పుట:హాస్యవల్లరి.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలక్షేపం

(TIT BITS)

మొదటి భాగం

ణాటికెట్టు పెట్టి, సోమయ్య, ఒకచోట గ్రామఫోను వాయిస్తూఉన్న సమయంలో సూది అదే గాడిలో పాడడంవల్ల గుర్రుమని అదేధ్వని కాగా, శ్రోతలలో ఒకడైన...

కైలాసం - ఆ పాడేవాణ్ణి లేచికూర్చుని తిన్నగా పాడమనకూడదూ?

అనగా, నలుగురూ నవ్వగా,

కై - (పక్కవాడి చెవిలో) నాది పొరపాటుగావును! గ్రామఫోను పుంలింగమా, స్త్రీలింగమా?

పక్క - నపుంసకం కూడాను!

కై - అల్లాయితే త్రిలింగా?

పక్క - కాదు. గ్రామఫోనూ, కాళహస్తీకూడా వాయులింగాలే!

2

మేష్టరు - ఈ లెక్కకి ఆన్సరు అర్థణా తక్కువ వచ్చిందేం? సోలయ్య!

సో - నిన్న పొద్దున్న మా బామ్మచేతి కిచ్చానండి.

మే - అడిగి పట్రా రేపు.

సో - (విచారంతో) నిన్న సాయంత్రం మా బామ్మ పోయిందండి.

మరొక బాలుడు - మేష్టారండి. వట్టిదండి. ఈ వేళ, నే చూశానండి!

మే - ఏమిరా, వెధవా! బతుకున్న వాళ్ళమీదే వొట్లు?

సో- మా బామ్మ పోయినట్లు మా నాన్న ప్రమాణిక్యం చేసి నెల తిరిగిందండి.

3

అల్లుడు - చూడండి, అత్తా! తొమ్మిదిగంటల బండికి వెళ్ళాలి. వంట త్వరగా కానీండి.

అత్త - అడ్డమా! తొమ్మిదిదాకా ఎందుకు నాయనా, రెండింటికి అయిపోతూంటేనూ!

4

రామయ్య - భీమారావు! సోమన్న దగ్గిర ఎంత ఉందని నీ తాత్పర్యం? క్రియమాట.

భీ- పది లకారాలుండచ్చు. నీ ఊహ?

రా - పది లకారాలు లెక్కేమిటి? డెబ్బై పిల్లకూన్ల పైమాట.

5

తెల్లారకట్ల గదిలోనించే.

దత్తుడు - ఒరేయి, భంట్రోత్! సూర్యోదయం అయిందేమో, చూడు.

భం - అంతా చీకటిగా ఉంది బాబూ, అయిందేమో, ఏమీ కనిపించడంలేదు.

- ఏమిరా పొగరూ! కనిపించకపోతే దీపబ్బుడ్డి పట్టుకు వెళ్ళి చూడాలని తెలియదూ?

భం - చిత్తం. అగ్గిపెట్టి తమదగ్గిరే ఉంది.

దత్తుడు గారి భార్య - పోనీ నిప్పుపుడక మీదగ్గిరే ఉంటే మన పాతికరూపాయల కొత్తలాంతరు ముట్టించి ఇయ్యండి, పాపం! బుడ్డి వెతుక్కుంటాడూ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

3

హాస్యవల్లరి