పుట:హాస్యవల్లరి.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

247

రామానందం, తనకోసం కుట్టిఉంచిన చొక్కా తొడుక్కుని తృప్తిపడక, పనివాడితో.

రా - నిరుడు, ఎక్కడున్నావోయ్?

ప - చెన్నాపట్నంలో సార్.

రా - అక్కడెక్కడ?

ప - "మోజస్” కంపెనీలోనండి.

రా - ఏంపని చేసేవాడవ్ అక్కడ?

ప - పోగేసేవాణ్ణండి.

రా - అందుకనే చొక్కా ఇట్టావుంది.

ప - అబ్బే, గారంటీగా కుడ్తే, ఏంటండీ అట్లా సెలవిస్తారు! తొడుక్కుచూడండి, ఇక వొదిలిపెట్టరు.

రా - అవును. నిన్ను వొదిలిపెట్టకుండా నీ చుట్టూ తిరగాలి.

248

వెంకట్రావుగారు గుమ్మం దిగేసరికి లింగమ్మగారు ఎదురుకాగా,

వెం - లింగమ్మా! వొచ్చావ్ ఎదురుగుండా! నా పని యీ పక్షానికి కాదు. ఎన్నింటికని ఏడవన్రా, భగవానుడా!

లిం - సరే. వొచ్చావ్, నా ప్రాణానికి, ఎదురుగుండా, ఒంటి బ్రాహ్మడివి! నా పని యీ మాసానికికాదు! నేను మాత్రం ఏడుచుకోడంలేదూ?

వెం - అల్లాయితే ఓ పనిచేస్తే మంచిదీ!

లిం - ఏమిటది?

వెం - ఇద్దరికీ ఏడుపే అయినప్పుడు కలిసి ఏడిస్తేనే నయం.

249

మనుమడు - బామ్మా! ఈజాతిబొమ్మ చూశావ్? అచ్చంగా బతికిఉన్నపిల్లాడే! ఆనాలట్టలేం.

బా - మరేరా అబ్బాయి. అయితే ఇవెల్లా సృష్టిస్తారొరీ?

మ - పోతపోస్తారట?

బా - సరేకాని, ఇది ఒక్కక్కటి ఏమాత్రం ?

మ - అయిదేసీ ఆరేసీనూ!

బా - అబ్బో. ఏం ధరా! నా చిన్నతనంలో పిల్లలు వాళ్ళంతట పుట్టుకురావడమేగాని, డబ్బోసి పిల్లల్ని సృష్టించడం అంటూలేదు.

250

ఉమాపతి - ఎమోయ్, కామేశా! రావుగారు రాజకీయంలో కృషి చేస్తున్నాడుగదా! ఇప్పటికి ఏం చేసినట్టూ?

కా - రాజకీయంలో ఎమిటయ్యా చేసేదీ! రాజకీయానికీ ఆడతనానికీ బోలెడు సంబంధం వుందీ!

ఉ - అదేమిటి, అల్లా అంటున్నావు?

కా - రాజకీయంలో, “అల్లానే” అని పలికితే “బహుశా” అన్నమాట. “బహుశా” అని అంటే “లేదుపో” అన్నమాట.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

56

హాస్యవల్లరి