్రీరామకవిగారు బహుముఖ ప్రజ్ఞాదురంధరుడు అయిన మహాకవి యనుట నిస్సంశయము. A versatlie genius. ఆయన ఒక మహా సముద్రము. అందనేక రత్నములు కలవు. పరిశీలింపఁజాలు పరీక్షకులకే వారి యౌన్నత్య మెరుకబడును - ఆ చంద్రతారకం బాంధ్రి యున్నన్నాళ్లు - దాసు శ్రీరాముండు ధరణి వెలుగు (నిలుచు)".

- శ్రీ విశ్వనాథ వేంకటేశ్వర్లు

"ఆద్యతన ఆంధ్రవాఙ్మయ నిర్మాత దాసు శ్రీరామకవి. వారింటి పేరు దాసువారు గాని, వారి కవితా పాండిత్య కావ్యరచనా విశిష్టత చేతవారు కవులకు స్వామిత్వము వహించారు."

- కళాప్రపూర్ణ శ్రీ నిడదవోలు వేంకటరావు

"శ్రీరాములు పంతులు గారు ప్రతిభా వుత్పత్యభ్యాసములకు కావ్యహేతువులు మూడును పుష్కలముగా గల మహాకవి పుంగవులు. దేవీభాగవతము వారి సర్వకవితా కౌశలమునకు పట్టుకొమ్మయైన ప్రశస్త రచన.”

ఆచార్య దివాకర్ల వేంకటావధాని

"అభినవభాసుడు”

- ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం

"శ్రీ దాసు శ్రీరామపండితుడు మహాకవిమాత్రమే కాదు, సకలశుభలక్షణ సమంచితుడైన అదృష్ట జాతకుడు. జ్ఞాన సంపదకు మించిన అయిశ్వర్యము అయిశ్వర్యమునకు మించిన ఔదార్యము - ఔదార్యమునకు మించిన ఆత్మధైర్యము, పండితులను పోషించియాదరించిన సరస్వతీపీఠాధ్యక్షుడు. చందోబద్ధ కవిత్వలోలుడగు

నీకవిజనాగ్రణి, హావభావ విన్యాస లయ తాళస్వరంగా సంశోభిత సంగీతనాట్యాభి నయకళాప్రవీణుడు. లౌక్యసరణి, ఘననిపుణమణియని వినుతిగన్న దొడ్డన్యాయవాది. 'రామ నీసమానమెవరు?' అను సంకీర్తనకు పాత్రుడైన ధన్యజీవి ఈకవియనుట వాస్తవమేగాని స్తవము కాదు. "

- దాసు వామనరావు, ప్రముఖ పాత్రికేయులు

7

మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి

హైదరాబాద్
ప్రచురణలు

మహాకవి దాసు శ్రీరాములు గారి రచనలు

1. తెలుగునాడు
2. అభినవగద్య ప్రబంధము
3. శ్రీదేవీ భాగవతము
4. సూర్యశతకము
5. కురంగ గౌరీ శంకర నాటిక
6. చక్కట్లదండ
7. భృంగరాజమహిమ, శ్రాద్ధ సంశయవిచ్ఛేది
8. దురాచారపిశాచ భంజని, ఆచారనిరుక్తి, విగ్రహారాధన తారావళి
9. పదములు జావళీలు
10. కృతులు పదములు - జావళీలు
11. అభిజ్ఞానశాకుంతలము (అచ్చతెనుఁగు)

ఇతర ప్రచురణలు

1. మహాకవి దాసు శ్రీరాములు జయంతి సంచిక (1975)
2. "మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు - ఒక సమీక్ష
(శ్రీమతి వెలగపూడి వైదేహి గారి పి.హెచ్. సిద్ధాంత వ్యాసము)
ప్రథమ ముద్రణ (1986), ద్వితీయ ముద్రణ (2014)


MAHAKAVI DASU SRIRAMULU SMARAKA SAMITHI
F 201, Sri Sai Ram Aditya Residency, Engineers Colony, Yellareddy Guda,
Hyderabad-500073. Phone: 040-23734864, 9490023947

8

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.