పుట:హాస్యవల్లరి.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భా - (వచ్చి) ఏమండి?

శే - చారెవరు కాచిందీ?

భా - నేనే. ఏం?

శే - ఎవరేనా వెధవ ఆవిడేమో అనుకున్నాను.

భా - ఎంత నిర్దయులండీ! అదా! నిజమే! అదంతా నేనే దాచేసుగున్నాను. అందులో వెయ్యడానికేమీ మిగల్లేదు.

67

కుండనాల వీరావధాన్లు పట్నం వెళ్ళి బంధువులింట్లో బసచేసి, సాయింత్రపు వేళ వీధులు తిరగడంలో ఒకవీధిని ట్రాంపోతూండగా, ఆపుమని సంజ్ఞచేయగా,

ట్రాంవాడు - (వడి తగ్గించి) ఊఁ, ఏరయ్యా, శీగిరం!

వీ - ఏరడానికి నాకెంపట్టింది గాని, ఎదరదార్లో పులిస్తరాకు కూడా ఉన్నట్టుంది. బండీ కాస్త తప్పించి మరీతోలు! .

68

ఒక రాత్రి ఒక హరిశ్చంద్ర నాటక ప్రదర్శనంలో విశ్వామిత్రుడికి మ్రొక్కి

హరిశ్చంద్రుడు - మునివరా! నాతప్పు సైరింపుము.

వి - ఛీ, మూర్ఖా! ఏలరా ఈ నక్కవినయమూ! నన్నంటకుమురా!

అని కోపిస్తూ, లోగడ హరిశ్చంద్రుడు కాంచిన కలప్రకారం జరిపే సదుద్దేశంతో అతని కిరీటం ఊడగొట్టడానికై ఒకతన్ను తన్నగా, ఆ తాపు దూసుకుపోయి, తన కాలికి ఉన్న పాంకోడు పావురాయికిమల్లే పైకి ఎగిరి హరిశ్చంద్రుడు నెత్తిని పడబోయినప్పుడు అతడు ఒసిలి తప్పించుకోగా, విశ్వామిత్రుడు ఆ పాంకోడు మళ్ళీ తొడుక్కుని, ఇంకా కోపంతో అతడు కణతమీద తన్నుతూ,

వి - నాదగ్గరటరా, నీ తలవిసురూ.

69

సత్రం గదుల్లో ఒకదాల్లో ఉన్న పెద్దమనిషితో,

బాటసారి - తమది ఏవూరండి? -

పె - కాకినాడ. ఏం?

బా - ఊరికేనేబాబూ! పేరు!

పె - దోసపాటి నాగారావు.

బా - తమకి ఏమన్నా ఉద్యోగమా అండి?

పె - (పక్కగదిలో మకాంఅయివున్న కలక్టరుగారి భార్యకు వినపడేటట్టు) ఈ గదిలో దిగారేం, ఆ కలెక్టరుగారి సర్కీటు గుమాస్తాని.

బా - తమకి ఏమన్నా సంతానమా?

పె - పింఛను పుచ్చుగున్న తరవాత అడగవలసిన ప్రశ్నలు ప్రస్తుతం అసందర్భం గనక ఊరుకోండి.

70

వాయిస్తూన్న వీణదించి సాగరంగారు ఒకమాటు బైటికి వెళ్ళడం కనిపెట్టి, సభలోంచి ఓఆయన తారాజువ్వలాగా వెళ్ళి “అదేమిటి, అదేమిటి” అంటూ మొత్తుగుంటూన్నా వినిపించుకోక, వీణ రెండుముక్కల క్రింద విరిచి అక్కడ పెడుతూండగా వైణికుడు వచ్చి అయ్యో అని నిర్ఘాంతపోగా,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

84

హాస్యవల్లరి